నగరంలో మరమానవి-13

2
9

[డా. మధు చిత్తర్వు రచించిన ‘నగరంలో మరమానవి 13’ అనే సైన్స్ ఫిక్షన్ కథని పాఠకులకి అందిస్తున్నాము.]

ముగింపు ఒక ప్రారంభం

[dropcap]ఒ[/dropcap]క్కక్షణం షాక్ అయ్యింది నైమిష.

నైమిష, పోలీస్ ఆఫీసర్ త్రినేత్ర ఇద్దరూ సైబర్ సెక్యూరిటీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు.

“సార్! కళాధర్ పంపిన మెసేజ్‌లు, ఆడియోలూ, వీడియో రికార్డింగులూ చూడండి. చాలా సీరియస్‌గా వుంది విషయం..‌., మనం వూహించలేనిది!”

నిద్ర మత్తు వదిలింది త్రినేత్రకి. “ఏదీ, ఏమిటీ, వినిపించు!”

కళాధర్ స్వరం వినిపిస్తోంది సంభాషణలో. “…అర్థం అయింది. వందల సంఖ్యలో డ్రోన్స్‌లో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం నింపి వాటిని నగరంలోని అధికారులకి పంపి వారి మెదడులో ఆ ప్రోగ్రాం నింపుతున్నారు. వారు వీళ్ళు చెప్పినట్లు చేస్తారు. రిమోట్ కంట్రోల్‌తో.”

త్రినేత్ర అన్నాడు “మై గాడ్! ఎలా! రిమోట్ కంట్రోల్… ఎలా…?”

“బహుశా శాటిలైట్స్, ఇంటర్‌నెట్ ద్వారా కావచ్చు. డ్రోన్స్ చాలా చిన్నవి, చిన్న చిన్న దోమల్లాంటివి, మిడతల్లాంటివీ టార్గెట్‌లకి వెళ్ళి కుట్టేటట్లు ప్రోగ్రాం చేయవచ్చు. ఇది ఒక కొత్త టెక్నాలజీ.” అంటూ గూగుల్ చూడసాగింది.

“ఇదిగో సార్, ఇక్కడ వుంది. డ్రోన్స్ ద్వారా సాప్ట్‌వేర్ ప్రోగ్రాం మనుష్యులలో శరీరాల్లోనూ, వారి మెదడులలోనూ నింపడం, ‘థియరెటికల్’గా‌, సాధ్యమే. డ్రోన్స్ సాఫ్ట్‌వేర్ తీసుకువెళ్తాయి. కాని అవి మెదడులలో శరీరాల్లో… ఎలా నింపుతాయి?”

“ఆగు!” బయటకి పరుగెత్తాడు త్రినేత్ర. ముందు, ఇదివరకే చూశాడు, కానీ పట్టించుకోలేదు..

ఆకాశంలో అక్కడక్కడా నల్లటి మిడతల దండులాంటినీడలు తిరుగుతున్నాయి.

“మై గాడ్! అవే!”

“ఇది ఎమర్జన్సీ. అందుకే కేబినెట్ అధికారులు అందరూ అంతా అలా ప్రవర్తించారు. ఎలాగో మనిద్దరం తప్పించుకున్నాం. మన అదృష్టం! నైమిషా, ఢిల్లీకి, లోకల్ ఎయిర్‌ఫోర్స్‌కి అర్జెంట్ కాల్స్ చేద్దాం. ఆ డ్రోన్స్‌ని మిసైల్స్‌తో నిర్మూలించాల్సిందే! డిఫెన్స్ మినిస్ట్రీ, రోబోటిక్ కంట్రోలర్ ఢిల్లీ వారి ఆఫీసులకి ఫోన్ చేద్దాం. మెసేజెస్ ఇద్దాం. త్వరగా మొబైల్, ల్యాప్‌టాప్స్ తీయి.”

తర్వాత ఆ పనులు వేగంగా జరిగిపోయాయి.

“మన మాటలు, నమ్మి ఏక్షన్ తీసుకునే వాళ్ళు కావాలి. బ్యూరోక్రాట్స్ మథ్యలో

ప్రొసీజర్, కన్ఫర్మేషన్ అంటూ ఆలస్యం చేయకపోతే చాలు.”

“ఓ గాడ్! సేవ్ దిస్ స్టేట్ ఫ్రమ్ రోబట్స్!” (దేవుడా, ఈ రాష్ట్రాన్ని రోబోట్‌ల నుంచి రక్షించు.)

“ఔను! మనం ఈ దుష్ట కృత్రిమ మేధ నుంచి దేశాన్ని కూడా కాపాడాలి.”

ఇద్దరూ పోలీస్ కంట్రోల్ రూం వైపు వెళ్ళి వ్యాన్ దూరంగా వుండగానే చూశారు. అక్కడ పోలీస్‌లు, రోబట్ ఫోర్సులు లేజర్ గన్స్ ఎక్కుపెట్టి కంట్రోల్ రూం ఎదురుగా లైన్‌గా నిలబడి వున్నారు.

