నాదొక ఆకాశం-4

0
11

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[హీరో సంజయ్ కిడ్నాప్ అవుతాడు. అతని స్నేహితుడు, పి.ఎ., సమీర్ పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత తన మీద వేసుకుంటాడు. అసలేం జరిగిందో తెలుసుకోవాలని శ్రీశైలంకు సంజయ్‌తో పాటు వెళ్ళిన వాళ్ళమ్మ గారి వెంట ఉన్న అటెండెంట్ వసుధకి ఫోన్ చేస్తాడు. వసుధ సంజయ్ వాళ్ళ దూరపు చుట్టం. శిక్షణ పొందిన నర్స్. కరాటే నేర్చుకుంది. ఆన్‍లైన్‍లో కోర్సులు చేస్తూ అప్‍టుడేట్‍గా ఉంటుంది. సమీర్ ప్రేమికురాలు కూడా. సమీర్ ఫోన్ చేసేసరికి అసలు ఏం జరిగిందో వివరిస్తుంది. తను అన్నీ సర్దుబాటు చేస్తాననీ, తనకి కాస్త టైమివ్వమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సమీర్. సంజయ్ కిడ్నాప్ వ్యవహారం సమీర్‍ని ఆందోళనకి గురి చేస్తుంది. సంజయ్ లేకపోతే తన పరిస్థితి ఏమవుతుందోనని అనుకుంటాడు. సంజయ్ లేకపోతే తనకు ఆ ఇంట్లో ఇక స్థానం ఉండదని, వసుధతో తన పెళ్ళి జరగడం కూడా సందేహమే అని అనుకుంటాడు. వసుధ, సంధ్యారాణి గారు – ఆశ్రమానికి వెళ్ళిన పోలీసులకు వాఙ్మూలం ఇచ్చేసి, మరునాడు ఉదయమే హైదరాబాదుకు వచ్చేస్తారు. కొడుకు కిడ్నాప్ అయినప్పటిని నుంచీ సంధ్యారాణిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. సుధాకర్ నాయుడు, సంధ్యారాణి గారు ఒకరినొకరు పట్టుకుని దుఃఖిస్తారు. వాళ్ళిద్దరి మధ్యా ఉన్న ప్రేమాభిమానాలను గుర్తు చేసుకుంటాడు సమీర్. కాసేపయ్యాకా, సుధాకర్ నాయుడు, సంధ్యారాణి నాల్గవ అంతస్తులోని తమ గదికి వెళ్ళిపోతారు. కాసేపయ్యాకా, వసుధ సమీర్‍కి వీడియో కాల్ చేస్తుంది. ఆమె అక్కడ బాధపడుతూంటే, కన్నీళ్ళు తుడవబోయి.. ఫోన్ కదా అని ఆగిపోతాడు సమీర్. కాసేపయ్యాకా, సమీర్ గదికి వస్తుంది వసుధ. ఇద్దరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని, మనోవేదనని తగ్గించుకుంటారు. – ఇక చదవండి.]

[dropcap]రెం[/dropcap]డు తెలుగు రాష్ట్రాల్లో ‘సంజయ్’ అపహరణపై తీవ్రమైన దుమారం చెలరేగింది. ఇంత వరకు ఏ ఆందోళన జరిగినా ఏదో ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకే జరిగేవి. కానీ, సంజయ్ విషయంలో అన్ని పార్టీల వాళ్ళు – అధికార పక్షానికీ, ప్రతిపక్షాలకు చెందిన యువతీయువకులు, ముఖ్యంగా స్కూళ్ళూ, కాలేజీలు ఎగ్గొట్టి విద్యార్థులు కూడా కలిసి ఎక్కడికక్కడ ధర్నాలు, నిరాహారదీక్షలు, మోర్చాలూ, రోడ్ల దిగ్బంధనం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో, ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.

