నాదొక ఆకాశం-15

0
11

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[సిటీ పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో – సంజయ్ విషయంలో అసలేం జరిగిందనే దానిమీద – సంజయ్ ఇంట్లో రికార్డింగ్ జరుగుతుంది. ముందుగా సంజయ్ మాట్లాడి కొన్ని వివరాలు చెప్తాడు. తరువాత సంధ్యారాణి గారు మాట్లాడుతారు. వసుధ కనిపించకుండా వెళ్ళినరోజు తనకి మామూలుగానే చికిత్స జరిగిందనీ, తర్వాత రెండు గంటల తరువాత వసుధ వస్తే తాను ఆమె మీద అరిచానని చెప్తారు సంధ్యారాణి. బంధువులతో మల్లన్న గుడికి వెళ్ళానని వసుధ చెప్పిందని చెప్తారు. తరువాత సంజయ్‌ని సిద్ధేంద్ర స్వామి మఠంలో వదిలిన గురూజీ తిరిగి ఆశ్రమానికి వచ్చి తనని పిలిచారని. అక్కడ సంజయ్ సెక్యూరిటీ వ్యవహారాలు చూసే కంపెనీ నుంచి హరినాథ్ అనే వక్తి ఉన్నాడనీ, అతను తనని తాను పరిచయం చేసుకుని ఈ కుట్ర ఎలా జరిగిందో వివరించాడని చెప్తారు. సంజయ్‍పై విషప్రయోగం చేసిన టోనీ అనే ప్రొఫెషనల్ కిల్లర్‍కి వసుధ సహాయం చేసిందని హరినాథ్ చెప్పాడని అంటారు సంధ్యారాణి. మీ పని మీరు సరిగా చేయలేదని తాను వాళ్ళతో అన్నాననీ, సంజయ్ వంద శాతం కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలని కోరినందున తాము ముందు జోక్యం చేసుకోలేకపోయామని హరనాథ్ చెప్పాడని చెప్తారామె. కమీషనర్ ఇక సుధాకర్ నాయుడిని చెప్పమంటుంది. ఆయన మాట్లాడుతూ భార్య సంజయ్ మీద విషప్రయోగం జరిగిందని తెలపగానే ముందు చాలా కంగారు పడ్డాననీ, ఈ వార్తలు బయటకు పొక్కితే సంజయ్ కెరీర్‍కు ప్రమాదమని, అందుకే సిటీ పోలీస్ కమీషనర్ పుష్పా కిరణ్ గారిని సంప్రదించానని, ఆమె సూచన మేరకు సంజయ్ కిడ్నాప్ అయ్యాడని అందరికీ చెప్పామని చెప్పారు. ఓ వారం రోజుల్లో వసుధ వెనుక ఎవరున్నదీ తెలుస్తుందనీ, అంత వరకూ జాగ్రత్త పడదామని అన్నారు మేడమ్ అని చెప్తారాయన. సమీర్ వసుధని ప్రేమిస్తున్నాడు కనుక,  ఈ కుట్రలో సమీర్‍కి భాగముందేమోనని పుష్పా కిరణ అనుమానించారనీ, కానీ తాను సమీర్ మీద అనుమానం అక్కర్లేదని అన్నానని చెప్తారాయన. కానీ తాము అనుకున్నట్టుగా సంజయ్ కోలుకోవడానికి రెండు నెలలకు పైనే పట్టిందనీ, ఈ లోపు వసుధ గురించి చేసిన ఎంక్వయిరీలో ఎన్నో నిజాలు బయట పడ్డాయని చెప్తారాయన. తనకి శ్రీవిక్రమ్ ప్రవర్తన మీద అనుమానం వచ్చిందని, అందుకే వసుధని హీరోయిన్‍గా ఎంపిక చేసినట్టు సమీర్‍కి చివరి దాకా చెప్పవద్దని చెప్పామని అంటారు. అప్పటిదాక ఎంతో ధైర్యంగా మాట్లాడిన సుధాకర్ నాయుడు ఒక్కసారిగా నిగ్రహమ్ కోల్పోయి బిగ్గరగా ఏడుస్తారు. – ఇక చదవండి.]

[dropcap]సం[/dropcap]జయ్ లేచి పరుగు పరుగున వచ్చి ఆయనను పట్టుకుని,

“నాన్నా! నాన్నా! నువ్వు ఏడవడమేమిటి నాన్నా! ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్!” అని బ్రతిమిలాడాడు.

