నా జీవన గమనంలో…!-16, 17,18,19

57
13

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

16

[dropcap]ఆ[/dropcap] సంవత్సరం వర్షాలు సకాలంలో పడడం వలన పంటలు బాగా పండాయి. చేబ్రోలు గ్రామంలో కూడా రైతులందరూ అధిక దిగుబడులు సాధించి, ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఎప్పుడైతే రైతులందరూ సంతోషంగా వున్నారో, ఆ గ్రామంలోని మిగతా వారందరూ సంతోషంగా వున్నారు.

  • గ్రామంలో ఉన్నవాటితో పాటు, కొత్తగా రైసు మిల్లు, ట్రాక్టర్ రిపేరింగ్ షాపు, ఎలెక్ట్రిక్ మోటార్లు, ఆయిల్ ఇంజన్లు, స్ప్రేయర్లు, డస్టర్ల రిపేరింగ్ షాపులు, బట్టల షాపు, కిరాణా షాపు, మెడికల్ షాపు, హెయిర్ కటింగ్ సెలూన్‍లు, ఇస్త్రీ షాపులు,… వెలిశాయి.
  • పాఠశాల, ఆసుపత్రి, పశువుల ఆసుపత్రి, దేవాలయం, మసీదు, చర్చి, ఆటస్థలం, పార్కు… ఇవన్నీ కొత్త అందాలతో కళకళలాడుతున్నాయి.
  • లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్‍ల వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత పశువైద్య శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు, ఉచిత దంత వైద్య శిబిరాలు, నిర్వహించబడ్డాయి.
  • చేబ్రోలు గ్రామ సర్వతోముఖాభివృద్ధి చూపరులకు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇప్పుడు అందరి మన్ననలను పొందుతున్న ఆ గ్రామం ఓ ఆదర్శ గ్రామంగా నెలకొంది.
  • జిల్లా కేంద్రం కాకినాడ నుండి కూడా వివిధ శాఖల అధికారులు చేబ్రోలు గ్రామ అభివృద్ధిని చూడ్డానికి వచ్చారు.
  • దినపత్రికలు కూడా ఫోటోలతో సహా, అభివృద్ధి పథంలో నడుస్తున్న చేబ్రోలు గ్రామం గురించి ఘనంగా వార్తలు ప్రచురించాయి.

***

ఆ రోజు హెడ్ ఆఫీసులో ఐ.డి.యస్.వి. పథకం క్రింద అప్పటివరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామీణాభివృద్ధి అధికారి, తాను ఎంచుకున్న గ్రామంలో జరిగిన కార్యక్రమాల అమలు గురించి, తద్వారా సాధించిన ఫలితాల గురించి, ఆ సమావేశంలో ఓ నివేదికని సమర్పించాలి.

అందరితో పాటు, నేను ఎన్నుకున్న చేబ్రోలులో జరిగిన కార్యక్రమాల గురించి, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, ఫోటోల ఆధారంగా, నా నివేదికను చాలా వివరణాత్మకంగా అందరి ముందుంచాను.

నా నివేదికపై కొంతమంది లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడం నాకంత కష్టమనిపించలేదు.

అంతిమంగా, అందరి నివేదికలను సమీక్షించిన మీదట, చేబ్రోలు గ్రామంలో నేను చేపడుతున్న కార్యక్రమాలను అందరూ ప్రశంసించారు. ఆ సమావేశంలో పాల్గొన్న హెడ్ ఆఫీస్ ఉన్నతాధికారులు, చేబ్రోలు గ్రామంలో జరిగిన కార్యక్రమాలను, వాటిపై నా నివేదికను అత్యుత్తమమైనవిగా ప్రకటించారు.

ఆ ప్రకటనతో నా ఆనందాలు ఆకాశాని కెగిరాయి. చేబ్రోలు గ్రామాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమ గ్రామంగా తీర్చిదిద్దాలనే నా పట్టుదల రెట్టింపైంది.

