నా రుబాయీలు-3

0
14

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]

~
శరణంటే ఆ శివుడు యముణ్ణి ఆపాడు చూడు
దాహమంటే మేఘము నేలను చేరాడు చూడు
తిరిగి చూస్తే గతమంతా నాకు బ్రతిమిలాటే
బలిపీఠంపై నను పశువులా నిలిపావు చూడు

చిగురించిన ప్రతీ కొమ్మకు శిశిరం గొప్ప వీడ్కోలు
విరబూసిన అన్ని పూలకు మరుదినం ఘన వీడ్కోలు
ప్రేమామృతం వల్లేమో నాకు చావు రాకున్నది
అస్తమించని గాయాల గుండెకు ఎక్కడ వీడ్కోలు

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారంట నిజమేనా
ఊరడించ బాధలిక సగమౌనంట నిజమేనా
ప్రాణాలకు మించి ప్రేమించగా తిరస్కరించెను
నా ఆర్తిపై తాను నవ్వుతుందట నిజమేనా

చంద్రుడికీ నాదో ముద్ద తినిపించాలని కోరిక
అంబారీ ఎక్కి నే చుక్కలు కోయాలని కోరిక
పెద్దయ్యాక నేనొక పేద్ద డాక్టర్ నవుతాను కద
డోలో సిక్స్ ఫిఫ్టీ సైజ్ తగ్గించాలని కోరిక

రేపంతా హాయేనని నిన్నంతా గడిపాను
సుఖమంతా నాదేనని తలపంతా గడిపాను
అమృతము అపహాస్యం చేయగా నా చషకాన్ని
అక్కున చేర్చికుని అశ్రువులు నిండా గడిపాను

నిను చూస్తే ముద్దొకటే రావడం లేదు తెలుసా
నీ స్పర్శలో హాయే అంతిమం కాదు తెలుసా
చేపకళ్ల సాగరాన ఓలలాడంగ నాకు
అలసినా రాతిరైనా నిద్దుర రాదు తెలుసా

నా ఎద పూబాటకు ప్రతి నా దారులు మూసావు
అరచేత పూపంచ పరిమళాలను మూసావు
ఎదలోని వేలుపువని నైవేద్యాలు చేశాను
చెమటలు కారగ నా మేను పొగగూడు మూసావు

నువు చేసిన గాయం నిన్ను తలచె గేయమే అవగా
మాయమై నీ ప్రతిన అమేయమైన ప్రశ్నే అవగా
దౌడు తీసిన మన మనోహాయములు అట సొమ్మసిల్లెను
మది ఒప్పనంది నేర్పు హేయములు భావ్యమే అవగా

ఆరు బయట అన్నం కోసం తుప్పల్లో వెదికాను
కడుపు ఏడిస్తె కంటిమంట జ్వాలల్లో వెదికాను
రోజంతా భోజనము ఎప్పుడైనా ఒక ముద్దేగ
మెతుకు ప్రతిసారి ఎండిన పళ్లెంలో వెదికాను

చూడగా పదును అన్ని వైపులా ఆమెకు
చేరు అర్జీలు కొన్ని కుప్పలా ఆమెకు
అదును కోసం వేచారు కుర్రాళ్లంతా
కానరాడే ముదుసలి ఎక్కడా ఆమెకు

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here