నా జీవన గమనంలో…!-5.2

47
8

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

[dropcap]రెం[/dropcap]డు వారాల తరువాత మరలా మా ఊరెళ్లిన నాకు ఓ సరికొత్త అనుభవం ఎదురైంది. అమ్మా, నాన్న, నాయనమ్మలతో మాట్లాడుతుండగా…

“నాయనా! నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాము!” అన్నది అమ్మ.

“చెప్పమ్మా ఏంటా విషయం?”

“ఏం లేదయ్యా! నీ తోటి వాళ్లందరికీ పెళ్ళిళ్ళవుతున్నాయి. కొంతమంది బిడ్డల తండ్రులు కూడా అయ్యారు! మరి నువ్ కూడా పెళ్ళి చేసుకోవచ్చు గదయ్యా!” నెమ్మదిగా చెప్పింది అమ్మ.

ఊహించని ఆ మాటలకు ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అతి కష్టం మీద నా నోట మాట పెగిలింది.

“అమ్మా! నాకేంటి…! పెళ్ళేంటి…! … ఏంటమ్మా ఇది?! ఇప్పుడు నా పెళ్ళి ఆలోచన ఎందుకమ్మా!?”

“ఏం లేదయ్యా! నీకు మంచి ఉద్యోగం వచ్చింది. సంతోషమే!… కాని అక్కడ నువ్వు ఒక్కడివే ఉంటున్నావు! ఎలా ఉంటున్నావో! ఏం తింటున్నావో! అని దిగులుగా ఉంటుందయ్యా! పెళ్ళైతే నీకో తోడు దొరుకుతుంది…! నీ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది నీక్కాబోయే భార్య! అప్పుడు మేం ఇక్కడ ధైర్యంగా ఉంటాం కదయ్యా! ఆలోచించు!!”

“అది కాదమ్మా! ఈ మధ్యనే ఉద్యోగంలో చేరాను. ఇంకా కన్‍ఫర్మ్ కూడా అవలేదు. అంటే… పర్మనెంటు కాలేదు… మరి… నా పెళ్ళికి తొందరెందుకమ్మా!” బ్రతిమాలుతూ చెప్పాను.

“అదేందయ్యా!! నీది పర్మనెంటు ఉద్యోగం అన్నావుగా!” ఆశ్చర్యంగా అడిగింది అమ్మ.

“అది నిజమే అమ్మా! పర్మనెంటే! కాని, కొత్తగా ఎవరు బ్యాంకులో చేరినా, ఆరు నెలల తరవాతనే పర్మనెంటు చేస్తారు! అంతే!…” వివరించాను.

“అయితే, ఇప్పటి నుంచి నీకో మంచి సంబంధం కోసం వెతుకుతుంటాము. పర్మనెంటు అయిన తరువాతనే పెళ్ళి చేసుకుందువుగాని! సరేనా! ఒప్పుకోయ్యా!” ప్రాధేయపూర్వకంగా అడిగింది అమ్మ.

“ఒప్పుకోయ్యా!” అంటూ నాన్న, నాయనమ్మ అమ్మతో గొంతు కలిపారు.

“మీరందరూ ఇలా బలవంతం చేస్తుంటే… ఇక నేనేం మాట్లాడగలను! సరే మీ ఇష్టం!” అన్నాను. అలా అనక తప్పలేదు మరి!

విచిత్రం ఏంటంటే, ఆ టైంలో నాకు కొంచెం సిగ్గనిపించిన మాట నిజం. అది మొదలుకొని, నాలో, నా ఆలోచనలో… ఏంటో కొంత మార్పు వచ్చినట్లనిపించింది నాకు.

అప్పటికే మా ఇంట్లో ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి… ఇప్పుడు మగ పిల్లాడి పెళ్ళికి ప్రయత్నాలు ప్రారంభించారు మావాళ్లు కొత్తగా.

వెంటనే మా కుటుంబ సలహాదారు, మా అందరి శ్రేయోభిలాషి, మా మేనమామ రామకోటయ్యగారికి ఉత్తరం రాశారు… మంచి సంబంధం చూడమని సందేశం పంపారు.

