నా జీవన గమనంలో…!-35

37
7

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

83

[dropcap]బ్యాం[/dropcap]కుల జాతీయకరణ జరిగి, ఇప్పటికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ ఇరవై సంవత్సరాల కాలంలో, బ్యాంకింగ్ ఇండస్ట్రీ సాధించిన విజయాలను ప్రజలందరికీ తెలియజెప్పేందుకు బ్యాంకుల జాతీయకరణ 20వ వార్షికోత్సవాన్ని, ఆంధ్రా బ్యాంకు లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తున్న అన్ని జిల్లాల్లో ఘనంగా జరపవలసిందిగా, మా హెడ్ ఆఫీసు నుండి మాకు ఆదేశాలు అందాయి.

మా లీడ్ బ్యాంక్ డిపార్ట్‌మెంటు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా లోని అన్ని బ్యాంకులను కలుపుకుని 20వ వార్షికోత్సవాన్ని జిల్లా కేంద్రమైన గుంటూరులో జరిపేందుకు ఏర్పాట్లు చేశాము.

ఆ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించాము.

  • ఒకటి: పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు, సాధారణ ప్రజలకు, విడివిడిగా వ్యాసరచన పోటీలను నిర్వహించాము.
    • వ్యాస రచనలకు విషయం:
      • పాఠశాల విద్యార్థులకు: బ్యాంకుల గురించి మీకేమి తెలుసు?
      • కళాశాల విద్యార్థులకు: జాతీయకరణ ఉద్దేశాలను బ్యాంకులు నెరవేర్చగలిగాయా?
      • సాధారణ ప్రజలకు: బ్యాంకుల జాతీయకరణకు ముందు… జాతీయకరణకు తరువాత…
  • రెండు: పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు విడివిడిగా వక్తృత్వ పోటీలను నిర్వహించాము.
    • వక్తృత్వ పోటీలకు విషయం:
          • పాఠశాల విద్యార్థులకు: గ్రామీణాభివృద్ధిలో జాతీయ బ్యాంకుల పాత్ర.
          • కళాశాల విద్యార్థులకు: దేశ ఆర్థిక ప్రగతిలో జాతీయ బ్యాంకుల పాత్ర.
  • మూడు: బ్యాంకుల సిబ్బందికి క్విజ్ మరియు క్రీడల పోటీలను నిర్వహించాము.
  • నాలుగు: జిల్లాలో అనేకచోట్ల, ఆయా బ్యాంకులు సాధించిన ప్రగతిని తెలియజెప్పేందుకు, ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేశాము.
  • ఐదు: గ్రామ పెద్దలను, స్థానిక ప్రజాప్రతినిధులను, కళాశాల లెక్చరర్లను, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లను, అభ్యుదయ రైతులను సమావేశపరిచి, ‘బ్యాంకుల జాతీయకరణ’ అనే అంశంపై సెమినార్ నిర్వహించాము.
  • ఆరు: బ్యాంకు ఋణాల ద్వారా అభివృద్ధిని సాధించి, అప్పుల వాయిదాలను సకాలంలో చెల్లిస్తున్న లబ్ధిదారులను పూలదండలతో, దుశ్శాలువాలతో, మెమెంటోలతో సత్కరించాము.
  • ఏడు: ది 30-07-1989న జరిగిన 20వ వార్షికోత్సవ ముగింపు సమావేశంలో, గుంటూరు జిల్లా కలెక్టరు గారి చేతుల మీదుగా విజేతలందరికీ బహుమతులను అందజేశాము.
  • మొత్తానికి, మా లీడ్ బ్యాంక్ డిపార్ట్‌మెంటు ఆధ్వర్యంలో, మా రీజినల్ మేనేజర్ గారి పర్యవేక్షణలో, బ్యాంకుల జాతీయకరణ 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాము. అన్ని బ్యాంకుల మరియు మీడియా వారి సహకారంతో జిల్లా లోని ప్రజలందరికీ, బ్యాంకుల జాతీయకరణ వలన కలిగిన ఉపయోగాల గురించి, వారికున్న అవగాహనను మరింతగా పెంచగలిగాము.
ఆంధ్రా బ్యాంకు – లీడ్ బ్యాంకు – ఆధ్వర్యంలో… బ్యాంకుల జాతీయకరణ 20వ వార్షికోత్సవాన్ని గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించిన ఆంధ్రా బ్యాంకు, గుంటూరు రీజినల్ ఆఫీసు, లీడ్ బ్యాంకు డిపార్ట్‌మెంట్ సిబ్బంది. ఎడమ నుండి కుడికి… సర్వశ్రీ ఎ.డి.యన్.వి. ప్రసాద్ గారు, యన్.ఆర్. సత్యనారాయణ గారు, రచయిత, పాలేటి సుబ్బారావు గారు, డి. వెంకటేశ్వర్లు గారు.

