నా రుబాయీలు-17

0
13

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
1.
అప్పుడే తిరిగొచ్చాడే – పుడమంటే రవికి ప్రేమ
అలల కౌగిలింతలాగవు – మన్నంటే అబ్దికి ప్రేమ
వియోగపు వేదనలేమెరక గొప్పలు పోవు ప్రకృతికి
ఎప్పుడు తిరిగొస్తాడో – నేనుంటే అతనికి ప్రేమ

2.
చేప ప్రపంచం అంతా సముద్రం లోపల
మృగరాజుకు సింహాసనం గహనం లోపల
దిగంతాలన్నీ పాదాక్రాంతమే అయినా
మది మురియుజాడ ఉంది నీ హృదయం లోపల

3.
తామరెక్కడిది కంపు పంకము లేకుంటే
అమృతమెక్కడిది చంపు గరళము లేకుంటే
మది గెలిచి ఇంట దీపమెట్టగ అంబుజాక్షి
సుఖమెక్కడిది ఒకింత దుఃఖం లేకుంటే

4.
పరువం గిచ్చేవరకు మదనుడి నీడ ఎందుకు
సంబురం సచ్చేవరకు పెళ్లి పీడ ఎందుకు
పాత్రల వరుసలు పరమాత్ముడికి బాగా తెలుసు
వసంతమొచ్చేవరకు కోయిల జాడ ఎందుకు

5.
వేటలో నా విజయాలు కరంజము చెప్పింది
మాటలో నా ప్రేమ నీ కజ్జలము చెప్పింది
సంపదలెన్నున్నా చెంత నీవు లేనినాడు
నా జీవితానికి విలువ పంజరము చెప్పింది

6.
అటుగా వెళ్లినా లాగు సూదంటురాయి నీవు
నా మోడువారిన బతుకున కలికితురాయి నీవు
కూల్చావు, కాల్చావు, మిగిల్చావు, రగిల్చావు,
స్థాణువును కదల్చావు, పేల్చావు తురాయి నీవు

7.
ప్రాణాలు ఊదవా పవనములు ఆడు దృతికి కాస్త
పరువాన్ని బరియింప అందించు చెలీ ధృతిని కాస్త
అలరారు తోటలోన అన్నీ చిలిపి కుసుమాలే
ఆరంభించుము అడుగులు అనునయముల ప్రభృతి కాస్త

8.
ప్రేమిస్తే తిరిగిస్తారు అను పదం కొంత దూరం
శిలలోన ప్రేమ మొలుస్తుందను వాదమెంత దూరం
జీవితమర్పించాక నీకు నేనవతలవాన్నయితె
‘ప్రియురాలు పిలిచె’ అను నాదం జీవితమంత దూరం

9.
ఆదిత్యుడు నడిస్తే అతడు
ప్రద్యుమ్నుడు తడిస్తే అతడు
కంట పడితే ఐచ్ఛికమేది
తాంబూలము మడిస్తే అతడు

10.
కోయిల పాట మదినింపేనేమో తరువు కాంతులీనుతుంది
అంగన నీడన నిలిచానేమో తనువు కాంతులీనుతుంది
తోరణాలకూ ముస్తాబు చేయాల్సిన తరుణమీ వేళ
మౌనం వీడి తను అవునంటే మనువు కాంతులీనుతుంది

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here