నాదొక ఆకాశం-10

0
11

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[రామోజీ ఫిల్మ్ సిటీలో సమీర్‍కి షూటింగ్‍ శిక్షణ మొదలవుతుంది. తాను నటించవలసినవన్నీ డాన్స్ లోని భాగాలే కాబట్టి ముందుగా కొరియోగ్రాఫర్ కొన్ని బేసిక్ మూవ్‍మెంట్లు ప్రాక్టీస్ చేయిస్తాడు. సమీర్‍లోని బిడియం పోగొట్టడానికి డాన్సర్ అమ్మాయిలు చొరవ తీసుకుని అతని చేతులను తమ శరీరలపై వేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. ఆ అమ్మాయిలు ఏ హీరోయిన్లకీ తీసిపోరని, వాళ్ళకి లేనిదల్లా తమ అందాన్ని, నాట్య ప్రావీణ్యాన్ని మార్కెట్ చేసుకునే తెలివితేటలనీ అనుకుంటాడు సమీర్. జూనియర్ డాన్సర్ల పరిస్థితి తలచుకుని బాధపడతాడు. మర్నాడు లొకేషన్‍కి హీరోయిన్ త్రక్ష వస్తుంది. ఆమెతో డాన్స్ అనేసరికి సమీర్ భయపడతాడు. ఆమెని తాకడానికి ఇబ్బంది పడితే, ఆమె అతన్ని ఏడిపిస్తుంది. సమీర్ ఇబ్బందిని గమనించిన డైరక్టర్ శ్రీవిక్రమ్ వచ్చి – ధైర్యం చెప్పి, నువ్వు ఇప్పుడు సమీర్‍వి కావు, సంజయ్‍వి. నువ్విలా చేస్తే సంజయ్‍కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మనసులోని భయాలన్నీ వదిలిపెట్టి చెయ్ – అని చెప్తారు. ఆయన ఇచ్చిన ప్రేరణతో సమీర్ ఉత్సాహం తెచ్చుకుని సంజయ్ చేసినట్టే డాన్స్ చేసి ఆ రోజుకి షూటింగ్ ముగిస్తాడు. త్రక్ష కేరవాన్ లోకి వచ్చి, సమీర్‍ని అభినందించి, సమీర్ హీరోగా పరిచయం అవుతున్నట్లు తెలిసిందనీ, హీరోయిన్‍గా తనని రికమెండ్ చేయమని, తమది మంచి జోడీ అవుతుందని చెబుతుంది. ఆ వివరాలన్నీ సంజయ్ వచ్చి చూసుకుంటాడని చెప్పి తప్పించుకుంటాడు సమీర్. షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఒళ్ళు నొప్పులు తెలుస్తాయి. సంజయ్ ఎలా భరించాడో ఇవన్నీ అనుకుంటాడు. వేడినీళ్ళతో స్నానం చేసి, ఆదమరచి నిద్రపోతాడు సమీర్. నిద్రలో ఆ రోజు షూటింగ్ చేసిన పాట గుర్తుకు వస్తుంది. హీరోయిన్ త్రక్ష స్థానంలో తన ప్రియురాలు వసుధ కనిపిస్తుంది సమీర్‍కి. సినిమా హీరోయిన్‍లా డ్రెస్ వేసుకుని కనబడిన వసుధని ఆ డ్రెస్ వివ్పేయమని అంటాడు. కల కొనసాగుతుంది. – ఇక చదవండి.]

[dropcap]కా[/dropcap]నీ, ఇదేమిటి, నాకు నిజంగానే అటువంటి ప్రియురాలి పెదవుల తియ్యందనం, గులాబీ పూరేకుల స్పర్శ తగులుతుంటే చటుక్కున మెలుకువ వచ్చింది.

నా పక్కనే ఉన్న వసుధ నా పెదవులకు తన పెదవులను ఆనించి చుంబిస్తుంది. అయితే, నేను కలలో అనుభవించిన సమీరాలూ, దేహ సుగంధాలు, వేణీ స్పర్శలు నిజమైనవేననుకుని,

“వసూ! మై డార్లింగ్!” అంటూ కౌగలించుకున్నాను.

