నాన్న

1
12

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో పి.పి. ఉపాధ్య గారు రచించిన ‘అప్ప’ అనే కథని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు. [/box]

[dropcap]ఓ[/dropcap] నెలకు పైగానే ఆస్పత్రి పడక మీదనే వున్నారు నాన్న. “బ్రతుకుతారనే ఆశ లేదు. చావుకి దగ్గర్లో ఉన్నారు” అని డాక్టరుగారు చెప్పి ఇప్పటికి వారం రోజులయ్యంది. ఆయన ప్రక్కనే కూర్చుని, ఆయన్నే చూస్తూ కూర్చుండిపోయీడు వీడు, అన్నపానాలు మానేసి. ఆయన తన ప్రాణాలు కోల్పోయేలోగా ఆయన మనసులోని మాటలని ఏవో చెప్పాలి. వాటిని తాను వినాలి. ఆయన అడిగే వాటికి సమాధానం ఇవ్వాలి. అంటూ తీవ్రమైన సంకటానికి గురై ఆయన్నే చూస్తూ ఉన్నప్పుడు, ఆయన శ్వాస తీసుకోటానికి పడుతున్న యాతనను గమనించి డాక్టర్ గారిని పిలిచాడు. ఆయన వచ్చి పరీక్షించి, “ఇక చేయడానికేమీ లేదు. ఇక కొద్ది రోజులే. మేం చేయగలగిందంతా చేశాం. ఇక చేయడానికి ఇంకేమీ మిగల లేదు.” అని చెప్పి వెళ్లిపోయాడు. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకోడానికని తల వంచి కూర్చుండి పోయాడు.

అమ్మ విషయం చెప్పనక్కరే లేదు. ఆమె పూర్తిగా మథన పడిపోతున్నది, ఆయనతో కలిసి పంచుకున్న జీవితాన్ని తలచుకొని.  ఈ నాటి ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నది. “ఎవరైనా, ఎంతకాలం జీవించి వుండగలరు? ఏదో ఓ రోజు వెళ్లిపోక తప్పదు! ఈ రోజు వీరు, రేపు నేను”  అనే డాక్టర్ గారి మాటల్నే తానూ నెమరేస్తూ వుంటుంది. ఆమె తాను లోలోనే అనుకుంటున్న మాటల్ని వీడు వినకపోలేదు. అది విని వీడు కలవర పడ్డాడు. ఎందుకు అమ్మ ఇలా మాట్లాడుతూ వుంది? ఆమె కూడా తన ఆఖరి ఘడియల్ని లెక్క వేయటం ప్రారంభించిందా? ఊహించిన కొద్దీ వీడికి కాళ్లు చేతులూ ఆడటం లేదు. అయినా ఆమెను సముదాయించాలనే, “లేదమ్మా.. ఏం కాదు. నాన్నగారిని ఇంకో అస్పత్రకి తీసుకెళ్తాను. ఇక్కడి కంటే అక్కడ మేలైన డాక్టర్లు ఉంటారు. అట్లాంటి ఆస్పత్రికే తీసుకెళ్తాను” అని అన్నాడు.

ఇది విన్న ఆమె “అంత దాకా ఆయన బ్రతికి బట్టకడతాడంటావా? ఈయన్ను చూడు, ఊపిరి తీసుకోడానికెంత అవస్థ పడుతున్నాడో” అంది. ఔను నాన్నగారు చాలా యాతన పడుతున్నారు. అయినా ఆశ కోల్పోక మరలా డాక్టర్ దగ్గరికి పరుగెత్తాడు.

అయితే డాక్టర్ వచ్చేలోగా అంతా ముగిసేపోయింది. ఊపిరి నిల్చిపోయి కనుగుడ్లు రెండు పైకి వెళ్లిపోయి వున్నాయి. ఈయన చనిపోయడని సర్టిఫై చేయడానికే వచ్చినట్లన్నాడు డాక్టరు. “అయిపోయింది. అంతా అయిపోయింది,” అని చెప్పి వెళ్లిపోయాడు డాక్టరు. అమ్మ మాత్రం అదే నిర్లిపత తోటి కూలబడిపోయింది! డాక్టర్ మాటలని వినీ కూడా ఆమెలో ఆ నిర్లిప్తతా భావనలో మార్పులేదు.

