నాదొక ఆకాశం-5

0
10

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సంజయ్’ అపహరణపై తీవ్రమైన దుమారం చెలరేగుతుంది. యువతీయువకులు స్కూళ్ళూ, కాలేజీలు ఎగ్గొట్టి ఎక్కడికక్కడ ధర్నాలవీ చేస్తుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతాయి. దాంతో సంజయ్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కనీవినీ ఎరగని విధంగా ‘మ్యాన్ హంట్’ ప్రారంభమవుతుంది. నల్లమల అడవుల్లో అంతకు ముందు పనిచేసిన అటవీ శాఖ, పోలీస్, గ్రే హౌండ్, ఆక్టోపస్ విభాగాలలోని మెరికల్లాంటి అధికారులు రంగంలోకి దిగుతారు. పోలీస్ కమీషనర్ సమీర్‍కి ఫోన్ చేసి – సంజయ్ తల్లిదండ్రులతో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ ద్వారా ఒక అప్పీల్ చేయించమని అడుగుతారు. సమీర్ ఒక విన్నపాన్ని తయారు చేసి, సమీర్ తల్లిదండ్రుల చేత ప్రెస్ వాళ్ళతో మాట్లాడిపిస్తాడు. వాళ్ళు మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తాయి. ఒకటి రెండు రోజులు ఆందోళను తగ్గుముఖం పడతాయి. కమీషనర్ పుష్పా కిరణ్ సంజయ్ వాళ్ళింటికి వచ్చి – సంజయ్ తల్లిదండ్రులకి ధైర్యం చెప్తారు. సమీర్‍ని మర్నాడు పోలీస్ హెడ్‍క్వార్టర్స్‌కి రమ్మని చెప్తారు. సమీర్‍ని అనుమనించవద్దని సుధాకర్ నాయుడు గారంటారు. కానీ కమీషనర్ వినరు. సమీర్‍పైనే అనుమానం ఉందని, సంజయ్ కిడ్నాప్‍లో సమీర్ పాత్ర ఉందని, చెప్తూ, మర్నాడు రాకపోతే, పోలీసులే వారెంటుతో వస్తారని చెప్పి వెళ్ళిపోతారు. మర్నాడు కమీషనర్ ఆఫీసుకి వెళ్తాడు సమీర్. అక్కడ వేరే ఇన్‍స్పెక్టర్ వచ్చి ఇంటరాగేషన్ రూమ్‍కి తీసుకువెళ్తాడు. అక్కడున్న సిబ్బంది రకరకాల ప్రశ్నలతో సమీర్‍ని ఇబ్బంది పెడతారు. ఆ అసత్య ఆరోపణలతో సమీర్ మనసు ఛిద్రమవుతుంది. చాలా బాధపడతాడు. మధ్యాహ్నం మూడు దాటాకా, బయటకి తెచ్చి కమీషనర్ గదికి తీసుకువెళ్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ తల్లిదండ్రులు, లాయర్ పద్మనాభరెడ్డి గారు కూడా కమీషనర్ గదిలోకి వెళ్తారు. సమీర్ మీద తమకేమీ అనుమానం లేదని, తమ కుటుంబంలోని మనిషి లాంటి వాడని సమీర్ తల్లిదండ్రులు కమీషనర్‍తో చెప్తారు. తమ వల్ల పొరపాటు జరిగిందని , క్షమాపణలు చెప్పి, సమీర్‍ని తీసుకువెళ్ళమంటుందావిడ. – ఇక చదవండి.]

[dropcap]సం[/dropcap]జయ్ వేటలో – ప్రశాంతంగా ఉన్న నల్లమల అడవులు – పోలీస్, మిలిటరీ అధికారుల పదఘట్టనలతో దద్దరిల్లి పోయాయి.

చాలా కాలంగా నల్లమల అడవులు ప్రశాంతంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర పోలీసులు ఉక్కు పాదం మోపడంతో నక్సలైట్ల కార్యకలాపాలు ఇక్కడ తగ్గి చత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో పెరిగాయి. నల్లమల అడవుల్లో వారికి షెల్టర్స్ కూడా తక్కువయ్యాయి.

