నాందీ-ప్రస్తావన

2
9

[box type=’note’ fontsize=’16’] “మనకు వెనకటి తరం నుండి వచ్చిన పద్ధతులనండి, భావాలు అనండి లేక శబ్దాలు అనండి – అవి ‘నాంది – ప్రస్తావన’. దరిమిలా ఇవి నాట్యశాస్త్రం నుండి పరంపరగా వచ్చి, లౌకిక వ్యవహారంలో మిళితమైపోయిన పారిభాషిక శబ్దాలు. వీటి ప్రస్థానమే ఈ వ్యాసం” అంటున్నారు అంటున్నారు రవి ఇ.ఎన్.వి. [/box]

నమో వెంకటేశానమో తిరుమలేశానమస్తే నమస్తే నమః

నమో వెంకటేశా నమొ నమో తిరుమలేశా;

మహానందమాయే ఓ మహాదేవ దేవ..

సినిమా థియేటర్ నుండి ఘంటసాల పాట మారు మ్రోగసాగింది.

తొందరగ పదరాసినిమా మొదలయ్యేటట్టుంది’ –

ఒకటి – ఒకటిన్నర తరం వెనకటి మాట. ఎన్టీవోడు, నాగేసర్రావుల చివరి సినిమాల కాలం. అప్పట్లో సినిమా మొదలవ్వాలంటే పై పాట ఉండాల్సిందే. ఆ పాట మొదలవగానే ఇటు ప్రేక్షకుల గుండెల్లో కోటి వీణలు మ్రోగేవి. ఆ పాటతో తెర పైకి లేచేది. ఆపై పేర్లతో సినేమా మొదలు.

అలా సినిమా మొదలవనే అయింది. ఇది జంధ్యాల సినిమా. పేరు – ’శ్రీవారికి ప్రేమలేఖ’. మొదలవగానే తెరపై వచ్చే ఓ కోపిష్టి (వీరభద్రరావు) పాత్రకు ఆ సమయాన్ని, సందర్భాన్ని వివరిస్తూ తెర వెనుకల నుంచి ఓ వాయిస్ ఓవర్ రాసాగింది.

ఇట్లాంటి పద్ధతి ఈ మధ్యన సినిమాల్లో కూడా చాలా వాటిల్లో చూసి ఉంటారు.

  1. తెర పైకి లేవటం సినిమా కథ మొదలవ్వటానికి ముందు జరిగే ప్రక్రియ.అందులో భాగంగా ’నమో వెంకటేశా’ అన్న పాట వస్తోంది.
  2. ఆ తర్వాత టైటిల్స్.
  3. టైటిల్స్ తర్వాత- సినిమా కథకు చెందని ఒక వ్యక్తి (వాయిస్) కథ తాలూకు ఆరంభాన్ని, సందర్భాన్ని వినిపిస్తున్నాడు.

ఈ మూడున్నూ ఎక్కణ్ణుంచి వచ్చాయి? ఏ ప్రక్రియకైనా ఓ ప్రేరణ, ఓ కారణం ఉండి ఉండాలి కదా, అదేది? ముఖ్యంగా మూడవ ప్రక్రియ – తెరపై నటుడిని/దృశ్యాన్ని చూపిస్తూ, తెర వెనుక ఓ వాయిస్ – తెరపై పాత్ర/దృశ్యం గురించి ఇంట్రో ఇవ్వాలన్న ఆలోచన ఎక్కడిది? అసలా ఆలోచన దర్శకుడికి ఎలా వచ్చి ఉంటుంది? దానికి మూలమెద్ది?

పైని వరుస, ఇంచుమించు అలాగే మన ప్రాచీన సంస్కృత నాటకాల్లో ఉండేది. ఆ ప్రక్రియలకు నాట్యశాస్త్రంలో పేర్లు కూడా పెట్టారు.

 పూర్వరంగమ్.

నాందీ

ప్రస్తావనా

ఆ ప్రక్రియలే ఆధునిక రూపమైన సినేమా లో రూపాన్ని మార్చుకుని అక్కడక్కడా నడుస్తున్నాయి. ఇంతకూ ఆ ప్రక్రియల కథా కమామీషు ఏమిటి? ‘పూర్వరంగం’ – ఇది కాస్త పెద్ద తంతు. దీనిని క్లుప్తంగా చెప్పుకుని మిగిలిన నాందీ ప్రస్తావనలను పరిశీలిద్దాం. .

నాంది’ కి ప్రస్తావన:

లౌకిక జీవనంలో మనకు తెలీకుండా మనం కొన్ని ప్రాచీన సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటాం. ప్రాచీనుల పద్ధతుల్లో ఆలోచిస్తూ ఉంటాం. అలా ఎప్పుడో సంస్కృత నాటకాల నుంచి వచ్చిన సాంప్రదాయాలు అవి. ఆ సాంప్రదాయాలను తెలుసుకోవడానికి నాట్యశాస్త్రానికి, వెళ్ళాలి. లేదా కనీసం వెయ్యేళ్ళు వెనక్కెళ్ళి దశరూపకం, సాహిత్యదర్పణం లాంటి అలంకారిక గ్రంథాలను కాస్త తిరగెయ్యాలి. మనకు వెనకటి తరం నుండి వచ్చిన పద్ధతులనండి, భావాలు అనండి లేక శబ్దాలు అనండి – అవి ‘నాంది – ప్రస్తావన’. దరిమిలా ఇవి నాట్యశాస్త్రం నుండి పరంపరగా వచ్చి, లౌకిక వ్యవహారంలో మిళితమైపోయిన పారిభాషిక శబ్దాలు. వీటి ప్రస్థానమే ఈ వ్యాసం.

సంస్కృతసాహిత్యంలో రూపకం – అన్నది నిజానికి పది రకాలు. వాటిని దశరూపకాలు అన్నారు. సౌలభ్యం కోసం ఆయా భేదాలను వదిలి, స్థూలంగా అన్ని భేదాలను కలిపి ’నాటకం’ గానే ఈ వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది.

ప్రాచీన కాలపు పూర్వరంగం:

చాలా ప్రాచీనకాలంలో సంస్కృత నాటకం ఆరంభం అవడానికి ముందు రంగమంటపాన్ని అలంకరించటం, గాయకులు తమ వాయిద్యాలను సరిచూసుకోవటం, శ్రుతి చూసుకోవటం, దేవతలను ఆవాహన చెయ్యటం, దిక్పాలకులను వందనం, నటీనటుల ఆహార్యం, దీప ప్రజ్వలనం – ఇత్యాది కార్యక్రమాలు కూడా నాటకంలో భాగంగా సాగేవి. వీటన్నిటికి కలిపి ’పూర్వరంగం’ అని పేరు. భరతుని నాట్యశాస్త్రంలో ఐదవ అధ్యాయంలో ఈ పూర్వరంగాన్ని విశదంగా వర్ణించాడు. పూర్వరంగంలో 19 అంగములు. అందులో 9 అంతర్యవనికకు చెందిన అంగములు., అంటే తెరలోపల కొనసాగేవి. మిగిలిన 10 బహిర్యవనికములు.

