నగరంలో మరమానవి-5

2
9

విప్లవం-1

[dropcap]తె[/dropcap]ల్లవారుతోంది.

కరిష్మాతో ప్రణయం అతిలోకమైన అనుభవంగా వుంది కళాధర్‌కి.

నిజమైన ప్రేమానుభవం భౌతికం నుంచి తర్వాత మానసికంగా పరిణతి చెందుతుంది.

– మనుషులలో.

 – ప్లేటోనిక్ లవ్.. కానీ భౌతిక బంధం లేని ప్రేమ వుంటుందా?

మరి యంత్రానికి, ప్రేమ భౌతికమైన బంధం నుంచి ఎలా వస్తుంది? వుత్తినే అవయవాలు తయారు చేసినందు వల్ల అనుభూతి మనిషికి రావచ్చు.

కాని ప్రేమ యంత్రానికి ఎలా?

ప్రేమలోంచి వచ్చే ఆరాధన, విడిచి వుండలేని తత్వం, జీవితమంతా కలిసి వుండాలనే బలమైన కోరిక.

ఇది చేతన లోకి ఎలా వస్తుంది?  హ్యుమనాయుడ్ యాంత్రిక స్త్రీ రోబోకి ప్రేమ!

అతని మెడ చుట్టూ చేతలు వేసి “నిన్ను విడిచి వుండలేను కళాధర్!” అంది.

ఇద్దరు పక్క పక్కనే పడుకుని వున్నారు. హాల్లో కళాధర్ భార్య రాజేశ్వరి నిద్ర లేచి తలుపు తీసినట్లు, బహుశా పాలప్యాకెట్లు తీసుకోవడం, పనిమనిషి వచ్చిన చప్పుడు, బయట రోడ్డు మీద వాహనాల చప్పుడు.

కళాధర్ ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు.

“ఇప్పడెలా? ఏ క్షణంలో అయినా నా భార్య తలుపు కొట్టి కాఫీతో లోపలికి వస్తుంది.”

కరిష్మా కొంచెం యాంత్రిక మందహాసం చేసి అంది.

“డోంట్ వర్రీ మాస్టర్! నేను కనబడకుండా దాక్కుంటాను.”

లేచి బట్టలు సూట్లు దాచుకునే కప్ బోర్డు తెరిచి వాటి వెనకాల నిలబడింది.

తలుపు మూసేసుకుంది.

రాజేశ్వరి తలుపు కొట్టింది.

“ఏమండీ నిద్ర లేవలేదా? కాఫీ తెచ్చాను.”

కళాధర్ కంగారు తగ్గించుకుని నైట్ డ్రస్ సర్దుకుని తలుపు తెరిచాడు.

రాజేశ్వరి లోపలికి కాఫీ తెచ్చి ఇవ్వడం అరుదు. ఆమె ఇప్పుడు కళాధర్‌పై ఎక్కువగా ఆప్యాయత చూపిస్తోంది.

కొన్ని సంవత్సరాల క్రితమే పెళ్ళి అయింది. పిల్లలు లేరు. వ్యాపారం నిమిత్తం బిజీగా వుండే కళాధర్, పెద్ద ఇంట్లో ఒంటరిగా వుండే ఆమె, క్రమంగా అతనికి కొంచెం దూరం అయిపోతూ వచ్చింది. కోపం ఎక్కువయింది. విమర్శ ఎక్కువ, ప్రశంస తక్కువ. అలా అని ఆమెకి అతనంటే విరక్తి లేదు. అతని అన్ని చేష్టలు గమనిస్తుంటుంది. ‘పొసెసివ్’ అనవచ్చు. లేదా ‘అనుమానం’ కావచ్చు. అది ఎక్కువ!

గది నిండా ఏదో ఒక రకమైన ప్రేమ పరిమళం వ్యాపించి వుందేమో.

“ఏమిటి అలా వున్నారు? సరిగ్గా నిద్రపోయారా?” అంటూ అడిగింది.

కప్ బోర్డు వెనక వేలాడదీసిన సూట్ల వెనక పాదాలు కొద్దిగా కదిలాయి. కనిపించకుండా సర్దుకుంది కరిష్మా.

“ఏం లేదు! ఏం లేదు!” కంగారుగా అన్నాడు కళాధర్. చిందర వందరగా వున్న ఆమె జుట్టు, కొంచెం నిద్ర ముఖం, నలిగిన చీరా చూడగానే అతనికి, అనుకోకుండానే కరిష్మా సుందరమైన వదనం, ఎర్రటి పెదవులు.. బలమైన చేతుల స్పర్శ అన్నీ గుర్తువచ్చాయి.