అందువల్ల హఠాత్తుగా పైన పడుతున్న పోలీసులను చూసి అటవీప్రాంత గిరిజన ప్రజలు, చెంచులు కకావికలయ్యారు. పోలీసులు నిజం రాబట్టడానికి వాడే అన్ని పద్ధతులు అవలంబించారు.

మనిషి శరీర ఉష్ణోగ్రతను పసిగట్టే థర్మల్ స్కానర్స్, హైఎండ్ సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తూ వెతకడం కొనసాగించారు.

కానీ, నల్లమల మామూలు అడవి కాదు, తూర్పు కనుమల్లో సుమారు 3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర విస్తరించిన మహరణ్యం. ఇందులోనే, భారతదేశంలోనే అతి పెద్ద ‘నాగార్జున సాగర్-శ్రీశైలం’ పులుల రక్షిత ప్రాంతం ఉన్నది. రాత్రి తొమ్మిది నుండి ఉదయం ఆరు గంటల వరకు ఈ మార్గాల గుండా వాహనాలను అనుమతించరు. ఈ అడవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో విస్తరించి ఉంది.

మానవుడి స్వార్థపు బుద్ధి సోకకుండా స్వచ్ఛంగా, ప్రకృతిమాత పరవశించి విహరించే సోయగాలతో ఉన్న ఏకైక అరణ్యం అది.

అయితే, నల్లమల అడవుల గుండా వేసిన గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం వల్ల కొంత అడవుల టెక్స్చర్ {Texture} దెబ్బతినడం, ఇక్కడ తరతరాలుగా నివసిస్తున్న  నివసిస్తున్న చెంచులకు నచ్చని విషయం. ఎందుకంటే, ఒకసారి నాగరికత అంటూ ప్రవేశిస్తే వారు అవలంబిస్తున్న సాంప్రదాయ జీవన విధానం చెల్లాచెదురవుతుందని వారి భయం.

నల్లమల అడవుల్లో అపార ఖనిజ సంపద నిక్షిప్తమై ఉందనీ, కొన్ని శతాబ్దాలుగా అనేక రాజవంశాల చక్రవర్తులు, రాజులు, శత్రు సైన్యాల ముట్టడి నుండి కాపాడుకోవడానికి దాచిపెట్టిన వజ్ర వైఢూర్యాలు, ధనరాశులు, స్వర్ణ సంపద ఉందనే పుకార్లు అప్పడప్పుడు చెలరేగుతుంటాయి.

3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన అడవి కాబట్టి, అడవి మొదట్లో, నాగరికత తగిలిన కొన్ని కొన్ని ఊళ్ళకు ఆనుకుని ఉన్న పలుచటి అడవి తప్ప ఘనమైన లోపలి అరణ్యాలను చూసిన వాడూ, చూసి ప్రాణాలతో తిరిగి వచ్చిన వాడూ లేడు. అది చెంచుల మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించేది, పరిపాలించాల్సింది తామేనని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే, ప్రభుత్వ అధికారులు తమ హక్కులను హరించడం, రకరకాల నిబంధనలను తమపై విధించడం వారికి నచ్చదు. తమ బ్రతుకు తమని బ్రతకనివ్వాలని వారు అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించుకుంటారు. కానీ, రాజకీయ నాయకుల మాటలు నీటి మీద రాతలేనని, వారికి పదేపదే అనుభవంలోకి వస్తుంది.

వారు నాగరిక ప్రపంచాన్ని నిరసించినా, తమకు జరుగుతున్న అన్యాయాల గురించి, తమ పేరు మీద జరుగుతున్న మోసాల గురించి, తామెంతో ప్రేమించే అడవి తల్లి పైన జరుపుతున్న విధ్వంసం గురించి వారికి తెలుసు. ఆ చైతన్యాన్ని, వారిలో అన్నలు కలుగచేసారు.

