నా జీవితంలో శివారాధన-2

0
8

శివ శివేతి శివేతి వా
భవ భవేతి భవేతి వా
హర హారేతి హరేతి వా
భజ మన శివమే నిరంతరం.

[dropcap]మా [/dropcap]ఊరిలో బిఎస్‌సి చదువు పూర్తి అయ్యాక పేపర్ టెక్నాలజీ చదువు కోసం సహారన్‌పూర్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ హాస్టల్‌లో ఉంటూ కొన్ని సాయంత్రాలు స్నేహితులతో కలిసి లేదా ఒంటరిగా ఉన్న నారాయణ మందిరానికి నడిచి వెళ్లి అక్కడ దేవతల దర్శనం చేసుకుని వచ్చేవాడిని. ఆ ఆలయంలో శివలింగం తెల్ల పాలరాతి లింగం, చక్కగా ధవళ కాంతులు విరాజిమ్ముతు ఉండేది. నేను వెళ్ళే సాయంత్రాలలో పుష్ప అలంకార శోభితం అయి ఉండేది.

ఆ మందిరంలో అన్ని పాలరాతి విగ్రహాలు ఎంతో శోభాయమానంగా ఉండేవి. నేను మంగళవారాలు ఎక్కువగా వెళుతుండే వాడిని.

కాలేజీ సెలవు సమయంలో దగ్గర ఉన్న హరిద్వార్, హృషికేష్ మిత్రులతో వెళ్లి గంగా స్నానం చేసి అక్కడ ఉన్న మందిరాలు దర్శనం చేసుకుని రావడం జరిగింది.

హృషికేష్‌లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గంగా స్నానం చేయడం జరిగింది, మార్చి నెలలో చలి తట్టుకోవడం కోసం. అప్పుడు గంగ నీరు ఎంతో స్వచ్ఛంగా కొద్దిగా వెచ్చగా ఉన్నాయి. నదిలో నుండి బయటకు రావాలనిపించలేదు.

పేపర్ టెక్నాలజీ చదువు అయి ఉద్యోగం రీత్యా తమిళనాడు ఈరోడ్‌లో శేషసాయి పేపర్ మిల్‌లో హాస్టల్‌లో ఉండడం జరిగింది.

తమిళనాడులో అందరు భక్తి ప్రదానంగా ఉంటారు. ఆలయం దర్శనానికి సంప్రదాయ దుస్తులు, వేషధారణలో వస్తారు ఎంత పెద్ద పదవిలో ఉన్న వారైనా.

మా పేపర్ మిల్ జనరల్ మేనేజర్ గారు సంప్రదాయ దుస్తుల్లో ప్రతి మంగళవారం, శనివారాలలో కాలనీ లోని మందిర సముదాయములకు కుటుంబ సమేతంగా వచ్చేవారు. అయన అయ్యంగార్లు, అందువల్ల ఆ వేషధారణలో వచ్చేవారు. వారి మెప్పు కోసం చాలా మంది అదే వేషధారణలో వచ్చేవారు.

నేను మాములుగా ప్యాంటు షర్ట్ వేసుకుని వినాయక గుడి దగ్గర ఉన్న విభూతి ధారణ, కుంకుమ ధారణ చేసి వెళ్లే వాడిని. అక్కడ రామ మందిరంలో శ్రీ విష్ణుసహస్ర నామ స్తోత్రం పారాయణం చేసేవారు. అందులో పాల్గొనే వాడిని.

ఈరోడ్ పట్టణంలో ఉన్న శివాలయానికి నేను పని మీద ఈరోడ్ వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకుని వచ్చేవాడిని.

నా సెలవు రోజుల్లో దగ్గరగా వేరే ఊళ్లలో ఉన్న క్షేత్రాలు దర్శనం చేసుకుని వచ్చే వాడిని. ఎక్కువ ఒంటరిగా వెళ్లే వాడిని.

ఈరోడ్ తరువాత మహారాష్ట్రలో బళ్లార్షలో ఉద్యోగం చేయడానికి వెళ్ళాను. అక్కడ ఉన్న 3 ఏళ్ళలో రామ మందిరానికి ఎక్కువ వెళ్లే వాడిని. శివ మందిరాలకు చంద్రపూర్ పట్టణానికి వెళ్ళినప్పుడు వెళ్లేవాడిని. చంద్రాపూర్ పట్టణం ఆరంభంలో భద్రకాళీ దేవస్థానం ఉండేది. అదో పెద్ద కోట. అందులో అమ్మ వారి మందిరం, శివ మందిరం ఉండేవి.

చంద్రపూర్ భద్రకాళి ఆలయం

నా మిత్ర కుటుంబాలు తప్పకుండా ఆ దేవాలయానికి వెళ్ళడానికి ఇష్టపడేవారు.

