‘నా’ నుంచీ ‘మనం’ లోకి!-2

0
11

[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన – ‘నా’ నుంచీ ‘మనం’ లోకి! – అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. మొదటి భాగం లింక్.]

[dropcap]కా[/dropcap]లింగ్ బెల్ మ్రోగిన శబ్దం.

ఆ తర్వాత తలుపు తెరిచిన చప్పుడు.

అక్షర: అమ్మా!

వసు: అక్షరా! నువ్వు బాగానే ఉన్నావు కదే!

అక్షర: అవునమ్మా. నాకేం కాలేదు. అలా చెబితే కానీ నువ్వు రావని.

వసు: ఇందులో మీ నాన్న పాత్ర కూడా ఉందా?

అక్షర: పాపం! నాన్నకు కూడా ఏమీ తెలియదు. మాములుగా పిలిస్తే వచ్చే టైపా మీ ఆయన.

వసు: ఇప్పుడైనా రాననే అని ఉంటారే.

అక్షర: అవునమ్మా! చాలా బ్రతిమాలాక కానీ ఒప్పుకోలేదు. చాలా నీరసంగా ఉన్నావమ్మా.

వసు: చాలా రోజులకి చూసావుగా. అలా అనిపిస్తుంది అంతే.

అక్షర: ఓ పదిహేను రోజుల్లో నిన్ను నేను మామూలు మనిషిని చేసేస్తాను. నేను పెట్టే తిండితో.

వసు(నవుతూ): అలాగే.

రామ్ (ఏమీ తెలియనట్లే): మమ్మల్ని ఇలా మోసం చేస్తావా?

అక్షర: తప్పయిపోయింది నాన్నా! నన్ను క్షమించండి. అమ్మా! ఇద్దరూ కాళ్ళూ చేతులు కడుక్కుని రండి.

వసు: అలాగే. బుజ్జి తల్లి కనిపించదే.

అక్షర: మీ అల్లుడు బయటకు వెళుతూ వెంట తీసుకువెళ్లారు. వచ్చేస్తుంది. అమ్మా! నీకు ఇష్టమని పెసరట్టు, ఉప్మా చేసాను.

వసు: భలే గుర్తు పెట్టుకుంటావే.

అక్షర: అమ్మనీ, అమ్మ ఇష్టాలనీ మరిచిపోతే వాళ్ళు కూతుర్లు ఎలా అవుతారమ్మా?

రామ్: హఁ! హఁ! హఁ!

వసు: పెద్ద నవ్వారులే.

అక్షర: నాన్నకి టీ పెట్టుకొని వస్తా.

వసు: నేను పెడతాలే.

అక్షర: ఇక్కడ నిన్ను ఏ పనీ చెయ్యనివ్వను.

***

వసు: అక్షరా! అల్లుడు గారు కనిపించట్లేదు.

అక్షర: అమ్మా! వాళ్ళ మేనేజర్ అప్పటికప్పుడు వెళ్ళాలని వేరే ఊరు పంపారు.

వసు: అవునా.

అక్షర: వెళ్ళేప్పుడు చెబుదామనుకున్నారు. మీరిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. లేపొద్దు, నేను చెప్పానని చెప్పు అంటూ వెళ్లిపోయారు.

వసు: ఏం ఉద్యోగాలో! ఏమిటో? మీ అన్నయ్యా అంతే ! ప్రొద్దున 9.30 కి డ్యూటీ ఎక్కుతాడు.

రామ్: దిగేది మాత్రం ఎవరికీ తెలియదు.

వసు: మధ్యలో ఒకటిన్నరకు వచ్చి గబగబా భోం చేసి వెళ్ళిపోతాడు.

రామ్: ఆ సమయానికి ముందు లేస్తాడు.

వసు: మేము ఇబ్బంది పడతున్నామని మా టిఫిన్ మేము తీసుకవెళతాం అంటారు. ఎంతకీ రారు.

రామ్: మీ అమ్మకేమో బీ.పీ. పెరిగిపోతుంది.

వసు: అవునే. పిల్లలు తినకపోతే తల్లి మనసు ఊరుకుంటుందా?

అక్షర: టిఫిన్ ప్లేట్లు, పచ్చడి, మంచినీళ్ళు.. అన్ని సార్లు తిరగాలంటే మీకు ఓపిక ఉండాలిగా.

రామ్: ఈ మధ్య అమ్మకు షుగర్ ఉందని బయటపడింది. మూడు నెలల నుంచే ఉందట. అక్కడి నుంచీ ఒకటే నీరసం.

వసు: అవునే.

అక్షర: నాకసలు చెప్పలేదు.

వసు: ఇక్కడ నువ్వుయినా హాయిగా ఉంటావని. చెబితే బాధపడటం తప్ప ఏం చెయ్యగలవు?

అక్షర: అలాగని చెప్పవా?

వసు: అసలు మతి ఉంటే కదా. వారానికి ఒక్కరోజు బాగుంటే గొప్ప.

అక్షర: అంతలానా?

రామ్: అవును. షుగర్ దయ మా ప్రాప్తం అన్నట్లు ఉండేది అమ్మ పరిస్థితి.

వసు: మందుల దారి ముందులదే. నీరసం దారి నీరసానిదే.

అక్షర: మరి నా దగ్గరకు వచ్చెయ్యచ్చుగా.

వసు: చిన్నదానివి. ఏమి వస్తాం. మరీ లేవలేని పరిస్థితి వస్తే అప్పుడు ఎలాగూ తప్పదు.

