నాదొక ఆకాశం-12

0
12

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

 

[తమవి ప్యాన్ ఇండియా మూవీలు అని చెప్పుకుంటున్న నిర్మాతలు, దర్శకులు, హీరోహీరోయిన్లు తమ సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారో చెప్తాడు సమీర్. ‘త్రిపుల్ ఎస్’ సినిమా ప్రీ-రీలీజ్ ఈవెంట్ గ్రాండ్‍గా ఏర్పాటు చేస్తారు నిర్మాత సత్యం గారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షనుకు వెళితే, ఎటు తిరిగి ఏం జరుగుతుందో, ఎవరే అభాండాలు వేస్తారేమోనని, నాయుడు గారు సంశయిస్తారు. సమీర్‍ని, వసుధని వెళ్ళమని ఆంటీ, నాయుడుగారు చెప్తారు. ఫంక్షన్ టైమ్‍కి సిద్ధమయ్యేలా సంజయ్ పర్సనల్ కాస్ట్యూమర్‌ను పిలిపించి సమీర్‍కి దుస్తులు సిద్ధం చేయమంటారు నాయుడు గారు. వసుధకి దుస్తులు డిజైన్ చేయడానికి వచ్చిన హారిక అనే అమ్మాయి ఏ రకగా డ్రెస్ రూపొందిస్తే వసుధకు బాగుంటుందో చెప్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు నిర్మాత, దర్శకుడు, నాయుడి గారిని ఆహ్వానించి, ఆశీస్సులు కోరడానికి వాళ్ళింటికి వస్తారు. ఆరోజు పనిమనుషులు అందుబాటులో లేకపోవడంతో, వచ్చిన అతిథులకు వసుధ కాపీట్లు అందిస్తుంది. శ్రీవిక్రమ్ ఎందుకో ఆమెని పట్టిపట్టి చూస్తాడు. ఈవెంట్‍కి రమ్మని అడిగితే, నాయుడు గారు సున్నితంగా తిరస్కరిస్తారు. అప్పుడు శ్రీవిక్రమ్ ఒక ప్రపోజల్‍ని నాయుడి గారి ముందుంచుతాడు. వాళ్ళు వెళ్ళిపోయాకా, శ్రీవిక్రమ్ చెప్పిన విషయాన్ని ఎక్కడా లీక్ కానివ్వద్దని నాయుడు గారు హెచ్చరిస్తారు. ప్రీ రిలీజ్ ఫంక్షనుకు వెళ్ళే రోజు మధ్యాహ్నం నాలుగింటికే కాస్ట్యూమర్, హెయిర్ డ్రెస్సర్, మేకప్ వాళ్ళు వస్తారు. నాయుడు గారు ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారో సమీర్‍కి అర్థం  కాదు. హారిక వసుధని అందంగా ముస్తాబు చేసి తీసుకువస్తుంది. వసుధని అలా చూసిన సమీర్ విస్తుపోతాడు. సంజయ్ వాళ్ళమ్మ గారు వసుధనీ, సమీర్‌కి ఎంగేజ్‍మెంట్ చేయాలని అంటారు. వసుధ, సమీర్ – సంజయ్ అమ్మానాన్నలకి పాదాభివందనం చేసి ఫంక్షన్‍కి బయల్దేరుతారు. – ఇక చదవండి.]

[dropcap]ఫం[/dropcap]క్షన్ హాలంతా చాలా కోలాహలంగా ఉంది.

ఆంటీ అన్నట్టుగా ఆ రోజే, నా జీవితాన్ని సంతోష సంబరాల్లో ముంచేసే ఒక సంఘటన, నన్ను జీవితాంతం దుఃఖ సాగరంలో ముంచేసే మరొక సంఘటన అక్కడే, అదే హాల్లో జరగబోతున్నాయని ఏ మాత్రం పసిగట్టినా నేను ఆ రోజు అటువైపు ముఖం కూడా చూపించే వాణ్ణే కాదు.

