నా జీవన గమనంలో…!-5.1

47
10

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

[dropcap]ఒం[/dropcap]గోలు బ్రాంచి ప్రకాశం జిల్లా లోనే అతి పెద్ద బ్రాంచి. జిల్లా లోని కొన్ని చిన్న చిన్న శాఖలకు మరో పెద్దదైన చీరాల బ్రాంచి, మరి కొన్ని చిన్న శాఖలకు ఒంగోలు బ్రాంచి, రిమిటెన్స్ బ్రాంచీలుగా ఉండేవి. అలా ఒంగోలు శాఖ క్రింద, కందుకూరు, చీమకుర్తి, సింగరాయకొండ, ఉప్పుగొండూరు, మరి కొన్ని బ్రాంచీలు వుండేవి. ఆ శాఖలకు చెందిన మిగులు క్యాష్‌ను తీసుకోవడం, తక్కువగా ఉన్నప్పుడు క్యాష్‌ను ఏర్పాటు చేయడం ఒంగోలు బ్రాంచి బాధ్యత. అప్పుడప్పుడు ఆయా బ్రాంచీల సిబ్బంది శలవులపై వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతుంటే, ఒంగోలు బ్రాంచి నుండి, ఆ బ్రాంచీలకు డెప్యుటేషన్‍పై సిబ్బందిని సహాయంగా పంపుతారు.

నన్ను కూడా రెండు మూడు రోజుల కొరకు ఆ బ్రాంచీలకు డెప్యుటేషన్ మీద పంపిస్తుండేవారు. పైగా, నేను అగ్రికల్చరల్ క్లర్కు కాబట్టి వ్యవసాయ ఋణాల వితరణ సమయంలో నన్ను విధిగా ఆ బ్రాంచీలకు పంపిస్తుండేవారు.

ఆ క్రమంలో నేను ఒకసారి కందుకూరు శాఖకు వెళ్ళినప్పుడు, చెప్పుకోదగ్గ అంశాలు చూశాను. ఆ శాఖ మేనేజరు గారిని గురించి నాకు ముందుగా తెలిసిన దాన్ని బట్టి, సుమారు 5 అడుగుల ఎత్తుంటారు, 45 సంవత్సరాల వయస్సుంటుంది. హాఫ్ హ్యాండ్స్ స్లాకును, ఇన్‍షర్ట్ చేసుకుని, కొంచెం హైహీల్స్ బూట్లు వేసుకుని, చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, చురుగ్గా వుంటారని అంటారు. ఆయన పేరు గురవయ్య. అయితే అందరూ ఆయన్ని ‘గోల్డ్ లోన్ గురవయ్య’ అంటారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రకాశం జిల్లాలోని మొత్తం శాఖలలో, అత్యధిక గోల్డ్ లోనులు, ఆ బ్రాంచిలోనే ఇస్తారు.

అందుకు తగ్గట్టుగా, నేను ఆ బ్రాంచికి వెళ్ళిన రోజు, బ్రాంచి మొత్తం, గోల్డ్ లోనులు తీసుకునే కస్టమర్లతో కిక్కిరిసి వుంది. అతి కష్టం మీద, వాళ్ళందరిని నెట్టుకుంటూ, మేనేజరుగారి క్యాబిన్ దగ్గరకి వెళ్ళాను. అక్కడ మేనేజరు గారు లేరు. బ్యాంకింగ్ హాల్‍లోకి చూశాను. అక్కడొక వ్యక్తిని చూశాను. చూసి చూడగానే, ఆయనే మేనేజరు గోల్డ్ లోన్ గురవయ్య గారు… అని నాకు అనిపించింది. కౌంటర్‍లో విచారించాను. నా ఊహే నిజమైంది.

కాసేపు అలాగే నిల్చుని, ఆయనను నిశితంగా గమనించాను. సుమారు ఓ అరడజను కౌంటరులు వున్నాయి. ప్రతి కౌంటర్ దగ్గరికి, అతి వేగంగా కదులుతూ, అక్కడున్న సిబ్బందికి, కౌంటర్ల ముందు నిలుచున్న కస్టమర్లకు సహాయపడుతున్నారు. అంతా తానై, ఎటు చూసినా ఆయనే కనబడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి, మధ్యాహ్నం 2 గంటల వరకు, అలా కౌంటర్ల మధ్యనే తిరుగుతూ, పని ఎక్కువగా ఉన్న చోట కొంత పనిని పంచుకుంటూ, చాలా ప్రత్యేకంగా కనిపించారు.

