నాన్న లేని కొడుకు-3

1
9

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]త[/dropcap]ల్లి, తండ్రి గుర్తుకు వస్తే మనసు కకావికలం అయిపోతుంది. మహరాణిలా బతకాల్సిన నాకీ దుస్థితి ఎందుకు వచ్చింది? వేదనగా అనుకుంది.

మరునాడు కొంచెం త్వరగా లేచి పని చూసుకుని వాడు వచ్చేలోగా ఇంకా కొంత మేర తవ్వాలనుకుంది. కానీ చేతులు బొబ్బలెక్కి సహకరించలేదు. అలాగే మెల్లగా సుత్తితో కొడుతూనే ఉంది. త్వరగా అలసిపోయింది. కాసేపటికి సుత్తి చేతిలో నిలవలేదు.. నిరాశగా దిగి బాబు, పనులు తన పనులు చేసుకుని పడుకుంది.

ఆమె లేచేసరికి ఐదున్నర అయింది. యథాప్రకారం చీకటి పడుతుండగా వచ్చాడు. అప్పటికే తాగి ఉన్నాడు. ఆమె చేతికి చికెన్ ఇచ్చాడు. ఫ్రై చేయి అన్నాడు. చేయను అనాలనుకుంది. చేయకతప్పదు. ప్రతిఘటిస్తే వాడిలో రాక్షసుడు నిద్ర లేస్తాడు. ఆమెని హింసించేటప్పుడు వాడికి ఆమె మీద ప్రేమ గుర్తు రాదు. కానీ ఆమెని ప్రేమిస్తున్నా అంటాడు. “నువ్వు నాకు తప్ప ఎవరికీ దక్కకూడదు.. నిన్ను ఎవరూ చూడకూడదు.. నేనే నిన్ను చూడాలి.. నేను తప్ప నిన్ను ఎవరూ ముట్టుకోకూడదు.. నువ్వు నా కోసమే బతకాలి.. నా కోసం చావాలి..” ఇది వాడి పాలసీ.

ఆ రాత్రి వాడి ఉక్కు చేతుల్లో నలుగుతున్న శరీరంతో పాటు చేతులు కూడా నిప్పులు పట్టుకున్నట్టు భగ, భగా మంటలు.. ఆమె కెవ్వుమంది.. ఆ కేకలు వాడికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆమె కన్నీళ్ళతో మండుతున్న చేతులు చల్లార్చుకోడానికి ప్రయత్నించింది.

తెల్లవారింది. వాడు వెళ్ళిపోయాడు. ఆమె కుప్ప కూలిపోయింది. చేతులు స్వాధీనంలో లేవు.. గ్లాసు కూడా పట్టుకోలేకపోతోంది. సుత్తి పట్టుకోడానికి పట్టు లేదు. ఈ రెండు రోజుల శ్రమ వృథానా.. అలా జరగడానికి వీల్లేదు. వెళ్లిపోవాలి… ఒక్కసారి బయటపడ్డాక చచ్చిపోయినా పర్వాలేదు.. ఆమె అరచేతులు చూసుకుంది. ఎర్రగా రక్తం చారికలు కట్టి… గాట్లు పెట్టినట్టు… ఆమె కళ్ళు మూసుకుని భగవంతుడిని తల్చుకుంది. తెగించి అటక ఎక్కింది. దెబ్బ మీద దెబ్బ.. పెదాలు బిగపట్టి బాధ ఓర్చుకుంటూ, కొడుతూనే ఉంది.

అయిపొయింది… ఆఖరి దెబ్బ… ఆమెకి గట్టిగా అరవాలనిపించింది..

ఆమె సంకల్పం నెరవేరింది.. ధృఢ నిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో చేసిన ప్రయత్నం ఫలించింది. దాదాపు పది ఇటుకలు విరిగిపడ్డాయి, మిగతాదంతా మట్టి. ఇప్పుడు మిట్టమధ్యాహ్నం.. సప్తాశ్వాలు అధిరోహించి నేరుగా సూర్యనారాయణుడు ఆమెని దీవించడానికి వచ్చినట్టు అనిపించింది. సంతోషంతో దుఃఖం ఉబికి వచ్చింది. మొదటిసారిగా ప్రకృతిని చూస్తున్నట్టు అనిపించింది బయటకి చూస్తుంటే. చుట్టూ ఎత్తైన వృక్షాలు, పచ్చని పచ్చిక.. ఎక్కడా నరసంచారం దరిదాపుల్లో కనిపించడం లేదు. అమ్మా, నాన్నల స్పర్శలా గోరువెచ్చని గాలి మొహాన్ని తాకింది. గుండెల నిండా గాలి పీల్చుకుంది.