కానీ, ది మిరాకిల్ మ్యాన్, కలియుగ శ్రీకృష్ణుడి అవతారమైన ‘శ్రీరాం సర్’ అన్నట్టు ‘Everything in our life is predetermined’ అంటే మన జీవితంలో జరగబోయే సంఘటనలన్నీ ఎప్పుడో నిర్ణయించబడే ఉన్నాయి. కాబట్టి మనం దేని గురించీ వగచి లాభం లేదు..

సాధారణంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లు అయినా, ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లు అయినా, కవి సమ్మేళనాలైనా, సాహిత్య సభలైనా ముఖ్య అతిథులు, అధ్యక్షులు, ఆహ్వాన పత్రికలో వేసిన టైముకు రారు. అలా రావడం తమ గౌరవానికి భంగమని భావిస్తారు. అసలు కొన్ని సార్లు నిర్వాహకులే, “సార్! సభ ఆరింటికి ప్రారంభమవుతుంది. కానీ, మీరు ఏడు గంటలకు వస్తే సరిపోతుంది” అని ముందే చెప్పేస్తారు. వచ్చిన సభికుల, అతిథుల టైముకు ఏ మాత్రం విలువనివ్వని దేశం మనది.

ఇంక సినిమా ఫంక్షన్‌లు అయితే, అసలు సభ సాయంత్రం ఆరింటికి ప్రారంభమైనా, హీరో రాత్రి తొమ్మిదింటి వరకూ రాడు. అదో పబ్లిసిటీ స్టంట్. హీరో వచ్చే వరకు ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆ సినిమాలో పాటలు పాడిన గాయకులతో పాటలు పాడిస్తూ, ఆ హీరో లేదా ఆ బ్యానరుకు సంబంధించిన ఏవీలు {AV: Audio Visuals} ప్రదర్శిస్తూ టైం పాస్ చేస్తుంటే, ఫ్యాన్స్ సహనం కోల్పోయి ‘హీరో! హీరో!’ అని అరుస్తుంటే, యాంకర్లు వారికి సర్ది చెప్పలేక అవస్థలు పడుతుంటారు. ‘మన హీరో బయల్దేరాడు!’ అనగానే ఈలలు, చప్పట్లతో హాలంతా దద్దరిల్లి పోతుంది. అట్లా అయిదారు సార్లు చప్పట్లు, ఈలలు తర్వాత హీరో గారు రంగప్రవేశం చేస్తారు.

సంజయ్ కూడా అలానే చేసేవాడు. కానీ, అప్పుడు, ఆ సాయంత్రం నుండి భలే టెన్షనులో ఉండేవాడు. అనుకున్నంత మంది జనం గుమిగూడకపోతే, పిలిచిన పాపులర్ స్టార్లు రాకపోతే అని అనేక అనుమానాలతో సతమతమయ్యేవాడు. చివరకు, అతని పీఆర్ మేనేజర్ బయల్దేరమనగానే బయల్దేరేవాడు.

హీరో ఎంట్రీయే గమ్మత్తుగా ఉంటుంది. అభిమానుల కేకలు, ఈలలు మధ్య, బౌన్సర్లు లేనిపోని హడావుడి చేస్తుండగా వచ్చి ముందు వరుసలో తన సీట్లో కూర్చుంటాడు. తన తోటి కళాకారులను పట్టించుకోడు. కేవలం హీరోయిన్, దర్శకుడు, అతిథులుగా వచ్చిన ఇతర హీరోలను పలకరించి, మిగిలిన అభిమానులకు చేయూపుతాడు.

నాకైతే ఇదంతా ఒక ఫార్సుగా అనిపిస్తుంది. కానీ, ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. కొంత మంది యువ హీరోలు టైముకే వచ్చి కూర్చుంటున్నారు.