వారికి చదువు విలువ తెలియచేసారు కాబట్టి వారి యువకులు రహస్యంగా, దూరంగా వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఆ యువకులే, అడవుల్లో నివసించే తమ వారిని చైతన్యపరుస్తున్నారు.

నల్లమల కొండల్లో ఉన్న యురేనియం వెలికి తీయడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారంటే, అందుకు విద్యావంతులైన వారి యువతే కారణం. ఎవడో స్వార్థపరులైన దురాశాపరులు, మూఢనమ్మకాలను నమ్మేవారు, గుప్తనిధులను అన్వేషించడానికి వచ్చి నర బలులు కూడ ఇస్తుంటారు.

వీటన్నింటికి చెంచులు సంజాయిషీ ఇవ్వాలని ప్రభుత్వాధికారులు వేధిస్తుంటారు. అందుకే, ఆదివాసీలు క్రూరమృగాలతోనైనా సహవాసం చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ, మానవమృగాలను వారు నమ్మరు.

అటవీశాఖ అధికారులు వారిని రకరకాల హింసలకు గురి చేస్తారు. అది ఆదివాసీలు మర్చిపోరు. హింస ఎక్కువైనప్పుడు, వారి ప్రతిఘటన కూడా తీవ్రంగానే ఉంటుంది. అడవిలోకి వెళ్ళిన అధికారులు మళ్ళీ జనజీవన స్రవంతిలో కలవలేరు.

అందుకే, వారు నమ్మిన, తమ పట్ల ఉదారంగా, అభిమానంగా ప్రవర్తించే, చాలా ఏళ్ళుగా చూస్తున్న  కొంతమంది చిన్నస్థాయి అటవీ ఉద్యోగులతోనే వారు మాట్లాడుతారు. కొత్తవాళ్ళను అసలు నమ్మరు. చెంచులను పెద్ద అధికారుల ముందు నిలబెడితే వారు బిగదీసుకుపోతారు. అడవికి రాజులమైన తాము ఎవడి ముందో నిలబడి సమాధానం చెప్పాలంటే అవమానంగా భావిస్తారు.

అందుకే, పైకి ఆకుపచ్చగా, అందంగా, అమాయకంగా కనిపించే నల్లమల, లోలోపల కుతకుత ఉడుకుతున్న, సేఫ్టీ పిన్ తీసి పట్టుకున్న బాంబులాంటి  ప్రాంతం.

ఈ విషయం అధికారులందరికీ తెలుసు. అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, రెండ్రోజుల్లో సంజయ్‌ని పట్టుకుంటామని ప్రగల్భాలు పలికిన, ప్రతిజ్ఞలు చేసిన పోలీస్, అటవీ అధికారులు వారం రోజులు తిరిగే సరికి చేతులెత్తేసారు.

కిడ్నాపర్స్ సంజయిని నల్లమల అడవుల నుండి తరలించారనీ; సంజయ్ ఎక్కడ ఉన్నాడో తెలియదని, అయినా తమ ప్రయత్నాలు తాము కొనసాగిస్తామని శుష్క వాగ్దానాలు చేసి బిచాణా ఎత్తేసారు.

***

సంజయ్ కిడ్నాప్ అయ్యాడన్న వార్త తెలిసిన మరుక్షణం నివ్వెరపోయిన ప్రపంచమే, ప్రజలే రెండ్రోజుల కల్లా ఆ విషయాన్ని మర్చిపోయి మరో సంచలన సంఘటన వార్త కోసం సిద్ధంగా ఉన్నారు.

ఇప్పుడు ప్రపంచమే అలా మారిపోయింది. అనుక్షణమూ కొత్త వార్తల కోసం, సెన్సేషన్ కలిగించే వార్తల కోసం ప్రజలు అర్రులు చాస్తూ, వేచి చూస్తున్నారు. ఎంత గొప్ప వార్తైనా ఒక పూట కన్నా ఎక్కువ థ్రిల్ కలిగించడం లేదు. ఎంత గొప్ప వ్యక్తి చనిపోయినా, ఆ కాసేపే వార్తా, విషాదం. అటు తర్వాత దాని వార్తా విలువ {news value} తగ్గిపోతుంది. ఈ నాటి వార్తా పత్రిక మరునాటికి చిత్తు కాగితమై {Today’s newspaper is tomorrow’s waste paper} కిరాణా షాపుల్లో ఉల్లిపాయలు ప్యాక్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వార పత్రికల్లా దాచుకుని చదివే కంటెంటే (content) ఉండడం లేదు.