ఆంధ్రా బ్యాంకు, హెడ్ ఆఫీసు, హైదరాబాద్ వారు – మా కార్యక్రమాలను ప్రశంసించడమే కాకుండా, ఆంధ్రా బ్యాంకు లీడ్ బ్యాంకుగా వ్యవహరిస్తున్న – తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, బెర్హాంపూర్ (ఒరిస్సా) జిల్లాల రీజినల్ మేనేజర్లకు – గుంటూరు రీజియన్‌లో చేసినట్లుగా, ఇంకా వేరేమైన కార్యక్రమాలను కూడా అలోచించి, బ్యాంకుల జాతీయకరణ 20వ వార్షికోత్సవాన్ని వెంటనే జరిపించమని ఆదేశాలను జారీ చేశారు.

84

అయినవారందరకీ దూరంగా, ఎండనకా, వాననకా, రాత్రనకా, పగలనకా, ఎముకలు కొరికే చలిలో, మాడ్చి మసి చేసే ఎండల్లో, దట్టమైన అడవుల్లో, మంచు కొండల్లో, ఎడారుల్లో, తిండీ తిప్పలూ లేకుండా, శత్రువులతో ప్రాణాలొడ్డి పోరాడేందుకు సంసిద్ధులై వుంటూ, మన కోసం, మన దేశ సంరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సైనికులు – సైన్యంలో వారి పదవీ కాలం పూర్తి చేసుకున్న తరువాత, తమ తమ సొంత ఊర్లలో స్థిరపడడానికి, తిరిగి ఇళ్లకు చేరుకుంటారు.

అలాంటివారు, భవిష్యత్తులో సౌకర్యవంతంగా జీవించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయకారులుగా వుంటున్నాయి. ఇదే సమయంలో, బ్యాంకులు కూడా వారికి అవసరమైన ఋణ సదుపాయాలు కల్పించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అందుకే, గుంటూరు జిల్లాకు లీడ్ బ్యాంకుగా వ్యవహరిస్తున్న ఆంధ్రా బ్యాంకు, ‘గుంటూరు జిల్లా మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం’ సభ్యులతో  ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో, బ్యాంకులు ఏ విధంగా మాజీ సైనికోద్యోగులకు సహాయపడగలవో చర్చించడం జరిగింది.

మాజీ సైనికోద్యోగుల అవసరాలను అనుసరించి, ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న బ్యాంకుల శాఖలు వారికి ఋణాలు మంజూరు చేయడానికి శ్రీకారం చుట్టాయి. తదుపరి రోజుల్లో, మాజీ సైనికోద్యోగులకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ, బ్యాంకులు తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించాయి.

85

బ్యాంకుల జాతీయకరణ తరువాత, గ్రామాల్లో విరివిగా శాఖలు తెరవడం, ప్రాధాన్యతా రంగాలకు ఎక్కువగా అప్పులు ఇవ్వడం కొనసాగుతుంది. ఆ క్రమంలో ఋణ పంపిణీ విధానంలో, కొన్ని అపశ్రుతులు దొర్లాయి. ఉదాహరణకు, ఒక గ్రామంలోని కొంతమంది, ఆ మండలంలోని ఒక బ్యాంకు శాఖలో అప్పులు తీసుకుంటారు.  ఆ వ్యక్తులే, ఆ మండలంలోని వేరే బ్యాంకు శాఖలో కూడా అప్పు తీసుకుంటారు. చివరికి రెండు చోట్లా, అప్పులు తిరిగి చెల్లించకపోవడం వల్ల, బ్యాంకుల వద్ద బకాయిలు పెరిగిపోయాయి.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరే ‘సర్వీస్ ఏరియా అప్రోచ్ – యస్.ఎ.ఎ’.

ఈ పథకం పూర్వపరాలు ఇలా ఉంటాయి. ఒక మండలంలోని బ్యాంకు శాఖ, ఆ మండలం లోని ఏయే గ్రామాలలో ఋణాలు ఇవ్వాలో, ముందుగా నిర్ణయిస్తారు. ఒక గ్రామంలో ఎవరైనా అప్పు తీసుకోవాలంటే, ఆ గ్రామం ఏ బ్యాంకు శాఖకు అనుసంధానం చేయబడిందో తెలుసుకుని, ఆ బ్యాంకు శాఖకే వెళ్ళాలి. ఆ వ్యక్తి వేరే బ్యాంకు శాఖకు వెళితే, ఆ బ్యాంకు శాఖ, సదరు వ్యక్తికి ఋణం ఇవ్వడానికి నిరాకరిస్తూ, ఆ వ్యక్తి ఋణం తీసుకునేందుకు, ఆ మండలంలోని ఏ బ్యాంకు శాఖకు వెళ్ళాలో సూచిస్తుంది.