ఈ కార్యక్రమాలను పర్యవేక్షించటానికి ఒక మేనేజరు ఉండేవాడు. వాడిని సూత్రధారుడు అన్నారు. ’పూర్వరంగం’ చిట్టచివరన వచ్చే అంశం నాంది. నాంది అంటే ఆనందింపజేసేది. సరిగ్గా ఇక్కడే నాటకానికి కావలసిన సన్నాహాలు అన్నీ ముగిసి అసలైన నాటకం రంగస్థలంపై మొదలవుతుంది. నాంది మొదలుకుని కవి రచన ఆరంభం. నాంది – అంటే కొంత నాటకానికి అవతలిది, కొంత ఇవతలిది.

చాలా ప్రాచీనకాలంలో – భాసుని కాలంలో ’నాంది’ కార్యక్రమం చివర సూత్రధారుడు ప్రవేశించేవాడు. “నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః” (“ఆపై నాంది చివరన సూత్రధారుడు వచ్చాడు”) – ఈ నిర్దేశంతో నాటకం ఆరంభమయ్యేది. నాటకపు నాందిని సూత్రధారుడే గానం చేసేవాడు.

ఆ పై ఆతడే నాటకంలోని ఏదో ఒక పాత్రను తెరపై ప్రవేశపెట్టి సుతారంగా తప్పుకుంటాడు. ఇది ప్రస్తావన. (భాసుడు ఈ వ్యవహారాన్ని ’స్థాపన’ అన్నాడు.)

నాంది నిర్వచనం:

సూత్రధారుడు రాగానే – ఆడబోయే నాటకం తాలూకు ఇతివృత్తాన్నో, నాటకం తాలూకు పాత్రలనో ప్రస్తావిస్తూ, ఓ శ్లోకం చదువుతాడు. ఇది నాంది. సంస్కృత నాటకాలలో నాంది – దీని గురించి సమగ్రంగా అయితే ఓ పుస్తకమే వ్రాయవచ్చు. అంత అవకాశం ప్రస్తుతానికి లేదు కనుక నాందిని గురించి కొన్ని విషయాలను ముచ్చటించుకుంటూ, కొన్ని కావ్యాల సాయంతో ఈ నాందిని అనుశీలించుకుంటూ పోదాం.

నాందికి కొన్ని నియమాలు (సూచనలు) ఉన్నాయి.

ఆశీర్వచన సంయుక్తా స్తుతి ర్యస్మాత్ ప్రయుజ్యతే

దేవద్విజనృపాదీనాం తస్మాన్నాందీతి సంజ్ఞితా |

మంగల్య శంఖ చంద్రాబ్జ కోక కైరవ శంసినీ

పదైర్యుక్తా ద్వాదశభి రష్టాభిర్వా పదై రుత |

యత్రాష్టాభి ర్ద్వాదశభి రష్టాదశభి రేవ వా

ద్వావింశత్యా పదై ర్వాపి సా నాన్దీ పరికీర్తితా |

శబ్దతో వాపి మనాక్కావ్యార్థ సూచన పదాది నియమోపి వా

నందంతి దేవతాః యస్మాత్ తస్మాన్నాన్దీతి సంజ్ఞితా | (సాహిత్యదర్పణం)

నాంది – ఆశీర్వచన పూర్వకంగాను, దేవ ద్విజ నృపుల కెవరకైనా స్తుతి వస్తువుగానూ ఉండాలి.

మంగళకరమైన చిహ్నాదులైన శంఖము, చంద్రుడు, పద్మము, కలువ, చక్రవాకము, బిల్వము లలో ఏవేని చిహ్నములు ఉండాలి. (చంద్రుణ్ణి అర్చించటంలో భాగంగా ఇందు/చంద్ర వాచకం ఉండాలని నాట్యశాస్త్రం.)

నాంది సాధారణంగా ఎనిమిది పదాలతో ఉండాలి. 8, 12, 18, 22 పదాలతో కూడా ఉండవచ్చు. (పదము – అంటే శబ్దమని, పద్యపాదమనీ కూడా అర్థం)

ఈ శ్లోకాన్ని గేయం లాగా, పూర్తీగా లోగొంతుకలోనూ కాక, అలా అని భీకరమైన గొంతుతోనూ కాక, ఒకింత మంద్రంగా మధ్యమ స్వరంలో ఆలాపించాలి.

నాంది వలన దేవతలు ఆనందిస్తారట. నంద్యంత ఇతి నాన్దీ’. దేవతలను నందింపజేయునది – ’నాందీ’. ’నాంది’కి మరొక ఆసక్తి కరమైన వ్యుత్పత్తి కూడా ఉంది. ’నంది’ కి సంబంధించినది ’నాంది’ అట.

నందికేంటి సంబంధం?

నన్దీ వృషో వృషాంకస్య జగదాదౌ జగత్పతేః

నృత్యతః కల్పనాయోగాజ్జగామ కిల రంగతామ్

తస్య తద్రూపసంబద్ధా పూజా నాందీతి కథ్యతే’

సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు (వృషాంకుడు) నృత్యం (ఆనందతాండవం) చేయ సంకల్పించాడు. అప్పుడాయన నృత్యానికి రంగభూమి గా ’నంది’ అవతరించినాడట! అలా రంగస్థలంగా మారిన నందికి ఒనరించే పూజ కాబట్టి నాంది అన్నారు.

’నంద’ శబ్దానికి మరొక అర్థం వృద్ధి. నాంది వలన నాట్యానికి (నాటకానికి) అడ్డంకులు తొలగి అది పరివర్ధితమవుతుంది. అందుచేత కూడా ’నాంది’. నందంతి నాట్యమనయా ప్రత్యూహాపోహాత్ యితి నాన్దీ’ అలా ఉంటే నాందీ శబ్దానికి పర్యాయపదంగా ’ప్రరోచన’ అన్న శబ్దాన్ని కూడా కొందరు పేర్కొన్నారు. ప్రరోచన – ’ప్రకృష్టం రోచయతీతి’ – గొప్ప ఉత్సుకతను కలిగింపజేసేది. ఇది నాంది కి ఇంచు మించు సమానార్థకమే.

నాన్దీ – ఇది సంస్కృతం. తెనుగులో ’నాంది’ అని అనవచ్చు. సంస్కృతంలో నాటకసాహిత్యం చాలా చాలా ప్రాచీనమైనది. రామాయణంలోనే నాటకాల ప్రస్తావన ఉంది. బుద్ధుడు ఒకానొక సూత్రధారుణ్ణి మందలిస్తూ చేసే సంభాషణ – బౌద్ధ నికాయాలలో ఒకచోట కనిపిస్తుంది. ఎన్నో అద్భుతమైన నాటకాలు నేడు ఖిలమై పోయినాయి. నేడు దొరుకుతున్న నాటకాలలో అత్యంత ప్రాచీనులు అశ్వఘోషుడు, భాసుడు, చతుర్భాణి అన్న నాలు భాణాలు రచించిన రచయితలు. భాసుడు, చతుర్భాణి రచయితలు నాటకంలో నాందిని క్లుప్తంగా, సరళంగా నిర్వహించారు.

నాంది శ్లోకం – నాటకరచయితల (కవుల) ప్రతిభకొక గీటురాయి. దీనిని కవులు ధ్వని మార్గంలోనో, శబ్దశ్లేషతోనో రచించడం రివాజు. ఈ నాంది శ్లోకాలలో కొన్నిటిని మనం చూద్దాం.