“అమ్మా..” గద్గద స్వరంతో పిలిచాడు వీడు అమ్మను. లేదు నుంచి ఎటువంటి స్పందనా లేదు. భుజం పట్టి అలుగాడించాడు. కొంచెం సేపటికి తేరుకొని, కొంచంగా తలెత్తి చూసింది. కొంచెంగా ధైర్యం వచ్చింది వీడికి.

“అమ్మా. డాక్టర్ గారు చెప్పారుగదా ఇంకేం చేయడానికీ వీలు లేదని.” ఎదలోంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమ్రింగుకుంటూ, అమ్మను ఊరడించే ప్రయత్నం చేశాడు.

వీరి బెడ్‌ని ఇంకో పేషెంట్‌కి ఏర్పాటు చేసే ప్రయత్నంలో వున్నారు ఆస్పత్రి సిబ్బంది. వీరి దుఃఖం వాళ్లకేమీ పట్టనట్టు నర్సుల హడావుడీ, ఆయాల గడిబిడ. అమ్మ డిప్రెషన్ లోకి వెళిపోతుందేమోననే భయమే వీడికి. బాకీ వున్న హాస్పిటల్ బిల్ చెల్లంచనిదే శవాన్ని తరలించటం సాధ్యం కాక, ఎటూ తేలని స్థితిలో వీడు. ఇంతలోనే కట్టాల్సిన బిల్‌ని చేతబట్టుకొని వచ్చాడు ఓ హాస్పిటల్ సిబ్బంది. బాకీ పడిన పైకాన్ని తీసుకొని వెళ్లపోగానే, ఇంకోడు సిద్ధమయ్యాడు శవానికి బట్టచుట్టటానికి. “నేనే తీసుకెళ్తాను సార్. బయట మీ వాహానమేదైనా వుందా చెప్పండి. లేకపోతే ఆంబులెన్స్ ఏర్పాటు చేస్తాను.” అని చెబుతున్న వాడి కన్నుల్లో, ముఖంలో మాటల్లో, వీడి నుండి డబ్బు ఎలా గుంజాలో అనే ఆతురతే వాడిలో కాన వచ్చింది మన వాడికి. “సరే. సరే.” అన్నాడు, తల్లిని పైకి లేవదీస్తూ “రా, అమ్మా బయటికెళ్దాం. ఇక్కడికి ఇంకో పేషెంట్‌ని తీసుకొస్తున్నారు” అని అన్నాడు. అయితే వీడి మాటల అర్థం ఆమెకి ఎంత బోధపడిందో ఏమో తెలీదు. కొడుకు తన చేయి బట్టి లేపుతున్నాడు. లేవాలి అని అనుకుంటూ ఆమె లేచింది.

***

అమ్మను ఇంటికి పిల్చుకెళ్లి, తండ్రిగారి అంతిమ సంస్కారాన్ని ముగించుకొని వచ్చే సరికి సాయంత్రం నాలుగయ్యింది. ఆస్పత్రి క్యాంటిన్‌లో ఉదయం ఇంత బిస్కట్ కాఫీ తీసుకున్న దంతే. అమ్మకి అది కూడా లేదు. ఇప్పుడేమైనా ఆమెకు ఆకలేస్తుందేమోనని అమ్మ ముఖంలోకి చూశాడు. ఊహు.. లేదు ఆ ఛాయలే కన్పించలేదు ఆమెలో. ఈ ప్రపంచంలోనే ఆమె లేనట్టుగా వుంది ఆమె తీరు. అది చూచి వీడికి భయం ఆవరించింది.