రోజంతా ‘త్రక్ష’ను అనేకసార్లు కౌగలించుకున్నా కలగని ఇంద్రియ సౌఖ్యం, వసుధ చిరుతాకిడితో చెలరేగిపోయాను.

మదనుడు తన సామ్రాజ్య నిర్మాణ పనిలో పడి, విచ్చలవిడిగా బాణాలు వేస్తుంటే రతీదేవి వాటి గురిని లక్ష్యం వేపు మళ్ళించ సాగింది.

ఒక మనిషికి, మానసిక స్థితి బాగా లేకపోతే, అప్పుడప్పుడు తలకు కొన్ని ఎలక్ట్రోడ్సును బిగించి, మైల్డ్ ఎలక్ట్రికల్ షాక్ ఇస్తుంటారు వైద్యులు.

కానీ, మా పరిస్థితి మాత్రం, ఒంటి నిండా ఎలక్ట్రోడ్సును బిగించి, హై వోల్టేజ్ కరెంట్ షాక్ ఇచ్చినట్టుగా ఉంది. మావి రెండు శరీరాలు కావు అప్పుడు.

అదొక రసరమ్యలోకం.

ఈ సృష్టిలో అత్యద్భుతమైన సృష్టి కార్యం. స్త్రీ పురుషుల మధ్య ఇంత వ్యామోహమెందుకో, ఇంత అలవి కాని తపన ఎందుకో ఆ భగవంతుడికే తెలియాలి.

ఇది కేవలం శరీరాల సంగమం కాదు. అది కేవలం సంభోగమైతే, ఈ అలౌకిక ఆనందం, పాత్ర నిండి పొంగి పొర్లిన భావన కలగదు.

శరీరాలు అలసిపోయాయి కానీ మనసులు మాత్రం, ఆ అనుభవం మరింత కావాలని కోరుకుంటున్నాయి.

కానీ, వసుధ

“ఏం తినకుండానే పడుకున్నావ్ సమ్మీ! నీ కోసమే నేను తినకుండా ఎదురు చూస్తూ కూర్చున్నాను.” అంది.

బట్టలు వేసుకున్న తర్వాత,

“ఒంట్లో ఉన్న శక్తినంతా పీల్చేసావు. అసలే ఆకలితో కడుపు మలమల మాడిపోతుంది. ఇప్పుడు ఒక్క అడుగు వేసే ఓపిక కూడా లేదు.” అంది.

నేను చటుక్కున,

“ఛలో, క్రింది బైక్ వరకూ నిన్ను నేను మోసుకు వెళ్తాను. నువ్వు బండి మీద కూర్చో! నీకిష్టమైన చోటుకి నేను తీసుకెళ్తా!” అని బట్టలు వేసుకుని, వసుధను ఎత్తుకుని లిఫ్ట్ వరకు నడిచాను.

ఒక సుగంధభరిత పూల బుట్టను మోస్తున్నంత హాయిగా ఉంది. అది ఒక చిన్న భంగిమే కానీ, ఆ తరుణంలో ఎన్ని శరీరభాగాలు అనుసంధానమవుతాయో అప్పుడే నాకు అనుభవంలోకి వచ్చింది.

బైక్ రివ్వున పరుగులు తీస్తుంటే, వసుధ కిలకిలా నవ్వుతూ చెవిలో, ప్రణయ ఊసులు, ఏవేవో గుసగుసలుగా చెప్తుంది. గాలి వేగానికి ఆమె మాటలు వినిపించకపోయినా, చెవిలో ఆ గుసగుస, ఆ సాన్నిహిత్యం నాకు బాగా నచ్చింది.

బైక్ బేగంపేటలోని ‘క్రీమ్ స్టోన్’ ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆపి వసుధకు ఎంతో ఇష్టమైన సీతాఫల్, బాదాం, పిస్తా ఐస్‌క్రీమ్ పెద్ద బకెట్, వసుధ ముందుంచాను. వసుధ చటుక్కున, ఒక స్పూన్ స్కూప్ చేసి,

“ఆహా! ఏమి మాధుర్యం! ముందేమో సఖుడితో పొందు. తరువాత ప్రియమైన హిమక్రీములతో విందు. ఈ ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత చచ్చిపోయినా ఫర్వాలేదు.” అని అంది.

