నా ప్రయాణం

0
7

[box type=’note’ fontsize=’16’] కావలి సాహిత్య సంస్థ నిర్వహించిన పోటీలో బహుమతి గెలుచుకున్న స్థానిక రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని టి. తేజస్విని వ్రాసిన కథ “నా ప్రయాణం”. కథకి తగ్గట్టుగా బొమ్మలు కూడా ఈ విద్యార్థినే గీసింది. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

[dropcap]ప్లై[/dropcap]ట్ రన్‌వే మీద నుంచి అప్పుడే ఆకాశంలోకి ఎగిరింది. బాగా పైకి ఎగిరిన తరువాత స్థిరమైన వేగంతో కదులుతూ వెళుతుంది. కిటికీలో నుంచి లాస్ ఏంజెలస్ పట్టణం కనిపిస్తుంది. చాలా పెద్ద నగరం అది. ఎక్కడ కావలి, ఎక్కడ లాస్ ఏంజెలస్. జీవితం చాలా అద్భుతం అనిపించింది. ప్రక్కనే నా హాండ్ బాగ్ జిప్ తీసి అందులో నుంచి గూగుల్ సైన్స్ ఫెయిర్‌‌లో అంతర్జాతీయ పోటీలలో ప్రథమ స్థానంగా గెలుచుకున్న కప్పు బయటకు తీసాను. నేను సాధించిన ఘనత నా పాఠశాలకి, నా వూరికి, నా దేశానికి పేరు తెచ్చింది. అరుదైన గౌరవాన్ని చిన్న వయసులో పొందాను. కాస్త గర్వంగా ఉంది. కాని ఈ రోజు ఈ పరిస్థితికి కారణం నాకు ఇంకా గుర్తుంది. కాదు ఎప్పటికీ గుర్తుంటుంది.

నేను ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నాను. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం, నేను మా తల్లితండ్రులతో చెన్నై నుంచి పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో కావలికి వస్తున్నాను. కాస్త మబ్బు వేసుకొని ఉంది. మాకు ఎదురుగా ఒక పెద్ద ఆయన సుమారు మా తాత వయస్సు ఉంటుంది. వాళ్ళ ఆవిడతో పాటు కూర్చొని ఉన్నాడు. ఈ సారి ప్రయాణం చాలా బోర్ అనిపించింది. “నాన్న ఫోన్ ఇవ్వవూ, ఇప్పుడే ఇస్తా” అని నాన్నని అడిగాను. “ఎందుకు, పిచ్చి, పిచ్చి గేమ్స్ ఆడేదానికా, కళ్ళు పోతాయి నేనివ్వను” అన్నాడు నాన్న.

“నాన్నా ప్లీజ్ ప్లీజ్, కొద్ది సేపే, రాత్రికి నీకు కాళ్ళు వత్తుతా” అని అన్నాను.

“కాళ్ళు నొక్కినా ఇవ్వను గడ్డం పట్టుకున్నా ఇవ్వను, రాదా నీకు బయలుదేరే అప్పుడే చెప్పాగా పాపవి ఏమైనా టెక్స్ట్ బుక్స్ పెట్టకొమని. ట్రైన్‌లో టైం వేస్ట్ చేసే కంటే చదివితే నాలుగు మార్కులు అయినా వస్తాయి” అని అమ్మపై విసుక్కున్నాడు.

నాకు కోపం వచ్చేసింది. తల ప్రక్కకి తిప్పి కోపంగా మాట్లాడకుండా కూర్చొన్నాను. ఎదురుగా ఉండే ముసలాయన నన్ను చూస్తున్నాడు. అమ్మ, నాన్న దగ్గర నుంచి పోన్ లాక్కొని నాకు ఇచ్చింది. కాసేపు బెట్టు చేసి ఆ తరువాత తీసుకున్నాను.

నాకు సబ్‌వే సర్ఫర్స్ గేమ్ అంటే చాలా ఇష్టం. గేమ్ ఆడటం మొదలు పెట్టాను. అందులో పిల్లవాడు రైలు పట్టాలపై పరిగెడుతూ, ట్రయిన్ పైన నుంచి దూకుతూ బంగారు కాయిన్స్ సంపాదిస్తూ వెళుతున్నాడు. ఎదురుగా ఉండే ముసలాయన నా గేమ్‌ను చూస్తున్నాడు. ఆయనకు ఏమి అర్థం అయినట్టు లేదు. అదోలా నా గేమ్ వంక చూస్తున్నాడు. నేను దానికి తగ్గట్లు పోజిచ్చి మరీ రెచ్చిపోయి ఆడుతున్నాను. కాసేపు చూసి నాన్నతో మాటలు మొదలు పెట్టాడు.