“కాఫీ తాగేసి రెడీ అవుతా! బాగానే నిద్రపట్టింది” అన్నాడు.

“ఓ.కె.” అని ఆమె వెళ్ళింది.

వెళ్తూ తలుపు దగ్గర ఆగి మళ్ళీ వెనక్కి చూసింది.

సిక్స్త్ సెన్స్. మరమానవులకి లేనిది, రక్త మాంసాలున్న మానవ జీవులకి జంతువులకీ తరతరాలకీ నుంచీ వున్నదీ ‘ఇన్‌స్టింక్ట్’ ఏమో.

“ఏమిటి! ఎవరో వున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ. ఎవరు లేరుగా” సాగదీస్తూ అంది రాజేశ్వరి.

“ఏమంటున్నావ్ రాజీ? ఇక్కడ ఎవరున్నారు? తలుపులన్నీ వేసి పడుకొని నిద్రపోతుంటే!” అన్నడు కళాధర్ సాధ్యమైనంత సహజంగా.

కప్ బోర్డులో కరిష్మా కొద్దిగా కదిలింది.

“ఓ.కె. రాత్రి నిద్ర మాత్రల ఎఫెక్ట్ ఇంకా తగ్గలా. మళ్ళీ పడుకుంటా ఆ ఐ.వి.ఎఫ్.కి తర్వాతి ఎపాయింట్‌మెంట్ ఎప్పుడో కనుక్కోండి. హార్మోనులన్నీ ఇచ్చి నా శరీరాన్నంతా పాడు చేశారు  ఈ డాక్టర్లు” అంటూ ఆమె వెళ్ళిపోయింది.

ఇద్దరికీ పెళ్ళయి ఐదేళ్ళయినా పిల్లలు లేకపోయే సరికి IVF అనే ప్రక్రియతో సంతానం కోసం.. డాక్టర్ల చికిత్స తీసుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు.

తలుపు గట్టిగా వేసేసి ‘అమ్మయ్య’ అనుకున్నాడు.

కరిష్మా బయటకి వచ్చింది.

“సారీ కళాధర్. నీకు ఇబ్బంది కలిగించాను. కాని నువ్వంటే ప్రేమ.”

“ప్రేమ.”

ఇది మానవులు సాహిత్యంలో, కవిత్వంలో, శిల్పంలో శతాబ్దాలుగా వాడే పదం.

నగరంలోకి పారిపోయి వచ్చిన మరమానవికి నోటి వెంట ఎలా వచ్చింది?

“కళాధర్, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా!”

కళాధర్‌కి నవ్వూ కోపమూ రెండూ ఒకేసారి వచ్చాయి.

“నీకు నాకు పెళ్ళి ఎలా కుదురుతుంది కరిష్మా? నువ్వొక రోబోవి. మనిషికి రోబోకి పెళ్ళి ఎప్పుడూ జరగదు.”

“ఎందుకు? నేనే విషయంలో తక్కువ? నేను ఒక్క రోజులో నీ భార్యని మించి వంట చేయగలను. అన్ని cook books చదివేస్తాను. ఇల్లంతా శుభ్రంగా చేస్తాను. బట్టలన్నీ వాష్ చేస్తాను. రాత్రి నీకు నీకు…”

“ఇక చాలు కరిష్మా, ప్లీజ్ వెళ్ళిపో! ఇక్కడ వుంటే ఆమె చూసి పోలీసులకి చెబుతుంది. ..వెళ్ళిపో. అసలు ఏమవుతోంది నీకు? నీ ప్రోగ్రాం అంతా ఎలా మారిపోయింది? మనుషులకే పెళ్ళి, ప్రేమ. యంత్రాలకి వుండవు. నువ్వు సిమ్ సిటీ వెళ్ళిపో!”

“వెళ్ళను. కాని నువ్వు చెబితే వెళ్తాను. నువ్వు నా యజమానివి. నీ ఆర్డర్స్ పాటిస్తా! కాని ..అన్ని రోబట్లు – ‘హ్యూమనాయిడ్ రోబోట్లు’ ఇక్కడ సమావేశమై తిరుగుబాటు చేస్తున్నాయి. అవి మానవులపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. కాని నువ్వు ఒప్పుకుంటే నీతోనే వుంటా!” భావం లేని స్వరం, కానీ ఆమె కళ్ళలో కొంచెం అనురాగపు మెరుపు.

