నాన్న లేని కొడుకు-1

1
11

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]“జ్యో[/dropcap]తీ! రేపు నాకు పూనాలో మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది.. ఒక్కదానివీ ఏం చేస్తావ్ ఇంట్లో! నాతో రా.. కాన్ఫరెన్స్ అయాక మరో పది రోజులు ఎటన్నా వెళ్లి వద్దాం.. నీకు కొంత డివియేషన్ ఉంటుంది” మొక్కలకి నీళ్ళు పెట్టి లోపలకి వచ్చిన భార్యతో అన్నాడు డాక్టర్ సూర్యనారాయణ.

“నేనెందుకండి? నేనొచ్చి ఏం చేస్తాను..” నాప్కిన్‌తో చేయి తుడుచుకుని సోఫాలో అలసటగా కూర్చుంటూ అంది జ్యోతి.

“ఊరికేనే.. నేను ఎలాగా వెళ్ళాలి కదా.. ఒక్కదానివి ఇంట్లో ఉండి బాధపడుతూ ఉంటావు.. నీకూ స్థలం మార్పు ఉంటుంది.. నాకు నిన్ను ఒక్కదాన్నే వదిలిపెట్టి వెళ్ళాను అనే టెన్షన్ ఉండదు.”

ఆవిడ విరక్తిగా నవ్వింది.. “నేను ఎక్కడికి రాలేనండి.. ఎక్కడికి వచ్చినా నా మనసు నాతోటే ఉంటుందిగా.. ఆ మనసు నిండా నా తల్లే.. మనసంతా దుఃఖంతో నిండిపోయి ఉంది.. ఈ దుఃఖం, ఈ వేదన ఎక్కడికి వెళ్ళినా నాతోటే వస్తాయి.. ఎక్కడికి వెళ్తే మాత్రం శాంతి లభిస్తుంది చెప్పండి.”

ఆయన నిట్టూర్చాడు. నిజమే! ఈ బాధ మామూలు బాధా! శివుడు గరళాన్ని తన కంఠంలో అలా ఎలా భరిస్తున్నాడంటే ఆయన దేవుడు.. కానీ మనుషులుగా పుట్టిన తను, తన భార్య హృదయంలో నిండిన గరళాన్ని నాలుగేళ్ళుగా భరిస్తున్నారు… ఎంత భయంకరమైన నరకమో ఈ బాధ అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది.

ఒక్కగానొక్క కూతురు.. “అమ్మా! వెళ్లొస్తాను” అని నవ్వుతూ, తుళ్ళుతూ కాలేజ్‌కని వెళ్లి ఇంతవరకూ తిరిగిరాలేదు.. ఎక్కడికి వెళ్లిందో.. ఎన్ని పోలీస్ స్టేషన్‌లకి తిరిగాడు! ఎంతమంది మినిస్టర్‌ల కాళ్ళు పట్టుకున్నాడు. నగరంలో ప్రముఖ డాక్టర్‍గా ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.

“మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం డాక్టర్ గారు.. కానీ ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. ఇలా అంటున్నాం అని అన్యధా భావించకండి. మీ అమ్మాయికి ఏదన్నాలవ్ ఎఫైర్ ఉందేమో!” కొంచెం సందేహిస్తూ అడిగాడు డి.ఎస్.పి.

“నాన్సెన్స్.. నా కూతురు వయసు ఎంతో తెలుసా.. మొన్ననే పదిహేడు పూర్తి అయింది. ఏం మాట్లాడుతున్నారు?” ఆ రోజు ఆయన అలా అడిగినందుకు ఎంత సీరియస్ అయాడు తను!

“అర్ధం చేసుకోండి. మిమ్మల్ని అవమానించాలని చెప్పడం లేదు. ఈ రోజుల్లో పదమూడేళ్ళ అమ్మాయిలు కూడా లవ్ అంటూ బాయ్ ఫ్రెండ్స్‌తో లేచిపోయిన కేసులు మా దగ్గరకి కోకొల్లలు వస్తున్నాయి.” చాలా కూల్‌గా అన్నాడాయన.

“అమాయకురాళ్ళయిన అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న కేసులు కూడా వస్తాయి కదా.. ఆ లైన్‌లో ఇన్వెస్టిగేషన్ చేయండి” గంభీరంగా అన్నాడు.

