ఇల్లు: నాన్నా.. నువ్వు లేని ఇల్లు!

1
12

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘ఇల్లు: నాన్నా.. నువ్వు లేని ఇల్లు!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ను[/dropcap]వ్వెందుకిలా చేసావు నాన్నా?
కొమ్మ మీద పక్షి అదాటున ఎగిరెళ్లి పోయినట్లు
వెళ్ళిపోయావేంటి నాన్నా!
ఇల్లు.. తుఫానుకి దీపం ఆరిపోయినట్లుంది.
నువ్వు లేని ఇల్లు
ఎగిరి పోయిన పక్షి గూడులా ఉంది.
నీ గొంతు.. గది గదిలో
నా పేరే ఇంకా పిలుస్తోంది
నా కాలం అనాథలా మిగిలిపోయింది.
~
నువ్వు అలిసి పడుకునే నవారు మంచం..
అమ్మ మీద అలిగి కూర్చునే వాకిటి వాలు కుర్చీ..
నువ్వు భోజనం చేసే పీట
నాన్నా నువ్వు అన్నం తిన్న కంచం.,
నువ్వు నడిపించిన బతుకు లాంటి సైకిల్,
లోగిలిలో ఊరి దోస్తులతో నువ్వేసే బాతాఖానీ అరుగు,
దొంగతనంగా కన్నీళ్లు తుడుచుకుంటూ.,
నువ్వు దిగులు మబ్బులా ఆనుకుని నిలుచున్న కిటికీ,
అన్నీ అలానే ఉన్నాయి నాన్నా!
మా బడి ఫీజు కట్టలేక బుగులై పోయిన
నీ రాత్రింబగళ్ళు కూడా నీకోసం వెతుక్కుంటున్నాయి.
నాతో పాడించుకున్న బతుకమ్మ పాట మూగబోయింది.
నాన్నా నువ్వు ఇంటి పెద్దర్వాజావి కాదూ.,
శాశ్వతంగా మూసుకుపోయావేంటి నాన్నా..
తలుపు తెరిచి కాసింత శ్వాసలా రా నాన్నా.
~
అలసిన నీ నవ్వులో కూడా సూర్యచంద్రుల కాంతి,
నీ వొళ్ళో వెన్నెలంత శాంతి.
ఇంటి ముందు వేప చెట్టంత
ధృడం కాదూ నువ్వు?
అమ్మ భరోసా కాదూ నువ్వు?
అమ్మ మీదో.. మా మీదో.. పొలం మీదో..
కురవని ఆకాశం మీదో.. అలిగీ.. అరిచీ
ఇంతలోనే నవ్వేసే..
పులుపూ.. వగరూ.. కారం కలగలిసిన
రుచివి కదా నాన్నా నువ్వు ?
ఇల్లంతా వదిలేసి.. ఎటెళ్ళిపోయావు నాన్నా?
ఇంటి ముందు నీ అరుగు నీ సమాధిలా ఉంది.
నీ మంచం నిన్ను మోసిన పాడేలా ఉంది.
ఇల్లంతా స్మశానంలా ఉంది నాన్నా!
~
అసలు నువ్వెప్పుడు ముసలి వాడివైనావు నాన్నా..
నన్నూ, నా బాల్య యవ్వనాలను పెంచుతూ.. పెంచుతూ
ఎప్పుడు నాన్నా మంత్రం వేసినట్లే
ముసలివాడివి అయిపోయావు?
పొలానికి వస్తూ.. పోతూ
నిన్ను చాలా సార్లు చూసాను.
నెరిసిన గడ్డం.. విరిగిన కళ్ళద్దాల వెనక
బూజు పట్టినట్లున్న దిగులు గాజు కళ్ళు..
సైకిల్ మీద నువ్వలా..
మంచు కమ్మే ఉదయాల్లోకి
సీతాకోక చిలుకలా మాయం అవడం..
మబ్బులు మోసం చేస్తే
పురుగుల మందు తాగడం.. బతికి రావడం..
అమ్మ దుఃఖంలా మౌనం అవడం చూసాను.
లోకమంతా ఆడపిల్లని చీదరించుకుంటే..
వాళ్ళను దుమ్ములా చూసి.,
నన్ను ఇంటి దేవతను చేసుకుని
పెంచున్నావు కదా నాన్నా.
~
అసలు నువ్వెలా తయారయ్యావో..
నువ్వెంతటి మహాద్భుతానివో
నీకేమైనా తెలుసా నాన్నా?
నువ్వు పచ్చటి పంట మట్టితో
తయారైన బంగారం నాన్నా!
ఇంటిపైని ఆకాశం..
