నా జీవన గమనంలో…!-28

65
8

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

47

[dropcap]రెం[/dropcap]డో రోజు బస్సు దిగగానే, పొన్నూరు ఆంధ్రా బ్యాంకుకు వెళ్ళి, మేనేజర్ గారిని, సిబ్బందిని పరిచయం చేసుకున్నాను. మేనేజర్ శ్రీ కె.వి.యన్.యస్.యస్.ఆర్.కె.ప్రసాద్ గారు… చాలా సరదా మనిషి… మంచి స్నేహశీలి. కాసేపు ఇద్దరం బ్యాంకు గురించి, పొన్నూరు పట్టణం గురించి మాట్లాడుకున్నాము. తరువాత కలుద్దామని చెప్పి మా బ్రాంచికి వచ్చాను. ముందుగా బ్రాంచ్ ప్రొఫైల్ తెప్పించుకుని క్షుణ్ణంగా చదివాను. తరువాత, ఇన్‌స్పెక్షన్ రిపోర్టును, ఆ రిపోర్టుకు బ్రాంచి ఇచ్చిన రిప్లై రిపోర్టును, ఆసాంతం పరిశీలనాత్మకంగా చదివాను. తద్వారా బ్రాంచి గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగాను.

పొన్నూరు శాఖ సాధారణ శాఖ. నిడుబ్రోలు శాఖ ఓ ప్రత్యేకమైన శాఖ.

‘గ్రామీణ పరపతి శాఖ’ మా నిడుబ్రోలు శాఖ. గ్రామీణ ప్రాంతాలలో నివసించే రైతాంగానికి, రైతు కూలీలకు, చేతి పని వృత్తుల వారికి, చిరువ్యాపారులకు, ఇతర ప్రభుత్వశాఖల సంక్షేమ పథకాల లబ్ధిదారులకు, విరివిగా ఋణ సదుపాయాలు కల్పించి, వారి ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ, ఆంధ్రా బ్యాంకు అనేక చోట్ల ఇలాంటి ప్రత్యేక శాఖలను తెరిచింది. అందులో నిడుబ్రోలు శాఖ ఒకటి. ఈ ప్రత్యేక శాఖ లన్నింటికీ, గ్రామీణాభివృద్ధి అధికారులను మాత్రమే మేనేజర్లుగా నియమిస్తారు. నా నేపథ్యం కూడా ఒక గ్రామీణ అభివృద్ధి అధికారే కాబట్టి, నన్ను ఈ ప్రత్యేక శాఖకు మేనేజర్‍గా పోస్టు చేశారు. మా బ్రాంచి ద్వారా చుట్టుపక్కల వున్న దాదాపు నలభై గ్రామాల్లో అధిక సంఖ్యాకులకు, అప్పులు ఇచ్చి, ఈ ప్రత్యేక శాఖను నెలకొల్పిన ఉద్దేశాన్ని నెరవేర్చడం జరిగింది. ఆ క్రమంలో ఋణ వసూళ్ళు కొంచెం మందగించి, బకాయిలు బాగా పేరుకుపోయాయి.

అప్పుడే ప్రక్కనే వున్న ఫోన్ రింగయింది.

“హలో సార్! నేను రీజినల్ మేనేజర్ గారి సెక్రటరీని… ఆర్.ఎమ్. గారు మీతో మాట్లాడతారట! లైన్‍లో వుండండి!”

“అలాగే నండి!”

“హలో!”

“నమస్కారం సార్!”

“ఆ నమస్కారం… ఎలా వున్నారు? బ్రాంచి ఎలా వుంది?”

“బాగున్నాను సార్! బ్రాంచి కూడా బాగానే వుంది సార్!”

“అవునయ్యా! అది మనకు ప్రిస్టీజియస్ బ్రాంచి… కానీ ఓవర్ డ్యూస్ చాలా ఎక్కువగా వున్నాయ్! నువ్ కూడా గమనించే వుంటావు!”

“అవున్సార్! చూశానండి!”

“మరి ఇప్పుడు ఆ బకాయిలను వసూలు చేయడం చాలా అవసరం. లేకపోతే అవి మరింతగా పెరిగిపోతాయ్!”

“అవున్సార్!”

“ముఖ్యంగా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్ పని చేయాలి!”

