ఒక కళానది ప్రస్థానం

0
10

[dropcap]శీ[/dropcap]లా వీర్రాజు గారికి నివాళి నర్పిస్తూ, నారాయణగూడా తాజ్‍మహల్ హోటల్‍లో సభ జరిగింది. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు హాజరైనారు. వీర్రాజు గారి శ్రీమతి శీలా సుభద్రాదేవి గారి సంపాదకత్వంలో ‘నది ప్రయాణం’ అన్న వారి స్మారక వ్యాస సంకలనం, డా. కాలెపు గణేశ్ రామ్ గారు అనువదించిన శీలా వీర్రాజు గారి ‘మైనా’ నవల హిందీ వెర్షన్ ఆవిష్కరణ జరిగింది.

‘నదీ ప్రయాణం’ అనకుండా ‘నది ప్రయాణం’ అని సంకలనానికి పేరు పెట్టడంలో ఎంతో నామౌచిత్యం ఉంది. ‘నదీ ప్రయాణం’ అంటే నదిలో ప్రయాణం. ‘నది ప్రయాణం’ అంటే నది యొక్క, నది చేసిన ప్రయాణం. ఆ నది జీవనది. సాహిత్య చిత్రలేఖనాలు దాని తీరాలు. ఆ నది పేరే ‘శీలావీ’.

ఇందులో 54 వ్యాసాలున్నాయి. వాటిని రాసిన రచయితలందరూ వీర్రాజు గారితో తమకున్న అనుబంధాన్నే ఎక్కువగా తలచుకున్నారు. అంటే ఆయన అందరితో ఎంత సన్నిహితంగా మెలిగేవారో తేటతెల్లమవుతుంది. రచయిత్రల్లో ఎంతో లబ్ధప్రతిష్ఠులున్నారు. ఆయనను ‘మాట్లాడకుండానే మాట్లాడే మౌనం’గా అభివర్ణించారు నందినీ సిద్ధారెడ్డి. ‘నా అక్షర ప్రాంగణమే నా చిర్నామా’ అన్న వీర్రాజు గారి కవితా పంక్తులను గుర్తుకుతెచ్చుకున్నారు జయసూర్య. ‘కవిసంధ్య’ సంపాదకీయం ‘ప్రయోగశీలి శీలావీ’లో గవర్నమెంటు ఉద్యోగం, కళాకారుడి ఉద్యోగాలలో రెండవదాన్ని ఎంచుకున్న ‘వెర్రిబాగులవాడు’గా ఆయన్ను అభివర్ణించారు. ఆ మాటకొస్తే రాతలవాళ్ళూ, గీతలవాళ్ళూ వెర్రిబాగులవాళ్ళే. ఎన్.టి.ఆర్. గారి ఉపన్యాసాలు రాసిన ఆయన ప్రతిభకు ముగ్ధుడై, రామారావు గారు మీకేం కావాలో చెప్పండని అడిగితే, నన్ను ఈ డ్యూటీ నుండి రిలీవ్ చేయమన్నారని, పొత్తూరు సుబ్బారావు గారు రాశారు, తమ వ్యాసం ‘అరుదైన వ్యక్తిత్వం’లో.

ఇక సత్యకాశీ భార్గవ ఫేస్‍బుక్ కవిత ‘మా మావయ్యకు అసలేమీ చేతకాదు’ మనకు ఆయన బోళాతనాన్ని, బ్రతుక’నేర్వని’తనాన్ని, ‘పేరును వాడుకోవడం’ కాని, ఇజాలను పూటకొకటి చొప్పున హత్తుకోవడం గాని, అసూయ గాని, చిన్నచూపు గాని, స్వోత్కర్ష గాని ఏమీ చేతగాదని తేల్చేస్తుంది. ‘నిందాస్తుతి’తో బాటు విరోధాభాసాన్ని మనసుకు హత్తుకునేలా రాశారీ కవి.

వీర్రాజు గారి చిత్రకళా ప్రదర్శనల గురించి చక్కగా వివరించారు ఎ. రజాహుస్సేన్. ఆయనను ఒక నిత్య ప్రయోగశీలిగా, ఒక పరిపూర్ణ కళాకారుడిగా వర్ణించారు. కొత్తపల్లి రవిబాబు ప్రజాసాహితి స్మారక సంచికలో ‘ఆరు వచన కావ్యాలు’ రాసి కుందుర్తి కళను సాకారం చేశారని కొనియాడారు. పాపికొండల చిత్రాలను దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీకి తమ సొంత ఖర్చులతో చేర్చి, తమ గురువు వరదా వెంకటరత్నం గారికి గురుదక్షిణ ఇచ్చారన్నారు.