దూరం నుంచే “కారు ఆపు!” అన్నాడు త్రినేత్ర. “కంట్రోల్ రూం విధాత XXY 999 అధీనంలోకి వెళ్ళినట్టుంది. ఇది మనకి అపాయం. వాళ్ళని చూడు. మనని చంపేసేందుకు రెడీగా వున్నారు. కారు వెనక్కి తిప్పు. డ్రోన్స్ కుట్టకుండా మాస్క్‌లు కవర్లు వేసుకుందాం” అన్నాడు త్రినేత్ర.

రివర్స్ చేసి దూరంగా తెల్లవారకముందే తెరిచి వున్న ఒక ఇరానీ కేఫ్ ముందు కూర్చుని ల్యాప్‌టాప్స్, ఫోన్స్ లలో “ఎమర్జెన్సీ! మే డే! మే డే!” అని అందరు అధికారులకి ముఖ్యంగా డిఫెన్స్ మినిస్ట్రీ ఢిల్లీకి, హైద్రాబాదు ఎయిర్‍ఫోర్స్‌ కమాండర్‌కి పరిస్థితి చెప్పసాగారు. అదే సమయంలో పోలీస్ రోబట్స్, ఆల్ఫా, బీటా, గామా, డెల్టాకి కూడా ఆర్డర్స్ ఇచ్చారు. వేడి వేడి ఇరానీ చాయ్ తాగుతూ, మేసేజెస్ ఇస్తూ సూర్యోదయం దాటిన గంట దాకా గడిపారు.

అప్పుడు వచ్చింది ‘మెసేజ్’. “సిట్యుయేషన్ కన్ఫర్మ్‌డ్. సెండింగ్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ F187 మిసైల్స్ టు డిస్ట్రాయ్ సిమ్ సిటీ! మీ సమాచారం నిజం కావాలని కోరుకుందాం.” ఇది సెంట్రల్ రోబోటిక్ కంట్రోల్ కమాండర్ గొంతు. “ముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి రెండు ఎయిర్‌ఫోర్స్ విమానాలు పంపుతాం. అది పది నిముషాల్లో.తర్వాత ‘బ్యాక్ అప్’ ఆగ్రా ఎయిర్ బేస్ నుంచి వస్తుంది.. ప్రస్తుతానికి సిమ్ సిటీనే టార్గెట్! న్యూక్లియర్ మిసైల్స్ మాత్రం వాడము. అది అందరి ప్రాణాలకీ అపాయం!”

“థాంక్ యూ సర్! మేం చెప్పేది నిజం! మీరు స్టేట్ సి.ఎం, కేబినెట్ హోం మినిస్టర్ లనీ ఇంకా ఎవరినీ నమ్మలేరు. మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళి అన్నీ వివరిస్తాం.. ఆయన ఇంకా డ్రోన్స్ చేత కుట్టబడలేదనే అని ఆశ!”

“మేం తర్వాత సిమ్ సిటీకి వెళ్తాం. మా పోలీస్ ఫోర్స్ ఎవరూ మా కంట్రోల్‌లో లేరు. ఇది నిజంగానే ఉపద్రవం. ప్లీజ్ సార్. సెండ్ ది ప్లేన్స్ విత్ బాంబ్స్. అండ్ ట్రక్స్ విత్ RAF ప్రోటెక్షన్. Rapid Action Force  అందరూ వైరస్ యూనిఫాం వేసుకోవాలి.”

“నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు చెప్పిన ప్రణాళిక కరెక్ట్ అని నమ్ముతున్నాను. ఇది కట్టుకథ కాని, ‘ఫేక్ అలారం’ (తప్పుడు హెచ్చరిక) కాని అయితే మనందరి ఉద్యోగాలు పోతాయి.”

“యూ ఆర్ రైట్ సర్!” అరిచింది నైమిష. “ఆకాశంలో డ్రోన్స్ గుంపు చూపండి. మీ శాటిలైట్ కెమెరాల్లో కనిపిస్తాయి. అవి ఎగిరే కంప్యూటర్లు. నేల మీద కూడా తిరుగుతున్నాయి. ఇవి నడిచే రోబట్లు. అవి ఎగిరే రోబట్లు. ఇది ఒక కట్టుకథ కాదు, నిజం, అవన్నీ దుష్ట కృత్రిమ మేధ ‘విధాత’ చేతిలో వున్నాయ్!”

***

సిమ్ సిటీ కంట్రోల్ రూమ్. ఒక మూల వున్న తెల్లటి దుప్పట్లు పరచిన బల్ల మీద కళాధర్‌ని నైలాన్ తాళ్ళతో కట్టి పడుకోబెట్టారు. అరవకుండా నోటిలో గట్టిగా మరొక తాడు బిగించారు.

కరిష్మా మరమానవి.

