నా రాత గుండ్రం

0
11

[dropcap]ఫో[/dropcap]న్‌లో కష్టమర్ ఆర్డర్‌ని చూశాక, చకచకా జుజుబీ రెస్టారెంట్‌కి వచ్చాడు రవి. వేగంగా లోపలికి వెళ్ళి, “సోదరా త్వరగా ఒక వెజ్ బిర్యానీ, ఒక పనీర్ కర్రీ ఇవ్వు. టైమైపోతోంది” అన్నాడు.

పార్శిల్ చేస్తున్నతను, “అరె, నేను మా రెస్టారెంట్ కష్టమర్స్‌ని వదిలి మీ పార్సిల్స్ ముందు కడతాను. నీకు తెలుసు కదా. ఇదిగో నీ ముందు ఇంకా ఇద్దరు ఫుడ్ డెలివరీ వాళ్ళు వెయిటింగ్. ఓ ఐదు నిమిషాలు ఆగాలి” చెప్పాడు సీరియస్‌గా చూస్తూ.

“కష్టమర్స్ త్వరగా రమ్మని పోరు పెడతారు. వీళ్ళేమో ఆర్డర్ పార్శిల్ చేయడానికే బోలెడు టైమ్ తింటారు. ఈ లేట్ కవర్ చేయడానికి, రిస్క్ అయినా బండి స్పీడ్‌గా నడపాలి ఛ” అని పక్కకి తిరిగి చూశాడు. తనతో పాటే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తున్న మధు కనిపించాడు.

చూస్తూనే దగ్గరగా వెళ్ళి “అరె మధూ, ఏంట్రా మరీ అలా నీరసంగా వేలాడిపోయావ్. నువ్ కూడా ఇంకా లంచ్ చేయలేదా” అడిగాడు

“ఏ రోజు చేశాననీ, ఈ రోజు చేయడానికి. చేరిన రోజు నుండీ ఇదే తంతు. ఆ మానేసే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను. కానీ ఆ రోజు, ఏ రోజు వస్తుందో మాత్రం తెలియడం లేదు. త్వరలోనే ఆ రోజు రావాలని, రోజూ దేవుడికి దణ్ణం పెట్టుకోవడం తప్ప ఏం చేయగలను” చెప్పాడు మధు నీరసంగా.

“మరీ అలా డీలా పడిపోకు. నిదానంగా ఉండు.” చెప్పాడు రవి.

“ఏం నిదానం నా బొంద. ఆదరా బాదరాగా పరిగెడుతూ అందరి కడుపులూ నింపుతున్నా, మన ఉదరాలు మాత్రం, ఉష్ణ మండలాల్లో మట్టికుండల్లా మాడి మసైపోతున్నై. వేళకి తినకపోవడంతో, ఇండైజేషన్ ముదిరి గ్యాస్ట్రిక్ వచ్చిందనీ, ఇలాగే అశ్రద్ద చేస్తే అల్సర్ కూడా వస్తుందని డాక్టర్ గారు ఒకటికి పదిసార్లు పెద్ద గొంతేసుకుని, అదేదో న్యూస్ చానెల్ యాంకర్‌లా అరిచి మరీ హెచ్చరించారు. ఆ భయంతోనే సగం హడలి, ఇలా వడిలిన వంకాయిలా తయారయ్యాను. కానీ ఏం చేస్తాం, ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చేవరకూ, ఇలా నా కడుపు ఉడకక తప్పదు. పోనీ హఠాత్తుగా మానేద్దావంటే ఇంటికి డబ్బు పంపడం ఆగిపోతుంది. అందుకే, లోపల వలవలా ఏడుస్తున్నా, పైకి గలగలా నవ్వుతూ, ఎలాగోలా ఈ ఉద్యోగం అలా అలా చేసుకుంటూ వస్తున్నాను. ఇవాళ కూడా రెండు నిమిషాలు ఖాళీ లేదంటే నమ్ము. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్ ఒక దాని వెనకాల ఒకటి రైలు పెట్టెల్లా అలా వేగంగా వస్తూనే ఉన్నాయి. చూసి, చూసి ఇలా లాభం లేదని, భోజనం చేద్దామని నా ఐడిని ఆన్‌లైన్ నుండి ఆఫ్‍లైన్‌లో పెట్టేశాను.”

“మంచి పని చేశావ్. అలా ఆఫ్‍లైన్‌ పెట్టి శుభ్రంగా తినేశావన్నామాట” అడిగాడు రవి.