నేను తన నోరు మూసి,

“పిచ్చి మాటలు మాట్లాడకు. పైన తథాస్తు దేవతలుంటారు. అమ్మ చెప్పింది.” అని “తప్పు బేబీ! మనింటి నిండా నీ లాంటి బేబీలు బోలెడు మందిని కనాలి నువ్వు. ఇప్పుడే చావు మాటలు మాట్లాడకు.” అన్నాను.

వసుధ ప్రేమారగా నన్ను చూసి, మరొక స్పూన్ ఐస్‌క్రీమ్ నోట్లో పెట్టుకుంది.

***

రెండు రోజులనుకున్న నా షూటింగ్ వారం రోజులు పట్టింది.

శ్రీవిక్రమ్ గారు అంత గొప్ప దర్శకుడు ఎందుకయ్యాడో నాకు మెల్లమెల్లగా అర్థం కాసాగింది. షూటింగ్ ముగిసిన తర్వాత, డ్రింక్ చేస్తూ నిర్మాత, ఎడిటర్, కెమెరామెన్, డైరెక్టరూ కూర్చుని, మొదటి రోజు నా పెర్ఫార్మన్స్‌ను ప్రీవ్యూ థియేటర్లో చూసారు.

షూటింగ్ జరిగేటప్పుడు చిన్న చిన్న మానిటర్లలో చూసి, అనుకున్న విధంగా సీన్ వచ్చిందో లేదో చూసుకుంటారు గానీ పెద్ద స్క్రీను మీద చూసేసరికి అనేక పొరపాట్లు దొర్లినట్టుగా కనిపిస్తుంది. అదీ కాకండా వాళ్ళు నాతో చేయబోయేది ఒక ప్రయోగం. ఆ ప్రయోగ ఫలితాలు వికటిస్తే మొత్తం సినిమానే ఫ్లాప్ అయ్యే ప్రమాదముంది కనుక,

‘నలుగురు సాంకేతిక నిపుణులము కూర్చుని నిశితంగా పరిశీలించామనీ, కొన్ని చోట్ల ‘ఫేస్ స్వాప్’ చేస్తే మిగిలిన యాక్షన్ పార్టంతా వాళ్ళనుకున్నట్టుగానే వచ్చిందని సంతృప్తి చెందామని’ మరునాడు షూటింగ్ స్పాటులో చెప్పిన తర్వాత శ్రీవిక్రమ్ గారు కొంచెం తటపటాయిస్తుంటే,

‘ఏమైంది సార్?’ అని నేనడిగాను.

“సమీర్! నీ పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నామని అనుకోకపోతే, ఈ పాటలను ‘గ్రీన్ మ్యాట్ స్టూడియో’లో కాకండా యాక్చ్యువల్ లొకేషన్లలో తీస్తే ఎలా ఉంటుందని నిన్న రాత్రి మాకో ఆలోచన వచ్చింది. నువ్వేమంటావు?” అని అడిగాడు.

అసలు సిసలైన డైరెక్టర్ ఆలోచించవలసిన తీరు అదే. ఆన్ ది స్పాట్ నిర్ణయాలు తీసుకోవాలి. సినిమా ఇంప్రూవ్‌మెంటుకు గానీ, సీన్ ఎలివేషనుకు గానీ అటువంటి తక్షణ నిర్ణయాలు, సృజనాత్మక నిర్ణయాలు తీసుకునేవాడే గొప్ప డైరెక్టర్. అందుకే, ఆ క్షణంలో శ్రీవిక్రమ్ గారి మీద గౌరవం పెరిగింది.