ఇంటి ముందరి వందేళ్ల చెట్టు,
దూరాన అంతెత్తు కొండ.,
రోజూ ఉదయించే సూర్యచంద్రులు,
ఊరున్నంత మేరా పారిన చెరువు,
మబ్బులోకి దూసుకుపోయే తెల్ల రెక్కల పక్షీ.,
ఇంటిలోపల గోడల్లోంచి ఫోటోల్లో నవ్వే
నానమ్మ తాతయ్యలు,
అమ్మ కౌగిలి.,
నీ గుండె కాయలాంటి పిల్లలం,
నా కొత్త నోటు పుస్తకంలోని
కాగితాల కమ్మటి వాసనా.,
నాలుగ్గదుల పెంకుటిల్లు,
కొట్టంలోని ఆవు దూడలు,
ఊరి పొలిమేరల్లోని పండీ.. పండని
ఏడ్పించి.. నవ్వించే చెలకా.,
నీ చమటలో పండిన పంటా.,
పంటని ఇంటికి పండగలా
తోలుకొచ్చే ఎడ్లబండీ..
వర్షాకాలపు తొలి వానా..
కాల్చిన కమ్మని మక్క కంకా ..
అమ్మ వాకిట్లో వేసిన బంతిపూల ముగ్గు..
అమ్మ కట్టిన పండగ చీరా
ఇంటి మీద ఎగిరిన సంక్రాంతి పతంగి.,
ఊరు నాన్నా.. నీకు గుడి లాంటి నీ ఊరు,
ఇవన్నీ కలిస్తేనే కదా నాన్నా నువ్వైంది..
నువ్వుగా తయారయ్యింది?
మరెటు పోయావు నాన్నా.. చెప్పు?
నాన్నా నువ్వు నా బాల్యం..
నా యవ్వనం కాదూ..
నువ్వే నేను.. నేనే నువ్వు కాదూ?
~
నాన్నా అలిసిపోయా ఎత్తుకోవూ..
నిద్రొస్తుంది, గుండెల మీద పడుకోబెట్టుకోవూ.,?
నువ్వు మాములుగా వెళ్ళిపోలేదు నాన్నా..
నన్ను దుఃఖ రుతువులో వదిలేసి.,
వసంతాన్ని తీసుకెళ్ళిపోయావు.
నా లోలోపలి తోడు కదా నువ్వు..
ఒంటరిని చేసి విడిపోయావెందుకు నాన్నా?
నాలోపలి తోట కదా నువ్వు?
ఎండ గొట్టేసి ఎటు పోయావు నాన్నా?
~
ఎవరూ చెప్పని.,
నా కథల పుస్తకం నాన్నా నువ్వు.
నీ కథలు చదువుతూ ఏడ్చీ.. నవ్వాను నాన్నా నేను!
నీ కోసం వాకిట్లో వెలగని దీపంలా ఉన్నాను.
ఎక్కడినుంచైనా వచ్చి వెలిగించి పో నాన్నా!
అలిసిపోయా.. నీ భుజాల మీదకి ఎత్తుకో .
చీకటిలో భయంగా ఉంది..
వచ్చి హృదయానికి హత్తుకో.
నువ్వుంటేనే నిరీక్షణ అనుకోకు
నువ్వెళ్ళాకా.. నువ్వొచ్చేదాకా నిరీక్షణే..
నువ్వు పిలిచే దాకా నిరీక్షణలోనే.
~
చూడు.. నాకు లాగా.,
నీ వస్తువులన్నీ నీకోసం
ఎదురు చూస్తున్నాయి
నీ చెప్పులు నీ పాదాల కోసం
వెతుక్కుంటున్నాయి..
రా.. చెప్పులు వేసుకో!
నా చిటికెన వేలు పట్టుకుని
నన్ను మళ్ళీ నడిపించుకుని వెళ్ళు.
నన్ను మళ్ళీ పెంచు నాన్నా
నిన్నేమీ అడగను
వచ్చేయి నాన్నా.
అలా ఇంట్లో నువ్వుంటే చాలు..
చూడు వచ్చేయ్!
~
ఇల్లు కట్టినట్లు,
పొలం దున్నినట్లు
ఆకాశం దాకా మెట్లు వేసుకుంటూ
వెళ్ళక పోయావా నాన్నా..
నిన్ను రోజూ కలవడానికి?
నువ్వు రోజూ వచ్చిపోవడానికి ?
నాన్నా., ఇంట్లోని వెలుగూ, చీకటీ నువ్వే అన్నీ..
నువ్వే ఇల్లు నాన్నా..
ఇల్లే నువ్వు నాన్నా!
చూడు అమ్మలా ఇల్లు కూడా ఏడుస్తుంది..
ఇల్లు దివారాత్రుళ్ళు నీకోసం ఎదురుచూస్తుంది!
ఒక్కసారి.. మళ్ళీ బతికి వచ్చేయి నాన్నా!
నాన్నా.. నువ్వు లేని ఇల్లు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here