నా జీవన గమనంలో…!-12, 13

62
9

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

12

ఒకరోజు కాకినాడ రీజినల్ మేనేజర్ గారు, పేరు శ్రీ సి.హెచ్. రాజారావు గారు, రావులపాలెం బ్రాంచి సందర్శించారు. వారిని చూడ్డం అదే మొదటిసారి. ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. ఆయన మాట్లాడే మాటల్లో ఓ ప్రత్యేకత కనిపించింది. చెప్పాలనుకునే ప్రతి విషయంపై, వాడుకలో ఉన్న ఓ సామెతను జోడించి, తన ఆలోచనలను ఎదుటివారికి సులభంగా అర్థమయ్యేట్లు చెప్తున్నారు. ఆయన బ్రాంచిలో ఉన్నంతసేపూ, మేనేజర్ గారితో పాటు నేనూ ఉన్నాను. బ్రాంచికి సంబంధించిన అన్ని విషయాలను చర్చించిన అనంతరం సిబ్బందితో కాసేపు ముచ్చటించారు.

శ్రీ సి.హెచ్. రాజారావు, రీజినల్ మేనేజర్

ఆ తరువాత స్థానికంగా వున్న పెద్ద డిపాజిటర్లను కలుసుకుని, బ్యాంకు ఆర్థిక సహాయంతో నడపబడుతున్న కొన్ని పారిశ్రామిక యూనిట్లను సందర్శించి, తదుపరి కాకినాడ వెళ్ళేందుకు ఉద్యుక్తులయ్యారు. రీజినల్ మేనేజర్ గారు వెళ్తూ వెళ్తూ, నా వైపు తిరిగి…

“ఆ! నీతో ఓ విషయం మాట్లాడాలోయ్! మా ఆఫీసులో పని చేస్తున్న గ్రామీణ ఋణాధికారిని నూతనంగా ప్రారంభించబోతున్న ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘానికి, మేనేజింగ్ డైరక్టర్‍గా బదిలీ చేశారు. అతని స్థానంలో మా ఆఫీసుకి నిన్ను బదిలీ చేద్దామనుకుంటున్నాము. నువ్వేమంటావ్?” అని అడిగారు.

ఊహించని ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, మాటలు తడబడుతుండగా,…

“మీ ఇష్టం సార్!” అంటూ నా ఇష్టాన్ని కూడా చెప్పకనే చెప్పాను.

“సరే! ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వస్తుంది. కాకినాడ రావడానికి ఏర్పాట్లు చేసుకో!” అంటు మేనేజర్ వేపు తిరిగి, “మీ బ్రాంచికి వేరేవాళ్ళను కొద్ది రోజుల్లోనే పోస్టు చేస్తాము. ఆర్డర్ రాగానే రిలీవ్ చేయండి! ఈలోపు ఎలాగోలా మేనేజ్ చేసుకోండి!” అని చెప్పారు.

“పరవాలేదు సార్! వేరే వారెవరూ లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలను సార్!” కొంచెం సంతోషంగానే చెప్పారు మేనేజర్ గారు.

అప్పుడు నాకు గుర్తొచ్చింది.. అప్పుడు ఒంగోలు బ్రాంచిలో పనిచేసేటప్పుడు కూడా, ఇదే తరహాలో రీజినల్ మేనేజర్ గారు బ్రాంచి విజిట్‍కి వచ్చి, నన్ను గుంటూరుకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ రోజు కాకినాడ రీజినల్ మేనేజర్ గారు ఈ బ్రాంచి విజిట్‍కి వచ్చి నన్ను కాకినాడకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు చెప్పారు. సేమ్‌ టు సేమ్!

అందుకే అంటారు… “కలిసొచ్చే టైం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడట”! అరెరె! ఇదేంటి!! నేను కూడా సామెత చెప్తున్నాను. ఇప్పటిదాక రీజినల్ మేనేజర్‍గారితో వున్నాను కదా! ఆయన చాలా సామెతలు చెప్పారు. అవన్నీ నేను విన్నాను. అందుకే అంటారు… “ఏడడుగులు కలిసి నడిస్తే వారు వీరు వీరు వారు అవుతారట!”… అరెరే! ఇదేంటి!! మరల సామెత!!

