నాదొక ఆకాశం-14

0
11

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[సంజయ్ రాకతో ‘త్రిపుల్ ఎస్’ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అద్భుతంగా సాగుతుంది. సంజయ్ సభని గొప్పగా నిర్వహిస్తాడు. దాదాపు రెండున్నర నెలల తరువాత సంజయ్ లైవ్‍లో ప్రత్యక్షం అవడం వల్ల టివీల్లో చూస్తున్నవారు కూడా ఉద్విగ్నతకు గురవుతారు. చివరగా సంజయ్ అందరికీ ధన్యవాదాలు చెప్పి, నేను క్షేమంగా మీ ముందు నిలబడడానికి కారణం ఎవరో తెలుసా అని ప్రేక్షకులని అడుగుతాడు. వాళ్ళు ఏవేవో జవాబులు చెప్తారు. ఐదు నిమిషాల తరువాత వాళ్ళని ఆపమని సైగ చేసి, తన అభిమానులే కారణమంటాడు. దాంతో అప్పటి వరకు నిశ్శబ్ద సముద్రంపై ఉన్న అభిమానులు ఉరకలేసే సముద్రపు అలల్లా కేరింతలు కొడతారు. కొందరు ఏడుస్తారు. కొందరు నవ్వుతారు. కొందరు తీన్మార్ డాన్సులు చేస్తారు. ఫంక్షన్ కోలాహలంగా మారిపోతుంది. సంజయ్ సమీర్‍తో కలిసి స్టెప్స్ వేస్తాడు. కాసేపయ్యాక, – సమీర్ గురించి చేసిన ప్రకటన, ఛాలెంజ్ యథాతథంగా ఉంటుందని చెప్పి, శుక్రవారం నాడు థియేటర్ల దగ్గర కలుసుకుందాం! అని అందరికి బై  చెప్పి వేదిక దిగుతాడు సంజయ్. ఇంటికి వచ్చాకా సంధ్యారాణి కొడుకుకి దిష్టి తీయించి, హారతితో స్వాగతం పలుకుతుంది. కాసేపు అమ్మానాన్నలతో మాట్లాడి, సమీర్‍ని వెంటబెట్టుకుని తన గదిలి వెళ్తాడు సంజయ్. చెప్పాల్సింది ఉంటే తనే చెప్తాడని సమీర్ ఏమీ అడగడు. కాసేపయ్యాక నిద్ర వస్తోందని సంజయ్ అంటే, సమీర్ తన గదికి బయల్దేరుతాడు. వెళ్తుంటే వసుధ గదిని ఇద్దరు పనిమనుషులు శుభ్రం చేస్తూ కనబడతారు. వాళ్ళని అడిగితే, తమకేమీ తెలియదని అమ్మగారిని అడగమని చెప్తారు. మర్నాడు పోలీస్ కమీషనర్ పుష్పా కిరణ్ సంజయ్ ఇంటికి వస్తారు. అందరూ సర్దుకుని కూర్చున్నాకా, వాళ్ళ టెక్నికల్ స్టాప్ రికార్డింగ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతారు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కమీషనర్ అందరికీ సూచనలిస్తారు. మొదటగా సంజయ్‍ని మాట్లాడమంటారావిడ. తను శ్రీశైలంలోని ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుంచి ఏం జరిగిందో సంజయ్ చెప్తాడు. సంజయ్ మాట్లాడిన తరువాత వాళ్ళమ్మ మరికొన్ని వివరాలు చెబుతుంది. – ఇక చదవండి.]

[dropcap]“గ[/dropcap]మ్మత్తుగా అంత వరకు నన్ను సరిగ్గా నిలబడనీయని మోకాళ్ళ నొప్పుల విషయమే మరిచిపోయి చకచకా నా గదికి వెళ్ళి పడుకున్నాను. వసుధ నా గదిలో లేకపోవడంతో నేను ‘హమ్మయ్య’ అని నిట్టూర్చాను. నాకు మామూలుగానే చికిత్స కొనసాగింది. రెండు గంటల తర్వాత వసుధ కూడా వచ్చింది. నేను తనను తీక్షణంగా చూస్తూ,

“ఎక్కడికెళ్ళావే? రోగిష్టి మనిషిని చూసుకోకుండా వదిలి మూడు గంటల పాటు ఎక్కడ తిరుగుతున్నావు? కనీసం ఎటు వెళ్తున్నావో కూడా చెప్పకుండా వెళ్ళిపోయావ్?” అని దబాయించాను, ఏం జరగనట్టుగా. దానికి వసుధ నీళ్ళు నములుతూ,

“మా బంధువులు వచ్చారంటే మల్లన్న గుడి వరకు వెళ్ళి వచ్చాను.” అని అంటూ నసిగింది. అప్పుడే నాకేదో అనుమానం వచ్చింది.