రామ్: నాకు అలానే అనిపిస్తుంది. ఒకరికి ఒకరం ఉన్నాంగా.

అక్షర: అవుననుకో.

వసు: కాసేపు బుజ్జి తల్లితో ఆడుకుని వస్తాను.

అక్షర: అలాగే.

రామ్: అమ్మ మరీ నీరసపడి పోతోందని ఒప్పుకున్నాను కానీ..

అక్షర: అప్పుడు మీకు కూడా ఆ అబద్ధమే వినిపించేదాన్ని. రప్పించేదాన్ని.

రామ్: నువ్వంతటి దానివే.

అక్షర: వదిన సహాయం చెయ్యకపోయినా పోనీ అన్నయ్య అయినా చెయ్యవచ్చుగా.

రామ్: ఇది వరకు చేసేవాడుగా. ఇప్పుడు సరిగ్గా ఆ కంప్యూటర్ ముందు కూర్చోవల్సిన సమయానికి అయిదు నిముషాలు ముందు లేస్తాడు.

అక్షర: ఇప్పుడు అసలు వాళ్ళకు ఖాళీ ఉండటం లేదు. టిఫిన్స్, భోజనాలు కూడా తిననివ్వటం లేదు. మేనేజ్‌మెంట్ వాళ్ళు.

రామ్: అవును. అదీ నిజమే!

అక్షర: అన్నయ్య వచ్చి నెల అయినట్లందిగా.

రామ్: ఆఁ! అయ్యింది.

అక్షర: మరి వాడి స్నేహితులు ఎవరూ రాలేదా?

రామ్: ఎందుకు రాలేదు? అందరూ వచ్చారు. వీడు అందరితో కలివిడిగా ఉండేవాడుగా.

అక్షర: మరి అప్పుడు ఎలా లేచేవాడు?

రామ్: అదే అర్థం కాదు. మనం చెబితే డైనింగ్ టేబుల్ దగ్గిరకు టిఫిన్ తినటానికి టైమ్ లేదంటాడు. మరి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా కుదిరిందో.

అక్షర: ఈ వయసులో వాళ్ళు సహాయపడేట్లు ఉండాలి కానీ భారం కాకూడదు కదా నాన్నా!

రామ్: ఏమో! అదంతా ఆ భగవంతుడికే తెలియాలి.

***

అక్షర: అమ్మా! దగ్గరలో పార్కు ఉంది వెళదామా?

వసు: వద్దు. నాలుగు రోజులు ఆగాక వెళదాం.

అక్షర: అలాగే.

వసు: ఈ అపార్ట్‌మెంట్‌లో అందరూ కలిసి మెలిసి ఉంటారా?

అక్షర: ఫర్లేదు.

వసు: ప్రక్కింట్లో నా వయసు ఆవిడ ఒకరున్నట్లున్నారు. బయటకు రారా ఆవిడ?

అక్షర: కోడలు రానివ్వదు అమ్మ. ఆవిడ చాలా మంచిగా మాట్లాడుతుంది.

వసు: ఎందుకు రానివ్వదు?

అక్షర: వాళ్ళింట్లో విషయాలు అందరికే చెప్పేస్తుందేమోనని భయం.

వసు: అలా కూడా ఉంటారా?

అక్షర: జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నారుగా. అలా అన్న మాట.

వసు: పోనీలే. వాళ్ళింట్లో వాళ్ళయినా మాట్లాడుతారా ఆవిడతో?

అక్షర: అదీ లేదమ్మా.

వసు: పాపం. కుటుంబాన్ని మహారాణిలా ఏలిన వాళ్ళు భర్త చనిపోగానే ఇలా పిల్లల పంచన చేరితే వీరి జీవితం ఇలా..

అక్షర: టిఫిన్‌కి రండి, భోజనానికి రండి అనే మాట తప్ప మరో మాట ఉండదు.

వసు: అలానా?

అక్షర: వాళ్ళు మాత్రం అప్పచెల్లెళ్ళతో, అన్నదమ్ములతో రోజంతా వీడియో కాల్ చేసుకొని మరీ మాట్లాడుకుంటారు.

వసు: అయ్యో! అందరూ ఉండి కూడా ఎవరూ మాట్లాడక పోతే ఆవిడకు ఎలా ఉంటుంది?

అక్షర: ఆవిడ మాత్రం ఏం చేస్తుంది.

వసు: పోనీ మిగతా పిల్లలైనా ఆవిడలో మాట్లాడతారా?

అక్షర: ఆఁ! మాట్లాడతారు. ఆవిడకు ముగ్గురు ఆడపిల్లలు.

వసు: పోనీలే. ఆవిడకు కొంత కాలక్షేపం.

అక్షర: మొన్నే, డెభైవ పుట్టిన రోజని వాళ్ళంతా కలిసి ఓ ‘టేబ్’ కొని ఇచ్చారు.

వసు: మంచి పని చేసారు.

అక్షర: ఇక ఆవిడ భజనలు అన్నీ చూస్తూ వింటూ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుకుంటుంది.

వసు: అవునా?

అక్షర: ఆ ఆడపిల్లలు అంటారు. పోనీలే మా అన్నయ్య అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించలేదు అని.

వసు: ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళను ఎలా వదిలించుకుందామనే చూస్తున్నారుగా.

అక్షర: అలాగే ఆవిడకు సర్ది చెబుతారు బాధపడుతుంటే.