నిజానికి ఈ సామెతలు మన జీవనయాత్రలో అడుగడుగికీ ముడిపడి వుంటాయి! ఎంతో అర్థం! మరెంతో పరమార్థం!! ఎంతటి క్లిష్టతరమైన విషయాన్నైనా, అందరికీ చక్కగా అర్థమయేట్లు, భావయుక్తంగా చెప్పగలవు ఈ సామెతలు!

***

ఇంటికెళ్ళి కాకినాడ ట్రాన్స్‌ఫర్ గురించి నా శ్రీమతితో చెప్పాను. తను ఆశ్చర్యపోతూ…

“అదేంటండీ! మనం ఇక్కడకొచ్చి అరునెలలు కూడా కాలేదు. అప్పుడే ట్రాన్స్‌ఫరా!!”… కుడి చేతి వేళ్ళను గడ్డం క్రింద పెట్టుకుని అడిగింది.

“ఈ ట్రాన్స్‌ఫర్ కావాలని నేను అడగలేదు. రీజినల్ ఆఫీసులో ఏర్పడిన ఖాళీలోకి నన్ను తీసుకుంటున్నారు. అయినా ఈ చిన్న గ్రామం నుండి, జిల్లా కేంద్రానికి వెళ్ళబోతున్నాము. చిన్న ఆఫీసు నుండి పెద్ద ఆఫీసుకు వెళ్ళబోతున్నాము. సంతోషించాలే కాని, బాధపడాల్సిన పని లేదు!” అని ఊరడించాను.

“అంతే లేండి!” అనుకుంటూ అప్పటికి సరిపుచ్చుకుంది నా శ్రీమతి.

***

మరునాడు మామూలుగానే బ్రాంచికి వెళ్ళాను. మేనేజర్ గారిని కలిశాను. చాలా సంతోషంగా కనిపించారు. బహుశా నాకు ట్రాన్స్‌ఫర్ అయినందుకేమో! నేను తనకెదురుగా కూర్చున్న తరువాత, …

“చూడండి! మీరు వచ్చిన దగ్గర నుండి నేను మీతో సరిగా ప్రవర్తించలేదు! సారీ అండి… అందుకు వ్యక్తిగతమైన కారణాలు ఏమీ లేవు… కాకపోతే, ఈ బ్రాంచి చాలా చిన్నది… బిజినెస్ కూడా తక్కువే! అతి కష్టం మీద లాభాల్లోకి తేగలిగాము. ఇప్పుడు మీరు ఈ బ్రాంచిలో వుంటే, మీకిచ్చే జీతభత్యాలు, మీ యొక్క ప్రయాణం ఖర్చులతో, మరలా నష్టాల్లోకి పోతుంది ఈ బ్రాంచి…

అదీగాక, వచ్చే సంవత్సరం నాకు ప్రమోషన్ కొరకు అర్హత వస్తుంది. లాభాలలో నడిచే బ్రాంచి మేనేజరుగా ఇంటర్వ్యూకి వెళితే, అది నాకు ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే మీరొచ్చినందువల్ల ఈ బ్రాంచి నష్టాల్లోకి జారిపోతుందనే ఒకే ఒక్క డౌట్ నన్నలా ప్రవర్తింప జేసింది. అయినా, మీతో నేనలా ఉండకుండా వుండాల్సింది! అయినా మీరేం చేస్తారు? ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి, వచ్చి చేరారు! అంతేగా!…” అంటూ తన మనసులోని బాధను బయటపెట్టారు.

అసలు విషయాన్ని తెలుసుకున్న నాకు మేనేజరు గారి మీద చాలా జాలి వేసింది. వారి ఆలోచనలలో తప్పేముంది? బహుశా వారి స్థానంలో వుంటే, నేనైనా, ఇంకెవరైనా అలాగే ఆలోచిస్తారేమో!