“ఆయన్ని కలవాలంటే ఎలా?” అని కౌంటర్‍లో క్లర్కును అడిగాను.

“ఆయన రెండింటి వరకు ఎవరినీ కలవరు. అప్పటి దాకా ఇక్కడ మా మధ్యనే వుంటారు. లంచ్ తరువాత, క్యాబిన్‍లో కూర్చుంటారు. అప్పుడే ఎవరినైనా కలుస్తారు. తరువాత బ్యాంకు పనులపై బయటకెళ్తారు.” అని చెప్పాడు.

“సార్! నేను ఒంగోలు బ్రాంచి స్టాఫ్‌ని… డెప్యుటేషన్‍పై వచ్చాను…!” అని చెప్పాను.

“ఔనా! అయితే వుండండి! నేను వెళ్ళి చెప్తాను!” అని వెళ్ళి మేనేజరు గారితో మాట్లాడి, తిరిగొచ్చి… “మిమ్మల్ని మేనేజర్ క్యాబిన్‍లో కూర్చోమన్నారు. ఓ ఐదు నిమిషాల్లో వస్తారట! అక్కడి కెళ్ళి కూర్చోండి!” అని చెప్పాడు.

నేను వెళ్ళి క్యాబిన్‍లో కూర్చున్నాను. చెప్పినట్టే ఐదు నిమిషాలలో వచ్చారు.

వస్తూనే, “హల్లో…  మీరొస్తున్నారని మీ మేనేజరు గారు ఫోన్‍లో చెప్పారు! వెల్‍కం!” అన్నారు.

“థాంక్యూ సార్!” అన్నాను.

“ఆ, ఏం తీసుకుంటారు? కాఫీ… టీ…!”

“ఏం వద్దండీ! లంచ్ టైం అవుతుంది కదా!”

“సరే! మీతో తీరిగ్గా లంచ్ టైం తరువాత మాట్లాడుతాను. ఈ లోపు మీరు కూడా బయటికెళ్ళి లంచ్ చేసి రండి… ఓ.కే.నా?”

“అలాగే సార్!”

తను మరలా బ్యాంకింగ్ హాల్‍లోకి వడివడిగా వెళ్ళారు.

నేను బయటకెళ్ళి, ఓ హోటల్‍లో భోంచేసి తిరిగి వచ్చాను. మేనేజరు గారు తన సీట్లో కూర్చుని తనతో తెచ్చుకున్న టిఫిన్ బాక్సు లోని టిఫిన్ తింటున్నారు. నేను అక్కడున్న స్టాఫ్‍తో మాటల్లో పడ్డాను. ఠంచనుగా రెండున్నర గంటలకి టిఫిన్ తినడం ముగించుకుని, ప్రశాంతంగా తన సీట్లో కూర్చుని, నన్ను రమ్మని కబురు పంపారు. నేను వెళ్ళి ఎదురుగా కూర్చున్నాను.

“ఆ! ఇప్పుడు చెప్పండి! బ్యాంకు వర్కుకు బాగా అలవాటు పడ్డారా?” అడిగారు మేనేజరు గారు.

“పరవాలేదండి! బాగానే చేయగలుగుతున్నాను!”

“గుడ్! రేపు కొన్ని క్రాప్ లోన్స్ రిన్యూవల్స్ వున్నాయి. మనిద్దరం కలిసే చేద్దాం. ఈ పూటకు ఆ గోల్డ్ లోన్ కౌంటర్‍లో కాస్త హెల్ప్ చేయండి!” అని చెప్పి, ఆ కౌంటర్ క్లర్కుని పిలిచి, నన్ను పరిచయం చేశారు.