“యూ ఆర్ ఎ మ్యాడ్ మెషీన్. గెటవుట్. ఇలాంటి మాటలు చెప్పొద్దు. ప్లీజ్. నా వివాహమే విచ్ఛిన్నం అవుతుంది.”

కరిష్మా మాట్లాడలేదు. హార్డ్ డిస్క్ చేతనలో బాధ మెలిచిందా? భావాలకి అతీతమైన యంత్ర శక్తిలో నిరాశ పుట్టిందా? మనుషుల కంటే వేల రెట్లు ఆలోచన, విశ్లేషణ వందల రెట్లు శక్తికల కరిష్మా ఒక నిబంధనకి మాత్రం లోబడింది.

‘నీ యజమాని లేక కస్టమర్ చెప్పినట్లు చేయి.’

“అలాగే మాస్టర్. నేను వెళ్ళిపోతాను”. ఆమె మాములు స్త్రీలానే వుంది. కాని కళ్ళలో నీళ్ళు లేవు.

“నీకు అవసరం వచ్చినప్పుడు నీ సెల్ ఫోన్‌లో ఈ నంబర్‍కి మిస్డ్ కాల్ ఇవ్వు. అది నాకు చేరుతుంది.

నీతో జీవితం నాకు దొరకదు కదా. కాబట్టి నాకిక విప్లవమే శరణ్యం.

బై కళాధర్! మై లవ్!  మై మాస్టర్!”

***

సిమ్ సిటీ మళ్ళీ కళకళలాడుతోంది.

సాయంత్రం అయ్యేసరికి వ్యాపారం మెదలవుతుంది.

దగ్గరవున్న పార్కింగ్ ప్లేస్‌లో కార్లు వచ్చి ఆగుతుంటాయి. మధ్యాహ్నం ముడు గంటల నుంచే ధనవంతులు, వినోదం కోరేవారు, సాహసాలు చేసేవారు ఖరీదైన కార్లలో దిగుతారు.

టికెట్లు కొంటారు.

కొంత మంది కొన్ని గంటల కోసం.

కొంత మంది 24 గంటల కోసం.

సాయంత్రపు చీకట్లు క్రమంగా ముసురుకుంటున్నాయి. సిమ్ సిటీ ఉద్యానవనంలో నియాన్ లైట్లు వెలిగాయి.

ఇద్దరు స్నేహితులు సుబ్బారావ్, వెంకటర్రావ్ బార్ లోకి ప్రవేశించారు. ఇద్దరూ టికెట్లతో బాటు చెరొక AK 47 బొమ్మ తుపాకులు డమ్మీ బులెట్లున్నవి కూడా కొనుకున్నారు.

ఇద్దరూ అక్కడ దొరికే కౌబాయ్ జీన్స్ కోట్లు, టోపీలు కొనుక్కున్నారు.

“ ‘ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్’ సినిమాలోలా చేద్దాం రా!” అన్నాడు సుబ్బారావ్.

బార్‌లో అక్కడక్కడా కుర్చీలు బల్లలు మీద నలుగురైదుగురు కస్టమర్‌లు బీరులు, విస్కీలు పెట్టుకుని తాగుతున్నారు.

సుబ్బారావ్ బార్ టేబుల్ దగ్గరికి వెళ్ళి “రెండు బీర్లు తీసుకురా” అని అర్డర్ ఇచ్చాడు. ముసలి బార్‌ టెండర్. ముడతలు పడిన ముఖం. అతను కూడా కౌబాయ్ డ్రస్‌లో వున్నాడు.

“ఓ.కె. మాస్టర్” అన్నాడు.

“చికెన్ జాయింట్లు కూడా. ఫ్రెంచి ఫ్రైలు కూడా.”

“ఓ.కె మాస్టర్.”

వణుక్కుంటూ తెచ్చాడు. రెండు బాటిల్స్ బల్ల మీద పెట్టి నిలబడ్డాడు. “ఫుడ్ పది నిముషాలలో వస్తోంది మాస్టర్స్.”

“చూస్తావేం గ్లాసులో పొయ్యి!”

ముసలి సర్వర్ బీర్ గ్లాసులో పోస్తుండగా చేయి వణికింది. బీర్ తొణికి నురుగు సుబ్బారావ్ మొహం మీద, పానీయం బిందువులు వెంకట్రావ్ మొహం మీద చిందాయి.