తాము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినా విజయవంతం కానీ ప్రొటెస్ట్ కార్యక్రమాలు, ఒక సినిమా హీరో కోసం, యువత అంతా స్వచ్ఛందంగా రోడ్ల పైకి వచ్చి ప్రభుత్వాన్ని స్తంభించేలా చేయడం చూసి, రాజకీయ పార్టీల నాయకులు కుళ్ళుకున్నారు కూడా.

అందుకే, ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశాలు జరిపి సంజయ్‌ని వెతికే పనులు వెంటనే వేగవంతం చేయాలని, అనుమానాస్పదమైన వారిని ఎవ్వరినీ వదలవద్దని, ఎవ్వరినీ స్పేర్ చేయవద్దని కఠినమైన ఆఙ్ఞలు జారీ చేయడంతో సంజయ్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కనీవినీ ఎరగని విధంగా ‘మ్యాన్ హంట్’ ప్రారంభమయింది. నల్లమల అడవుల్లో అంతకు ముందు పనిచేసిన అటవీ శాఖ, పోలీస్, గ్రే హౌండ్, ఆక్టోపస్ విభాగాలలోని మెరికల్లాంటి అధికారులను రంగంలోకి దించింది ప్రభుత్వం. ప్రభుత్వం విన్నపం మేరకు అందుబాటులో ఉన్న, రిటైరైన సీనియర్, జూనియర్ ఉద్యోగులను కూడా తమ టీముల్లోకి చేర్చుకున్నారు.

నాకు కమీషనర్ గారు ఫోన్ చేసి,

“సంజయ్ అమ్మానాన్నలతో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ ద్వారా ఒక అప్పీల్ రిలీజ్ చేయించండి, నేను మధ్యాహ్నం కలుస్తానని నాయుడి గారికి చెప్పండి.” అని చెప్పారు.

నేను ఒక విన్నపాన్ని తయారు చేసి, ప్రెస్ వాళ్ళందరినీ సంజయ్ ఇంట్లోని సెల్లారులో ఉన్న ప్రెస్ రూముకు పిలిచాను. అందరికీ టీ, బిస్కెట్స్ సర్వ్ చేసాక, సుధాకర్ నాయుడు గారు, సంధ్యారాణి ఆంటీ వచ్చి కూర్చున్నారు. అందరూ మైకులు సర్దుకున్నాక ముందు సుధాకర్ నాయుడు గారు,

“సంజయ్‌ని ప్రేమించే అభిమానులందరికీ నాదొక అప్పీల్! ప్రభుత్వం తరఫున సంజయ్‌ని వెతకడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుంది. కాబట్టి దయ చేసి మీరంతా హింసకు పాల్పడకండి. సంజయ్ క్షేమం కోసం, సంజయ్ తిరిగి రావడం కోసం ప్రార్థనలు చేయండి. వీలైతే పూజలు చేయండి, పేదలకు అన్నదానం చేయండి, రోగులకు రక్తదానం చేయండి. హాస్పిటల్లో ఉన్న రోగులను కలిసి పళ్ళూ ఆహారం ఇవ్వండి. మీకు వీలైతేనే! సంజయ్ అభిమానులంటే క్రమశిక్షణగా మెలిగే లౌకికవాద, చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడరనీ, చట్టాన్ని గౌరవించే నాగరికులని, ప్రజలు పొగిడే విధంగా, మీ కార్యక్రమాలు నిర్వహించండి. సంజయ్ ఉన్నా ఇదే విషయం మీకు చెప్పేవాడు. అంతేకానీ, ప్రజల శాంతిభద్రతలకు, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించవద్దు.” అని చేతులు జోడించి వేడుకున్నారు. తర్వాత సుధారాణి ఆంటీ,