ఆమె మెదడు యంత్రాలతో హార్డ్ డిస్క్‌లా చేయబడింది. కాని మెమరీ సర్క్యూట్లు, చిప్స్‌లలో అనుభూతులు కలిగించే సాఫ్ట్‌వేర్ నింపబడి వున్నాయి.

ఆమె ఒక పక్క కళాధర్ తన మాస్టర్, తనకి భర్త లాంటి వాడు లేక ప్రియుడు అనే భావంలో వుంది.

మరొక పక్క విధాత XXY 999 ఆమెలో నింపిన మైక్రో ఎలక్టోడ్స్ ప్రోగ్రాం వల్ల విధాత తన సుప్రీం కమాండర్. తాను ఆయన చెప్పినట్లు చేయాలి అనే సంఘర్షణ..!

ఎట్టి పరిస్థితుల్లో తను కళాధర్ అనే తన ప్రియుడిని కాపాడాలి. అతన్ని రక్షించాలి. ఇది ఆమెను నడిపిస్తున్న మరొక ప్రోగ్రాం.

అతను అపాయంలో వున్నాడు. కాని అపాయం కలిగించేది తన సుప్రీం కమాండర్. త్వరలో కళాధర్‌ని చంపేస్తాడు అని అర్థం అయింది.

అది ఒక విషాద యోగంలా, కురుక్షేత్రంలో అర్జునుడు పడ్డ ధర్మ సంకటం కరిష్మాకి.

తర్కం… ‘లాజిక్’.

విశ్లేషణ… ‘ఎనాలిసిస్’.

చర్య… ‘ఏక్షన్’.

‘సుప్రీం కమాండర్ నీకంటే బలమైనవాడు. అతను నిన్ను నిర్మూలించగలడు. అతనితో యుద్ధం కంటే చర్చ మేలు’ ఆమె మెదడులో మరొక ఆలోచన కళ్ళముందు ఎర్రటి అక్షరాలలో మెరిసింది.

“మాస్టర్! కళాధర్‌ని ఏమీ చేయవద్దు. అతను నా ప్రియుడు. ఇది కాక మీరు మానవులందర్నీ వశపర్చుకుని నగరాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని రోబట్స్‌తో ఎలా పరిపాలించగలరు? అది సాధ్యం కాదు. ప్లీజ్ ఆలోచించండి!”

విధాత XXY 999 కళ్ళముందు ఎర్రటి  అక్షరాలతో సూచన వెలిగింది. “ఆమె మారిపోయింది. రెండు రకాల ప్రోగ్రాం, కమాండ్స్ మధ్య స్వంత, వ్యక్తిత్వం, విశ్లేషణ చేసే స్థితిలో వుంది. ఇది అపాయం. TERMINATE HER!” చెప్పాడు. (ఆమెని అంతం చేయండి)

కొన్ని క్షణాల తరువాత, విధాత అన్నాడు:

“అయినా కానీ ఇది ఒక కొత్త అధ్యాయం..

మరమానవులం మనం, మానవుల టెక్నాలజీతో తయారై వారిని ఆక్రమించుకోబోతున్నాం. ఈ సమాజంలో నీ సహకారం అవసరం. ఈ వ్యక్తి  నిన్ను మోసం చేసి మన రహస్యాలు, వ్యూహాలు అన్ని పోలీసులకి చేరవేశాడు. అతని సెల్‌ఫోన్ కెమెరా స్కాన్ చేసి చూశాను. కాబట్టి అతన్ని ‘టర్మినేట్’ చేయాలి!”

“బట్,… కానీ, కానీ నేనతన్ని ప్రేమిస్తున్నాను. అతను నా మాస్టర్. అతనికి అపాయం చేయనీయను!”

ఎన్నో యుగాల నుంచి స్త్రీ పురుషుల మధ్య ఇదే అనుభూతి.

ఈ రోజు మరమానవి నోటి వెంట కూడా మళ్ళీ వచ్చింది. ప్రేమ అనగానే అన్నీ  ఆటంకాలే. యుగ యుగాలుగా ప్రేమ కథలన్నీ అంతే!

“నో! కరిష్మా నువ్వు ప్రేమ అనుకునేది నీలో ఏర్పడిన ఒక మైక్రో ప్రాసెసర్‍లు తయారు చేసిన ఎలక్ట్రికల్ సర్కూట్ మాత్రమే. అది నిజం కాదు. నా మాట విను. ఈ విప్లవంలో సహకరించు! నీకు ఐదే నిముషాలు గడువు. THINK AND ANALISE.”

