ప్రజాదృక్పథమే వూపిరిగా…

0
8

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత డా. శాంతి నారాయణ గారి ‘నాగలకట్ట సుద్దులు – 2’ పుస్తకానికి ఎ. కె. ప్రభాకర్ గారు వ్రాసిన ముందుమాట ఇది. [/box]

[dropcap]ప[/dropcap]త్రికల్లో వచ్చే ‘కాలిక రచన’ (column) లకు కొన్ని ప్రత్యేకతలు వుంటాయి. అవి రాజకీయ సామాజిక పరిస్థితులపై తక్షణ వ్యాఖ్యానాలైనప్పుడు వాటికి కాల పరిమితులు యేర్పడతాయి. వాటిని ఆ యా రాజకీయ సామాజిక సందర్భాల నుంచి విడదీసి చూడలేం. నిర్దిష్ట స్థల కాలాల్లో వాటికి వున్న ప్రాసంగికతని అవి ఇతరత్రా కోల్పోవచ్చు. సాధారణంగా అవి సంతకి వచ్చిన పచ్చి చేపల్లాంటివి. తాజా కూరగాయల్లాంటివి. వాటిని frozen చేసి యెక్కడైనా యే కాలంలోనైనా వుపయోగించుకోడానికి అనువుగా మార్చగల శక్తి కొందరికే వుంటుంది.  ఆ కొందరిలో శాంతి నారాయణ వొకరు. ఆయన రచించిన ‘నాగలకట్ట సుద్దులు’ ఒక కాలానికి చెందిన రచనే అయినా దానిని ఆయన సార్వకాలీన రచనగా తీర్చిదిద్దాడు. ఆయన కేవలం కాలమిస్టు అయితే ఆ పని సాధించగలిగేవాడు కాదు. ఆయనలోని  కవీ కథకుడూ అందుకు తోడ్పడ్డారు. రచ్చబండ మీద చెప్పుకొనే సుద్దుల్ని ఆయన కథలుగా మలిచాడు. కొండొకచో వాటికి కవిత్వ పరిమళాన్ని సైతం అద్దుతాడు. ఏ రూపంలో తీర్చిదిద్దినా వాటికి తనదైన ప్రాపంచిక దృక్పథాన్ని  జోడిస్తాడు. ఆ దృక్పథమే యీ రాజకీయ వ్యాఖ్యకు ప్రాణం పోసింది.  కారణం : అది మంది మంచిని కోరేదీ, సామాన్యుడి సంక్షేమాన్ని ఆశించేదీ,  నలుగురికీ  మేలుచేసేదీ,  ప్రజాస్వామిక స్వభావంతో నిండినదీ. పీడితులవైపు నిలిచేదీ. అంతిమంగా  అది ప్రజాదృక్పథం. అందువల్లే యీ కథనాలు యెప్పుడో పదేహేనేళ్ళ కింద చెప్పినా యిప్పటికీ ప్రాసంగికంగానే వున్నాయి. పదికాలాలపాటు పరిమళించే యీ గుణమే నన్ను వాటికి దగ్గర చేర్చింది.

వార్త దినపత్రికలో ‘శాంతిసీమ’ పేరుతో వచ్చిన యీ రచనల్ని తర్వాత పుస్తకరూపంలో చూసినప్పుడు అవి నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. వాటిలోని భాషా భావ గాంభీర్యం వ్యంగ్యవైభవం అధిక్షేప చాతుర్యం తలకిందుల సామాజిక విలువలపట్ల అసహిష్ణుత అపసవ్య – కుత్సిత రాజకీయ దుర్నయాల పట్ల ప్రకటించిన ధర్మాగ్రహం  నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. మెదడు పొరల్లో నిక్షిప్తమై వున్న అప్పటి ఆలోచనలన్నీ యిప్పుడు నాగలకట్ట సుద్దులు రెండో భాగం చదువుతుంటే కళ్ళముందు మళ్ళీ వొకసారి అక్షరరూపంలో సాక్షాత్కరించినట్లనిపించింది.

