నాకు అది పడదు

0
16

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]మ[/dropcap]ధు పార్క్ లోకి నడిచి వచ్చి, ఓ క్షణం తీక్షణంగా చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో కూర్చునే సిమెంట్ బెంచీలు ఏం కనబడలేదు, “ఏంటిది, పేరుకు పెద్ద పార్కే కానీ, ఇందులో కూర్చోడానికి మాత్రం సరిపడా బెంచీలు పెట్టలేనట్టుందే” అని ఓ క్షణం ఆలోచించి ‘బహుశా అలా పెడితే లవర్స్ బెడద పెరుగుతుందనో, లేక పార్క్‌కి వచ్చేవాళ్ళు, ఆ బెంచీల కోసం వెతుకుతూ నడిచి నాలుగు అడుగులు వేయాలనే ఉద్దేశమో మరి’ అని ఓ వైపుగా చూసి ‘హమ్మయ్య’ అనుకున్నాడు. కారణం, అక్కడ ఓ బెంచీ సగం ఖాళీగా కనిపించింది, గబగబా వెళ్ళి కూర్చున్నాడు.

అప్పటికే ఎవరో ఒక అబ్బాయి నీట్‌గా తయారయ్యి సూటు, బూటు వేసుకుని చేతిలో ల్యాప్‌టాప్‌తో పని చేసుకుంటున్నాడు. ‘ఎవరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుకుంటాను. మన వాలకం చూస్తే ఇలా ఉంది, పలకరిస్తే పరాగ్గా చూసి చిరాకు పడదు కదా’ అని మనసులో అనుకుంటూ, “మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీరా” అడిగాడు అతని వంక చిరునవ్వుతో చూస్తూ

“ఔనండీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్, నా పేరు శేఖర్, రోజంతా వర్క్ ఫ్రం హోం పేరుతో, గదిలో దూది పరుపులా, గూట్లో గుండ్రాయిలా ఉండి, ఉండి మహా బోర్ కొట్టింది. అందుకే రోజులో ఇలా ఓ గంట, రెండు గంటల పాటు ఈ పార్క్ లోకి వచ్చి, ఈ చల్లగాలికి పనిచేసుకుని వెళ్ళిపోతాను.”

“ఇలాంటి చక్కటి సాయంత్రం వేళ, పచ్చటి వాతావరణంలో, చల్లటి గాలిలో పని చేసుకోవాలనే మీ ఆలోచన బావుంది.” అని మధు ఏదో చెప్పేంతలో అతని ఫోన్ రింగ్ అయింది. “ఒన్ మినిట్” అంటూ ఫోన్ లిఫ్టు చేసి, “ఇప్పుడే బస్సు దిగాన్రా, దిగీ దిగగానే నీకు చాలా మార్లు ఫోన్ చేశాను. బహుశా నువ్ బిజీగా ఉండి ఉంటావనుకుని మరి చేయలేదు. ఆ.. ఆ.. నీ రూము నాకు తెలీదు. అందుకే నువ్వు చెప్పినట్టే ఆ పార్క్‌కే వచ్చాను. నీ కోసం వెయిట్ చేస్తాను. మీ ఆఫీస్ అయిపోగానే ఈ పార్క్‌కే నేరుగా వచ్చేయ్, ఓ కంగారు పడిపోయి వేగంగా రాకు. నిదానంగా రా, కలిసి నీ రూమ్‌కి పోదాం. అవున్రా నా ఇంటర్వ్యూ రేపే. సరే ఉంటాను” అని ఫోను పెట్టేశాడు మధు.

అతని మాటలు విన్న శేఖర్, అతన్ని కింద నుండి పై వరకూ ఓ సారి చూసి, ‘ఇతని వాలకం చూస్తుంటే ఉద్యోగం కోసం ఏ పల్లెటూరి నుండో ఈ పట్నానికి వచ్చినట్టున్నాడు’ అని మనసులో అనుకుని పైకి చిన్న చిరునవ్వుతో, “మిమ్మల్ని చూస్తుంటే, మీకు జాబ్ చాలా అవసరంలా అనిపిస్తోంది, ప్రస్తుతం నేను టీ టీ సాఫ్ట్‌వేర్ కంపనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. కావాలంటే మా కంపెనీలో మీకు.. ” అని ఏదో చెప్పేంతలోనే ఎవరో కత్తితో పొడవబోతున్నట్టు “నో, నో థాంక్స్” అని పైకి అనేసి ‘నా వాలకం చూసి జాలి పడుతున్నాడా ఏమిటి, అసలు ఎవరి కళ్ళలోనైనా నా మీద జాలి కనబడితే, నా కాళ్ళలో ముళ్ళు దిగినట్టుంటుంది’ అని మనసులో అనుకున్నాడు. తర్వాత కొంత సేపటికి మధు, “శేఖర్ మీరు ఏవీ అనుకోకపోతే, కొంచెం నా బ్యాగ్ చూస్తూ ఉంటారా. నేను వాష్ రూమ్‌కి వెళ్లి వస్తాను” అడిగాడు