నా ఉద్యోగ నిర్వహణలో తలమునకలై ఉన్న నాకు, ప్రతి ఆదివారం, ఏదో ఒక ఊరు తీసుకెళుతూ, ఎవరో ఒక అమ్మాయిని చూపిస్తునే ఉన్నారు మా వాళ్ళు. ఏమీ నిర్ణయించుకోలేని అయోమయంలో పడ్డాను నేను. అందుకే…! భారమంతా వాళ్ళ మీదనే పెట్టి… నాకో అమ్మాయిని చూసే బాధ్యత వాళ్ళకే అప్పగిద్దామనుకున్నాను. ఎంతైనా… మా వాళ్ళే కదా! వాళ్ళంతా నా మంచినే కోరుకుంటారు కదా! అందుకే చెప్పాను:

“మీరందరూ ఆలోచించి ఓ నిర్ణయానికి రండి! మీ అందరికీ ఇష్టమైతే… నాకూ ఇష్టమే…! మీరే అమ్మాయిని చేసుకోమంటే, ఆ అమ్మాయిని చేసుకుంటాను. ఇక నన్ను ఈ విషయంలోకి దయచేసి లాగకండి!…

మరో విషయం, మీరు చెప్పిన అమ్మాయినే పెళ్ళి చేసుకుని, కలకాలం సంతోషంగా ఆ అమ్మాయితోనే జీవిస్తానని మీకు నా మాటగా చెప్తున్నాను! ఇక మీరు మీ ప్రయత్నాలు కొనసాగించండి!”

“అదెలా కుదురుతుంది? నువ్వు చూడకుండానా? అదెలా సాధ్యం?” ఆశ్చర్యంగా అడిగారు మామయ్య.

“పరవాలేదు మామయ్యా! మీరంతా అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించి, ఎంపిక చేసిన అమ్మాయిని, పెళ్ళికి ముందు ఓసారి చూస్తాన్లే!” అన్నాను.

అందరూ కొంచెం సేపు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని, “సరే…! అలాగే కానిద్దాం…!” అన్నారు మామయ్య.

“హమ్మయ్య!” అంటూ ఊపిరి పీల్చుకున్నాను నేను.

***

బ్యాంకులో ఆరు నెలల సర్వీసు పూర్తి కాగానే హెడ్ ఆఫీసు నుండి కన్‍ఫర్మేషన్ లెటర్ వచ్చింది. అప్పటికే మా వాళ్ళు నాకో మంచి సంబంధం వెతికారు. అమ్మాయి వాళ్ళది గుంటూరు. ఓ మంచి ముహూర్తాన ఆ కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో వివాహం ఏ ఆర్భాటం లేకుండా, పెద్దల ఆశీర్వాదాలతో సాదాసీదాగా జరిగింది. తిరుగు ప్రయాణంలో కాళహాస్తిలో ఆగి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నాము.

ఆ తరువాత ఒంగోలులో కాపురం పెట్టించారు, ఇరువైపుల పెద్దలు. మా బ్యాంకు వాళ్ళకు ఓ పెద్ద హోటల్‍లో మంచి పార్టీ కూడా ఇచ్చాను. వైవాహిక జీవిత ఆనందాల అనుభూతులతో రోజులు తొందరగానే గడుస్తున్నాయి. మా నెల జీతంతో సంసారం ఏ లోటు లేకుండా, సంతృప్తిగా సాగుతుంది. పండగలకు పబ్బాలకు, మేమిద్దరం, వాళ్ళ ఊరూ, మా ఊరు వెళ్ళొస్తున్నాం. అప్పుడప్పుడూ వాళ్ళమ్మా వాళ్ళు, మా అమ్మావాళ్ళు వచ్చి, మాతో కొద్ది రోజులు గడుపుతూ, మా భవిష్యత్తు జీవితం, సాఫీగా గడిపేందుకు మార్గదర్శకం చేస్తున్నారు.