ఎంత కాలమైంది ప్రకృతిని చూసి..! ఎంత కాలమైంది ఇంత స్వచ్ఛమైన గాలి పీల్చుకుని..

గబుక్కున బాబుని ఎత్తుకుంది. పచ్చటి చెట్లు చూపిస్తూ “మనం అక్కడికి వెళ్ళిపోతాం” అంది.

బాబు ఎన్నడూ ఎరుగని ఆ వెలుగు భరించలేని వాడిలా కళ్ళు మూసుకుని ఆమె భుజం మీద వాలిపోయాడు.

ఆమెకి దుఃఖం వచ్చింది. “నాన్నా! నీకు తెలియని ప్రపంచంరా అది.. అక్కడ మనకి స్వేచ్ఛ ఉంటుంది.. ఆనందం ఉంటుంది.. మనం ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు.. ఎగరచ్చు.. నవ్వచ్చు.. ఏది నవ్వు…” కితకితలు పెట్టింది.

బాబు ఆమె మొహంలోకి వింతగా చూస్తూ ఉండిపోయాడు.

ఆమె కన్నీళ్లు తుడుచుకుని వాడిని కిందకి దించింది. ఒక్కసారి ఏర్పడిన కంత వైపు చూసింది.

తను కొంచెం కష్టపడితే బయటకి దూకచ్చు.. ముందు బాబుని పంపించి తరవాత తను వెళ్ళాలి.

ఇప్పుడు టైం ఎంత అయి ఉంటుందో.. సూర్యకిరణాలు పదునుగా ఉన్నాయి.. అంటే మధ్యాహ్నం అయి ఉంటుంది. వెళ్లిపోవచ్చు. వాడు రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇదే అనుకూలమైన సమయం.. పారిపోవాలి.. కనిపిస్తున్న విశాల ప్రపంచంలోకి రెక్కలు చాచుకుని ఎగిరిపోవాలి.

ఇక్కడ నుంచి సిటీకి ఎలా వెళ్ళాలో.. చూస్తుంటే అడవిలా ఉంది ఈ ప్రదేశం. బాబుతో కలిసి క్షేమంగా మానవ సంచారం ఉన్న చోటుకి వెళ్ళిపోతే చాలు.. ఏదో ఒక వాహనం కనిపిస్తే చాలు.. అమ్మా, నాన్నల దగ్గరకి వెళ్లిపోవాలి. అమ్మ… అమ్మా! ఆమె హృదయం ఆర్తనాదం చేసింది. ఎంత ఏడుస్తోందో! నాన్న ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో తనని వెతకడానికి.. ఎంత కాలమైంది వాళ్ళని చూసి. ఎంతకాలమైంది అమ్మ ఒడిలో పడుకుని.. ఎంత కాలమైంది అమ్మ చేతి వంట తిని.. ఎంత కాలమైంది అమ్మ చేసిన కమ్మటి కాఫీ తాగి.. వెళ్ళిపోతుంది.. అమ్మ ఒడి చేరుతుంది.. నాన్న గుండెల మీద పడుకుంటుంది. ఆమె ఆనందానికి అవధులు లేకుండా అయింది.

ఇక్కడి నుంచి రోడ్ మీదకి ఎంత దూరం ఉంటుందో! వెధవ ఆ పశువుకి ఈ నిర్జన ప్రదేశంలో ఈ చిత్రమైన పాడు పడిన గది, దీనికి ఒక బాత్రూం, ఇలా వెంటిలేటర్స్ లేకుండా ఎలా దొరికింది. అసలు ఈ స్థలంలో ఎవరు కట్టారు? వాడే కట్టినట్టు ఉన్నాడు. ఈ స్థలం ఎవరిదీ? ఇది ఎవరూ చూడలేదా! పోలీసులు ఎందుకు కనిపెట్టలేదు ఇక్కడ ఈ నిర్మానుష్యమైన అడవిలో పాడుపడిన ఈ ఇల్లు ఒకటి ఉందని, ఈ ఇంట్లో ఒక నిస్సహాయురాలు ఐదేళ్ళుగా నరకయాతన పడుతోందని ఎవరూ ఎందుకు తెలుసుకోలేకపోయారు.

