నా కూతురు తప్పు చెయ్యదు

0
13

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన Faith in Upbringing అనే కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. కథాకాలం 1970 దశకం చివరి, 1980 దశకం తొలి రోజులు. సూర్య లక్ష్మి గారు మూలకథను 2012లో వ్రాశారు. ఇది వారి తొలి కథ.]

[dropcap]సో[/dropcap]మనాథ్, శక్తి ఒకరినొకరు అర్థం చేసుకున్న దంపతులు. వాళ్ళకి పద్మాసన, లలిత అనే ఇద్దరు కూతుళ్ళు. నిజానికి వారు ఒక బిడ్డతో చాలనుకున్నారు, కానీ పద్మాసన తోబుట్టువు ప్రేమని కోల్పోతోందని గ్రహించి, రెండో సంతానాన్ని ఆహ్వానించారా భార్యాభర్తలు. పద్మాసన పుట్టిన పదేళ్ళ తరువాత లలిత పుట్టింది. తమది పెద్దలు కుదిర్చిన పెళ్ళయినా, పెళ్ళికి ముందుకు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా సోమనాథ్, శక్తిల మధ్య చక్కని అవగాహన ఉంది. ఇద్దరివీ ఒకే రకమైన ఆశయాలూ, ఆదర్శాలూ. వాటిని సిద్ధింపజేసుకోడం సాధ్యమేనని ఇద్దరూ విశ్వసించేవారు. పిల్లలిద్దరినీ తాము అనుకున్న పద్ధతిలోనే పెంచారు. వారికి దైవభీతి ఉంది; చేదుగా ఉన్నా సరే, ఎప్పుడూ నిజమే చెప్పేవారు, పెద్దలని గౌరవించేవారు, పిన్నలని ఆదరించేవారు.

బాల్యంలో ఎక్కువగా అనారోగ్యానికి గురైన పెద్ద కూతురు పద్మాసన అంటే వారికి మరింత అభిమానం. పద్మాసన తెలివైనది, ఏకసంథాగ్రాహి, కానీ తరచూ జబ్బుపడేది. వాళ్ళది విశాఖపట్టణం. వాళ్ళ ఇల్లు సముద్రతీరానికి దగ్గరగా ఉండేది. తుపానులొచ్చినప్పుడల్లా, చలిగాలులకి పద్మాసన టాన్సిల్స్‌తో బాధపడేది. ఒక్కోసారి వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడేది. పద్మాసన జబ్బు పడకుండా వేసవి గడిచేది కాదు. పిల్లని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళడం, మందులు కొని తేవడం (ఆ రోజుల్లో ఊరు మొత్తం మీద ఒకటో, రెండో మెడికల్ షాపులు ఉండేవి) వంటి పనులు ఎంతో ప్రేమగా చేసేవారా తల్లిదండ్రులు. పాప అనారోగ్యంపై ఒక్కసారి కూడా చిరాకు వ్యక్తం చేయలేదు. అలారం పెట్టుకుని మధ్యరాత్రి లేచి మందులు వేసేవారు (ఆ రోజుల్లో కొన్ని మందుల మోతాదులు ఆరు గంటలకి ఒకసారి ఇవ్వాల్సి వచ్చేది). అనారోగ్యాన్ని బట్టి బత్తాయి రసం తీసో, లేదా హార్లిక్స్ కలిపో, శక్తి కూతురిని నిద్రలేపేది. ఓపిక లేని కూతురిని పట్టుకుని తాగించేవాడు తండ్రి. మందు ఇచ్చి మళ్ళీ నిద్రపుచ్చేవారు వాళ్ళు. తల్లిదండ్రులు తన ఆరోగ్యాన్ని ఎంతలా కాపాడున్నారో ఆ చిన్నారి అర్థం చేసుకుంది.