ఆమె ఆకలి కొంచానికి కొంచమైనా తీరిస్తే, ఆమె ఈ లోకంలోకి రాగలదనే ఆశతో, తినడానికేమైనా దొరకగలదేమోనని వంటింటినంతటిని గాలించాడు. ఇప్పటికి వారం రోజులయింది, ఆమె ఇంటిని వదిలి. ఆస్పత్రిలో భర్త వద్దే వుండిపోయింది. మరి ఇంట్లో తినడానికి ఏమి వుండగలదు? వెదకగా, వెదకగా ఓ చోట ఓ చిన్న డబ్బాలో అటుకులుండటాన్ని గమనించి, వాటిని నీళ్లల్లో తడిపి కొంచెం బెల్లం ముక్క కలిపి ఆమె కిచ్చి తాను కొంచెం నోట్లో వేసుకున్నాడు. కడుపులోకి కాస్త చేరగానే కొంచం ఉత్సాహం వచ్చింది. కొడుకు కలిపి ఇచ్చిన బెల్లం అటుకులు తనకు ఎక్కువయ్యిందో అథవా వారం రోజుల పాటు ఆస్పత్రిలో నిద్ర లేమి రాత్రుళ్లు గడిపిన దాని వల్లలో ఆమె నిద్రకు జారుకుంది. ఇది గమనించి ఆమెకు హాయిగా పడుకుంటానికని అనువు కల్పించి ఇచ్చాడు కొడుకు. తల్లి హాయిగా నిద్రపోతూవుంది. తానూ నిద్రపోవాలనే, పక్క మీద ఎంత పొర్లాడినా తనకి నిద్ర దరిజేరలేదు. తనకీ నిద్రలేదు గత వారం రోజులుగా. ఈ వేళైనా నిదర రాగలదేమోననే ఆశతోనే పడుకున్నాడు. నిద్ర మాత్రం దరిజేరలేదు. ఏవేవో పాడైన ఆలోచనలు. అమ్మ గుఱించి లేదు లేదు. అమ్మకేం కాదు. త్వరలోనే కోలుకోగలదు. అని తనకు తానే సమాధాన పరచుకుంటున్నా, ఏవేవో గతకాలపు సంఘటలన్నీ తెర మీదకు వచ్చి నిద్రను పాడు చేస్తున్నాయి.

***

నాన్నగారికెందుకో మొదట్నుంచి తనకంటే తమ్ముడంటేనే ఎక్కువ ప్రీతి. తాను చదువులో చురుకుగా వున్నా, అమ్మ ఎంత చెప్పినా, తాను ఎంత బతిమిలాడినా, తన హైస్కూలు చదువు అయిం తర్వాత పై చదువులకి పంపించలేదు. హైస్కూలు చదువు అయింతర్వాత తన విద్యాభ్యాసాన్ని నిలిపి వేయమన్నాడు నాన్న. అంతే కాదు వయసు మీద పడుతున్న తనకు సహాయకంగా ఒకరు ఉండాలనేదే ఆయన హఠమూ, తను. బయటికెక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదు. అలా స్వతంత్రించి వదలి పెట్టినట్టియితే, బెంగుళూరులోని తెలిసిన ఎవరి హోటల్లోనే పగటి పూట పని చేసి నైట్ కాలేజీలకి వెళ్లి డిగ్రీ పూర్తి చేసి వుండేవాడే, దానికీ ఆయన అడ్డు పుల్ల వేశాడు. అయితే తమ్ముడు చదువు విషయంలో అంతంత మాత్రంగానే వున్నా, వాణ్ణి ఇంజనీరింగ్ చేర్పించారు. కలలోకూడా మెరిట్ సీట్ దొరకని వానికి, బొటా బొటా మార్కుల తోటి ఎక్కణ్ణుంచో అప్పు తెచ్చి వాణ్ణి ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు.