17

1980 సంవత్సరం.

ఆంధ్రా బ్యాంకులో పనిచేసే గ్రామీణాభివృద్ధి అధికారుల విధి నిర్వహణా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, దేశంలోని వివిధ గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్థలకు, ప్రత్యేక శిక్షణ నిమిత్తం, విడతల వారీగా పంపడం మొదలైంది.  ఆ క్రమంలో ‘సకలార్థ సహకార సంఘాల ద్వారా గ్రామీణాభివృద్ధి’ అనే విషయంపై ‘సకలార్థ సహకార శిక్షణా సంస్థ’, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో, కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం ‘ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకు’లో 1980 ఫిబ్రవరి నెలలో, రెండు రోజుల పాటు సెమినార్ నిర్వహించారు.

సకలార్థ సహకార శిక్షణా సంస్థ, హైదరాబాద్, మరియు ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకు ప్రతినిధులతో… సెమినార్‌లో పాల్గొన్న ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి అధికారులు… మొదటి వరుసలో నిలుచున్న వారిలో ఎడమ నుండికి కుడికి… మూడవవారు రచయిత

ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకు మన దేశ స్థాయిలోనే కాదు… ఆసియా ఖండంలోనే అత్యుత్తమ సహకార గ్రామీణ బ్యాంకుగా గుర్తింపు పొందింది. సంఘ సభ్యులకు, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కొరకు ఋణాలు సమకూర్చడమే కాకుండా, వారికి కావలసిన విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, తమ సొంత గోడౌన్ల నుండి సరఫరా చేస్తున్నారు. రైతులు పండించిన వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఉత్పత్తులకు ఆయా గ్రామాల్లోనే మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ, గిట్టుబాటు ధరలు కూడా చెల్లిస్తున్నారు. ఆ బ్యాంకు కార్యకలాపాలను, బ్యాంకు పరిధిలోని గ్రామాలకు వెళ్ళి ప్రత్యక్షంగా చూసిన నేను గ్రామీణాభివృద్ధిపై ఎంతో అవగాహనను పెంచుకోగలిగాను. ఆ బ్యాంకు అధ్యక్షులు శ్రీ ఎ.కె. విశ్వనాధ రెడ్డి గారు.

శ్రీ ఎ.కె. విశ్వనాధ రెడ్డి గారు

వారి ఆధ్వర్యంలో ఆ బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ, దేశంలోని మరెన్నో సహకార గ్రామీణ బ్యాంకులకు ఆదర్శప్రాయంగా నిలిచింది. శ్రీ ఎ.కె. విశ్వనాధ రెడ్డి గారితో ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి అధికారుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, వారితో గ్రామీణాభివృద్ధిపై ముచ్చటించడం, నిజంగా నా అదృష్టం. ఆ రోజు ఎన్నటికీ మరువలేని రోజు.

18

1980 ఏప్రిల్‍లో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్, సి.ఎ.బి (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), పూనాలో వివిధ వాణిజ్య బ్యాంకుల్లో గ్రామీణాభివృద్ధి కొరకు పనిచేసే అధికారుల కొరకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంకు తరఫున నేను పాల్గొన్నాను. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను సిలబస్‍లో పొందుపరిచారు. నాలుగు వారాల పాటు సాగిన ఆ శిక్షణా కార్యక్రమం మా అందరికీ చాల ఉపయోగకరంగా అనిపించింది. చివరి వారంలో మమ్మల్నందర్నీ నాలుగు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపును ఉత్తరం వైపు, ఒక గ్రూపును దక్షిణం వైపు, ఒక గ్రూపును తూర్పు వైపు, ఒక గ్రూపును పడమర వైపు క్షేత్ర స్థాయీ శిక్షణ నిమిత్తం పంపించారు. నేను ఉత్తరం వైపు వెళ్ళే గ్రూపులో వున్నాను. ఒక్కో గ్రూపులో ఎనిమిది మంది చొప్పున మేము మొత్తంగా 32 మందిమి. ఉత్తరం వైపు వెళ్ళిన మా ఎనిమిది మందికి ఢిల్లీలో బస ఏర్పాటు చేశారు. ప్రతీ రోజూ ఉదయాన్నే బయలుదేరి సోనిపట్ వెళ్ళడం, అక్కడి గ్రామాల్లో, పొలాల్లో తిరుగుతూ, అక్కడి రైతులతో సమావేశమవుతూ, వారవలంబించే ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అధ్యయనం చేసి, రాత్రికి ఢిల్లీ చేరుకుంటున్నాము.