వసు: ఆవిడ పనులు ఆవిడే చేసుకోగలదా?

అక్షర: ఆఁ! చక్కగా!

వసు: అదీ ఒక అదృష్టమే. బ్రతికున్నంత వరకూ ఎవరితో చేయించుకోకుండా వెళ్ళిపోవాలి.

అక్షర: అందరూ అదే కదమ్మ కోరుకుంటారు.

వసు: అసలు భగవంతుడిని అనాలే.

అక్షర: ఏమని?

వసు: పిల్లలు అసరాగా ఉండటం కుదరటం లేదు ఈ ఉద్యోగాల వల్ల..

అక్షర: అయితే?

వసు: మరి చేసి పెట్టే వాళ్ళు లేనప్పుడు వృద్ధాప్యంలో ఈ జబ్బులు నీరసం ఎందుకివ్వాలేం?

అక్షర: దేవుణ్ణి అడుగుదామా?

వసు: ఆఁ! నాకు కనిపిస్తే నేను తప్పక అడుగుతాను.

అక్షర: అమ్మా! నీకు నాన్నకు మాత్రం నేనున్నాను. అన్నయ్య సంగతి వదిలెయ్.

వసు: నాకు తెలియదా ఏమిటి?

***

రామ్: అక్షరా! ఏం చేస్తున్నావ్?

అక్షర: వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేస్తున్నా నాన్నా!

రామ్: నేనూ సాయం చేస్తా.

అక్షర: వద్దు నాన్నా! అక్కడ అమ్మకి సాయం చేసింది చాలు.

రామ్: ఖాళీగా కూర్చోవాలనిపించదు తల్లీ!

అక్షర: ఏ టీ.వీ.నో, సెల్లో చూసుకోండి.

రామ్: అవి ఎప్పుడూ ఉండేవేగా.

అక్షర: చక్కగా అమ్మతో కబుర్లు చెప్పుకోండి.

రామ్: అంతేగానీ నీకు మాత్రం సాయం చెయ్యనివ్వవు.

అక్షర: సరే కబుర్లు చెప్పండి.

రామ్: అక్కడ ఈ డ్యూటీ నాదే. అమ్మ నీరసంతో చెయ్యలేకపోయేది.

అక్షర: అవును కదా?

రామ్: మా ఇద్దరికయతే వారానికి రెండు సార్లు వేసుకుంటే సరిపోయేది.

అక్షర: మరి ఇప్పుడూ..

రామ్: అన్నయ్య, వదినవి కూడా కలిసాయిగా.

అక్షర: వాళ్ళవి మీరు ఉతకటం ఏమిటి నాన్నా!

రామ్: మనమా ఉతుకుతూంది మిషన్ కదా ఉతికేది.

అక్షర: అయినా. అన్నయ్యవి దెయ్యం పాంట్లు. నాకు తెలియదా?

 రామ్: వాళ్ళు చూసుకుంటామంటారు. ఎండంతా పోయాక అప్పుడు వేస్తారు. నాకు ఊసురుమంటుంది.

అక్షర: అయితే ఏముంది నాన్నా! మరునాడు ఎండుతాయిగా.

రామ్: ఏమిటో అలా నాకు ఉండబుద్ధి కాదురా. ఉండలేను.

అక్షర: వాళ్ళకు శని, ఆదివారాలు ఖాళీనే కదా. అప్పుడు ఉతుక్కుంటే ఈ సమస్య ఉండదుగా.,

రామ్: వాళ్ళు అప్పుడు గీత వాళ్ళమ్మ దగ్గరికి వెళుతున్నారుగా.

అక్షర: అలానా!

రామ్: అయినా అమ్మ కూడా అంటుంది.

అక్షర: ఏమని!

రామ్: వాడు ఆన్‌లైన్‌లో చేసుకుంటున్నాడు కాబట్టేగా వచ్చాడు. అదీ ఏడేళ్ళకి అని.

అక్షర: అయితే?

రామ్: ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వెళ్ళిపోతాడు. ఇన్నాళ్ళకు కన్నబిడ్డను కళ్ళార చూసుకుంటున్నానని.

అక్షర: అదీ నిజమేగా!

రామ్: అందుకే. పని చేసుకోవటం కష్టమైనా పట్టించుకోవటం లేదు.

అక్షర: అమ్మ ఆనందం అమ్మది.

రామ్: అమ్మ మీద ప్రేమతోనే ఇలా అబద్ధం చెప్పి తీసుకు వచ్చాను గానీ..

అక్షర: కానీ..

రామ్: ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే మీ అమ్మ నన్ను చంపేస్తుంది.

అక్షర: పొండి నాన్నా! మీరు మరీను.

రామ్: ఇంకా వెళ్ళిపోదాం అని పాట మొదలుపెట్టలేదా?

 అక్షర: ఏదీ రెండు రోజులే కదా అయింది. అప్పుడే అంటే తిడతానేమోనని ఊరుకుని ఉంటుంది.

రామ్: అదీ నిజమే!

అక్షర: అమ్మ అరిచి గీ పెట్టిగా నేను పంపేది లేదు. మీరు అడ్డు రాకూడదు.

రామ్: ..

అక్షర: చెప్పండి నాన్నా!

రామ్: ఆ మాట మాత్రం నేనివ్వలేను.

అక్షర: పొండి నాన్నా! అన్నయ్యనూ, నన్నూ సమానం అంటారు గానీ నా దగ్గర ఉండనంటారు.