రాయలసీమ ప్రాంతం  అనంతపురం జిల్లా సింగనమల మండలం బండమీదపల్లె గ్రామం నాగలకట్ట అనే రచ్చబండ మీద కూర్చొని ఆ వూరికి చెందిన నలుగురు మనుషులు తమ ప్రమేయం లేకుండానే తమజీవితాలపై ప్రభావం చూపే యేదో వొక  సామాజిక / రాజకీయ అంశం గురించి మాట్లాడుకునే మాటలు ఆ స్థల కాలాలకు మాత్రమే చెందినవి కావు. పక్కా లోకల్ విషయాల దగ్గర్నుంచీ మొత్తం రాష్ట్రానికి దేశానికి సంబంధించి తమను కల్లోలపరచే కలవరపెట్టే సమస్త విషయాల్నీ వాళ్ళు చర్చకు పెడతారు. ఆ చర్చ ఏకపక్షంగా సాగదు. ప్రతి వొక్కరికీ అభిప్రాయ వ్యక్తీకరణకు స్వేచ్చ వుంటుంది. వాళ్ళలో వొక్కొకరూ వొక్కో రాజకీయ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తారు. తమ వాదనని వినిపిస్తారు. యెక్కడా సౌమనస్యం కోల్పోరు. బావా మామా చిన్నాయన అన్నా తమ్మీ … వరసలతో పిల్చుకునే  సంబంధాలు తెగిపోవు. విద్వేషాలకు తావు లేకుండా కులభావనకు అతీతంగా రాజకీయాభిప్రాయాల్ని ప్రజాస్వామికంగానే కాదు అత్యంత మానవీయంగానూ ప్రకటించుకోవచ్చనే యెరుకతో గొప్ప సంయమనంతో చేసే రచ్చబండ సంభాషణ అసెంబ్లీ  పార్లమెంటరీ కాట్లాట రాజకీయాలకు పాఠాలు చెప్పేలా నడుస్తుంది.

‘నాగలకట్ట సుద్దులు’ మొదటి భాగంలోని రచనలు 2003 – 04 మధ్యకాలంలో తెలుగుదేశం పాలన చివరి దశలో వచ్చినవి – యీ రెండో భాగంలోని సుద్దులు  ఆ తర్వాత కాంగ్రెస్ పాలన తొలి రోజుల (జూన్ 2004- మే 2006) నాటివి. రైతు వ్యతిరేకిగా ప్రపంచబ్యాంక్ యేజెంట్ గా ముద్రపడ్డ చంద్రబాబు నుంచి అధికారం రాజశేఖర రెడ్డి ‘హస్త’గతమైంది. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యల్ని అర్థం చేసుకున్న కొత్త ప్రభుత  సీమ నీటి సమస్యలు కష్టాలు తీరుస్తుందని ప్రజలు నమ్మారు. ఎన్నికల్లో యెగరేసిన వాగ్దానపు కత్తులకి మొన దగ్గర కన్న పిడి దగ్గర వాడి యెక్కువ అని ప్రజలు నెమ్మదిగా  గ్రహిస్తున్న కాలం.

పాలకులంతా వొక తాను ముక్కలే. పార్టీ ఏదైనా ప్రజల వెతలు తీరవు. పేదవాడి కష్టాలు అంతరించవు. అవినీతి అకస్మాత్తుగా అదృశ్యమై పోదు. అవే విధానాలు కొనసాగుతాయి. కాకుంటే పాత పాలకుల  అవినీతి పుట్టల్ని కొత్త పాలకులు తవ్వుతారు. ఒక్కోసారి ఆ పుట్టల్లో స్వకీయ సర్పాలు బయటపడి బుసకొడితే  తవ్వకం ఆపేస్తారు. అంతా రాజకీయ విష వలయం. బలయ్యేది ప్రజలు. లాభ పడేది సంపన్నులు. పాలక వర్గ ప్రయోజనాల కేంద్రంగానే పార్లమెంటరీ రాజకీయాలు నడుస్తాయి. వారి  అభివృద్ధి పథకాలన్నీ కాంట్రాక్టర్ల బాగు కోసమే వుద్దేశించి నడుస్తాయి. చాటు మాటు  దొంగ భాగోతాల తీరు మారదు.  కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన ప్రభుత్వ భూములు ఆశ్రితులకు బఠానీలతోనో పల్లీలతోనో మారకమై పోతాయి. అంతా దళారీ వ్యవహారం.  క్విడ్ ప్రో కో లావాదేవీలు.

ఈ దురాగతాన్నంతటినీ నిష్పక్షపాతంగా విమర్శకు పెట్టడానికి పూనుకున్న రచయిత  ప్రతి మాటా ప్రతి వాక్యం యెంతో జాగరూకతతో రాయాల్సి వుంటుంది. తనదైన దృక్పథాన్ని ఆవిష్కరించడానికి తడబడకూడదు. రాజీ పడకూడదు. దాగుడుమూతలాడకూడదు. నేలవిడిచి సాము చేయరాదు. సత్యం బ్రూయాత్, హితం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, ప్రియమపి అసత్యం న బ్రూయాత్ … అనే ధర్మాన్ని వొక నిష్టగా ఆచరిస్తూ  భావ ప్రకటన స్వేచ్చ అనే  రెండంచుల కత్తిమీద నృత్యం చేసి యీ కాలమ్ ద్వారా అటు జర్నలిస్టుల్లోనూ యిటు రచయితల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొంది అవుననిపించుకున్నారు శాంతినారాయణ.