సరే అన్నట్టు ల్యాప్‌టాప్ వైపు నుండి దృష్టి మరల్చకుండా తల ఊపాడు.

‘ఇదేవిటితను, కనీసం అతని ల్యాప్‌టాప్ లోంచి తల బయట పెట్టకుండానే తలని అలా నామ మాత్రంగా ఊపాడు. అయినా వాష్ రూమ్ కి వెళ్ళి రావడం రెండు నిమిషాలు పని, అంతేగా, ఈలోగా ఎవౌతుందిలే’ అని భుజానికున్న బ్యాగ్ తీసి బెంచ్ మీద పెట్టి వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. తిరిగి వస్తూ, వస్తూ ఆ బెంచ్ వైపు చూశాడు. ఏదో చూడకూడనిది ఏదో చూసినట్టు, చెవులు మూసుకుని మరీ “నో” అంటూ అరిచాడు. తన బ్యాగ్‌ని ఓ కోతి చేతిలోకి తీసుకుని బెంచి దిగింది. అది చూసి “శేఖర్, లేచి వెళ్ళి ఆ బ్యాగ్‌ని దాని చేతిలోంచి తీసుకోండి ప్లీజ్. అది వెళ్ళిపోతోంది, దాంట్లో నా సర్టిఫికెట్స్ ఉన్నాయి. అవి లేకపోతే నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్ళలేను. నా బతుకు బరంపురం బస్టాండ్ అయిపోద్ది. ఆ బ్యాగ్ తీసుకోండి” అంటూ గొంతు చించుకుని మరీ అరుస్తూ, అశ్వనీ నాచప్ప అన్నయ్యలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అది బ్యాగ్‌తో పాటు ఓ చెట్టు పైకి వెళ్ళిపోయింది. మధు ఒక్కసారే కారం తిన్న మనిషిలా బుసలు కొడుతూ, శేఖర్ వైపు చూసి, “ఏంటండీ మీరు ఇలా చేశారు. ఓ క్షణం మీరు చటుక్కున లేచి, లటుక్కున దాని చేతిలోని బ్యాగ్‌ని తీసుకుంటే సరిపోయేది కదా” అడిగాడు

శేఖర్ అతని మాటలు పెద్దగా పట్టించుకోకుండా, తన ల్యాప్‌టాప్ వైపు చూస్తూ “నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. నా పని డిస్టర్బ్ అవుతుంది, అందుకే పైకి లేవలేదు” చెప్పాడు

“అయినా నాదే పొరపాటు, మీ ఆహార్యం వెనుక ఉన్న అహంకారం చూడలేకపోయాను. మీ సూటు, బూటూ చూసి బోల్తా పడ్డాను. ఎవరు ఎలాంటి వారో తెలియకుండా నా బ్యాగ్ అప్పజెప్పాను” అని జేబులో ఫోన్ తీసి చూసుకుంటూ ఆ కోతిని వెంబడిస్తూ వెళ్ళిపోయాడు మధు.

అప్పుడే వచ్చి ఆ సంభాషణ అంతా విన్న శేఖర్ తమ్ముడు, “ఏంట్రా నువ్వు, అతను అలా అపార్థం చేసుకుని నిన్ను అన్ని మాటలంటుంటే మన్ను తిన్న పావులా గమ్మున ఉండకుండా అసలు విషయం చెప్పొచ్చు కదా” అడిగాడు కోపంగా

“నీకు తెలుసు కదా, నాపై ఎవరైనా జాలిపడితే నాకు నచ్చదని” చెప్పాడు శేఖర్, వాళ్ళ తమ్ముడు తెచ్చిన వీల్ చైర్ లోకి నెమ్మదిగా జరిగి కూర్చుంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here