ఏ లైన్స్‌లో చేసినా ఇంతవరకు తమ కూతురు ఆచూకీ తెలుసుకోలేకపోయారు.

డి.ఎస్.పి. సూర్యనారాయణ పేషెంట్ అవడం మూలాన మరింత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని తనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు.

ఆయన ఆ మాట అడిగినందుకు ఆ క్షణంలో కోపం వచ్చినా అదే అనుమానం సూర్యనారాయణకి కూడా కలిగింది. భార్యతో తన అనుమానం వ్యక్తం చేసాడు. “దానికి ఏమన్నా లవ్ అఫైర్స్ ఉన్నాయేమో నీకేమన్నా తెలుసా”.

ఆవిడ గబా,గబా తల అడ్డంగా ఆడించి, “నేను తనకి కేవలం ఒక అమ్మని కాదండి.. ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉంటాను. ప్రతి చిన్న విషయం నాకు చెబుతుంది. ఎవరో కుర్రాడు ఆ మధ్య వెంట పడుతూ విసిగిస్తున్నాడని చెప్పింది.. తరవాత ప్రిన్సిపాల్‌కి కంప్లైంట్ చేసానని, మళ్ళి తన జోలికి రాలేదని కూడా చెప్పింది. అలాంటి పిల్ల కాదు” అంది.

నిట్టూర్పు విడిచి మౌనంగా ఉండిపోయాడు.

మళ్ళీ ఒకరోజు “మీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా డాక్టర్” అడిగాడు డి.ఎస్.పి.

“లేరండి.. అసలు చాన్స్ లేదు.. మీకు తెలుసుకదా నేను ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఎప్పుడూ ఎవరినీ డబ్బుల కోసం పీడించలేదు. ఎవరినీ నొప్పించలేదు.. నాకు శత్రువులు ఉండే చాన్స్ ఎక్కడ?”

“నిజమే! నాకు తెలుసు… ఎవరి నోటి నుంచి కూడా ఎప్పుడూ బాడ్‌గా వినలేదు.. వర్రీ అవకండి.. మీ కేసు మేము ప్రయారిటీ బేసిస్‌లో చూస్తాం.. నేను ఇవాళే అన్ని పోలీస్ స్టేషన్‌లకి మెస్సేజ్ పంపిస్తాను.” డాక్టర్ సూర్యనారాయణ దయార్ద్రహృదయం తెలిసిన డి.ఎస్.పి ఈయనకి శత్రువులు ఉండే అవకాశం ఎక్కడుంది అనుకుంటూ వాగ్దానం చేశాడు.

డి.ఎస్.పి వాగ్దానంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది. గుండెల మీద పెద్ద బరువు దించేసినట్టు నిశ్చింతగా గడిపాడు నెలరోజులు.. చిరుగాలికి గులాబీ కొమ్మ కదిలినా, ఒక ఆకు నేలరాలినా తన కూతురే వచ్చేసినట్టు భార్యాభర్తలు ఇద్దరూ ఉలికి, ఉలికి పడుతూ, గుమ్మం దగ్గరకు పరిగెత్తి నిరాశగా రావడం. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఐదు సంవత్సరాలు.. కాలం ఆగలేదు.. ఋతువులు మారుతూనే ఉన్నాయి. కూతురు జాడ లేదు. ప్రతి రోజూ ఎన్నో వార్తలు.. మరెన్నో కథలు టివిలో, వార్తాపత్రికల్లో.. ప్రేమిస్తున్నానని భ్రమపడి ఎవరితోటో వెళ్ళిపోయి, మోసపోయిన అమ్మాయిలు, సినిమాల మోజుతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అమ్మాయిలు, ఉన్మాదుల కిడ్నాప్‌కి గురై , అత్యాచారాలకి గురై హతులైన అమ్మాయిలు ఇలా ఎన్నో కథలు.. కన్నీటి గాథలు… అయినా ఆశ చావని ఆ దంపతులు నిరీక్షిస్తూనే ఉన్నారు.