రామ్: ఆడపిల్ల దగ్గిర అన్నాళ్ళు ఉంటే బాగోదురా.

అక్షర: మీ అల్లుడు అలా అనుకనే మనిషి కాదు నాన్నా!

రామ్: నాకు తెలుసురా.

అక్షర: మరి ఎందుకు ఆ ఫీలింగ్?

రామ్: అనాదిగా నరనరాల్లో ఎక్కిన పైత్యం అనుకో.

అక్షర: నాన్నా.

రామ్: అవును తల్లీ! మీ అమ్మ లాంటి వాళ్ళు అందులోంచి బయటపడుతున్నారు.

అక్షర: మరి మీరు ఎప్పుడు బయటకి వస్తారు?

రామ్: ఏమో తెలియదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలమే చెబుతుంది.

వసు: ఏమిటి.. తండ్రీ కూతుళ్ళు మంతనాలు?

రామ్: ఏం? మనవరాలితో ఆటలు అయిపోయాయా?

వసు: హాఁ! అది బొజ్జుంది.

అక్షర: అమ్మ పిల్లల్ని భలే పడుకోబెట్టేస్తుంది నాన్నా.

రామ్: ఏదీ.. ‘వటపత్రశాయికి వరహాల లాలీ’ అని పాట పాడా..

అక్షర: ఆఁ! ఆఁ! అలాంటిదే!

వసు: నేను ‘జో అచ్చితానంద.. జోజో ముకుందా!’ పాడి నిద్ర పుచ్చాను.

అక్షర: ఓ.. నాన్నా! నేను ఓడిపోయాను.

రామ్: ఏం ఫర్లేదురా. ఓడిపోతే గెలిచే ఛాన్స్ ఉంటుంది ఎదురుగా. అదే గెలిస్తే ఇంకేం ఉండదు. ఎవరో చెప్పారు.

వసు: సరిపోయారు తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ.

అక్షర (నవ్వుతూ): హఁ! హఁ!

రామ్: (మనసులో) వసూ! ఇంత హాయిగా ఉండటం చూసి ఎన్నాళ్ళయిందో, తనని ఇక్కడకు తీసుకు వచ్చి మంచి పనే చేసాను.

***

వసు: అక్షరా! పార్క్‌కి వెళదామన్నావుగా!

అక్షర: వెళదాం అమ్మా!

వసు: ఎప్పుడు?

అక్షర: ఇప్పుడే వెళదాం. నాన్నని కూడా అడగనా?

వసు: అడుగు. వస్తారేమో?

అక్షర: నాన్నా! నాన్నా! పార్క్‌కి వస్తారా?

రామ్ (దూరం నూంచే): అమ్మా వస్తానందా?

అక్షర: ఆఁ! వస్తానంది.

రామ్: సరే! వస్తాను.

వసు: మరి బుజ్జి తల్లి.

అక్షర: దాన్ని ప్రక్కన ‘రాజీ’ తీసుకువెళ్ళింది. పదండి. వెళ్దాం!

పక్షల కిలకిలారావాలు.

పిల్లల కేకలు, అరుపులు.

అక్షర: నాన్నా! అమ్మా! ఇక్కడ కూర్చుందామా?

రామ్: ఆఁ! బెంచ్ ఖాళీగా ఉందిగా కూర్చుందాం.

వసు: ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందే.

అక్షర: అవునమ్మా! నాకు కాస్త డల్‌గా అనిపిస్తే చాలు ఇక్కడ వాలిపోతాను.

వసు: ప్రకృతిలో గడిపితే ఆ ఆనందమే వేరు.

అక్షర: పిల్లలతో ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది ఈ పార్కు.

రామ్: రిటైర్ అయిన వారికి చక్కటి కాలక్షేపం.

అక్షర: అవును నాన్నా. కాసేపు ఆగితే ఆ బ్యాచ్ వస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి కథ.

రామ్: అవునురా. రిటైర్ అయ్యేటప్పటికి పిల్లలు సెటిల్ అవ్వకపోయినా, ఆర్థికంగా ఎవరి పైనన్నా ఆధారపడినా ఇవి తప్పవు.

అక్షర: డబ్బు ఉంటే అవి కావాలని పీక్కుతినే పిల్లలు కూడా ఉన్నారు నాన్నా!

రామ్: ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి.

అక్షర: అమ్మా నువ్వేం మాట్లాడటం లేదే?

వసు: వింటున్నాను మీ ఇద్దరి మాటలు.

అక్షర: కొందరు పీడించి ఆస్తులు రాయించుకొని బయటకు తోసేసిన వారు కూడా ఉన్నారు.

వసు: దారుణం కదా!

అక్షర: వృద్ధుల విషయంలో ఇది మరీ ఎక్కువైపోతున్నాయి.

రామ్: బంధాలు తగ్గిపోయి, అనుబంధాలకి అర్థం మరిచిపోయిన మనస్తత్వాల వలనే ఇవన్నీ జరుగుతున్నాయి.

వసు: ఉమ్మడి కుటుంబాలు పోయి ఒంటరి కుటుంబాలు తయారయ్యాయి. పోనీ వీళ్ళన్నా బాగున్నారా అంటే అదీ లేదు.

అక్షర: అంటే ఏమిటమ్మా నీ ఉద్దేశం?

వసు: అవును అక్షరా! ఈ వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు వచ్చాక ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవటం తగ్గిపోయింది.