‘బౌండెడ్ స్క్రిప్ట్’ అని కొంత మంది డైరెక్టర్లు అనే మాటకు అర్థమే లేదు. స్క్రిప్ట్ నిత్యనూతన చైతన్యస్రవంతి. షూటింగ్ జరుగుతున్న కొద్దీ అనేక మార్పులు చేయవలసి ఉంటుంది. షూటింగ్ స్పాటులో పనిచేసే లైట్ బాయ్ దగ్గర నుండి కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, నిర్మాత అసిస్టెంట్ డైరెక్టర్ల వరకు మంచి మంచి ఆలోచనలు, ఒక సీన్‌ను ఎలివేట్ చేసే ఆలోచనలు వస్తుంటాయి.

ఉదాహరణకు, ఒక రేప్ సీన్ షూట్ జరుగుతుంటుంది. డైరెక్టర్ ఆ దృశ్యాన్ని సింబాలిక్‌గా, ఒక మేక మీద పులి దూకి దాడి చేస్తున్న చిత్రం మీదకు కెమెరాను ప్యాన్ చేసి, ముగించాలనుకుంటాడు. అది బాగానే ఉంటుంది. కానీ, షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి సమీపంలో ఒక పచ్చని చెట్టును కొట్టేస్తుంటే పెద్ద పెద్ద కొమ్మలు కింద పడుతుంటాయి. అలాంటి ఒక కొమ్మను నరికినప్పుడు, ఆ కొమ్మ కిందపడిపోతున్న దృశ్యాన్ని చిత్రీకరిస్తే, ఒక కొత్త ప్రతీక, సింబల్ ద్వారా, రేప్ జరిగిందన్న సంఘటనను ఎస్టాబ్లిష్ చేయవచ్చని యూనిట్‌లో ఎవరో చెబితే, దాన్ని డైరెక్టర్ స్వీకరించితే, ఎంతో అద్భుతంగా ఆ సీన్ పండుతుంది.

అందుకే, చాలా మంది యువతరం డైరెక్టర్లు ‘బౌండెడ్ స్క్రిప్ట్’ కాన్సెప్టుకు వ్యతిరేకం.

కానీ, ఆయన మీద గౌరవం పెరిగింది అనుకున్న మరుక్షణంలోనే ఆయన పట్ల నాకు ఏహ్యభావం పుట్టడానికి కారణం, ఆయన తరువాత అన్న మాటలే.

“ఇంకో విషయం. ఇది మనలో మాట.” అని రహస్యంగా అన్నాడు. నా దగ్గరగా వచ్చి,

“సమీర్! నాయుడు గారు నీకు పారితోషికం వద్దన్నారని, మన నిర్మాత సంబర పడుతున్నాడు. మరో వారం రోజుల పాటు కూడా ఫ్రీగా చేయించుకోవచ్చని ఆరాట పడుతున్నాడు. నువ్వే ఆలోచించు. సంజయ్ ఉంటే, ‘కీవ్’లో వారం రోజుల పాటు షూటింగ్ అంటే ఎన్ని ఖర్చులు ఉండేవి. విమానయాన ఛార్జీలు, సెవన్ స్టార్ లాడ్జింగులు, హోర్డింగులు, లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్, లొకేషన్ పేమెంట్స్ అన్నీ కలిపి కోటి రూపాయలు దాటేవి. ఇప్పుడు నీతో అరకులో చుట్టేద్దామనుకుంటున్నాడు. తెల్లవారుఝామున వచ్చే మంచులో ముఖ కవళికలు అంతగా తెలియవు కాబట్టి, ఆ రిస్కు తీసుకుందామని నేనే చెప్పాను. కానీ, నీతో పేమెంట్ విషయం మాట్లాడాలని, రెమ్యూనరేషన్ ఇవ్వమని చెప్పాను. నువ్వు దబాయిస్తే కనీసం యాభై లక్షలైనా వస్తాయి.” అని ఉత్సాహంగా చెప్పాడు.