“తప్పకుండా సార్! నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను సార్! ఈపాటికే రికవరీ సీజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అప్పులు అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి, వచ్చే సంవత్సరం రికవరీ సీజన్‍లో, అంటే జూన్, 1987 కల్లా ఓవర్ డ్యూస్ రికవరీలో మంచి ప్రోగ్రెస్ చూపిస్తాను సార్!”

“నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్ సాధించగలవ్!… గో ఎహెడ్… ఆల్ ది బెస్టయ్యా!”

“థాంక్స్ అండీ!”

“వుంటాను మరి!”

“నమస్తే సార్!”

రిసీవర్ పెట్టేసి కాసేపు దీర్ఘంగా ఆలోచించాను. అప్పుడే… నా కంటూ, ఓ లక్ష్యం, నా కళ్ళెదుట సాక్షాత్కరించింది. అదే… అప్పుల వసూళ్ళలో అభివృద్ధిని సాధించాలి… యస్… డిపాజిట్ల సేకరణ, ఋణ వితరణ, ఖాతాదారుల సేవ, మొదలైన వాటికి ప్రాముఖ్యతనిస్తూనే, అప్పుల వసూళ్ళకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుందని నాకవగతమైంది.

ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకర సంఘం, కురవిలో; ఆంధ్రా బ్యాంకు మహబూబూబాద్ శాఖలో వ్యవసాయ ఋణాల్లో 90 శాతంపైగా వసూళ్ళను సాధించిన నా గత అనుభవం ఇక్కడ తప్పక ఉపయోగపడుతుంది. బహుశా… అందుకే నన్ను ఇక్కడ మేనేజర్‌గా పోస్ట్ చేసి ఉంటారేమో! ఏది ఏమైనప్పటికీ… ఇదొక మంచి అవకాశంగా తీసుకొని, వసూళ్ళలో మంచి ఫలితాలు సాధించాలి! అదే… ఇప్పుడు నా ముందున్న లక్ష్యం!!!

48

ఇప్పుడు మొట్టమొదటిగా నేను చేయాల్సింది… ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకోవాలి. ఆరా తీయగా, నా కంటే ముందు ఈ బ్రాంచిలో పని చేసిన మేనేజర్ గారు నేతాజీనగర్‍లో వుండేవారట! వారు ఖాళీ చేసిన ఇల్లు ఇంకా ఖాళీగా వుందని తెలిసింది. ఆ ఇల్లు బ్రాంచికి చాలా దగ్గరలోనే వుంది. వెళ్ళి చూశాను. బాగుంది. మాకు సరిగ్గా సరిపోతుంది. అడ్వాన్సు ఇచ్చి, ఓ వారం రోజుల్లో వచ్చి చేరుతామని చెప్పాను.

ఆ వారాంతం నుండి జాయినింగ్ టైం వాడుకున్నాను. మహబూబాబాద్ వెళ్ళి, మా పిల్లల స్కూళ్లల్లో టీ.సీ.లు తీసుకొని, ఇంటి సామాన్లను నిడుబ్రోలు అద్దె ఇంట్లోకి చేర్పించాను. భార్యాపిల్లలు కూడా నాతో వచ్చారు. సామాన్లన్నీ సర్దుకున్నాము. ఒక నెలకు సరిపడా కిరాణా సామానులు కొనుక్కున్నాము. ఇంటికి సమీపంలోనే కూరగాయల మార్కెట్టు వుంది. ప్రతి రోజూ ఉదయం పూట వెళ్ళి అవసరమైనవి కొనుక్కోవచ్చు. పిల్లలిద్దర్నీ… స్థానికంగా వున్న సెయింట్ ఆన్స్ కాన్వెంట్ స్కూల్‌లో చేర్పించాను. మొత్తానికి కుటుంబపరంగా సెటిల్ అయినట్లే. ఇక బ్యాంకులో నా విధి నిర్వహణపై మనసు లగ్నం చేయాలి…

49

ఆ రోజు ముందుగా, సబ్ మేనేజర్ అమర్నాధ్ గారిని క్యాబిన్‍లోకి పిలిపించాను.

“చూడండి! అమర్నాధ్ గారూ! మన బ్రాంచి ఓవర్ డ్యూస్ చాలా ఎక్కువగా వున్నాయి. వాటిని వసూలు చేయడంలో మనమంతా ప్రత్యేక శ్రద్ధ చూపించాలి!”

“చెప్పండి సార్! అందుకు నన్నేం చేయమంటే అది చేస్తాను!”

