[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]
38
[dropcap]బ్రాం[/dropcap]చ్ టార్గెట్లన్నీ రీచ్ అవగలిగాము. మా బ్రాంచి నుండి వితరణ చేసిన వ్యవసాయ ఋణాలను కూడా తొంభై శాతం పైగా వసూలు చేయగలిగాము. అక్కడ కర్షక సేవా సహకార సంఘంలో అవలంబించిన పద్ధతులనే ఇక్కడ బ్రాంచిలో కూడా అమలు చేస్తూ అక్కడి లాగే ఇక్కడ కూడా వ్యవసాయ ఋణాల్లో తొంభై శాతం పైగా వసూలు చేయగలిగాము.
వాస్తవంగా ఎలాంటి బ్యాంకు ఋణాలనైనా వసూలు చేసేందుకు పాటించవలసిన పద్ధతులు ఒకటే!
వాతావరణ పరిస్థితులు అనుకూలించి, సకాలంలో వర్షాలు కురిసి, చాలినంత వర్షపాతం నమోదైతే, పంటల్లో ఆశించినంత దిగుబడి సాధించగలుగుతుంది మన రైతాంగం. వాటికి తోడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తే రైతుల శ్రమకుదగ్గ ఫలితం తప్పక లభిస్తుంది. అప్పుడు ఏ రైతు కూడా బ్యాంకు అప్పు కట్టకుండా వుండాలని అనుకోడు.
ఇక బ్యాంకుగా వ్యవసాయ ఋణాల్లో అత్యధిక శాతం వసూళ్ళ కొరకు, మా పాత్ర ఎలా ఉంటుందో చూద్దాం.
- మొదటిది… భూమి యాజమాన్య హక్కు పత్రాలను, పండించే పంటల వివరాలను పరిశీలించిన పిమ్మట ఆ రైతుకు ఫలాన తారీఖున అప్పు ఇస్తాము… అని చెప్తాము. ఆ తారీఖున బ్యాంకుకు వచ్చిన రైతుకు అప్పు ఇచ్చి తీరతాం. అలా చేయగలిగితే, యాభై శాతం మేర ఆ అప్పును తిరిగి వసూలు చేసినట్లే. చెప్పిన మాట ప్రకారం అప్పు ఇచ్చినప్పుడు, రైతు కూడా మనం చెప్పిన తారీకుకు ముందే అప్పు తిరిగి చెల్లించాలని మనసులోనే నిర్ణయించుకుంటాడు. అలా కాకుండా రైతు బ్యాంకుకు వచ్చినప్పుడల్లా, ఆ పత్రం కావాలని, ఈ పత్రం కావాలని కొన్నిసార్లు; సిబ్బంది లేరని మరికొన్నిసార్లు తిప్పుకుంటే, ఆ రైతు అప్పు కట్టేందుకు బ్యాంకు వాళ్ళను తన చుట్టూ పదిసార్లు తిప్పుకుంటాడు. అలా ఒక రోజులో కొత్తవారికైతేనేమి, గతంలో తీసుకున్న అప్పులు చెల్లించి, తిరిగి తీసుకునే వారికైతేనేమి… రోజుకు దాదాపు అరవై మంది రైతులకు అప్పులు ఇచ్చేవాళ్ళం.
- రెండవది… రైతుకు చెప్పిన రోజు అప్పు ఇస్తాము. తిరిగి అప్పు చెల్లించవలసిన రోజునే ఆ రైతును అప్పు కట్టాల్సిందిగా అడిగితే, ఒక వడ్డీ వ్యాపారస్తుడికి, బ్యాంకుకు తేడా వుండదు. అందుకే నేను, మా అగ్రికల్చరల్ క్లర్కు శ్రీ వరద రెడ్డి గారు, ఆ రైతులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటాము. ఆ రైతు ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికైనా పిలిచినప్పుడు వెళ్తాము. వాళ్లతో సంతోషాలను పంచుకుంటాము. అశుభకార్యం అయితే, పిలవకపోయినా వెళ్తాము. వాళ్లను పరామర్శించి, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపుతాము. రైతుకు, మనం, తన హితులమని, సన్నిహితులమని, స్నేహితులమనే ఆత్మవిశ్వాసం కలిగిస్తాము. అంతిమంగా… రైతుకు మాకు ఉన్న సత్సంబంధాల వలన, అడగకుండానే అప్పు చెల్లించే స్థాయికి చేరుకుంటాడు ఆ రైతు.
- మూడోది… మధ్య మధ్యలో గ్రామాలను సందర్శిస్తూ రైతుల పంట పొలాలకు వెళ్ళి చూస్తాము. వీలైనప్పుడల్లా ప్రభుత్వ వ్యవసాయాధికారులను కూడా మా వెంట తీసుకుని వెళ్ళి రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తాము. పంటలను పట్టి పీడించే రోగాలు, తెగుళ్ళు బారి నుండి, క్రిమి కీటకాల బెడద నుండి కాపాడుకునేందుకు తగిన సూచనలు లభించేటట్లు చూస్తాము. రైతులు అధిక దిగుబడులు సాధించే దిశగా మా అడుగులు వేస్తాము.