మరో ఇంట్రెస్టింగ్ వార్త కోసం ప్రజలు టీవీ ఛానెళ్ళను మారుస్తున్నారు. మన దేశం మీద శత్రుదేశం దాడి చేసినా, ఎన్‌కౌంటర్లు జరిగినా, సినిమా నటులు మరణించినా, ఎవరైనా లేచిపోయినా ఆ వార్త వయసు బహు కొద్ది సేపే. అందుకే, సాంప్రదాయ టెలివిజన్ ఛానెళ్ళు, ప్రేక్షకుల డిమాండ్లను తీర్చలేక సతమతమవుతున్నాయి.

అదే సమయంలో, సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది. కోట్లాది మంది వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వేదికల మీద ప్రపంచం నలుమూలల నుండి తాజా తాజా వార్తలు, వీడియోలు పోస్ట్ చేస్తుండడంతో, నూతనత్వాన్ని, థ్రిల్లును కోరుకునే ప్రజలు సోషల్ మీడియా వైపే బాగా ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పోస్ట్ చేస్తూ, సోషల్ మీడియాను నిత్యనూత్నంగా ఉంచుతున్నందున, తామే యాంకర్లుగా మారుతున్నందున, ఏ వార్తయినా రెండు మూడు రోజుల్లోనే ప్రజల మనసుల్లో మరుగున పడి, పాతబడిపోతుంది.

ఒక అంచనా ప్రకారం, ఒక్కరోజు యూట్యూబులో పోస్ట్ చేసిన వీడియోలను చూడడానికే ఒక మనిషికి తొంభై సంవత్సరాలు పడుతుందంటే, ప్రతిరోజు ఎంత సమాచారం, ఎన్ని కోట్ల వార్తలు సోషల్ మీడియా ప్రజలకు చేరవేస్తుందో ఊహించుకోవచ్చు.

అమెరికా ప్రెసిడెంట్ ఎన్నిక నుండి భారతదేశ ప్రధానమంత్రి ఎన్నికలో కూడా సోషల్ మీడియా గణనీయమైన పాత్ర పోషిస్తుందన్నది నిర్వివాదాంశం.

అందుకే ఆత్మీయులకు అత్యంత విషాదం కలిగించే వార్త, సాధారణ ప్రజలకు బాధాకరంగా ఉండడం లేదు. గతంలో ఏ దేశ నాయకుడైనా మరణిస్తే దేశ ప్రజలు మొత్తం సంతాప దినాలను పాటిస్తూ, విషాదంలో మునిగిపోయేవారు. ఇప్పుడు అదేం లేదు. మరణించిన వారి పార్థివ దేహాలను టీవీల్లో చూస్తూ భోజనం కూడా చేసేస్తున్నారు. ఒక్కోసారి మనలో మానవత్వం చచ్చిపోయిందా అని బాధ కలుగుతుంది.

ఈ మధ్యనే చనిపోయిన ‘భారతరత్న’ గానకోకిల లతామంగేష్కర్ గురించి కాసేపు చూపించిన ఛానెళ్ళు ఆమె అంతిమ యాత్ర సమయంలో కూడా ఆ విశేషాలు వదిలేసి మరో కుళ్ళు రాజకీయ చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేసారంటేనే మన ప్రజల, ఛానెళ్ళ మారిన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.

