నా రుబాయీలు-6

0
12

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]

~

1.
నేనిచట భోంచేసి బిల్లును నీకు పంపగ
నువు పెద్ద కేకు కొని ఓ ముక్క నాకు పంపగ
పుట్టిన రోజు శుభాకాంక్షలు కృష్ణవేణికి
పుష్యమాసము విషెస్ ఈ వేడుకకు పంపగ

2.
అణువైనా తాకాలని ఆశలసారం చెప్పింది
క్షణమైనా గడపాలని చూపులవైనం చెప్పింది
తిలోత్తమే దారితప్పి దేవలోకం విడిచిందో
కలనైనా చూడాలని కోర్కెలతీరం చెప్పింది

3.
చెంతనే నీవుంటే నా తనువంతా చేతులుండాలని ఆశ
జున్ను నీ మేనైతే నా తనువంతా మూతులుండాలని ఆశ
అవధుల్లేని అందాలన్నీ కేవలం ప్రకృతికే సొంతమా
వింత నా మాటే నీ తనువంతా నే చేలమవ్వాలని ఆశ

4.
ద్వారమున అల్లుకోవాలని హారమునకు పండుగ
హారమున తోడునవ్వాలని దారమునకు పండుగ
చెలికై కొలిమి అనలముల సమ్మెటలకోర్చ స్వర్ణం
కంఠమున మోకరిల్లాలని చారమునకు పండుగ

5.
నీ తొలిచూపుతో ఎదను రగిలించావు
నా మలిచూపుకై నువు నిరీక్షించావు
నీవే నా లోకమనుచు పరితపిస్తే
ఏమీ కానట్లు నట్టేట ముంచావు

6.
ఉబికివస్తున్న కన్నీటిని ఆపు
ఉలికిపడుతున్న ఎద గడబిడని ఆపు
మరో లోకాన్ని చూపునీ లోకం
గతంతో ఇక పెనుగులాటని ఆపు

7.
ఓపలేని బాధను తగ్గిస్తుంది శోకం
గుండెలోని భారాన్ని దించుతుంది శోకం
ఎండమావులు ఈ ప్రపంచంలో మిత్రమా
భుజం తట్టేవాన్ని చూపిస్తుంది శోకం

8.
పళ్ళను పరుగులు పెట్టిస్తున్నది చలి
ప్రాణాలను బందించనీకుంది చలి
జీవం పరమేశ్వరుడి ఆధీనమే
నీకు స్వస్తి నిన్నే పలుకమంది చలి

9.
భవిష్యత్తు వరకు బాల్యం నుండి ఉరుకు
సంపదల కొరకు యవ్వనం నుండి ఉరుకు
వర్తమానం వాడనివ్వకు మిత్రమా
చంచలమయిన మస్తిష్కం నుండి ఉరుకు

10.
తప్పు చేసాక తప్పదు కారాగారం
నిను ప్రక్షాళించే తర్ఫీదు కారాగారం
మెరుగులద్దగా ప్రతిరోజున జీవితం
అనురాగాలు బందించు కారాగారం

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here