నాన్న లేని కొడుకు-11

1
7

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]ఆ[/dropcap] స్కూల్‌కి సంబంధించిన వివరాలన్నీ సేకరించాడు సూర్యనారాయణ. చాలా మంచి స్కూల్ అని, పిల్లలకి ఆటలు, పాటలు, మైండ్ గేమ్స్, రకరకాల పద్ధతుల్లో వారిలోని ఇంటలెక్చువల్ లెవెల్స్ పెరగడానికి శిక్షణ ఇస్తారని, ఆ స్కూల్‌లో మానసికంగా ఎదగని పిల్లలు కూడా ఉన్నారని, ఆ పిల్లలని కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తారని తెలిసింది.

అప్లికేషన్ ఫారం తెప్పించాడు. హరిత ఫారంలో ఉన్న అన్ని కాలమ్స్ చదివింది. ఆమె పెదవుల పైన నిర్వికారమైన చిరునవ్వు మెరిసింది. తండ్రి వైపు చూస్తూ అంది “వీడికి పేరు పెట్టాలిగా నాన్నా! ఏం పేరు పెడదాం” అంది.

బాబుని ఒళ్లో కూర్చోబెట్టుకుని బొమ్మలు చూపిస్తూ, ఆ బొమ్మల పేర్లు చెబుతూ అన్నం తినిపిస్తోన్న జ్యోతి అంది “క్రాంతి అని పెట్టు హరితా!”.

“క్రాంతి…” ఆ పేరు ఒకసారి ఉచ్చరించి, “బాగుందమ్మా! నీకు ఓకేనా నాన్నా!” అడిగింది హరిత.

“మీ అమ్మ చెప్పాక ఓకే కాకపోవడం అనే ప్రసక్తే లేదు” అన్నాడాయన నవ్వుతూ.

హరిత పేరు రాయబోతూ ఆగిపోయి సందేహంగా అంది “ఇనిషియల్ ఏమని రాయాలి”.

ఆ ప్రశ్నకి భార్యాభర్తలిద్దరూ ఉలిక్కిపడ్డారు. సూర్యనారాయణ కూతురి మొహంలోకి కొంచెం ఆందోళనగా చూసాడు.

“వీడి జీవితం ఒక ప్రశ్న అవుతుందేమో అని భయంగా ఉంది నాన్నా… ఇంటిపేరు కావాలి. తండ్రి పేరు కావాలి.. అడ్రస్ కావాలి.. ఒక మనిషి ఈ భూమ్మీద పడిన దగ్గర నుంచి ఆ మనిషికి ఒక identity crisis ఏర్పడుతుంది.. నాకు మనోధైర్యం ఉంటే చాలదు… ఈ సమాజానికి కొత్త జీవన విధానం హర్షించే హృదయవైశాల్యం ఉండాలి కదా! సమాజం ఆమోదించకపోతే ఈ చిన్ని మనసు ఎంత వేదనకు గురి అవుతుందో తల్చుకుంటే నా మనసు విల,విల్లాడుతోంది నాన్నా.. ఒక కిరాతకుడి కొడుకు కిరాతకుడు కాకూడదు కదా..”

ఆయన కూతురి దగ్గరగా జరిగి కూర్చుని ఆమె భుజం మీద చెయ్యేసి అన్నాడు. “ఇటీవల ఒక కేసులో సుప్రీమ్ కోర్ట్ ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. దగాపడిన తల్లులకి గార్డియన్‌గా తన పిల్లలకి తండ్రి పేరు చెప్పాల్సిన నియమం లేదని, తల్లికి తండ్రి పేరు చెప్పడం ఇష్టం లేకపోతే బలవంతం చేయవలసిన అవసరం లేదని. స్త్రీల గౌరవమర్యాదలు కాపాడడానికి ఈ తీర్పు చెప్పడం జరిగిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, స్కూల్‌లో చేర్చాలన్నా తండ్రి పేరు చెప్పడం మాండేటరి కాదని, తల్లే నాచురల్ గార్డియన్ అని రాసుకోవచ్చు అని. నీకా ధైర్యం ఉందా!”

