నా జీవన గమనంలో…!-2

55
10

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

[dropcap]వ్య[/dropcap]వసాయ శాస్త్రంలో పట్టభద్రుడనైన నేను ఆంధ్రా బ్యాంకులోకి అనూహ్యంగా ప్రవేశించాను.

మాది గుంటూరు జిల్లాలో ఒక పల్లెటూరు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం మాది. వ్యవసాయమే మా కుటుంబ ఏకైక ఆదాయ మార్గం. నాయనమ్మ, తాత, అమ్మానాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు… ఓ పెద్ద కుటుంబం మాది…

డాక్టర్ అవాలనుకున్న నేను… యాక్టర్ అవలేదు కాని… కాలానుగుణంగా ఓ బ్యాంకర్ అవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో యం.బి.బి.యస్ సీట్లు పి.యు.సి.లో గ్రూపులో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి ఇచ్చేవారు. ఈ ఎంట్రన్సులు అవీ ఉండేవి కావు.

ఆ సంవత్సరం గ్రూపులో 75.50% ఆ పైన మార్కులు వచ్చిన వారికి యం.బి.బి.యస్.లో సీట్లు లభించాయి. నాకు 75.25% వచ్చాయి కాబట్టి సీటు దక్కలేదు. కేవలం 0.25% మార్కు తక్కువ అవడం మూలంగా డాక్టరు అవలేకపోయాను. ఇతర రాష్ట్రాలకు పంపి డొనేషన్ కట్టి డాక్టర్ కోర్సు చదివించేంత ఆర్థిక స్తోమత మా కుటుంబానికి లేదు. అందుకే ఆ తరువాత ప్రాముఖ్యంలో వున్న బి.యస్.సి. (అగ్రికల్చర్‍)లో చేరాను.

1971 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశాను. బి.యస్.సి. (అగ్రికల్చర్‍) డిగ్రీ పొందిన వారికి అప్పట్లో, వారి వారి క్రమంలో వ్యవసాయ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అది గెజిటెడ్ ఆఫీసరు హోదాలో. అందుకు రెండు, మూడు సంవత్సరాలు పట్టవచ్చు. అందాక… ఖాళీగా వుండే బదులు, ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని అనుకున్నాను.

అదే కాకుండా, మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, వెంటనే ఉద్యోగంలో చేరి, ఎంతో కొంత ఆర్థికంగా కుటుంబానికి సహాయకారి నవుదామను కున్నాను. రోజూ దినపత్రికల్లో, ఉద్యోగావకాశాల ప్రకటనలు చూస్తూ, ‘అర్హత ఏదైనా డిగ్రీ…’ అని వున్న ప్రతీ ఉద్యోగానికి, ఇదీ… అదీ… అని ఆలోచించకుండా, దరఖాస్తులు పంపించేవాడ్ని.

ఆ క్రమంలో ఒకరోజు ‘అగ్రికల్చరల్ క్లర్కులు కావలెను’… అనే ఆంధ్రా బ్యాంకు ప్రకటన చూశాను. అర్హత… వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ… ఇంకేం అదే రోజు ఆ ఉద్యోగానికి దరఖాస్తు పంపాను.

వారం తిరక్క ముందే… విజయవాడ కాకరపర్తి భావన్నారాయణ కళాశాలలో… వ్రాత పరీక్షకు హాజరు కమ్మని వర్తమానం అందింది. సబ్జెక్టుల పరంగా, జనరల్ నాలెడ్జి పరంగా, శక్తిమేరకు తయారై వ్రాత పరీక్షలో తృప్తిగా రాయగలిగాను. తప్పక ఉత్తీర్ణత సాధిస్తాననే నమ్మకం కలిగింది.

ఓ పది రోజుల తరువాత ఆంధ్రా బ్యాంకు నుండి నాకో ఉత్తరం అందింది. వ్రాత పరీక్షలో నేను ఉత్తీర్ణుడయ్యానని, హైదరాబాదులో వున్న ఆంధ్రా బ్యాంకు కేంద్ర కార్యాలయంలో ఇంటర్వ్యూకి రమ్మని తెలియజేశారు. అందుకోసం హైదరాబాదు వెళ్ళాను.

హైదరాబాదు నగరాన్ని మొట్టమొదటిసారిగా చూశాను. పెద్ద పెద్ద భవనాలు, వెడల్పాటి రోడ్లు, జనసందోహం చూసి, మొదట్లో భయపడిన మాట నిజం… ఎలాగొలా ఓ హోటల్లో గది అద్దెకు తీసుకుని, తయారై ఇంటర్వ్యూకి వెళ్ళాను.

