నా జీవితంలో శివారాధన-6

0
7

[dropcap]’అ[/dropcap]నాయాసేన మరణం,

వినాదైన్యేన జీవనం,

దేహాంతే తవ సాయుజ్యం

దేహిమే పార్వతీపతే॥’

అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం – దేహం చాలించిన తరువాత నీలో లీనమయ్యే మోక్షం నాకు ప్రసాదించు పార్వతీపతీ! అని దీని అర్థం. దిగులులేని జీవితం, వేదనలేని మరణం, చివరకు కైవల్యం. జీవితానికి కావలసిన ముఖ్యమైనవన్నీ మూడింట్లోనే ఉన్నాయి.

[బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు]

ఈ శ్లోకం నా జీవితంలో శివారాధనని ఇంకా ప్రభావితం చేసింది.

నిత్యం ఇంట్లో శివభిషేకానంతరం పాణి మంత్రం తరువాత చెప్పుకునే శ్లోకాల్లో ఇది ముఖ్యమైనది. తప్పకుండా శివభక్తులు అందరు రోజుకొక్కసారి అయిన శివుని ధ్యానిస్తూ చదవాలని విన్నపం.

శివలింగం, శివాలయం విశేషాలు:

ప్రతి ఊరులో ఒక శివాలయం ఉంటుంది. శివాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. శివాలయంలో మనకు ఎడమ వైపు నవగ్రహ మండపంలో నవగ్రహములు, శనీశ్వరుడు కొలువై ఉంటారు.

శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభం వెనుక వైపు నుండీ ప్రదక్షిణ చెయ్యాలి. శివ దర్శనంకు ముందు చండీశ్వర దర్శనం తరువాత నందికి నమస్కారం చేసి అపుడు శివలింగం దర్శనానికి వెళ్ళాలి. చండీశ్వరుడు ఆలయంలో శివాభిషేక ద్రవ్యాలు గర్భగుడి నుండి వెలుపలకు వచ్చే చోట స్వీకర్తగా కొలువై ఉంటాడు. అయన దగ్గర చప్పట్లు కొట్టి ధ్వని చేసి మనం వచ్చినట్లు తెలియబరచుకుని ముందుకు సాగాలి. తరువాత నందీశ్వరుడి వద్ద నిలబడి వంగి కుడి చేయి నంది పృష్ఠ భాగం వద్ద ఉంచి కుడి చేయి బొటన వ్రేలు చూపుడు వేలు నంది శృంగల మధ్య ఖాళీ ఉంచేలా పెట్టుకుని శివలింగం వ్రేళ్ళ మధ్యలో నుండీ దర్శనం చేసుకోవాలి. దీన్నే శృంగ దర్శనం అని అంటారు. అప్పుడు నందీశ్వరుడిని ఇలా ప్రార్థన చెయ్యాలి.

‘నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయాకం మహా దేవస్య సేవార్ధం అనుజ్ఞామ్ దాతు మర్హసి.”

అని ప్రార్థించి ముందుకు సాగాలి. గర్భగుడిలో శివలింగానికి ఎదురుగా నిలబడరాదు. ఒక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. అభిషేకం చేయించుకోవాలి.

శివలింగం 3 భాగాలుగా ఉంటుంది.

  1. భూమి భాగం లేదా బ్రహ్మ భాగం
  2. పీఠభాగం లేదా విష్ణు భాగం
  3. లింగభాగం శివ భాగం లేదా పూజ భాగం.

శివలింగం సృష్టి, స్థితి, లయ కార్యములు నిర్వహించే భగవంతునికి ప్రతి రూపంగా ఉంటుంది.

శివలింగం ఉన్న బాగమును పానవట్టం అని అంటారు. అభిషేకం ద్రవ్యాలు శివలింగం నుండీ ఉత్తరం దిశగా వెళ్లే విధానంగా ఉత్తరం భాగం ప్రవహించే లా నిర్మితం అయి ఉంటుంది.

శివలింగం మీద ధారా పాత్ర ఉంటుంది. శివలింగం శివ, శక్తుల సమ్మేళనం కనుక ప్రచండం అయిన ఊర్జస్సు (తాపము) ఉద్భవిస్తూ ఉంటుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండడానికి శివలింగం పైన జల ధార పోస్తూ ఉండాలి. ఆ ధార నుండి ఓం కారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణ బ్రహ్మ.

గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉండాలి.

శివ అభిషేకం అనంతరం శివలింగానికి అలంకరణ చేయబడి మహా నైవేద్యం సమర్పణ జరుగుతుంది.

శివ అనుగ్రహం కోసం శివ ప్రార్థన చేసుకొని బయట కు వచ్చి నందీశ్వరుని తరువాత ఉత్తరాభిముఖంగా సాష్టాంగ ప్రమాణం చేసుకుని నందీశ్వరుని దగ్గర కొంత సమయం కూర్చొని మిగతా ప్రాంగణం దేవతల దర్శనం అనంతరం మనం మన గృహాలకు వెళ్ళాలి.