***

ఈ పుస్తకం లోని ప్రతి శీర్షికా వొక సామాజిక పాఠం. వొక జీవితానుభవ సారం. వొక రాజకీయ ధర్మాగ్రహ ప్రకటన.  సైద్ధాంతిక పరిణతి, సమ్యగ్ దృష్టి, నిశిత పరిశీలన, లోతైన విశ్లేషణ, సదవగాహన, సంయమనం, సమతౌల్యం వాటిలో దర్శనమిస్తాయి. కళ్ళముందు జరుగుతోన్న అన్యాయాలపట్ల తీవ్రాతితీవ్రమైన  క్రోధం, దు:ఖితులపట్ల ఆర్తి – సహానుభూతి వ్యక్తమౌతాయి. కొన్ని సందర్భాల్లో అగమ్యగోచరమైన భవిష్యత్తు పట్ల నిస్సహాయతతో కూడిన  అసహనం వినిపించినప్పటికీ  నూటికి నూరుపాళ్ళూ సామాన్యుడి గొంతే  ప్రతి రచనలోనూ పలుకుతుంది. అయితే ఆర్.కె. నారాయణ్ పొలిటికల్ కార్టూన్ లోని కామన్ మేన్ లా యీ రచయిత జరిగే మంచికీ చెడుకీ తాటస్థ్యం పాటించే మౌనసాక్షిగా వుండిపోడు. తనవైన నిక్కచ్చి అభిప్రాయాల్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పడానికి యెక్కడా వెనకాడలేదు. నిప్పుల మీద నడవడానికి యెన్నడూ సంకోచించలేదు. నిజాయితీ  నిర్భీతీ నిబద్ధతా నిష్పక్షపాతం ప్రత్యక్షరంలోనూ గోచరమౌతాయి. పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా తప్పుచేసినవాడినల్లా  గల్లా పట్టుకు నిలదీసే దమ్మున్న వాక్యం యీ రచనలకు బలాన్నిచ్చింది. అది పాఠకుల ఆలోచనలకు పదునుపెట్టి వారి  చైతన్య పరిధిని విస్తరింపజేస్తుంది. మహాకవి వేమన పద్యానికున్నంత శక్తి రచయిత శాంతినారాయణ వచనానికి  వుంది.

పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల గురించి పాలనా వ్యవహారాల్లో చోటుచేసుకొంటున్న అవకతవకల గురించి  వ్యవస్థల్లోని  లొసుగుల గురించి అధికార యంత్రాంగంలో పాతుకుపోయిన అవినీతి అలసత్వం వంటి  సమస్త అవలక్షణాల గురించి కొమ్మోడు ( తెలుగుదేశం పార్టీ), ఓబులేసు (కాంగ్రేసు పార్టీ), గంపన్న, మల్లన్న పాత్రల ముఖత: రచయిత చేసే చర్చలు సూత్రీకరణలు మూల్యాంకనాలు నిర్ధారణలు చాలా నిర్మాణాత్మకంగా కనిపిస్తాయి. అప్పుడు నాగలకట్ట వొక ప్రజా కోర్టులా వ్యవహరిస్తుంది, రచయిత న్యాయమూర్తిలా గోచరిస్తాడు. రాజకీయ సామాజిక ఆర్ధిక నేరస్తుల్ని నిలదీస్తాడు. పార్లమెంటరీ రాజకీయాల్లోని డొల్లతనాన్ని యెండగడతాడు. రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే కుట్రల్ని బహిర్గతం చేస్తాడు. ప్రజా సంక్షేమానికి కీడు చేసే వ్యక్తుల్నీ వ్యవస్థల్నీ దేన్నీ విడిచిపెట్టలేదు. నిర్ద్వంద్వంగా ఖండించాడు. చివరికి న్యాయ వ్యవస్థలోని దిగజారుడు తనాన్ని విమర్శించడానికి వెనకాడలేదు.

తెలుగు నేల మీద నడిచే రాజకీయాల గురించి స్థూలంగా మాట్లాడినప్పటికీ  రాయలసీమ నిర్దిష్టత యీ కథనాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందునా సీమను పట్టి పీడించే నీటి రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. కోస్తా ఆధిపత్య రాజకీయాలు, రాయలసీమ లోపలి ముఠా తత్వ శక్తుల స్వార్థ పూరిత కుతంత్రాలు  జమిలిగా సీమకు చేసిన అన్యాయాన్ని ప్రస్తావించినప్పుడల్లా శాంతినారాయణ గొంతు దు:ఖంతో  పూడుకుపోవడం గమనిస్తాం. రతనాలసీమ యెడారిగా మారి సామాన్యుల బతుకులు యెదారి  పోతున్న తీరుని చిత్రించడంలో యెంతో ఆవేదననీ  గుండెతడినీ చూడగలం.