ఆంధ్రా బ్యాంకు కేంద్ర కార్యాలయం కోఠీలోని సుల్తాన్‍బజార్‍లో వుంది. ఒక్కసారిగా, ఆంధ్రా బ్యాంకు గొప్పతనానికి, నిలువెత్తు నిదర్శనంగా నిలిచివున్న అ భవనాన్ని చూసి అచ్చెరువందాను. లిఫ్టులో ఆఖరి అంతస్తుకు చేరుకున్నాను. అక్కడి నుండి క్రిందకు చూస్తే… ఆ రోడ్లు, బస్సులు, మనుషులు, ఇతర బిల్డింగులు… చిన్నవిగా… ఆట బొమ్మలుగా… నా కళ్ళకు కనిపించాయి.

ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందర్నీ… ఒక గదిలో కూర్చోబెట్టారు. సుమారు 20మంది దాకా వున్నారు. రేపు, ఎల్లుండి కూడా ఇంటర్వ్యూలు ఉంటాయట!

మరో గదిలో ఇంటర్వ్యూ జరుగుతోంది. ఒక్కొక్కరినే పిలుస్తున్నారు. అప్పుడే… నాలో టెన్షన్ మొదలైంది.

ఇంటర్వ్యూలో ఎవరుంటారో… ఏం ప్రశ్నలడుగుతారో… సమాధానాలు నేను సరిగా చెప్పగలనో లేనో… అదో రకమైన భయం, అలజడి నన్ను ఆవహించాయి. అంతలోనే… నిలదొక్కుకున్నాను. నేను ఏ పరిస్థితుల్లో ఇంటర్వ్యూ దాకా వచ్చానో… ఈ ఉద్యోగం నాకెంత అవసరమో… గుర్తు చేసుకుంటూ ధైర్యం తెచ్చుకున్నాను. ఈ ఉద్యోగం ఎలాగైనా నాకు రావాలి… అనుకుంటూ, కళ్ళు మూసుకుని, మనసులోనే ఆ దైవాన్ని ప్రార్థిస్తూ కూర్చున్నాను.

ఇంతలో… నా పేరుతో… ఎవరో పిలిచినట్లనిపించింది. కళ్ళు తెరచి చూస్తూ విన్నాను. అవును నన్నే…! ఓ బ్యాంకు ఉద్యోగి పిలుస్తున్నాడు. లేచి నిలుచున్నాను. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళమని సైగ చేశాడు.

నెమ్మదిగా తలుపు తెరుచుకుని అక్కడున్న వారిని చూశాను. అందరూ ఎలాంటి భావ ప్రకటన లేని ముఖారవిందాలతో… నన్ను లోపలికి ఆహ్వానించారు.

నవ్వుతో.. “గుడ్ మార్నింగ్ సర్స్!” అంటూ వారికి అభివాదం చేశాను. వారు కూడా హుందాగా తలలూపుతూ… నా కోసం వారికెదురుగా ఏర్పాటు చేయబడిన కుర్చీలో కూర్చోమన్నారు. నింపాదిగా కూర్చున్నాను.

ఇంటర్వ్యూ మొదలైంది…

“మిమ్మల్ని మీరు మాకు పరిచయం చేసుకుని మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి”… అని మొదటిగా మధ్యలో కూర్చున్న వ్యక్తి అడిగారు.

నా గురించి, నా కుటుంబం గురించే కాబట్టి చక్కగా చెప్పాను. మరికొన్ని జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ప్రశ్నలను అడిగారు. తడుముకోకుండా అన్నింటికి సరైన సమాధానాలు చెప్పాను.

బహుశా, ఆయన ఆంధ్రా బ్యాంకు ఉన్నతోద్యోగి అయ్యుండొచ్చనుకున్నాను.

రెండో వ్యక్తి నా చదువుకు సంబంధించిన సబ్జెక్టులలో, ప్రశ్నలడిగారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు బాగానే చెప్పాను. ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలను బట్టి, తను వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయ్యుండొచ్చనుకున్నాను.

ఇక మూడో వ్యక్తి వంతు వచ్చింది. తను, నేను వచ్చిందగ్గర నుండి, నన్ను ఆపాదమస్తకం చూస్తూ, నిశితంగా గమనిస్తున్నారు. అతను నా కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ… “మీ ఇంటిపేరు గల ప్రస్తుత హైకోర్టు జడ్జిగారి పేరు చెప్పగలవా?…” అని అడిగారు.

అందరికీ బాగా తెలిసిన పేరే కాబట్టి… వెంటనే… ఆ జడ్జి గారి పేరు చెప్పాను.

“గుడ్…! …మరి వారు మీకు బంధువులా?” చిరునవ్వులు చిందిస్తూ… అడిగారు.