అనుకోకుండా ఓ రోజు మా మామయ్య వచ్చారు. రెండు రోజులు మాతో గడిపి, మా అన్యోన్య దాంపత్యాన్ని చూసి సంతృప్తి చెంది తిరిగి వెళ్ళారు. మాది ఆయన కుదిర్చిన సంబంధం కదా! అందుకని మేం ఎలా వుంటున్నామో… ఓసారి చూడాలనిపించి వచ్చి వుంటారు.

***

అప్పుడే నా దృష్టికి వచ్చింది… మా కొలీగ్స్ ఏవో బ్యాంకు పరీక్షలు వ్రాస్తుండటం. ఆ పరీక్షల గురించి ఆరా తీశాను.

‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్’ అనే సంస్థ బొంబాయిలో వుంది. వారు సంవత్సరంలో రెండు సార్లు, దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్ 1లో ఐదు సబ్జెక్టులు, పార్ట్ 2లో ఆరు సబెక్టులు ఉంటాయి. రెండు పార్టులలో ఉత్తీర్ణులైన వారికి ‘సి.ఎ.ఐ.ఐ.బి’ అనే బ్యాంకింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. అంటే ‘సర్టిఫికెటెడ్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్’.

ఆ క్వాలిఫికేషన్ ప్రత్యేకతలు ఏమిటంటే, పార్ట్ 1 పాసయితే ఒక ఇంక్రిమెంటు, పార్టు 2 కూడా పాసయితే రెండు ఇంక్రిమెంట్లు, అంటే మొత్తం మూడు ఇంక్రిమెంట్లన్న మాట! పైగా ఆ ఇంక్రిమెంట్లు ‘ప్రొటెక్టెడ్ ఇంక్రిమెంట్స్!’. అంటే మున్ముందు ఆ సర్టిఫికెట్ సాధించిన ఉద్యోగికి ఎప్పుడు ప్రమోషన్ వచ్చినా, అలా ఎన్ని ప్రమోషన్లు వచ్చినా, ప్రమోషన్ తరువాత స్కేల్ ఆఫ్ పే లో, ఆ మూడు ఇంక్రిమెంట్లను కలుపుతూ, నూతన బేసిక్ పే ని నిర్ణయిస్తారు. అంటే ఆ ఇంక్రిమెంట్లు సర్వీసు చివరి వరకూ వస్తుంటాయని అర్థం చేసుకున్నాను. ఆ ఇంక్రిమెంట్లు ఇచ్చిన తరువాత, ఫిట్‍మెంట్‍లో మాగ్జిమమ్ రీచ్ అయితే, ‘ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అలవెన్సు’ అని ఓ ప్రత్యేకమైన అలవెన్సు కూడా ఇస్తారు.

ఇంకో విషయం! సి.ఎ.ఐ.ఐ.బి క్వాలిఫికేషన్ వున్నవారికి ప్రమోషన్ సమయంలో స్పెషల్ వెయిటేజ్ కూడా ఇస్తారట! అందుకే ఆ క్వాలిఫికేషన్‍ని సాధించడం, ఓ ప్రిస్టేజ్‍గా భావిస్తారు బ్యాంకు వాళ్ళు.

కాని, ఆ పరీక్షల్లో పాసవడం అంత ఈజీ కాదట! ఆల్ ఇండియాలో పాస్ పర్సంటేజ్, 15 నుంచి 20 శాతానికి ఏనాడూ మించదట! అదీ గాక, అక్కౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్ వారికి పరవలేదు గానీ, సైన్స్ బ్యాక్‍గ్రౌండ్ వున్న నాలాంటి వారికి మరీ మరీ కష్టమట!

ఆ క్షణంలోనే… ఎలాగైనా… ఆ క్వాలిఫికేషన్ సాధించి తీరాలనే బలీయమైన ఆకాంక్షకు నాలో బీజం పడింది… అంతే! …వెంటనే అందుకు కావలసిన పుస్తకాలు కొనుక్కుని చదవడం మొదలెట్టాను. మొదటిగా పార్ట్ 1 లో రెండు సబ్జెక్టులు, తరువాత రెండు సబ్జెక్టులు, ఐదో సబ్జెక్టు అక్కౌంట్స్ – ఆ ఒక్క సబ్జెక్టును ఎక్కువ కాన్‍సన్‍ట్రేషన్ పెట్టి వ్రాద్దామనుకున్నాను.