నేను ఆయన వైపు నిరాసక్తంగా చూసాను. అంటే నిర్మాతను ఇబ్బందుల్లోకి నెట్టి నేనో యాభై లక్షలు కొట్టేస్తే శ్రీవిక్రమ్‌కు సంతృప్తి. దాన్ని తర్వాత నాతో చేయబోయే సినిమాకు ‘గుడ్‌విల్’ గా వాడుకుంటాడన్న మాట. తను నా శ్రేయోభిలాషినని నాకు ప్రూవ్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఒకవేళ, రేపేదైనా అనూహ్యా కారణంతో అతనికీ నాకు సమస్య వస్తే, ఈ విషయాన్నే సుధాకర్ నాయుడి గారి దగ్గరకు కూడ మోసే ప్రబుద్ధుడు అతను అని నాకనిపించింది. అందుకే, నేను కూడా న్యాక్‌గా,

“సార్! సుధాకర్ నాయుడి గారిని అడిగి ఏ విషయమైనా మీకు చెబుతాను!’ అన్నాను. దాంతో శ్రీవిక్రమ్ గతుక్కుమని,

“ఈ విషయం పెద్దాయన వరకు పోకుండా ఉంటేనే మేలు. నీకిష్టం లేకపోతే ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాము. నువ్వు మాత్రం ఎవరికీ చెప్పకు ప్లీజ్! నీ వెల్ విషర్‌గా ఆలోచించాను. అంతే!” అని నా దగ్గర నుండి వడివడిగా పారిపోయాడు.

అనుకున్నట్టుగానే, అరకులో షూటింగ్ బాగా జరిగింది. రోజురోజుకీ నాపై నాకే ఆత్మవిశ్వాసం పెరగసాగింది. యూనిట్ వాళ్ళు కూడా సంతృప్తి చెందారు.

***

సినిమా పూర్తయి, యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి.

సినిమా షూటింగ్ దశ ఎంత ముఖ్యమో, మిగిలిన దశలు కూడా, అంతే ముఖ్యం.

సాధారణ ప్రజలు సినిమా నిర్మాణం అనగానే కేవలం షూటింగ్ అనే అనుకుంటారు.

కానీ, అలా కాదు. సినిమా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత సినిమా నిర్మాణంలో నాలుగు ముఖ్య దశలు ఉంటాయి. ఒకటి ప్రీ ప్రొడక్షన్ దశ. ఈ దశలో సినిమాకొక ఆఫీస్, ఆఫీస్ స్టాఫును ఏర్పరుచుకోవడం; కొత్త కంపెనీ అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో, మన కంపెనీ బ్యానరు రిజిస్టరు చేయించుకోవడం; మన సినిమా కథను రైటర్స్ అసోసియేషనులో రిజిస్టరు చేసుకోవడం; మన సినిమాకు పేరు నిర్ణయమైతే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం; ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఔట్‌డోర్ లొకేషన్లలో షూట్ చేసుకోవడానికి అనుమతి కోసం అప్లై చేయడం; ఏవైనా చారిత్రక స్థలాల్లో షూట్ చేయాలనుకుంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి అనుమతులు పొందడం; లొకేషన్లను సెలెక్ట్ చేసుకుని వాటిని బుక్ చేయడం; షూటింగ్ సమయంలో ఆయా ప్రదేశాల్లో ఉండడానికి లాడ్జింగ్ వసతులు చూసుకోవడం; కార్లను, క్రేన్లను, లైటింగ్‌ను, ప్రొడక్షన్ అంటే భోజన వసతిని ఏర్పాటు చేసుకోవడం వంటి సవాలక్ష పనులు ఉంటాయి.

వీటితో పాటు కథ ఫైనల్ చేసి, నటీనటులను సెలెక్ట్ చేసి, నటీనటుల కాంబినేషన్ సీన్లను ప్లాన్ చేసి, అందుకనుగుణంగా వారి కాల్షీట్లు సంపాదించి, వారిని బుక్ చేయడం; సంగీత దర్శకుడు, కెమెరామెన్, గాయనీగాయకులను ఎంపిక చేసుకుని, పాటలు రికార్డు చేయించడం; ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమర్, చివరకు డైరెక్షన్ డిపార్టుమెంట్ వారిని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే, అన్నీ కుదిరిన తర్వాతనే, అసలు షూటింగ్ ప్రారంభమవుతుంది.