“అమ్మలారా! అయ్యలారా! మీలో ఎవరికైనా సంజయ్ ఆచూకీ తెలిస్తే చెప్పండి. మీలో ఎవరైనా ఏదైనా ఆశించి సంజయిని కిడ్నాప్ చేసినా, మీకేం కావాలో మాకు చెప్పండి. మా తల తాకట్టు పెట్టైనా సరే మీ డిమాండ్లు నెరవేరుస్తాము. వాడు మాకు ఒక్కగానొక్క కొడుకు. నేను అనారోగ్యంగా ఉన్నాను. వాడి మీదనే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. మీకు ప్రభుత్వం తరఫున కానీ, పోలీసుల నుండి కానీ ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. మీరు చేయమన్న ప్రతీ పనీ చేస్తాము. కానీ, మా బిడ్డను మాకు ప్రసాదించండి. ఈ ముసలి వయసులో మీకు పుత్రశోకం కలిగించకండి. అమ్మలారా! నాయనలారా! మీ పాదాలకు వందనం చేసి ప్రార్థిస్తున్నాను.” అంటూ వలవలా ఏడ్చింది.

ఆ దృశ్యం చూసి ప్రెస్ మిత్రులలో సగం మంది కన్నీరు పెట్టుకున్నారు. నేను రాసిచ్చిన సందేశమే అయినా ఆంటీ ఉద్వేగంగా చదువుతుంటే నేనే కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. వసుధ ముందుకొచ్చి, ఆంటీ కన్నీళ్ళు తుడిచి మంచినీళ్ళు అందించింది. కానీ, ఆంటీ తాగడానికి ఒప్పుకోలేదు. వెంటనే సుధాకర్ నాయుడు గారు,

“ఈ వార్త తెలిసినప్పటి నుంచీ సంజయ్ తల్లి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు. మాత్రలు కూడా వేసుకోవడం లేదు. ఆమె ఆరోగ్యం నిన్నటికి ఇవ్వాళ్టికే క్షీణించింది.” అని చెప్పి ఆంటీని లేపి లోపలకు తీసుకెళ్ళారు.

ఈ సందేశం నిజంగానే పనిచేసింది. కొన్ని ఛానెళ్ళు ఆంటీ మాటలను పదేపదే ప్రసారం చేయడంతో, అందరూ దుఃఖంలో మునిగిపోయారు. రెండు రాష్ట్రాల్లోనూ, సాయంత్రానికల్లా ఆందోళనలు ఆగిపోయి, శాంతియుత కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ..

***

పుష్పా కిరణ్ గారు, అన్నట్టుగానే, మధ్యాహ్నం ఇంటికి వచ్చి, అధికారిక ప్రకటనలు ఎలా ఉన్నా, కాన్ఫిడెన్షియల్‌గా మాత్రం, ప్రభుత్వం తూతూ మంత్రంగానే సెర్చింగ్ కొనసాగిస్తుందని చెప్పడంతో మేమంతా నిరాశలో కూరుకుపోయాము. నాయుడు అంకుల్, సుధారాణి ఆంటీ ఆ వార్త విని క్రుంగిపోయారు. ఇద్దరూ ఏడవడం మొదలు పెట్టారు. వారి కోసం నీళ్ళూ, మేడమ్ కోసం కాఫీ పట్టుకొచ్చి నిలబడిన వసుధను తీక్షణంగా ఒక చూపు చూసి, వారిద్దరిని చూస్తూ, వారిని ఓదారుస్తూ, పుష్పా కిరణ్ మేడమ్,

“సుధాకర్ నాయుడు గారూ! అమ్మా! మీరు నిరాశ పడకండి. మనం ధైర్యంగా ఉండాలి. ఇక్కడ ఒకటి రెండు విషయాలున్నాయి. మొదటిది మనకు ఎవరి దగ్గరి నుండి రాన్సమ్ కాల్ అంటే ఇంత డబ్బు ఇస్తే సంజయ్‌ని వదిలేస్తామనే బెదిరింపు సమాచారం రాలేదు. అది ఒక గుడ్ సైన్. అలాగే, మనకు.. గాడ్ ఫర్గివ్ మీ.. దేవుడి దయ వలన సంజయ్ బాడీ కూడా దొరకలేదు. అంటే అతనికేమీ ప్రమాదం జరగలేదన్నమాట. అలాగే, గురూజీ ఆశ్రమంలోకి బలవంతంగా ప్రవేశించినట్టు ఏ ఆధారమూ లభించలేదు. ఆశ్రమంలోని వాళ్ళు ప్లస్ అతని పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా సంజయ్ బయటకు వెళ్ళలేదని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కేస్ కొంచెం ట్రిక్కీగా కనిపిస్తుంది.” అని నా వైపుకు తిరిగి,