“సార్! రాబోయే సంవత్సరంలో మీకు తప్పక ప్రమోషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!”

“చాలా థాంక్సండీ!”

“మరో విషయం… ఈసారి గ్రామీణ ఋణాధికారి పోస్టింగ్ విషయంలో, కోనసీమలోని అన్ని బ్రాంచీలను చూసుకోడానికి, మీ బ్రాంచిలో కాకుండా, పెద్ద బ్రాంచి అయిన అమలాపురంలో వుండేట్లు, రీజినల్ మేనేజర్ గారికి సలహా ఇస్తూ, ఆయన్ని తప్పకుండా ఒప్పిస్తాను. ఈ విషయంలో మీరు నిశ్చింతగా వుండండి!”

“చాలా చాలా థాంక్సండీ! మీరు నన్ను అపార్థం చేసుకోకుండా, సరిగ్గా అర్థం చేసుకున్నందుకు!”

“భలేవారండీ! మనం ఒకే సంస్థలో కలిసి పని చేస్తున్న వాళ్ళం! ఆ మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఎలా?” అంటూ నా సీట్లోకి వెళ్ళాను.

***

ఆలోచించగా, ఇక్కడ నాకో సున్నితమైన సమస్య ఎదురైంది. రీజినల్ ఆఫీసులో అగ్రికల్చరల్ క్లర్కుగా నా క్లాస్‌మేట్ బంగార్రాజు పనిచేస్తున్నాడు. మేమిద్దరం మంచి స్నేహితులం కూడా. తను నాతో పాటు గ్రేడ్ 2 గ్రామీణ ఋణాధికారి పోస్టు ఇంటర్వ్యూకి వచ్చాడు. కాకపొతే, నేను సెలెక్ట్ అయ్యాను…. తను కాలేదు. అంతే కాని, సమర్థతలో నాకేమాత్రం తీసిపోడు. ఇప్పుడు నేను రీజినల్ ఆఫీసులో జాయిన్ అయితే, నేను అధికారిగా, తను నా దగ్గర క్లర్కుగా పని చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.

ప్రమోషన్ రాలేదనే బాధ ఉండనే వుంటుంది… బంగార్రాజుకి. తన క్లాస్‌మేట్ దగ్గరే గుమాస్తాగా పని చేయడం అంటే ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు’ కదా!

మరిప్పుడు నేనేం చేయాలి???

శ్రీ బంగార్రాజు

ఒకసారి కాకినాడ వెళ్ళి బంగార్రాజుతో మాట్లాడితే బాగుంటుందనిపిస్తోంది. పనిలో పని కాకినాడ పట్టణాన్ని, రీజినల్ ఆఫీసును చూసినట్లుంటుందని, ఒక రోజు శలవు పెట్టి కాకినాడ వెళ్ళాను.

కాకినాడ చాలా బాగుంది. రీజినల్ ఆపీసు జగన్నాయక్‍పూర్ వంతెనకు ప్రక్కనే, మెయిన్‍రోడ్‌లో ఉన్న ఓ బిల్డింగు మొదటి అంతస్తులో వుంది. ఆఫీసు కూడా బాగుంది. ముందుగా బంగార్రాజును కలిశాను. కాఫీ త్రాగుతూ కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్న తరువాత నేను రీజినల్ మేనేజర్‍ గారిని కలిశాను…

“ఆ! రావయ్యా! రా! ఏంటిలా వచ్చావ్?”

“కాకినాడలో ఓ పనుండి వచ్చాను సార్! ఎటూ వచ్చాను కదా.. మిమ్మల్ని ఓ సారి కలిసిపోదామని వచ్చాను సార్!”

“మంచి పని చేశావ్! పన్లో పని నువ్ చేరబోయే ఆఫీసు కూడా చూసినట్లయింది… అటు స్వకార్యం, ఇటు స్వామి కార్యం – అంటే ఇదేనోయ్! త్వరలో ఆర్డర్ వస్తుంది. వెంటనే వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వాలి!”

“అలాగే సార్!” అని చెప్పి క్యాబిన్ నుండి బయటికొచ్చాను.