తర్వాత బాబుని సిద్ధేంద్ర స్వామి మఠంలో వదిలిన గురూజీ తిరిగి వచ్చారు. ఆయన కుటీరంలోకి నన్ను పిలిచారు. అక్కడ కాషాయ దుస్తుల్లో మరొక వ్యక్తి గురూజీ ముందు నేల మీద కూర్చుని ఉన్నాడు. అతను నన్ను చూడగానే లేచి నిలబడి,

“అమ్మా! సమీర్ నుండి ఉత్తరం వచ్చింది.” అన్నాడు. నేను విచారంగా,

“ఏమిటి నాయనా! ఏం జరుగుతుంది. ఒక్క నిముషం ఉండు. గురూజీ.. బాబు..” అని గురూజీ వంక చూసాను.

“అమ్మా! మీరేం భయపడాల్సిన పనేం లేదు. బాబు క్షేమంగా ఉన్నాడు. మా స్వామీజీ అభయంతో ప్రాణ భయం తప్పింది. కానీ, విష ప్రభావాన్ని అంచనా వేసి దానికి తగిన వైద్యం చేయడానికి కొంత సమయం పడుతుంది.” అన్నారు.

సెక్యూరిటీ ఆఫీసర్, “సుమారు ఎన్ని రోజులు పట్టొచ్చు గురూజీ” అని ప్రశ్నించాడు.

“బాబూ! అసలు అతని మీద ప్రయోగించిన విషమేమిటో కూడా మాకు తెలియలేదు. నా వల్ల కాకపోతేనే మా సిద్ధేంద్ర స్వామీజీ దగ్గరకు తీసుకు వెళ్ళాము. తక్షణ చర్యగా, శరీరం నుండి విషాన్ని తొలగించగలిగాము. ముందుగా ఆ విష పదార్థ లక్షణాలను తెలుసుకుని పరిశోధించి దానికి ఖచ్చితమైన విరుగుడును తయారు చేయాలి. తొందర పడితే లాభం లేదు. కనీసం వారం పది రోజులైనా అక్కడే ఉండక తప్పదు. రెండు రోజులైతే గానీ ఏ విషయమూ చెప్పలేము.” అన్నారు.

దానికి, సెక్యూరిటీ అధికారి తల పంకించి,

“గురూజీ! సంజయ్ సార్ వంటి సెలబ్రిటీ ఒక్క రోజు కనిపించక పోతేనే అనుమానాలు వస్తాయి. పోనీ సంజయ్ బాబు మీద విషప్రయోగం జరిగిందని ప్రకటిస్తే, అసలు దోషులు అప్రమత్తమవుతారు. నిజానికి, సంజయ్ బాబు మీద విషప్రయోగం జరగడంలో, మా ప్రాథమిక విచారణలో కొంతమంది సొంత మనుషుల ప్రమేయం ఉందని తేలింది. మనం అలర్ట్ అయినట్టు వాళ్ళకు తెలియకుండా ఈ విషయాన్ని బయటపెట్టాలి. ఎలా చేయాలో అర్థం కావడం లేదు.” అని ఆలోచనలో పడ్డాడు.

అతను సొంత మనుషుల ప్రమేయంతోనే జరిగిందనడంతో నా గుండె గతుక్కుమంది. మా ఇంట్లో నా కొడుకు ప్రాణం తీసే నరరూప రాక్షసులున్నారా అని నా ప్రాణం విలవిలలాడింది. అందుకే,

“మా సొంత మనుషులా? అంటే ఎవరని మీ ఉద్దేశం?” అని కోపంగా అడిగాను. దానికి ఆ సెక్యూరిటీ ఆఫీసర్,