ఎల్లాగో ఇంజనీర్ అనిపించుకొన్న వాడికి కొమ్ములు మొలిచాయి. బాల్యం నుంచీ అన్నకంటే తాను చదువుల్లో అంతంత మాత్రమే అనే భావనలో పెద్ద వాడైన తమ్ముడు, తానిప్పుడు ఇంజనీర్ అయ్యాడేనే అహంకారంతోటి అన్నను తిరస్కార భావంతో చూడసాగాడు. దానికి తోడు నాన్నగారి వత్తాసు. తనకు తెల్సిన వారి చేతులు తడిపి నాన్న వాడికి ఓ ఇంజనీర్ పోస్టు దొరికేటట్టు చేశారు. ఇలా రెండేళ్లు గడిచే సరికల్లా వాడు ఓ బాంబ్ పేల్చాడు. తనకి అమెరికాలోని ఓ కంపెనీలో ఓ జాబ్ దొరికిందని, ఇంకో నెలలోనే తానక్కడికి రవాణా అయిపోతున్నానని. ఈ అన్నయ్యకు ఆశ్చర్యం – ఇంత సులభంగా, ఇంత త్వరగా అమెరికాలో ఉద్యోగం లభించటమా? అయితే దాన్ని ప్రశ్నించేందుకు తను సాహసించలేడు. ఒక వేళ ప్రశ్నించినా, వాడు సమాధాన మివ్వాలి కదా! తాను ఇంజనీరింగ్‌కి చేరిన దినం నుండే ఈ ఎస్సెస్సెల్సీ చేసి ఇంట్లో కూర్చున్న అన్నయ్య అంటే వాడికి నిర్లక్షభావనే. ఇంజనీర్ అయిం తర్వాత ఆ భావం మరీ ఎక్కువయింది. అంతే కాదు, తన భవిష్యత్తు గురించి, తన ముందున్న ఆలోచనల గురించి వీళ్లకేం తెలుస్తుందనే ఓ తాత్సార భావం. ఎవర్నీ లెక్కచేయడు. “అమెరికాలో జాబ్ దొరికింది, ఒ నెల్లో అక్కడికెళుతున్నాను” అంతే వాడు చెప్పింది.

అంతే, వాడు అమెరికా వెళ్లిపోయాడు. ఈ అన్నయ్య ఇంట్లోనే వుండిపోయి, ఇంటి పన్లు, వ్యవసాయపు పన్లు చేసుకుంటూ ఊళ్లోనే వుండిపోయాడు. ఎలాంటి కనికరం లేకుండా నాన్న వీడి తోటి అన్నిరకాల పనులనీ చేయించుకొంటున్నాడు. ఇంతకు మునుపు చిన్నా చితకా పనులకి జీతగాళ్లను పెట్టి చేయించేవాడు నాన్న. ఇప్పుడు ఆ పనులన్నీ తన నెత్తినే వేశాడు. తనతోనే చేయించటమే కాక ఆ పని సరిగా చేయలేదు, ఈ పని పాడుచేశావు, అని తప్పులు బట్టి తిడుతూ వుండటం పరిపాటి అయిపోయింది. ఇలా కసురుకొన్నప్పుడల్లా ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకునేదే తప్ప ఆయన్నేమీ అనేది కాదు. ఆమెను తానే సమాధాన పరిచేవాడు. “ఇందులో ఏముందమ్మా, తప్పు చేశాననే గదా నాన్న తిట్టారు. ఇక మీదట ఆ తప్పు చేయకపోతే సరి” అని ఊరడించేవాడు.

***

తమ్ముడు అమెరికా వెళ్లి రెండేళ్లయ్యే సరికి, వాడికి పిల్లనివ్వడానికి ఊళ్లో పెళ్లికెదిగిన ఆడపిల్లల తల్లిదండ్రులు వీళ్ల ఇంటికి రాకపోకలు సాగించారు. వాళ్లతో అమ్మ “చూడండి, మా పెద్దవాడు, మా ఆస్తిపాస్తులు నన్నింటినీ చూసుకుంటూ ఇక్కడే ఉన్నాడు. వాడికి కాకుండా” అని అన్నప్పుడు, ఆ మాట విన్న వాళ్ల ముఖాలు చూడాలి. “మీ అమ్మాయిని మా పెద్దకొడుక్కు చేసుకోమని” ఎక్కడ అడుగుతుందో ఈయమ్మ అనే భయంతోటి అక్కణ్ణుంచి జాగా ఖాళీ చేసేవారు. ఇలా జరిగినప్పుడల్లా, అమ్మ తన పట్ల కనబరుస్తున్న శ్రద్ధకు వీడు సంబరపడిపోయేవాడు. అయితే నాన్నగారు దీనికి తద్విరుద్ధం. “కాదు, అమెరికాలో ఉండే వాడికి పిల్లనిస్తానని వాళ్లు వస్తే, పల్లెటూరి గబ్బిలాయిని చూపించి, వాళ్లు వచ్చిన దారినే వెళ్లి పోయేట్టు చేస్తున్నావా.. బుద్ధిలేని ఆడదానివి..”  అని ఆమెను తిట్టేవాడు. అమ్మది మాత్రం ఒకటే మాట – పెద్దవాడికి కానిదే, చిన్నవాడికి పెళ్లి చేయటమా అని.