అప్పుడే కొబ్బరికాయ కొట్టి, రెండవ దశ అయిన షూటింగ్ ప్రారంభిస్తారు. గుమ్మడికాయ కొట్టి సినిమా షూటింగ్ ప్రక్రియను ముగిస్తారు.

అటు తర్వాత, మూడవ దశ పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. ముందు ఎడిటింగ్, డబ్బింగ్, నేపథ్య సంగీతం, కంప్యూటర్ గ్రాఫిక్స్, కలర్ కరెక్షన్ వంటి పనులన్నీ పూర్తయిన తర్వాత సెన్సారు సర్టిఫికెట్ కోసం సమర్పించి సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో మూడో దశ ముగుస్తుంది.

నాలుగవ దశలో సినిమా ప్రమోషన్, యాడ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, టీవీల్లో టాక్స్, బిజినెస్, థియేటర్లను బుక్ చేసుకోవడం వంటి ప్రక్రియలు ఉంటాయి.

ఇన్ని గండాలు దాటుకుని సినిమా, థియేటర్లలో రిలీజ్ అయి, ప్రేక్షకుల దీవెనలు పొంది విజయం సాధిస్తేనే అందరూ సంతోషిస్తారు.

కానీ, ఈ మధ్య ఒక సినిమా మాములు విజయం సాధించగానే, దాని ప్రొడ్యూసర్, మీడియాతో మాట్లాడుతూ, విజయగర్వంతో, ‘లెక్కలు అనీ మనవంటి మేధావులకు గానీ, ఆడు (అంటే ప్రేక్షకుడు) నూటా యాభై ఇస్తే, ఆడికి మేము పది రెట్ల అంటే పదిహేను వందల ఎంటర్టైన్మెంట్ ఇచ్చామని’ ప్రగల్భాలు పలికి, ప్రేక్షకులంతా ట్రోల్ చేసేసరికి మరునాడు క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇటువంటి వాళ్ళు చాలా కాలం సినిమా రంగంలో మనలేరు.

అలా, ఇప్రుడు, మా సినిమా నాలుగో దశ పనులు పూర్తి చేసుకుంటుంది.

కానీ, ఇంకా సంజయ్ జాడే దొరకలేదు. మిగిలిన వారికి సినిమా రిలీజవుతుందన్న సంతోషం ఉన్నా, మా హృదయాలు మాత్రం బాధాతప్తమై ఉన్నాయి.

***

దాదాపు ప్రపంచమంతా సంజయ్ గురించి మరిచిపోయింది. పోలీసులు నామ్ కే వాస్తే, అంటే పేరుకు మాత్రమే, ప్రెస్సు మీటింగుల్లో సంజయ్ గురించి తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు.

నాయుడు గారూ, ఆంటీ పైకి గుంభనంగా ఉన్నా వాళ్ళ గుండెలు దినదినానికీ కోసుకుపోతున్నాయి. ఆంటీ అయితే మంచమే దిగడం లేదు. శారీరక అనారోగ్యం కన్నా మానసిక ఆందోళనే ఆమెను కృంగదీస్తుంది. వసుధ బలవంతం మీద కాసేపు వాకర్ మీద నడుస్తుంది. కొంచెం సేపు ప్రాణాయామం చేస్తుంది. మిగిలిన సమయమంతా కొడుకు ఆలోచనలతోనే గడుపుతుంది. ఆంటీ సేవలోనే వసుధ సమయమంతా గడిచిపోతుంది. అంకుల్ కూడా తన బిజినెస్ వ్యవహారాలన్నీ మేనేజర్లకు అప్పగించి, ఇంటికే పరిమితమయ్యారు. పగటి పూట కూడా తాగుతున్నారు. ఆలోచిస్తుంటే వాళ్ళిద్దరూ జీవితం మీద ఆశను కోల్పోయి, మరణం కోసం ఎదురుచూస్తున్న వారిలా బ్రతుకునీడుస్తున్నారు. సంజయ్ వస్తాడేమోనన్న చిరు ఆశే వారిని బ్రతికిస్తుంది. ఆ ఆశే గనుక లేకపోతే వారిలో ఎవరో ఒకరు ప్రాణాలు విడిచేవారు.