“అమ్మా! మీకు కోపం రావడం, బాధ కలగడం సహజమే. కానీ, మీరే ఆలోచించి చూడండి. మీ రాక అత్యంత రహస్యంగా జరిగింది. మీరు మా సెక్యూరిటీని విత్‌డ్రా చేసినప్పుడే, ముందుగా అనుకున్న ప్రకారమే సంజయ్ బాబు ఈ ఆశ్రమానికి వస్తున్నారని మాకర్థమయింది. మా యాన్యువల్ కాంట్రాక్ట్ ప్రకారం రోజుకి 24 గంటలూ, సంవత్సరానికి 365 రోజులూ సంజయ్ బాబుని కాపాడవలసిన బాధ్యత మా పై ఉంది కాబట్టి, మా హెడ్డాఫీసు, ఇక్కడి నెట్ వర్కు ఇంఛార్జినయిన  నాకీ బాధ్యత నిన్ననే అప్పగించింది. బై ది బై నా పేరు హరినాథ్! నేను నిన్నటి నుంచే ఈ ఆశ్రమంపై ఒక కన్ను వేసి ఉంచాను. వివరాలు చెప్పకుండా మావాళ్ళను హై అలర్టులో ఉంచాము. అత్యంత గోప్యంగా మేమంతా కాపలా కాస్తున్నాము..” అని హరినాథ్ అంటుండగానే నా గుండె దడదడలాడింది.

‘వసుధ మూడు గంటల పాటు చెప్పకుండా బయటకు వెళ్ళిందని నేను చెప్పాలా వద్దా?’ అని సంశయిస్తుండగానే, అతను,

“అమ్మా! సంజయ్ బాబు పైన విషప్రయోగం చేసి పారిపోతున్న దుండగుణ్ణి మా వాళ్ళు పట్టుకున్నారు. వాడు, టోనీ, హైదరాబాదులో ఒక ప్రొఫెషనల్ కిల్లర్. యాభై లక్షలకు వాడికి సుపారీ ఇచ్చారు. ఆయుర్వేద ఆశ్రమంలో విషప్రయోగం జరగాలి కాబట్టి విషపు మూలికలతోనే అత్యంత ప్రమాదకరమైన విషాన్ని తయారుచేసారు. దాని వల్ల, భవిష్యత్తులో ఏదైనా ఎంక్వైరీ జరిగినా, సంజయ్ బాబు పైన వాడిన ఆయుర్వేద మందులు వికటించి మరణించాడని అందరూ అనుకోవాలని, పకడ్బందీగా ప్లాన్ వేసారు. కానీ, ఈ మరణ మృదంగపు ప్రణాళికకు పూర్తిగా సహకరించింది, మీతో పాటు ఉండే వసుధనే!” అనే సరికి నేను మ్రాన్పడిపోయాను. గురూజీ కూడా నోరు వెళ్ళబెట్టారు.

“వసుధ ఈ రోజు పదకొండు నుండి రెండున్నర వరకు ఆశ్రమంలో లేదు. తను ఆశ్రమం బయటకు అడుగు పెట్టగానే, మా వాళ్ళు ఆమెను అనుసరించారు. వసుధ, టోనీని కలిసి ఆశ్రమంలో రహస్యంగా ఉన్న సంజయ్ బాబు గది ప్లానూ, ఆశ్రమంలోని సేవకులు వేసుకునే యూనిఫాం అతనికి ఇచ్చింది. టోనీ సైకిల్ మోటారు మీద ఆశ్రమం వరకు వచ్చి, ఆశ్రమం లోపలికి ప్రవేశించి మరింత జాగ్రత్త కోసం టోపీ పెట్టుకుని, సంజయ్ బాబు గది నుండి మసాజ్ చేసిన వాలంటీర్ బయటకు వచ్చిన పది నిముషాల తరువాత లోపలికి వెళ్ళి, వాలంటీర్ మాదిరిగానే కొంత సేపు మసాజ్ చేసి, మత్తులో ఉన్న సంజయ్ బాబు నోరు తెరిచి విషపు మాత్ర వేసాడు. మా వాళ్ళు జరుగుతున్న విషయాన్ని కేవలం గమనించారే కానీ, ఆపే ప్రయత్నం చేయలేదు. అందుకు కారణం, ఎట్టి పరిస్థితుల్లోనూ మా సెక్యూరిటీ కంపెనీ ఉద్యోగులు ఆశ్రమంలోకి ప్రవేశించకూడదనే హెడ్డాఫీసు ఉత్తర్వులే. అయినా సరే, ప్రమాదం గమనించిన మా వాళ్ళు పరిగెత్తే సరికే, జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇది మా పొరపాటే. మా ఏజెన్సీ తరఫున మేము క్షమార్పణ కోరుతున్నాము. ఈ తప్పుకు పరిహారంగా ఈ సంవత్సరం మీరు చెల్లించవలసిన కోటి రూపాయల మెయింటెనెన్స్ ఫీజు మాఫీ చేస్తున్నాము.. ” అనేసరికి నా కోపం నసాళానికి ఎత్తుంది. నేను లేచి నిలబడి అతని చెంపలు రెండు వాయించి,