🌼🌿స్మరణ మాత్రం చేతనే మనకి సర్వశుభాల్ని, సుఖాలని ప్రసాదించేవారు ఉమామహేశ్వరులు.🌼🌿

రుద్రో దివః ఉమా రాత్రిః అని వేదం చెప్తోంది. పగలు శివస్వరూపం. రాత్రి అమ్మ స్వరూపం. ఇలా సర్వ జగత్తు వారి రక్షణలోనే ఉంది. వారి అనుగ్రహాన్ని నిత్యం మనం పొందడానికి వేదమాత ఎంతో  స్తోత్రవాఙ్మయాన్ని మనకి అనుగ్రహించింది. అన్నిటిని మనం అందిపుచ్చుకోలేకపోయినా అన్నిటి సారభూతమైన కొన్ని నామాలను కూడా మనకి ప్రసాదించింది. వాటిని నిత్యం సంధ్యలలో, శయన సమయాల్లో స్మరించుకొంటే వారి అనుగ్రహం పూర్ణంగా లభిస్తుంది.

అవే 1.శ్రీ శివాయనమః. 2.శ్రీ మహేశ్వరాయ నమః. 3. శ్రీ రుద్రాయనమః 4. శ్రీ విష్ణవే నమః 5.శ్రీ పితామహాయనమః 6.శ్రీ సంసారవైద్యాయనమః 7.శ్రీ సర్వజ్ఞాయనమః 8.శ్రీ పరమాత్మనేనమః.

అమ్మవారి నామాలు:- 1.శ్రీ ఆర్యాయైనమః 2.శ్రీ దుర్గాయైనమః 3.శ్రీ వేదగర్భాయైనమః 4.శ్రీ అంబికాయైనమః 5.శ్రీ భద్రాయైనమః 6.శ్రీ భద్రకాళ్యైనమః 7.శ్రీ క్షేమ్యాయైనమః 8.శ్రీ క్షేమంకర్యైనమః

-పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు.

శివాలయ ప్రదక్షిణా విధానం:: చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం::

మిగిలిన దేవాలయాలలో వలే ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనిని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని కూడా అంటారు.

లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది!!

ప్రదక్షిణా విధానాన్ని వివరించే ఒక శ్లోకం!!

వృషంచండంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం|

చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం||

శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్|

లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధృవం||

శివాలయ ప్రదక్షిణా విధానం

నందీశ్వరుని(ద్వజస్తంభం) వద్ద ప్రారంభించి – ద్వజస్తంభం దగ్గరనుండి చండీశ్వరుని దర్శించుకుని సోమసూత్రం-చండీశ్వరులు-అక్కడనుండి మళ్లీ వెనుకకు తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి.. ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం (అభిషేకజలం బయటకు పోవు దారి) వరకు వెళ్ళీ వెనుకకు తిరిగి మరలా ద్వజస్తంభం దగ్గర ఒక్కక్షణం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడినుండి తిరిగి ద్వజస్తంభం దగ్గరకు వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది.. వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక “శివ ప్రదక్షిణ” పూర్తి చేసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. (సోమసూత్రం దగ్గర ప్రమథ గణాలు కొలువై ఉంటాయంటారు.. అందుకే వారిని దాటితే తప్పు చేసినవారమవుతాం). కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టంకాదు.

ఇలా చేసే ఒక ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినదట.. ఇలా మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి!!

అయితే గుంటూరు పెద్దకాకాని శివాలయంలో ఈ విధమైన ప్రదక్షిణం గురించి చాలా ప్రముఖంగా పేర్కొనబడింది…

పెద కాకాని లో చండీ ప్రదక్షిణ విధానం తెలిపే చిత్రం
పెద కాకాని లో శ్రీ చండీశ్వరులు
చండీ ప్రదక్షిణ విధానం 🙏🙏

2017లో నా ఉద్యోగం విరమణ అనంతరం పేపర్ మిల్లు వసతి గృహం నుండి వేరే చోట నివాసం కోసం రావలసి వచ్చింది. అప్పటి నుండి ప్రతి సోమవారం ఉదయం నేను వెళ్ళడానికి రవాణా సౌకర్యం ఉన్న కాతేరు గ్రామం లో వెలసిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి, జనార్దన స్వామి, ఆదికేశవ స్వామి దేవస్థానం ఆలయాల సముదాయనికీ వెళ్లడం అలవాటు అయింది.

ఆ ఆలయం పురాతనమైనది 200ఏళ్ళ క్రితం గాలి గోపురం తో ప్రతిష్ఠితమైన దేవాలయం.