తరువాత బంగర్రాజుతో మనసు విప్పి మాట్లాడాను. నా అంతరంగంలో నన్ను కలవర పెడుతున్న విషయాన్ని సవివరంగా చెప్పాను

చిరునవ్వుతో, చిద్విలాసంగా అంతా విన్న బంగార్రాజు…

“ఇంత చిన్న విషయం గురించి అంతగా ఆలోచించి మనసు పాడు చేసుకున్నావన్న మాట! ఆ ఆలోచనల్ని వెంటనే తుడిచెయ్! నీతో కలిసి పని చేయడానికి నాకే మాత్రం ఇబ్బంది ఉండదు. ఎవరో ముక్కు ముఖం తెలియని వారి కంటే, నువ్వు చాలా బెటర్ కదా! మనిద్దరం క్లాస్‍మేట్స్… పైగా మంచి స్నేహితులం కూడా! నువ్ వేరే ఏమీ ఆలోచించకుండా ఆర్డర్ రాగానే వచ్చి జాయిన్ అవ్వు! ఇద్దరం కలిసి హ్యాపీగా పని చేద్దాం!… సరేనా!!?” అంటూ నా ఆలోచనలన్నింటినీ పటాపంచలు చేశాడు బంగార్రాజు. ఎంత మంచివాడో, అంత విశాల హృదయుడని నా కవగతమైంది. తేలికపడిన మనసుతో రావులపాలెం బయలుదేరాను.

***

కాకినాడ ట్రాన్స్‌పర్ ఆర్డర్ రానే వచ్చింది. రావులపాలెంలో రిలీవ్ అయ్యాను. ఆ మరుసటి రోజే కాకినాడ రీజినల్ ఆఫీసులో జాయిన్ అయ్యాను. గుంటూరు రీజినల్ ఆఫీసులో పనిచేసిన అనుభవంతో, ఇక్కడ రీజినల్ ఆఫీసులో పని చేయడం ఏ మాత్రం కొత్తగా అనిపించలేదు. తొందరగానే అన్ని పనులు అర్థం చేసుకుని, తేలిగ్గానే చేయగలుగుతున్నాను.

జగన్నాయక్‌పూర్‌లో ఓ డాబా ఇంట్లో సగం పోర్షన్ అద్దెకు దొరికింది. ఓ ఆదివారం రోజున రావులపాలెం ఇంటిని ఖాళీ చేసి, సామాన్లతో సహా, అందరం వచ్చి కాకినాడ ఇంట్లో చేరాము. సామాన్లు సర్దుకుని, ఇంటికి కావలసిన సరుకులు, ఇతర సామగ్రిని, అన్నింటిని సమకూర్చుకున్నాము. సౌకర్యంగా జీవించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాము. ఇక బ్యాంకు పనిలో పూర్తిగా నిమగ్నమయ్యేందుకు సమాయత్తమయ్యాను.

13

1978 సంవత్సరం.

నేను కవర్ చేయాల్సిన బ్రాంచీలు, అధిక సంఖ్యలో వున్నందువల్ల, నా ప్రయాణ సౌలభ్యం కోసం ‘యెజ్డి’ మోటారు సైకిల్, బ్యాంకు లోనుతో కొనుక్కున్నాను. ప్రస్తుతానికి రీజియన్‍లో వున్న బ్రాంచిలన్నింటిని, రీజినల్ ఆఫీసులో వున్న నేను, కాకినాడ, రాజమండ్రి బ్రాంచీలలో వున్న మరో ఇద్దరు గ్రామీణ ఋణాధికారులు పర్యవేక్షణ చేయాల్సి వుంది.