“బ్లడీ ఫూల్! నువ్వు ఫీజు మాఫీ చేస్తే మా బాబు బ్రతికొస్తాడా? సిగ్గు లేకుండా ఫీజు గురించి మాట్లాడుతున్నావు. టోనీ గాడు ప్రొఫెషనల్ కిల్లర్ అనీ, వసుధ వాణ్ణి కలిసి వివరాలు చెప్పి, డ్రస్సు ఇచ్చిందని తెలిసి కూడా మీరు వాణ్ణి ఎందుకు ఆపలేదు? వాడు చేయాల్సిన ఘాతుకం చేసిన తర్వాత మీ సెక్యూరిటీ ఎందుకు?  మీరెందుకు?” అని తల కొట్టుకున్నాను.

హరినాథ్ తల వంచుకుని నిలబడ్డాడు. ఐదు నిముషాల తర్వాత తలెత్తి,

“అమ్మా! మేము ఏ నిర్ణయమూ స్వయంగా తీసుకోలేను. సంజయ్ బాబు వంద శాతం కాన్ఫిడెన్షియాల్టీ కావాలని కోరారు. మేము టోనీని ఫాలో అయ్యి ఆశ్రమంలోకి ప్రవేశిస్తే, ఒకవేళ వాడు ఏమీ చేయకుండా కేవలం రెక్కీ చేసి వెళ్ళిపోతే, మేము లోపలికి వచ్చిన విషయం సంజయ్ బాబుకు తెలిస్తే.. ఇవన్నీ ప్రశ్నలే మేడమ్! అయినా మా వాళ్ళు కొందరు టోనీని వెంటాడితే, మాలోని మెడికల్ ఎక్స్‌పర్ట్ టీము సంజయ్ బాబుని పరీక్షించి, లైఫ్ సేవింగ్ మెడిసిన్ ఒకటి వేసారు. మీకెవ్వరికీ ఆ విషయం తెలియదు. అది విదేశాల నుండి తెప్పించిన మోస్ట్ పవర్‌ఫుల్ యాంటీ వెనమ్ డ్రగ్. మావాళ్ళే ఎమర్జెన్సీ అలారం మోగించి, మీరొచ్చే లోపల బయటపడ్డారు. అయినా మాది క్షమించరాని తప్పిదమే! ఒక్క నిముషం ముందుగా లోపలికి ప్రవేశిస్తే, సంజయ్ బాబు మీద ఈ అఘాయిత్యం జరగకుండా ఆపగలిగే వాళ్ళం.

అయినా మేము అదృశ్యంగానే, గివెన్ సర్కమ్‌స్టెన్సెస్‌లో, ఆ పరిస్థితుల్లో చేయగలిగినంత చేసాము. టోనీని పట్టుకున్నాము. వసుధ గురించి మొత్తం ఎంక్వైరీ చేసాము.

వసుధను కూడా మేము అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించడానికి కావలసిన ఆధారాలున్నాయి. మీ నిర్ణయాన్ని బట్టి ముందుకు ప్రొసీడ్ అవుదాము. కానీ, ముందుగా సంజయ్ బాబు ఏమయ్యాడన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో మనం నిర్ణయించుకోవాలి.” అన్నాడు. నాకు అతని మీద కోపం తగ్గలేదు. అతను ఎంత సేపూ కంపెనీ పాలసీ అని చెప్తున్నాడు కానీ, అవతల ప్రాణాలకు ప్రమాదం ఉండబోతుందన్న విషయం మర్చిపోతున్నాడు.

కానీ, కొంత సేపటికి, నేను శాంతించి, మా వారికి ఫోన్ చేసాను.” అని సుధారాణి గారు చెప్పడం ముగించారు.

ఆమె చెప్పిన విషయాలను విన్న నా సీటు క్రింద బాంబు వేసినంత పనయ్యింది. నేను వాళ్ళందరి ముఖాల్లోకి తీక్షణంగా చూసాను. ఇంత తతంగం జరిగినా నాకు చిన్న వివరం కూడా తెలియకుండా బాగా మ్యానేజ్ చేసారు. ఈ విషయాలన్నీ పోలీస్ కమీషనర్ పుష్పా కిరణ్ మేడమ్‌కు కూడా ముందే తెలుసునేమోనని నాకు అనుమానమొచ్చింది.