కానీ, ఈ రోజు ‘హీరో’ సంజయ్ లేడు, రాడు కాబట్టి ఏడింటికల్లా ఫంక్షన్ ప్రారంభమయింది. ప్రేక్షకుల్లో ఉన్న సంజయ్ అభిమానులు మాత్రం ఆందోళనగా ‘సంజయ్’; ‘సంజయన్న రావాలి’ అని అరుస్తున్నారు. వారిని ఆర్గనైజర్‌లు సమాధాన పరచడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇంతలో, శ్రీవిక్రమ్ గారు మైకు తీసుకుని,

“మిత్రులారా! సంజయ్ బాబు అభిమానులందరికీ నాదొక విన్నపం! మీరందరూ సైలెంట్‌గా ఉంటే నేను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతాను. మన సంజయ్ బాబు గురించే.” అనగానే ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యంగా చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. వెంటనే శ్రీవిక్రమ్,

“థ్యాంక్యూ! మీ అందరికీ తెలుసు మన సంజయ్ బాబు కిడ్నాపైన సంగతి. కానీ, మన సినిమాలో అప్పటికే రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ మిగిలిపోయి ఉంది. సంజయ్ బాబు త్వరలోనే తిరిగి వస్తాడని మీలాగే మేమూ ఆశించాము. మన దురదృష్టం కొద్దీ ఆయన ఆచూకీ దొరకలేదు. సంజయ్ బాబు తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. మనం కూడా బాధపడ్డా కానీ, వారిది వేరే దుఃఖం. పుత్రశోకం. మనది మన అభిమాన నటుడు కనిపించకుండా పోయాడన్న బాధ మాత్రమే.

ఇక్కడొక విషయం చెప్పాలి. అంత దుఃఖంలో ఉన్న వాళ్ళు కూడా సంజయ్ బాబుకు ఎంతో ఇష్టమైన ఈ సినిమా విజయం గురించే ఆలోచించారు.

మనం ఈ సినిమాలో ఇంత వరకు టాలీవుడ్‌లో ఎవరూ చేయని ప్రయోగం చేసాము. సంజయ్ బాబు చేయకుండా మిగిలిపోయిన రెండు పాటలను మరో హీరోని పెట్టి షూట్ చేసాము. సంజయ్ బాబు అభిమానులుగా మీ అందరికీ ఒక ఛాలెంజ్. సంజయ్ బాబు స్థానంలో నటించిన హీరోను కొన్ని క్షణాల్లో మీ ముందుకు తీసుకు రాబోతున్నాము. కానీ, అతను ఏ పాటల్లో వుంటాడో మీరు కనుక్కుని, ముందుగా మా వెబ్‌సైట్‌కు మెసేజ్ చేసిన వెయ్యి మందికి మన కొత్త హీరోతో షీల్డులు ఇప్పిస్తాము. మన సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది కాబట్టి, శుక్రవారం అర్థరాత్రి వరకు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చును. అలాగే, అటు తర్వాత కూడా ప్రతీ రోజు ఒక ఛాలెంజ్ ఇస్తాము. విన్నర్స్ అందరితో కలిసి ఒక ఫంక్షను చేసుకుందాం. ఏమంటారు ఫ్యాన్స్?” అని గట్టిగా అరిచారు. వెంటనే ఆ ‘క్యూ’ ని గమనించి, గట్టిగా, హోరెత్తించే సినిమా పాట మొదలయింది. ఫ్యాన్స్ ఈ ఛాలెంజ్ అన్న మాటకు బాగా కనెక్ట్ అయ్యి, పిచ్చిగా గంతులేస్తూ, రచ్చరచ్చ చేసారు. ప్రీ రిలీజ్ ఈవెంటుకు కావలసిన హంగామానే అది.

ఒక ఐదు నిముషాల పాటు వాళ్ళను అరవనిచ్చిన తర్వాత, శ్రీవిక్రమ్,

“మీకు ఆ కొత్త హీరోను పరిచయం చేస్తానన్నాను కదా? కానీ, అంతకు ముందు ఆ సినిమాలో నటించబోయే కొత్త హీరోయిన్‌ని పరిచయం చేస్తాను. ప్లీజ్ వెల్‌కం వసుధా పాటిల్!” అంటూ చప్పట్లు కొడుతూ, స్టేజి మీద డ్యాన్సు చేస్తూ, వసుధను డయాస్ మీదకు రమ్మని సైగ చేసాడు. వసుధకి మూర్ఛ వచ్చినంత పనయింది. విభ్రమంగా చూస్తూ, నాతో,

“నన్నెందుకు పిలుస్తున్నారు? నేను హీరోయిన్ ఏమిటి? నన్ను అడగవలసిన పనే లేదా? వాటీజ్ దిస్ నాన్సెన్స్?” అని కోపంగా అన్నది.