ఆ కేసు డీల్ చేస్తున్న డి.ఎస్.పి బదిలీ అయి వెళ్ళిపోయాడు. వెళ్తూ, వెళ్తూ మరో ఆఫీసర్‌కి కేసు అప్పచెప్పి మరీ వెళ్ళాడు. అయినా సంవత్సరాలు గడిచినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా జాడ తెలియలేదు.. ఇంకా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆయన ఆశ పడుతున్నాడు. నిజంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారో, లేదో ఎవరికీ తెలియదు.

ఆయన గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది నిట్టూర్పు.

రెండు అరచేతుల్తో మొహం కప్పుకుని మోచేతులు తొడమీద పెట్టుకుని నిశ్సబ్దంగా ఏడుస్తున్న భార్య పక్కన కూర్చుని ఆమెని దగ్గరకు తీసుకుని “బాధపడకు జ్యోతి. మనం ఎవరికీ అన్యాయం చేయలేదు.. మనకి దేవుడు అన్యాయం చేయడు.. తప్పకుండా అమ్మాయి వస్తుంది. నాకు నమ్మకం ఉంది” అన్నాడు.

ఆవిడ కుమిలి, కుమిలి ఏడుస్తూ ఆయన గుండెల మీద వాలిపోయింది.

***

టక్ టక్ టక్ టక్

ఆమె చేతిలో సుత్తి ఇటుక మీద శబ్దం చేస్తోంది. ఆమె మొహంలో ఒక విధమైన దృఢ సంకల్పం, కసి కనిపిస్తోంది. కుడి చేతిలో సుత్తి పిడి బలంగా పట్టుకుని, తీక్షణంగా ఆ గోడని చూస్తోంది. రెండు రోజులుగా పట్టుదలతో, ఒక నమ్మకంతో, ఆశతో కొడుతున్నందుకేమో ఆమె దృఢ విశ్వాసానికి తలవంచినట్టు రెండు ఇటుకలు విరిగి కింద పడ్డాయి.

ఏటవాలుగా ఓ సూర్యకిరణం గదిలో పడింది. ఎంతో కాలం తరవాత కనిపించిన ఆ వెలుగు రేఖని కళ్ళు విప్పార్చుకుని చూడాలనిపించినా, ఆమె కళ్ళు సహకరించక చూడలేకపోయింది. రెండు చేతులతో మొహం కప్పుకుని, నెమ్మదిగా కనురెప్పలు కదిలిస్తూ వేళ్ళ సందులో నుంచి ఆ కాంతి ద్వారా పరిసరాలు చూడడానికి విశ్వప్రయత్నం చేసింది. కొన్ని నిమిషాల తరవాత మెల్లగా కళ్ళు పూర్తిగా తెరిచింది. తల్లి గర్భం నుంచి బయటపడిన పాపాయి కళ్ళు తెరిచి లోకాన్ని చూసినప్పుడు ఎలాంటి అనుభూతి ఆ పాపాయికి కలుగుతుందో మరి కానీ ఆ క్షణం మాత్రం ఆమెకి ఓహో వెలుగంటే ఇదా అనిపించింది.

ఎంతకాలమైంది ఈ వెలుగు చూసి.. ఒక్కసారి సూర్యుడి కిరణాలు చూడాలని, ఆ వెచ్చదనం అనుభవించాలని హృదయం తహ,తహలాడుతోంది. అపరాహ్ణం దాటి నడినెత్తి మీదకి వచ్చిన సూర్యకిరణాలు వాడిగా, సూదుల్లా గుచ్చుతున్నా అవి బాధించడంలేదు ఆమెని. మెత్తని గులాబీరేకులు గాలికి ఎగిరివచ్చి అణువణువూ స్పృశిస్తున్న మధురానుభూతి కలిగింది. చేతులు అడ్డం తీసి కళ్ళు విప్పార్చుకుని చూసింది. ఇంతకాలంగా గాలి, వెలుతురు లేని ఆ చిన్నగదిలో ఇప్పుడు వస్తువులు అన్నీకొత్తగా, వింతగా కనిపించసాగాయి.

