నా జీవన గమనంలో…!-30

63
6

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

53

[dropcap]ఆ[/dropcap] రోజు శరత్‌బాబు గారి నుండి ఫోనొచ్చింది. వారు కూడా నాలాగే మా బ్యాంకులో గ్రామీణాభివృద్ధి అధికారిగా చేరారు. నాకు బాగా సీనియర్. నాకు గురుతుల్యులు. అందరితో అట్టే కలిసిపోతారు. ప్రస్తుతం ఆంధ్రా బ్యాంకు స్థాపించిన ‘చైతన్య గ్రామీణ బ్యాంకు’కు ఛైర్మన్. ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయం తెనాలిలో ఉండగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా శాఖలున్నాయి.

“సార్! నమస్కారం సార్!” చెప్పాను.

“ఆ… నమస్కారం… ఎలా వున్నారు?” అడిగారు శరత్‌బాబు గారు.

“బాగున్నాను సార్! మీరెలా వున్నార్సార్?”

“నేను బాగానే వున్నాను!”

“ఏంటి సార్! ఫోన్ చేశారు!… చెప్పండి సార్… నాతో ఏమైనా పనిబడిందా!”

“ఆ… పనుండే చేశాలే! ఏం లేదూ… ఈ నెల్లో చైతన్య గ్రామీణ బ్యాంకు చతుర్థ వార్షికోత్సవాన్ని జరపాలనుకుంటున్నాము. ఆ ఫంక్షన్‍లో మా వాళ్ళేదో నాటిక వేయాలనుకుంటున్నారు. అదేదో నీ దర్శకత్వంలో అయితే బాగుంటుందని నాకనిపించింది. అదీగాక, నాటకాల్లో నీకు బాగా అనుభవం ఉంది కదా! మరి నువ్వేమంటావ్?”

“అలాగే చేద్దాం సార్! నో ప్రాబ్లెమ్!”

“నాకు నీ గురించి బాగా తెలుసయ్యా! నేనడిగితే నువ్ కాదనవని మా వాళ్ళకు ముందే చెప్పాను… మరి ఎప్పుడు కలుద్దాం?”

“సార్! రేపు సాయంత్రం… ఆరు ఆరున్నర కల్లా మీ ఆఫీసుకు వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్! అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం సార్!”

“అన్నట్లు… ఫంక్షన్ ఇంకో పదిహేను రోజుల్లోనే వుంది. అంత తక్కువ టైమ్‍లో మా వాళ్ళు నాటికను ప్రదర్శించేందుకు తయారవగలరా?”

“ఫంక్షన్ ఇంకెన్ని రోజుల్లో వుందని కాదండి… మీ వాళ్ళలో ఎంత ఉత్సాహం ఉంది… ఎంత పట్టుదల వున్నది… అన్నదే ఇక్కడ ముఖ్యం… మీరు ఈ విషయాలేవీ ఆలోచించకండి! అంతా నేను చూసుకుంటాను! మీరు నిశ్చింతగా వుండండి!”

“నీతో మాట్లాడుతుంటే, కొండంత ధైర్యం వచ్చిందయ్యా! మరి రేపు కలుద్దాం! ఉంటాను!”

“అలాగే సార్!”

***

శరత్‌బాబు గారు అడిగారు… అంతే! ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తా…! ఇది నా సామర్థ్యాన్ని చూపించేందుకు, నాకు లభించిన ఓ మహదావకాశం కాదా!

54

సాయంత్రం ఐదు గంటలకు బ్యాంకులో పని ముగించుకుని, ఐదున్నర ట్రెయిన్‌కి తెనాలి బయలుదేరాను. ఆరున్నర కల్లా శరత్‍బాబు గారి ముందున్నాను.

“నమస్కారం సార్!”

“ఆ! నమస్కారం… రావయ్యా… రా! కూర్చో… మా వాళ్ళని పిలిపిస్తాను… మాట్లాడుదువుగాని! (అటెండర్‌తో వాళ్ళని పిలవమని చెప్పారు). ఆ! ఇంకేంటి సంగతులు? బ్రాంచిలో అంతా ఓ.కే.నా?”

“అంతా ఓ.కే. సార్! నో ప్రాబ్లెమ్!”

(అంతలో వాళ్ళంతా క్యాబిన్‍లోకి వచ్చారు).

“ఆ! రండి రండి! వీరే… మీ నాటికను దర్శకత్వం చేయబోయేది… వీరికి మంచి అనుభవం వుంది… అందునా నా మిత్రుడు… శిష్యుడు… (నా వైపు తిరిగి) వీళ్ళేనయ్యా! మన నాటికలో నటులు!”

పరిచయ కార్యక్రమం అయింతర్వాత అందరికీ కాఫీలు అందాయి.

“ఒక పన్చేయండి! ఇక మీరంతా మన మీటింగ్ రూమ్‍లో కూర్చుని మిగతా విషయాలు మాట్లాడుకోండి!… సరేనా?” అడిగారు శరత్‍బాబు గారు.

“అలాగే సార్!” అంటూ అందరూ నిష్క్రమించారు.

“ఓ.కే. ఇక నువ్ నీ పని మొదలుపెట్టొచ్చు… నీకేదైనా చిన్నపాటి సమస్య వచ్చినా… నాతో మాట్లాడడానికి వెనుకాడొద్దు… సరేనా!” అడిగారు శరత్‍బాబు గారు.

“అలాగే సార్! మరి నేను వాళ్ళందరి దగ్గరకు వెళ్తాను సార్!”

“ఓ.కే…. ఆల్ ది బెస్ట్!”