ఇంతలో ‘త్రిపుల్ యస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ తేదీ ప్రకటించారు.

***

ఇంతకు ముందు సినిమా ఫంక్షన్లకు ఇప్పుడు జరుగుతున్న సినిమా ఫంక్షన్లకు పోలికే లేదు. గతంలో సినిమా విడుదలైన తర్వాత శతదినోత్సవాలు ఉండేవి. ఆ ఉత్సవాలలో సినిమాలో నటించిన అందరు నటీనటులకు, డిస్ట్రిబ్యూటర్లకు, సినిమా థియేటర్ల యజమానులకు శతదినోత్సవం షీల్డులు బహుకరించేవారు. అది రానురాను అర్ధ శతదినోత్సవాలకు తగ్గింది. ఇంకా అంత కన్నా తగ్గితే బాగుండదని ఇప్పుడు ఆ ఉత్సవాలే మానేసారు.

ఇప్పుడు సినిమా రంగం కేవలం వ్యాపార సూత్రాల మీదనే నడుస్తుంది. 21వ శతాబ్దంలో సినిమా నిర్మాణ వ్యయం కూడా బాగా పెరిగిపోయింది. గతంలో అతి పెద్ద సినిమా బడ్జెట్ అంటే యాభై లక్షలు మాత్రమే. ఎంత ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకున్నా ఆ యాభై లక్షలు, రెండు మూడు కోట్లు కావాలి. కానీ, టాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమా అంటే యాభై నుంచి వంద కోట్లు. ఇంక పాన్ ఇండియా {Pan-India} సినిమాల బడ్జెట్లయితే ఐదారు వందల కోట్లే ఉంటున్నాయి. అందుకు ముఖ్య కారణాలు – విపరీతంగా పెరిగిన హీరోల, డైరెక్టర్ల రెమ్యునరేషన్లు, కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్‌ల ఖర్చులు.

నిన్ననో మొన్ననో, ఒక మిడిల్ రేంజి హీరో, ఈ మధ్య అతను నటించిన ఒక బూతు సినిమా హిట్టు కాగానే తన రేటును అమాంతం 15 కోట్లకు పెంచాడనీ; ఇప్పుడు ఆ హీరోతో సినిమా చేయబోయే – కరోనా తర్వాత ఇండస్ట్రీకే ఈ మధ్య సూపర్ హిట్ ఇచ్చిన – డైరెక్టరు కూడా అంత కన్నా తక్కువ తీసుకోడని అనుకుంటున్నారు. అంటే ఒక సినిమా బడ్జెటులో 60 నుంచి 70 శాతం హీరో, డైరెక్టర్ల పారితోషికానికే పోతే, మరో ఇరవై కోట్ల వరకు నిర్మాణ వ్యయం ఉంటుంది. అంటే యాభై కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సినిమాకు కనీసం వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తేనే నిర్మాతకు పెట్టిన పెట్టుబడి, నెట్ కలెక్షన్ రూపంలో, తిరిగి రాదు.

అంటే వంద కోట్లు రాబట్టవలసిన సినిమాకు హైప్ చాలా అవసరం. యువతలో క్రేజు పుట్టించడం అవసరం. అందుకే సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయోత్సవాల వల్ల పెద్దగా ప్రయోజనముండదని గ్రహించి, కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆడియో రిలీజ్ ఫంక్షన్లు చేసారు. అవి కేవలం పాటలను పరిచయం చేయడానికి తప్ప, వ్యాపార ప్రయోజనాలను నెరవేర్చడంలో ఉపయోగపడక పోవడంతో, లేటెస్టుగా ప్రీ ప్రీ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారు. ఇందులో హీరోను ఆకాశానికి ఎత్తేస్తారు. హీరో ఏదో కరుణించి రెండు ముక్కలు మాట్లాడితే, అతని అభిమానులు నిముషానికి ఒక్కసారి పిచ్చి రంకెలు వేస్తుంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయినట్టుగా భావిస్తున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here