“సమీర్, రైట్!” అని నా పేరు గుర్తుకు ఉన్నందుకు సంతోషిస్తూ, కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగి,

“నువ్వే మమ్మల్ని ఎన్‌లైటెన్ చేయాలి. ఒకసారి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు రేపు ఉదయం పదింటికి రండి. మాట్లాడుకుందాము.” అని లేచి నిలబడ్డారు. దాంతో నాయుడు గారు కంగారుగా,

“మేడమ్! సమీర్‌ను అనుమానిస్తున్నారా? సంజయ్‌కి మంచి మీత్రుడు. మమ్మల్ని కన్నకొడుకు లాగా ఇన్ని రోజుల నుండి చూసుకుంటున్నాడు.” అన్నారు.

“అవన్నీ సరే! ఇరవై నాలుగ్గంటలూ సంజయ్ వెంట ఉండే సమీర్.. శ్రీశైలంకు అతనితో ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు నిన్ననే త్రిబుల్ యస్ సినిమా ఆఫీసుకు వెళ్ళాడు? మీ ఇంట్లోనే ప్రేమాయణం సాగిస్తూ తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం కరెక్టేనా? అసలు ఈ వసుధకి, సమీర్‌కు ఎప్పటి నుంచీ పరిచయం? ఇంతకు ముందే తెలుసా, ఇక్కడే పరిచయమా? వాళ్ళిద్దరూ మీ ఇంట్లోనే శృంగారం సాగిస్తున్నారని మీకు తెలుసా? ఇటువంటి అక్రమ సంబంధం విషయాలు, ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళతో ముందుగా తెలుస్తాయి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే, లోకమంతా గుడ్డిదై పోదు మిస్టర్ సమీర్! యూ ఆర్ ప్రైమ్ సస్పెక్ట్! సంజయ్ అదృశ్యంలో నువ్వే మొదటి ముద్దాయివి. పారిపోవడానికి ప్రయత్నించకు. మా పోలీసులు నిన్ను ఈ ఇంటి బయటకు అడుగు పెట్టనీయరు.” అని కఠినంగా అని,

“సారీ! సుధాకర్ నాయుడు గారూ! మీమీది గౌరవంతోనే, సంజయ్ మీద ఉన్న అభిమానంతోనే వీణ్ణి ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేయడం లేదు, చేతులకు బేడీలు వేయడం లేదు. రేపు పదింటికి రాకపోతే మాత్రం మా వాళ్ళు వారెంటుతో వస్తారు. వాళ్ళ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలియదు సార్! ఈ సారి వీడికి రుచి చూపిస్తాము.” అంటూ నా వైపు కోపంగా చూస్తూ బయటకు నడిచారు.

నేను మ్రాన్పడిపోయాను. నా పేరు ‘సమీర్’ అని ఆమెకు గుర్తున్నందుకు సంతోషించాను కానీ వెనువెంటనే నన్నే అనుమానిస్తున్నానని చెప్పడాన్ని నేనూహించ లేదు. ‘పోలీస్ కమీషనరే అనుమానించిన తర్వాత నన్ను ఆదుకునేవారెవ్వరు?’

నాయుడుగారు, ఆంటీ, వసుధ అందరూ విస్తుపోయి, ‘స్టాట్యూ’ ఆటలో స్థాణువుల్లా నిలబడిన బొమ్మల్లా నిలబడిపోయారు.

