నాటి పురాణాల్లో నేటి ఆధునిక విజ్ఞానం

1
15

[డా. కె. జి. వేణు గారి ‘నాటి పురాణాల్లో నేటి ఆధునిక విజ్ఞానం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]భా[/dropcap]రతదేశ విజ్ఞానం గురించి మాట్లాడటానికి మొదలుపెడితే వెంటనే మనకు గుర్తుకొచ్చేవి ‘వేదాలు’. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణవేదం. ఈ వేదాలన్నీ ఏకకాలంలో రచించబడలేదు. కొన్ని వేల సంవత్సరాల కృషితో తయారుచేయబడినవి. రుగ్వేదంలో నక్షత్ర సమూహాలైన గెలాక్సీల గురించి, రాశిచక్రాన్ని గురించి, సౌరశక్తి గురించి, గ్రహాల గురించి, వాటి చలనం గురించి, రుతువుల గురించి, ఉత్తర, దక్షిణ ధృవాల గురించి, ఇలా ఎన్నో అంతరిక్ష విజ్ఞానాంశములను రుగ్వేదంలో చూడవచ్చు.

రుగ్వేదానికి ఉపవేదమే ‘ఆయుర్వేదం’. ఇందులో జబ్బులను గురించి, వాటి నివారణ గురించి, ఔషధ విజ్ఞానం గురించి, రసాయనశాస్త్ర వినియోగం గురించి, శారీరక నిర్మాణశాస్త్రం గురించి ఇందులో వుంది.

యజుర్వేదంలో యజ్ఞాలు, ప్రయోగాలు, వాణిజ్య, వ్యవసాయాలు, జ్యోతిష, వాస్తు శాస్త్రాలు చోటుచేసుకున్నాయి. యజుర్వేదానికి ఉపవేదం ‘ధనుర్వేదం’. ఇందులో అస్త్ర, శస్త్రాల విజ్ఞానం మొత్తం వుంటుంది.

సామవేదంలో కళలకు ప్రముఖస్థానం వుంది. నృత్య, సంగీతాలకు సంబంధించి అనేకవిషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. రుగ్వేదంలోని రుక్కుల్ని రాగయుక్తంగా ఎలా పాడాలో వివరణ సామవేదంలో వుంది. అధర్వణవేదంలో వైద్యశాస్త్రానికి సంబంధించిన వివిధ రోగాల లక్షణాలు, వాటి నివారణలు, సూక్ష్మజీవుల వివరణ, శస్త్ర చికిత్సలు వున్నాయి. ఇందులోనే సామాజిక శాస్త్రం గురించి కూడా ప్రస్తావించబడింది. వేదాలలో ఇంకా వృక్ష, జంతుశాస్త్రాల గురించి, గణితం, రేఖాగణితం గురించి, తత్వ, తర్క శాస్త్రాల గురించి, విమానయానం, అంతరిక్షాల గురించి, కాలమానం గురించి, వర్షాలు, కృత్రిమ వర్షాల గురించి, సూర్యశక్తి, సూర్యశక్తితో రోగాల నయం గురించి, కృత్రిమ అవయవాల నిర్మాణం, అమరిక గురించి అనేక విషయాల జ్ఞానసంపద వుంది.

భూమి గోళాకారం గురించి వేదాల్లోని ఉత్తర బ్రాహ్మణంలో వివరించబడింది. భూమికి సూర్యుడు ఎప్పుడూ చాటుకాడని, నిత్యం ఇక్కడో ఒకచోట సూర్యుడి కాంతి పడుతూనే వుంటుదని నిరూపించారు. ఇదే విషయాన్ని వరాహమిరుడు పంచసిద్ధాంతిక గ్రంథంలో 13వ అధ్యాయమైన త్రైలోక్య సమస్థానంలో భూగోళం గురించి వివరించాడు. ఆర్యభట్టు తన గ్రంథమైన ‘ఆర్యభటీయం’లో భూమికి చలనం వుందని, అది తన అక్షంపై తిరుగుతోందని భూమితో సహా కొన్ని ఇతర గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగు తున్నాయని వివరించాడు. డాల్టన్ ప్రతిపాదించిన పరమాణు సిద్ధాంతానికి ముందే అణువులు, పరమాణువుల ఉనికిని గురించి భారతీయ పురాణ, ఇతిహాలలో ప్రస్తావించబడింది. పదార్థములను విడగొట్టినప్పుడు అవి అణువులుగా విడిపోతాయని, ఆ అణువులను తిరిగి విడగొట్టితే అవి పరమాణువులుగా విడిపోతాయని, రెండు వేరు, వేరు పరమాణువుల కలయిక వలన ఏర్పడే పదార్థముల ధర్మాలు ఆ పదార్థాన్ని ఏర్పరచిన పరమాణు ధర్మాలతో ఎటువంటి పోలికలు కలిగివుండదని, రెండు పరమాణువులు కలిసినప్పుడు కొంతశక్తి విడుదల అవుతుందని, అలాగే ఏర్పడిన అణువును విడగొట్టటానికి కొంతశక్తి అవసరం వుంటుందని, ఇలా ఇత్యాది విషయాలను ‘కణాదుడు’ ఏనాడో ఈ ప్రపంచానికి వెల్లడించాడు. కణాదుడి అసలు పేరు ‘కాశ్యపుడు’. అణువుల గురించి గ్రంథాలు రాయటం వలన కణాదుడయ్యాడు. శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్పు చెందుతుంది. శక్తిని నశింపజేయటం కాని, క్రొత్తగా సృష్టిం పజేయటం కాని జరుగదని చెప్పే ‘శక్తి నిత్యత్వ సూత్రాన్ని’ భగవద్గీతలో స్పష్టంగా తెలియజేయటం జరిగింది.