అక్షర: అవునమ్మా! అది మాత్రం వంద శాతం నిజం.

వసు: భార్యాభర్తలు, తల్లి తండ్రులు, పిల్లలు మధ్య బంధాలు పలచబడిపోతున్నాయి. గమనిస్తున్నావా?

అక్షర: అవునమ్మా! నేను చూస్తున్నాను.

వసు: ఇంకొన్నాళ్ళు పోతే అందరూ ‘నా’ అనే ఫీలింగ్ లోకి దిగిపోతారు. ఇక అప్పుడు ఎవరినీ బాగుచేయలేం.

అక్షర: మనం.. మేం.. నేను.. భలే చెప్పావు అమ్మా!

వసు: ఇలాంటివి చూస్తుంటే దిగులు వేస్తుంది. మనల్ని ప్రేమించే వారితో గడిపితే ఎంత హాయిగా ఉంటుంది?

అక్షర: అమ్మా. ఇప్పుడంత నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళే లేరమ్మా. అంతా కాగితపు పువ్వుల్లాంటి ప్రేమలే.

రామ్: భలే పోల్చావులే.

అక్షర: అదుగో. ఆ గేటు లోంచి వస్తోంది ఆవిడను చూడు.

రామ్: ఆఁ! చూసా!

అక్షర: ఆవిడను సొంత కొడుకు తెలియని ఊరికి తీసుకువెళ్లి వదిలేస్తే అనాథాశ్రమంలో చేరింది.

వసు: అయ్యో!

అక్షర: తల్లీ తండ్రీ లేని దంపతులు పెద్ద దిక్కు కావాలని ఈవిడని తీసుకెళ్ళి సొంత అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారట.

వసు: ఇలాంటివి చూసి అయినా సొంత కొడుకులకు బుద్ధి రావాలి.

అక్షర: బుద్ధి ఉంటే అసలు అలాంటి పనులు ఎందుకు చేస్తారమ్మా? నువ్వు మరీనూ.

వసు: అంతేలే!

అక్షర: అమ్మా! ఆ ఎర్ర చీర ఆవిడను చూసావా? ఆ రాయి ప్రక్కన కూర్చుంది.

వసు: ఆఁ! కనిపించింది.

అక్షర: ఆమెకు కోడలు సరిగా తిండి పెట్టదు. ఇక్కడకు వచ్చిన వాళ్ళ వలన తెలిసింది.

వసు: అయ్యో! పాపం!

అక్షర: నేను కూడా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చి ఇస్తుంటాను. తీసుకోవటానికి భలే మొహమాటపడుతుంది.

వసు: ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు అంతేగా మరి. లేకపోయినా ఎవరినీ ఏమీ అడగరు.

రామ్: చీకటి పడుకోంది, వెళదామా ఇక.

అక్షప: ఏమ్మా?

వసు: వెళదాం. ఇక్కడ ఎంత సేపు ఉన్నా ఇంకా ఉండాలనే అనిపిస్తుంది.

అక్షర: దగ్గరే కదమ్మా! రావచ్చు.

రామ్: కాసేపయినా ఇలా స్వచ్ఛమైన గాలిని పీల్చాలి అక్షరా!

అక్షర: అవును నాన్నా! అపార్ట్‌మెంట్స్‌లో ఎలాగైనా గాలీ, వెలుతురూ తక్కువేగా.

వసు: బుజ్జి తల్లి ఏమైనా ఏడుస్తుందేమో!

అక్షర: లేదమ్మా! దానికి ఆవిడ దగ్గిర చేరిక ఎక్కువే.

వసు: అలా అయితే ఫరవాలేదు.

అక్షర: లేకపోతే నేను వదిలి పెడతానా దాన్ని.

వసు (నవ్వు): హ.. హ.. అవునులే.

రామ్: చిన్నప్పుడు మీ అన్నయ్యని, నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి పెట్టేది కాదు మీ అమ్మ.

అక్షర: అవునా అమ్మా.

వసు: అవును.

***

అక్షర: అమ్మా! అన్నయ్య ఇలా ఎందుకు మారాడంటావ్?

వసు: ఏమోనే! నాకేం తెలుసు?

అక్షర: అదే నాకూ అర్థం కావడం లేదు.

వసు: హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తూ నాలుగు వేలతో సరిపెట్టుకొని ఇంటికి జీతం అంతా పంపే కొడుకు నా కొడుకే నని గర్వపడేదాన్ని.

అక్షర: మళ్లీ రూమ్‌లో స్నేహితుని కూడా పోషించేవాడు, బావమరిది అంటూ.

వసు: అవును. నెలకు మూడు వేలు ఆ అబ్బాయి కోసం ఖర్చు చేసేవాడు.

అక్షర: అవును. మొత్తం ఏడు వేలు ఉంచుకునేవాడు.

వసు: డబ్బు దేముందిలే అక్షరా. పెన్షన్ వస్తోంది. అద్దెలు వస్తున్నాయి. పిల్లవాడు అలా ప్రేమ లేని వాడిలా తయారయ్యాడేమిటనే బాధ తప్ప.

అక్షర: నా స్నేహితురాళ్ళు అందరూ అన్నయ్య అంటే మీ అన్నయ్యలా ఉండాలనేవారు.

వసు: తెలిసిందేగా.

అక్షర: ఇప్పుడు అలాంటి అన్నయ్య వద్దే అంటున్నారు. వాళ్ళకే అలా అనిపిస్తే ఇక నాకెలా ఉంటుంది?