- నాలుగోది… మహబూబాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్‍లో నేను సభ్యుడిని. ఆ సంస్థ ద్వారా మా గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను బ్యాంకు ద్వారా ఏర్పాటు చేశాము. ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత పశువైద్య శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, మందులను, కళ్ళజోళ్ళను ఉచితంగా అందించాము. బ్యాంకు తమ గ్రామాల్లో అప్పులు ఇవ్వడమే కాదు, తమ బాగోగులు కూడా పట్టించుకుంటుందన్న భావన వాళ్లలో కలిగించాము.
- ఐదవది… దురదృష్టవశాత్తు గ్రామాల్లో జరగకూడని విపత్తు ఏదైనా సంభవించినప్పుడు, మేము త్వరితగతిన స్పందించి, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. ప్రభుత్వ శాఖలతో సంప్రదించి, నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా రావలసిన సహాయం అందేట్లు ప్రయత్నించేవాళ్లం.
- ఆరవది… రైతులు తాము పండించిన పంటను మహబూబాబాద్ అగ్రికల్చరల్ మార్కెట్ యార్డులో అమ్ముకునేందుకు వచ్చినప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళేవాళ్లం. అక్కడ మా గ్రామాల రైతులు కొనుగోలుదారుల చేతుల్లో, దళారీల చేతుల్లో, మోసపోకుండా, నష్టపోకుండా చూసేవాళ్ళం. ఆ సమయంలో రైతులకు తోడుగా నిల్చున్న మమ్మల్ని తమ శ్రేయోభిలాషులుగా పరిగణించేవారు ఆ రైతులు.
- ఏడవది… గ్రామ పెద్దలను, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులను తరచూ కలుస్తూ, వారి అండదండలను సంపాదించగలిగాము. తద్వారా, వారి సహకారంతో మాకు అలవిగాని, మొండి బకాయిలను సైతం వసూలు చేయగలిగాం.
- ఎనిమిదవది… వీటన్నిటికి తోడు, ఋణగ్రహీతలకు, అప్పులు తిరిగి కట్టవలసిన తేదీని గుర్తు చేస్తూ, పది రోజుల ముందుగానే, తప్పనిసరిగా ఆర్డినరీ నోటీసులు పంపేవాళ్ళం. ఆ రోజు లోపు దాదాపు యాభై శాతం పైగా అప్పులు వసూళ్ళవుతాయి. ఆ రోజు లోపు చెల్లించని వాళ్ళకు రిజిస్టర్డ్ నోటీసులు పంపించేవాళ్ళం. దాంతో మరో ఇరవై శాతం మేర వసూళ్ళు అవుతాయి. ఇక మిగతా ముప్ఫై శాతం కోసం గ్రామాలకు వెళ్ళి, రైతులను నేరుగా కలిసి, అప్పులు తిరిగి చెల్లించాల్సిన అవసరం గురించి వివరిస్తూ కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. చెల్లించకపోతే బ్యాంకు వారు తీసుకోబోయే చర్యలకు ఇబ్బందుల పాలు కావలసి వస్తుందని నయానా భయానా చెప్పి అప్పు వసూళ్ళు చేసేవాళ్ళం. ఆ క్రమంలో మరో ఇరవై శాతంపైనే వసూళ్ళు జరుగుతాయి.
పైన తెలియజేయబడిన ఎనిమిది రకాల కార్యక్రమాలను ఓ ప్రణాళికాబద్ధంగా అమలుచేయబట్టే వ్యవసాయ ఋణాల్లో తొంభై శాతం పైగా వసూలు చేయగలిగాము.
ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా గ్రామాల్లో ఉండే పరిస్థితులను బట్టి, పైన తెలుపబడిన వాటితో పాటు, వినూత్నమైన కార్యక్రమాలు మరేవైనా అమలు చేయవచ్చు.
39
1985 సంవత్సరం.
గత సంవత్సరం మహబూబాబాద్ లయన్స్ క్లబ్ చేపట్టిన ప్రతి సేవా కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఆ క్రమంలో ఖమ్మం, వరంగల్ పట్టణాల్లోని లయన్స్ క్లబ్ కార్యక్రమాలకు కూడా తోటి సభ్యులతో కలిసి హాజరయ్యాను. ఈ సంవత్సరానికి గాను నన్ను మహబూబాబాద్ లయన్స్ క్లబ్ సెక్రటరీగా ఎన్నుకున్నారు.
ఆ క్లబ్‍లో అదొక బాధ్యతాయుతమైన పదవి. మొదటిగా క్లబ్ ఈ సంవత్సరం చేపట్టబోయే వివిధ సేవా కార్యక్రమాలు, వాటికి అవసరమైన ఆర్థిక వనరులను విరాళాల రూపంలో సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకుసాగాము.
క్లబ్ సభ్యులు విరివిగానే విరాళాలు ఇచ్చారు. పట్టణం లోని ఇతర దాతలు కూడా తమ శక్తి మేర విరాళాలు ఇచ్చారు.