కొన్ని ఉదాహరణలు:

ఈ నాంది విషయంలో రెండు పద్ధతులు కనిపిస్తాయి. కావ్యంలో పాత్రలను పరిచయం చేస్తూ, కావ్యనాయకుణ్ణి ఉద్యోతిస్తూ చెప్పే నాంది మొదటిది. కావ్యార్థ సూచనలో భాగంగా కథను పరోక్షంగా ఉద్యోతిస్తూ చెప్పే నాంది రెండవది.

మొదటి పద్ధతి సరళం. భాసకవి ప్రతిమా నాటకంలోని నాంది ఇది.

సీతాభవః పాతు సుమన్త్రతుష్టః సుగ్రీవరామః సహలక్ష్మణశ్చ |

యో రావణార్య ప్రతిమశ్చ దేవ్యా విభీషణాత్మా భరతోనుసర్గమ్ ||

యః = ఎవఁడు; సుమన్త్రతుష్టః = చక్కని ఆలోచన చేత పరిపూర్ణమైన వాడై; సుగ్రీవరామః = చక్కని కంఠము గల వాడై; లక్ష్మణశ్చ సహ = లక్ష్మణునితో బాటు; (పితృవాక్యపరిపాలకుడన్న చిహ్నముతో) రావణారి = రావణుని శత్రువై; విభీషణాత్మా = (అసురుల పాలిటి) భీషణమైన ఆత్మ కలవాడై; అప్రతిమః చ = స్థంభింపని పరాక్రమవంతుడై; (అప్రతిమ ప్రభావుడై) దేవ్యా = దేవి చేత; భరతః అనుసర్గమ్ = భరతుడు (తన బాటను) అనుసరించుట గలవాడో (అట్టి); సీతాభవః = సీతాపతి; (మనలను) పాతు = రక్షింపుగాక!

చక్కని ఆలోచన కలవాడై, చక్కని కంఠము గలవాడై, రావణుని శత్రువై, అసురులపాలి భీకరుడై, అప్రతిమ ప్రభావుడై, దేవిచేత, లక్ష్మణుని చేత అనుసరింపబడుచూ, భరతునికి మార్గదర్శియై ఉన్నాడో, అట్టి సీతాపతి మనలను రక్షించుగాక!

నాటకంలోని ప్రధానపాత్రల పేర్లు చెబుతూ, ఆయా పేర్ల వ్యుత్పత్తులను ఉపయోగించుకుంటూ, అలవోకగా అల్లిన నాంది యిది. ఈ నాందిలో భరతోనుసర్గమ్ అన్నచోట – భరతుడు అన్న పేరిట నాట్యశాస్త్రకర్తను కూడా ఉద్యోతించటం గిలిగింతలు పెట్టే చమత్కారం.

కాకపోతే ఈ నాందిలో చంద్రుని ప్రస్తావన కానరావడం లేదు. రామచంద్రుడు ఉండగా చంద్రుడెందుకిక, అనుకున్నాడేమో కవి!

సాధారణంగా సంస్కృతకావ్యాలను తెనిగించినప్పుడు ’నాంది’ని – సంస్కృతం తాలూకు అదే అర్థంతో, సున్నితత్వంతో అనువదించటం కష్టమే. ప్రతిమ నాటకానికి అనేక తెనుగు అనువాదాలు ఉన్నాయి. ఈ అనువాదాల్లో అర్థవంతమైన నాంది యడవల్లి ఆదినారాయణ గారిది.

:

భావిత ధీసుమంత్ర పరివర్ధిటుడున్ భరతుండు జానకీ

భావుకసంవిధాతృడు ప్రసన్న విభీషణ మానసుండు సు

గ్రీవనుతాభిరాము డురు కీర్తియు నప్రతిమ ప్రభావుడున్

రావణ విద్విషుండు సహలక్ష్మణుడోముత సర్గసర్గమున్

అలా ఉంచితే – భాసుని వలే క్లుప్తతను పాటించే ఉద్దేశ్యాన్ని గుర్తెరిగిన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి నాంది ఇది.

తే.గీ||

సీతచెలికాఁడు లక్ష్మణాశ్రితుడు భరత

హితుఁడు సుగ్రీవరాముఁడ ప్రతిమమతి సు

మంత్రనుతుఁడు విభీషణాత్మకుఁడు రావ

ణారి యగుశౌరి మీకు శ్రేయములొసంగు

భాసుని స్వప్నవాసవదత్తమ్ నాటకపు నాందిని గురించి ఈ లంకె లో తెలుసుకోవచ్చు.

శాఖాచంక్రమణం మాని, మళ్ళీ విషయానికి; నాంది రెండు పద్ధతులలో ఉంటుందని చెప్పుకున్నాం. కథాపాత్రలతో ఒక నాంది అయితే, మరొకటి కథావస్తువుకు చెందినది అన్నాం. ఈ రెండవ పద్ధతి నాందికి భాసుడి తర్వాతి కాలపు నాటకకర్తలు మొగ్గు చూపటం కనిపిస్తుంది. కథావస్తువును, కథలోని సంఘటనలను ఉద్యోతిస్తూ, అదే సమయంలో పరోక్షంగా దైవస్తుతి చేస్తూ నాంది నిర్వహించటం క్లిష్టమైన విషయమే అయినా సంస్కృత కవులు మహాప్రతిభతో దీనిని నిర్వహించారు. అయితే ఈ రెండవపద్ధతికి అనాయాసమైన దేశీ ఛందస్సులు చాలవు. మత్తేభ, శార్దూల, స్రగ్ధర, మహా స్రగ్ధర ఇత్యాది వృత్తాలు కవులకు అవసరమయినాయి.  కాళిదాసు రచించిన మూడు నాటకాల్లోనూ (అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రమ్) ఈశ్వరస్తుతి ప్రధానాంశంగా కావ్యార్థాన్ని పరోక్షంగా చెప్పటం ఉంది.

కాళిదాసును అనుసరించినప్పటికీ, స్వీయప్రతిభ వెలుగులనూ అమోఘంగా ప్రకాశింపజేసిన చక్కని హర్షవర్ధనుడు ఆయన కాళిదాసు లాగానే మూడు నాటకాలు వ్రాశాడు. నాగానందం, రత్నావళి, ప్రియదర్శికా. ఈ మూడింటిలో ప్రియదర్శికా అన్న నాటకంలోని నాందిని చూడండి.

ధూమవ్యాకులదృష్టి రిన్దుకిరణైరాహ్లాదితాక్షీ పునః

పశ్యన్తీ వరముత్సుకానతముఖీ భూయోహ్రియా బ్రహ్మణః,|

సేర్ష్యా పాద నఖేన్దు దర్పణగతే గఙ్గాం దధానే శివే,

స్పర్శాదుత్పులకాకరగ్రహవిధౌగౌరీ శివాయాస్తు వః ||

గౌరీదేవి, శంకరుల వివాహం జరుగుతోంది. ఆ సందర్భంలో యజ్ఞం లో పొగ కారణం చేత ఆమె కళ్ళు కలతపడినాయి; కానీ ఆ కలతను పోగొడుతూ వరుడు శంకరుని తలపైనున్న చంద్రకిరణాలు వెన్నెలలు కురిపిస్తే, అంతట ఆమె కనులు సుఖమునందినవి. గౌరీదేవి పెండ్లికుమారుని మీద తమకముతో ఆతని ముఖాన్ని చూస్తోంది, కానీ పక్కన ఉన్న బ్రహ్మ తనను గమనిస్తున్న కారణమున సిగ్గుపడి తలవంచుకున్నది. ఇంతలో ఆమె కాలిగోట పరమేశ్వరుని తలపైని గంగ ప్రతిఫలించగా, ఆ గంగను చూసి అసూయపడుతోంది. ఆ అసూయను కప్పేస్తూ వరుడు హరుని కరగ్రహణంతో గగుర్పాటు చెందుతోంది. ఇట్టి అవస్థ గల ఉమాదేవి, ఓ సామాజికులారా! మీకు మంగళము చేకూర్చు గాక!