ఇంతలో “రావాలి, రావాలి, కొత్త హీరోయిన్ రావాలి. వసుధ రావాలి!” అని ఆడియన్సులో ఉన్న శ్రీవిక్రమ్ మనుషులు అరవడంతో మిగిలిన ప్రేక్షకులు కూడా పిలవడం మొదలు పెట్టారు.

ఫ్యాన్స్ అంతా టీనేజ్, ఇరవై ఇరవై ఐదేళ్ళు దాటని యువతీ యువకులే. వారికి జీవితంలో థ్రిల్ కావాలి. సినిమా ఫంక్షన్లు ఇచ్చేంత థ్రిల్ మరే సంఘటన వల్ల కూడా రాదు. అందుకే రెండు రాష్ట్రాల నలుమూలల నుండి నానా తంటాలు పడి, తల్లిదండ్రులను పీడించి డబ్బులు వసూలు చేసుకుని, తాము ఇష్టదైవంగా భావించే తమ అభిమాన హీరోను, హీరోయిన్లను, మిగిలిన నటీనటులను చూడడానికి ఉదయం నుంచే ఫంక్షను జరిగే హాలు ముందర పడిగాపులు కాస్తుంటారు.

అక్కడి వాతావరణమంతా ఒక మాస్ ఫోబియాతో నిండి ఉంటుంది. అందుకే, నిర్మాత తరఫు మనుషులు ఆడియన్సులో ఉండి ఆర్గనైజర్ల సూచనల మేరకు, సభలో హైప్ క్రియేట్ చేస్తుంటారు. ఒకరు అరవగానే పది మంది అరుస్తారు. పది మందిని చూసి వంద మంది, వారిని చూసి హాలంతా అరుపులు కేకలతో దద్దరిల్లి పోతుంది.

ఈ కోలాహలాన్నంతా మొదటిసారి చూసిన వసుధ కంగారుగా నా వంక చూసింది. వసుధ తటపటాయిస్తుండడంతో, పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీవిక్రమ్,

“కొత్త హీరోయిన్ వసుధా పాటిల్‌ను స్టేజ్ మీదకు తీసుకు రావలసిందిగా కొత్త హీరో సమీర్ చటోపాధ్యాయను రిక్వెస్ట్ చేస్తున్నాను.” అని అనౌన్స్ చేసి నన్ను కూడా ఇరికించాడు. మా ఇద్దరి పేర్లకు ఏవో తోకలు తగిలించాడు కూడా. అదంతా పబ్లిసిటీ స్టంట్ అని నాకు తెలుసు.

అసలైతే, ఆర్గనైజర్లు హీరోనే సభాస్థలి మీదకు ఆహ్వానించాలి. కానీ నేను కొత్తవాణ్ణి కాబట్టి నన్నే వసుధను తీసుకు రమ్మని ప్రకటించి, నా వైపు తిరిగి ‘ప్లీజ్ ప్లీజ్’ అంటూ పెదవులు కదిలించిన శ్రీవిక్రమ్‌ని చూసి నాకు ఒళ్ళు మండిపోయింది. కానీ, ఇక్కడ అనుచితంగా ప్రవర్తించడం సమంజసం కాదు కాబట్టి, విస్తుపోయి చూస్తున్న వసుధకి నా చేయి అందించాను. వసుధ నా చేతిని విసిరి కొట్టి,

“ఇదంతా నీకు ముందే తెలుసు కదూ? నన్ను అడగకుండానే ఇంత మంది ముందు నా పేరు అనౌన్స్ చేసింది నన్ను అవమానపరచడానికే కదా?” అని కళ్ళ నుండి విస్ఫులింగాలను కురిపిస్తూ అడిగింది.

నేను నిజంగానే భయపడిపోయాను. ఇదంతా రసాభాస అయేటట్టుందని గ్రహించి అక్కడి నుంచి పారిపోదామా అని దిక్కులు చూస్తుండగా, నా చేతిని వసుధ గట్టిగా పట్టుకుంది. తనకు తప్పలేదు కాబట్టి, నాకూ తప్పేటట్టు లేదనుకుని స్టేజి మీదకు నడిచాము.