వసు: ఏం చేస్తాం? ప్రారబ్ధం అనుకోవాలి.

అక్షర: వదిన వల్ల ఇలా తయారయ్యాడంటావా?

వసు: ఏమో! ఎందుకు ఆ అమ్మాయికి అప్రతిష్ఠ అంటకట్టటం. మన బంగారం మంచిది అవ్వాలి కానీ..

అక్షర: కోడలిని మాత్రం ఏమీ అననివ్వవు.

వసు: మన పిల్లాడిని మనం తిట్టుకునే హక్కుంది. ఆ అమ్మాయిని ప్రేమించాలే కానీ ద్వేషించకూడదు. అది నా సిద్ధాంతం!

అక్షర: నువ్వు నా బంగారు తల్లివే అమ్మా!

వసు: చాల్లే! ఊరుకో!

***

గీత: వెళ్ళిపోదామంటే మాట్లాడవేం?

వంశీ: ఏమోఁ? ఎందుకో తెలియదు. కొన్నాళ్ళు ఇక్కడ ఉండాలనిపిస్తోంది.

గీత: అదేంటి కొత్తగా.

వంశీ: అమ్మా, నాన్నా నన్ను ఎంతో ప్రేమగా చూసారు.

గీత: అందరూ అంతే గదా.

వంశీ: తీసుకున్న దాంట్లో కొంతన్నా ఇవ్వాలిగా.

గీత: అలా అంటావా?

వంశీ: అవును.

గీత: ఎన్నాళ్ళు ఇలా?

వంశీ: నా మనసు అంతా అదోలా అయోమయంగా వెలితిగా ఉంది.

గీత: ఎందుకలా?

వంశీ: ఏమో?

గీత్: నీకు నువ్వే అర్థం కాకపోతే ఎలా?

వంశీ: ఆ అర్థమయ్యే స్థితిలో ఉంటే ఇలా అమ్మానాన్నాలకు దూరంగా ఇన్నాళ్లు ఉండేవాణ్ణి కాదు.

గీత: ఈ రోజు వింతగా మాట్లాడుతున్నావే?

వంశీ: అయినా నీకేంటి బాధ! అక్కడా హోటల్ ఫుడ్డే! ఇక్కడా అదే!

గీత: అవుననుకో.

వంశీ: చెప్పాలంటే అక్కడ కంటే ఇక్కడే ఇంట్లో చేసినట్లు ఉండేవి దొరుకుతాయి.

గీత: అయితే నీ ఇష్టం..

వంశీ: థాంక్స్.

గీత: (తలుపు దబ్బున వేసిన శబ్దం.)

***

అక్షర: అమ్మా! ఏమిటి? అదోలా ఉన్నావే?

వసు: ఏదో గుర్తు వచ్చి.

అక్షర: ఏమిటిది?

వసు: యువత పట్టించుకోనితనం. పట్టించుకొనే వైనం గుర్తు వచ్చి.

అక్షర: అబ్బో! రెండూనే!

వసు: అవునే.

అక్షర: చెప్పవా! చెప్పవా!

వసు: అబ్బ! వద్దులేవే? ఎవరివో సంగతులు?

అక్షర: ఆ ఎవరో ఎవరమ్మా? మన సమాజంలో వారే కదా. వాళ్ళు గురించేగా నీ ఆలోచనంతా.

వసు: అవునే.

అక్షర: నేనూ వారిలో ఒకరినేగా, విననీ.

వసు: మొన్నీ మధ్య నా స్నేహితురాలు కలిసి వాళ్ళింటికి తెలిసినవాళ్ళు వచ్చారని, పావుగంటలో పిల్లలు ఇల్లంతా ఆగం ఆగం చేసారని చెప్పింది.

అక్షర: ఇప్పటికి పిల్లలు పిడుగులు కదా!

వసు: కదా! అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరింటికైనా వెళ్లినప్పుడు.

అక్షర: అంతే కదా! మన పిల్లల్ని మనమేగా చూసుకోవాలి?

 వసు: వాళ్ళదేం లేదట. మా పిల్లలు గడుగ్గాయిలు అని చెప్పేసి హాయిగా కూర్చున్నారట.

అక్షర: అప్పుడే మయ్యింది?

వసు: అది వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తుంటే వాళ్ళాయన వాళ్ల పిల్లలను చూసుకున్నాడట.

అక్షర: అయ్యో!

వసు: వాళ్ళు ఎప్పటి నుంచో జ్ఞాపకంగా దాచుకున్న వాచీ కూడా పాడు చేసేసారట. ఆ కాసేపటిలో .

అక్షర: అలానా!

వసు: మరీ అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా. ఒక చోటకి వెళ్ళినప్పడు.

అక్షర: అవునమ్మా.

వసు: మరీ ఇంత చిన్న విషయం చెప్పించుకునే స్థితిలో ఉన్నారే అని బాధ.

అక్షర: ఇంకొకటి.

వసు: అది ఓ మంచి భర్త సంగతి.

అక్షర: అయితే తప్పకుండా వినాల్సిందే.

వసు: కొత్తగా వచ్చిన కోడలు అత్తగారి మీద పెత్తనం చెయ్యబోయిందట రాగానే.

అక్షర: ఆఁ! అప్పుడు.

వసు: ఆ కొడుకు మీ ఇద్దరూ తల్లీ కూతుర్లలా కలిసి మెలిసి ఉన్నారా సరి.. లేదంటే మీకు కనిపించకుండా వెళ్ళిపోతాను అని అన్నాడట.