కాబట్టే, మెయిన్ టీవీ ఛానెళ్ళు కూడా కొత్త అప్‌డేట్స్ లేకపోవడంతో, అప్పుడప్పుడు, అక్కడక్కడ సంజయ్ కిడ్నాప్ విషయాన్ని ప్రస్తావిస్తున్నా, పెద్దగా ఫోకస్ చేయడం లేదు. కొన్ని అంతగా పాపులర్ కాని ఛానెళ్ళు, టీఆర్పీ రేటింగ్ కోసం పాకులాడే ఛానెళ్ళు సందీప్ కిడ్నాప్ గురించి చర్చలు పెట్టినా, క్రమంగా టాలీవుడ్, ఇన్ జనరల్, సందీప్ గురించి మరిచిపోయింది.

***

అయితే, సందీప్ కిడ్నాప్ వల్ల ‘త్రిబుల్ యస్’ వారి సినిమా, ఉక్రేయిన్ దేశ రాజధాని ‘కీవ్’ పట్టణంలో జరపాల్సిన పాటల చిత్రీకరణ ఆగిపోయింది. ఆ పాటలు తీయనవసరం లేకుండా, సినిమాను రిలీజ్ చేసే, అవకాశాలను నిర్మాతలు పరిశీలిస్తున్నారని మాకు తెలిసింది. ఆ సినిమాకు పనిచేస్తున్న ఎడిటర్ చాలా షార్ప్. షార్ప్ ఎందుకంటున్నానంటే అతను చేసిన సినిమాలలో, షార్ప్ కట్స్ ఉంటాయి. ‘ల్యాగ్’ (Lag) అంటే నస ఉండదు. ఉదాహరణకు,

“డ్రైవరును పిలువ్! ఏర్‌పోర్టుకు వెళదాం!” అని హీరో పిలిచే డైలాగుతో మొదలయ్యే సీనులో –  కొందరైతే హీరో పిలవడం, డ్రైవర్ వచ్చి చేతులు కట్టుకుని నిలబడడం, మళ్ళీ హీరో ‘రామయ్యా! ఏర్‌పోర్టుకు వెళదాం!’ అని చెప్పగానే, రామయ్య తలూపుకుంటూ వెళ్ళడం, అతని వెనకనే హీరో బోలెడన్ని మెట్లు దిగి, వరండా అంతా నడిచి, కారు దగ్గరకు రాగానే రామయ్య కారు తలుపు తీయడం, తర్వాత కారు సిటీ వీధుల్లో తిరిగీ తిరిగీ – ఏర్‌పోర్టుకు చేరడం వంటి దృశ్యాలన్నీ ఎడిటింగ్ తర్వాత, ప్రజల కోసం రిలీజ్ చేయబోయే సినిమాలో ఉంచేస్తారు. రెగ్యులరుగా సినిమా చూసే ప్రేక్షకులకు ఈ రొటీన్ వ్యవహారం బోర్ కొట్టిస్తుంది. ఇక్కడే, డైరెక్టర్ ప్రతిభను అంచనా వేసి, ‘రొడ్డకొట్టుడు’ సినిమా అని, ఇదంతా టైం పాస్ బేరమని తేల్చేస్తారు.

కానీ, ఎడిటరుకు మొత్తం సినిమా కథ మీద పూర్తి అవగాహన, చెప్పాల్సిన కథ మీద పట్టు ఉంటే, ఓవరాల్ సినిమా కథా స్కీములో, ఆ సీను యొక్క ప్రాధాన్యత ఎంత మేరకు ఉంటే బాగుంటుందోనని ఆలోచించి, ఈ సీను వల్ల సినిమాకు పెద్దగా ఉపయోగం లేదనుకుంటే,

“డ్రైవరును పిలువ్! ఏరుపోర్టుకు వెళదాం!” అని చెప్పగానే అక్కడ కట్ చేసి, తరువాతి షాట్ హీరో ఏరుపోర్టు ముందు కారు దిగుతున్నట్టుగా పెడతాడు. అదీ షార్ప్ కట్ అంటే, అతను షార్ప్ ఎడిటరంటే!