‘యాడ జూసినా నెర్రెలు చీలిండే సెరువులూ, నీల్లు పారిన పలకవే లేని వంకలూ, బట్ట తలకాయల్లెక్కనుండే బోడి కొండలూ, యా పల్లెలో జూసినా డొక్కలు యాలాడేసుకొని కటికంగల్లకు పోతా ఉండే పసులూ, దినామూ యెసిట్లేకి పిడికెడు బియ్యపు గింజల కోసరం కన్నగసాట్లు పడే జెనమూ, నెత్తి మింద కుండాసట్టీ పెట్టుకోని వలసెల్లిపోతా ఉండే పల్లెలూ, ఇదంతా యేమీ పట్టనట్ల పెరిగిపోతా ఉండే టవున్లూ, పెత్తనం కోసరం వొగర్నొగరు సంపుకోడమూ – ఇంతదప్పా ఇంగా యేముందప్పా ఈడ?’  

ఇటువంటి కఠోర జీవన వాస్తవిక చిత్రణ ‘శాంతిసీమ’ను ఫీచర్ స్థాయి నుంచి సృజనాత్మక కథన స్థాయికి వున్నతీకరించడానికి దోహదం చేసింది. అదే యీ రచనల బలం. రచ్చబండ సంభాషణకి వుద్వేగాలతో పాటు రాజకీయ తాత్త్వికతని జోడించి గొప్ప కళావిలువని సాధించడంతో ప్రతి శీర్షికా వొక యేకాంకికలా సజీవ దృశ్యంలా  రూపొందింది. ఈ మాటలు చూడండి:

‘యాడయినా పగతో పగ తీరిపొయ్యిందా? పగతో పగ తీర్సుకోవడం యిగ్నానవంతులు  చేసే పనేనా? పనీ పాటా లేని పేదోల్లకు అవీ ఇవీ యెరజూపి తమ పెద్దరికం కోసరం, అధికారం కోసరం రాజకీయ నాయికులు అమాయికుల్ని బలిజేయడం యింగా యెన్నాల్లన్నా?

హత్యల ద్వారా అధికారాన్నీ  ఆధిపత్యాన్నీ కాపాడుకోవాలని, శవాల మీదగానే  గద్దెనెక్కాలని ప్రయత్నించే సీమ ఫ్యాక్షనిస్టుల రాజకీయాల గురించి  ప్రశ్నిస్తూనే హింస మూలాల్ని తాత్వికంగా అన్వేషిస్తాడు. భూస్వామ్య పెత్తందారీ కుటుంబాల మధ్య జరిగే ఆధిపత్యాల పోరులో చంపుతున్నదీ చస్తున్నదీ బతుకుదెరువు లేని కరువు పీడితులైన అమాయకులే అని ఖేదపడతాడు. రాయలసీమ అందునా అనంతపురం కక్షల సీమగా పేరు మోయడానికి కారణం అక్కడి ప్రజల మధ్య వున్న కక్షలు కాదనీ నొక్కిచెబుతాడు.

చర్చలు రాయలసీమ కేంద్రంగా సాగినప్పుడు కూడా అనంతపురం ప్రత్యేక సమస్యలు ఆయనకు తెలీకుండానే ప్రాథమ్యం వహిస్తాయి. హంద్రీ నీవా పూర్తిచేసి అనంతపురాన్ని సుభిక్షం చేస్తామని వాగ్దానాలు గుప్పించి అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీల మోసపూరిత విధానాలని సందర్భం వచ్చినప్పుడల్లా  (కాంగ్రేసు – తెలుగుదేశం ‘దొందూ దొందే’ అని) కడిగేస్తూనే వుంటాడు. వేల కోట్ల రూపాయల కాలువ పనుల గురించి మొదలుకాని ప్రాజెక్టుల గురించి పూటకో మాట మాట్లాడుతూ అరగజం పురోగతి చూపలేని గజయీతగాళ్ళని యేకిపెడతాడు. పాతకాలంనాటి వందలాది  చెరువులు నిండితే బక్క రైతుల బతుకులు బాగుపడతాయని గుబులుపడతాడు. వరస కరువుల్ని జయించవచ్చని ఆశపడతాడు. వ్యవసాయం సరే;  పోనీ అక్కడి వనరుల లభ్యతని దృష్టిలో వుంచుకొని రూపొందించుకోవాల్సిన పారిశ్రామిక విధానాల పట్ల సైతం యే పార్టీకీ దూరదృష్టి లేదు. చిత్తశుద్ధి లేదు.

‘మన గడ్డ అన్నెందాలా అదవ జిక్కిందేమో! తరతరాల్నుంచి కాలావతన వాన్లు బడక యెవసాయమంతా వొగ పక్క గబ్బులేసిపాయ. యింగో పక్కేమో మొన్నటిదాకా బీదా బిక్కికి రోంత ఆదరువుగా వుండే సన్నా పెద్ద ప్యాక్ట్రీలూ మిల్లులన్నీ యెత్తిపాయ. యెటూ ఎవసాయం దెబ్బతినింది. జెనానికి రోంత పని కల్పిత్తామని గవుర్మెంటుతో కొట్లాడి యేంటివైనా రొండు ప్యాక్ట్రీలు పెట్టేతట్ల సూత్తామనే గ్నానం మన రాజకీయ నాయకులకు ల్యాకపాయ. కొత్తవి వొద్దులే, వుండేదాండ్లనన్నా కాపాడుకుందామనే బుద్ది ల్యాకపాయ.  యీల్ల శాతగాని తనం వల్ల అనంతపురంలో బలుపుల ప్యాక్ట్రీ, ఆ గుంతకల్లులో నూలుమిల్లూ , యిందూపురంలో సక్కిరి ప్యాక్ట్రీ యింగా యాడుండే ప్యాక్ట్రీలన్నీ నున్నగా పాడుబడిపాయ.  ఆ కర్నూలూ కడపా సిత్తూరు జిల్లాలను జూసినంకయినా మన నాయకులకు సిగ్గురాకపాయ.’