అనుకోని ఈ ప్రశ్నకు ఖంగుతిన్నాను… కొంచెం తడబడ్డాను కూడా… ఆలోచించాను… అటు నా చదువుకి గాని, ఇటు నేను చేయబోయే ఉద్యోగానికి గాని… ఏ మాత్రం సంబంధం లేని ప్రశ్న అది. ‘అడగడంలో… ఏదో… అంతరార్థం వుండే వుంటుంది… లేకపోతే… ఎందుకు అడుగుతారు…!’ అనుకున్నాను.

సరే!.. నిజం నిర్భయంగా చెప్పాలని నిర్ణయించుకున్నాను.

“సర్!… నాకు ఆ జడ్జిగారి పేరు మాత్రమే తెలుసండి… వారిని ప్రత్యక్షంగా నేనేన్నడూ చూడలేదు…. వారితో నాకెలాంటి బంధుత్వం కూడా లేదండి…” అని టకటకా చెప్పి మౌనంగా వున్నాను.

నా సమాధానంతో తృప్తి చెందిన… ఇంటర్వ్యూ చేసిన ఆ మూడో వ్యక్తి… “గుడ్!” అంటూ పెదాలు బిగించి, తల క్రిందకి పైకి ఊపాడు.

బహుశా, అతనొక సైకాలజిస్టు అయి వుండవచ్చని నాకనిపించింది.

“ఇక మీరు వెళ్ళవచ్చు”… అన్నారు మధ్యలో కూర్చున్న… ఇంటర్వ్యూ చేసిన మొదటి వ్యక్తి.

అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఇంటర్వ్వూ గది నుండి బయటకు వచ్చాను. అక్కడున్న మిగతావారు క్వశ్చన్ మార్కు ముఖాలతో, ఆందోళనకరంగా నన్ను గమనిస్తున్నారు.

ఇక్కడొక విషయం గురించి తప్పక చెప్పుకోవాలి…

నా మటుకు నేను పాఠశాలలలో, కళాశాలలో చదువుకునే రోజుల్లో… వ్యాస రచన పోటీలలో, వక్తృత్వ పోటీలలో తప్పనిసరిగా పాల్గొనేవాడిని. నాటకాల్లో నటిస్తూ ఉండేవాడ్ని… ఎప్పుడూ నేను పాల్గొన్నవాటిలో నాకు బహుమతులు లభిస్తుండేవి. ఆ అనుభవం వల్ల, నాకు తెలిసిన విషయాన్ని సూటిగా చెప్పగలగడం, చక్కటి పదాల ఉచ్చారణతో, ముఖ కవళికలను మారుస్తూ, సందర్భోచితంగా హావభావాలను ప్రదర్శిస్తూ, అవసరమైనంత ఆంగికం జోడించి… చెప్పడం నాకలవాటయింది.

అది నా ఇంటర్వ్యూలో కూడా నాకు బాగా ఉపయోగపడి వుండవచ్చు. మిగతావారితో పోలిస్తే, ఈ విషయంలో నాకు ఎక్కువ మార్కులే వచ్చి వుండవచ్చు.

మొత్తానికి ఇంటర్వ్యూ సంతృప్తికరంగా సాగింది. తప్పక ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాననే నమ్మకం కుదిరింది.

ఆ రోజు నా ఇంటర్వ్యూ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. మా ఊరి బస్సు రాత్రి పది గంటలకు… టైం చాలా వుంది కాబట్టి, దిగువ అంతస్తులో వున్న ఆంధ్రా బ్యాంకు శాఖలోకి వెళ్ళి, బ్యాంకు గురించి కొంతమేర తెలుసుకున్నాను.

నేను సేకరించిన సమాచారం ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి….

1969లో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. తద్వారా… ప్రైవేటు రంగంలో పని చేస్తున్న కొన్ని పెద్ద పెద్ద బ్యాంకులను ప్రభుత్వ రంగంలోకి తీసుకోవడం జరిగింది. ఆంధ్రా బ్యాంకును మాత్రం అప్పుడు మినహాయించారు. జాతీయకరణ తరువాత బ్యాంకులన్నింటికీ… రిజర్వ్ బ్యాంకు ద్వారా కొన్ని ప్రత్యేకమైన మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. వాటిల్లో ముఖ్యమైనవి…

మొదటిగా… ఇప్పటివరకు నగరాలకు, పట్టణాలకు పరిమితమైన బ్యాంకులు, ఇకపై తమ శాఖలను… గ్రామీణ ప్రాంతాలలో కూడా తెరవాలి.