జనార్దన స్వామి కాతేరు

ఇందులో నవగ్రహ ఆలయం, జనార్దన స్వామి ఆలయం, చెన్న కేశవస్వామి ఆలయాలు ఉన్నాయి.

ఆది కేశవ స్వామి, కాతేరు

పూజారి గారు ఉదయం 5.30 గంటలకు వచ్చి శివాలయం అంతరాలయం శుభ్రం చేసి అభిషేకం చేయడానికి ఏర్పాటు చేస్తారు. పర్వ దినాల్లో తప్ప ఉదయం 6గంటలకు భక్తులు చాలా తక్కువ మంది స్వామి దర్శనం కోసం వస్తారు. అందువల్ల గుడి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గుడి ఆవరణలో ధ్వజస్తంభం దగ్గరగా పెద్ద మారేడు వృక్షము ఉంది. అక్కడ దీపాలు పెట్టి ప్రదక్షిణలు చేయడం ఓ అలవాటుగా మారింది.

మిగతా ఆలయాల పూజారులు సాధారణంగా 6 తరువాత వస్తారు.

ఓ భక్తురాలు (స్థానికురాలు) రోజూ ఉదయాన్నే ఆలయం ధ్వజస్తంభం ముందు ముందు చక్కగా శుభ్రం చేసి ముగ్గు వేసి నాతో బాటుగా ప్రథమ అభిషేకంలో పాల్గొనేది.

ఉమా మార్కండేయ స్వామి కాతేరు

అలాగే నవగ్రహాలు చక్కగా నీటితో శుభ్రం చేసి ఉంచి తాను ప్రథమ పూజ చేసేది. నేను ఒక్క సోమవారం మాత్రమే వెళ్లగా ఆవిడ ప్రతీ రోజూ గుడికి వచ్చి ఇలా చేస్తుందని తెలిసి ఆవిడ భక్తి ముందు మనదేపాటి అని అనుకునేవాడిని.

ఈ గుడి దగ్గర మరో అద్భుతం అయిన సౌకర్యం స్వచ్ఛమైన ఆవు పాలు, ఆవు పెరుగు, పళ్ళ రసం, చెరుకు రసం ఇలా అభిషేకం ద్రవ్యాలు అందుబాటులో ఉండేవి. నాకు చాలా ఆనందం కలిగేది.

దుకాణంలో వారు కూడా ఎంతో మర్యాద గా ఉండేవారు.

పూజారి గారు చాలా శ్రద్ధ గా అభిషేకం ద్రవ్యాలు పురుష సూక్తం చదువుతూ స్వామికి సమర్పించేవారు.

ఉదయాన్నే ఎంతో ప్రశాంతంగా ఉండేది. అభిషేకం అనంతరం నందీశ్వరుని వద్ద కూర్చుని కొంత జపం, కొన్ని స్తోత్రాలు చదువుకుని, ఉత్తరాభిముఖంగా సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి సంతృప్తితో వచ్చే వాడిని.

ఇదివరకులా పేపర్ మిల్లుకు ఉద్యోగంకు వెళ్ళాలి అన్న ఆత్రుత ఉండేది కాదు ఎక్కువ సమయం శివాలయంలో గడపడానికి అవకాశం ఉండేది.

ఈవిధంగా 2020 అక్టోబర్ వరకు ఆ ఆలయానికి శివారాధన నిమిత్తం వెళ్లడం జరిగింది.

తరువాత 2020 నవంబర్ నుండి ఇప్పటిదాకా రాజమండ్రిలో అతి ముఖ్యమైన కూడలి “దేవి చౌక్” వద్ద ఉన్న “శ్రీ ఉమా బసవ లింగేశ్వర స్వామి”ఆలయానికి వెళ్లడం జరుగుతుంది.

దేవి చౌక్ బసవేశ్వర స్వామి ఉమా దేవి

ఈ ఆలయం చాలా చిన్నది 2015 గోదావరి పుష్కరాలు వరకు ధ్వజస్తంభం లేకుండా ఉండేది. పరిమిత సంఖ్యలో భక్తులు దర్శనానికి వెళ్లేవారు.

2015 పుష్కరాలకు ముందు శివ భక్తులు పూనుకొని ఆలయనిర్మాణం ఆగమ శాస్త్ర రీత్యా గాలి గోపురం, ధ్వజస్తంభం, భక్తులు చక్కగా ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండేలా నిర్మించడం జరిగింది.

దేవాంగ కులస్తులు ఆలయ ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ఈ ఆలయం పర్వ దినాల్లో చాలా రద్దీగా ఉంటుంది.