హరిత తల్లి వైపు చూసింది.

“అలా రాసి దాని జీవితం నాశనం చేద్దామా! కోర్ట్ తీర్పుని ఆమోదించే మనసు సమాజానికి ఉండాలి కదండీ.. పెళ్ళికాని తల్లిగా ముద్ర పడ్డాక తనకి మళ్ళీ పెళ్లి చేయడం ఎంత కష్టమో తెలుసా! మీరనుకునే అభ్యుదయం ఈ సమాజంలో రాలేదు. ఎవరన్నా ఆదర్శాలు వల్లిస్తే అవి పెదాల మీద నుంచి గొప్ప కోసం చెప్పేవే. అలా చెప్పేవాళ్ళు ఎవరూ తనకి జీవితం ఇవ్వరు. వీడి పేరు ఎన్ క్రాంతి.. తల్లి జ్యోతి, తండ్రి డాక్టర్ సూర్యనారాయణ.. హరితకీ పెళ్లి కాలేదు… చదువు పూర్తి అవగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి.” స్థిరంగా అంది ఆవిడ.

సూర్యనారాయణ హరిత మొహంలోకి చూసాడు. నేల చూపులు చూస్తూ మౌనంగా కూర్చున్న హరిత నెమ్మదిగా తలెత్తి అంది “పెళ్లి కాని తల్లిగా నా కొడుకుని పెంచుకోడానికి ఎలాంటి అభ్యంతరం లేదమ్మా… సమాజం అంటే భయమూ లేదు. ఇదివరకటి కన్నా మనుషుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. మొదటిరోజు ఒక్కదాన్ని గేటు దాటి బయటికి వెళ్తుంటే తల నుంచి పాదాల దాకా వణుకు వచ్చింది. తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తారేమో! ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతారేమో? నీతో పాటు తీసుకుని వచ్చిన బాబు ఎవరు అని గుచ్చి, గుచ్చి అడుగుతారేమో అనుకున్నా. సమాధానం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? అని మానసికంగా విలవిల తన్నుకున్నాను. కాకపొతే కార్లలో తప్ప కాలినడకన తిరిగే మనిషి కనిపించని చోటు కావడం వల్ల కావచ్చు.. నన్ను ఎవరూ చూడలేదు.. నేనెవరో పట్టించుకోలేదు. కాలేజ్‌లో అయినా అడుగుతారేమో అనుకున్నా.. అక్కడ కూడా ఎవరూ నాకు తెలిసిన వాళ్ళు కనిపించలేదు. నెమ్మదిగా నన్ను నేను కౌన్సిలింగ్ చేసుకున్నా. ఇప్పుడు నా అంతట నేనుగా పాత ఇంటికి వెళ్లి ఆ చుట్టుపక్కల అందరినీ పలకరించి రాగలను. ఆ కాలేజ్‌కి వెళ్లి పాత ఫ్రెండ్స్ ఎవరన్నా కలిస్తే జరిగిన విషయం చెప్పగలను. మీరంతా ఆరోజు నాకు అండగా ఉండి అంత ధైర్యం చెప్పినా జరగాల్సిన దారుణం జరిగింది అని చెప్పి నా ఆత్మీయులు అయిన అపర్ణ, నీలు, షీలా దగ్గర నా బాధ పంచుకోవాలని కూడా ఉంది.”

గాద్గదికం అయిన స్వరం సవరించుకుంది. కళ్ళ చివర కారిన కన్నీరు తుడుచుకుంది. “ఇప్పుడు నాకే భయం లేదు.. ఎలాంటి సంకోచం, సంఘర్షణ లేదు.. అందుకే చెప్తున్నా… నువ్వు అన్నట్టే వీడి పేరు క్రాంతి… తల్లి పేరు హరిత…తండ్రి లేడు.. ఇక ఇంటి పేరు నా ఇంటి పేరే అంటే నా తల్లి, తండ్రుల ఇంటి పేరే ఇచ్చుకోడానికి అనుమతి ఇవ్వండి..”