బడిలో కూతురు ఆడుకునే సమయాన్ని కూడా వాళ్ళు గమనిస్తూండేవారు, ఎందుకంటే ఎక్కువగా అలసిపోతే, మళ్ళీ జబ్బుపడుతుందని భయం. స్కూలు యాజమాన్యంతో మాట్లాడి – పద్మాసన రెండవ బై-మంత్లీ పరీక్షల నుండి ఫైనల్ ఎగ్జామ్స్ వరకూ ఇంట్లో ఉండే చదువుకునేలా ఒప్పించారు. వాళ్ళింటి దగ్గరలోనే పద్మాసన క్లాస్‍మేట్స్ ఇద్దరమ్మాయిలు ఉండేవారు. పద్మాసన వాళ్ళింటికి వెళ్ళి నోట్సులు అడిగి తీసుకుని, రాసుకుని చదువుకునేది. నిజం చెప్పాలంటే, స్కూలు వాళ్ళ కన్నా పద్మాసనే ముందుండేది. ఎందుకంటే శక్తి కూతురికి సిలబస్ ప్రకారం అన్ని పాఠాలు ముందే అర్థమయ్యేలా చెప్పేది. పాఠ్యపుస్తకాలలోని ప్రశ్నలకు జవాబులు ఎలా రాయాలో నేర్పించేది. దాంతో పద్మాసన ఫైనల్ ఎగ్జామ్స్ చాలా సులువుగా రాయలగేది. ఎప్పుడైనా క్లాస్ టీచర్ కాస్త పక్షపాతం చూపించి, మరో విద్యార్థికిస్తే తప్ప, సాధారణంగా ‘జనరల్ ప్రొఫీషయన్సీ ప్రైజ్’ పద్మాసనే గెల్చుకునేది. చదువనేది మార్కుల కోసమో, ర్యాంకు కోసమో కాదని, విజ్ఞానం కోసమని తల్లిదండ్రులు ఆమెకు బాగా నూరిపోసారు. అమ్మానాన్నలు ఏం చెప్పినా, పద్మాసన నమ్మేది, ఎందుకంటే, ‘వాళ్ళకన్నీ తెలుసు’ అనుకునేది.

ఆ కాలపు పిల్లల్లా కాకుండా ఉండేది కాదు పద్మాసన. నాల్గవ తరగతికి వచ్చేదాకా తనకి తమ కులమేమిటో తెలియదు. అమ్మానాన్నలతో కలిసి బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా చర్చ్ ముందు నుంచి వెళ్తుంటే, శిలువ కనబడి ఆ చిన్నారి మనసుని బాధించేది. “అభిప్రాయాలు కలవనంత మాత్రాన మేకులు కొట్టి ఎలా శిలువకెక్కిస్తారు?” అని అడిగేది. యేసుక్రీస్తు పటాన్ని కొనుక్కుని ఇంట్లో డ్రాయింగ్ రూమ్‌లో పెట్టుకుంటానంటే అమ్మానాన్నలు అభ్యంతరం చెప్పలేదు. ‘మతం మారుతున్నార’నే పుకార్లు చుట్టుపక్కల వాళ్ళు పుట్టించినా, సోమనాథ్, శక్తి నవ్వేసి ఊరుకున్నారు.

కాలం గడిచే కొద్దీ – పద్మాసన – ప్రతి తల్లీ తండ్రీ కోరుకునే ఆదర్శవంతమైన కుమార్తెగా ఎదిగింది. చెల్లి పుట్టినప్పుడు అమ్మకి దూరంగా ఉండలేకపోయింది పద్మాసన. అందుకే, దాదాపు మూడు నెలలు బడి ముఖం చూడలేదు. పాపం, నాన్నే తోటి పిల్లల నుంచి పుస్తకాలు తీసుకుని, టీచర్లు చెప్పిన వాటిని కాగితాలపై రాసి (అప్పటికి ఇంకా ఫోటోకాపీ మెషీన్లు పూర్తిగా వాడకంలోకి రాలేదు) పద్మాసన కోసం, 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి పోస్టులో పంపేవాడు. బడికి వెళ్ళకపోయినా, పాఠాలలో కూతురు వెనకబడకూడదని ఆయన ఉద్దేశం. అందుకే, అమ్మానాన్నలు లేకపోతే, తను లేనట్టే అని అనుకునేది పద్మాసన.

పద్మాసనకి పన్నెండేళ్ళు వచ్చేవరకూ, ఆమె ప్రతి పుట్టినరోజు నాడు నాన్న తన భుజాల మీద ఎక్కుంచుకుని ఇంట్లోని ప్రతి గదిలోనూ తిప్పేవాడు. తన ‘యువరాణి’కి వందనాలు చేయమనేవాడు. అయితే చెల్లెలు లలిత కొద్దిగా పెద్దయ్యాకా, పద్మాసన ఈ హక్కుని కోల్పోయింది, ఇప్పుడు నాన్న భుజాలు చెల్లెలివే!