సరేలే… అయిపొయింది.. పీడకల లాంటి జీవితం ముగిసిపోతుంది. ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం లేదు.. పారిపోవాలి.. అదొక్కటే తన లక్ష్యం.

ఆమె ఒక్కసారి ఆ వెలుగులో గదంతా పరిశీలించింది.

అడ్డదిడ్డంగా పేర్చిన ఇటుకలు.. మధ్య, మధ్య మట్టి పెళ్లలు.. అవసరం కోసం వాడు నిర్మించుకున్న రహస్య స్థావరం.

బాబు తన కుర్తీ అంచు లాగడంతో వాడికేసి చూసింది.

వాడు రెండు వేళ్ళు నోట్లో పెట్టుకుని చూపించాడు. అది వాడికి ఆకలేస్తోంది అని చెప్పడానికి సంకేతం.. తనే నేర్పింది.

అప్పుడు గుర్తొచ్చింది. తనింకా వంట చేయలేదు.. పారిపోడానికి దారి చేసుకునే ప్రయత్నంలో ఆకలి, దప్పులు మర్చిపోయింది. తనకి లేకున్నా ఆ పసివాడికి ఆకలి ఉంటుంది కదా..

జాలేసింది. చక, చకా కింద పడిన ఇటుకలు తీసి గోడకి ఏర్పడిన కంతకీ అడ్డుపెట్టింది తాత్కాలికంగా. చీరల మడతలతో పాటు దిండు, దుప్పటి కూడా అడ్డు పెట్టింది ఇటుకలు కనిపించకుండా. చేతులు కడుక్కుని ముందు బాబుకి అరటిపండు తినిపించింది.

ఒక కప్పు బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టింది.

వంకాయలు తరిగి వేయించింది. ఇవాళ ఆ వెధవ కోసం తను వంట చేయనక్కరలేదు. తను, బాబు తిని వెళ్లిపోవాలి. తినకుండా వెళితే నడిచే ఓపిక ఉండాలిగా! నిట్టూర్చింది.

సరిగ్గా గంటలో బాబుకి అన్నం పెట్టి తను తినేసి గిన్నెలు అలాగే వదిలేసింది. బాబుకి జుట్టు సవరించి తను జడ వేసుకుంది. తనవి, బాబువి బట్టలు, వాడి బొమ్మలు, మిగతా వస్తువులు ఒక్కసారి చూసి కాలితో దూరం జరిపింది.

గోడకి ఉన్న మేకుకి తగిలించిన నల్ల హ్యాండ్ బాగ్.. ఆమెకి ఏడుపొచ్చింది. ఎంత ఇష్టంగా కొనుక్కుంది ఈ బాగ్..

తీసింది. దుమ్ము కొట్టుకుపోయి ఉంది.. దూరంగా తోసిన చున్నీ తీసి పై పైన తుడిచి భుజాన వేసుకుంది.

నెమ్మదిగా దడ, దడలాడే గుండెలతో మళ్ళీ ఇటుకలు తొలగించింది.

బాబుని ఎత్తుకుని వాడికి అర్ధం చేయడానికి ప్రయత్నిస్తూ బయట పెద్ద, పెద్ద కొమ్మలతో విస్తారంగా పరచుకున్న మర్రి చెట్టు కింద ఉన్న గట్టు చూపిస్తూ చెప్పసాగింది. “నిన్ను ఇప్పుడు ఇలా కిందకి దింపుతాను… నువ్వు అదిగో ఆ గట్టు మీద కూర్చో..నేను కూడా వస్తాను. మనం అమ్మమ్మ, తాతల దగ్గరకి వెళ్ళిపోదాం సరేనా..”

వాడు మౌనంగా చూసాడు ఆమె వైపు.

ఆమె పేలవంగా నవ్వుకుంది.. మరో మనిషి కనిపిస్తే, మరో మాట వినిపిస్తే, దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని లాలించే వాత్సల్యంతో కూడిన స్పర్శ తెలిస్తే వీడికి మాట వచ్చేది, మనసు విచ్చుకునేది, మెదడు వికసించేది. తను, ఈ గోడలు, ఆ రాక్షసుడు తప్ప ఇంకేమీ ఎరుగని ఈ పసివాడికి ఏం చెబితే మాత్రం అర్థం అవుతుంది.