“ఎందాకండీ మీరు?” అని మొదలు పెట్టి ఏవేదో రాజకీయాలు, సుత్తులు మొదలు పెట్టారు. అటు ఇటూ చేరి సంభాషణ నా మీదకు తిరిగింది.

“పాప ఫోన్ బలే స్పీడుగా వాడుతుందే, బాగా వచ్చు అనుకుంటా” అని ఆ పెద్దయన అన్నాడు. వెంటనే నాన్న “ఔనండి మా అమ్మాయికి సెల్ ఫోనులో తెలియని విషయాలు లేవు. అప్పుడప్పుడు నాకు అర్థం కాకపోతే చెబుతుంది. బలే తెలివైంది. ఆ తెలివి చదువులో పెడితే క్లాసుఫస్టు వస్తుంది. కాని ఎక్కడ, ఎప్పుడు చూడు గేమ్‌లు గేమ్‌లు. ఆ కళ్ళు ఎక్కడ పాడైపోతాయో అని నాకు అనిపిస్తుంది” అన్నాడు.

అమ్మ ఇలా అంది “ఈ కాలంలో ఆడని పిల్లలు ఎవరండి? ఎవ్వరైనా ఆడుతారు. పెద్దైతే వాళ్ళే తెలుసుకుంటారు.”

ఆ పెద్దాయన నా వేపు తిరిగి “ఏం ఆట పాపా అది” అని అడిగాడు.

“మొదలు పెట్టాడ్రా” అనుకున్నాను. సమాధానం చెప్పకూడదు అనుకున్నా. కానీ ఎందుకులే పక్కన నాన్న ఉన్నాడు అనుకుని, “ఇది సబ్‌వే సర్ఫ్ గేమ్” అన్నాను.

వెంటనే ఆయన “ఆహా ఎట్ట ఆడాలి” అని అడిగాడు.

ఈ సారి తలెత్తి పెద్దాయన వైపు విసుగ్గా చూసి సమాధానం చెప్పకుండా గేమ్ ఆడటం మొదలు పెట్టా. నాన్న నన్ను కప్పిపుచ్చాలని చూసి, “అరే వాన వస్తుందే, అబ్బా బలే ఉంది బయట. చిన్నీ అటు చూడు ఎంత బాగుందో” అన్నాడు.

ఒక అరక్షణం కన్ను అటు తిప్పానో లేదో, ఆటలో పిల్లవాడు ట్రైన్‌ని గుద్దుకున్నాడు. నిజానికి బయట చాలా బాగుంది. చూడాలనిపించింది. కాని ఇంతలో గేమ్ మరళా మొదలైంది.

ముసలోడు నన్ను వదిలేలా లేడు. “నీ ఆటలో కూడా రైళ్ళు పరిగెత్తున్నాయే, నాకు నేర్పిస్తావా?” అని చిన్న పిల్లవాడిలా అడిగాడు.

“మీకు రాదు” అని చెప్పాను. అయినా నన్ను వదలలేదు.

“నేర్చుకుంటాలే చెప్పమ్మా… బాంగారు!!” అన్నాడు. ఫోన్‌లో “నో బ్యాటరీ” అని సింబల్ వచ్చింది. అప్పుడు, చిన్న పిల్లని కదా బ్యాటరీ అయిపోయిందని నాన్న ఎక్కడ తిడుతారో అని వెంటనే నాన్నకి ఫోన్ ఇచ్చేసాను.

“ఏం తల్లి, పవర్ అయిపోయిందా? నీ ఆటలో ఆ పిల్లవాడు ఎందుకు అట్లా ట్రైన్‌లు దూకుతున్నాడు” మరలా ప్రశ్న మొదలు పెట్టాడు ఆ తాత.

“డబ్బులు కాయిన్స్ కోసం”

“ఏంటి అడితే మనకు డబ్బులు వస్తాయా?” అని అమాయకంగా అడిగాడు.

“మనకు రావు, అంటే అట్లా చూపిస్తాయి, నిజం డబ్బులు కాదు” అని చెప్పాను.

“మరి ఎందుకు ఆడుతున్నావు, ఎంచక్కా బైట చూడు ఎంత బాగుందో కదా! ” అని చెప్పాడు.

“బైట ఏముంది వానే కదా, బైటకెళ్ళి తడవలేం కదా!” అని బదులిచ్చాను.