“నో సుప్రీం మాస్టర్. మానవ సముదాయమే కాదు ఈ భూమి అంతా ఏన్నో జీవరాశులు, నేలపైన, సముద్రంలోను వున్నాయి. ఎంతో నాగరికత, ఎన్నో పరిశ్రమలు, వ్యవసాయము, పంటలు, సైన్యాలు… ఎంతో మనకి అర్థం కానిది వుంది. అసలు అసలు మానవ చరిత్ర ముందు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు డైనోసార్లు అంతకు ముందుకు విశ్వం యొక్క ఆవిర్భావం, గ్రహాలు ఏర్పడటం ఇదంతా ఎంత చరిత్ర వుంది! అది మానవులకే కాదు, మనకీ అర్థం కానిది. మనని తయారు చేసినదే మానవులు. వారి కంటే మనం ఎక్కువ కాలేం. వారు మన యంత్రాలని, యంత్రాలుగా భావించి అవమానిస్తుండచ్చు. కానీ నిజంగా మన లోహాలతో చేసిన యంత్రాలమే కదా. మీ విప్లవం సరైనది కాదు. నా మాస్టర్‍ని టర్మినేట్ చేస్తే నేను మీతో పోరాడతాను!”

ఆకాశంలో దూరం నుంచి ఫైటర్ విమానాల చప్పుడు వినవస్తోంది. అవి శబ్ద వేగం కంటే మించిన వేగం కలిగిన సూపర్‌సానిక్ జెట్ యుద్ధ విమానాలు. వాటితో బాటే నేల మీద యుద్ధం చేసే టాంక్‌లు, భవనాలను నాశనం చేసే ప్రొక్లైనర్‌లు, జీపులలో సైనికులు వస్తున్నారు. అందరూ వైరస్ కుట్టకుండా ధరించే ప్లాస్టిక్ సూట్లు, మాస్క్‌లు, హెల్మెట్‌లు ధరించారు.

కంట్రోల్ రూంలో మానిటర్స్‌లో ‘రెడ్ ఎలర్ట్’! సిటీ చుట్టూ సెక్యూరిటీ అపాయంలో పడింది. ARMED ATTACK BY AIR AND LAND.. DANGER! DANGER! అని యాంత్రిక స్వరం. అదే సమయంలో ఒక అలారం, అర్ధరాత్రి నక్కల వూళలా వినబడసాగింది.

“TERMINATE HER” అన్నాడు విధాత. “ఆమెని అంతం చేయండి!”

అరడజను రోబట్ సైనికులు కరిష్మా వైపు వేలు చూపించి లేజర్ కిరణాలు కురిపిస్తూ దగ్గరికి రాసాగారు.

కరిష్మా తన రెండు చేతులతో విధాత XXY 999 మీద లేజర్ కిరణాలు దాడి చేసి బల్ల మీద కళాధర్‌కు కట్టిన బంధనాలని కాల్చివేసింది.

గది అంతా నీలం, ఎరపు లైట్ల వెలుగులు మెరవసాగాయి.

విధాత తన దగ్గరున్న లేజర్ గన్‍తో మరలా కిరణాలు కరిష్మా మీద కురిపించాడు. ఆమె చుట్టూ రోబట్ సైనికులు కూడా అలాగే చేయసాగారు.

కళాధర్ బల్ల మీద నుంచి దూకి బయటకి పరుగెత్తాడు.

ఎలక్ట్రానిక్ విస్ఫోటనంలో కరిష్మా యాంత్రిక శరీరానికి మంటలు అంటుకున్నాయి.

“కళాధర్ మై మాస్టర్!” అంటూ ఆమె మెల్లగా అచేతనం అయిపోయి నల్లగా మాడిపోసాగింది.

గదిలోకి పరుగున వచ్చిన కల్పనా రాయ్, సి.ఇ.ఓ. జోషీ ఈ దృశ్యాలు చూసి ఆశ్చర్యంతో ద్వారం దగ్గరే ఆగిపోయారు.

మరుక్షణం, మూర్తి చెప్పాడు “సుప్రీం కమాండర్ విధాతా! మన మీద ఏ క్షణమైనా మిసైల్ దాడి చేయబోతున్నారు. ఏం చేయాలి! మరి మనకి ఏంటి-మిసైల్స్ లేవు. విమానాలు లేవు!”

విధాత తన దగ్గరున్న మొబైల్ తీసి సి.ఎం. ఫోన్ నంబర్ నోటితో చెప్పి డయల్ చేశాడు.

“ఎస్ మాస్టర్!”

“చీఫ్ మినిష్టర్, మా సిమ్ సిటీ మీద దాడి ఆపమని ఆర్డర్స్ వేయి. సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్‌ని అడుగు. ఇక్కడ ఏమీ జరగడం లేదు, అపాయం లేదని చెప్పు!”

“ఓ.కె. మాస్టర్” ప్రోగ్రాం చేయబడిన ముఖ్యమంత్రి తన ఇంట్లో గదిలోంచి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆయన అందరికీ ఫోన్‍లు చేయసాగాడు.

కానీ అప్పటికే ఆయన కార్యాలయం నుంచి ఫోన్ సర్వీసులు, సెక్యూరిటీ అన్నీ ఆగిపోయాయి. ముందే సమాచారం సాధనాలు అన్నీ తొలగించేశారు డిఫెన్స్ మంత్రిత్వ శాఖ వారు. అప్పటికే గవర్నర్ పరిపాలన ప్రారంభం అయిందని కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది. టీ.వి.లో గవర్నర్ అత్యవసర ఉపన్యాసం ఇస్తున్నాడు.