నెమ్మదిగా వాడిని ఆ పెద్ద కంతలో నుంచి బయటికి దించసాగింది. గోడకి, నేలకి మధ్య నాలుగు అడుగులు ఉండచ్చు.. బాబు పడిపోతాడేమో! సందేహంగా ఆగిపోయింది. కింద అన్నీ రాళ్ళూ, మట్టి, పిచ్చి, పిచ్చి మొక్కలు, ఒళ్ళంతా గీసుకు పోయే అవకాశం ఉంది. గుండె దిటవు చేసుకుంది.

ఒకే ఒక్క క్షణం … ఆమె చేతులు వణికాయి. బాబు చేతుల్లోంచి జారబోతుండగా కనిపించాడు.

అత్యంత వేగంగా ఎవరో తరుముతుంటే పారిపోతున్న వాడిలా పరిగెత్తుకుని వస్తున్నాడు…

మానవరూపంలో ఉన్న రాక్షసుడు..

గబుక్కున బాబుని పైకి లాక్కుని కింద కూలబడింది అతనికి కనిపించకుండా.. కానీ గోడకి ఏర్పడిన ఖాళీ చూస్తాడు.. ఆయిపోయింది.. తన శ్రమ వృధా.. అంతే కాదు.. ఇప్పుడు అతని చేతిలో తనకి చిత్రహింసలు.. ఆమె భయంతో గజ, గజ వణుకుతూ అలాగే కూర్చుంది.

క్షణంలో తలుపులు ధడాల్న తెరుచుకుని, వెంటనే మూసుకున్న శబ్దం.

చీకటిగా ఉండే పరిసరాలన్నీ వెలిగిపోతున్నాయి.. ఆ ఒక్క గదిలో వచ్చిన వాడి ఎర్రటి కళ్ళు పసిగట్టేశాయి.. తల ఎత్తి చూసాడు. చిగురాకులా కంపించింది. వికృతంగా చూసాడు ఆమె వైపు. భయంకరంగా దగ్గరగా నడిచాడు.

ఏం జరుగుతోందో తెలిసేసరికి ఆమె జుట్టు అతని చేతిలో..

మెడ విరిగిపోయిందనుకుంది.

“ఎంత ధైర్యం నీకు.. నా నుంచి పారిపోడానికేనా.. ఎప్పటి నుంచి చేసావు ఈ పని?” కింద పడిన ఇటుకలు చూస్తూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అడిగాడు.

బాబు భయం, భయంగా ఏడుస్తూ దూరం, దూరం జరగసాగాడు.

ఆమె పాకుతూ వెళ్లి వాడిని దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెలకు హత్తుకుని ముడుచుకుని అలాగే కూర్చుంది.

అతని కర్కశమైన చేయి బాబుని లాగింది. బాబు కెవ్వుమని ఆర్తనాదం చేసాడు. ఆమె విల,విల తన్నుకుంది. “బాబూ!” అంది గట్టిగా.. అతను రెండు చేతులతో బాబుని పైకి ఎత్తి పట్టుకుని “వీడిని ఇప్పుడు ఇందులోనుంచి బయట పడేస్తా… కాపాడుకో చూస్తా” అన్నాడు.

“ఒద్దు… నీకు దణ్ణం పెడతా… వాడిని వదిలేయ్..” ఆమె మాట పూర్తి అయేలోగానే బయట నుంచి బూట్ల శబ్దం వినిపించింది. ఎవరో వస్తున్నారు.. ఇన్నేళ్ళకి… మరో వ్యక్తి అలికిడి… ఆమె మనసు ఆనందతాండవం చేసింది.

కచ్చితంగా వాళ్ళెవరో ఇతడిని వేటాడుతూ వస్తున్నారు. ఈ టైంలో ఇలా హడావుడిగా పరిగెత్తుకుని వచ్చాడంటే వీడి పాపం పండింది.. కచ్చితంగా ఎవరో వీడిని వెతుక్కుంటూ వస్తున్నారు. “హెల్ప్…. హెల్ప్ ప్లీజ్.. రండి, రండి… ప్లీజ్ రండి.. నన్ను, నా కొడుకుని కాపాడండి.” గట్టిగా అరిచింది.

వాడు గభాల్న ఆమె నోరు మూసాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here