“నేను మనం ఫైనాన్స్ చేసిన కొన్ని యూనిట్స్‌ని ఇనస్పెక్షన్ చేయడానికి, డిపాజిట్ల కోసం పెద్దవాళ్లని కలిసేందుకు బయటికెళ్తున్నాను. నేను రావడానికి బాగా లేటవుతుంది. మనం రేపు ఉదయం పదిగంటలకు కలుద్దాం… ఓ.కే.నా?… ఇప్పుడు మీరు గోల్డ్ లోన్ కౌంటర్‍కి వెళ్ళండి!” అని చెప్పి, నా సమాధానం కోసం ఎదురుచూడకుండా, బిరబిరా బయటికెళ్ళారు.

“ఏమండీ! సార్… రోజూ ఇంతేనా!” అని కౌంటర్ క్లర్కుని అడిగాను.

“ఆ! ఎప్పుడూ ఇంతే! ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా పరిగెత్తుతుంటారూ! మమ్మల్ని కూడా పరిగెత్తిస్తుంటారు!” చెప్పాడు ఆ క్లర్కు.

‘వాట్ ఎ సిస్టమాటిక్ అండ్ సిన్సియర్ మేనేజర్!’ అని మనసులో అభినందించకుండా వుండలేకపోయాను.

రాత్రి 8 గంటల దాకా గోల్డ్ లోన్ కౌంటర్‍లో వారికి సహాయపడ్డాను. ఆ ఊర్లో అంత అనువైన హోటల్స్ లేవు. రాత్రికి బ్యాంకులోనే నిద్ర చేశాను.

***

రెండో రోజు ఉదయం పది గంటలకల్లా, సుమారు ఓ అరవై మంది క్రాప్ లోన్స్ కోసం వచ్చారు. మేనేజరు గారు చెప్తున్న వివరాల మేరకు, వాళ్ళందరి దరఖాస్తులు పూర్తి చేసి, వాళ్ళ భూముల రికార్డులను పరిశీలించి వాళ్ళు వ్యవసాయం చేయబోయే విస్తీర్ణం, అందులో సేద్యం చేయబోయే పంటలను బట్టి, ముందు బ్యాంకు నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం, క్రాప్ లోనులను, ఏ ఒక్కరినీ వెనక్కి పంపకుండా, ఆ రోజు వచ్చిన వారందరికీ ఇచ్చాము. తదుపరి అన్ని దరఖాస్తులను, డాక్యుమెంట్లను, మరొక్కమారు పరిశీలించుకుని, సరిగ్గా వున్నాయని నిర్ధారించుకున్న తరువాత, సేఫ్ రూమ్‍లో జాగ్రత్తగా సర్దేశాము.

అంతా అయ్యేసరికి రాత్రి 8 గంటలయ్యింది.

“చాలా బాగా చేశావయ్యా! నీ దగ్గర మంచి స్పీడుంది… యాక్యురసీ వుంది…! ముఖ్యంగా రైతుల పట్ల నీ హెల్పింగ్ నేచర్ నాకు బాగా నచ్చింది…! నీకు మన బ్యాంకులో మంచి భవిష్యత్తు ఉంది… ఇలాగే కష్టపడి పని చేయ్!” అని మేనేజరు గారు మెచ్చుకుంటుంటే, ఆ రోజున నేను పడిన శ్రమ అంతా మటుమాయమైంది.

***

మూడో రోజు కూడా… ఓ డెబ్భై మంది దాకా రైతులు వచ్చారు. వాళ్ళందరికీ లోన్లు యిచ్చి, అన్నీ సర్దుకునేసరికి రాత్రి 9 గంటలయింది. బ్యాంకు తలుపులు వేసి వెళ్తూ…

“నాకు నువ్ బాగా నచ్చావయ్యా! నెలలో కనీసం రెండు మూడు రోజులైనా మా బ్రాంచీకి వస్తుండు. మీ మేనేజరు గారితో నేను మాట్లాడుతాను!” అన్నారు మేనేజరు గారు.

‘మీరు కూడా నాకు మరీ మరీ నచ్చారు సార్!’ అని మనసులోనే అనుకుంటూ… “అలాగే వస్తాను సార్!” అని బాహాటంగా అన్నాను.

“సరే! పద! బస్‌స్టాండులో నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను!… అన్నట్లు ఇందాక తిన్న టిఫిన్ నీకు సరిపోయిందా?”