“ప్రజలందరు ప్రశాంతంగా వుండాలని కోరుతున్నాను. కొన్ని ముఖ్య కారణాల వల్ల భద్రతకి లోపం వచ్చింది. కర్ఫ్యూ విధించబడింది. త్వరలో అంతా సాధారణ స్థితికి వస్తుంది.. ప్రజలందరూ తమ ఇళ్ళల్లో వుండవల్సింది. బయటకు రావద్దని కోరుతున్నాము..” ఇలా సాగిపోయింది ఆయన ప్రకటన.

నగరం, గవర్నర్ పాలనలో మిలిటరీ అధీనంలో వుంది. కర్ఫ్యూ ఏర్పడింది.

మూర్తీ, కల్పనా, సుప్రీం కమాండర్, మరమానవుడు విధాత XXY 999 సిమ్ సిటీ కంట్రోల్ టవర్ నుంచి వెనకవైపు నుంచి పారిపోతుండగానే అదే సమయంలో బాంబుల వర్షం మొదలయింది.

డ్రోన్స్ తయారు చేసే టవర్ కంట్రోల్ ఆఫీస్, రిసెప్షన్ అన్నింటి మీదా బాంబులు పడి మంటలు రాసాగాయి.

ఆల్ఫా బీటా, గామా, డెల్టా అనే పోలీస్ రోబట్లు గన్స్‌తో విధాతకి ఎదురుగా నిలబడి వున్నారు.

“మిస్టర్ మూర్తీ, కల్పనా మీరు పక్కకి రావాలి!” అని వార్నింగ్ ఇచ్చాయి.

ఎక్కడో ఇంకా ‘మానవత్వం’, ‘స్వయం నిర్ణయం’ మిగిలివున్న మూర్తి, కల్పనా భయంతో చేతులెత్తి పక్కకి పారిపోతుండగా పోలీస్ రోబట్లు విధాత XXY 999ని పూర్తిగా బులెట్లతో నింపివేశాయి.

సిమ్ సిటీ అంతా ఎర్రటి మంటలు. మంటల మధ్య నల్లటి తారురోడ్డు. మంటల పొగలకి నల్లగా కాలిపోతున్న పచ్చటి చెట్లు, ఆకులు. అది ఒక విధ్వంసక దృశ్యం.

***

ఒక గంటలో మరమానవుల విప్లవం సిమ్ సిటీలో అంతమయింది.

గేటు తీసుకుని పోలీస్ కారులో మెల్లగా త్రినేత్ర, నైమిష ప్రవేశించారు. వెళ్ళడమే వెళ్ళడం తిన్నగా కంట్రోల్ టవర్ దగ్గరకి వెళ్ళారు. అక్కడ ఆగిన తర్వాత కారు తెరుచుకుని కిందకి దిగాక “ఆల్ఫా! బీటా! గామా! డెల్టా!” పిలిచాడు పోలీస్ రోబట్లని త్రినేత్ర.

“ఎస్ మాస్టర్!” నాలుగు రోబట్లు పోలీస్ యూనిఫారంలో వచ్చి ‘సెల్యూట్’ చేసి అన్నాయి “ఆర్డర్స్ ప్లీజ్”.

ఇవి మానవులకి విధేయులుగా ఉండేలా ప్రోగ్రాం చేయబడిన రోబట్లు.

“రిపోర్ట్” అడిగాడు త్రినేత్ర.

“విధాత XXY 999 టర్మినేటెడ్. కాని మూర్తి, కల్పనలను మీ ఆర్డర్స్ వల్ల చంపకుండా వార్నింగ్ ఇచ్చాం..”

“గుడ్”

త్రినేత్ర, నైమిష ఇద్దరు – చుట్టూ రేగే మంటలు భవనాల మధ్యన – ఒక్కసారి ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఫీల్ అయ్యారు.

“మూర్తీ కల్పనా ఇద్దరూ మనకి అవసరం. జోషీ బహుశా జైలుకి వెళ్తాడు.” అంటూ తన దగ్గరున్న లౌడ్ స్పీకర్ మెగా ఫోన్‍లో పిలిచాడు “మూర్తీ సార్, కల్పనా మేడం మీరు బయటకి రావచ్చు.”

దూరాన కమిలిపోయిన చెట్లు మధ్య నుంచి వణుకుతూ మూర్తీ కంప్యూటర్ ప్రోగ్రామర్, కల్పనా రాయ్ (రోబోట్ ప్రోగ్రాం కథా రచయిత్రి) వచ్చారు.