మొదటిసారిగా వ్రాసిన పార్ట్ 1 లో రెండు సబ్జెక్టులు సునాయాసంగానే పాసయ్యాను.

డెలివరీ కోసం పుట్టింటికెళ్ళింది మా ఆవిడ. ఆ సమయంలోనే, ఎటూ ఒక్కడినే ఉండాలి కాబట్టి పార్ట్ 1 లోని మరో రెండు సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యాను. ఓ ప్రక్క బ్యాంకు ఉద్యోగాన్ని బాధ్యతాయుతంగా చేస్తూ, మరో ప్రక్క కష్టపడి చదివి ఆ రెండు సబ్జెక్టులు కూడా వ్రాశాను. చాలా బాగా వ్రాశాను కూడా! ఓ రోజు రిజల్ట్స్ కూడా రానే వచ్చాయి. పాసయ్యాను! ఎంతో ఆనందించాను. పార్ట్ 1 అవాలంటే, చివరిది, అయిదోది అయిన అక్కౌంట్స్ సబ్జెక్టులో పాసవ్వాలి… అంతే!

***

అనుకోకుండా ఓ రోజు, …గుంటూరు నుండి రీజియనల్ మేనేజరు శ్రీ చెరువు రాధాకృష్ణమూర్తి గారు మా బ్రాంచి విజిట్‍కి వచ్చారు. బ్రాంచి మేనేజరుగారితో బ్రాంచికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించిన తరువాత, ఇద్దరూ కలిసి స్థానికంగా వున్న, మా బ్యాంకు ద్వారా అప్పు పొందిన కొన్ని యూనిట్‍లను సందర్శించారు. పెద్ద డిపాజిట్ కస్టమర్లను కూడా కలిశారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బ్రాంచికి వచ్చారు. స్టాఫ్ మీటింగ్‍లో మా అందరితో ముచ్చటించారు రీజియనల్ మేనేజరు గారు.

ఆ మీటింగులోనే… గుంటూరు బ్రాంచి నుండి, రీజియనల్ ఆఫీసును విడదీసి వేరే బిల్డింగులో పెట్టబోతున్నామని చెప్పారు. తాను ఆ రీజియనల్ ఆఫీసులోనే రీజియనల్ మేనేజరుగా వుండేందుకు హెడ్ ఆఫీసు నిర్ణయించిందని తెలియజేశారు. ఇకపై గుంటూరు మేనేజరుగా, ఈ మధ్యనే ప్రమోషన్ పొందిన మా బ్రాంచి మేనేజరుగారిని ట్రాన్స్‌ఫర్ చేస్తారని, అతి త్వరలో మా బ్రాంచికి కొత్త మేనేజరు గారు వస్తారని చెప్పారు.

మీటింగ్ అయిపోగానే, మా బ్రాంచి సిబ్బంది అందరూ, మా మేనేజరుగారికి అభినందనలు తెలియజేశారు. తరువాత మేనేజరు గారి క్యాబిన్‍లో మేనేజరు గారు, రీజియనల్ మేనేజరు గారు, ఇద్దరూ ఏవో విషయాలు చర్చించుకుంటున్నారు.

అంతలో నన్ను క్యాబిన్‍లోకి రమ్మని కబురు చేశారు. నన్నే ఎందుకు పిలుస్తున్నారో… అర్థం కాక… భయం భయంగా… బిక్కుబిక్కుమంటూ… మేనేజరు గారి క్యాబిన్‍లోకి వెళ్ళాను.

“ఏం బాబూ! ఎలా వున్నావ్?!… వర్కు బాగా నేర్చుకున్నావా?” అంటూ నన్ను ప్రశ్నించారు రీజియనల్ మేనేజరు గారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here