నాన్న అదేంటో అంటూండేవాడు. తాను అతి దగ్గర్లోనే వున్నా అదేంటో వినబడేది కాదు. అయితే ఆయన మాటలకి అమ్మె బిక్కు బిక్కు మని ఏడుస్తూ వుండటం మాత్రం వినిపించేది. ఆయన కనుమరుగైన తర్వాత. “అమ్మా నాన్న ఏమన్నారని.. ఎందుకు ఏడ్వటం” అని తాను అడిగినా, ఆమె ముఖం చాటేసుకుని సమాధానమిచ్చేది కాదు. “అమ్మా నీవేం చింతించకు. నాకు పెళ్లే వద్దు, నేనిలానే వుండిపోతా” అని అనేవాడు.

తమాషాకు ఇలా అంటున్నాడా అని, ఆమె వాడి ముఖం చూసినప్పుడు వాడి ముఖంలో అలాంటి తమాషా తాలూకు చిహ్నలేవే కనిపిస్తుండేవి కావు. కొన్ని సార్లు వాడా మాటాల్ని ఎంత బిగ్గరగా చేప్పే వాడంటే, అక్కడే ఎక్కడో వున్న నాన్నకీ వినబడేటట్లుగా.

అంతే రెండే రెండు నెలల తర్వాత నాన్నకు, అమ్మకు వీడికీ ముగ్గురకూ షాక్ తగిలినంతగా సంగతి ఒకటి తెలిసి వచ్చింది. అది అమెరికాలో వున్న ఆ కొడుకు వ్రాసిన ఉత్తరం. “నేను ఇక్కడే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. తెలుగు అమ్మాయి. మా కంపెనీలోనే నాతోటి పని చేస్తూ వుంది. కాలేజీ చదివే రోజుల్లోనే మేమిద్దరం కలసి ఉండేవాళ్లం. ఇద్దరం కూడా ఒకేసారి అమెరికా వచ్చాం.”

అమ్మా నాన్నలిద్దరూ నెత్తిమీద చేతులేసుకొని కూర్చోవటమొకటే మిగిలింది. “ఛీ వీడిట్లా చేస్తాడని అనుకోలేదు” అని వగస్తూ నాన్న రెండు రోజులు పాటు తిండీ తిప్పలు మానేశాడు. అమ్మ బతిమలాడితే

“నా కొడుకుకిలా చేశేసాడే. పిల్లనిస్తామని ఎంతో మంది వస్తున్నా వాళ్లకి నేనేమని జవాబు చెప్పను?” అని అన్నప్పుడు అమ్మ దానికి సమాధాన మిచ్చేది కాదు.

“అయ్యో! వాడి మీద, ఎన్నో ఆశలు పెట్టుకొని వుంటినే. నా ఆశలన్నీ మట్టి పాలు చేశేసాడే. ఇల్లాంటి కొడుకులుంటేనేం, పోతేనేం..” నాన్నగారి దుఃఖాన్ని అదపు చేయటం కష్టమయ్యేది ఈ కొడుక్కి.

“పోనివ్వు నాన్నా, అమెరికాకి వెళ్లాలన్న కోరిక కలిగిన ఈనాటి పిల్లలు చేసే తీరు ఇదే నాన్న. దీంట్లో విశేషమేమీ లేదు. లేకపోతే వాడు మనందరకు తెలిసి చేసుకొని వున్నట్లయితే బాగుండేది. వాడి పైన మనమందరం ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేశాడు!” అని ఊరడించాడు వీడు.