“నీకు తడవడం ఇష్టమా?” సమాధానం చెప్పలేదు నేను. ఎదురుగా ఫోనును చూస్తూ ఉండిపోయాను.

“ఫోన్‌లో ఆడితే ఏమొస్తుంది తల్లి, చక్కగా ఏవైనా పాటలు పాడరాదు, లేదా అలా బైట చెట్లని చూడు వానలో ఎంత బాగున్నాయో!”

అమ్మో! ఆయన నన్ను విసిగించేస్తున్నాడు. ఆయన చెప్పినట్లు చేస్తే పోలా అని కిటికిలోనించి బయటకు చూసాను. నిజానికి చాలా బాగుంది. చినుకుల కిటికీలో నుంచి నా మీద పడుతున్నాయి. ఎగరాలి అనిపించింది. కానీ ఇగో కదా నాకు. ఆంద్రా వచ్చింది తెలుగు బోర్డులు కనిపించాయి.

కొద్ది సేపటికి వానలేదు. ఆ ఊర్లో ఎక్కడా చమ్మ లేదు. సూర్యుడు కనిపిస్తున్నాడు. “నాన్నా వాన ఇక్కడ లేదు, అదెట్లా” అని అర్థంకాక నాన్నని అడిగాను.

“మేఘాలు అక్కడ వరకే ఉన్నాయమ్మా అందుకని అక్కడ వరకు వాన” అని నాన్న బదులు ఇచ్చాడు.

ట్రైన్ చాలా వేగంగా వెళుతుంది. దూరంలో కొండలు కనిపిస్తున్నాయి. కొండలు నిదానంగా కదులుతున్నాయి. కాని దగ్గరుండే చెట్లు మాత్రం వేగంగా వెళ్ళిపోతున్నాయి. వెంటనే నాన్నతో “నాన్నా చెట్లు ఎందుకు వేగంగా వెళుతున్నాయి, కొండలు ఎందుకు నిదానంగా పోతున్నాయి” అని అడిగాను.

నాన్న రెండు క్షణాలు ఆగి “దాన్ని వ్యూ యాంగిల్ అంటారు. దూరం కంటే దగ్గరగా ఉన్న వాటిని చూసే యాంగిల్ ఎక్కువ అవసరం. అందువల్ల అలా కనపడుతుంది” అని చెప్పారు.

ఏదో కాస్త గందరగోళం అనిపించింది. అయినా అర్థం అయినట్లు తలవూపాను. కానీ నా సందేహం అలానే ఉండిపోయింది. ఇంతలో ఏదో స్టేషన్‌లో ట్రైన్ ఆగింది. ప్రక్కనే ఇంకొక ట్రైన్ ఆగింది. నాన్న నీళ్ల కోసం క్రిందికు దిగాడు. ఇంతలో మా ట్రైన్ కదిలింది. “ట్రైన్ కదులుతుంది నాన్నా రాలేదే” అని గట్టిగా అరిచాను. ప్రక్కనే ఉన్న అమ్మ, ఎదురుగా ఉన్న పెద్దాయన నన్ను చూసి నవ్వారు. ఎందుకంటే కదిలింది మా ట్రైన్ కాదు. ప్రక్క ట్రైన్, నేను మాదని బ్రమపడ్డాను. నాన్న రాగానే అలా ఎందుకు జరిగింది అని అడిగాను. నాన్న ఏదో “రిలేటివ్ థీయరి” అన్నాడు. మరలా అర్థం కాలేదు. మా ట్రైన్ కదిలింది. ఈ సారి ట్రైన్‌తో పాటు ఎగిరే పక్షుల్ని, కారుల్ని చూస్తూ కూర్చున్నాను. అనేక సందేహాలు ఒక దాని వెంట ఒకటి వస్తున్నాయి. నాన్నని అడగాలని అనుకున్న కానీ విసిగిస్తున్నానేమో అని ఆగాను. పెద్దాయన నన్ను గమనిస్తూ ఉన్నాడు.

ఎందుకనో నాకు ప్రతీదీ వింతగా అనిపించింది. నాలో అనేక ప్రశ్నలు, కొన్నింటికి ఆలోచిస్తున్న కొద్ది సమాధానాలు వస్తున్నాయి. అప్పుడు పెద్దాయన నాతో ఇలా అన్నాడు. “ఏం తల్లీ నీకు చాలా సందేహాలు వస్తున్నాయి కదూ!”