ఆఖరి మాటలు అంటున్నప్పుడు ఆమె దుఃఖాన్ని నివారించగల శక్తి ఆ తల్లి,తండ్రులకి లేకపోయింది. జ్యోతి గబుక్కున దగ్గరకు వచ్చి హరితను గుండెలకు హత్తుకుంది.. ధారగా కారుతున్న కన్నీరు గొంతుని నొక్కేసి మాట రాకుండా అడ్డు పడడంతో నిశ్శబ్దంగా ఆమె వీపుమీద ఓదార్పుగా రాస్తూ ఉండిపోయింది.

సూర్యనారాయణ ఎగసిపడుతున్న దుఃఖం అణచుకుంటూ కూర్చున్న దగ్గర నుంచి లేచి కిటికీ దగ్గరగా నిలబడి బయట లాన్ వైపు చూస్తూ అన్నాడు.

“భారతదేశం అంటేనే పవిత్రతకి చిహ్నం… సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కారవంతమైన జీవనవిధానం, పటిష్టమైన కుటుంబ వ్యవస్థ… ఇవన్నీ భారతీయుల సొత్తు. అలాంటి ఈ దేశంలో ఏ దుష్టశక్తులు ప్రవేశించాయో అందమైన కుటుంబాలను, ఆడపిల్లల జీవితాలను చెల్లాచెదరు చేసాయి. మనిషిని, మనిషి దోచుకునే స్వార్ధం కోరలు చాచుకుంది. ధనదాహం బతికున్న మనిషి అవయవాలతోటే కాదు, శవాలతో కూడా వ్యాపారం చేసే స్థాయికి దిగజారింది. మానవత్వం సిగ్గుపడి తనని తాను సమాధి చేసుకుంది. శాడిస్టులు చెలరేగిపోతున్నారు. ప్రేమ, దయ, తోటి మనిషి పట్లే కాదు, జీవకారుణ్యం కూడా అంతరించిపోతోంది.”

ఆయన అక్కడి నుంచి కదిలి తిరిగి సోఫాలో కూర్చున్నాడు. ఎటో చూస్తూ నెమ్మదిగా తనకి తానే చెప్పుకుంటున్నట్టు “ప్రేమ…. సమస్త జగత్తూ ఈ రెండక్షరాలతోటే నిర్మించబడింది. మొట్టమొదట ఓ మలయపవనంలా ప్రవేశించింది అమ్మ ప్రేమ. ఆ తరవాత స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ… ఈ ప్రేమ అనే అమృతాన్ని ఒక్క మనిషికే కాదు సృష్టిలోని సమస్త జీవజాతికీ పంచిపెట్టాడు ఆ విధాత. అందుకే ఆయా జంతువులు, పక్షులు ఆఖరికి చీమ లాంటి సూక్ష్మజీవుల్లో కూడా కలసికట్టుగా జీవించాలన్న ఆరాటం, తమకంటూ ఓ గూడు ఏర్పరచుకుని అందులో కలిసి జీవించాలన్న కోరిక ఉంటాయి. అందుకోసమే శ్రమిస్తాయి. కానీ మనిషిలో కనీసం కుటుంబం పట్ల కూడా నిజాయితీతో కూడిన ప్రేమ కనిపించడం లేదు.