సుమారు ఐదేళ్ళుగా అక్కడ బంధింపబడి బయటకు వెళ్ళడానికి ఎటూ దారి తోచక నరకం అనుభవిస్తున్న ఆమెకి అత్యంత ప్రయాసకి ఓర్చి సుకుమారమైన చేతులతో రెండు రోజులుగా కష్టపడి చేసిన ఆ చిన్న కంత విశాలమైన రహదారిగా అనిపిస్తోంది.. అప్పుడే రెక్కలొచ్చిన పక్షి రివ్వున ఎగిరిపోడానికి రెక్కలు రెప,రెపలాడించినట్టు ఆమె హృదయం తహ,తహలాడింది. అప్పటికప్పుడు ఏదన్నా మేజిక్ తెలిస్తే ఓ పక్షిగానో, చిన్న కుందేలుగానో మారిపోయి ఆ చిన్న రంధ్రంలో నుంచి పారిపోవాలని ఉంది.

చాలా కాలం తరవాత ఆమెలో ఉత్సాహం వెల్లి విరిసింది. చాలు.. ఈ చిన్న మార్గం ఇంకొంచెం విశాలం చేస్తే… చేస్తే.. ఒక్క క్షణం ఆగిపోయాయి ఆలోచనలు..

ఎలా? ఈ మార్గం లో నుంచి తను ఎలా వెళ్ళగలదు! మొత్తం గోడ విరగాలి.. అది జరిగే పనేనా! ఇప్పటికే చేతులు గాయాలతో మంటలు రేగుతున్నట్టు భగ, భగ మండుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు చేస్తే తను దూరే దారి ఏర్పడుతుంది! ఆమెకి భయం, దుఃఖం మూకుమ్మడిగా దాడి చేసాయి. తప్పదు.. వెలుగులోకి నడవాలంటే చీకటిని జయించాలి.. శిఖరాలను చేరాలంటే నిచ్చెన కోసం చూస్తూ కూర్చోడం కాదు… అందిన ఆధారం పట్టుకుని పైకి ఎగబాకాలి.. మరోసారి దృఢంగా అనుకుంది.

చెమటలు కారుతోంటే కొంచెం వొంగి చుడిదార్ పైన టాప్‌తో మొహం తుడుచుకుని, తల పైకి ఎత్తబోతుంటే ఆమె దృష్టి అప్రయత్నంగా ఎదురుగా నోట్లో వేలు వేసుకుని, కళ్ళు చికిలిస్తూ తన వైపే భయంగా చూస్తున్న మూడేళ్ళ బాబు మీద పడింది. ఒక్కసారి గుండె మెలిపెట్టినట్టు అయింది. సుత్తి చెక్క మీద పెట్టి స్టూల్ మీద నుంచి దిగింది.

వాడిని దగ్గరకు తీసుకుని వొళ్ళో కూర్చోబెట్టుకుని మృదువుగా అడిగింది “భయం వేస్తోందా!” నుదుట చిందర వందరగా పడ్డ జుట్టు సరిచేస్తూ.

వాడు సమాధానం చెప్పలేదు.. ఆమె మెడచుట్టూ రెండు చేతులు పెనవేసి గుండెల్లో తలదాచుకున్నాడు.

ప్రేమగా వాడిని దగ్గరకు హత్తుకుని దీర్ఘంగా నిట్టూర్చింది.

ఆమె గుండె లోతుల్లోంచి పెగిలి వచ్చాయి మాటలు. “అవును పుట్టిన మరుక్షణం నుంచి పద్దెనిమిదేళ్ళ పాటు వెలుగులో, వెన్నెల్లో బతికిన నేనే ఇన్నాళ్ళ తరవాత వెలుగు చూసి తట్టుకోలేకపోతున్నాను.. చీకటే తప్ప వెలుగెలా ఉంటుందో తెలియని నువ్వెలా తట్టుకోగలవురా తండ్రీ!” దుఖంతో గొంతు జీరపోగా కన్నీళ్లు తుడుచుకుని, వాడి చెంపలు నిమురుతూ అంది.

“కొంచెం ఓపిక పట్టు నాన్నా.. నేను అనుకున్నది అయిపోతే మనకి ఇక్కడినుంచి విముక్తి దొరుకుతుంది. మనం అమ్మమ్మ, తాతయ్యల దగ్గరికి వెళ్ళిపోదాం.. కొంచెం ఓపిక పట్టు.”