అమ్మ అలా చూస్తూ ఊరకే ఉండి పోయింది. “పోనీండి నాన్న. ఎందుకు వాడి కోసం మీరు చింతించడం. వాడు చేసుకొన్నది మన దేశపు అమ్మాయినే కాని ఆ దేశపు పిల్లను కాదు కదా. ఇద్దరూ పని చేస్తున్నారు. అదీ ఒకే కంపెనీలోనే. ఇంకేం. ఇక పోతే నేనున్నా కదా మిమ్మల్ని అమ్మనూ చూచుకోవడానికి. నేనున్నాను కదా మీకు” అనే మాటని విని ఆయన ముఖంలో వచ్చిన మార్పులని గమనించలేదు ఈ కొడుకు. అయితే వీళ్ళిద్దరి మాటల్ని ఆలకిస్తున్న అమ్మ మాత్రం దేన్నో గుర్తించి కలవరం చెందినట్టుంది. అస్పష్టంగా నాన్నగారు అక్కణ్ణుంచి లేచిపోయారు. ఆమెలోని కలవరపాటను చూచి, “ఏమైందమ్మా” అని అడిగాడు. ఎవరిదో కేక వినవచ్చి ఆమె బయటకెళ్లింది.

“అమ్మా! ఆ కేక నాన్నదే కదా!” వాడికి ఆమె నుంచి సమాధానం వచ్చేలోపుగానే ఆమె ఇంటి బయట మెట్ల మీద వుంది. చూడగా నాన్న, మెట్లమీద నుండి జారి పడినట్లుంది. పడటం, పడటం తలకు బలమైన దెబ్బ తగలడం, చెవి నుండి రక్తం కారటం. ఆయన తలని తన ఒళ్లో పెట్టుకుని వుంది. “అమ్మా నాన్నను వెంటనే ఏదైనా ఆస్పత్రికి తీసుకెళ్లాలి” అన్నాడు. “ఔనౌను” అంటూ వాడిని ఆటోను తీసుకురావడానికని పురమాయించింది.

తండ్రి పరిస్థితిని గుఱించి ఫోన్ చేసి తమ్ముడికి తెలియజేశాడు. పరిస్థితి సీరియస్‌గా వుందని, డాక్టర్ ఏ విషయాన్నీ సరిగ్గా తెల్చి చెప్పటం లేదని.

“నీవే అన్నీ చూసుకో, నాకిక్కడ సెలవు దొరకటం కష్టం. చాలా పని ఒత్తిడిలో వున్నాను. వదిలి రావటం కష్టం” అని రాగం తీశాడు.

అంతే. హాస్పిటల్ వాసం ఎన్ని రోజులైనా గుణం కన్పించక ఆయన వెళ్లేపోయాడు. పోయింతర్వాతైనా, అంత్యక్రియలకి రావాల్సిందిగా తమ్ముడికి ఫోన్ చేస్తే, అదే రాగమే అదే పాటే “నీవే అన్ని కార్యక్రమాలు ముగించు. నేనిక్కణ్ణుంచే దండం పెడతాను” అన్నాడు. ఈ విషయమే అమ్మకు చెబితే ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది.

***

అంత్యక్రియలన్నీ ముగించాడు. ఏ లోటు లేకుండా దాన ధర్మాలు చేశాడు. అయితే అమ్మ మాత్రం పూర్తిగా కృంగిపోతూనే వుంది. తండ్రి అనంతరం బాధ్యతలన్నీ తన నెత్తి పైన పడ్డాయి. ఇన్ని రోజులూ కేవలం తండ్రి అదుపాజ్ఞల్లో వుండి ఇతర వ్యవహారాలేవీ తనకు తెలియకుండా ఉండేవి. తండ్రి చెప్పిన పనేదో చేసుకుంటూ పోతూ వుండేవాడు. ఇక ముందు తానే వ్యవహారాలన్నింటినీ నిర్వహించాలి.. తమ్ముడు ఉన్న మాటే గాని, వాడు అన్నింటినీ విస్మరించాడు. తండ్రి అపరకర్మలకు చేయడానికని ఇతరుల వద్ద అప్పుగా తీసుకొన్న డబ్బును తిరిగి చెల్లించాల్సిన బాధ్యత తనపైన వుంది. అందుకొఱకుగాను, తండ్రిగారి బీరువాను తెరచి చూచాడు.