ఈ ‘యస్.ఎ.ఎ’ పథకం వల్ల, అటు బ్యాంకులకు, ఇటు గ్రామీణ ప్రజలకు చాలా ఉపయుక్తంగా వుంటుంది. అదెలా అంటే, ఒక గ్రామంలో నివసించే వ్యక్తి అప్పు కోసం, ఆ మండలంలోని ఆయా బ్యాంకు శాఖల చుట్టూ ప్రదక్షిణలు చేయనక్కరలేదు. తన గ్రామం, ఆ మండలం లోని ఏ బ్యాంకు శాఖకు అనుసంధానం చేయబడిందో తెలుసుకుని, సరాసరి ఆ బ్యాంకు శాఖకు వెళ్ళి ఋణ సౌకర్యం పొందవచ్చు.

అలాగే, ఒక బ్యాంకు శాఖ ఏయే గ్రామాల్లో అప్పులు ఇవ్వాలో ముందుగానే నిర్ణయించబడింది కాబట్టి ఆ బ్యాంకు శాఖ ఆయా గ్రామాల్లోని వ్యక్తులకు మాత్రమే అప్పులు ఇవ్వవచ్చు. తద్వారా, అప్పులు ఇవ్వడం, బకాయిలు వసూలు చేయడంలో సౌలభ్యం చేకూరుతుంది.

అదియును గాక, ఆయా గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలను తయారు చేసి, అమలు పరుస్తూ, బ్యాంకు శాఖలు గ్రామీణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడవచ్చు.

86

ప్రస్తుతం నడుస్తున్న పద్ధతిలో ఏదైనా మార్పు చేద్దామని ప్రయత్నించినప్పుడు, సాధారణంగా ప్రజల నుండి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అర్థమయ్యేట్లు చెప్పి ఒప్పించగలిగితే, ఆ మార్పును తప్పక స్వాగతిస్తారు ఆ ప్రజలు.

ఇప్పుడు అదే పరిస్థితి. ఏ బ్యాంకు శాఖకైనా వెళ్ళి అప్పు తీసుకునే తమ స్వేచ్ఛను, ఈ ‘సర్వీస్ ఏరియా అప్రోచ్’ హరిస్తున్నట్టు భావించారు, గ్రామీణ ప్రజలు. బ్యాంకు శాఖల ముందు ప్రదర్శనలు నిర్వహించారు. ఉన్న పద్ధతిని మార్పు చేయవద్దని కోరుకుంటూ, మహాజర్లు సమర్పించారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చకముందే, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి మండలంలోని బ్యాంకు శాఖల అధికారులు, ప్రభుత్వ అధికారులు కలిసి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు, రైతు నాయకులు, గ్రామీణ ప్రజలు, అందరినీ ఆ సభలకు ఆహ్వానించి, ‘సర్వీస్ ఏరియా అప్రోచ్’ వలన కలిగే లాభాలను వివరించారు. నూతన విధానంపై గ్రామీణ ప్రజలకున్న అపోహలను తొలగించారు.

ఈ నేపథ్యంలో, ఆంధ్రా బ్యాంకు, ఫిరంగిపురం శాఖ ద్వారా నుదురుపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామీణ ప్రాంత లబ్ధిదారుల సమావేశంలో, నాతో పాటు, ఆంధ్రా బ్యాంకు గుంటూరు రీజినల్ మేనేజర్ గారు, ప్రభుత్వ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరక్టరు గారు, ఇతర మండల స్థాయి ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.

ఆ ప్రాంతంలో ప్రత్తిపంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. అందుకే ప్రత్తిపంటలో అధిక దిగుబడి సాధించేందుకు అవలంబించవలసిన ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి వివరించడం జరిగింది. అదే సభలో, తీసుకున్న అప్పులను సకాలంలో తిరిగి చెల్లించే లబ్ధిదారులను సన్మానించడం జరిగింది. తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, తద్వారా కలిగే లాభాలను విశదీకరిస్తూ వక్తలు ప్రసంగించారు.

చివరిగా, ‘సర్వీస్ ఏరియా అప్రోచ్’ పథకాన్ని వివరించి, ఆ పథకం వల్ల గ్రామీణ ప్రజలకు ఒనగూరే లాభాలను తెలియజేస్తూ, వారికున్న సందేహాలను నివృత్తి చేశారు.

ఇలాంటి గ్రామ సభలను, ఆయా మండలాల్లో, అక్కడున్న బ్యాంకు శాఖలన్నీ కలిసి, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించాయి.

ఎట్టకేలకు, జిల్లా వ్యాప్తంగా ఈ ‘సర్వీస్ ఏరియా అప్రోచ్’ పథకానికి గ్రామీణ ప్రాంత ప్రజల ఆమోదాన్ని బ్యాంకులు చూరకొనగలిగాయి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here