నా విషాద నగరం!

1
14

[పాలస్తీనా కవయిత్రి ఫద్వా తూకాన్ రచించిన ‘My Sad City!’ అనే కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Fadwa Tuqan’s poem ‘My Sad City!’ by Mrs. Geetanjali.]

(జియోనిస్ట్‌లు పాలస్తీనాని ఆక్రమించిన రోజు, జూన్ 27, 1967)

~

ఆ రోజు.. మేము చావునీ, మోసాన్ని ఒకేసారి చూసిన రోజు
ఆ రోజే.. సముద్రపు అలలన్నీ క్షీణించిపోయాయి.
ఆకాశపు కిటికీలు మూసుకుపోయాయి.
ఇక నగరమంతా శ్వాసను బిగబట్టింది.
అలలు అలసి
ఓడిపోయిన రోజు కూడా అదే!
అంతేలేని సముద్రం తన నిజస్వరూపాన్ని చూపించిన రోజు..
ఆశలు బూడిదైన రోజు..
సముద్రం అంతా ప్రళయం మీద వికారంతో కక్కుకున్న రోజు..
నా విషాద నగరం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.
నగరాన్ని నిశ్శబ్దం ఏలింది..
వంకరగా నిలబడ్డ పర్వతాలను ఆక్రమించిన నిశ్శబ్దం..
రాత్రిలా మార్మికమైన నిశ్శబ్దం.. విషాద నిశ్శబ్దం..
భారమై., మృత్యువుతో., ఓటమితో కృంగిపోయి..
అయ్యో.. నా విషాద.. ఒంటరి నగరం!
పంటలు అందేవేళలో..
ధాన్యం.. పండ్లూ బూడిదై పోయాయా ఇక్కడ?
అయ్యో.. ఇదా.. ఇంత ప్రయత్నం చేసి,
ఇన్ని దూరాలు నడిస్తే.. దొరికిన ఫలితం?
నా విషాద నగరం..
నా నగరం!

~

మూలం: ఫద్వా తూకాన్

అనుసృజన: గీతాంజలి


ఫద్వా తూకాన్ పాలస్తీనా కవయిత్రి. ఇజ్రాయెల్ ఆక్రమణలను ప్రతిఘటించిన కవులకు ప్రాతినిధ్యం వహించారు.

‘An autobiography: A Mountainous Journey’ అనే ఆత్మకథను రచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here