టెక్నికల్ ఎక్స్‌పర్ట్ రికార్డింగ్ ఆపాలా అని, అద్దాల గది బయట నుండి సైగ చేస్తుంటే, కమీషనర్ గారు వద్దని చెప్పారు.

రెండు నిమిషాల తరువాత తేరుకున్న, నాయుడుగారు,

“ఏరా! నేను గంభీరంగా ఉన్నంత మాత్రాన నాకు ప్రేమ లేనట్టేనా? నీకు ఇప్పుడు తెలియదు రా! నీ కడుపున ఒక కాయ కాచి, వాడికేదైనా అయితే, దేవుడి దయ వల్ల ఏం కాకూడదు గానీ, నీ గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్టుగా విలవిలలాడిపోతావు. ప్రపంచమంతా నీ కోసం విషాదగీతం ఆలపిస్తున్నంత దుఃఖం ముంచుకొస్తుంది. ఈ రెండున్నర నెలలూ అంత బాధను నేనూ అనుభవించాను. మీ అమ్మయితే, ఏడ్చి తన దుఃఖభారాన్ని దించుకుంది. నాకు ఆ అవకాశం కూడా లేదు. కమీషనర్ మేడమ్ గనుక నన్నాపకపోతే, ఒక కిరాయి సైన్యాన్నే దించి ఈ భూప్రపంచమంతా వెతికైనా సరే, నీ మీద హత్యా ప్రయత్నం చేసిన వాడిని వెతికి పట్టుకుని స్వయంగా నా చేతులతో వాడి పీక పిసికి చంపేసేవాణ్ణి. నువ్వంటే అంత ప్రేమ రా!

కానీ, ఈ లోకం తండ్రిలోని కాఠిన్యాన్నే గుర్తుంచుకుంటుంది గానీ, నాన్న సూర్యుడిలా తనలో తానే భగభగ మండుతుంటాడు. అలా మండడం వల్ల పుట్టే సూర్యకాంతి వల్లనే, సంసారంలో కిరణజన్య సంయోగ క్రియ జరిగి, చెట్టులో ఉండే పత్రహరితం అనే ఆకుపచ్చని అమ్మ, పుష్పించి, ఫలసాయం సృష్టించి పిల్లలకు ఆహారం పెడుతుందని గ్రహించదు.

లోకం  పెట్టే చేయినే చూస్తుంది గానీ, దాని వెనుక ఆధారంగా నిలబడ్డ నాన్న చేయిని చూడదు కద రా నాన్నా?” అన్నారు.

సంజయికే కాదు నాకూ కన్నీళ్ళు తిరిగాయి. కమీషనర్ మేడం కూడా కళ్ళద్దుకున్నారు. సుధాకర్ నాయుడి గారి గుండెల్లో ఇంత బాధ ఉందనీ, ఇంత భావుకతతో తన హృదయ వేదనను వెలిబుచ్చగలరని నేనూహించలేదు లేదు. ఆయన వ్యాపారంలో కొమ్ములు తిరిగిన మొనగాడే అనుకున్నా గానీ, ఆయన మనసులో ఇంత లాలిత్యం, ఇంత సున్నితత్వం ఉండడం నిజంగా నన్ను విస్తుగొల్పింది.

సంజయితో పాటూ నేనూ ఆయన దగ్గరగా నడిచి ఆయన భుజం మీద చేయి వేసాము. నాకు చిన్నప్పటి నుండే నాన్న లేడు కాబట్టి నాకు నాన్న ప్రేమను పొందే అదృష్టం లేదు. నాకు నాయుడిగారిలోనే మా నాన్న కనిపించాడు. మా నాన్న ఉంటే, ఆయన కూడా నా మీద ఇంతే ప్రేమ కురిపించేవాడా? నేను ఆపదలో ఉన్నానని తెలిస్తే ఒక ప్రైవేటు సైన్యాన్నే దించేవాడా? ఏమో.. తాగి తాగి ఎయిడ్స్ వ్యాధితో చచ్చిన వాడి గుండెల్లో కూడా ప్రేమ ఉంటుందా?