అయితే, డైరెక్టరుకు కూడా ఎడిటింగ్ కళ, ప్రక్రియ మీద అవగాహన ఉంటే పై సీన్లన్నీ తీయడు. తనకు కావలిసిన రెండు సీన్లు మాత్రమే షూట్ చేస్తాడు. లేకపోతే, అత్యంత ఖరీదైన హీరో కాల్ షీట్, కెమెరామెన్, లొకేషను, కాంబినేషన్ ఆర్టిస్టులు ఇంత మంది సమయం, శ్రమ వృథా అవుతుంది.

షూటింగులో ప్రతీ క్షణమూ ఖర్చుతో కూడుకున్నదే. నిర్మాత అన్న వాడికి ప్రతీ క్షణమూ ఖర్చవుతున్న రూపాయలే, కళ్ళ ముందు కదలాడుతుంటాయి. కరెన్సీ కౌంటింగ్ మిషనులో, నోట్లను లెక్కపెడుతున్నంత స్పీడుకన్నా, ఎక్కువ స్పీడుగా షూటింగు జరుగుతున్న రోజున డబ్బులు ఖర్చవుతుంటాయి.

ఇప్పుడైతే అంతా డిజిటల్ మీడియాలోనే, మెమొరీ కార్డులో కంటెంట్ అంతా నిక్షిప్తమవుతుంది. షూట్ చేసిన ఆ భాగాన్ని హార్డ్ డిస్కులోకి బదిలీ చేసుకుని మళ్ళీ మెమొరీ కార్డు వాడుకోవచ్చు. ఫిల్ము వృథా అన్న ప్రసక్తే ఉండదు. ఇప్పుడిలా మెమొరీ కార్డుల మీద షూటింగ్ జరుగుతుంది కానీ, ఓ ఇరవై ముప్ఫై ఏళ్ళ క్రితం వరకూ, సినిమా అంతా నెగటివ్ ఫిల్మ్ మీదనే జరిగేది. ఈ పనికి రాని సీనంతా తీయడం వలన కొన్ని లక్షల విలువైన ముడి ఫిలిం కూడా వృథా అయ్యేది.

పోనీ పై సీనులో ఏరుపోర్టుకు వెళ్ళే దారిలో హీరోకు యాక్సిడెంటో, హీరో మీద విలన్ల దాడో జరుగుతుందన్న సంఘటన స్క్రీన్ ప్లేలో ఉంటే అదంతా షూట్ చేయవచ్చు. అటువంటిదేమీ లేదనప్పుడు నిర్మాతకు లాభం కూర్చే, లాభం కూర్చే కాకున్నా, వృథా తగ్గించే, డైరెక్టర్ అయితే అదే విధంగా స్క్రీన్ ప్లే ప్లాన్ చేస్తాడు. సీన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత వివరణ అవసరమే కానీ, మరీ ప్రేక్షకుడిని బోర్ కొట్టించేంత నస ఉండకూడదు.

ఇదే సూత్రం రచనలకు కూడా వర్తిస్తుంది. చెప్పాల్సిన మ్యాటర్ లేనప్పుడు ప్రకృతి వర్ణనలు, సమ సమాజపు ఆందోళనలు, దేశభక్తికి సంబంధించిన విషయాలు చొప్పించి రచయిత కాగితాలను నింపే పని చేస్తాడు. నిపుణుడైన సంపాదకుడు ఆ విషయం పసిగట్టి చెత్తబుట్టకు పని చెప్తాడు.

ఈ విషయాలన్నీ నాకెలా తెలుసంటే, సందీప్ నన్ను ఉద్యోగంలోకి తీసుకున్న కొత్తలోనే సినిమా రంగంలో నటుడిగా రాణించాలంటే – డైరెక్షన్, కెమెరా, ఎడిటింగుల వంటి  మూడు ముఖ్య విభాగాలలోని సాంకేతిక విషయాలను క్షుణ్ణంగా గమనించమని చెప్పాడు.

***

సందీప్ ప్రస్తావన వచ్చేసరికి నా కళ్ళు చెమర్చాయి. సందీప్ కిడ్నాప్ వల్ల వ్యక్తిగతంగా సందీప్ తల్లిదండ్రులూ, వసుధా, నేనే ఎక్కువగా దుఃఖిస్తున్నాము.