ఇప్పటికి 5 వేల సంవత్సరాల క్రితమే వ్యాసమహార్షి నేటి ఆధునికులకంటే మెరుగైన వైద్య విధానంలో, నూటొక్కమంది టెస్ట్ ట్యూబ్ బేబీలకు జన్మ కల్పించాడు. విడవడిన పిండభాగాలు కూడా ప్రత్యేక పిండాలవలె సంపూర్ణంగా శిశువులకు జన్మనివ్వగలవని ఆధునిక సైన్స్ చెబుతోంది. ఈ విషయం ఆనాడే వ్యాసమహామునుల వారికి తెలుసు. ఆ పద్ధతిలో కౌరవుల జననానికి మార్గం ఏర్పరచాడు. ఒక స్త్రీ ధరించిన గర్భాన్ని తీసి, వేరొక స్త్రీ గర్భంలోకి మార్చే ప్రక్రియ ఈనాడే కాదు, ఇతిహాసాల కాలంలోనే కొనసాగింది. తన చెల్లెలికి జన్మించే 8వ శిశువు తనను సంహరిస్తాడని కంసుడికి తెలుసు. అందుకే వసుదేవుడ్ని, దేవకిని చెరసాలలో బంధించాడు. వరుసగా 6మంది పిల్లల్ని చంపేశాడు. మళ్లీ దేవకి గర్భం ధరించింది. ఆదిశేషుడి అవతారం 7వ సంతానంగా జనించబోతోంది. ఆ బిడ్డను కాపాడటం కోసం తరచు చెరసాలకు వస్తూ, పోతుండే వసుదేవుడి మొదటి భార్య రోహిణీ గర్భంలోకి దేవకి మోస్తున్న గర్భాన్ని మార్పిడి చేస్తారు. అందరూ దేవకీకి గర్భస్రావం అయిందనుకున్నారు. ఈ ప్రక్రియను నిర్వహించిన డాక్టరుకు యోగమాయ అని పేరు పెట్టారు. అలా జన్మను పొందిన శిశువే ‘బలరాముడు’.

ప్రస్తుత కాలంలో సంభోగక్రియతో అవసరం లేకుండా భర్తమొక్క వీర్యాన్ని కాని, లేదా వేరొక పురుషుని వీర్యాన్ని కాని స్త్రీ యందు ప్రవేశపెట్టి కృత్రిమ గర్భధారణ కలిగిస్తున్నారు. మరి ఈ పద్ధతి మన పురాణాల్లో ఏయే సందర్భాలలో జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం. శివుడు తన వీర్యాన్ని వాయుదేవుడి ద్వారా అగ్నికి అందించగా, పార్వతీదేవి తన అండాన్ని స్వాహాదేవికి అందివ్వగా, అగ్ని, స్వాహాదేవిల కలయిక ద్వారా ‘కుమారస్వామి’ జన్మించాడు. శివుడి వీర్యాన్ని తీసుకొని వాయుదేవుడు అంజనాదేవితో కలిసి ‘హనుమంతుడికి’ జన్మనిచ్చారు. యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వనీదేవతలిద్దరు తమ వీర్యాన్ని కుంతీ, మాద్రిలకు అందించి పాండవుల జన్మకు కారకులయ్యారు. మహాభారత కథలో మరో సంఘటన వుంది. వసురాజు ఒకరోజు వేటలో ఉండగా, వీర్యస్కలనం ఆయింది. దాన్ని వెంటనే తన పెంపుడు గ్రద్ద ద్వారా తన భార్య గిరిక కోసం పంపించాడు. కాని మార్గమధ్యమంలో కొంచెం వీర్యం వొలికి క్రింద పడిపోయింది. ఆ పడిపోయిన వీర్యాన్ని ఒక చేప మ్రింగుతుంది. ఆ ఫలితంగానే ‘సత్యవతి’ జన్మిస్తుంది. పురుషుడిని స్త్రీగాను, స్త్రీని పురుషుడుగాను మార్చే ప్రక్రియలు నేటికాలంలోనే కాదు. పురాణాల కాలంలో కూడా జరిగాయి. మహాభారతంలోని శిఖండి కథ అందరికి తెలిసిందే.