నేను, నా కాళ్ళు పట్టు తప్పడంతో, సోఫాలో కూలబడిపోయాను.

***

మరునాడు కమీషనరు కార్యాలయానికి వెళ్ళాను. కమీషనర్ గారు నన్ను చూడడానికి కూడా ఇష్టపడలేదు. వేరే ఇన్‌స్పెక్టర్ వచ్చి నన్ను ఇంటరాగేషన్ రూములోకి తీసుకు వెళ్ళాడు. వారికి కమీషనర్ గారు ఏమి ఆదేశాలు ఇచ్చారో గానీ నన్ను చాలా అవమానకరంగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. చేతులకు బేడీలు వేయలేదన్న మాటే గానీ అంతకన్న ఘోరంగా నా చుట్టూ పది మంది పోలీసులు నిలబడి, నా మనసులో అక్కడి నుండి పారిపోవాలనే ఆలోచన వచ్చినా సరే కుళ్ళబొడుస్తారేమోనన్నట్టుగా, క్రూరంగా చూస్తున్నారు. నన్ను అనేక ప్రశ్నలు, అసలు నేను నా జీవితంలో, కలలో కూడా ఊహించని ప్రశ్నలు, ఆరోపణలు చేసి తికమక పెట్టారు.

‘సంజయ్ కిడ్నాప్ వ్యవహారంలో నా హస్తం కూడా ఉందేమోనని’ ఒక్క క్షణం నేను కూడా నిజంగానే అనుమానపడేంతలా కట్టుకథలు అల్లారు. ఒకే ప్రశ్నను తిప్పి తిప్పి, ఒకరు కాకపోతే మరొకరు; అడిగిందే అడిగి మనము సహనం కోల్పోయి తిరగబడేంతగా రెచ్చగొట్టారు. వాళ్ళ విచారణా విధానమే అదేమో గానీ, ఒకరు బుజ్జగిస్తూ అడిగితే, మరొకడు దబాయిస్తాడు. కానీ, ఈ టెక్నిక్ గురించి నాకు తెలుసు. ఇది ‘గుడ్ కాప్ బ్యాడ్ కాప్ {Good cop Bad cop}’ టెక్నిక్. ఒకడు ‘నువ్వు నిజం చెప్పకపోతే, సంజయ్‌ని కిడ్నాప్ చేసానని ఒప్పకోకపోతే ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తా’ అని మనను బెదిరించగానే, వారిలోనే ఒకడు మనకు మంచి నీళ్ళ గ్లాసు అందిస్తూ, లేకపోతే కాఫీ కప్పు అందించి, ‘నువ్వాగు రా! సార్! వాడు మంచోడు కాదు సార్! ఎన్‌కౌంటర్ చేసినా చేసేస్తాడు. ఎందుకొచ్చిన తంటా, నిజం చెప్పేయండి సార్!’ అని మన మంచి కోసమేనన్నట్టుగా చెప్తాడు.

అప్పటికీ నేను వాళ్ళు అనుకున్న సమాధానం చెప్పకపోతే ‘గుడ్ కాప్’, ‘బ్యాడ్ కాప్’ అవుతాడు; ‘బ్యాడ్ కాప్’, ‘గుడ్ కాప్’ అవుతాడు. వాళ్ళకు అనుమతి లేదేమోగానే లేకుంటే, నాకు పోలీసుల థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందో రుచి చూపేవారు. ప్రస్తుతానికి మాటలతోనే హింసించడం మొదలుపెట్టారు.