 మన పిచ్చి గానీ , పాలకుల ప్రాథమ్యాలు వేరు. ప్రభుత్వ రంగంలో వున్న పరిశ్రమల్ని దివాలా తీయించి యంత్ర పరికరాల్ని స్క్రాప్ గా అమ్మేయడం. ఆ భూముల్ని కారు చౌకకి ఆశ్రితులకు కట్టబెట్టడం. పారిశ్రామిక అభివృద్ధి అంటే సెజ్ లు కట్టడడమే. వందలాది ఎకరాల భూములు  ప్రైవేటు వ్యక్తుల పరం చేయడమే. చెడ్డీ లంగాల సెజ్ మీద లోపలి పేజీల్లో వున్న వ్యంగ్య రచన చూస్తే కోపం వస్తుంది – విషాదం కమ్ముకుంటుంది తప్ప  నవ్వురాదు.

సమకాలీన రాజకీయాల పట్ల శాంతినారాయణది నికార్సైన పీడిత ప్రజాదృక్పథం, రాజీ యెరుగని పోరాటం అని చెప్పుకున్నాం. అయితే వాటిని ఆయన పైపైన తడిమి వదలడు. సమస్యకున్న భిన్న కోణాల్ని లోతుగా అధ్యయనం చేస్తాడు. ఆలోచనలు క్రియాశీలంగా మారాలని తపనపడతాడు. విద్యని వ్యాపారం చేసే కార్పోరేట్ గంజాయి వనాన్ని వేళ్ళతో సహా పెరికివేయాలని పిలుపునిస్తాడు. గుండె జబ్బున్న పసిపిల్లోల్ల బతుకుల్తో శెవాల్తో రాజకీయం చేయడాన్ని తీవ్రంగా గర్హిస్తాడు. ప్రజల వెతలు పట్టించుకోని ‘గవుర్నమెంట్ల మిందా క్యాకరిచ్చి ముయ్యల్ల అని ముక్కుమింద గుద్ది మరీ కార్యాచరణ నిర్దేశిస్తాడు. అధికారంలో వున్నప్పుడు వొక మాట పదవి కోల్పోయాకా మరోమాట చెప్పి పబ్బం గడుపుకునే క్షుద్ర రాజకీయాల్ని ద్వంద్వనీతిని యెండగట్టాడు. ‘దొంగలూ దొంగలూ యాకమై జెనం సొమ్ము మిక్కర బెడతా, పైకేమో బయికారి ఏడుపులు యేడ్చే’ కౌటిల్యాన్ని నిరసించాడు. ‘వున్నోల్లంతా అదికారం కోసరం యిగ్గులాడతా వుంటే మద్దెలో సన్నాబన్నోల్లు బలైపోతాండారు’ అని దిగులుచెందుతాడు.  భూస్వామ్య సాయుధ ముఠాల హింసని నిర్భయంగా ఖండిస్తూనే, సమాజానికి చెందిన అన్ని పార్శ్వాల్లోనూ న్యాయం సమత్వం మానవీయత వెల్లివిరియాలని ఆయన ప్రత్యక్షరంలోనూ కోరుకున్నాడు.

***

సాహిత్య రచనని సామాజిక ఆచరణగా స్వీకరించిన శాంతినారాయణ రచ్చబండ మీద పాత్రల ముఖత: లేవనెత్తిన సవాలక్ష ప్రశ్నలకు పాలకుల నుండి జవాబులు డిమాండ్ చేస్తున్నాడు. పాఠకుల్లో కొత్త స్ఫూర్తి నింపుతున్నాడు. ప్రశ్నించే తత్త్వాన్ని పెంచుతున్నాడు. నిరసన తెలిపే ధైర్యాన్ని కోల్పోకూడదని వుద్బోధిస్తున్నాడు. ప్రజల్లో వొక ప్రెజర్ గ్రూప్ వుంటేనే ప్రజాస్వామ్యం మనగల్గుతుందని హెచ్చరిస్తున్నాడు. ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యాన్ని ప్రశ్నించలేని ప్రజల చేతకాని తనాన్ని, పట్టని తనాన్ని చీదరించుకుంటున్నాడు. సమాజంలోని సమస్త పార్శ్వాలలో సున్నితత్వాన్ని కోల్పోవడం చూసి బెంగటిల్లుతున్నాడు. అయితే అదే సందర్భంలో ఐక్య పోరాటాలు చేయాల్సిన పీడిత  ప్రజల మధ్య ప్రబలుతున్న వైషమ్యాల్ని చూసి  వాపోతున్నాడు.