“భలే వాడివే, అక్కడే ఉంది ట్విస్ట్. నేను ఇలా ఆఫ్‍లైన్‌లో పెట్టీ పెట్టగానే, మన మేనేజర్ ఆఘమేఘాల మీద ఫోన్ చేశాడు. నేను ఫోన్ ఎత్తి ఎత్తగానే, “ఏవిటి ఇలా హఠాత్తుగా ఆఫ్‍లైన్‌లోకి పోయావ్. ఇంకా ఎన్ని ఫుడ్ ఆర్డర్లు క్యూ లో ఉన్నాయో తెల్సా. అసలే ఈరోజు ఇద్దరు లీవ్ పెట్టి చచ్చారు. కనుక నువ్వు ఏవీ అనుకోకపోతే ముందు లైన్‌లో ఉన్న ఆ రెండు ఆర్డర్‌లూ క్లియర్ చెయ్. తర్వాత బ్రేక్ పెట్టుకో” అని కుంకుడు రసం మింగినవాడిలా రుసరుసలాడిపోతూ ఫోన్ పెట్టేశాడు దరిద్రుడు. నిన్న కూడా ఇలానే అన్నం తినేప్పటికి మూడున్నర అయిపోయింది. ఎంత ఉద్యోగం అయితే మాత్రం, మరీ ఇలా రుద్దేస్తారా. ఇలా సెలవులు ఇవ్వకుండా, కనీసం భోజనం చేయడానికి కూడా కొంత సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు కనుకే, మన సిబ్బంది మానేసి పోతున్నారు” మండిపోయాడు మధు.

అతని భుజం తడుతూ, “విసనకర్ర వచ్చి సీలింగ్ ఫ్యాన్‌తో మొర పెట్టుకున్నట్టుంది. ఇంచు మించు, అటూ ఇటూగా నాదీ అదే పరిస్థితి. కానీ ఏం చేయను? నీలాగే నాకూ ఉద్యోగం అత్యవసరం. అందుకే, ఖాళీ దొరికే వరకూ ఖాళీ కడుపుతోనే ఉంటున్నాను. నువు ఈ విషయమై ఎక్కువ ఆలోచించి, బాధపడి బుర్ర ఖరాబు చేసుకోకు. మరో ఉద్యోగం చూసుకున్నావ్ కదా, అదే ఆ టి.టి. సాఫ్ట్‌వేర్ కంపెనీ నుండి ట్రైనింగ్ డేట్ వస్తే, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అది మంచి కంపెనీ, నువ్వు వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు” చెప్పాడు రవి మరోసారి భుజం తడుతూ.

“ఔను, అది చాలా మంచి కంపెనీ, నువ్వన్నట్టు ఇక వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. అందులో జాబ్ చేయడం అంటే ఎంత గొప్ప విషయం అనీ, ఆ కంపెనీ గురించి ఆల్రెడీ నేను నెట్‌లో చదివాను. కేవలం ఎనిమిది గంటలే పని. పైగా మూడు నెలలకోసారి బోనస్‌లూ, ఆరు నెలలకోసారి హైక్‌లూ, సంవత్సరానికోసారి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్‌లో యానివర్సరీ పార్టీలూనూ. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్న కెఫెటేరియా బొమ్మ చూసా, చాలా పెద్దది. హాయిగా మనకి ఓ బ్రేక్ టైమ్ ఇస్తారట. అక్కడ ఆ కెఫెటేరియాలో కూర్చుని హాయిగా వేళకి ప్రశాంతంగా కడుపుకి ఇంత అన్నం తినొచ్చు” చెప్పాడు ఆశగా ఆకాశం వైపు చూస్తూ.

ఇంతలో “మధూ నీ ఆర్డర్ రెడీ” అని రెస్టారెంట్ వాడు పిలవడంతో, “సరే ఉండు, రెస్టారెంట్ వాళ్ళు నా ఆర్డర్ ప్యాక్ చేసినట్టున్నారు, తీసుకెళ్లాలి” అంటూ ఆ ప్యాకెట్ తీసుకు వెళ్లే లోపు కస్టమర్ నుండి ఫోన్ వచ్చింది.

లిఫ్టు చేసి “నేను వచ్చేస్తున్నాను సార్” అని సమాధానం ఇచ్చినా, అవతలి నుండి ఏ రిప్లై లేదు. “హలో హలో” అన్నాడు మధు.

కస్టమర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు “ఛ ఇవాళ కూడా తినలేను రా. రోజూ ఇంతే, తినడానికి అరగంట సమయం ఇస్తారు. కానీ పావుగంటకే తిరిగి లాగిన్ అవ్వమంటారు” అని ఫోన్ వంక చూసి “హలో” అన్నాడు ఆ కస్టమర్.

“వినబడుతుందా సార్, ఫుడ్ తెస్తున్నా సార్” అన్నాడు మధు.

“అక్కరలేదు, నేను అర్జెంట్‌గా నా వర్క్‌లో లాగిన్ అవ్వాలి. కాబట్టి ఎవరికైనా ఆ ఫుడ్ ఇచ్చేయండి లేదా మీరే తినేయండి” చెప్పాడు.

“సార్ మీరు ఇంత బిజీగా ఉన్నారు, ఏం జాబ్ చేస్తారు సార్” అడిగాడు మధు.

“నేను టి.టి. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంప్లాయిని” ఫోన్ కట్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here