ఆమె మాటలు అర్ధం కాని బాబు గుండె మీద నుంచి తల ఎత్తి ఆమె వైపు చూసాడు.

ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు, అనుమానాలు.. ఆమె ఏం మాట్లాడుతోందో అది ఏ భాషో వాడికి అర్థం కాలేదు అని వాడి మొహంలో కనిపిస్తున్న భావాలు చెప్తున్నాయి.

ఆమెకి తెలుసు వాడికి ఏమి అర్థం కాదని … కానీ ఆమె వాడితోటే మాట్లాడుతుంది. వాడు తప్ప ఆమెకి మరో లోకం లేదు.. వాడు తప్ప బతకడానికి ఆమెకి మరో ఆశ లేదు. వాడి కోసమే ఆమె ఇప్పుడు చేయకూడని సాహసం చేస్తోంది.. తను చేస్తున్న పని అతనికి తెలిస్తే ఏమవుతుందో ఊహించుకుంటేనే ఆమె అణువణువూ భయంతో జలదరిస్తుంది..

ఆ చూపుల నుంచి, ఆ పశువు నుంచి పారిపోడానికి ఎన్నో ప్రయత్నాలు.. ఎంతో పోరాటం… ఎంతో ఘర్షణ.. కనుచూపు మేరలో ఎక్కడా మార్గం కనిపించక నిరాశతో క్రుంగి పోయే సమయంలో ఓ చిన్న ఆశాకిరణం.

ఆరోజు అనుకోకుండా ఏ గంధర్వులో ఎక్కడి నుంచో ఆమెని కరుణించి పడేసినట్టు కనిపించింది సుత్తి.. సంకల్పం బలంగా ఉంటే ఏదో రూపంలో ఆ భగవంతుడే సాయం చేస్తాడు..

ఆ గది నిర్మించడానికి ఉపయోగించిన పని ముట్లలో ఒకటైన సుత్తి.. ఓ మూల కుప్పగా పడేసిన సగం విరిగిన ఇటుకల గుట్ట వెనకాల.. తుప్పు పట్టి.. మహాసముద్రంలో కొట్టుకుపోతున్నా జీవించాలన్న ఆశ ఉంటే తిమింగలం కనిపించినా దానిమీద కూర్చుని ఒడ్డు చేరడానికి గొప్ప ధైర్యం కావాలి.. మరికొంత సాహసం ఉండాలి.. ఇప్పుడు ఆమెలో మొండి ధైర్యం వచ్చేసింది.. ఇంతకాలం తప్పించుకోడానికి మార్గాలు అన్వేషిస్తూ నిరాశతో క్రుంగిపోయింది.. ఇప్పుడు తప్పించుకోడానికి ఒక ఆధారం లభించింది.. ఆ ఆధారం వృథా చేసుకోవాలని లేదు ఆమెకి.. తన ప్రాణం పోయినా కనీసం ఆ చిన్నారి నైనా స్వేచ్చా ప్రపంచం లోకి పంపించాలి.. వాడికి ఉజ్వలమైన భవిష్యత్తు నివ్వాలి. తల్లిగా తన బాధ్యత. తను చేయగలదో లేదో, అసలు జీవించి ఉంటుందో లేదో తెలియదు.. కానీ వాడిని చేర్చాల్సిన చోటికి చేర్చాలి.. ఆమె కళ్ళ ముందు ఎవరో నిలబడి కర్తవ్యం బోధిస్తున్నట్టుగా అనిపించింది. భయపడుతూ బ్రతకడం కన్నా చావడం మేలు.. తను రిస్క్ తీసుకుంటోంది.. కానీ రిస్క్ లేకపోతే విజయం ఉండదు.. విజయం సాధించాలంటే రిస్క్ చేయాలి.. చేయాలి.. ఆమె చేతిలో ఉన్న సుత్తి వైపు ప్రేమగా చూసింది.. అది ఇప్పుడు తనని రక్షించే దివ్యాస్త్రం.. ఎంతో వెతికింది పారిపోయే మార్గం కోసం.. ఏ దారి కానరాలేదు.. ఆరోజు… ఆరోజు.. ఆమె కళ్ళ ముందు నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన కదిలింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here