పుట్టినప్పట్నుంచీ గుంతలేకి పోయ్యేదంకా ఆడిదంటే సన్నసూపే … పతొక్క మొగోనికీ అదవ జిక్కిండేది యెవురంటే ఆడిదే’ అని స్త్రీల అభద్ర జీవితాల గురించి ‘యాష్టపడ్డ’ సందర్భాల్లో రచయితగా శాంతినారాయణ స్వరం బాధితుల పక్షమే అని రుజువౌతుంది. పెళ్ళికి ముందు లైంగిక స్వేచ్చ గురించి సినీ నటి ఖుష్బూ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఆయన నికార్సయిన స్త్రీవాదిగానే దర్శనమిస్తాడు. అయితే ఆ ముచ్చట్లు రచ్చబండ మీద కాకుండా యింటి పంచలో  స్త్రీల నోట పలికించడం ద్వారా గొప్ప సాహితీ ఔచిత్యాన్ని సైతం పాటించాడు.

కంచి మఠం లో హత్యలు జరిగినప్పుడు, పుష్కరాలకు వందలకోట్లు ఖర్చుపెట్టి ప్రజలు సంపాదించుకునే పుణ్యానికి గవర్నమెంటే పూచీ పడినప్పుడు, పెద్దనామాల సన్న జియ్యరు వెయ్యికాళ్ల మండపం గొడవ రేపినప్పుడు, గణేశ నిమజ్జనాలకు రాజ్యమూ  మతమూ యేకమై హడావిడి చేసే సందర్భంలో  హేతుదృష్టితో చేసిన ప్రతిపాదనలు,  ‘శ్రెమే దేవుడన్న నమ్మకాన్ని జెనంలో కలిగిత్తే తప్పా ఈ దేశం బాగుపడదు’ అని చెప్పిన ముక్తాయింపు మాటలు ఆయనలోని లౌకిక ప్రజాస్వామిక భౌతికవాద దృక్పథానికి తార్కాణంగా నిలుస్తాయి. అందుకే అధికారం కోసం మత విద్వేషం రేపి  దేశాన్ని వెయ్యేళ్ళు వెనక్కి నడపాలనుకునే హిందూత్వ శక్తులపట్ల అప్రమత్తంగా వుండాలని బుద్ధిగరపగలిగాడు. మతాన్ని రాజకీయాల్నుంచి వేరుచేయాల్సిన అవసరాన్ని పదేపదే గుర్తుచేయగలిగాడు.

తన దృష్టికి వచ్చిన చెడు పట్ల రచయితగా శాంతి నారాయణ యే మాత్రం వుదాసీనత చూపలేదు; దేన్నీ ఖండించకుండా వొదిలిపెట్టలేదు. పార్లమెంటులో ప్రశ్న అడగడానికి లంచం తీసుకున్నపెద్దమనుషుల అవినీతి భాగోతం దగ్గర్నుంచీ రాములోరి గుడి చుట్టూ  మసీదు చుట్టూ వోట్ల రాజకీయాలు నడిపే సంఘీయుల కుట్రల వరకూ ప్రతి అడ్డగోలు వ్యవహారాన్నీ యెటువంటి సంకోచం లేకుండా విమర్శకు పెట్టాడు.ఆ క్రమంలో రౌడీలకూ పోకిరీ యెదవలకూ రాజకీయ నాయకులకూ వొత్తాసు పలకడం తప్ప శాతగానోల్లకు సహకరించరనీ చట్టాన్ని కాపాడాల్సిన రక్షకులే భక్షకులౌతున్నారానీ  పోలీసోల్లని శపించాడు. ప్రేమించలేదన్న కక్షతో ఆడపిల్లల మీద కత్తులతోనో యాసిడ్ తోనో దాడులు చేసే మానవ మృగాల్ని చీల్చి చెండాడాడు. అటువంటి దుష్ట సంస్కృతికి కారణమయ్యే మూలాల్ని తాత్వికంగా విశ్లేషించాడు. బంజారా హిల్స్ దీపకాంతుల కింద ముసిరిన చీకటి బతుకుల గురించి ఆరాటపడ్డాడు. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ లేనోళ్ళు అందలం యెక్కుతున్నారని వోపలేని అక్కసుతో చేసే వాదనని  తార్కికంగా తిరస్కరించాడు.