మొత్తం శ్లోకమే మంగళకరం. పైగా ఇందు ప్రస్తావన కూడా ఉంది. ఈ శ్లోకం ద్వారా కవి చేసిన ప్రధాన కావ్యార్థసూచన – ఇదివరకే వాసవదత్తతో పెళ్ళయిన వత్సరాజు ఉదయనుడితో ప్రియదర్శికకు వివాహమవటం. ఇంకా కావ్యఘట్టాల సూచన కూడా ఉన్నది కానీ ప్రస్తుతానికి ఇంతే చెప్పుకోవటం సబబు.

నిజంగానే నాన్దీ – ఈ శబ్దం హర్షవర్ధనుని రచనతో సార్థకనామధేయ అయింది కదూ! ముద్రారాక్షసం అనే నాటకం సంచిక పత్రికలోనే ధారావాహికగా వస్తోంది. అందులో నాందిని టీకా తాత్పర్య సహితంగా ఈ లంకె లో చూడండి.

ముద్రారాక్షసం నాందిలో భాగంగా రెండు శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలో నాలుగు పాదాలు, వెరసి ఎనిమిది పాదాలతో ఇది అష్టపద నాంది. ఈ నాందిలో కథాసూచన చేస్తూ, ఇటు నాందికి చెందిన “చంద్రుని”కి సంబంధించిన సూచనను కవి పాటించాడు. ఇది కవి చమత్కారం.

అలా ఉంటే మృచ్ఛకటిక నాటకకర్త అయిన శూద్రకుడు భాసకవిలా క్లుప్తంగానూ, కాళిదాసాది కవుల ధోరణిలో విశదంగానూ ఒక్కొక్క శ్లోకాన్ని నాంది లో భాగంగా వ్రాశాడు. ఆ రెండు శ్లోకాల్లో రెండవదీ, క్లుప్తంగా ఉన్నదీ అయిన శ్లోకం ఇదీ.

పాతు వో నీలకణ్ఠస్య కణ్ఠః శ్యామామ్బుదోపమః |

గౌరీభుజలతా యత్ర విద్యుల్లేఖేవ రాజతే ||

చందనపు మేని గౌరీదేవి బాహువు కారుమబ్బు వంటి ఏ నీలకంఠుని మెడను మెఱుపుతీగవలె కౌగిలించియున్నదో, అట్టి మెడ మిమ్ములను రక్షించుగాక!

కారుమబ్బు – చారుదత్తుని, మెఱుపుతీగ – వసంతసేననూ సూచిస్తోందని మృచ్ఛకటిక వ్యాఖ్యాత రామానుజయ్యంగారు గారు వ్రాశారు.  ఈ మెఱపు – మేఘము చాలా కావ్యాల్లో సుప్రసిద్ధమైనది. తెనుగున అన్నమయ్య కూడా ’మెఱపు – మేఘము కూడి మెరసినట్లుండె’ అని ఉపయోగించాడు.

కాళిదాసుతో తీవ్రమైన స్పర్ధను పాటించిన భవభూతి, తన ఉత్తరరామచరితమ్ లో క్లుప్తమైన నాందిని, ఇంకొక కావ్యమైన మాలతీమాధవమ్ లో విపులమైన నాందిని నిర్వహించటం గమనార్హం.

సంస్కృతరూపకాలలో వ్యాయోగం, సమవకారం, భాణం ఇత్యాది రూపకభేదాలు – ఏకాంకికలు. ఈ ఏకాంకికలల్లో కూడా భాణం విశిష్టమైనది. మనకు దొరుకుతున్న భాణాల్లో మానవల్లి కవి గారు వెలికితీసిన చతుర్భాణి అన్న నాలుగు భాణాలు ప్రముఖమైనవి. ఈ భాణాల్లో వస్తువు పూర్తిగా సామాజికం. వీటిల్లో ఘాటైన శృంగారం కూడా ఉన్నది. వీటిల్లో సాధారణంగా నాందిని క్లుప్తంగానే నిర్వహించారు, ఒక్క ’ఉభయాభిసారిక’ అన్న భాణంలో తప్ప. అందులో కవి వరరుచి, చాలా చిత్రమైన,అందమైన, శృంగారభరితమైన ఆశీర్వచనాన్ని నాంది రూపంలో రచించాడు.

కోపి త్వం మే? కా వాహం తేవిసృజ శఠ మమ నివసనం ముఖం కిమక్షేపసే?

న వ్యగ్రాహం జానే హీ హీతవ సుభగ దశనవసనం ప్రియాదశనాఙ్కితమ్ |

యా తే రుష్టా సా తేనాహంచపల హృదయనిలయాం ప్రసాదయ కామినీం

ఇత్యేవ వః కందర్పార్తాః ప్రణయకృత కలహకుపితా వదన్తు వరస్త్రియః ||

“నువ్వు నాకేమవుతావోయ్? నీకు నేనేంటి? ఓయీ ధూర్తుడా, నా ఇంటిచుట్టూ తిరుగడం మానేయ్, నా ముఖమేం చూస్తావు? ఓయీ గొప్పవాడా! నేనేం నీకోసం బెంగపెట్టుకోలేదు. ప్రియురాలి పంటినొక్కు పడిన నీ పెదవిని గుర్తుపట్టినాను. ఒరే చపలుడా, అలా నీపై కోపం చూపించిందే, ఆమెయే నీది. నేను కాను. నీ మనసులో ఉన్న ఆ అమ్మాయిని అనుగ్రహించు పో!” – మదనబాధతోనూ, ప్రణయకలహంతోనూ కూడిన కోపంతో అందమైన అమ్మాయిలు ఈ విధంగా మీతో చెప్పుదురు గాక!

పైని నాంది కథావస్తువులో భాగమే.

ఇలా పలుపోకడలు పోయిన నాంది, కాలక్రమంలో – శ్రవ్యకావ్యాలలో, చంపువులలో కూడా చోటు చేసుకున్నది. దశకుమారచరితమ్ లో దండి – ఎనిమిది మంది రాకుమారుల విజయయాత్రను ప్రస్తావిస్తూ, త్రివిక్రముని ప్రస్తావిస్తూ అపూర్వమైన నాంది శ్లోకం వ్రాశాడు. దానిని ఇక్కడ చదువుకోవచ్చు. తెలుగు కావ్యసాంప్రదాయంలోనూ ’ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశో వాపి తన్ముఖమ్’ – ఆశీర్వచనం, నమస్కృతి, లేదా కావ్యవస్తువును సూచించే విధంగా కావ్యారంభం మంగళకరంగా ఉండాలని నిర్దేశించబడింది. దరిమిలా తెలుగు కావ్యాలు మంగళకరమైన ’శ్రీ’ శబ్దంతో, మ గణంతో ఆరంభించటం పరిపాటి అయింది. స్థాలీపులీకంగా ఒక్క ఉదాహరణ చూద్దాం. ఇది అల్లసాని పెద్దన రచించిన స్వారోచిషమనుసంభవ కావ్యారంభం.