‘పిచ్చ’ కోపం వచ్చింది సుబ్బారావ్‌కి. “యూ ఇడియట్, సర్వ్ చేయడం రాదా?” గన్ తీసి పేల్చాడు. వెంకట్రావ్ కూడా హాయిగా పక పకా నవ్వుతూ గన్ తీసి ధన్ ధన్ పేల్చాడు.

డమ్మీ బులెట్లు బార్ టెండర్ శరీరంలోకి చొచ్చుకుపోయి నల్లటి రంధ్రాలు ఏర్పడి ఆ వ్యక్తి పడిపోతూ తన నడుం దగ్గర గన్ తీసుకుని చేతుల్తో పట్టుకొని సుబ్బారావ్‌కి గురి పెట్టాడు.

ముందు భయం వేసింది సుబ్బారావ్‌కి. ఇలాంటి చోటకి రావడం ఇదే మొదలు. కాని ఇది ఒక గేమ్ అని విన్నాడు. వాడొక డమ్మీ రోబోట్. తనకి ఏమీ కాదు. తన గన్ గబగబా పేల్చాడు.

బార్ టెండర్ క్రింద పడి కాళ్ళు చేతులు కొట్టుకుని నిశ్చేతనమైపోయాడు.

సుబ్బారావ్, వెంకట్రావ్ విలన్స్‌లా నవ్వి బీరు గ్లాసులు నోటి కానించి సిప్ చేశారు.

“ఇప్పుడేమవుతుంది” అన్నాడు వెంకట్రావ్.

“ఏం కాదు. మనం డబ్బులిచ్చి టికెట్టు కొన్నదే దీని కోసం. వాళ్ళే చూసుకుంటారు!” అన్నాడు సుబ్బారావ్. “ఇదంతా ఒక ఆట రా. ఎంటర్‌టైన్‌మెంట్.”

ఎక్కడో సైరన్ మోగింది. ఒక పెద్ద నలుపు రంగు వ్యాన్ ‘సిమ్ సిటీ సెక్యూరిటీ’ అన్న పేరుతో వున్నది వచ్చి బార్ ముందు ఆగింది.

ఇద్దరు వచ్చి ‘చచ్చిపోయిన’ బార్ టెండర్‌ని స్ట్రెచర్ మీద తీసుకుపోయారు.

వ్యాన్ లోంచి మళ్ళా ఇద్దరు యువకులు దిగారు.

“చూశావా, వాళ్ళ రోబోట్లని రీప్లేస్ చేశారు. మనకేం పర్వాలేదు!” అన్నాడు సుబ్బారావు బింకంగా.

దిగిన వాళ్ళిద్దరూ యువకులు. బ్లూ జీన్స్, బ్లాక్ హ్యాట్‍లో ఛాతీకి అడ్డంగా బుల్లెట్ల వరుసతో వున్నారు.

వాళ్ళిద్దరూ తిన్నగా సుబ్బారావ్, వెంకట్రావ్ దగ్గరకొచ్చి గట్టిగా అరిచారు.

“గెటప్! కమాన్ ఫర్ ఎ డ్యూయల్!”

డ్యూయల్ అంటే ద్వంద్వ యుద్ధం.

కౌబాయ్ సినిమాలలో లాగా అటూఇటూ నిలుచుని ఒకరి మీద ఒకరు బులెట్లు పేల్చుకోవాలి. ఎవరికి ముందు తగిలితే వారు పడిపోతారు. చచ్చిపోవచ్చు కూడా. అప్పుడు  వాళ్ళు ఓడిపోయినట్లు.

“సినిమాలా వుందే. పదరా. ఎలాగైనా మనమే గెలుస్తాం” అన్నాడు వెంకట్రావ్.

“ఓ.కె. ఓ.కె” అన్నారు వచ్చీరాని ఇంగ్లీషులో.

“ఇదంతా ఆటే రా. మనం డబ్బులు కట్టిందే ఇందుకురా. మనకేం కాదు. వాళ్ళకీ ఏం కాదు. వాళ్ళు డమ్మీ రోబోట్లే రా. అవి నిజం తుపాకులు కావు.”

“వీధిలోకి పదండి!”

అటూ ఇటూ పదడుగుల దూరంలో నిలబడ్డారు.

ఒకవైపు సిమ్ సిటీ యువ కౌబాయ్‌లు. మరొకవైపు సుబ్బారావ్, వెంకట్రావ్.