చివరికి కమీషనర్ గారు మాట్లాడుతూ,

“నేను హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ పుష్పా కిరణ్, ఐపీయస్. ఇంత వరకు వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి సంజయ్ హత్యకు పెద్ద కుట్రే జరిగింది. పెద్ద మొత్తంలో సుపారీ ఇచ్చారు. టోనీ మా కస్టడీలోనే, జుడిషియల్ రిమాండులో ఉన్నాడు. వసుధ కూడా మా కనుసన్నలలోనే, తన జూబ్లీహిల్స్ ఫ్లాటులో ఉంది. నిన్న రాత్రే తన మకాం అక్కడకు మార్చింది. అసలు దొంగలను, ఈ మొత్తం కుట్రకు సూత్రధారులెవరో, ఇంకా ఎంత మంది పాత్రధారులున్నారో అతి త్వరలోనే తెలుసుకుంటాము. అయితే, ఇప్పటికి కూడా మన మీద వసుధకి అనుమానం రాలేదు. కానీ, సంజయ్ బ్రతికి బట్టకట్టి బయటపడ్డాడు కానీ టోనీ ఏమయ్యాడో తేలకపోవడంతో తన గుట్టు సేఫ్‌గా ఉందని ఆమె అనుకుంటుంది.

ఆమెను అదే భ్రమలో ఉంచి మీరనుకున్నట్టుగా మీ సినిమా షూటింగ్ ప్రారంభిస్తే, వసుధకి మీ మీద మరింత నమ్మకం కలుగుతుంది. తను ఇప్పుడు హీరోయిన్ అయింది కాబట్టి, అంతకు ముందు పనిమనిషిగా పనిచేసిన ఇంట్లో ఉండడం భావ్యం కాదని వసుధ వేరే ఇంట్లో ఉండడమే సమంజసమని, లేకపోతే టాలీవుడ్‌లో పుకార్లు కోడై కూస్తాయని చెప్పి వసుధను కన్విన్స్ చేద్దాము.

దట్సాల్! ఈ రోజు నలుగురి స్టేట్‌మెంట్లు రికార్డు చేయడం జరిగింది. ఈ ఆడియో మాత్రమే కాకుండా మా దగ్గర మరిన్ని ఫిజికల్, కెమికల్, ఎలక్ట్రానిక్, బ్యాంకు రికార్డులున్నాయి కాబట్టి వీటన్నింటి దృష్ట్యా, నేరస్థులకు కఠిన శిక్ష పడుతుందనే ఆశిస్తున్నాము.” అని ముగించింది.

తర్వాత నన్ను దగ్గరకు రమ్మని,

“సారీ! సమీర్! నిన్ను నేను అనుమానించాను. కానీ, మీ స్నేహం ఎంత గొప్పదో నిన్ననే చూసాము. కానీ వసుధతో జాగ్రత్త. తనొక క్రిమినల్! మరో ఎత్తు వేస్తూనే ఉంటుంది. మనకు అసలు వాడు దొరకగానే తనను కూడా అరెస్ట్ చేస్తాము. కాబట్టి మీ ప్రేమ ప్రయాణం ముగించు.” అని నా భుజం తట్టి,

“సంజయ్! నీ సినిమా రిలీజ్ కాగానే రెండు మూడు రోజుల్లో సమీర్ సినిమా మొదలు పెట్టి, మీరేం చేస్తారో నాకు తెలియదు, పది రోజుల్లో షూటింగ్ ముగించాలి. ఎట్‌లీస్ట్ వసుధ పార్ట్ వరకైనా ముగించండి. ఏ క్షణమైనా ఆమెను అరెస్ట్ చేయవలసి రావచ్చు.” అని అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళి పోయారు.

***

సంజయ్‌ని రాత్రి ఫంక్షన్ హడావుడిలో, పొద్దున్న కమీషనర్ స్టేట్‌మెంట్ రికార్డింగ్ సమయంలో సరిగ్గా గమనించలేదు గానీ, సంజయ్ ఇప్పుడు చాలా స్మార్ట్‌గా చాలా హుషారుగా ఉన్నాడు. ముఖంలో నేవళం వచ్చింది.

