నా జీవితంలో శివారాధన-4

0
9

[dropcap]శి[/dropcap]వ శివేతి శివేతి వా
భవ భవేతి భవేతి వా
హర హారేతి హారేతి వా
భజమన శివమే నిరంతరం

1997వ సంవత్సరం నుండి నేను ‘శ్రీ ఉమా కోటి లింగేశ్వర స్వామి దేవాలయం’కు ప్రతి సోమవారం ఉదయాన్నే 5 గంటలకు వెళ్లి స్వామి వారి ప్రథమ అభిషేకంలో పాలు పంచుకోవడం మొదలు పెట్టాను. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం.

ఈ ఆలయం స్థల చరిత్ర:

శ్రీ కుమార సంభవం జరుగు సమయంలో పరమ శివుడు రాక్షస సంహారం చేసాడు. ఆ సమయంలో శివుని శరీరం నుండి స్వేద బిందువులు వెలువడి రాక్షసుల పైనబడుట వలన వారు శివలింగములుగా ఉద్భవించారు. ఆ శివలింగాలను దేవతలు నాసికా త్రయంబకం మొదులుకొని ఒక్కొక్క లింగమును ప్రతిష్ఠించగా ఈ స్థలం దగ్గరికి వచ్చేసరికి కోటికి ఒక శివలింగం తక్కువ వచ్చింది. అంతట బ్రహ్మ, విష్ణువులు కాశి నుండి ఒక లింగమును తీసుకుని వచ్చి రాజమహేంద్రవరం గోదావరి నదీ సమీపమున ఉన్న ఈ క్షేత్రం నందు ప్రతిష్ఠించారు. అందుచే ఈ స్వామికి ‘కోటి లింగేశ్వరుడు’ అనే నామధేయం ఏర్పడింది.

శ్రీ ఉమా కోటి లింగేశ్వరస్వామి

శ్రీ రాముడు వానవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు ఈ క్షేత్రం మీదుగా ప్రయాణం చేయుచు శ్రీ స్వామి వారి దర్శనం చేసుకొనెను. కావున ఈ క్షేత్రమునకు క్షేత్ర పాలకుడుగా కొలువు తీరాడని చెప్పబడుతుంది.

ఈ ఆలయం ముఖ్య ఆలయం ప్రక్కన శ్రీ సుబ్రమణ్య స్వామి, నవగ్రహ మందిరాలు ఉన్నాయి. తరువాత కొత్త గా కాలభైరవ మందిరం, వీరభద్ర మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి.

శ్రీ భువనేశ్వరి అమ్మ వారు

ముఖ్యదేవాలయం కోటి లింగేశ్వరస్వామి గర్భాలయంలో గణపతి కొలువై ప్రథమ పూజలు అందుకోంటాడు. శివలింగం ప్రక్కన అమ్మ వారు కొలువై ఉంటారు.

ఈ ఆలయానికి ఎడమ ప్రక్కన భువనేశ్వరి దేవి ఆలయం, కుడి ప్రక్కన శ్రీ సీతాలక్ష్మణరామ చంద్ర స్వామి ఆలయం ఉన్నాయి. రామచంద్ర స్వామి ఆలయం కు ప్రత్యేక ధ్వజస్తంభం ఉండి అక్కడ హనుమాన్ నమస్కార ముద్రలో స్వామికి అభిముఖంగా కొలువై ఉన్నాడు.

శివాలయం ధ్వజస్తంభం దగ్గర పెద్ద నందీశ్వరుడు కొలువై ఉన్నాడు.

ఈ ఆలయంలో ఇద్దరు నందీశ్వరులు కొలువై ఉండటం విశేషం.

శ్రీ కాలభైరవస్వామి

నేను ప్రతి సోమవారం ఉదయం 5 గంటలకు స్వామి వారికీ జరిగే ప్రథమ అభిషేకంలో కావలసిన పూజ సామాగ్రి గుడి దగ్గర ఉన్న దుకాణంలో కొని గుడి లోకి వెళ్లి నందీశ్వరునికి నమస్కారం చేసుకుని (మనసులో “నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం మహా దేవస్య సేవార్థం అనుజ్ఞం దాతు మార్హసి” అని అనుకుని) విభూది ధారణ, కుంకుమ ధారణ చేసుకుని అమ్మ దర్శనం చేసుకుని అభిషేకం జరిగే శివాలయం లోకి ప్రవేశించే వాడిని. అప్పటికే భక్తులు నిండిపోయి ఉండేవారు. ఎలాగో చోటు సంపాదించుకుని అభిషేకంలో భాగస్వామిని అయ్యేవాడిని.