మేడమ్, సుధాకర్ నాయుడు గారి వైపు, ‘ఇక మీ వంతు’  అన్నట్టుగా చూసింది.

సుధాకర్ నాయుడు గారు గొంతు సవరించుకున్నారు.

***

“మేడమ్! నాకు మా ఆవిడ నుంచి ఫోన్ రాగానే చాలా భయపడ్డాను. కానీ, జరగవలసిన సంఘటన జరిగిపోయింది. సంజయ్ బాబుకు ప్రాణాపాయం తప్పింది. కానీ, బాబు మీద విషప్రయోగం జరిగిన విషయం బయటకు పొక్కితే అభిమానుల్లో ఆందోళన మొదలవుతుంది. అంతే కాకుండా శ్రీశైలం ఎందుకు వెళ్ళాడన్న సంశయం మొదలవుతుంది. దాంతో వాడి అనారోగ్య సమస్య గురించి చర్చ మొదలవుతుంది. అసలే మా ఇండస్ట్రీ మూఢనమ్మకాల పుట్ట. ప్రతీ చిన్న సెంటిమెంటును ఆధారంగా చేసుకుని కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంది. మూర్ఖంగా పేర్లలో అక్షరాలు మార్చుకుంటారు. సంతకాలు మారుస్తారు. ఇళ్ళు మారుతారు. ఇటువంటి ఇండస్ట్రీలో బాబు అనారోగ్యం గురించి తెలియవద్దనే మేము అతి రహస్యంగా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నాము. ఇప్పుడు విషప్రయోగం జరిగిందన్న విషయం తెలిస్తే, వాడి భవిష్యత్తు ఏమౌతుందోననీ, అలాగే వీడి కోసం శ్రీశైలానికి అభిమానులు వెళ్ళి ఇబ్బందుల పాలవుతారేమోనని కొంచెం సేపు ఆలోచించాను. ఎందుకైనా మంచిదని, సంజయ్ అంటే ఎంతో అభిమానం చూపించే,  హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్, శ్రీమతి పుష్పా కిరణ్ గారికి విషయం చెప్పాను. ఆమె రమ్మన్న చోటుకి వెళ్ళి కలిసాను. మొత్తం కుట్రను ఛేదించాలంటే, మనకేం తెలియనట్టే ఉందామని, ప్రస్తుతానికి సంజయ్ కిడ్నాప్ అయ్యాడని డ్రామా ఆడదామని సూచించారు. కానీ, వసుధకి విషయమంతా తెలుసు కదా తనెలా, ఈ కిడ్నాప్ డ్రామాను నమ్ముతుందని నేను ప్రశ్నిస్తే, ‘ఆ టోనీ గాణ్ణి, వాడి మీద ఉన్న చాలా కేసుల్లో ఏదో ఒక దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి నేను పీటీ వారెంట్ మీద హైద్రాబాదుకు తీసుకు వచ్చి, ఇక్కడి నుంచి కథ నడిపిస్తాను. టోనీ, హత్యాయత్నం చేసిన తర్వాత వసుధను కలవలేదు కాబట్టి నిజంగా ఏం జరిగిందో ఆమెకు తెలిసే అవకాశం లేదు. ఈ లోపల వసుధ సంగతేమిటో, దాని వెనుక ఉండి ఆడిస్తున్నదెవరో కూడా కూపీ లాగుదాము. ఓ వారం రోజులేగా, ఈ లోగా సంజయ్ కోలుకుంటాడు కదా?’ అని అన్నారు.

అందుకే మేమందరం, కిడ్నాప్ అని తప్ప మరో మాట మాట్లాడలేదు. కానీ, అప్పటికే సమీర్ వసుధ ప్రేమలో మునిగి ఉన్నాడు కాబట్టి, సమీర్‌కు కూడా రహస్యం పొక్కకూడదని మేడం ఆజ్ఞాపించారు. మేమెంత చెప్పినా కమీషనర్ మేడం సమీర్ నిర్దోషి అని నమ్మలేదు. అందుకే మరునాడు కమీషనర్ ఆఫీసులో వాణ్ణి హింసిస్తుంటే వెళ్ళి మేడమ్‌ను బ్రతిమిలాడి, వాడి ఇన్వాల్వ్‌మెంటు గనుక ఉంటే, మేమే తీసుకొచ్చి అప్పగిస్తామని చెప్పి తీసుకొచ్చాము. వసుధకి మా నాటకం గురించి అనుమానం రాకూడదని, సమీర్, వసుధ మధ్య ప్రణయాన్ని మేమే ప్రోత్సహించాము. ఎందుకంటే, సంజయ్ గురించి ఏ విషయమైనా మాకు తెలిస్తే, సమీర్‌కు తప్పక తెలుస్తుంది, సమీర్ ద్వారా తనకు తెలుస్తుందని వసుధ నమ్మకం. ఆ నమ్మకాన్నే మేము మా అడ్వాంటేజ్ కోసం వాడుకున్నాము. పాపం సమీర్ నిజంగా అమాయకుడే.

