నాలో నేను

0
5

(జి. వి. లలితకుమారి గారు రచించిన ‘నాలో నేను’ అనే కవితని అందిస్తున్నాము.)

[dropcap]నా[/dropcap]లో నేను, నాతో నేను మాట్లాడుకుని
ఎన్ని ఏళ్లు గడిచాయో

నడిచి వచ్చిన పథాన్ని – తప్పటడుగులతో వెనక్కి నడిస్తే
తప్పక తెలిసే తప్పుడు అడుగు లెన్నో

చిరుప్రాయాన – మల్లెలు విరిసినా, జల్లులు కురిసినా
హృదయంలో సువాసనా అమృత భావాలు వెల్లువయ్యేవి

ఆట ఐనా, పాట ఐనా, ఆ అందమైన అనుభవం
నన్ను అలరించేది

ప్రకృతి మౌనరాగమైనా, పడుచుల ముగ్ధ భావాలైనా
మనో ఆకాశంలో వెన్నెల్లా పరుచుకునేవి

పచ్చని పొలాల గడ్డి బాటలు విడిచి –
సిమెంట్ రోడ్డున నడక మొదలైన రోజునే –
కనులు మూసుకుంటే నక్షత్రాలు మాయమైనట్టు
సుభరిత భావనలన్నీ మిణుగురు పురుగుల వెలుగులైనాయి.

వివాహం, వినోదం, సంపాదనా, సమ్సారం – ఆనందం – ఐశ్వర్యం
వడి వడి ఝడులలో ఎపుడు ఎక్కడ నిలిచానో –
ఈ జీవితపు అంచున నిలిచి, నీలాకాశపు నిలువుటద్దములో
చూచినప్పుడు, ఒకప్పటి చక్కటి భావము హృది తలుపు తీసి –
తలపులో మెరుపులా మెరిసింది.

కిటికీలోంచి చల్లని గాలి దివ్య భావాన్ని ప్రేరేపించింది
తోటలోని ముద్దమందారం తేనె మధురిమ చిందించింది
అమృతపు బిందువేదో గొంతులోకి జారిందా?
పుడమి తల్లి ఒడిలో విరిసిన హరివిల్లు వంటి పంటభూమి
హరిత దుకూలపుటంచు నిజంగా అందుకున్నానా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here