శ్రీవక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా

దేవిన్ తత్కమలాసమీపమునఁ బ్రీతిన్ నిల్పినాఁడో యనం

గా వందారు సనందనాది నిజభక్తశ్రేణికిన్ దోఁచు రా

జీవాక్షుండు కృతార్థుఁజేయు శుభదృష్టిన్ గృష్ణరాయాధిపున్

శ్రీలక్ష్మీదేవిని నారాయణుడు కౌగిలించుకొన్నాడు. ఆమె పయ్యెదపైని కస్తూరి తన ఱొమ్మునకంటుకొన్నది. ఆ చిహ్నము – సనకసనందనాదులకు – విష్ణుమూర్తి యెదపై భూదేవితో బాటు శ్రీదేవియు నిల్చినదా అన్నట్టుగా కనిపించినది. అట్టి శ్రీమన్నారాయణుడు కృష్ణరాయప్రభువును కృతార్థుని చేయుగాక.

లక్ష్మీదేవి పయ్యెద యొక్క కస్తూరి భూదేవి లా మునులకు కనిపించడం – గంధర్వుడు వరూధినికి ప్రవరుని వలె కనిపించడం అన్న కావ్యార్థ సూచనగా వ్యాఖ్యాతలు.

నాంది కథ యిది.  నాందికి, పూర్వరంగానికి సమానంగా ఆంగ్లంలో Prologue అన్న మాట ఉంది. నాందికి Prologue కి అర్థాలలో ఉన్న వ్యత్యాసం స్పష్టమే.  నాంది నుండి ఇక ఇక ప్రస్తావనకు.

ప్రస్తావన:

నాంది ద్వారా నాటకపరిచయం అయింది. తర్వాత నాటకం లో భాగమైన కనీసం ఒక నటకుణ్ణి తెరపై రానిచ్చి, అతణ్ణి పరిచయం చేసి, ఆట్టే సామాజికుల బుర్ర తినకుండా సూత్రధారుడు (Stage Manager) తప్పుకోవాలి.  ఈ కార్యక్రమానికి ప్రస్తావన లేదా ఆముఖం అని పేరు.

సూత్రధారుడు మారిషునితోఁ గాని నటితోఁ గాని విదూషకునితోఁ గాని ప్రస్తుత కథాసూచకంబుగాఁ దమ కార్యమును గూర్చి చిత్రమైన సంభాషణమొనరించుటయే ప్రస్తావనానామంబునఁ బరఁగునుఇందు మారిషునకు మార్షుఁడు పారిపార్శ్వికుఁడు నని నామాంతరములు గలవు.” – అని మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారి తెలుగు దశరూపకంలో నిర్వచనం.

నాట్యశాస్త్రపు తదనంతర కాలంలో ఆముఖం అన్నది కథలకు, ప్రస్తావన అన్నది నాటకాలకూ పరిమితమయ్యింది. ప్రస్తావన ను చాలా ప్రాచీన కాలంలో ’స్థాపనా’ అని అన్నారు. భాసుని నాటకాల్లోనూ, చతుర్భాణిలోనూ ఈ ’స్థాపన’ అన్నది కనిపిస్తుంది.

ప్రస్తావనను దశరూపకకారుడు ధనంజయుడు మూడు రకాలుగా వింగడించినాడు.

తత్ర స్యుః కథోద్ఘాతః ప్రవృత్తకమ్ |

ప్రయోగాతిశయాశ్చాథ….”

ప్రస్తావన మూడు విధాలు.

  1. కథోద్ఘాతము
  2. ప్రవృత్తకము
  3. ప్రయోగాతిశయము

రెండవదైన ప్రవృత్తకమ్ తో ఆరంభిస్తాను, కొంచెం సౌలభ్యం కోసం.

  1. ప్రవృత్తకమ్

– అంటే ఏంటి?

 కాలసామ్యసమాక్షిప్తప్రవేశః స్యాత్ ప్రవృత్తకమ్ |” అని నిర్వచనం.

కాలాన్ని (ఋతువును), సందర్భాన్ని చెబుతూనే (శ్లేషతో) ఓ పాత్ర స్వరూపాన్ని నిక్షిప్తం చేసి పాత్రను ప్రవేశపెట్టే పద్ధతినే ప్రవృత్తకం అంటారు. ఈ ప్రవృత్తకాన్ని సాధారణంగా సూత్రధారుడు స్వయంగా పఠించడం ఉంటుంది. (ఒక్కో సారి నాటకపు పాత్ర కూడా)

దీనికి ఉదాహరణగా ఛలితరామమ్ అన్న నాటకపు ప్రస్తావనను ఉటంకిస్తాడు దశరూపక కర్త.

ఆసాదితప్రకటనిర్మల చంద్రహాసః

ప్రాప్తః శరత్సమయ ఏష విశుద్ధకాంతః |

ఉత్ఖాయ గాఢతమసం ఘనకాలముగ్రం

రామో దశాస్యమివ సంభృతబంధుజీవః ||

వెల్లడి అగుచున్న, నిర్మలమైన చంద్రకాంతులు కలిగినదియై, నిర్మలమైన వెన్నెలలతో ఈ శరత్కాలము వచ్చియున్నది.  చిక్కని తమస్సును, ఉగ్రమైన వర్షాకాలమును హరించుచూ, ఈ శరత్కాలము దశముఖములు కలిగి మంకెనపూలతో భాసించుచున్నది. – ఇది శరత్కాలపరంగా అర్థం.

చిక్కని కాంతులు ప్రకటితమైన (రావణుని) చంద్రహాస ఖడ్గము కలవాడై, చిక్కని తమస్సును, ఉగ్రమైన వర్షాకాలమును హరించుచూ వచ్చిన శరత్కాలము వలే, (కష్టాలు తొలగి) రావణుని నుండి బంధుజనులను (సీతను) తిరిగి పొందిన వాడై రాముడు ప్రకాశించెను. – ఇది రాముడి పరంగా అర్థం.

ప్రస్తావనలో కాలం (ఋతువు) గురించి ఎందుకు చెప్పుకోవాలి? – సంస్కృత నాటకాలు ఆడే కాలంలో తెరపై ఆయా ఋతువులను (వాటి చిహ్నాలను) చూపే అవకాశం లేదు. అందుకే ఋతువును శ్లోకం ద్వారా వాచ్యం చేస్తూ, వర్ణిస్తూ చెప్పడం ఆనవాయితీ అయింది.