రెండోది… ఇప్పటివరకు… లాభాపేక్షతో… వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు విరివిగా అప్పులు ఇస్తున్న బ్యాంకులు… ఇకపై వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన కోళ్ళ పరిశ్రమ, పాడి పరిశ్రమ, మత్య్స పరిశ్రమలకు, చేతి పని వృత్తివారలకు, షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతులకు చెందినవారికి, నిరుద్యోగులకు, చిరు వ్యాపారులకు తప్పనిసరిగా అప్పులు ఇవ్వాలి. వీటినే ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించారు.

మూడోది… బ్యాంకులు తాము ఇస్తున్న మొత్తం అప్పుల్లో… పైన పేర్కొనబడిన ప్రాధాన్యతా రంగాలకు… 18శాతానికి తగ్గకుండా… అప్పులు ఇవ్వాలి.

బ్యాంకుల జాతీయకరణ ద్వారా గ్రామాల్లో కూడా బ్యాంకు శాఖలు తెరచి, బ్యాంకుల సేవలను గ్రామీణ ప్రజల ముంగిటికి తీసుకెళ్ళాలని, తద్వారా అప్పులు ఇచ్చి గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలని ప్రభుత్వ ఉద్దేశం… బ్యాంకులు కూడా బీదరికాన్ని పారద్రోలే సామాజిక బాధ్యతలో పాలు పంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అప్పుడు బ్యాంకుల సిబ్బందికి ప్రాధాన్యతా రంగాలకు అప్పులివ్వడం కొత్త… అందుకోసం… ఆ యా రంగాలలో అనుభవం ఉన్నవారిని, ఉద్యోగులుగా తీసుకున్నారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖ, సహకార శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ మొదలైన సంబంధిత శాఖల్లో, అప్పటికే పనిచేస్తున్న సీనియర్ అధికారులను… అగ్రికల్చరల్ ఆఫీసర్లుగా; వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రులైనవారిని అగ్రికల్చరల్ క్లర్కులుగా, బ్యాంకులలో ఉద్యోగులుగా చేర్చుకోవడం మొదలైంది..

ఈ పాటికే ఆంధ్రా బ్యాంకులో ఆరుగురిని గ్రామీణ ఋణాధికారులుగా చేర్చుకున్నారు. ఇప్పుడు అగ్రికల్చరల్ క్లర్కులను తీసుకుంటున్నారు. ఆ కోవ లోనే… నేను దరఖాస్తు చేసుకోవడం, వ్రాత పరీక్ష వ్రాయడం, ఇంటర్వ్యూకి రావడం, వరుసగా జరిగాయి.

మొత్తానికి విషయం అర్థమైంది నాకు… రాత్రి పది గంటల బస్సులో తిరిగి ప్రయాణమై, మరుసటి రోజు తెల్లారేటప్పటికి మా ఊరు చేరుకున్నాను.

వారం రోజులు గడిచాయి. నేను ఉద్యోగానికి ఎంపికయ్యానని తెలుపుతూ… ఆంధ్రా బ్యాంకు వారు ఉత్తరం పంపారు. ముందుగా హైదరాబాదులో మెడికల్ టెస్టుకు రావల్సిందిగా తెలియజేశారు. మరుసటి రోజే హైదరాబాద్‍కు చేరుకుని ఆంధ్రా బ్యాంకు కేంద్ర కార్యాలయానికి వెళ్ళాను. వారి సూచన మేరకు నగరంలో పేరు మోసిన ఓ డాక్టరుగారి దగ్గరకు వెళ్ళాను. ఆ డాక్టరు గారు శరీరంలోని అన్ని భాగాలను పూర్తిగా పరీక్షించి, రిపోర్టును ఆంధ్రా బ్యాంకుకు తామే పంపిస్తామని చెప్పి నన్ను వెళ్ళమన్నారు. తిరిగి ఆ రాత్రికే ఇంటికి చేరుకున్నాను.

అప్పాయింట్‍మెంట్ ఆర్డరు కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ, కాలాన్ని కష్టంగా గడుపుతున్నాను. నా నిరీక్షణ ఫలించి ఆ రోజే నాకు ఆంధ్రా బ్యాంకు నుండి అప్పాయింట్‍మెంట్ ఆర్డరు వచ్చింది. ఆంధ్రా బ్యాంకు గుంటూరు శాఖలో జాయిన్ అవమని తెలియజేశారు. చదువుకోగానే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కలా నిజమా… అని తర్కించుకున్న తరువాత… నిజమే… అని తేల్చుకున్నాను. ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. ఇంట్లో వాళ్ళందరి సంతోషాలకు అవధుల్లేకుండా పోయాయి. అందరి దేవుళ్ళకు మనసులోనే మొక్కుకున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here