కత్తిపూడిలో నూతనంగా స్థాపించబడిన ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘంలో, బ్యాంకు తరఫున రీజినల్ ఆఫీసులో పని చేస్తున్న గ్రామీణ ఋణాధికారి ఒక డైరక్టరుగా వుంటారు. ఆ బాధ్యతను కూడా నేను నిర్వహించాల్సి వుంది. గ్రామాలలో తిరగడానికి, రీజినల్ ఆఫీసుకు కేటాయించబడిన జీపు ఆ ఆఫీసులో పనిచేసే గ్రామీణ ఋణాధికారి ఆధీనంలో వుంటుంది. అందుకే ఆ జీపు కూడా నా కంట్రోల్‍లో వుంటుంది. ఆ జీపు డ్రైవరు కూడా నాకే రిపోర్ట్ చేస్తాడు. నాకు కేటాయించబడిన బ్రాంచీలకే కాకుండా, రీజియన్ లోని ఇతర బ్రాంచీలకు కూడా, ఆయా అవసరాలను బట్టి, నేను వెళ్ళాల్సి వుంటుంది. అందుకోసం నేను జీప్‍ని కూడా ఉపయోగించుకుంటాను. డ్రైవర్ డ్యూటీకి రానప్పుడు, జీప్‍ని నేనే నడిపించాలి కాబట్టి, రీజినల్ మేనేజర్ గారు, తన కారు డ్రైవర్‍ని నాకు డ్రైవింగ్ నేర్పమని పురమాయించారు. అతి కొద్ది సమయంలోనే జీప్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను.

***

రోజులు గడుస్తున్నాయ్. నా సహజ శైలిలో నా విధులు సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహిస్తూ, అందర్నీ సంతృప్తి పరచగలుగుతున్నాను. ఆ సమయంలోనే నా శ్రీమతి డెలివరీ కోసం గుంటూరు వెళ్ళింది.

అప్పుడే సి.ఎ.ఐ.ఐ.బి. పార్టు 2లో మిగిలి వున్న రెండు పేపర్ల కోసం బాగా చదవడం, పరీక్షలు బాగా వ్రాయడం, వాటిల్లో పాసవడం జరిగింది. దాంతో నాకు ఇప్పుడు సి.ఎ.ఐ.ఐ.బి. క్వాలిఫికేషన్, మరియు పార్ట్ 2 పాసయినందుకు గాను, రెండు స్పెషల్ ఇంక్రిమెంట్లను కూడా శాంక్షను చేశారు. అనుకున్నట్లు గానే ఆ రెండు ఇంక్రిమెంట్ల ద్వారా అదనంగా వచ్చే డబ్బును భవిష్యత్ అవసరాల నిమిత్తం, ఇంతకు ముందు అనుకున్నట్లే, పొదుపు చేయడం మొదలుపెట్టాను.

***

కాకినాడలో ‘రసమయి’ అనే సాంస్కృతిక సంస్థ వుంది. నెలకో నాటకం ప్రదర్శించడమే కాకుండా, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, పట్టణంలో మంచి పేరుప్రతిష్ఠలు సంపాదించింది ఆ సంస్థ. అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కళాభిరుచి వున్న ఇతర పుర ప్రముఖులు, రసమయి సంస్థలో సభ్యులు. రీజినల్ మేనేజర్ గారికి తీరిక దొరకని కారణంగా, వారి తరఫున కళల్లో కాస్తో కూస్తో అనుభవం, కళల పట్ల అంతో ఇంతో మోజున్న నేను ఆ సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వుండేవాడిని. గత సంవత్సరం ఆ సంస్థకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ మేనేజర్ గారు, అధ్యక్షులుగా వున్నారు. ఈ సంవత్సరానికి ఆంధ్రా బ్యాంకు రీజినల్ మేనేజర్ గారిని, అధ్యక్షులుగా చేయాలని రసమయి సంస్థ ప్రతినిధులు మా రీజినల్ మేనేజర్ గారిని సంప్రదించారు. అందుకు మా రీజినల్ మేనేజర్ గారు విముఖత వ్యక్తం చేశారు.