సంజయ్ మొదటి నుండీ అందగాడే గానీ, సినిమా షూటింగుల్లో నిర్విరామంగా పాల్గొనడం వలన, ఆ 1 కేవీ, 2 కేవీ, 5 కేవీ లైట్ల వెలుతురులో, మేకప్ కోసం వాడే కెమికల్స్ వల్ల, నిరంతరం అసిధారావ్రతం వంటి సినిమా ఫీల్డ్ ఒత్తిళ్ళ వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయేవాడు. మా ఇద్దరిదీ ఒకే వయసయినా, తనకున్న హెక్టిక్ షెడ్యూలు వల్ల ముఖం, రసం తీసేసిన మామిడి పండులా, వాడిపోయి ఉండేది. మేకప్‌తో దాన్ని కవర్ చేసేవారు.

వాడికి సరైన విశ్రాంతి అవసరమని నేనెన్ని సార్లు మొత్తుకున్నా వినకుండా, అవకాశాలున్నప్పుడే, మనం కెరటం పై భాగాన ఉన్నప్పుడే, సాధ్యమైనన్ని ప్రాజెక్టులు చేయాలని అంటుండేవాడు.

నేనొచ్చిన తర్వాత సంజయ్ మానసిక సమస్యలను నేను నెత్తిన వేసుకుని, సంజయ్‌కి ప్రశాంతతనివ్వాలని ఎంతో ప్రయత్నం చేసేవాణ్ణి.

కానీ, ఈ రెండున్నర నెలలు షూటింగులు లేక, ప్రశాంతమైన నల్లమల అటవీ ప్రాంతంలో, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, నదులలోని నీటిని నేరుగా తాగుతూ, తరతరాలుగా ప్రవహిస్తూ మూలికాశక్తిని మోసుకొస్తున్న సెలయేళ్ళల్లో శరీరాన్ని పునీతం చేసుకోవడంతో, ప్రకృతి కన్య సతత హరిత ప్రాంగణంలో సేదదీరడంతో, సంజయ్ చాలా అందంగా తయారయ్యాడు.

ఒక నూతన శక్తి, ఒక నూతన కాంతి, కళ్ళల్లో ఒక మెరుపు గమనించాను. సిద్ధేంద్ర స్వామి మందుల వల్ల ఎన్నో ఏళ్ళుగా తనను పీడిస్తున్న మెరాల్జియా వ్యాధి నుండి కూడా విముక్తి పొందినట్లు సంజయ్ చెప్పడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.

సిద్ధ ఆయుర్వేద వైద్య విధానాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన వైద్యులు ఆమోదించరు. కానీ, అలోపతి వైద్య విధానంలో నయం కానీ అనేక వ్యాధులకు ఆయుర్వేదం చికిత్స చేయగలుగుతుంది. అయితే, ఆయుర్వేద చికిత్సా విధానమంటూ తరతరాల వైద్య కుటుంబమని చెబుతూ, రకరకాల మోసాలు చేసే దొంగ వైద్యుల మూలంగా మరియు కొంతమంది బూటకపు వైద్యులు అసలు మూలికలకు బదులుగా స్టెరాయిడ్స్, పాదరసం వంటి హానికారక మూలకాలను అధిక మోతాదుల్లో వాడడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి.

కానీ, నిస్వార్థంగా వైద్య వృత్తిని నిర్వహించే సిద్ధేంద్ర స్వామి వంటి వారు, ఒక రోగి యొక్క వాతం, విత్తం, కఫముల సమతుల్యత చెడిపోవడం వల్లనే మనిషి వ్యాధిగ్రస్తుడవుతున్నాడని పసిగట్టి, ఆ సమతుల్యతను సాధించడానికి కృషి చేస్తారు. అలా రెండున్నర నెలల పాటు వాతావరణ, నీటి, గాలి, మనుషుల కాలుష్యానికి దూరంగా ఉండి, తన జీవనశైలిని మార్చుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై, విజయుడై సంజయ్ తిరిగి వచ్చాడు.

***

సంజయ్ తిరిగి రావడంతో ఇల్లంతా మహా సందడిగా ఉంది. అభిమానుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ప్రెస్ మీట్లు, పోలీసుల విచారణలు, టాలీవుడ్ ప్రముఖుల పరామర్శల మధ్య రోజులు చకచకా గడిచిపోతున్నాయి.