స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే ప్రేమ మంచి గంధం పరిమళంలా అంగాంగం లోనే కాదు అంతరంగంలో కూడా వ్యాపించాలి. ప్రేమంటే యాసిడ్ బాటిల్ కాదు.. అత్తరు సీసా.. ప్రేమంటే కత్తికి కట్టిన కంకణం కాదు రెండు హృదయాలు వేసుకున్న ముడి. అలాంటి ప్రేమ ఇవాళ శాడిస్టుల మనస్సులో జొరబడి విషవాయువులు ప్రపంచం మొత్తం వ్యాపింప చేస్తోంది. ఈ పరిణామమే పవిత్రమైన జీవనవిధానాన్ని చెల్లాచెదరు చేసి, చెట్టుకొకరు, పుట్టకోకరుగా విసిరివేస్తోంది… ఈ పరిణామమే అక్క, చెల్లి, అమ్మ, నాన్న, అన్న, బంధువులు, మిత్రులు అనే బంధాలను తెంచి మనిషిని ఒంటరిని చేస్తోంది. ఈ పరిణామం వల్లనే రేపటి పిల్లలు నాన్న లేని పిల్లలుగా మిగిలిపోతున్నారు. ఇంటిపేరు లేని అనాథలు అవుతున్నారు. కుటుంబం అంటే తెలియక మ్యూజియంలో కనిపిస్తుందేమో అని వెతుక్కుంటున్నారు. తప్పదు… తల్లకిందులుగా పడిపోయిన ఈ వ్యవస్థని సరిచేసి సరిగా, పటిష్టంగా నిలబెట్టగల సమర్థుడైన మహారాజు ఎవరన్నా పుట్టాలి. అందాకా ఇంతే.. కానీ హరితా! నీ ఆశయాన్ని హర్షిస్తున్నాను. వాడు పెద్దవాడు అయాక మమ్మల్ని అమ్మా, నాన్నా అని పిలుస్తుంటే నిన్ను ఏమని పిలవాలో వాడికీ అర్ధం కాదు.. నీకూ అర్ధం కాదు. అందుకే తండ్రి లేకున్నా కనీసం తల్లి ఉందన్న ఆశ వాడికి ఆనందాన్ని కలిగించాలి. ఈ తల్లే తనకోసం ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి కొత్త తరాన్ని ప్రారంభించిందని తెలియాలి. ఎస్ వీడి ఇంటిపేరు నిమ్మరాజు క్రాంతి… “

ఆయన ఆపగానే పిన్ డ్రాప్ సైలెన్సు ఏర్పడింది అకస్మాత్తుగా. అప్పటివరకూ నిశ్చేష్టులయి వింటున్న జ్యోతి, హరిత నిద్ర నుంచి మేలుకున్నట్టు ఒకరినొకరు చూసుకున్నారు. హరిత చటుక్కున లేచి ఆయన దగ్గరకు పరిగెత్తినట్టుగా వెళ్లి, ఆయన ఒడిలో తలపెట్టుకుని అస్పష్టంగా, ఆర్తిగా అంది “థాంక్స్ నాన్నా… థాంక్ యు వెరీ మచ్… మీలాంటి తల్లి,తండ్రులు లభించడం నా అదృష్టం నాన్నా… ఐ లవ్ యు…”

ఆయన కుడిచేయి ఆమె జుట్టు సవరించింది.. ఆ స్పర్శలో కొండంత ధైర్యం, ఇంకా ఎంతో గొప్ప అభయం కనిపించింది హరితకీ. ఆ తండ్రి, కూతుళ్ళ వైపు చంకలో ఉన్న బాబుకి చూపిస్తూ “ చెప్పు తండ్రి! అమ్మ…. అమ్మ…” అంది జ్యోతి.

వాడు చిరునవ్వుతో తననే చూస్తున్న హరిత వైపు చూసాడు. జ్యోతి మళ్ళీ “చెప్పు నాన్నా! అమ్మ… పిలువు అమ్మని ఇలా రమ్మను..” చెంప మీద ముద్దుపెట్టుకుంటూ అంది.

వాడు నెమ్మదిగా, పెదాలు కదుపుతూ “అ… అ…. అమ్” అన్నాడు.

చిటారు కొమ్మన ఊగుతున్న గులాబీ ఒకటి కొమ్మ పైకి వాలి నిశ్చింతగా నవ్వింది.. పెళ్ళికొచ్చి పెద్ద బంతి కోసం కూర్చున్న పెళ్ళివారిలా కాంపౌండ్ వాల్ మీద వరసగా కూర్చుని ఉన్న పావురాళ్ళు రెక్కలు టప, టప లాడించి ఒక్కసారి ఎగిరి తిరిగి గోడమీద వాలాయి…

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here