మా ఇద్దరినీ చూసి ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు కేరింతలతో స్వాగతం పలికారు. అప్పటి వరకు ఆగ్రహోదగ్రురాలై ఉన్న వసుధ అంత మంది ముందు చిరునవ్వుతో నిలబడి, సీజన్డ్ యాక్ట్రెస్ లాగా, అంటే, ఎంతో అనుభవజ్ఞురాలైన నటిలాగా స్టేజంతా కలియ తిరుగుతూ, అందరికీ వందనం చేస్తూ, అందరి మన్ననలు పొందింది. నేను నిలబడి ఉన్న చోటు నుండే అందరికీ ‘హాయ్’ చెప్పాను.

తర్వాత నన్నూ, వసుధనూ ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకూ, మీడియాకు పరిచయం చేస్తూ,

“నేను మన హీరోయిన్ వసుధా పాటిల్‌ను సంజయ్ బాబు ఇంట్లో ఒకే ఒక్కసారి చూసాను. అప్పుడే, నా కళ్ళ ముందు టాలీవుడ్‌ను ఏలబోయే ఒక అప్సరస మెరిసింది. నేను సంజయ్ బాబు నాన్నగారిని, వారు నిర్మించబోయే సినిమాలో హీరోయిన్‌గా వసుధా పాటిల్‌నే పెడదామని, అడిగాను. వారు ఆలోచించి చెబుతామన్నారు. ఒక గంట క్రితమే ఆమె నటించడానికి వారు ఒప్పుకున్నారు. ఈ విషయం వసుధ గారికీ, సమీర్ బాబుకి కూడా తెలియదు. మీ ఇద్దరికీ సంజయ్ బాబు సినిమా ప్రీ రిలీజ్ జరుగుతున్న ఈ వేదిక మీదనే ఈ విషయం చెప్పాలని అనుకున్నాను. మీకు ఇబ్బంది కలిగిస్తే మన్నించండి మేడమ్!” అని వసుధ వైపు తిరిగి అన్నాడు శ్రీవిక్రమ్. అందుకు, వసుధ, శ్రీవిక్రమ్‌ను గట్టిగా హగ్ చేసుకుని,

“అయ్యో అదేం లేదు సార్! నేను చిన్నప్పటి నుండీ మీ అభిమానిని. మిమ్మల్ని జీవితంలో ఒకసారి చూస్తే చాలుననుకునే దాన్ని. అటువంటిది మీరు నన్ను హీరోయిన్‌ను చేస్తానంటే అది నా పూర్వజన్మ సుకృతమే కదా సార్! మీకు నేను అన్ని విధాలా సహకరిస్తాను. నా లాంటి అనుభవం లేని సాధారణ యువతిని మీరు అద్భుతమైన కళాకారిణిగా తీర్చిదిద్దుతారని నా నమ్మకం సార్! మీకేమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను సార్?” అని మరొకసారి కౌగలించుకుంది.

‘రెండు సార్లు కౌగిలించుకున్నావు కదా? ఋణం బాగానే తీర్చుకున్నావు గదా?’ అని నేను మనసులోనే అనుకున్నాను.

ఎంతో అమాయకంగా ఉండే, సినిమాలంటే పట్టనట్టు ఉండే, నేను సినిమాలల్లో నటిస్తున్నానంటే నేను, ఏ హీరోయిన్ వ్యామోహంలోనో పడి తనను మరిచిపోతానని ఏడ్చి గొడవ చేసిన వసుధ, ఒక్కసారిగా దేదీప్యమానమైన రంగుల జిలుగు వెలుగులలో, తన అసలు రంగు చూపించింది. అసలు తను సంజయ్ ఇంట్లో చేరింది కూడా ఇటువంటి అవకాశం కోసమేనేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.