నాటకాల్లో ఋతువును వర్ణించడం విధాయకం అయింది. నాటకపు ఇతివృత్తం వివాహానికి సంబంధించినదితే వసంతకాలాన్ని కానీ, గ్రీష్మాన్ని కానీ చెప్పాలని, యుద్ధవిషయమైతే శరత్కాలాన్ని చెప్పాలని ఒక సాంప్రదాయం. ’శరత్ సంగ్రామ విషయేవివాహే గ్రీష్మ మాధవౌ

వ్యాసం మొదట్లో మనం జంధ్యాల సినిమా శ్రీవారికి ప్రేమలేఖలో ఆరంభాన్ని గురించి చెప్పుకున్నాం. తెరవెనుక దర్శకుడి వాయిస్ – తెరపై పాత్రను గురించి చెపుతుంది. ఇది నాటి కాలపు ప్రవృత్తకానికి ప్రస్తుతపు ఛాయ. ఇసి సినేమా కాబట్టి –  ఋతువు (అవసరమైతే) తెరపై కనిపించేలా చిత్రీకరించవచ్చు. అందుచేత ఋతువు ప్రస్తావన పోయింది. కానీ పాత్రలను ప్రేక్షకులకు, వెనక voice over ద్వారా పరిచయం చేయటం మాత్రం ఒకానొక టెక్నిక్ గా సినిమాల్లో మిగిలింది. సినేమా తాలూకు canvas పెద్దది కనుక, వెనుక వచ్చే వాయిస్ ఓవర్ పద్ధతి కూదా పక్కనెట్టి – సాధ్యమైనన్ని పాత్రలను ఒకే వేదిక మీదకు తెచ్చి, ఏదో ఉత్సవం/సంరంభం ద్వారా ప్రముఖపాత్రను ప్రస్తావిస్తూ సినిమాను మొదలెట్టటమూ అనేక సినిమాల్లో ఉన్నది. తెలుగులోనే కాక, భారతదేశంలోనే చక్కని సినిమాల్లో ఒకటైన మాయాబజార్ సినిమా ఇందుకు ఉదాహరణ. చూడండి. టైటిల్స్ అయిన తర్వాత – గొప్ప సంరంభం, ఆపై శశిరేఖపై చిత్రించే పాట తో ప్రస్తావన మొదలు.

దీనికి మూలం ఛాయామాత్రంగానైనా నాటకాల్లోని ప్రవృత్తకం అనబడే ప్రస్తావనా పద్ధతి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తావనలో మరొక పద్ధతి కథోద్ఘాతం గురించి చెప్పుకుందాం.

  1. కథోద్ఘాతమ్.

–  అంటే ఏమిటి?

స్వ ఇతివృత్త సమం వాక్యమర్థం వా యత్ర సూత్రిణః |’

ప్రస్తుతపు కథలో భాగమైన వాక్యాన్ని కానీ, ఒకానొక భావాన్ని కానీ ఉటంకిస్తూ నాటకానికి చెందిన పాత్ర రంగస్థలంపై అడుగుపెట్టటం కథోద్ఘాతం.

దీనికి ఉదాహరణ వేణీ సంహారమనే నాటకంలో ఉంది.

సూత్రధారుడు, పారిపార్శ్వికుడు మాట్లాడుకుంటున్నారు. సూత్రధారుడి మాటల్లో – శ్రీకృష్ణుడు కౌరవులతో  రాయబారానికి వెళుతున్నట్టు తెలుస్తుంది. సూత్రధారుడు ఇలా అంటాడు.

నిర్వాణవైరిదహనాః ప్రశమాదరీణాం

నన్దన్తు పాండుతనయాః సహ మాధవేన |

రక్తప్రసాధితభువః క్షతవిగ్రహాశ్చ

స్వస్థా భవన్తు  కురురాజసుతాః సభృత్యాః ||

(నేపథ్యేసాధిక్షేపమ్)

ఆః దురాత్మన్! వృథామంగళపాఠకశైలూషాపసద!;

లాక్షాగృహానల విషాన్న సభాప్రవేశైః

ప్రాణేషు విత్తనిచయేషు చ నః ప్రహృత్య |

ఆకృష్టపాండవవధూపరిధానకేశాః

స్వస్థా భవన్తు మయి జీవతి ధార్తరాష్ట్రాః ||

***

రాయబారం కుదిరిన పక్షంలో, శమించిన వైరముతో పాండవులు మాధవునితో సహా ఆనందింతురు గాక! ఇటు ధార్తరాష్ట్రులు కూడా యుద్ధాన్ని విరమించినవారై తమ అనుచరులతో కులాసాగా ఉండగలరు.

(తెరవెనుక కోపంగా)

ఒరే దురాత్ముడా, వృథాగా మంగళం చదివే వాడా, నటాధముడా,

నాకు విషం పెట్టి, మమ్ములను లక్క ఇంటిలో కాల్చడానికి ప్రయత్నించి, సభలో వంచనతో మా సంపదను హరించి, పాండవపత్ని ద్రౌపది వేణిని పట్టిన ఆ కౌరవులు నేను జీవించి ఉండగానే సుఖంగా ఉండాలీ?”

(పారిపార్శ్వికుడు, సూత్రధారుడు ఆ కంఠాన్ని, శ్లోకాన్ని చెవులు రిక్కించి విన్నారు. భీముడు కోపంగా వస్తున్నాడు, మనం ఇక ఇక్కడ ఉండరాదని తెర వెనుకకు మాయమవుతారు. అలా ప్రస్తావన జరుగుతుంది. అదే శ్లోకాన్ని తిరిగి భీకరంగా చదువుతూ భీముడు తెరపైకి వస్తాడు.)

ఇది కథోద్ఘాతం. నాటకానికి చెందిన వాక్యాన్ని, వాక్యార్థాన్ని కూడా ఉచ్ఛరిస్తూ నటుడు తెరపైకి వచ్చే ప్రస్తావనాప్రక్రియ. పైన “నిర్వాణవైరిదహనాః..” అన్నది కథకు సంబంధించిన వాక్యం. ఆ వాక్యపు భావాన్ని స్వీకరించి నటుడు ప్రవేశిస్తూ చెప్పే శ్లోకం రెండవది – “లాక్షాగృహానల..”

ఇది కూడా సినిమాల్లో లేకపోలేదండి. 🙂 ఇలాంటి ప్రస్తావన తెలుగులో ఏ సినిమాలో ఉందో పాఠకులు వ్యాఖ్యలో వ్రాస్తే సంతోషం.

ప్రస్తావనలో తర్వాతి పద్ధతి 3. ప్రయోగాతిశయం.

ఏషోయమిత్యుపక్షేపాత్ సూత్రధారప్రయోగతః |

పాత్రప్రవేశో యత్రైష ప్రయోగాతిశయో మతః ||

ఏషః అయం – ఇతి ఉపక్షేపాత్

“ఆతడే ఈతడు” అన్న నిర్దేశంతో సూత్రధారుడు ప్రయోగాన్ని అనుసరించి పాత్ర – రంగస్థలంపై ప్రవేశిస్తే అలాంటి దాన్ని ప్రయోగ-అతిశయం అంటారు.

దీనికి ఉదాహరణ – కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలోని ఈ అత్యద్భుతమైన శ్లోకం. సూత్రధారుడు ఓ నటితో మాట్లాడుతుంటాడు. ఆ నటి ఆలాపించే గానానికి పరవశుడైపోయి అంటాడు.

తవాస్మి గీతరాగేణ హారిణా ప్రసభం హృతః |

ఏష రాజేవ దుష్యన్తః సారంగేణాతిరంహసా||

(ఇతి నిష్క్రాన్తౌ)

వేగంగా పరిగెడుతున్న దుప్పి చేత ఎలా అయితే “ఈ రాజు దుష్యంతుడు” ఆకర్షింపబడినాడో, అదే విధంగా నీ గానం చేత నన్ను నేను కోలుపోయినాను సుమా!