‘మంగలోల్లు యీల్ల మాసిన గడ్డం గొరిగి సవరం జేత్తే , సాకలోల్లు మైల బట్టలుతికితే, మాలోల్లు మాదిగోల్లు యీల్ల గబ్బంతా కడిగితే, కుమ్మరోల్లూ కంసలోల్లూ వొగరేంది, మొత్తం ఆయగాల్లంతా యీల్లకు సేవ జేత్తే యీల్లూ మనుసుల మాదిరి తలకాయలెత్తుకోని ప్రెతిబంతా తమ సొత్తని యీ పొద్దు నీలుగుతా తమను మనుసులుగా చేసినోల్లను పశువుల కంటే నీశెంగా సూత్తాండారు. తరతరాల్నుంచీ వొంట్లోని సత్తవంతా పోగొట్టుకోని గుడకా అవమానాల్తో గాయపడినోల్లు యావల్లన నిమ్మలంగా వుంటారు? నిమ్మలంగా లేనప్పుడు యింగ వాల్ల తెలివి యెట్ల యిచ్చుకుంటది?’ 

ఇలా అగ్రకులాల సంపన్నులు అనుభవించే సదుపాయాలు సోకులు సౌకర్యాలు అన్నీ శ్రామిక కులాల కష్ట ఫలాలే అని తీర్మానిస్తాడు. నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అధికారం పదవులు సంపద అన్నీ పై కులాల చేతిలో కేంద్రీ కృతమై వుండగా తరతరాలుగా సామాజికంగా ఆర్థికంగా అణచివేతకి గురైన జాతులు యెలా యెదగగలరని మౌలికమైన ప్రశ్నసంధిస్తాడు. ఈ అసమ వ్యవస్థని అంతం చేయడానికి అవసరమైన – అనివార్యమైన రాజకీయ పోరాటాలకు మద్దతు కూడగడుతున్నాడు. అందుకు దళిత బహుజన మైనారిటీల ఐక్యత అవసరాన్ని గుర్తిస్తాడు. రాజ్యంతో నక్సలైట్ల చర్చలు చేసిన సందర్భంలో భూమి సమస్య గురించి స్వావలంబన గురించి బిసి దళిత కులాలపై దాడుల గురించి లేవనెత్తిన అనేక అంశాలు శాంతినారాయణ మూలాలు మార్క్సిజంలో వున్నప్పటికీ నెమ్మదిగా అంబేద్కరిస్టు  భావజాలంతో బహుజన రాజకీయాలవైపు మొగ్గుతున్నట్టు అనిపిస్తుంది.

***

నాగలకట్ట సుద్దుల్ని అన్ని ప్రాంతాల పాఠకులూ  ఆత్మీయంగా గుండెకు హత్తుకోడానికి కారణం అందులోని భాష అనడంలో యేమాత్రం సందేహం లేదు. తనకకెంతో యిష్టమైన అందమైన  రాయలసీమ మాండలికాన్ని తన తల్లిదండ్రులనుండి అందిపుచ్చుకున్నట్టు మొదటిభాగం  అంకితం పేజీలో శాంతినారాయణ స్వయంగా చెప్పుకున్నాడు. అది ఆయన రక్తగతమైన భాష. శ్వాస తీసుకున్నంత అతి సహజంగా ఆయన వాడిన భాషని ఫలానా ప్రాంతీయ మాండలికమనో  వర్గ మాండలికమనో భాషా శాస్త్రవేత్తల పరిభాషలోకి కుదించి  వ్యవహరించలేం. అది మట్టిపొరల్ని పెకలించుకు వచ్చిన ప్రాకృతిక భాష.  శిష్ట వాసనలు అంతగా  సోకని  బహుజన భాష. పల్లె పొత్తిళ్ళలో పుట్టిన శ్రమజీవుల భాష. ఉత్పత్తికులాలకు చెందిన  ప్రజల  సాంస్కృతిక  జీవితంలోంచి  వికసించిన హృదయ భాష. అచ్చమైన బతుకు బాస. ప్రజల సాంస్కృతిక భాషకు సాహిత్య భాషా గౌరవాన్ని సాధించిన రచయితల్లో ఆయన ముందువరసలో నిలిచివున్నాడు.

ఓరియంటల్ కళాశాలలో నేర్చిన సంప్రదాయ వాసనలు వదిలించుకోవడం కష్టమే. భాష విషయంలో కావొచ్చు భావజాలం విషయంలో కావొచ్చు చదువు తెచ్చిపెట్టిన సంకెళ్ళని శాంతినారాయణ ఛేదించాడు. అన్నిరకాల  కట్టుబాట్లు తెంచుకున్నాడు. ప్రాచీన సాహిత్య అధ్యయనం ద్వారా అబ్బే పాండిత్య స్ఫోరకమైన శైలికి లొంగిపోలేదు. తన మూలాలకు ఆయన దూరం కాలేదు. అమ్మవొడిలో చనుబాలతో నేర్చిన భాషలోని మాధుర్యాన్ని పెదవిపై చప్పరిస్తూనే వున్నాడు.   తల్లినుడిలోని జీవల్లక్షణమైన మౌఖికతని తన రచనల్లో ఆయన అద్భుతంగా  పలికిస్తున్నాడు.  యాసని వొడిసిపట్టుకుని కాగితంమీదికి వొంపుతున్నాడు. అందుకే తక్కిన సీమ రచయితల కన్నా విలక్షణమైన తనదైన  స్వరాన్ని వినిపించగలుగుతున్నాడు.