‘నేను నెలకు లక్ష రూపాయలు వచ్చే ‘ఇన్ఫోసిస్’ సంస్థ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో మంచి ఉద్యోగాన్ని వదులుకుని, కుట్రపూరితంగానే సంజయ్‌ని కిడ్నాప్ చేసే ఉద్దేశం తోనే సంజయ్ దగ్గర చేరానని, ఇంట్లోని అంతర్గత వ్యవహారాలను పసిగట్టి నాకు చెప్పడానికి, వసుధను ప్రేమ పేరుతో ముగ్గులో దించానని ఆరోపించారు. సంజయిని విడిచిపెట్టడానికి ఎంత రాన్సమ్ డిమాండు చేయాలనుకుంటున్నానో చెప్పమని దబాయించడంతో, నా బుర్ర ఆలోచించే శక్తి కోల్పోయి, ఇక నా వల్ల కాదని నేను టేబుల్ మీద తల వాల్చాను.

అసలు కలలో కూడా ఊహించని ఆ అసత్య ఆరోపణలతో నా మనసు ఛిద్రమైంది. నా మనోమంజూష బ్రద్దలయ్యేంతగా నేను లోలోపల కుమిలిపోయాను. కుళ్ళికుళ్ళి ఏడ్చాను.

అప్పటికి సమయం మధ్యాహ్నం మూడయింది.

ఇంతలో, ‘నన్ను బయటకు తీసుకు రమ్మని’ ఉత్తర్వులు వచ్చినట్టుంది. వారిలో ఒకడు నా ముఖం మీద నీళ్ళు చల్లి, తువ్వాలతో తుడిచి, నా జుట్టు దువ్వి, బట్టలు సర్ది బయటకు నడిపించారు.

కమీషనరుగారి ఛాంబరు ముందర సుధాకర్ నాయుడు అంకుల్, సుధారాణి ఆంటీ, నా వసుధ, జంట నగరాల్లో ప్రసిద్ధి చెందిన క్రిమినల్ లాయర్ పద్మనాభ రెడ్డి గారూ ఉన్నారు. నన్ను కమీషనరు గారి గది లోపలికి తీసుకు వెళ్తుంటే, అక్కడున్న పోలీసు అధికారులు వారిస్తున్నా వినకుండా వాళ్ళు కూడా తోసుకుంటూ లోపలికి వచ్చారు. వాళ్ళందిరినీ చూసి, కోపంగా ఊగిపోయిన కమీషనర్ గారు, లాయరుగారిని చూసి, ఒక్క క్షణంలో మామూలయిపోయి, తన సబార్డినేట్సును బయటకు వెళ్ళమని చెప్పారు.

వాళ్ళు వెళ్ళగానే, సుధాకర్ నాయుడు గారు కమీషనర్ గారితో,

“ఏమిటిది మేడమ్? సమీర్ అమాయకుడు. సంజయ్ అంటే ప్రాణమిస్తాడు. మీరు రమ్మంటే వచ్చాడు. అతన్ని ఇన్ని గంటల పాటు విచారించడానికి ఏముంది? వాడి ముఖం చూడండి, ఎలా వాడిపోయిందో?” అని ఉక్రోషంగా అన్నారు.

సంధ్యారాణి గారు కూడా,

“అమ్మా! సంవత్సర కాలంగా నేను సమీరును చూస్తున్నాను. వాడికి నా కొడుకంటే ప్రాణం! సమీర్, వసుధ మధ్య ప్రేమ గురించి కూడా నాకు వసుధ ఎప్పుడో చెప్పింది. ఇద్దరూ జీవితంలో స్థిరపడ్డ తర్వాత పెళ్ళి చేసుకుంటామని చెప్పారు. అసలు సమీరును మీరెందుకు అనుమానిస్తున్నారు. సమీర్ వచ్చాకనే సంజయ్ జీవితం ఒక గాడిన పడింది. మీక్కూడా సంజయ్ గురించి బాగానే తెలుసు కదా! సంజయ్‌లో గత సంవత్సర కాలంలో వచ్చిన మార్పును మీరు గమనించ లేదా? నిజం చెప్పండి. దానికి కారణం కూడా సమీరే! అంతకు ముందు నా గురించి ఎప్పుడూ పట్టించుకోకుండా తిరిగిన సంజయ్, మొన్న నా కీళ్ళ నొప్పులు ఎక్కువ కావడంతో నన్ను కూడా గురూజీ ఆశ్రమానికి తీసుకెళ్ళాడంటే, వాడిలో ఎంత మార్పొచ్చిందోనని నేనే ఆశ్చర్యపడ్డాను. సమీర్ చెడ్డవాడు కాడు తల్లీ! దయచేసి వాణ్ణి అనుమానించకండి. మాకిద్దరు కొడుకులని అనుకుంటున్నాము. వీణ్ణి కూడా దూరం చేయకండి.” అని దీనంగా అడిగేసరికి నేను భోరుమన్నాను. వసుధ, ఆంటీ దగ్గరకు నడిచి వీపు రాస్తూ ఆమెను ఓదార్చింది.