నేను ఢిల్లీలో ఉన్నప్పుడే ఒక రోజు ఆంధ్రా బ్యాంకును జాతీయం చేసినట్లు ప్రకటన వెలువడింది. ఇతర బ్యాంకుల నుండి వచ్చిన నా తోటి శిక్షణార్థులు నన్ను అభినందించారు. నాలోని సంతోషం కట్టలు తెంచుకొని పొంగి పొరలింది. ఆ రోజు రాత్రి వాళ్లందరికీ మంచి పార్టీ ఇచ్చి నా సంతోషాన్ని వారందరితో పంచుకున్నాను. నిజంగా ఆ రోజు నా జీవితంలో ఓ మరువలేని రోజు.

మొట్టమొదటిగా 1969 సంవత్సరంలో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. అప్పుడు 50 కోట్ల రూపాయలు, ఆ పైన డిపాజిట్లు వున్న ప్రైవేటు సెక్టారులో నడిచే వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అప్పటికి డిపాజిట్లు 50 కోట్ల రూపాయలకి కొంచెం తక్కువ వుండడం వలన, ఆంధ్రా బ్యాంకు జాతీయకరణను తప్పించుకుంది. కానీ 1969 నుండి 1980 వరకు ప్రైవేటు సెక్టారులో నడిచే వాణిజ్య బ్యాంకులలో నెం.1 బ్యాంకుగా వుంది ఆంధ్రా బ్యాంకు. ఇప్పుడు రెండో విడత జాతీయకరణలో భాగంగా… 1980లో… జాతీయం చేయబడింది ఆంధ్రా బ్యాంకు.

19

కాకినాడ రీజియన్‍లో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాకు వరంగల్ రీజియన్‍లోని ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం, కురవికి మేనేజింగ్ డైరక్టర్‍గా బదిలీ అయింది.

కాకినాడ ఆంధ్రా బ్యాంకు రీజినల్ ఆఫీసు సిబ్బంది… కూర్చున్నవారు ఎడమ నుండి కుడికి – సర్వశ్రీ 1. రచయిత 2. రామకృష్ణ గారు 3. సి.హెచ్. రాజారావు గారు, రీజినల్ మేనేజర్ 4. వీర్రాజు గారు 5. శ్రీమతి విజయలక్ష్మి గారు మరియు ఇతరులు (నిల్చున్నవారు)

ఆ ఉత్తర్వుల ప్రకారం కాకినాడ రీజియన్‍ ఆఫీసులో రిలీవ్ అయి, కురవి కర్షక సేవా సహకార సంఘంలో మేనేజింగ్ డైరక్టర్‍గా జాయిన్ అయ్యాను.

మహబూబాబాద్‌కు 9 కి.మీ. దూరంలో వుంది కురవి గ్రామం. సంఘం ఆఫీసు మాత్రం మహబూబాబాద్‌లోనే వుంది. సంఘంలో జాయిన్ అయిన రోజునే నన్ను కురవి గ్రామానికి తోడ్కొని వెళ్ళారు మా సిబ్బంది. ఆ గ్రామంలో వున్న మహిమాన్వితమైన దేవాలయాన్ని సందర్శించి, అక్కడ కొలువైయున్న వీరభద్రస్వామి వారిని, భద్రకాళీమాతను పూజించుకున్నాను. తిరిగి ఆఫీసుకు చేరుకుని సిబ్బందితో సమావేశమయ్యాను.