మాకు ‘సందీప్’ ఒక కమాడిటీ, వస్తువు కాదు. సుధాకర్ నాయుడి గారికీ, సంధ్యారాణి గారికీ ఒక్కగానొక్క కొడుకు కిడ్నాప్ కావడం తీరని దుఃఖాన్నే మిగిల్చింది. నాకు ఆప్తమిత్రుడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అంతగా చనువుగా తిరగకపోయినా, వాడు నన్ను పిలిచి పీయ్యేగా అపాయింట్ చేసిన ఈ సంవత్సరంలో బాగా ఆత్మీయుడయ్యాడు. తనకు నేనొక నీడలాగా వ్యవహరించాను. పది మందిలో వాడికి పర్సనల్ అసిస్టెంట్ గానే విధులు నిర్వర్తించినా, ఏకాంతంలో మేమిద్దరమూ మంచి మిత్రులుగా ఎదిగాము. సందీప్ తన బలాలూ, బలహీనతలూ అన్నీ నాతో షేర్ చేసుకునేవాడు.

నేను సందీపుతో ఎంత క్లోజుగా ఉన్నా, ఎక్కడ నిశ్శబ్దంగా నిష్క్రమించాలో, అక్కడ బయటకు వెళ్ళిపోయే వాణ్ణి. అది వాడికి బాగా నచ్చింది. నా నోటి నుండి సందీప్ వ్యక్తిగత వివరాలు బయటకు రాకపోయేవి. నా మనసులోనే ‘సీల్డ్’ అయిపోయేవి. బహుశా, అందుకేనేమో సందీప్ నన్ను పిలిపించింది.

అప్పట్లో హిట్ సినిమాలతో పాటు సందీప్ మీద పుకార్లు కూడా బాగా వినిపించేవి. తామరతంపరగా తయారయిన యూట్యూబ్ ఛానెళ్ళూ, వెబ్‌సైట్లకైతే ప్రతి నిత్యమూ పండగలాగే ఉండేది?

‘ఫలానా ‘హీరోయిన్’ తో గోవాలో గడిపిందెవరు?’ అని ఒక వెబ్‌సైట్ హెడ్డింగ్ పెట్టి అందరి ముఖాలు కప్పేసి, ఒక వార్త వదులుతుంది. ‘ఫలానా డ్రగ్ ముఠాతో సంబంధమున్న యువ సినీ కథా నాయకుడెవరు?’ అని మరో యూట్యూబ్ ఛానెల్ మరో వీడియో రిలీజ్ చేస్తుంది.

వీటన్నిటికీ సందీపే టార్గెట్ అయ్యేవాడు. వీటిల్లో ఎంతో కొంత నిజం కూడా ఉండేది. ఆ కొంత నిజమైన వార్తయినా ఎలా బయటకు వచ్చిందంటే అందుకు సందీప్ దగ్గర పనిచేసే మేనేజర్లు, పీయ్యేలే కారణం. వాళ్ళు ఉప్పు అందించనిదే, నిప్పు లేనిదే, పొగ రాజుకోదు. అటువంటి వార్తలు సంజయ్, వాళ్ళ అమ్మనాన్నల కంట పడ్డప్పుడల్లా, ఇంట్లో రణరంగమే జరిగేది. అందుకే, తరుచుగా, ఆ వార్తలకు కారణమైన ఉద్యోగులను, మేనేజర్లను మార్చేసేవాడు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్ళ, వెబ్‌సైట్ల బ్లాక్‌మెయిలింగుకు భయపడి డబ్బులు కూడా చెల్లించేవాడు.

కానీ, నేనొచ్చిన సంవత్సరం నుండి ఈ పుకార్లన్నీ క్రమంగా తగ్గిపోయాయి. అప్పుడో, ఇప్పుడో ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే, తప్పుడు రాతలు రాస్తే లీగల్ నోటీసులు ఇస్తున్నాము; పరువు నష్టం దావాలు వేస్తున్నాము; చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి సందీప్ గురించి రాయాలంటే, ‘ఒక్క క్షణం’ ఆగి, ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here