అక్షర: ఆహఁ!

వసు: దెబ్బకు దిగి వచ్చింది ఆ అమ్మాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ నిజమైన తల్లీ కూతుళ్ళు కంటే అన్యోన్యంగా ఉంటున్నారు.

అక్షర: నిజంగా!

వసు: ఆఁ! భర్త అనేవాడు త్రాసులా ఉండాలి. ఎటూ జరగకూడదు. భార్య వైపైనా.. తల్లి వైపైనా.

అక్షర: ఇలా అబ్బాయిలంతా ఉంటే సంసారాలు బాగుపడినట్లే! వృద్ధాశ్రమాలు అక్కర్లేదు.

రామ్: అది ఎంతంటే మీ అమ్మ ఒక సమయంలో వాళ్ళిద్దరూ కొట్టుకున్నారనే సంగతే మరిచిపోయే లాగా!

అక్షర: అవునా?

వసు: అవునే. ఆ విషయం ఎలా మరిచిపోయానో నాకే గుర్తులేదు.

అక్షర: విచిత్రంగా ఉందే!

వసు: అత్తగారు మా కోడలు చాలా బాగా చూసుకుంటోంది అని ఈ మధ్య చెబితే ఈ విషయం నాన్నే గుర్తు చేసారు.

అక్షర: ఆ అబ్బాయికి సన్మానం చెయ్యాల్సిందే.

వసు: అవును.ఇంట్లో గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కరించుకున్నాడు.

అక్షర: ఈ విషయం అన్నయ్యకి కూడా చెప్పకపోయావా?

వసు: భలే దానివే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆచరణలో పెట్టరంతే.

రామ్: అందుకే మీ అమ్మ ఇలాంటివి గుర్తు చేస్తూ ఉంటుంది.

వసు: రామ్! ఎప్పుడూ నన్ను ఆట పట్టించటమే నీ పని.

అక్షర(నవ్వు): హఁ! హఁ! హఁ !

***

వసు: ఎవరు రామ్ ఫోను చేసింది?

రామ్: నాగోలులో ఉండే నారాయణరావు.

వసు: ఏమిటట?

రామ్: ఏముంది. అదంరిదీ ఒకటే భాగవతం.

వసు: అంటే?

రామ్: వాడి అబ్బాయి, అమ్మాయి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని దూరంగా వెళ్ళిపోయారు.

వసు: అయ్యో! పాపం! భార్య కూడా లేదుగా!

రామ్: అవును. నా గోడు ఎవరైనా కథగా రాస్తే బాగుండునని అంటాడు.

వసు: అందరూ అలానే ఉన్నారని చెప్పకపోయారా?

రామ్: నేను చెప్పేది ఎక్కడ వింటాడు? పరువు, ప్రతిష్ఠ వదిలేసి నేను పెళ్ళిళ్ళు చేస్తే నన్నిలా వదిలేస్తారా అని.

వసు: రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోతాయి. అలాగే కొడుకులు అనే వాళ్లు ఒకప్పుడు.

అక్షర: మరి ఇప్పుడమ్మా..?

వసు: ఈ మధ్య నేనో వీడియో చూసాను. నన్నెంతో ఆనందపరిచింది అది.

అక్షర: ఏముంది అందులో?

వసు: ఒక ముసలి పక్షికి దాని బిడ్డ ఆహారాన్ని నోట్లో పెట్టి తినిపిస్తోంది.

అక్షర: ఎప్పుడూ వినలేదే..?

వసు: అది చూసాక అనిపించింది పక్షి జాతిని అనవసరంగా ఇన్నాళ్ళూ అవమానించామేమోనని.

అక్షర: అవునమ్మా!

వసు: వాటికున్న బుద్ధి తెలివి, జ్ఞానం ఉన్న మనుషులకు లేకుండా పోతోంది.

రామ్: అసలు వాళ్ల చిన్నతనాన్ని, వాళ్ళు అందించిన మధుర జ్ఞాపకాలనూ గుర్తు చేసుకుంటూ గడిపేస్తే బాగుంటుందని నాకనిపిస్తంది.

వసు: మీ నాన్నలా ఆలోచించగలిగితే ఏ తండ్రీ బాధ పడాల్సిన అవసరం ఉండదే.

అక్షర: అలా అందరూ ఉండలేరుగా.

వసు: అదే కదా!

***

వసు: చూడు రామ్! మనం వచ్చి పది రోజులయింది. ఒక్కసారైనా చెల్లికి ఎలా ఉందని వాడు ఫోన్ కూడా చెయ్యలేదు.

రామ్: వసూ! ఇంకా అలవాటు పడలేదా? ఇలా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు.

వసు: ఎలా ఉంటాం? ఆలోచించకుండా!

రామ్: ఉండాలి. నా కోసం నువ్వు లేకుండా. నేను ఒక్కరోజు కూడా ఉండలేను వసూ.

వసు: నాకు తెలియదా?

రామ్: తెలుసు అనుకో. నా గురించి ఆలోచించకుండా వాళ్ల గురించి ఆలోచిస్తుంటే..

వసు: భలే పిచ్చి వాడివి రామ్! భగవంతుడు దయదలిస్తే ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోవాలని నా కోరిక.

రామ్: ఇద్దరిదీ ఒకే ఆలోచన.

వసు: నా స్నేహితురాలు ‘హిమజ’ ఉందిగా, అది ఫోన్ చేసింది.