వుప్పోడూ పులిసేదే పొప్పోడూ పులిసేదేనా?

తాతాశార్లకూ పీర్లపండక్కీ ముడేత్తే యెట్లా?

యెదటోని బొంతలో బొక్కలు సూపడమే గానీ తమ బొంత సూసుకోవద్దా?

వూర్లో పెండ్లి జరుగుతావుంటే వూసినదాన్ని పట్టేకి కాదన్నెట్ల     … వంటి సాటవలు ,

అసెడ్డం, కువాడం, ముజిగుంబరం, పిత్తరం రేగడం, నలుసులెంచడం, సెటాయింపు పుట్టడం, నిగత తీరడం,  బయికారి యేడుపులు, వడ్లగింజలో బియ్యపు గింజ,  శెని సెప్పుతో కొడతా వుంటే, గోసిలో రాయి పడేతట్ల, పొప్పులుబెట్టి పోరుమాన్పినట్ల, మోసెయి వొంగితేనే ముంజేయి వొంగుతాది … వంటి లెక్కలేనన్ని సీమ పదబంధాలు జాతీయాలు నుడికారాలు  ఆయన మాటల్లో అలవోకగా జాలువారతాయి. అవి యీ సుద్దులకు సొంపు సోయగాల్నీ సౌష్టవాన్నీ  సౌకుమార్యాన్నీ సహజాతి సహజమైన సొబగునీ సాధించాయి. దు:ఖోద్విగ్నతనీ క్రోధావేశాన్నీ వ్యక్తం చేయడానికి అనువైన యీ భాషకు నేనైతే పూర్తిగా  ‘ఫిదా’ అయ్యాను.

***

‘యాబై యేండ్ల నుంచీ తమ బతుకులు ఆరిపోతావున్న్యా గొర్రెలు కసాయోల్లను నమ్మినట్ల నాయకుల్ని నమ్ముతావుండే ఈ జెనం కండ్లు తెరిసేదెన్నడు ? కోట్లు కోట్లు సంపాయిచ్చుకుండే దాంట్లో పోటీబడి పెత్తనం కోసరం వొగర్నొగరు సంపుకుంటా, అదంతా పెజాసేవే అని నాయికులు గొంతు సించుకుంటావుంటే యెవురే గానీ నోరెత్తకుండా కుక్కిన పేండ్ల మాదిరుంటే యెట్ల ?’  

ఈ రచనల్లో శాంతి నారాయణ వ్యక్తం చేసిన అభిప్రాయాలు యెంత స్థానికమో అంత విశాలం. అవి రాయలసీమకో తెలుగునేలకో పరిమితం కావు. తమ పదవుల్ని పదిలపరచుకోవడం కోసం ప్రజల్ని పావులుగా వుపయోగించుకోడానికి పాలకుల యెత్తుగడల పట్ల ఆయన మొత్తం సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నాడు. ప్రజా చైతన్యమొక్కటే దుష్ట రాజకీయాలకు చరమ గీతం పాడగలదని నిర్ధారిస్తున్నాడు.

మౌనం నేరమని ప్రబోధించే యీ రచనల్లో శాంతినారాయణది ఆగ్రహ స్వరమే కాదు. ధిక్కార స్వరం కూడా. ప్రశ్నించడమే దేశద్రోహంగా పరిగణించి భావప్రకటన స్వేచ్చనీ జీవించే హక్కుని సైతం కాలరాస్తున్న  ఫాసిస్టు మూకల యేలుబడిలో వొకానొక అమానవీయ సందర్భంలో యీ స్వరం అవసరం యెంతైనా వుంది. ఇప్పుడు వూరూరా మనం నిర్మించుకోవాల్సింది కండలు తిరిగిన హనుమంతుడి విగ్రహాలు కాదు. పౌరసమాజానికి బుద్ది బలాన్నీ గుండె బలాన్నీ పెంచే రచ్చబండ రాజకీయాల్ని పునర్నిర్మించుకోవాలి. రచ్చబండలు ప్రజాస్వామిక భావనలకు పాదులు కావాలి. ఆత్మగౌరవ స్వరాలకు పట్టుగొమ్మలు కావాలి. ప్రత్యామ్నాయ ఆలోచనలకు వేదికలు కావాలి. సమస్త ఆధిపత్యాలకూ అంతం పలకాలి. అందుకు నాగలకట్ట సుద్దులు దారిపరుస్తాయని నమ్ముతూ … రచయిత శాంతినారాయణని గుండెకు హత్తుకుంటూ … సెలవ్.

ఎ.కె. ప్రభాకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here