సంధ్యారాణి ఆంటీ పునరుత్సాహంతో తిరుగుతున్నారు. ఆమె, ఆ దారుణ సంఘటనను ఎదుర్కొన్నప్పుడు ఆమె  తీవ్రంగా స్పందించడంతో అనూహ్యంగా ఆమె శరీరంలో కొన్ని హార్మోన్లు ఉత్పత్తి అయ్యాయని; దానికి తోడు కొడుకుకు ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడన్న శుభవార్త వల్ల ఆమె ‘ప్లేసిబో’ ఎఫెక్ట్ వల్ల కూడా తాత్కాలికంగానైనా ఉపశమనం పొందిందని గురూజీ చెప్పారు. నాయుడు గారు మళ్ళీ వ్యాపారంలోకి దూకారు.

నేనొక్కడినే అంతమే లేని ఒక లోతైన గోతిలోకి కూరుకుపోతున్న ఫీలింగ్‌తో నరకయాతన అనుభవిస్తున్నా! వసుధ మరునాడు వచ్చి, సినిమాలో హీరోయినుగా అవకాశం ఇచ్చినందుకు నాయుడుగారికీ, సుధారాణి గారికీ పాదాభివందనం చేసి, ఆ స్థాయిలో, అక్కడ ఉండడం ఉచితంగా ఉండదనీ, పరిశ్రమలో పడని వారు కోడై కూస్తారని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోతూ, నా దగ్గరకు వచ్చి,

“సమ్మీ! నువ్వు కూడా బయటపడు. మర్రి చెట్టు నీడ ఎంత హాయిగా ఉన్నా, ఆదరించినా మనం జీవితాంతం ఊడలుగానే మిగిలిపోతాము. మనమొక మహావృక్షంగా ఎదగలేము. మన సినిమా మొదలు కాబోతుంది. మనది తప్పనిసరిగా హిట్ కాంబినేషన్ అవుతుంది. ఐదారు సినిమాలు చేసి పెళ్ళి చేసుకుని, మన జీవితాన్ని మనమే సుందరవనంగా తీర్చుదిద్దుకుందాం. నువ్వన్నట్టుగా మనింటి నిండా మన పాపాయిలను కని నీకు కానుకగా ఇస్తా!” అంటూ కౌగలించుకుంది.

అంతకుముందు మరులు గొలిపే ఆమె ఒంటి సౌరభం నాకు భరించలేనంత వెగటుగా అనిపించింది. ఆమె కౌగిలిలో ఒక విషప్పురుగు నా ఒంటి మీద పాకినట్టుగా ఒళ్ళు జలదరించింది. వసుధ నిజంగానే అమాయకురాలో లేక మాకు తన మీద ఎటువంటి అనుమానం లేదని నమ్ముతుందో లేక నడిచినంత కాలం ఈ బూటకపు నాటకాన్ని రక్తి కట్టిద్దామని అనుకుంటుందో – నేనైతే పసిగట్టలేకపోయాను.

కానీ, నేను కూడా, వసుధ నిజ స్వరూపం తెలిసిన తర్వాత, కమీషనరుగారు ‘జాగ్రత్తగా ఉండమ’ని హెచ్చరించిన తర్వాత గూడా, వసుధను నమ్మను. కానీ, ఇక్కడే లౌక్యం ప్రదర్శించవలసిన అవసరముందని గ్రహించి, నేను నవ్వుతూ,

“పిచ్చిదానా! నాకు మాత్రం నువ్వు లేని ఇంట్లో ఉండడం ఇష్టమా చెప్పు? కానీ, నేను కూడా ఇప్పుడే నీతో పాటే బయటకొస్తే, మొదటికే మోసం వస్తుంది. సంజయ్ తిరిగి వచ్చాడు కాబట్టి, కొత్త సినిమాను మనిద్దరితో బదులు, సంజయ్‌ తోనే తీస్తే, మనకు ఛాన్స్ మిస్సవుతుంది. నేను సంజయ్ పక్కనే ఉండి, పాచిక వేసి, ముందు మన సినిమా, సెట్స్ మీదకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తాను. ఏమంటావు?” అన్నాను.

వసుధ ఒక్క నిముషం ఆలోచించి, నా మాటలు నిజంగానే నమ్మిందో లేదో గానీ, నమ్మినట్టు చూసి, మరోసారి కౌగిలించుకుని వెళ్ళిపోయింది. మొదటి సినిమా ప్రారంభమే కాలేదు కానీ, వసుధ మాత్రం పరిశ్రమకు కౌగిళ్ళను విచ్చలవిడిగా పంచేస్తుంది. తను వెళ్ళిపోవడంతో, నేను ఊపిరి పీల్చుకున్నాను.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here