(మనసులో) టాపిక్ డైరెక్షన్ మార్చాల్సిందే.

రామ్: ఏం చెప్పింది?

వసు: దుబాయ్ నుంచీ కూతురు వచ్చిందని, దానికి పుట్టినరోజును హోటల్‌లో చేస్తున్నాడు తన కొడుకని.

రామ్: నిజంగా ఆ దంపతులు ఎంతో అదృష్టవంతులు!

వసు: నాకు అలానే అనిపిస్తుంది. ముగ్గురు కొడుకులకూ పెళ్ళిళ్లైనా అందరూ కలిసి ఉండటం.

రామ్: ఎలాంటి అరమరికలు లేకుండా.

వసు: ఎవరైనా తమ్ముడ్ని రాఖీకి దుబాయ్ పంపుతారా? అదొక్కటేనా అమ్మనాన్నలకు పుట్టిన రోజులు, చెల్లి పెళ్ళి, షష్టిపూర్తి అన్నీ భలేగా చేస్తారు.

రామ్: కుటుంబం అంటే అలా ఉండాలి.

వసు: అవును. అలా ఎక్కడో ఒక్కళ్ళు కనిపిస్తున్నారు.

రామ్: జీవితం అంటే అలా ఉండాలి.

వసు: పోనీలే. మనకు లేకపోయినా ఒకరికైనా ఆ సంతృప్తి దక్కిందని సంతోషపడదాం.

అక్షర: అమ్మా! ఇక్కడున్నావా? అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు.

వసు: అరె! ఇప్పుడే అనుకున్నాం. వాడికి నూరేళ్ళ ఆయుష్షు.

అక్షర: మీ ఫోన్‌లు అక్కడ పెట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు మరి.

రామ్: మాకంత ఫోన్లు ఎవరూ చేసే వాళ్లు లేరని. చేసే నీ దగ్గిరే మేము ఉన్నాంగా అని.

అక్షర: సరే! మాట్లాడండి! లైన్ లోనే ఉన్నాడు.

వసు: అవునా? ఏరా? ఎలా ఉన్నావు?

వంశీ: ఆఁ! బాగున్నాం అమ్మా! ఎప్పుడు వస్తున్నారు? ఇంటికి?

అక్షర: ఒరేయ్! అన్నయ్యా! నువ్వు అమ్మానాన్న నా దగ్గరుండే రోజుల్ని లాక్కోకు. నాకు ఇంకా పూర్తిగా తగ్గలేదు.

వంశీ: వాళ్ళున్నంత వరకూ నీకు తగ్గదు. నాకు తెలియదా నీ వేషాలు?

 అక్షర: అదేం లేదు. బావగారు కూడా రేపు వచ్చేస్తున్నారు. నువ్వు కూడా వదిన్ని తీసుకొని ఇక్కడికే వచ్చేయ్.

వంశీ: కుదరదు లేవే!

అక్షర: వచ్చెయ్యరా. చాన్నళ్ళయింది నువ్వు మా ఇంటికి వచ్చి.

వంశీ: సరే!

అక్షర: ఒక వారం ఉండి అందరూ కలిసి వెళ్ళిపోవచ్చు.

వంశీ: ఆఁ!

అక్షర: అసలు అమ్మను నెల్లాళ్ళన్నా ఉంచుకుందామనుకున్నాను.

వంశీ: ఆశ, దోశ, అప్పడం, వడై.. కాల్ వస్తోంది నాకు ఉంటా.

వసు: అబ్బ ఎన్నాళ్ళయింది వీడిలా మనతో మాట్లాడి.

అక్షర: నిజం అమ్మా! నాకు అలానే అనిపించింది.

రామ్: నాకు కూడా!

వసు: మనకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయన్న మాట.

(అందరి నవ్వులూ వినిపించాలి)

***

అక్షర: అమ్మా! ఇంకో పది రోజులన్నా ఉండొచ్చుకదే.

వసు: వాళ్ళంత మారి మన దగ్గరకు వచ్చినప్పుడు వెళితేనే బాగుంటుంది. మరోసారి వస్తానుగా.

అక్షర: వదిన అంతలా మారటం మనతో అలా కలసిపోవటం వింతలా ఉందమ్మా.

వసు: ఒకరు మారితే మరొకళ్ళు సహజంగా మారిపోతారు.

రామ్: మీ అమ్మ జ్ఞాని.

వసు: పోదురూ!

(వారం రోజులు అందరూ అందరితో కలిసి నిముషంలా గడిచిపోయి వెళ్ళిపోయే రోజు వచ్చేసింది కూడా)

***

వంశీ: అమ్మా! బయలుదేరుదామా?

వసు: ఆఁ! ఆఁ! వెళదాంరా.

వంశీ: అది వదలటం లేదా?

వసు: అది వదలటానికి ఏనాడు ఇష్టపడిందని?

వంశీ: దాన్ని కూడా మనింట్లోనే కాపురం పెట్టెయ్యమందాం.

గీత: హాఁ! ఇది చాలా బాగుంది.

రామ్: ఇదేదో బాగుందిగా.

అక్షర: పొండి! నాన్నా!

రామ్: ఆఁ పోతున్నాం!

అక్షర: వెళ్ళొస్తాం అనాలి.

వసు: ఓ! మా పాఠం మాకే చెబుతున్నావా?

అందరూ: బై! బై! బై! బై! బై! బై!

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here