(అలా చెప్పి నటి, సూత్రధారుడు ఇరువురూ తప్పుకున్నారు)

ఏష రాజేవ దుష్యన్తః  – “ఈ రాజే దుష్యంతుడు” అన్న నిర్దేశం ఉంది కాబట్టి ఇది ప్రయోగాతిశయం. అలా ఉంటే ఆ చిన్ని శ్లోకం కాళిదాసు అసమాన ప్రతిభకు నిదర్శనం. ఎందుకంటే – సారంగ అన్నది ఓ రాగం పేరు. ఆ రాగం మధ్యాహ్నం పూట ఆలపించబడుతుంది. గీతరాగేణ అంటూ రాగం పేరును చెప్పడమూ కాళిదాసు కొంటెతనమే. సారంగం వీరరసప్రధానం కూడా. వీలు కుదిరితే ఈ లంకె లో ఆ శ్లోకం గురించి చదువుకోవచ్చు.

కాళిదాసుకు పూర్వం భాసుడు కూడా ’స ఏష’ నిర్దేశంతో మధ్యమవ్యాయోగం అన్న ఒక నాటకంలో ప్రస్తావన చేశాడు. అయితే భాసుడి నాటకంలో ’స ఏష’ నిర్దేశంతో వచ్చేది నాటకంలో పాత్ర. నాయకుడు కాదు.

శ్రాన్తైః సుతైః పరివృతస్తరుణైః స దారో

వృద్ధో ద్విజో నిశిచరానుచరః స ఏషః |

వ్యాఘ్రానుసారచరితో వృషభస్స ధేనుః

సంత్రస్తవత్సక ఇవాకులతాముపైతి ||

చిన్నవయసు కొడుకులతో భార్యతో అలసట చెందిన వాడై ఈ వృద్ధ బ్రాహ్మణుడు తెలియక ఈ నిశాచరునికి చిక్కాడు. పులిని అనుసరించిన వృషభము, ధేనువు, దూడల లాగా ఆపదల పాల పడుతున్నాడు.

ఆ వెంటనే సూత్రధారుడు పక్కకు తప్పుకోవడం, ద్విజుని ప్రవేశం మామూలే.

కుందమాల నాటకంలో కూడా ప్రయోగాతిశయమనే ప్రస్తావన ఉపయోగించబడింది. సూత్రధారుడు సీతను ప్రస్తావిస్తాడు. ఆపై సీత రంగస్థలంపై అడుగు పెడుతుంది.

ఇక సినిమాలకు. ప్రయోగాతిశయం – తెలుగు, తమిళ దర్శకులకు కొట్టినపిండి. మనకు ’అతిశయం’ అంటే ప్రాణం కదా!  ఎటొచ్చీ  సినిమాల్లో సూత్రధారుడు అనే third party అవశ్యకత దాదాపుగా లేదు కనుక, దర్శకుడే హీరో గురించి (పాట ద్వారా) చెప్తూ సినిమా తాలూకు ప్రస్తావనను ఆరంభిస్తాడు. అగ్రహీరోల సినిమాలన్నీ ఉదాహరణలే. తమిళంలో అయితే ’ప్రయోగాతిశయం’ పాట రూపేణా లేకుండా ఓ మహాగ్ర హీరో సినిమాలు దాదాపుగా ఉండవు. 🙂 తెలుగులోనూ  ’వీడు మినపట్టు, పెసరట్టు…’ అని ఒకడంటే, “ఏషః అయం” నే ఏకంగా “ఏస్స రుద్రస్స” అని మరొకరు. ప్రయోగ అతిశయం – ప్రయోగ మహా ఉత్కృష్ట అతిశయం అయిపోయింది 🙂 తెలుసుకోవలసిందేమంటే – ఈ ఆలోచనకు మూలాలు వెనకటివే.

ప్రతిమానాటకంలో ప్రస్తావన:

ప్రతిమలో ప్రస్తావన (స్థాపనా):

(రంగస్థలంపైకి నాటకం తాలూకు స్త్రీ పాత్ర ప్రవేశపెట్టబడింది. ఆమెతో ప్రస్తుత ఋతువును స్మరిస్తూ గానం తనతో బాటు చేయమన్నాడు సూత్రధారుడు)

అస్మిన్ హి కాలే 

చరతి పులినేషు హంసీ కాశాంశుకవాసినీ సుసంహృష్టా|

(నేపథ్యేఆర్యాఆర్యా (అయ్యాఅయ్యా)

(ఆకర్ణ్యసూత్రధారః – భవతు విజ్ఞాతమ్

ముదితా నరేంద్రభవనే త్వరితా ప్రతిహారరక్షీవ |’

(నిష్క్రాంతః)

ఈ కాలంలోనే

’ఆడుహంస నదీతీరాలలో కాశపుష్పాల వద్ద ఉంటూ ఇసుక తెన్నెలలో విహరిస్తుంది

(తెరవెనుక) అయ్యా, అయ్యా

(విని) సూత్రధారుడు – కానీ, అర్థమయ్యింది.

రాజభవనంలో ఓ అంతఃపుర ప్రతీహారి స్త్రీ లాగా సంతోషంగా’

(వెళ్ళిపోయెను)

రాజభవనంలో ఓ అంతఃపుర ప్రతీహారి స్త్రీ లాగా సంతోషంగా ఓ ఆడుహంస నదీతీరాలలో కాశపుష్పాల వద్ద ఉంటూ ఇసుక తెన్నెలలో విహరిస్తుంది.

ఈ శ్లోకం ద్వారా శరత్కాలాన్ని గురించి చెప్తూన్నాడు. ప్రాస్తావికంగా ’మంథర’ అనే ప్రతీహారిని గురించి కూడా చెప్పాడు. చెప్పి తప్పుకున్నాడు.

ఈ ప్రస్తావన ’ప్రవృత్తకం’ లక్షణాలు కలిగి ఉంది.అంటే – శరత్కాలాన్ని, అన్యాపదేశంగా ఓ పాత్రప్రవృత్తినీ కూడా చెప్పాడు కనుక. కానీ ఇది ప్రయోగాతిశయంగా కూడా కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఎందుకంటే ప్రతీహారిని ప్రస్తావిస్తూ ఆమె ను ప్రవేశపెట్టాడు కనుక.

ప్రస్తావన – ప్రవృత్తకమని, కథోద్ఘాతమని, ప్రయోగాతిశయమని చెప్పుకున్నాం. నిజానికి ఇంకా కొన్ని భేదాలు ఉన్నాయి. దశరూపకకర్త వీటిని వీథ్యంగాలుగా పేర్కొన్నాడు. సాహిత్య దర్పణకారుడు మరొక ప్రస్తావనా భేదాన్ని ’ఉద్ఘాత్యకము’ అని పేర్కొన్నాడు.

ఉద్ఘాత్యకము:

పదాని త్వగతార్థాని తదర్థగతయే నరాః

యోజయన్తి పదైరన్యైః స ఉద్ఘాత్యక ఇత్యుచ్యతే

అర్థం లేని మాటలకు ప్రత్యేక అర్థాన్ని (శ్లేష ద్వారా) కల్పిస్తూ, మనుష్యులు రంగస్థలంపై అడుగు పెట్టే పద్ధతి ఉద్ఘాత్యకం. దీనికి ఉదాహరణగా ముద్రారాక్షసాన్ని పేర్కొన్నాడు.