పద్మనాభ రెడ్డిగారు కూడా కొన్ని లీగల్ ప్రశ్నలు వేయబోతుంటే, నాయుడు గారు అతన్ని వారించి, కమీషనర్ గారికి చేతులు జోడించి నమస్కరించాడు.

కమీషనర్ గారు కూడా ఒక్క క్షణం జరిగిన పొరపాటుకు మనసులోనే మథనపడ్డట్టుంది. అందుకే,

“సారీ! మా వల్ల పొరపాటే జరిగినట్టుంది. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. సమీర్‌ను తీసుకెళ్ళండి.” అంది నమస్కరిస్తూ.

***

సాయంత్రపు నీరెండ పడుతుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడే వానపడి వెలిసి, వాతావరణం – ఆ పూట పడుచు హృదయాలలో మదనుడు సందడి చేయబోతున్నాడన్న సందేశాన్ని మోసుకొస్తున్నట్టుగా – రంజుగా ఉంది.

ఇంతలో, వసుధ నేను నిలబడి ఉన్న మేడ మెట్లు ఎక్కి వస్తూ కనిపించింది. నా ప్రియురాలి ఒంటికి తన గరుకు కిరణాలు గుచ్చుకుంటే నేనేమైనా శిక్షిస్తానేమోనని భయపడి, సూర్యుడు పరుగుపరుగున పశ్చిమాద్రిన దాక్కునేందుకు పరుగిడుతున్నాడు. ఆ తరుణంలో ఆకాశాన ఒక స్వర్ణకాంతి పరుచుకుని ఉంది. ఆ వెలుగులో

‘పారిజాత పుష్పములలోని..

పరాగపు వర్ణ మేనిఛాయ..

ఎగిసిపడే అలల కుంతలాలు..

ఎద లోతుల అగాధాలలో..

ఏదో శోధించాలనుకొనే కనుదోయి..

ఆపై రెండు నెల వంకల మధ్య..

చుక్క బొట్టై అమరిన కుంకుమ శోభ..

సంపెంగకే సవాలు విసిరే..

సన్ననైన చిన్న నాసిక..

తియ్య తేనియ దాచుకున్న..

జంట గులాబీ రేకల అధరాలు..

పండు వెన్నెలంతా చుట్టేసుకున్నట్లు..

సంజ ఎరుపును అంచు చేసుకున్న తెల్లచీర..

చెప్పాలనుకున్నదేదో చెప్పలేక ఆగినట్టుగా..

నన్ను చూసిన తడబాటో లేక..

జరగబోయే ప్రణయ సంబరపు బిడియమో కానీ,’

మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ వస్తున్న వసుధ ఒంటి నుండి వీస్తున్న పరిమళం అక్కడ వ్యాపించి, మదనుడు అప్పుడే అక్కడికి ప్రవేశించాడన్న ప్రమోద ఘంటికలు, నా గుండెల్లో మ్రోగించాయి. నా ఒళ్ళు జలదరించింది. ఒక్క అంగలో వసుధను చేరి ఆమెను బిగి కౌగిలిలో బంధించాను.

తన తనువు తరులతలా తడబడింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here