మూడు రోజులు పాటు ఆఫీసులోనే వుంటూ సిబ్బందితో విడివిడిగా ముచ్చటిస్తూ, సంఘ కార్యకలాపాలను గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. స్థానికంగా ఉన్న ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళ్ళి మేనేజర్ గారిని, అక్కడి సిబ్బందిని పరిచయం చేసుకున్నాను. ఆఫీసుకు వచ్చే సంఘ సభ్యులతో కూడా సవివరంగా మాట్లాడాను. కొంతమంది పాలకవర్గ సభ్యులు కూడా నన్ను కలిసేందుకు ఆఫీసుకు వచ్చారు. వాళ్ళందరూ చాలా అనుభవజ్ఞులుగా, సహాయకారులుగా కనిపించారు. ఆ మూడు రోజుల్లో సంఘం గురించి సంపూర్ణ అవగాహన పెంచుకోగలిగాను.

సంఘం ద్వారా ఉద్యోగాలు పొందిన పదిమంది ఆఫీసులో పని చేస్తున్నారు. ముగ్గురు ఫీల్డ్ ఆఫీసర్లు గ్రామాల్లో పర్యటిస్తుంటారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖ నుండి ఒక వ్యవసాయ విస్తరణాధికారి, సహకార శాఖ నుండి ఒక కో-ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, డెప్యుటేషన్ పై పని చేస్తున్నారు. ఆ మాట కొస్తే, మేనేజింగ్ డైరక్టర్‌గా పని చేసే ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి అధికారి కూడా డెప్యుటేషన్ పైనే పని చేస్తారు. అంటే, నేను కూడా డెప్యుటేషన్ పైనే…

రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించి, అధిక దిగుబడుల సాధనకు ఉచితంగా సలహాలిస్తారు వ్యవసాయ విస్తరణాధికారి. ఋణాలు పొందిన రైతుల యొక్క భూముల తాకట్టు, ఋణాలు చెల్లించని వారి ఆస్తులను జప్తు చేయడానికి కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ అందుబాటులో ఉంటారు.

ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం కురవి, సిబ్బంది… కూర్చున్నవారు ఎడమ నుండి కుడికి – సర్వశ్రీ. 1. కరుణాకర్ గారు 2. సోమయ్య గారు 3. ప్రభాకరరావు గారు (కోఆరేటివ్ సబ్ రిజిస్ట్రార్) 4. సత్యనారాయణగారు 5. రచయిత 6. రామకోటయ్య గారు (బదిలీపై వెళ్తున్న ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్) 7. జమీల్ అహ్మద్ గారు (వ్యవసాయ విస్తరణాధికారి) 8. మల్లారెడ్డి గారు 9. రామ్మూర్తి గారు 10. ప్రసాద్ గారు… మరియు ఇతరులు (నిల్చున్నవారు)

సంఘ సభ్యులందరికీ కావలసిన ఋణాలు ఇవ్వడానికి అవసరమయ్యే ఆర్థిక వనరులను ఆంధ్రా బ్యాంకు, మహబూబాబాద్ శాఖ సమకూరుస్తుంది.

పాలకవర్గంలో రైతులు తరఫున 11 మంది, ప్రభుత్వం తరఫున కోఆపరేటివ్ డిప్యూటి రిజిస్ట్రార్, ఆంధ్రా బ్యాంకు తరఫున వరంగల్ రీజినల్ ఆఫీసులో పనిచేసే గ్రామీణాభివృద్ధి అధికారి, మొత్తం 13 మంది సభ్యులుగా ఉంటారు. పాలకవర్గం నెలకోసారి సమావేశమవుతూ, పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం, సభ్యులకు ఋణాలను మంజూరు చేయడం, ఋణాల వసూళ్ళను సమీక్షించడం, పాత బకాయిల వసూళ్ళ కొరకు ప్రత్యేక చర్యలను చేపట్టడం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం, ఇతర ముఖ్య విషయాలను ఎజండాగా తీసుకుని, సుదీర్ఘంగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారు.