“చాలు సార్! అంతగా కావాలనుకుంటే ఫ్రూట్స్ ఓ గంటాగి తింటాను సార్!”

తన స్కూటర్ పై నన్ను బస్టాండులో దింపేసి వెళ్ళారు మేనేజరు గారు.

రాత్రి 12 గంటలు దాటాకా ఒంగోలు చేరుకున్నాను.

***

ఆ రోజు మా ఊరి నుండి ఉత్తరం వచ్చింది. మా దగ్గరి బంధువుల వాళ్ళబ్బాయి పెళ్ళి. వాడు నాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ కూడా. వచ్చే సోమవారమే పెళ్ళి. ఆ పెళ్ళికి వెళ్ళాలనిపించింది. అమ్మా వాళ్ళూ కూడా వీలైతే రమ్మని ఉత్తరంలో వ్రాశారు. శనివారం రోజు ఉదయమే సోమవారం శలవు కోసం లీవ్ లెటర్‍తో మేనేజర్‍ గారిని కలిశాను. ఇప్పుడు శలవు ఇవ్వడం కుదరదని, లీవ్ లెటర్ తిరిగి నా చేతికే ఇచ్చి, వెళ్ళి కౌంటర్‍లో పని చేసుకోమన్నారు. ఏమి మాట్లాడాలో తెలియక, దిగాలుగా నా కౌంటర్ వైపు నడిచాను. ఇది గమనించిన నా కొలీగ్ శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు గారు…

“ఏంటి గురూ! అలా వున్నావేంటి? మేనేజరు గారు ఏమైనా అన్నారా?” అని అడిగాడు.

బాధ పడుతూ జరిగిన విషయాన్ని చెప్పాను. వెంటనే మేనేజర్ గారి దగ్గరకి గబగబా వెళ్ళాడు నా కొలీగ్… కాసేపటికి తిరిగొచ్చి…

“ఇప్పుడెళ్ళి లీవ్ లెటర్ ఇవ్వు!” అని చెప్పాడు.

“కోప్పడతారేమోనండి!”

“నువ్వెళ్ళి ఇవ్వు గురూ!”

భయం భయంగా మేనేజర్ గార్ని కలిశాను.

నా కొలీగ్ ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో నాకు తెలియదు గాని, లీవ్ లెటర్ తీసుకున్న మేనేజర్ గారు, ‘శాంక్షన్డ్’ అని వ్రాసి, “సబ్ మేనేజర్ గారికి ఇవ్వండి” అని ఆ లీవ్ లెటర్‍ని నాకే ఇస్తూ…

“మంగళవారం ఉదయమే వస్తావుగా!” అని అడిగారు.

“తప్పకుండా వస్తానండి…! చాలా థాంక్సండీ!” అని చెప్పి తృప్తిగా క్యాబిన్ బయటి కొచ్చాను.

“ఏమైంది గురూ? ఏమన్నారు మేనేజర్ గారు?” అడిగాడు నా కొలీగ్.

“లీవ్ శాంక్షన్ చేశారండి! మీకు చాలా థాంక్సండీ!”

“పరవాలేదు లే!”

ఇద్దరం పనిలో పడ్డాం.

తరువాత తెలిసింది ఆ కొలీగ్ మా బ్రాంచి యూనియన్ సెక్రటరీ అని…!!

మొత్తానికి పెళ్ళికి వెళ్ళి రాగలిగాను. మా వాళ్ళందరితో,  బంధువులతో, స్నేహితులతో, ఆ రెండు రోజులు చాలా సరదాగా గడిచాయి.

అందరూ నాకు బాగా విలువ ఇస్తూ…, చాలా సన్నిహితంగా మెలిగారు. ఎందుకంటే… ఇప్పుడు నేనొక బ్యాంకు ఉద్యోగస్తుడ్ని కదా! నిజానికి బ్యాంకు ఉద్యోగం అంటే చాలా గొప్పగా అనుకున్నారు అందరూ…

మేనేజర్ గారికి చెప్పిన విధంగా మంగళవారం ఉదయమే ఒంగోలు చేరుకుని 10 గంటలకల్లా బ్యాంకు కెళ్ళాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here