పురాణకాలంలో ఆశ్వనీ దేవతలను ప్రముఖ వైద్యులుగా పేర్కొనేవారు. నిశ్చలుడు, అనే వీరుడు యుద్ధంలో కాలు కోల్పోతే ఇనుముతో చేసిన కాలును అమర్చి తిరిగి యుద్ధంలో పాల్గొనేలా చేశారు. ద్రావకాలను వుపయోగించి మృతదేహాలు పాడవకుండా కాపాడే పద్ధతి వర్తమానంలోనే కాదు పురాణకాలంలో కూడా వుంది. ఇందుకు నిదర్శనం రామాణమే. దశరథమహారాజు చనిపోయినప్పుడు అయోధ్యలో ఎవరూ లేరు. సీతా, రామ, లక్ష్మణులు అడవులకెళ్లి పోయారు. భరత, శతృఘ్నులు తాతగారింట కేకేయ దేశంలో వున్నారు. కేకేయ దేశం అయోధ్యకు చాలా దూరంలో వుంది. అక్కడికి వెళ్లి వాళ్లను తీసుకురావటానికి పది రోజులు పడుతుంది. ఆ పదిరోజులు దశరథమహారాజు శవం పాడవకుండా వుండటానికి తైలద్రావణంలో నిల్వవుంచారు. వేదకాలపు మహార్షయిన చెరకుడు ఆయుర్వేద వైద్య శిఖామణి. ఆయన రాసిన చరకసంహిత ఆయుర్వేద గ్రంథం గురించి అందరికి తెలిసిందే. అందులో విరిగిన కాలును తిరిగి ఎలా అతికించాలో చాలా స్పష్టంగా వివరించబడింది. గ్రుడ్డితనం, మూర్ఛ, క్షయ, మొదలగు వ్యాధులతో పాటు గుండె జబ్బులను తగ్గించే మార్గాలు కూడా ఆ గ్రంథంలో వున్నాయి.

పురాణకాలంలో శస్త్ర చికిత్సా విధానాలకు మూలపురుషుడు ‘శుశ్రుతుడు’. తలవెంట్రుకను నిలువునా వంద ముక్కలుగా చీల్చగల పరికరాలను కూడా ఆయన తయారుచేశాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మెదడుకు శస్త్రచికిత్స చేసిన వైద్యుడు ‘జీవకుడు’. ఇతడు బుద్ధుడి సమకాలికుడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో అభ్యసించాడు. నేలమీదున్న ప్రతి మొక్క ఏ వైద్యానికి పనికివస్తుందో విపులంగా వివరించిన వైద్యశికామణి ఈయన. శరీర ఆరోగ్యాన్ని కాపాడగల ఏకాగ్రత, నియమ, నిష్టలతో కూడిన యోగాసనాలను రూపొంచిన వాడు పతంజలి. ఆయన సిద్ధాంతం ప్రకారం మానవ శరీరంలో కీలకమైన నాడీ స్థానాలతో పాటు, ప్రధానమైన నాడీ స్థానాలున్నాయి. ఈ స్థానాలను ప్రేరేపించటం ద్వారా మన శరీరంలోని అంతర్గత శక్తి మేలుకుంటుందని, దానివలన ఆయురారోగ్యాలను పెంచుకోవచ్చునని బోధించాడు. ఈ ఆధునిక కాలంలో రాబొట్లను వుపయోగించటం చాలా సర్వసాధారణమై పోయింది. పురాణకాలంలో కూడా రాబొట్లను పనుల కోసం వుయోగించిన సంఘటనలు చాలా వున్నాయి. 11వ శతాబ్దంలో భారతదేశంలో మర మనుషుల వాడకం గురించి చాలా చారిత్రిక ఆధారాలున్నాయి. పారమార వంశస్థుడైన భోజరాజు రాసిన ‘సమరాంగణ సూత్రధార’ అన్న గ్రంథంలో మరమనుషులకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి.

ఇలా పురాణాలలోని శాస్త్ర విజ్ఞానం అనంతమైనది, అద్భుతమైనది, అశేషమైనది. అంతేకాదు కొలవటానికి సాధ్యంకాని అపురూపమైన విశేషాల గని అది. అందులోని శతకోటి సూక్ష్మపరిమాణాన్ని వివరించటానికే మనిషి జీవితకాలం సరిపోదు. విదేశీ మేథావులు సైతం అబ్బురపడి కీర్తించిన విశేషాలు మన పురాణాల్లో ఎన్నో వున్నాయి. ఈ విశిష్ట సమాచారాన్ని భద్రపరచి ముందుతరాలవారికి కానుకగా అందించవలసిన బాధ్యత భారతీయులందరి మీద వుందని మనవి చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here