“గుడ్! మీరు చేయాల్సిందల్లా… నేను బ్రాంచి బిజినెస్ డెవలప్‍మెంట్ కోసం, ఋణాల వసూళ్ళ కొరకు గ్రామాలు తిరుగుతుంటాను. అంటే, ఎక్కువ టైం బ్రాంచ్ బయటే వుండాల్సి వస్తుంది. అప్పుడు బ్రాంచిని జాగ్రత్తగా చూసుకోవాలి. అటు సిబ్బంది నుండి గాని, ఇటు ఖాతాదారుల నుండి గాని ఏ విధమైన ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మన పై అధికారుల నుండి మన బ్రాంచి గురించి ఒక్క రిమార్కు కూడా రాకుండా చూసుకోవాలి. మీకు అలవి కాని సమస్య ఏదైనా వస్తే నాకు చెప్పండి. నేను చూసుకుంటాను. ఏమంటారు?”

“ఆ విషయాల్లో మీరింకేమీ ఆలోచించకండి! బ్రాంచిని నాకొదిలేయండి! అంతా నేను చూసుకుంటాను! మీరనుకున్నట్లు మీరు చేయండి సార్!”

“థాంక్స్ అమర్నాధ్ గారూ! ఇక మీరెళ్ళి మీ పని చూస్కోండి!”

తరువాత బ్రాంచిలో పని చేస్తున్న ఇద్దరు గ్రామీణాభివృద్ధి అధికారులను క్యాబిన్‍లోకి పిలిపించాను. ఇద్దరూ వేరే వేరే బ్రాంచీలలో అగ్రికల్చరల్ క్లర్కులుగా వుండేవాళ్ళు. పదోన్నతిపై ఈ బ్రాంచికి వచ్చారు. పేర్లు శ్రీ జి. ప్రభాకరరెడ్డి, శ్రీ యమ్. రామకృష్ణ. ఇద్దరూ యువకులు, ఉత్సాహవంతులు. గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా ఋణ వితరణ చేయడానికి పెట్టిన ప్రత్యేక శాఖ కాబట్టి ఒకరికి ఇద్దరు గ్రామీణ అభివృద్ధి అధికారులను ఈ బ్రాంచిలో పోస్ట్ చేశారు. ఇద్దరూ క్యాబిన్ లోకి వస్తూనే,

“నమస్కారం సార్!” ఒకేసారి చెప్పారు.

“నమస్కారం! రండి… కూర్చోండి! మీ ఇద్దర్నీ చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా!! జయ విజయుల్లాగా భలే వున్నారు! మీ ఇద్దరూ నా ప్రక్కన వుంటే ఏదైనా సాధించగలనని నాకనిపిస్తుంది! మరి మీరేమంటారు?”

“సార్! మీరు మా కంటే చాలా సీనియర్! అనుభవజ్ఞులు! మీతో కలిసి పని చేయడం మా అదృష్టం సార్!” అన్నాడు ప్రభాకర్ రెడ్డి.

“మీతో కలిసి పని చేస్తే, మీ నుండి మేమెంతో నేర్చుకోగలం సార్!” అన్నాడు రామకృష్ణ.

“సరే! మీకు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బ్రాంచి గురించి మీకంతా తెలుసు. ప్రస్తుతం మన ముందున్న ప్రధాన సమస్య… ఓవర్ డ్యూస్… వాటి వసూలు… ఆ తరువాత బ్రాంచి బిజినెస్ డెవెలప్‍మెంట్!”

“మీరు చెప్పింది నిజమే సార్!”

“ముందుగా నేను మన బ్రాంచి పరిధిలోని నలభై గ్రామాలను చూడాలి. ఆ గ్రామాల సర్పంచులను, ప్రజా ప్రతినిధులను, గ్రామ పెద్దలను, రైతులను, ఇతర లబ్ధిదారులను కలుసుకోవాలి. అందుకోసం మీరెలా ప్లాన్ చేస్తారో చెప్పండి.”

“అలాగే సార్! ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు బయలుదేరుదాం సార్! మధ్యాహ్నం రెండు గంటల కల్లా బ్రాంచికి వచ్చేద్దాం సార్!”

“గుడ్! మరి రేపట్నించే మొదలుపెడదామా!”

“ఓ.కే. సార్! రేపట్నించే!”

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here