ఆ నిర్ణయాలను అమలు చేయడం మేనేజింగ్ డైరక్టర్ యొక్క బాధ్యత. ఆ విషయంలో మేనేజింగ్ డైరక్టర్‍కి సిబ్బంది యొక్క సహకారం వుండనే వుంటుంది.

ప్రతి సంవత్సరం సంఘం యొక్క సర్వసభ్యుల సాధారణ మహాసభ తప్పక జరుగుతుంది.

సంఘం పరిధిలో కురవి, అయ్యగారిపల్లి, మాధాపురం, సత్తుపల్లి, నేరెడ, బేతోలు, మొగిలిచర్ల, నారాయణపురం, రాజోలు, బలపాల, తిరుమలాపూర్, నల్లెల, మోద్గుల గూడెం – మొత్తం 13 గ్రామాలున్నాయి. ఈ గ్రామాలన్నింటికి అనుబంధంగా 90 దాకా తండాలున్నాయి. తండాల్లో నివసించే లంబాడీలు… చిన్నసన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు. వీళ్ళంతా కష్టపడి పని చేస్తారు. నిజాయితీగా వుంటారు. ప్రస్తుతం సంఘంలో వున్న సుమారు 1500 మంది సభ్యుల్లో, 50 శాతం పైన లంబాడీలే వుంటారంటే అతిశయోక్తి కాదు.

బలపాల, నేరెడ గ్రామాల్లో వున్న సంఘం యొక్క సొంత గోడౌన్ల ద్వారా విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను, వ్యవసాయ పరికరాలను సంఘ సభ్యులైన రైతులకు సరసమైన ధరలకు విక్రయిస్తుంది సంఘం. వరంగల్ పట్టణంలో రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారస్తులకు, రైతులకు మధ్యవర్తిగా సంఘమే వుండి రైతులందరూ వరంగల్ దాకా వెళ్ళి తాము పండించిన పంటల ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా, తమ గ్రామాల్లోనే సరసమైన ధరలకు అమ్ముకునే సదుపాయం కలిగించింది సంఘం. వ్యాపారస్తులు, ఏ రోజు కా రోజు రైతుల నుండి తాము కొనుగోలు చేసిన ఉత్పత్తులకు ఇవ్వవలసిన మొత్తం డబ్బును సంఘానికి చెల్లిస్తారు. వ్యాపారస్తులు తాము కొనుగోలు చేసిన ఉత్పత్తులను, ఆయా గ్రామాల నుండి వరంగల్ తీసుకొని వెళ్ళేందుకు సంఘం సహకరిస్తుంది.

వ్యాపారస్తులు సంఘానికి చెల్లించిన డబ్బును, ఆయా రైతుల సేవింగ్సు బ్యాంకు ఖాతాలకు, వారు అమ్మిన ఉత్పత్తుల విలువ మేరకు జమ చేస్తుంది సంఘం. రైతుల సేవింగ్సు ఖాతాల నుండి, వారి ఋణ ఖాతాలకు, బకాయిల మేర జమచేసుకుంటుంది సంఘం. తద్వార ఋణ వసూళ్ళు చాలావరకు జరుగుతాయి. బకాయిలు ఇంకా వున్న రైతులకు, ఇతర సభ్యులకు నోటీసులు పంపడం, వ్యక్తిగతంగా కలవడం ద్వారా ఋణాలు వసూలు చేస్తారు. ప్రతి సంవత్సరం సంఘం వితరణ చేసిన ఋణాల వసూళ్ళు 90 శాతం పైనే వుంటుంది.

మొత్తంగా చూస్తే, ఇదో మినీ ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకులా… అనిపించింది నాకు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here