తర్వాత నేను కూడా శ్రీవిక్రమ్ గారికి, సుధాకర్ నాయుడిగారికి ధన్యవాదాలు తెలిపి,

“అసలు ఈ నా కొత్త సినిమాను నా మిత్రుడు సంజయే నిర్మిస్తాననీ, తనే క్లాప్ కొడతానని నాకు ప్రామిస్ చేసాడు. వాడు లేని సందర్భంలో ఈ సినిమా చేయడం నాకు ఇష్టం లేదు. నాడు నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో వాడు ఉండవలసిన స్థానంలో నేను నిలబడడం నా గుండెను కోసేస్తుంది..” అనబోతున్న తర్వాత మాటలు తడబడ్డాయి. కన్నీళ్ళు పొంగుకొచ్చాయి.

“కానీ, సంజయ్ తండ్రి గారైన సుధాకర్ నాయుడి గారి ఆదేశాలను పాటించే, ఈ రోజు ఈ ఫంక్షన్‌కు వచ్చాను. మా కొత్త సినిమా ‘నాదొక ఆకాశం’ పది రోజుల తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని షూటింగ్ ప్రారంభించబడుతుంది. కానీ, నా మిత్రుడు వచ్చి నా సినిమాకు క్లాప్ కొడితేనే తన ప్రామిస్ నిలుపుకున్నట్టుగా నేను భావిస్తాను. సంజూ! ప్లీజ్ కమ్ బ్యాక్ రా! లైఫ్ ఈజ్ మిజరబుల్ వితౌట్ యూ!” అని నా ఉపన్యాసం ముగిస్తుండగానే,

“పది రోజుల తర్వాతే రావాలా? ఇప్పుడైనా రావొచ్చా?” అని ప్రేక్షకుల నుండి ఒక గొంతు వినిపించింది.

***

అంత గందరగోళంలోనూ నేను ఆ గొంతు గుర్తు పట్టాను. పదిరోజుల తర్వాత జరిగే నా సినిమా ముహుర్తం టైముకు సంజయ్ తప్పక రావాలని, వచ్చి క్లాప్ కొట్టాలని అన్న నా మాటలకు బదులుగా, సంజయే ఆ మాటలు అన్నాడని నాకు తప్ప ప్రేక్షకులకు అర్థం కాలేదు.

నేను, “సంజయ్ వచ్చాడు. ఇక్కడే ఉన్నాడు.” అని స్టేజ్ దిగబోతుంటే,

“ఏయ్ నీకు పిచ్చా? సంజయ్ ఇక్కడే ఉంటే స్టేజీ మీదకు వచ్చేవాడు కాదా?” అంటూ నా చేయి పట్టుకుని వసుధ నన్ను ఆపేందుకు ప్రయత్నించినా నేను వసుధ చేతిని విదిల్చి, వెంటనే ఆ మాటలు వచ్చిన దిక్కుగా రివ్వున పరిగెత్తి,

“సంజూ! సంజూ!” అంటూ అక్కడ కూర్చున్న వారిలో వెతుకుతుంటే, ప్రేక్షకుల్లో గందరగోళం చెలరేగింది.

“సంజయ్, సంజయ్” అని ప్రేక్షకులూ అరవసాగారు. చివరి బెంచీ మీద శాలువా కప్పుకుని ఉన్న ఒక వ్యక్తి దగ్గర నేను నిలబడి,

“సంజూ!” అంటూ శాలువా లాగి పారేసాను. బెంచీ మీద నా మిత్రుడూ, నా ప్రియ బాంధవుడూ అయిన సంజయ్ కూర్చుని ఉన్నాడు.

అప్పటికే నన్ను అనుసరించి వచ్చిన కెమెరాలు ఆవురావురుమంటూ సంజయ్‌ని షూట్ చేయసాగాయి. సంజయ్ చుట్టూ ఉన్న ఫ్యాన్స్ సంజయ్‌ని దగ్గర నుండి చూడాలనీ, అతనిని ముట్టుకోవాలనీ ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ సంజయ్ వెంట ఉండే బౌన్సర్లు చటుక్కున వచ్చి సంజయ్ చుట్టూ రక్షణ కవచంగా నిలబడ్డారు. సంజయ్ లేచి నిలబడ్డాడు.