కౄరగ్రహః సకేతుశ్చంద్రమ సంపూర్ణ మండలమిదానీమ్ |

అభిభవతు మిచ్ఛతి బలాత్ రక్షత్యేనంతు బుధయోగః ||

ఈ శ్లోకం, దానిలో విశేషాలు చాలా విశదమైనవి. అదృష్టవశాత్తూ దీని వివరణ సంచిక పత్రికలోనే ఇక్కడ ఉన్నాయి. స్వాభావికార్థాన్ని వదిలి, అర్థాంతరం ద్వారా విషయాన్ని చెప్పటం వలన ఇది ఉద్ఘాత్యకమనే ప్రస్తావన అట.

ఈ మధ్యన వచ్చిన ఓ Path breaking movie లో ఆరంభంలోనే హీరో నానమ్మ కాలం గురించి “కాలం ఖగే మృగే నగః…” అంటూ వివరిస్తూ, మెల్లగా హీరో ప్రవృత్తిని చెబుతుంది. ఇది ఉద్ఘాత్యకపు ఛాయ.

భాణాల్లో ప్రస్తావన:

సంస్కృత ఏకాంకిక లైన భాణం ఇత్యాది రూపకభేదాల్లో ఒక్కడే నటుడు ఉంటాడు. ఆతడే ఇతర నటులు ఉన్నట్టు ఊహిస్తూ వారితో ఆకాశభాషణం సాగిస్తూ రూపకాన్ని కొనసాగిస్తాడు. అక్కడ ప్రస్తావనకు అవకాశమే లేదు. అయితే ఇది మరింత రమణీయమైన వర్ణనలకు దోహదం చేసింది. చతుర్భాణిలో ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క ఋతువును తీసుకొని ప్రస్తావన రూపంలో రమణీయంగా వర్ణించటం కనిపిస్తుంది. ఆ తరువాత నటుడు (సాధారణంగా భాణాలలో విటుడే ఏకైక నటుడు) ఆ వర్ణనను కొనసాగిస్తూ కథలోకి వెళతాడు.

ధూర్తవిటసంవాదమ్ అనే ఒక భాణం (ఏకాంకిక) లోని ఈ అపురూపమైన వర్ణనలు చూడండి. ఇది శివదత్తుడనే ప్రాచీనకవి రచన.

సూత్రధారః:

జలధరనీలాలేపః తడిత్సమాలభన విహ్వలద్ గాత్రః |

వికసితకుటజ నివసనః విటో యథా భాతి ఘనసమయః ||

నల్లటి కారుమేఘము (లాంటి నూనెను జుట్టుకు) అలదుకొని, మెఱపు వలన (కౌగిలి దొరికిన యౌవనపు పొంగు వలన) ఒళ్ళు పరవశం చెందగా, వికసించిన కొండమల్లె దండలు బట్టలుగా చుట్టుకొని, వర్షరుతువు విటుని వలె ప్రకాశిస్తున్నది.

(నిష్క్రాన్తః) – స్థాపనా.

(వెళ్ళిపోయెను) – స్థాపన.

విటః (విటుడు)

సాధ్వభితమేతత్

(సరిగ్గా చెప్పబడింది)

శ్రీమద్వేశ్మ మృదంగవాద్యకుశలా ధారాః సృజంత్యంబుదాః

కృద్ధస్త్రీ భృకుటీ తరంగకుటిలా విద్యుల్లతా ద్యోతతే |

గాఢాలింగనహేతవః ప్రచలితాః శీతాః పయోదానిలాః

కామః కామిమనస్సు ముఙ్చతి ధృఢానాకర్ణపూర్ణానిషూన్ ||

ధనవంతుల ఇళ్ళలో వాద్యకారులు మృదంగం వాయించినట్లు మేఘాలు వర్షధారలను కురిపిస్తున్నవి. కోపించిన యువతి నొసలు ముడివడినట్టు మెఱుపు తీగెలుగా కనిపిస్తోంది. చల్లగా, దట్టంగా మేఘాలపై నుండి  వీస్తున్న గాలులు గాఢమైన కౌగిలింతలకు పురికొల్పుతున్నాయి. మన్మథుడు కాముకుల హృదయాలపై ఆకర్ణాంతము బాణాలను లాగి సంధిస్తున్నాడు.

కావ్యం యొక్క వస్తువు (ఇతివృత్తం) కూడా విటులకు చెందినదే కాబట్టి, అలా సాగిపోతుంది.

భరతవాక్యం:

నాట్యశాస్త్రపు పారిభాషిక శబ్దాలను వివరించే ఈ వ్యాసం కూడా పారిభాషిక శబ్దంతో ముగించడం సబబు. అందుకే ’ముగింపు’ కాకుండా ’భరతవాక్యం’. 🙂

వ్యాసంలోనే ఓ మారు ప్రస్తావించినట్టు మనం మనకు తెలిసినా, తెలియకపోయినా మనకు నేర్పిన పాత పద్ధతుల ప్రకారం ఆలోచిస్తూ ఉంటాం. ఆ మధ్య తెలుగులో అత్యంత భారీ చలనచిత్రం ఒకటి వచ్చింది. దేశవిదేశాల్లో తెలుగు వారు బ్రహ్మరథం పట్టారు. ఆ చలన చిత్రం పై అనేకానేక విమర్శలూ వచ్చినై. ఆ చలనచిత్రం గొప్పదా, కాదా అన్న మీమాంస పక్కన పెట్టి – ప్రజలు ఆ సినిమాను ఎందుకు ఆదరించారని ఆలోచిస్తే – ప్రేక్షకులు అందులో ఏదో ’నోస్టాల్జియా’నో, తమకు సొంతమైన ఇంకేదో విషయాన్నో వెతుక్కున్నారని ఊహించవలసి వస్తుంది. అవును. ప్రజలు తమ పుట్టి పెరిగిన సాంప్రదాయల మూలంగానే ఆలోచించడం నేర్చుకుంటారు. ’పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో తప్ప పోవు’ కదా. Human being  is born in their own peculiar conditioning -అని మహనీయుడు జిడ్డుకృష్ణమూర్తి ఉవాచ.  ఆధ్యాత్మిక తలంలో ఈ Conditioning అన్నది సత్యమార్గానికి నిరోధం అయితే , భౌతికతలంలో ఇది ఉపయోగం. సమాజపరంగా అయితే – పాతదైన ప్రతీదీ ఒప్పు కాదు, కొత్తదైన ప్రతీ విషయం తప్పు కాదు. కాళిదాసే చెప్పాడు కదా.

పురాణ మిత్యేవ న సాధు సర్వం

నచాపి కావ్యం నవమిత్యవద్యమ్ |

సంతః పరీక్షాన్యతరత్ భజంతే

మూఢపరః ప్రత్యయనేయ బుద్ధి: || 

పాతదైన ప్రతిదీ ఒప్పు కాదు; కొత్తది అన్న పేరుతో ఓ కావ్యాన్ని పక్కన పెట్టనక్కర్లేదు. బాగా వివేచించిన తర్వాత వివేకవంతులు తప్పొప్పులు తెలుసుకుంటారు. మూఢులు మాత్రమే ఇతరుల ఆలోచనలను గుడ్డిగా అనుసరిస్తారు.

కావ్యానికి చెప్పిన పైమాట భౌతిక విషయాలకూ వర్తిస్తుంది.

స్వస్తి.

(ఈ వ్యాసంలో ఉపయోగించిన చిత్రాల సౌజన్యం – వడ్డాది పాపయ్య, గూగుల్ ఇమేజెస్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here