ఈ ఆలయంలో దేవస్థానం నిర్వాహకులు ప్రతి దినం క్రమం తప్పకుండా చేసే కార్యక్రమం నక్షత్ర హారతి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 6.30గంటలకు నూనె దీపాల కాంతిలో స్వామికి అమ్మవారికి చక్కగా విభిన్న దీపాలతో ఢమరుక, ఘంటా నాదం మ్రోగుతుండగా హారతి ఇవ్వడం ఓ విశేషం. హారతి సమయంలో అందరు భక్తులకు హారతి వత్తులు వెలిగించే అవకాశం నిర్వాహకులు ఇస్తారు.

ఉదయం ఆ హారతిలో పాల్గొంటే  శివ దర్శనం అద్భుతంగా చేసుకున్నాం అనే సంతృప్తిని పొందుతాం.

ఎన్నో ఏళ్ళుగా నిత్యం ఉదయాన్నే వచ్చి ఈ హారతిలో పాల్గొనే వ్యక్తులు ఉన్నారు.

శివానుగ్రహం లేనిదే శివారాధన చెయ్యాలి అనే సంకల్పం కలగదు.

కాశీకి 30వ ఏట వచ్చి పాదరక్షలు లేకుండా కాశీలో జీవనం కొనసాగిస్తూనిత్యం బ్రహ్మ ముహూర్తంలో గంగ స్నానం, కాశీ విశ్వనాధుని దర్శనం చేసుకున్న 75 ఏళ్ళ వృద్ధ బ్రాహ్మణుడిని చూసి అనిపిస్తుంది ఏ పూర్వ పుణ్యమో దేముడు ఇలా ఈ జన్మలో కరుణించి సేవ చేసే భాగ్యం కల్పించడాని. అతని మరణానంతరం అంత్యక్రియలకి అవసరం అయిన సొమ్ము జత చేసేసానని చెప్పాడు.

45 ఏళ్ళ వయసులో సంసారం మీద విరక్తి కలిగి కాశీ వచ్చి ఓ అన్నదానసత్రంలో ఉంటూ వారికి ఆహార పదార్ధాల తయారులో వడ్డనలో సాయం అందిస్తూ నిత్యం ఉదయం తెల్లవారు ఝామున 2గంటలకు గంగా స్నానం చేసి కాశీ విశ్వేశ్వర దర్శనం అనంతరం సత్రం కార్యక్రమంలో పాల్గొంటు సాయంత్రం ప్రదోష వేళ శివ దర్శనం చేసుకుని ఏకభుక్తముగా ఆహారం స్వీకరిస్తూ కాలం గడుపుతున్న 65 ఏళ్ళ మహిళ ఏ పుణ్యం చేసుకున్నదో కదా?

నిత్యం గోదావరి స్నానం,శివాలయం దర్శనం చేసుకునే భక్తులు ఏ పుణ్యం చేసుకున్నారో కదా?

ఈ జీవితం పరమేశ్వర కృపతో వచ్చింది. వారిని ఆరాధించి జన్మ ధన్యం చేసుకోవడం శివ భక్తులు గా మన కర్తవ్యం.

నేను ఇష్టంగా చదివే స్తోత్రాలు

  1. శివ పంచాక్షరీ స్తోత్రం
  2. శివాష్టకం
  3. శివాష్టకం (తులసి దాస్ రచన)
  4. శివ అష్ట్తోత్తర శత నామ స్తోత్రం
  5. బిల్వాష్టకం
  6. చంద్ర శేఖరాష్టకం
  7. శివ మహిమ్న స్తోత్రం
  8. అర్ధ నారీశ్వర స్తోత్రం.
  9. శివ మానస పూజ
  10. విశ్వనాథాష్టకం
  11. శివ సహస్ర నామ స్తోత్రం(వారానికి ఓ సారి)
  12. కాలభైరవాష్టకం

మనం రోజు నిద్రించే ముందు శివుణ్ణి తలచుకుని నిద్రించడం మెలని పెద్దలు చెబుతున్నారు.

నిద్రించే ముందు మనం శివుడ్ని స్మరించాలి. ఓం నమః శివాయ అంటూ శంకరుణ్ణి ధ్యానిస్తూ నిద్రలోకి జారుకోవాలి. ఇలా ఎందుకంటే, శివుడు లయకారుడు. ఆయన్ని స్మరిస్తూ నిద్రలో లయిస్తే పీడకలల వంటివి లేకుండా హాయిగా పడుకోగలుగుతాం.

శివానుగ్రహంతో నా జీవితశివారాధన అనుభవాలు, కొన్ని ముఖ్య విషయాలు పంచుకోవడం జరిగింది.

సహృదయంతో చదివిన అందరికి నమస్సులు.

నమః పార్వతీ పతే హర హర మహా దేవ.

శివ శివేతి శివేతి శివేతి వా

భవ భవేతి భవేతి భవేతి వా

హర హరేతి హరేతి హరేతి వా

భజ మన శివమే నిరంతరం.

🙏🙏🙏🙏🙏🙏.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here