‘పిట్టపిల్లంత మనిషి, కాని మగ్గం మీద ఎన్నో గజాలు నేసిన కలనేత వస్త్రం లాంటి వాడని; అందులో ప్రేమ, స్నేహం, ఆత్మీయ స్పర్శ, మృదువైన, దృఢమైన మాట ఇలా ఎన్నో పొరలున్నాయ’ని వరవరరావు ప్రశంసించారు. వాడ్రేవు చినవీరభద్రుడు – ఆ కాలంలోని ప్రింటింగ్ సాంకేతికతను ప్రస్తావిస్తూ ‘తన చేతిరాతలోనే రాసుకున్న ప్రతి కవితని ఒక బ్లాకుగా చెక్కించి, ఆ బ్లాకుల్ని ముద్రించి పుస్తకం వేసుకున్నార’ని తెలిపి మనల్ని ఆశ్చర్యానికి లోను చేశారు. వంశీకృష్ణ – బుచ్చిబాబు గారి ‘చివరికి మిగిలేది’, వీర్రాజు గారి ‘మైనా’ నవలను తులనాత్మక పరిశీలన చేశారు. రెండూ రెండూ కేంద్రీకృత బిందువుల మధ్య సాగే ప్రయాణాలన్నారు. తెలుగులో వచ్చిన అత్యుత్తమమైన పది నవలల పేర్లు చెప్పమంటే వాటిల్లో ‘మైనా’ కూడా ఉంటుందని ఆయన రాయడం ‘స్వభావోక్తే’ గాని అతిశయోక్తి కాదు.

జేమ్స్ జాయిస్ రాసిన ‘A Portrait of the Artist as a Young Man’ (1916) నవలలోని హీరో స్టీపెన్ డెడలస్‍కు శీలా వీర్రాజు గారికి ఎంతో సామ్యం ఉంది. ఆయన లాగే ఈయన కూడా established conventions ను ప్రశ్నిస్తారు. జాయిస్ నవల third person narrative లో ఉండి, free indirect speech ను విరివిగా ఉపయోగిస్తుంది. కొటేషన్ మార్కులు ఉండవు.

‘స్వాతి’ వారపత్రిక అనే పసికూనని 1970 నుండి సంరక్షికుంటూ, 53 సంవత్సరాల పూర్ణత్వాన్ని సంతరించుకునేలా చేసిన సంపాదక స్ఫూర్తి శీలవీ గారని వేమూరి బలరామ్ గారు నివాళులర్పించారు. ‘గోదావరిని దేశమంతా అద్దిన ఆర్ద్రమూర్తి మీర’ని ఎన్. గోపి గారు ఆయనకు కవితా నీరాజనమిచ్చారు.

చిత్రకారునిగా, కవిగా, రచయితగా ద్విముఖ ప్రజ్ఞ చూపినవారు అడవి బాపిరాజు గారు. వారి తర్వాత వీర్రాజు గారు. ఆంధ్రప్రభ దినపత్రిక ‘సాహితీ గవాక్షం’ కోసం సంపాదకులు శ్రీ వై.యస్.ఆర్. శర్మ గారు ఈ సమీక్షకునితో శీలావీ గారికి నివాళిగా ఒక వ్యాసం రాయించుకున్నారు. వారిని ‘రాతలకూ గీతలకూ సమతూకపు తరాజు’గా శీర్షికలోనే జోతలర్పించాను. సృజనశీలురకు మరణాలుండవని మనవి చేశాను. ‘బాధ పడాలి, నలగాలి, జీవిత రధ చక్రాల క్రింద, కలంలోంచి నెత్తురు ఒలకాలంటే’ అన్న చలం గారి మాటలు వీర్రాజు గారి కవిత్వానికి వర్తిస్తాయని రాశాను. ‘శీలావీ కవిత్వమంతా సామాజిక వేదనే’ అన్న విహారి గారి మాటలను ఉదహరించాను. ‘Man is a bundle of inevitable weaknesses’ అన్న Goethez సిద్ధాంతాన్ని ఆయన కథలు అక్షరీకరిస్తాయి. ఆయన చిత్రకారుడు కావటం వల్ల, ఆయన వర్ణనల్లో మనకు ఎన్నో అపురూపమైన పదచిత్రాలు (word pictures) కనువిందు చేస్తాయి.

వీర్రాజు గారు అజాత శత్రువు. ఆయనను అభిమానించనివారు, ఇష్టపడనివారు ఎవరూ ఉండరు.

మందరపు హైమావతి గారి వ్యాసం వారి పదచిత్రాలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆమె ఉదహరించిన కవితా పంక్తులు మన ఎదలను కదిలిస్తాయి. ‘కాటుక కళ్ళ పెళ్ళికూతురి కన్నీటిలో కరిగిన కొత్త మాంగల్యపు నుసిముద్ద లాంటి చీకటి’.

భర్తృహరి మహాశయులు చెప్పినట్టు,

‘జయంతి తే సుకృతి రససిధ్ధాః కవీశ్వరాః

నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం’

సుకృతులు, రససిద్ధులైన కవీశ్వరులు శీలా వీర్రాజు గారు. వారి కీర్తి శరీరానికి మరణం లేదు. వారు perennial గా సాగే నది!

***

నది ప్రయాణం
సంపాదకత్వం: శీలా సుభద్రాదేవి
పుటలు: 178
వెల: అమూల్యం
ప్రతులకు:
శీలా సుభద్రాదేవి
217, నారాయణాద్రి, ఎస్.వి.ఆర్.ఎస్. బృందావం,
సరూర్ నగర్,
హైదరాబాద్ 500035
81068 83099

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here