సంజయ్ వేసుకున్న బట్టల మీద నా దృష్టి పడింది. అవి అచ్చం అప్పుడు నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ లాగానే ఉన్నాయి. నా భృకుటి ముడిపడింది. కానీ, అది సందేహాలకు సమయం కాదని, సంబరాల హేలకు ప్రాధాన్యమని గ్రహించి, నేనే స్వయంగా స్టేజీ మీదకు తీసుకు వస్తుంటే, సంభ్రమాశ్చర్యాల నుండి తేరుకున్న నిర్మాత, శ్రీవిక్రమ్ పరుగుపరుగున వచ్చి సంజయ్‌కి నమస్కరించి, స్టేజ్ మీదకు వస్తుంటే సంజయ్ మధ్యలోనే ఆగి తన అభిమానులందరికీ వందనం చేసి మైకు అడిగి తీసుకుని,

“నా శ్రేయోభిలాషులందరూ క్షేమమేనా?” అని, ‘త్రిపుల్ యస్’ సినిమాలో అప్పటికే బాగా పాపులరైన డైలాగ్ ఒకదాన్ని ఒక రకమైన యాసలో పలకడంతో, బాగా పాపులరైన ఆ డైలాగును అప్పటికే బాగా బట్టీ పట్టిన ప్రేక్షకుల కేకలతో హాలంతా హోరెత్తిపోయింది.

ఆ కేకలు తగ్గిన తర్వాత, సంజయ్ మైకులో,

“అమ్మా నాన్నా! లోపలికి రండి!” అని పిలిచాడు.

రెండు నిముషాల్లో సుధాకర్ నాయుడుగారు, సుధారాణి గారితో కలిసి లోపలికి రాగానే, వారిని ముందు వరుసలో కూర్చోబెట్టి, తను వేదిక మీదకు నడిచాడు.

అప్పటి వరకు స్టేజి మీద దేదీప్యమానంగా వెలిగిన వసుధ ఒక్కతే, డిమ్ వెలుతురులో, చీకట్లో నిలబడి ఉంది. సంజయ్ స్టేజి మీదకు వస్తుండడంతో, యాంకర్ రమ అతనికి ఘనంగా స్వాగతం పలుకుతూ, వసుధను స్టేజి దిగిపొమ్మని సూచించింది. వసుధ ముఖం నల్లబడిపోయింది. నా మనసులోని దుఃఖ మేఘాలన్నీ తీరం దాటి భారీ వర్షంగా కురవక ముందే వేరే దేశ దిశగా దారి మళ్ళడంతో, అప్పటి వరకు దిగులుగా ఉన్న నేను, ద్విగుణీకృత ఉత్సాహంతో, తీన్మార్ స్టెప్పులు వేస్తూ స్టేజి మీద “జంగల్ సే ఆయా మేరా దోస్త్” అని అరుస్తూ, “సంజయ్, సంజయ్” అని పాడుతుంటే, యాంకర్ రమ నాకు మైకు అందించింది. నేను రెట్టించిన ఉత్సాహంతో పాడుతూ, డాన్స్ చేస్తుంటే, హాల్లో ఉన్న ప్రేక్షకులు కూడా నాతో గొంతూ, కాలూ కదిపారు. అది డ్యాన్స్ కూడా కాదు. పిచ్చి ఆనందంలో వేసే గంతులు. పది నిముషాలు ఎగిరి ఎగిరి అలసిపోయి, నేను మైకులో,

“ఈ రోజు నా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు. నా సంజయ్ వచ్చాడు. ఆ భగవంతుణ్ణి ఇంకే కోరిక కోరను. థ్యాంక్ గాడ్!” అంటూ చేతులెత్తి కనపడని దేవుడికి దండం పెట్టి కనపడే దేవుడు సంజయ్ కాళ్ళ ముందు కూర్చుని తనివితీరా ఏడ్చాను.

సంజయ్, “ఏయ్ సమీర్! నీకేమైనా పిచ్చా? లేరా! నేనొచ్చాను కదా? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం! లెటజ్ ఫినిష్ దిస్ ప్రోగ్రాం!” అంటూ నన్ను లేపి కౌగలించుకున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here