మేము పేపర్ మిల్లు వారు ఏర్పాటు చేసిన బస్సులో వెళ్లే వాళ్ళం. డ్రైవర్ మంచి వాడు అయితే ఎక్కువ సేపు ఆపేవాడు. పేపర్ మిల్లులో ఉద్యోగుల కుటుంబాలు చంద్రాపూర్ వెళ్లి రావడానికి మిల్లు యాజమాన్యం బస్సు రోజు సాయంత్రాలు మిల్లు కాలనీ నుండి ఏర్పాటు చేసిది. సుమారు 40మంది వెళ్లే వాళ్ళం.

అక్కడ ఉన్న తెలుగు కుటుంబ స్నేహితులతో కలసి వెళ్లి భద్రకాళి దేవాలయం దగ్గర దిగి అక్కడ దేవతా దర్శనం చేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ పట్టణం లోకి ఒక్కోసారి వచ్చే వాళ్ళం.

భద్రకాళి దేవాలయం:

ఈ పురాతన ఆలయాన్ని 16వ శతాబ్దంలో గోండు రాజ వంశానికి చెందిన దుంధ్య రామ్ సాహు నిర్మించాడు. మంగళవారాలు ఈ ఆలయ దర్శనానికి ప్రత్యేకమైన రోజులు.

శయన స్థితిలో భద్రకాళి మాత

మందిరంలో చిన్న హనుమాన్ ఆలయం, గణపతి ఆలయం ఉన్నాయి. పక్కన పూజ సామాగ్రి అమ్మే దుకాణాలు ఉన్నాయి.

ఆలయంలో రెండు విగ్రహాలు ఉన్నాయి. ఒకటి ఎరుపు, పసుపు రంగు మరియు నారింజ పండు రంగు వస్త్రాలతో అలంకరణ చేయబడ్డ శివలింగానికి సంబంధించిన విగ్రహం.

ఇంకోటి నేలమట్టం క్రింద వాలి ఉన్న స్థితిలో ఉంది. భక్తులు ఈ విగ్రహం దర్శించుకోవాలి అంటే సొరంగం ద్వారా వెళ్ళాలి. ఇక్కడ పూజలు చేయడానికి పూజారి ఉంటారు. ఈ ఆలయం ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది.

బల్లార్పూర్ ఉద్యోగం చేసినంత కాలం ఈ మహాకాళి మందిరానికి దర్శనానికి వెళుతుండేవాడిని.

ఉద్యోగంలో ఎదుగుదల కోసం, పెళ్లి అయిన తరువాత రాజమండ్రి రావడం జరిగింది. రాజమండ్రిలో ఉన్న కాలంలో ఎక్కువ రామ మందిరం, హనుమాన్ మందిరం దర్శనాలు చేసుకునే వాడిని. పర్వాల్లో శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకునే వాడిని.

రాజమండ్రి ఉద్యోగం చేస్తుండగా విదేశంలో (దుబాయ్) ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. అక్కడకి వెళ్లి ఉద్యోగం చెయ్యాలి, మళ్ళీ విదేశంలో ఉద్యోగం చేసే అవకాశం రాదు అని యోచనతో దుబాయ్‌లో ఉద్యోగం కోసం రావడం జరిగింది. ఇక్కడ నా రూమ్ మేట్ రెడ్డి గారు వారంలో ఒక రోజు సిటీలో దేవాలయాలు దర్శనం చేసుకుని బయట ఉపాహారం చేసి వద్దాం అని అనడంతో ప్రతి శనివారం దుబాయ్‌లో సింధీలచే నిర్వహించబడే శివాలయానికి, పక్కన అనుకుని ఉన్న గుజరాతి దేశీయులు చేత నిర్వహించబడే కృష్ణ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం.

ఉదయం పూట ముందు కృష్ణ మందిరానికి వెళ్లి కృష్ణుడికి ఇచ్చే ఆరతిలో పాల్గొని తరువాత శివ మందిరానికి వెళ్లేవాళ్ళం. శివాలయంలో లింగం మీద పాలు పోయడానికి వీలు ఉండేది. ఉదయం ఎక్కువగా దుకాణాలకు వెళ్లే వ్యాపారస్థులతో సందడిగా ఉండేది.

ఇక్కడ ప్రసాదంగా బ్రెడ్ మరియు కాబూలి సెనగలు కూర ఇచ్చేవారు.

ఓల్డ్ దుబాయ్ లో శివ మందిరం

శివరాత్రి సమయంలో మంచుతో హిమాలయ పర్వతాలు ఏర్పరిచి అందులో శివలింగం ఉంచేవారు.

ఈ రెండు ఆలయాలు దుకాణ సముదాయాల మధ్యలో ఉండటం, దీనికి దగ్గరగా ఓ మసీదు, దుబాయ్ పురావస్తు సంగ్రహణాలయం ఉండటం విశేషము.

దీని పక్కన సముద్రం ఓ పాయగా తీయబడి ప్రవహిస్తూ ఉంటుంది. దేవాలయం ఉన్న ప్రాంతం బర్ దుబాయ్ (పురాతన దుబాయ్), సముద్రం పాయ అవతల భాగం నూతన దుబాయ్ అని వ్యవహారిస్తారు. ఈ పాయ దాట డానికి మోటార్ బోట్‌లు చక్కగా నడుస్తూ ఉంటాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here