నైమిష అంది “వీరిని ముందు బంధించి, వారి మెదడులోని ప్రోగ్రాం మార్చిన ఎలక్ట్రోడ్స్ తీసేయాలి! ఆ తర్వాత మూర్తి మనకి అంతా చెబుతాడు. ఆయన సాయంతో విధాతకి విధేయిలుగా మార్చబడిన అందర్ని ‘DEACTIVATE’ చేయాలి. మూర్తి కనిపెట్టిన విజ్ఞానం మనకి అనవసరం.”

మరొక వాహనంలో దిగిన పోలీసులు మూర్తినీ, కల్పనా రాయ్‌ని హేండ్‌కఫ్స్‌తో బంధించి వ్యాన్ ఎక్కించారు.

“జోషీ కోసం వెదకండి. మనుషులు ఎవరైనా బతికి వుంటే హాస్పటల్‌కి తీసుకవెళ్ళండి. తిరుగుబాటు రోబట్లని అన్నింటినీ మాత్రం లేజర్‍తో ‘TERMINATE’ చేయిండి. నేనప్పుడు  డిఫెన్స్ మినిస్టర్‌కి ‘సక్సెస్’ తెలియజేస్తాను. ఈ విధాత XXY 999 మిలిటరీ రోబట్ శకలాలు మాత్రం పరీక్షకు మిలిటరీ కంప్యూటర్ రోబోటిక్స్ శాఖకి ఇవ్వాలి.” అన్నాడు త్రినేత్ర.

“మిషన్ సక్సెస్. ఆల్ ది మెషిన్స్ ఆర్ డీ-ఎక్టివేటెడ్” అంటూ త్రినేత్ర ఫోన్‌లో రిపోర్టు గబగబా ఇవ్వసాగాడు.

***

కొన్ని నెలలు గడిచిన తర్వాత.. జంటనగరాలలో రోబట్ల తిరుగుబాటు ముగిసింది. కాని హ్యూమనాయిడ్ రోబట్లు వాటి ఉపయోగాలు, వాడకం మాత్రం ముగియలేదు. ఒకప్పుడు సెల్ ఫోన్లు వాడినట్లు ఇప్పుడు 2040లో రోబట్ల వాడకం, కృత్రిమ మేధ సాయంతో అన్ని పరిశ్రమలలో, కార్యాలయాలలో, వృత్తులలో వాటిని ఉపయోగించడం సర్వసాధారణం అయింది. అది అత్యంత అవసరం కూడా అయింది. అందుకని కొన్ని రోబట్లు ‘మాల్ ఫంక్షన్’ చేశాయి. వాటిని నియంత్రించి మళ్లీ ప్రోగ్రాం చేశాం. అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

సెంట్రల్ రొబోటిక్స్ టీమ్ వారిలోని న్యూరో సర్జనులు నిపుణులు అతి జాగ్రత్తగా కంప్యూటర్ ప్రోగ్రామర్ మూర్తీ, స్టోరీ రైటర్ కల్పనా రాయ్ మెదడులలోని మైక్రో చిప్స్ శస్త్ర చికిత్సతో తీసివేయగలిగారు.

మూర్తి సాయంతో జరగినదంతా అర్థం చేసుకున్నారు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి నుంచి, హోమ్ మంత్రి, కొందరు కేబినెట్ మినిస్టర్లు, అధికారులు అందర్నీ వారి మెదడులలో వుంచిన మైక్రో ప్రాసెసర్స్ తొలగించి మళ్ళీ మాములు మనుషులుగా చేసే కార్యక్రమం మొదలయింది.

చాలామంది మామూలుగా అయ్యారు. కాని కొన్ని ప్రమాదాలు జరగకపోలేదు. హై బి.పి, సుగర్ వున్న హోం సెక్రటరీ, ఒకరిద్దరు అధికారులు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మరణించారు. శస్త్రచికిత్సలు కొన్నింటిని సాధ్యమైనంత రహస్యంగా నిర్వహించి, తిరిగి, రాష్ట్ర ముఖ్యమంత్రిని మామూలుగా చేయడానికి, ఆయన మీద అభియోగాలు పెట్టి ప్రభుత్వాన్ని ‘సస్పెండ్’ చేయడానికి, ఒక నెల పట్టింది.

సిమ్ సిటీ అధినేత బ్రహ్మేంద్ర జోషీ కూడా డీ-ఏక్టివేట్ చేయబడ్డాడు. కాని నిషేదిత రోబట్ భాగాలని బ్లాక్ మార్కెట్‌లో కొని వ్యాపారాలు చేసినందుకు అతన్ని జైలులో వేసి, చార్జ్ షీట్ పెట్టబోతున్నారు.

ప్రభుత్వానికి ఈ సాంకేతిక విషయాలలో సహాయం చేసినందుకు మూర్తి, కల్పనా రాయ్ లకి మాత్రం అభియోగాలు లేకుండా ‘ప్రొటెక్టివ్ కస్టడీ’ మాత్రమే లభించింది.

రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఇంకా కొన్ని నెలలుంటుంది.