అందులోని వాటిని వీడు పరిశీలించి చూస్తూనే వీడి తల తరిగి పోయింది. నాన్న తన యావదాస్తిని, బ్యాంక్‌లో దాచిన డబ్బును, సర్వస్వాన్నీ తమ్ముడి పేరు వ్రాసిన పత్రాలు కన్పించాయి. వాడు అమెరికాకు పోవకముందే,  ఆ వ్యవహారమంతా జరిగిందని వాటిలో పొందుపరిచిన తేదీలు స్పష్టపరిచినాయి. కడకు అమ్మ పేరిట కూడా ఏమీ వ్రాసి వుంచలేదు. వీడి కళ్లు దిమ్మదిరిగి పోయాయి. ఇంకేం, నిల్చున్న వాడు నిల్చున్నట్టుగానే కూలబడుతూండగా అమ్మ వచ్చి వాణ్ణి పట్టుకొంది. మాట్లాడడమే మానివేసిన అమ్మ ఇప్పుడు తానే అడిగింది.

“ఏంట్రా! ఏమయ్యింది?” అని. దుఃఖం తన్నుకు వచ్చింది వాడికి. “అమ్మా.. అయిపోయిందమ్మా.. అంతా అయిపోయింది. నీకూ నాకూ ఏమీ మిగల్చలేదు నాన్న. చిరాస్తి కాదు కదా బ్యాంక్‌లో ఉన్న నగదుని మనకు దక్కకుండా.. అంతా తమ్ముడి పేర రాశేసారు” అని వాపోయాడు.

“వాడు ఇక్కడలేనే లేడు కదరా” అంది అమ్మ.

“లేకపోతే ఏంటమ్మా!  సమస్తం వాడి పేరే వ్రాసేశారు. ఆయన కదేంత ప్రేమో వాడి పైన.”

ఏమీ చెప్పడానికి తోచక కడకు నిర్లిప్తంగా అంది ఆ తల్లి “ఔనయ్యా వాడంటేనే ఆయనకి ప్రేమ. నీవు ఆయన కొడుకువు కాదు కదా. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా ఆయన ఆయన కొడుకుకు పేరే వ్రాశారు.”

అర్థం కాలేదు వాడికి. “అమ్మా ఏమంటున్నావు నీవు. నేను ఆయన గారి కొడుకును కానా?” ఆమెకు మతి భ్రమించిందేమో ననుకున్నాడు. తాను తన అనుమానంలోంచి తేరుకునే అంతలోనే అంది ఆమె “ఔనయ్యా నీవు నా కొడుకువి అంతే. ఆయన కొడుకువి కాదు.”

“ఏంటమ్మా! ఏంటి అంటున్నావు!”

“ఔనయ్యా, నీవు పుట్టగానే మీ నాన్న గతించారు. వారు పోయినాక ఎలాగో నిన్ను పెంచి పెద్ద చేయాలనుకున్నా. అయితే, నీకు నాల్గు నెలల వయసులోనే ఒకాయన తారస పడ్డాడు. ఆయన భార్య కూడా గతించిందట. ఆమె చనిపోయేటప్పడు వారికి ఓ ఏడాది పాప ఉండేది. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా కూతురుతోటి నీ కొడుకుతోటి ఇద్దరం కలసి వుందాం. వేరే పిల్లలు అక్కరలేదు మనకు అని అన్నారు. ఆయనే మీ నాన్న. నేనూ అంగీకరించాను. మా ఇంట్లోవాళ్లు, ఆయన ఇంటివాళ్లూ ఒప్పుకున్నారు. పెళ్లి అయ్యంది. అయితే పెళ్లయిన రెండేళ్లకే ఆయన కూతురు, ఏదో వ్యాధితో మరణించింది. ఆ అమ్మాయి చనిపోయిన తరవాత సంవత్సరమే ఆ నీ తమ్ముడు పుట్టాడు. మొదట్నుంచి ఆయనకు ఆ నీ తమ్ముడి పైనే ప్రేమ ఎక్కువ. కనుక నీవు ఆయన కొడుకువి కాదు. నీవు ఆయన కొమారుడు కాదనే విషయం నీకు తెలియజేయకూడదని నాకు ఆంక్ష విధించారు” అమ్మ ఈ విషయాన్ని బయటపెట్టి అలాగే కూలబడిపోయింది. వీడు కూడానూ..

కన్నడ మూలం: పి.పి. ఉపాధ్య

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here