బ్యాంకులో నా విధి నిర్వహణలో ఏ మాత్రం లోపం రాకుండా చూసుకుంటూ, లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలలో నా వంతు బాధ్యతలు నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను.
మహబూబాబాద్ లోని అన్ని స్కూళ్ళు, కాలేజీలలో ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించి, విద్యార్థులకు దంత పరీక్షలు చేయించి, అవసరమైన మందులు ఉచితంగా అందజేశాము.
చుట్టుపక్కల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేదవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశాము.
ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించి, పశువులకు ఆరోగ్య పరీక్షలు చేయించి, అవసరమైన మందులు ఉచితంగా అందజేశాము.
మహబూబాబాద్‍లో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించి, పేదవారికి కంటి ఆపరేషన్లు చేయించి, కళ్ళద్దాలను, మందులను ఉచితంగా అందజేశాము. ఆర్థిక ఇబ్బందులతో చదువులను కొనసాగించలేని పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్‍షిప్‍లు అందజేసి, వారి చదువులను నిరాటంకంగా కొనసాగించేందుకు సహాయపడ్డాము.
40
ఈ సంవత్సరం కూడా మహబూబాబాద్ బ్రాంచి టార్గెట్స్ అన్నీ చేరుకోగలిగాము.
వరంగల్ రీజియన్ లోని శాఖాధిపతుల సమావేశము భువనగిరి దగ్గర యాదగిరిగుట్టలో జరిగింది. నేను కూడా ఆ సమావేశానికి హాజరయ్యాను. ముందుగా ఎంతో ప్రాచుర్యం ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించాము. హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ డి.యన్. మూర్తి గారు, వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీ యల్. వీరభద్రరావు గారు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు.
ఆ తరువాత రీజియన్ లోని అన్ని బ్రాంచీల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ బ్రాంచిని సమీక్షించిన పిమ్మట, వారు మిక్కిలిగా సంతృప్తిని వెలిబుచ్చారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను, అన్ని బ్రాంచీల టార్గెట్లను బాగా పెంచారు.
సమావేశం ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ డి.యన్. మూర్తి గారు, బ్రాంచి మేనేజర్లను ఉద్దేశించి ఒకింత ఆవేశంగానే ప్రసంగించారు.
“ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలో వివిధ బ్యాంకుల మధ్య వ్యాపారాభివృద్ధి కొరకు, పోటీతత్వం విపరీతంగా పెరిగిపోతోంది. ఏ బ్యాంకైనా భవిష్యత్తులో నిలదొక్కుకోవాలంటే, ఇతర బ్యాంకులతో పోటీ పడాల్సిందే… నెగ్గుకు రావల్సిందే! ఆ విషయంలో మన బ్యాంకుకు ప్రత్యేకమైన మినహాయింపు ఏమీ లేదు. అందుకే ఈ సంవత్సరం బ్రాంచీలకు టార్గెట్లు, గడచిన సంవత్సరాలకు భిన్నంగా, మరింతగా పెంచాము.
మీరందరూ… అనుకోవచ్చు – ఈ టార్గెట్లు పెట్టారు గానీ, వాటిని రీచ్ అవగలమా? అని. అవలేమని తెలిసి తెలిసి, ప్రయత్నం చేయడం వృథా ప్రయాస అవుతుందేమో!… అని కూడా మీరు అనుకోవచ్చు. అలా అనుకుంటే – అది చాలా పొరపాటు. ఎందుకంటే, మనందరి భవిష్యత్తు, మన బ్యాంకు భవిష్యత్తు పైనే ఆధారపడి వుంది. అది నిజం అని మీకందరికీ తెలుసు. అందుకే, టార్గెట్స్ ఎక్కువగా ఉన్నాయని మీరెవరూ నిరుత్సాహపడకూడదు. మీ వంతు ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే! మీరు అనుకోవాలే గాని, అది తప్పక సాధిస్తారు… ఎందుకంటే ‘ఆంజనేయస్వామి బలం, ఆంజనేయస్వామికి తెలియదట!’… అలాగే మీలోని శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. మీలో నిగూఢంగా దాగి వున్న ఆ శక్తి సామర్థ్యాలను వెలికి తీయండి, వాటిని ప్రయోగించండి, మీకిక ఎదురనేది ఉండదు. మీరంతా ఈ క్షణం నుండే రంగంలోకి దిగండి. ఆల్ ది బెస్ట్!”… అంటూ తన సందేశాన్ని వినిపించారు.
కళ్ళప్పగించి, చెవులు రిక్కించి ఆ ప్రసంగం విన్న మేమంతా, కరతాళ ధ్వనులతో మా సమ్మతిని తెలియజేశాము. మాలో ప్రతి ఒక్కరం రెట్టింపైన ఉత్సాహాన్ని మూటగట్టుకుని, కదనరంగంలోకి దూకే సైనికుల్లా తిరుగు ప్రయాణమయ్యాం.
(మళ్ళీ కలుద్దాం)