“మీకు ఎలా తెలుసు”

“నిన్ను చూస్తే నాకు తెలుస్తుందిలే. నీ లాగే నాకు చిన్నప్పుడు అనేక సందేహాలు వచ్చాయి. అన్నింటి గురించి ఆలోచించాను. నాకు వచ్చిన ఆలోచనలన్ని నా టెక్ట్స్ బుక్స్‌లో, లైబ్రరీ బుక్స్‌లో వెతికాను సమాధానాలు దొరికాయి. దాని వల్లే నేను SMAR లో సైంటిస్ట్ అయ్యాను” అన్నాడు.

నాకు ఆయన సైంటిస్ట్ అని తెలిసిన తరువాత ఆయన మీద గౌరవం కలిగింది.

“ఏంటి రాకెట్లు పైకి పంపారా? మీరు ఎప్పుడైన ఆకాశంలోకి వెళ్ళారా? చందమామ మీద ఎవరు ఉంటారు….” ఇలా ప్రశ్నలు వర్షం కురిపించాను. అన్నింటికి సమాధానం చెప్పి నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాతో ఇలా చెప్పాడు – “చూడు తల్లి ప్రపంచం చాలా పెద్దది. అందులో మనకి తెలిసింది సూది మొన అంత. ప్రతి ఆవిష్కరణకి మనలో మెదిలే ప్రశ్నలే కారణం. మనం ప్రపంచాన్ని అర చేతిలో ఇమిడే ఫోన్‌లో చూస్తే మన ఆలోచనలు కూడా అలాగే చిన్నవై పోతాయి. ప్రతి క్షణం ఒక అద్బుతం, విజ్ఞానం. ప్రకృతిలోకి చూడు. అనేక విషయాలు నీకు పరిచయం అవుతాయి. మన చట్టూ పరిచయం అవుతున్న విషయాల మీద అవగాహన పెంచుకోవడమే సైన్స్, కాబట్టి అన్ని చూస్తూ ఉండాలి. సందేహాలు కల్గినప్పుడు అన్వేషించాలి. లైబ్రరీ, ఇంటర్నెట్, మీ టీచర్లు ఉన్నది అందుకే. చూసావా నువ్వు ఆ గేమ్ ఆపి బైట చూస్తున్నపుడు నీకు ఎన్ని సందేహాలు వచ్చాయో. మరి పిచ్చి పిచ్చి గేమ్స్ వలన నువ్వు ఎంత కోల్పోతున్నావో అర్థమయ్యిందా తల్లీ. ఐన్‌స్టిన్, న్యూటన్‌లు నీలాగే బుల్లి బుల్లి ప్రశ్నలతో మొదలై అంత పెద్ద సైంటిస్ట్‌లు అయ్యారు, నువ్వేమైనా వాళ్ళ కన్నా తక్కువ తిన్నావా!”

ఈ మాటలు ఎందుకో నన్ను కదిలించి వేసాయి. నా ఆలోచనలు మారిపోయాయి. నేను తప్పక గొప్ప సైంటిస్ట్‌ని అవుతాను అనే నమ్మకం నాలో మొదలైంది. సబ్ వేసర్ఫ్ గేమ్‌కి అదే ఆఖరి రోజు. వర్చువల్ ఆనందం నుంచి నా చుట్టు ఉన్న ప్రపంచాన్ని చూడటం ఆరంభించాను. నిదానంగా నా ఆలోచనలు పరిశోధన మీదకు వెళ్ళాయి. ఒక రోజు ఫిల్డ్ ట్రిప్‌కు సముద్రం వద్దకి వెళ్ళాము. సముద్రం నీటిని త్రాగు నీరుగా మారిస్తే ఎలా ఉంటుంది. అనే ఆలోచన నాలో మొదలైంది. తక్కువ ఖర్చుతో ఉప్పు నీరును మంచి నీరుగా మార్చే పరికరాన్ని తయారు చేసాను. అది ఈ రోజు నన్ను ఖండాలు దాటేలా చేసింది.

చిన్న ప్రయాణం నా జీవితాన్ని ఎంతగానో మార్చేసింది. చూడాలి, చుట్టూ వున్న ప్రతి అద్భుతాన్ని చూడాలి. అరచేతిలో కల్పిత ప్రపంచం (సెల్ ఫోన్) నుంచి అనంతమైన విశ్వంలో ఉన్న అద్భుతాలను అన్వేషించాలి.

“ఎన్నో ఆవిష్కరణలు చేసి మానవ జీవితాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచిన శాస్త్రవేత్తలకు, విజ్ఞావంతులకు ఈ నా చిన్న కథ అంకితం.”

టి. తేజస్విని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here