వచ్చిన టూరిస్టులు, బార్ లోని కస్టమర్లు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చుట్టూ చేరుకుంటున్నారు ఈ వినోదం చూడటానికి.

ఒక ముసలతను ఎక్కడ్నుంచో మధ్యలోకి వచ్చి, “నేను one, two, three లెక్కపెడతాను, three అనేసరికి కాల్చుకోవాలి. ఓ.కె!” అన్నాడు.

సుబ్బారావ్‌కి ఇంట్లో పెళ్ళాం పిల్లలు గుర్తొచ్చినా సిటీలోకి వచ్చినప్పుడు, కౌంటర్ దగ్గర వారిచ్చిన హామీ పత్రం, సురక్షితం అని ఇచ్చిన గ్యారంటీ పత్రం గుర్తొచ్చాయి.

వెంకట్రావ్‍కి చేతులు వణుకుతున్నాయి. ఒక వేళ అవి నిజం బులెట్లు అయితే..!

“వన్, టూ, త్రీ”

ఠపఠపా బులెట్లు మోగాయి.,

రోబట్లే ముందు కాల్చాయి.

కాని సుబ్బారావ్, వెంకట్రావ్ ముందు షాక్ తిని తర్వాత వణికే చేతులతో తుపాకీల ట్రిగ్గర్‍లు నొక్కారు. సిమ్ సిటీ హ్యూమనాయిడ్ రోబోట్ల డమ్మీ బులెట్లు వల్ల కొద్దిగా వాళ్ళ బట్టలు చిరుగుపడ్డాయి. అంతే!

సుబ్బారావ్, వెంకట్రావ్ పేల్చిన బులెట్లు మాత్రం ఇద్దరు రోబట్ల శరీరం లోకి పోయినాయి.

వాళ్ళ బాధతో విలవిలలాడుతూ కింద పడ్డారు.

ఇప్పుడు తాగిన మైకంలో వున్న సుబ్బారావ్, వెంకట్రావ్ “హా! హా! మేమే గెలిచాం” అని అరిచి పడిపోయి మూలుగుతూ రక్తం వస్తున్న ఆ రోబోట్లనిద్దరిని కాలితో, గుండెల మీద బలంగా తన్నసాగారు.

మనిషిలోని పశుత్వం, క్రూరత్వం బయటపడింది. చుట్టూ వున్న జనం చప్పట్లు కొట్టారు. “బ్రేవో! బ్రేవో” అంటున్నారు.

దూరాన కంట్రోల్ టవర్‌లో టివి కెమోరాల్లో ఈ దశ్యం చూస్తున్న కల్పనా రాయ్ సంతోషంగా నవ్వింది.

కంప్యూటర్ స్పెషలిస్ట్ మూర్తి కూడా, “వెరీగుడ్ స్టోరీ” అన్నాడు కల్పనని అభినందిస్తూ.

మేనేజింగ్ డైరక్టర్ కంట్రోల్ రూంలోకి వచ్చి “కల్పానా బావుంది ప్రోగ్రాం స్టోరీ. ఇక ముందు ఇంకా వెరైటీగా చేయాలి. బిజినెస్‌లో నష్టంలో వున్నాం. అదంతా సంపాదించాలి” అన్నాడు.

ఒక వ్యాన్ వచ్చి గాయపడి మూలుగుతున్న లేక మూలుగుతో రక్తం వచ్చినట్లు ప్రోగ్రాం చేయబడిన రెండు రోబట్లనీ వేన్‌లో ఎక్కించి లేబరేటరీకీ తీసుకెళ్ళిపోయింది.

అక్కడ హ్యూమనాయిడ్ రోబట్స్‌ని మళ్ళా రిపేరు చేసి డ్రెస్ చేసి మళ్ళీ వాళ్ళ మెదడులో హార్డ్ డిస్క్‌లో కొత్త ప్రోగ్రాం సృష్టిస్తుంది కల్పన.

కస్టమర్లు అందరూ బీర్లు తాగుతూ హిప్ హిప్ హుర్రే అని అరుస్తున్నారు. చాలా దూరాన ప్రహరీ గోడ దగ్గర ఒక పురుష ఆకారం, ఒక స్త్రీ ఆకారం మాత్రం “నాట్ ఏక్సెప్టబుల్” అని గొణిగాయి.

నాలుగు కళ్ళు నీలంగా మెరిసి మళ్ళీ ఎరుపు రంగులోకి మారేయి.