“థాంక్యూ సార్!”

55

అందరం మీటింగ్ రూమ్‍లో కూర్చుని నాటికను ఒకసారి చదువుకున్నాము. ఆ నాటిక పేరు ‘అమ్మ!’. ఇతివృత్తం ఏమిటంటే… నలుగురు అన్నదమ్ములు… మద్యపానానికి బానిసలై, సంపాదించినది సరిపోక, అప్పులపాలై రోడ్డున పడతారు. ఐదు సంవత్సరాల క్రితం, తండ్రి మరణించాడు. కొడుకుల చెడు అలవాట్లతో కలత చెందిన తండ్రి, చనిపోయే ముందు ఆస్తినంతా భార్య పేరు మీద వ్రాయించాడు. తండ్రి ఆస్తిని అనుభవించలేని కొడుకులు, తల్లిని చంపి, ఆ వచ్చే ఆస్తిని అమ్మగా వచ్చే డబ్బును, తమ వ్యసనాలకు వాడుకుందామనుకుంటారు. ఒక రోజు ఫుల్‍గా తాగి, తాగిన మైకంలో, కన్నతల్లిని కడతేర్చి, ఆ శవం పైనేబడి, స్పృహ కోల్పోతారు. తాగిన మత్తు దిగిన తరువాత జరిగింది తెలుసుకుని, ‘అమ్మా!… అమ్మా!!’ అంటూ గుండెలు బాదుకుంటారు. ఘోర తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపంతో మద్యపానాన్ని త్యజిస్తారు.

మంచి భావ ప్రేరేపితమైన కథ…

చదవడం పూర్తయిన తరువాత, వాళ్ళల్లో ఎవరు ఏ పాత్రకు సరిపోతారో నిర్ణయించాము. అందరూ తమ తమ పాత్రల సంభాషణలను విడివిడిగా వ్రాసుకుని బట్టీపట్టమని చెప్పాను. నాటిక ప్రదర్శన ముగిసేవరకు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించాను. వాళ్ళల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఉత్తేజం ఉరకలేస్తుంది. ఎలాగైనా మంచి ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదల వాళ్ళల్లో నాకు ప్రస్ఫుటంగా కనిపించింది. ఇక వాళ్ళని తీర్చిదిద్దడం పెద్ద కష్టమేమీ కాదనిపించింది నాకు. ప్రతి రోజూ ఇదే టైమ్‍కి వస్తానని, అందరూ తమ పనులు ముగించుకుని తయారుగా వుండాలని చెప్పాను.

ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి ఇంటికి చేరాను.

56

ఓ మూడు రోజులు కూర్చునే సంభాషణలు చదువుతూ, భావయుక్తంగా మాటలను పలకడం, సందర్భోచితంగా ఆరోహణ, అవరోహణ క్రమంలో మాటలను మలచుకోవడంలో, అభ్యాసం చేయించాను. నాలుగు రోజు నుంచి అందరం నిలుచునే, స్టేజీ మీద చేస్తున్నట్లు చేయడం, హావభావాలతో, శరీర కదలికలను, ముఖ కవళికలను మార్చడంలో అభ్యాసం చేయించాను.

ఉన్నట్టుండి ఛైర్మన్ శరత్‍బాబు గారు ఓ రోజు మా రిహార్సల్స్ రూమ్‍లోకి వచ్చి కూర్చున్నారు. రిహార్సల్స్ పూర్తయ్యేవరకు కూర్చుని, చివరిగా… నా దగ్గరకు వచ్చి…

“దర్శకత్వం అంటే ఇంత శ్రమ వుంటుందని నాకు తెలియదు. వాళ్ళందరితో సంభాషణలు పలికించడానికి, హావభావాలను సరిపడా వ్యక్తపరచడానికి, నువ్ ఇంత కష్టపడాల్సివస్తుందని నేను ఊహించలేదు. పైగా ప్రతిరోజూ రావడం, రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరడం… నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాననిపిస్తోంది… తలచుకుంటే చాలా బాధగా వుందయ్యా!”… అంటూ  బాధపడ్డారు.

“నన్ను బాధపెడుతున్నారని మీరనుకుంటున్నారు. నేనలా అనుకోవడం లేదు. నా ప్రజ్ఞాపాటవాలను నిరూపించుకునే ఓ గొప్ప అవకాశాన్ని  మీరు నాకు కలిపించారని, నేను అనుకుంటున్నాను.

నిజానికి, మన తెనాలి పట్టణం, కళలకు నిలయం. ఎందరో రంగస్థల మరియు వెండితెర కళాకారులను అందించింది ఈ తెనాలి. ఇక్కడ నాకంటే అనుభవజ్ఞులు, గొప్ప కళాకారులు కోకొల్లలుగా వుంటారు. వాళ్ళల్లో ఏ ఒక్కరిని మీరు అడిగినా,… కాదంటారా!! అలాంటిది, వాళ్ళందర్నీ కాదని ఆ బాధ్యతను నా భుజస్కందాలపై వుంచారంటే… అది కేవలం నాపై మీకున్న అభిమానానికి, నమ్మకానికి నిదర్శనం. అందుకు నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా వుంటాను!” అంటూ శరత్‍బాబు గారి బాధను తగ్గించే ప్రయత్నం చేశాను.

“అదంతా నీ మంచితనమయ్యా!… సరే!… మీరు కానివ్వండి… నేను తరువాత కలుస్తాను!” అంటూ భారంగా బయటికి నడిచారు శరత్‌బాబు గారు.

మేమంతా తిరిగి మా పనిలో పడ్డాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here