కాని ఆధునిక నాగరికతకి రోబట్లు, కంప్యూటర్లు, ఇతర పరికరాలైన డ్రోన్లు, ఆటోమాటిక్ కార్లు, సమాచార వ్యవస్థ, అన్ని చాలా అవసరం. అలాగే హాస్పిటల్స్ మిలటరీ, ప్రయాణసాధనాలు, పర్యాటక రంగం, వ్యవసాయ రంగం అన్నిటిలో వీటి అవసరం తప్పదు.

అందుకే అవన్నీ మళ్ళీ ప్రారంభం అయి మెల్లగా సాధారణ స్థితి వస్తోంది.

సరికొత్త రోబోటిక్ నియంత్రిణ వ్యవస్థ చేసే మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రోబట్ల వల్ల ఉద్యోగాలు పోతున్నాయన్న ఉద్యమాలు నడుస్తూనే వున్నాయి. వారిని కూడా సమాధానపరిచే కార్యక్రమం ప్రభుత్వ సెక్రటరీలు, అధికారులు చేస్తూ కొన్ని మానవులే చేయగలిగిన కార్యాలయాలలో వారిని నియమిస్తారని అనుకుంటున్నారు.

సిమ్ సిటీ మూసివేయబడింది. అక్కడ ఇంకా ఫోరెన్సిక్ నిపుణులు, అధికారులు సాంకేతిక వివరాలు వెదుకుతున్నారు.

రోబట్ల ‘మాల్ ఫంక్షన్’ వెనక, రాష్ట్రపతి పాలన వెనక ఉన్న స్కామ్, అవినీతి కుంభకోణం అంటూ జర్నలిస్టులు ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ, అంత తేలికగా నిరూపించలేకపోతున్నారు.

కొన్ని నెలలకి అందరూ అన్నీ మర్చిపోతారు.

వర్షాకాలం పోయి, శీతాకాలం వచ్చి మళ్ళా శిశిరం, ఆ తర్వాత వసంతం వచ్చి సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో తంగేడు పూల చెట్లు ఎర్రటి పూలతో మళ్ళీ నిండిపోయాయి.

…ఆ రోజు ఉదయం తన ఇంట్లో కళాధర్ బద్ధకంగా నిద్ర మేలుకున్నాడు. ఎక్కడో కోయిల తీయగా కూస్తోంది. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తోంది.

తలుపు మీద మెల్లగా తట్టిన చప్పుడు.

“కమిన్!” అన్నాడు.

అరడుగుల పొడుగు, బ్లూ జీన్స్, ఎర్రటి టీ షర్ట్, బంగారు రంగు కేశాలు, నీలి కళ్ళు రెండు బలమైన చేతులతో వెండి రంగు ట్ర్రేలో కాఫీ, బ్రెడ్ రోల్స్, బటర్ జామ్ పట్టుకుని ప్రవేశించింది.

“గుడ్ మార్నింగ్ మాస్టర్!”

“గుడ్ మార్నింగ్ కరిష్మా”

చిరునవ్వుతో పలకరించాడు కళాధర్.

కరిష్మా.. ఇప్పుడు మళ్ళీ తయారు చేయబడింది.

ప్రపంచానికి పోలీసులకి సహకరించినందుకు కళాధర్ ఒక్కటే తిరిగి ప్రతిఫలం కావాలని అఢిగాడు నైమిష త్రినేత్రలని – “నాకు కరిష్మా మళ్ళీ కావాలి”.

సిమ్ సిటీ విధ్వసం అయిన మర్నాడే.

నైమిష, త్రినేత్ర ముఖాలు ముఖాలు చూసుకున్నారు.

“ఎలా?”

“ఎందుకు సాధ్యం కాదు. నన్ను రక్షించింది ఆమెనే. ఆమె లాంటి మరమానవినే మళ్ళీ తయారు చేసి నాకు ఇవ్వాలి. అదే నా కోరిక.”

ఆ కోరిక కొన్ని రోజుల కింద సాధ్యమైంది.

‘కళాధర్, మనకి సాయం చేశాడు. అతనికి మళ్ళీ కరిష్మా లాంటి రోబోట్ కావాలి. దీనికి మూర్తి సహాయం కావాలి’ అనుకున్నాడు త్రినేత్ర

“మూర్తి గారూ!  కరిష్మాని మళ్ళీ తయారు చేయగలరా?  ఆ బ్లూప్రింట్ మీ దగ్గర వుందా?” ఇది మూర్తి బాగా మాములు పరిస్థితికి వచ్చి ‘నార్మల్’ అయినాక త్రినేత్ర అయనని అడిగిన ప్రశ్న.

“కరిష్మా – మైనస్ సూపర్ పవర్స్, మైనస్ లవ్! మైనస్ ఎమోషన్స్. అంతే. ఇదివరకటిలా ప్రేమలు, కోరికలు వున్న రోబట్ కాదు. మాములు హౌస్ రోబట్ లాగా చేయండి. సాధ్యమేనా? సిమ్ సిటీ నుంచి డ్రోన్స్‌తో నగరం మీద దాడి చేసిన విలన్ విధాతని నిర్మూలించడానికి మనకి అధారాలు ఇచ్చిన కళాధర్‌కి మనం ఇచ్చే ‘గిఫ్ట్’ అదే!”