ఓసారి శివరాత్రి రోజున, పక్కింటి అబ్బాయితో ఆడుకుని వచ్చిన పద్మాసన – తాను ఆ రాత్రి జాగారం చేస్తున్నానని ప్రకటించింది. ఉపవాసానికే ఇష్టపడిని సోమనాథ్, జాగారం అనేసరికి విస్తుపోయాడు. కూతుర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని (అప్పుడు పద్మాసనకి ఆరేళ్ళో ఏడేళ్ళో ఉండేవి), ఎందుకు జాగారం చెయ్యాలనుకుంటుందో కారణం అడిగాడు. ‘నువ్వు గొప్ప అనిపించుకోవాలంటే, శివరాత్రి రోజు ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేసి చూపించు’ అని పక్కింటి అన్నయ్య పందెం కాసాడట. ఓడినవాళ్ళు గెల్చినవాళ్ళకి ఐదు రూపాయలివ్వాలట. అసలు పందేలు కాయడమే తప్పని కూతురికి నచ్చజెప్పాలని చూశాడు సోమనాథ్. కానీ పద్మాసన తన పట్టు విడవలేదు. తనని ఎవరూ తేలికగా తీసుకోకూడదని వాదించింది. ఇలా కాదనుకుని, నువ్వు నిద్రపోతే, పది రూపాయలిస్తానని ఆశచూపాడు నాన్న. డబ్బులు కన్నా మాటే ముఖ్యమనీ, తాను అప్పటికే జాగారం చేసి చూపిస్తానని మాటిచ్చానని అంది పద్మాసన.

పక్కింటివాళ్ళ పిల్లలతో, వాళ్ళ గదిలోనే రాత్రంతా మెలకువగా ఉండి పందెం గెలిచి మర్నాడు ఉదయం ఇంటికొచ్చింది (అయితే మిగతా పిల్లల అరుపులు కేకలతో, పాపం పందెం కాసిన అబ్బాయికి నిద్రపట్టలేదు). ఆ రోజు పగలంతా నిద్రపోయింది. రెండు విషయాలకు నాన్న సంతోషించాడు – ఒకటి: కూతురి పట్టుదల, రెండు: ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం! పందెం కాయడం తనకి ఇష్టం లేకపోయినా, తన ఆరేళ్ళ కూతురు భవిష్యత్తులో అది తప్పని తెలుసుకుంటుందని ఊరుకున్నాడు. అయినా, పందేలు కాయడం తప్పని; ప్రతిభని నిరూపించుకోడానికీ, పందేలకీ సంబంధం లేదని కూతురుకి చెప్పాడు.

పద్మాసన టీనేజ్‍లోకి వచ్చింది. అమ్మానాన్నలంటే అభిమానం ఇదివరకూ లానే ఉంది. అయితే ఇప్పుడు పెద్దయ్యింది కాబట్టి ఇదివరకులా నాన్న తనని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, భుజాలకెక్కించుకోవడం వంటివి చేయడం లేదు. టీనేజర్లకు వచ్చే కొన్ని తిక్క ఆలోచనలు అప్పుడప్పుడూ పద్మాసన బుర్రలోనూ మొలిచేవి. అలాంటి ఓ ఆలోచనతో నాన్నని పరీక్షించాలనుకుంది. వేసవి సెలవలు. ఆదివారం. సోమనాథ్ లైబ్రరీకి వెళ్ళి, ఎండలో తిరిగొచ్చి, అన్నం తిని, నడుం వాల్చాడు. నాన్న దగ్గరకి వెళ్ళి, “నాన్నా, నాకు వంద రూపాయలు కావాలి” అంది. అంత పెద్ద మొత్తం (80లలో వంద రూపాయలంటే, మధ్య తరగతి వాళ్ళకి పెద్ద మొత్తమే) ఇప్పుడెందుకని నాన్న కారణం అడుగుతాడని భావించింది. ‘నాన్నా, మీ కూతురు మీద మీకే నమ్మకం లేదా?’ అని తండ్రికి చురక వేయచ్చని అనుకుంది.

అయితే, సోమనాథ్ కూతురికి ఆ అవకాశం ఇవ్వలేదు. “బీరువాలో ఉంటాయి, తీసుకోమ్మా!” అన్నాడు ప్రశాంతంగా. తండ్రితో వాదించాలనుకున్న పద్మాసన కోరిక తీరలేదు. మళ్ళీ డబ్బులడిగింది. ఈసారి సోమనాథ్ ఏమీ మాట్లాడలేదు, లేచి, బీరువా దగ్గరకి వెళ్ళి, అందులోంచి వంద రూపాయల నోటు తీసి, కూతురి చేతిలో పెట్టాడు.

పద్మాసన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, నాన్నకి క్షమాపణ చెప్పి, డబ్బులు ఎందుకు అడిగిందో అసలు కారణం చెప్పేసింది. “అవును. నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది. అందుకే నీకు వంద రూపాయలిచ్చాను. అయితే మా పెంపకం మీద కూడా మాకు నమ్మకం ఉంది. నా కూతురు తప్పు చెయ్యదు. దుబారా చెయ్యడానికి డబ్బు అడగదు” అన్నాడు.

‘అన్నీ తెలిసిన’ నాన్న నుంచి మరో పాఠం నేర్చుకుంది పద్మాసన.

ఆంగ్ల మూలం: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

స్వేచ్ఛానువాదం: కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here