కానీ, మేమనుకున్నట్టుగా వారం పది రోజులు కాకుండా, సంజయ్ ట్రీట్‌మెంట్‌కు రెండు నెలలకు పైగా సమయం పట్టింది. విషానికి విరుగుడుతో పాటూ అంతకు ముందు వాడికున్న సమస్యకు కూడా  చికిత్స జరుగుతుండే సరికి లేటయింది.

ఈ లోగా వసుధ గురించి చేసిన ఎంక్వైరీలో చాలా నిజాలు బయటపడ్డాయి. వసుధ అంతకు ముందు పెద్ద పెద్ద దొంగతనాలు చేసే హై క్లాస్ ముఠాకు చెందిన సభ్యురాలనీ తెలిసింది. ఆమె మీద రౌడీ షీట్ కూడా ఉందని తేలడంతో పోలీసుల నిఘా పెంచారు. ఆమె ఫోన్ రికార్డులు, ఆధార్, ప్యాన్ కార్డులనన్నింటిని అబ్జర్వేషనులో పెడితే తేలిందేమిటంటే, సంజయ్ కిడ్నాపుకు నెల రోజుల ముందు నుండే టోనీ గ్యాంగ్ వసుధతో సంప్రదింపులు జరిపిందనీ, వారికి సహకరించినందుకు గాను జూబ్లీహిల్స్‌లో ఒక త్రీ బెడ్ అపార్ట్‌మెంట్‌ను వసుధ దూరపు బంధువు పేరు మీద రిజిస్టర్ చేసారని అర్థమయింది. మా కుమారుడి హత్యకు పన్నాగం పన్నిన విషసర్పం, మా ఇంట్లోనే, నా కళ్ళ ముందు  తిరగడం చూసి నాలో కోపం బుసలు కొట్టేది. దాన్ని కాలి కింద నలిపి పారేయాలన్నంత కసి పుట్టేది. కానీ, టోనీకి సుపారీ ఇచ్చిందీ, వసుధకి ఫ్లాట్ కొనిచ్చి సంజయిని హత్య చేయించడానికి ప్రయత్నించిన అసలు సూత్రధారి ఎవరో తేలేంత వరకు ఓపిక పట్టమని కమీషనర్ మేడం చెప్పడంతో మేం కూడా నటించడం ప్రారంభించాము.

శ్రీవిక్రమ్, సత్యం గారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రమ్మని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు, శ్రీవిక్రమ్ ప్రవర్తన నాకు అనుమానాస్పదంగా తోచింది. చూడగానే, తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తాననడం ఆశ్చర్యం కలిగించింది. అందుకే, నేను ‘మేము ఆలోచించుకుని చెప్తాం’ అని చెప్పాను. సమీర్‌కు వసుధ నిజస్వరూపం తెలియదు కాబట్టి, నేను మా సినిమాలో వసుధను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టుగా సమీర్‌కు చివరి నిముషం వరకు చెప్పొద్దని కూడా శ్రీవిక్రమ్‌కు చెప్పాను.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకు సంజయ్ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది వస్తాడని తెలిసే మేమంతా ఒక ప్రణాళిక ప్రకారం, అక్కడికి వచ్చాము. అంత వరకు వాడు సభలో అజ్ఞాతంగానే ఉండి చివరి క్షణంలో ప్రత్యక్షమయ్యాడు. మాకు సినిమాల కన్నా ప్రపంచంలో మరే విషయం కన్నా మా బాబు క్షేమమే ముఖ్యం. మా వాడి ప్రాణాలను హరించాలన్నంత తప్పు వాడేం చేసాడు మేడమ్!” అంటూ ఎప్పుడూ ధీరగంభీరంగా, బడబాగ్నిని కంఠంలో దాచుకున్న గరళకంఠుడిలా, నిశ్చలంగా, ధైర్యంగా ఉండే సుధాకర్ నాయుడు గారు వలవలా ఏడ్చారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here