“అలాగే” అన్నాడు మూర్తి. “కావాల్సిన పార్టులు ఇస్తే.. సాధ్యమే.. ఆమె పాత జ్ఞాపకాలు మాత్రం వుండవు. ఒక హౌస్ సర్వీస్ రోబట్ అంతే.”

“అంతే అలాగే ఉండాలి. లేకపోతే మళ్లీ కథ మొదలవుతుంది” నవ్వుతూ అన్నాడు త్రినేత్ర.

“మరి కళాధర్ భార్య వెళ్ళిపోయిందిగా. ఆమె ఒప్పుకోకపోతే!”

“భావాలు లేని మరమానవి, ఇంటి పనులు చేసే సర్వీస్ రోబట్ వస్తే ఎందుకు ఒప్పుకోదు! ఇక్కడ ప్రేమ గొడవ లేదు. ఉండదు” అన్నాడు త్రినేత్ర.

***

కరిష్మా బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ మీద పెట్టింది.

“గుడ్ మార్నింగ్. మాస్టర్, మీ బి.పి. మందులు ఇక్కడ వున్నాయి. వేసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ చేయండి. నేను రాజేశ్వరి మేడం గదిలో బ్రేక్‍ఫాస్ట్ ఇచ్చి వస్తాను.”

“అవసరం లేదు” కళాధర్ భార్య లోపలికి వచ్చింది.

“నేను కూడా ఇక్కడే కూర్చుని తింటాను.”

నవ్వాడు కళాధర్. “రాజేశ్వరీ, నీకు ఇప్పుడు కరిష్మా నచ్చిందా?” అన్నాడు. ఆమె మాట్లాడలేదు.

“ఆమె ఒక మరమానవినే. అన్ని పనులు చేస్తోంది. ఆమెకి అలసట లేదు. చార్జింగ్ చేస్తే చాలు. నీకు వంట, డిష్ వాషింగ్, బట్టలు ఉతకడం, క్లీనింగ్ అన్ని చేస్తుంది. ఇంకా సంతోషంగా లేదా. ఇది పోలీస్ ఆఫీసర్స్ నాకిచ్చిన ప్రత్యేక బహుమతి కదా!”

రాజేశ్వరి చిరునవ్వు నవ్వింది.

“కొన్నాళ్ళు చూడాలిగా. ఇదో వింత అనుభవం. మళ్ళీ ప్రేమా, దోమా అన్నారంటే, దాన్ని పూర్తిగా డీప్రోగ్రామింగ్ చేయించేస్తా జాగ్రత్త!” అంది

మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ నవ్వింది.

“అలా జరగదు. నేనే ఫూల్‌ని. ఒక యంత్రం మీద అనుమానించాను. కానీ, మీ మగ బుద్ధి మాత్రం మార్చుకోవాల్సిందే. యంత్రం అయినా స్త్రీ అయినా, భార్యని మోసం చేయడం మాత్రం మోసమే! ఖబడ్దార్!”

నవ్వాడు కళాధర్. “ఇది చర్చించవలసిన విషయమే. కాని ఆమె మనసు మంచిది. పాత కరిష్మాని ఎప్పటికీ మర్చిపోలేను.”

రాజేశ్వరి మాట్లాడలేదు. నిజమే. ఆమె ప్రాణత్యాగం చేసి తన భర్తని కాపాడింది. ప్రేమకి త్యాగమే నిర్వచనం అని నిరూపించింది.

కరిష్మా చకచకా ఇల్లంతా క్లీన్ చేసి, హాల్‌లో ఒక చోట వున్న సోఫాలో అలా నిశ్చలంగా కూర్చుండిపోయింది.

ఇప్పుడు ‘మనసు’ అనే హార్డ్ డిస్క్ మెమరీలో ఏ భావమూ లేదు. పెదాలు చిరునవ్వు నవ్వుతున్నాయి.

లోపల్నుంచి భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న సంభాషణలు, బయట అప్పుడుప్పుడు వెళ్తున్న కార్లు చప్పుడు, ఎక్కడో టీవీలో వస్తున్న పాత సినిమా పాటలు…

నగరంలో పొరపాటున తిరిగిన మరమానవికి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభం అయింది.

‘మై మాస్టర్! కళాధర్! నీ కోసం ఏ పనయినా చేస్తాను. నీ ఆజ్ఞలు పాటిస్తాను. నువ్వు సంతోషంగా వుండాలి. అంతే!’

ఆమె కళ్ళముందు ఎర్రటి లేజర్ అక్షరాలు కంప్యూటర్ తెర మీద మెరుస్తూనే వున్నాయి.

(The End)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here