అభిషేకం చేసే పూజారులు వారానికి ఒకరు చొప్పున వంతులు వారీగా మారేవారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అందులో ఇద్దరు చాలా బాగా అభిషేకం చేసేవారు. అందులో ఒకరిది నా పేరే.

శ్రీ వీరభద్ర స్వామి

వారు అభిషేకం ఎంతో శ్రద్ధగా ముందు సంకల్పంలో అందరి గోత్ర నామాలు చెప్పి తరువాత పూజ ద్రవ్యాలు అన్ని సేకరించి ఒక్కక్కటి అభిషేకం చేస్తూ నమక, చమకం చదువుతూ చేసేవారు. ముందు ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనే, పంచదార, తరువాత పళ్ళ రసాలు తరువాత భస్మజలం బిందెలో కలిపి అభిషేకం తరువాత గంధం, పుష్పాలు, మారేడు దళాలు, పన్నీరు, సెంట్ వేసి, వట్టి వేళ్ళు అన్ని వేసిన జలంతో అభిషేకం చక్కగా చేసేవారు.

తరువాత కొబ్బరికాయల నుండి వచ్చే నీరుతో అభిషేకం చేసి వట్టి వేళ్ళు లింగం దగ్గర జలంతో తడిపి ఆలయంలో ఉన్న మా పైన జల్లి, తరువాత స్వచ్ఛ జలంతో రెండు మూడు బిందెలు నీరుతో అభిషేకం చేసి తరువాత విభూది, గంధంతో అలంకరణ చేసి, మారేడు దళాలు, పుష్పాలుతో స్వామిని అలంకరణ చేసి దూపం చూపించి, తరువాత దీపం చూపించి, ప్రసాదంగా కొట్టిన కొబ్బరికాయలు, అరటిపళ్లు నైవేద్యం పెట్టి, నీరాజనం ఇచ్చేటప్పుడు గుడిలో ఘంటానాదం పరికరం ఆరంభం చేసి ఆ ధ్వనితో బాటుగా చేతిలో గంట వాయించేవారు.

నవ గ్రహాలు

తరువాత నీరాజనం అందరికి చూపించి మంత్రపుష్పం చెప్పి అనంతరం మన నుంచి మంత్రపుష్పం పుష్పాలు ఇచ్చిన పుష్పాలు, మారేడు దళాలు స్వీకరించి స్వామికి సమర్పించి అనంతరం లింగానికి వ్రాసిన విభూతి,గంధం మిళీత మిశ్రమం చక్కగా అందరికి ధారణకి ఇచ్చి, అభిషేకం చేసిన పంచామృత తీర్థం అందరికి పంచి, ప్రసాదం, స్వామి పాదుకలు అందరికి ఇచ్చేవారు. మొత్తం ఈ కార్యక్రమం ఓ గంట సాగేది. చక్కగా ఎంతో సంతృప్తి కలిగేది అభిషేకం జరుగుతున్నపుడు చూస్తుంటే.

తరువాత అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్లి అమ్మ దర్శనం చేసుకుని, అనంతరం క్షేత్ర పాలకులు శ్రీ సీతా లక్ష్మణ, రామచంద్ర స్వామి మందిరంలో వారిని దర్శనం చేసుకుని తీర్థం తీసుకుని బయటకి వచ్చి నందీశ్వరుని దగ్గర మనకిచ్చిన పుష్పము లేదా మారేడు దళం ఉంచి అక్కడ నుండి స్వామిని చూస్తూ ఓ స్తోత్రం చదువుకుని, ఉత్తరాభిముఖంగా నందికి వెనకాల సాష్టాంగప్రణామం చేసుకుని తరువాత ఆలయంలో నవగ్రహ దర్శనం, ప్రదక్షిణలు, ఇతర ఆలయ దర్శనం చేసుకుని సంతృప్తిగా బయటకు వచ్చేవాడిని. ఒక్కొక్క సారి మాములు ప్రదక్షిణలు, ఒక్కొక్కసారి చండీ ప్రదక్షిణలు చేసేవాడిని.

శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత రామచంద్ర స్వామి

మామూలుగా శివాలయంలో దర్శనం నియమాలు ముందు నవగ్రహాలు, శని దర్శనం అనంతరం కాళ్ళు కడుక్కుని అపుడు నంది ఆజ్ఞ తీసుకొని శివాలయంలోకి వెళ్లి దర్శనం, అభిషేకం చేసుకోవాలి. కానీ నాకు సమయం సరిపోక ప్రథమ అభిషేకంలో తప్పకుండా భాగస్వామి ని అవ్వాలి అనే తపన, కోరికతో ఇలా చేసేవాడిని.

శివ అభిషేకం ఏ ఏ ద్రవ్యాలు ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మన పెద్దలు పురాణ ఇతిహసాల్లో ఉన్నవి చెప్పినవి తెలుసుకుందాం.

శివుడు అభిషేక ప్రియుడు!

శివో అభిషేక ప్రియః అంటే శివుడు అభిషేక ప్రియుడు.

“శివుడు అభిషేక ప్రియుడు” కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు!!

“నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి

పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు

గామధేనువు వానింట గాడి పసర

మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు”

తా:- శివలింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి (మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేనువు’ కాడి పశువుగా పడి వుంటుందట! ‘కల్పవృక్షం’ అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట!! శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి!! సకలైశ్వర్యములు సమకూరతాయి!!

నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు.

హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి.

అభిషేక ద్రవ్యాలు,ఫలితాలు:

  • ఆవు పాలతో – సర్వ సౌఖ్యాలు.
  • ఆవు పెరుగు – ఆరోగ్యం, బలం.
  • ఆవు నెయ్యి – ఐశ్వర్యాభివృద్ధి.
  • చెఱకురసం (పంచదార) – దుఃఖ నాశనం, ఆకర్షణ.
  • తేనె – తేజో వృద్ధి.
  • భస్మ జలం – మహా పాప హరణం.
  • సుగంధోదకం – పుత్ర లాభం.
  • పుష్పోదకం – భూలాభం.
  • బిల్వ జలం – భోగ భాగ్యాలు.
  • నువ్వుల నూనె – అపమృత్యు హరణం.
  • రుద్రాక్షోదకం – మహా ఐశ్వర్యం.
  • సువర్ణ జలం – దరిద్ర నాశనం.
  • అన్నాభిషేకం – సుఖ జీవనం.
  • ద్రాక్ష రసం – సకల కార్యాభివృద్ధి.
  • నారికేళ జలం – సర్వ సంపద వృద్ధి.
  • ఖర్జూర రసం – శత్రు నాశనం.
  • దూర్వోదకం (గరిక జలం) – ద్రవ్య ప్రాప్తి.
  • ధవళొదకమ్ – శివ సాన్నిధ్యం.
  • గంగోదకం – సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి.
  • కస్తూరీ జలం – చక్రవర్తిత్వం.
  • నేరేడు పండ్ల రసం – వైరాగ్య ప్రాప్తి.
  • నవరత్న జలం – ధాన్య గృహ ప్రాప్తి.
  • మామిడి పండు రసం – దీర్ఘ వ్యాధి నాశనం.
  • పసుపు, కుంకుమ – మంగళ ప్రదం.
  • విభూది – కోటి రెట్ల ఫలితం.

విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు.

శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు. ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి.

“అప ఏవ ససర్జాదౌ” అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.

ఉమా కోటి లింగేశ్వరస్వామి అభిషేకం అనంతరం

మంత్రంపుష్పంలోని.. “యోపా మాయతనంవేద” ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతుని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.

“ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్” అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పఠిస్తూ అభిషేకం చేయాలి.

“పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్”

పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్ఠాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here