అప్పుడు నేనే చొరవ తీసుకుని, రీజినల్ మేనేజర్ గారిని ఒప్పించడానికి ప్రయత్నించాను. అధ్యక్షులుగా వారు నిర్వహించాల్సిన బాధ్యతలన్నింటినీ, నేను దగ్గరుండి చూసుకుంటానని భరోసా ఇవ్వడం వలన వారు ఒప్పుకున్నారు. మంచి మంచి కార్యక్రమాలను నిర్వహించడంతో బాటు, బ్యాంకు యొక్క ప్రతిష్ఠను కూడా, కాకినాడ పట్టణంలో ఇనుమడించగలిగాము. అది నాకు చాలా తృప్తినిచ్చే అంశం.

ఈ సంవత్సరం జరిగిన రిక్రూట్‍మెంట్‌లో, కాకినాడ రీజియన్‍లో… అమలాపురం, పెద్దాపురం బ్రాంచీలలో గ్రామీణ ఋణాధికారులను పోస్ట్ చేశారు. రీజినల్ ఆఫీసులో అగ్రికల్చరల్ క్లర్కుగా పనిచేస్తున్న నా క్లాస్‌మేట్ బంగార్రాజుకు గ్రేడ్ 3 ఆఫీసర్‌గా ప్రమోషన్ కూడా వచ్చింది. రీజినల్ ఆఫీసులోనే లీడ్ బ్యాంక్ ఆఫీసరుగా పోస్టింగ్ ఇచ్చారు.

కూర్చున్నవారు: (ఎడమ నుండి కుడికి) – సర్వశ్రీ: 1. బంగార్రాజు, లీడ్ బ్యాంక్ ఆఫీసర్, కాకినాడ 2. రచయిత 3.హరగోపాల్, మేనేజింగ్ డైరక్టర్, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం, కత్తిపూడి 4. శ్రీ రామిరెడ్డి, గ్రామీణ ఋణాధికారి, కాకినాడ 5. రఘోత్తమరావు, గ్రామీణ ఋణాధికారి, అమలాపురం 6. మోహన్, గ్రామీణ ఋణాధికారి, పెద్దాపురం.
నిలుచున్నవారు: (ఎడమ నుండి కుడికి) – సర్వశ్రీ: 1. తిరుమల రావు, రీజినల్ ఆఫీసు, కాకినాడ 2. అశోక్ రాజు, అగ్రికల్చరల్ క్లర్కు, గొల్లప్రోలు.

***

బ్యాంకులో రిక్రూట్ అయిన గ్రేడ్ 2 గ్రామీణ ఋణాధికారులకు, హైదరాబాద్ స్టాఫ్ ట్రెయినింగ్ కాలేజీలో, ఓ వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం ఇరవై ఏడు మంది హాజరయ్యారు. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ (రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా) పూనా; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్, పూనా; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవెలప్‍మెంట్, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రొఫెసర్లతో మాకు శిక్షణా తరగతులను నిర్వహించారు.

గ్రామీణ ఋణాధికారులకు శిక్షణ

ఆ శిక్షణా కార్యక్రమంలో ఉండగానే, ఒక రోజు ఉదయం నాకో టెలిగ్రాం వచ్చింది. నా శ్రీమతి ప్రసవించిందని, ఆడపిల్లకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డా క్షేమమని సమాచారం అందింది. చిత్రం ఏమిటంటే, నా కొలీగ్ విష్ణువర్దన్ రెడ్డికి కూడా ఆ రోజు సాయంత్రం ఓ టెలిగ్రాం వచ్చింది. తన శ్రీమతి ప్రసవించిందని, ఆడపిల్ల పుట్టిందని, ఇద్దరూ బాగున్నారని సమాచారం అందింది. మిగతా వాళ్ళందరూ మా ఇద్దర్నీ అభినందించారు. రాత్రికి మేమిద్దరం కలిసి అందరికీ ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చాము. నాకు, విష్ణువర్దన్ రెడ్డికి ఆ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు.

శిక్షణ పూర్తి చేసుకుని గుంటూరు వచ్చాను. నా శ్రీమతిని, బాబుని, పుట్టిన పాపను చూశాను. ఆనందంగా ఆ రోజు, వాళ్ళందరితోను సంతోషంగా గడిపి తిరిగి కాకినాడ చేరుకున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here