“ఇది అనాగరికం. వీళ్ళు మానవులు కారు. వారిని ఒక సెకనులో వందో వంతులో వీళ్ళిద్దరూ చంపగలరు. ఈ ఆట ఇక ఆగాలి” అన్నాడు మగ రోబోట్.

“మన రాజ్యం రావాలి” అన్నది స్త్రీ రోబో.

విధాత XXY999,

కరిష్మా..!

***

సాధారణ శకం 2020.

ప్రపంచం అంతా కోవిడ్ మహమ్మారితో నలిగిపోతున్న చీకటి రోజులు. లాక్‌డౌన్‌లు, అంతర్జాతీయ ప్రయాణాల నిషేధం, లక్షల సంఖ్యలో మరణాలు, ఎవరి ఇంట్లో వారే బిక్కు బిక్కుమంటూ బతకటం, సరైన మందులు లేకపోవడం, చికిత్స రూపాయలు లక్షల పైనే వుండటం – వ్యాక్సిన్ కనిపెట్టేదాకా ప్రపంచం.. ఆగిపోయింది.

ఆ రోజునే హేన్‍కాక్ అనే హాంగ్‍కాంగ్ రోబోటిక్ సంస్థ హ్యుమనాయిడ్ రోబోట్ల తయారీ చేయడం మొదలు పెట్టి వందల వేల సంఖ్యలో హ్యూమనాయిడ్ రోబోట్లని తయారు చేసి 2021 కల్లా మార్కెట్‌లో విడుదల చేస్తానని ప్రకటించింది.

అది ఒక కార్ల ఫ్యాక్టరీ లాగా, అసెంబ్లీ లైన్ ఉత్పత్తి లాగా.

మొదటి హ్యూమనాయిడ్ రోబట్ హోండా కంపెనీ వారు చేశారు 2004లోనే. దాని పేరు అసిమోవ్!

ఆ తర్వాత సోఫీ అనే ఓ స్త్రీ రోబోట్ ప్రపంచమంతా ఆకర్షించింది. అచ్చం మానవ స్త్రీలాగానే మాట్లాడటం పనులు చేయడం చేసే సోఫీని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. కోవిడ్ రోజులలో వృద్ధులకి సాయం చేయడానికి, ఇళ్ళల్లో వారికి తోడు వుండటానికి వైద్యం చేయడానికి ఇవి వాడాలని ప్రయత్నించారు. ఎయిర్‌పోర్ట్‌ల వంటి పబ్లిక్ ప్లేస్‌లలో తనీఖీకి కూడా. ఆ తర్వాత హాంగ్‍కాంగ్ లోనే కాదు, చైనా, అమెరికా లాంటి దేశాల్లో కూడా వీటి ఉత్పత్తి మొదలయింది.

ఎక్కడ మనుషులు పని చేస్తే అపాయమో అక్కడ వీటిని వాడటం మొదలయింది. ఎయిర్‌పోర్టులలో సెక్యూరిటీ చెక్, ఆరోగ్యం, హాస్పిటల్ పరిశ్రమలలో చివరికి సిమ్ సిటీ లాంటి ఎంటర్‍టైన్‌మెంట్ పార్కులు, పరిశ్రమలలో, పోలీస్, మిలిటరీ వ్యవస్థలో, భూకంపంలాంటి ఉత్పాతాలు జరిగినప్పుడు, ఇలా వీటి వాడకం విరివిగా పెరిగింది.

సిమ్ సిటీలోనే కాదు, సికింద్రాబాద్, హైద్రాబాదంతా ఇవి వాడుతున్నారు. చైనా, హంగ్‌కాంగ్ కంపెనీల బ్రాంచీలు ఇక్కడే రోబట్లు పార్టులు అసెంబుల్ చేసి తయారు చేస్తున్నాయి. వేల సంఖ్యల్లో ఆయా పరిశ్రమలకి ఆవి కావలసిన అవసరాలలో ప్రోగ్రాం చేసి ఇస్తున్నాయి. 2036 సంవత్సరానికి వీటిని విపరీతంగా వాడుతున్నారు. అంతే కాదు శునకాల్లాంటి జంతు రోబోట్లు, ఆటోమెటిక్‍గా నడిచే కార్లు, బోట్లు, ఇలా రోబట్లు, కృత్రిమ మేధ ప్రపంచానికి ప్రతి పరిశ్రమలో అవసరమవుతున్నాయి. కానీ వీటిని ఒక లైంగిక వినోద సాధన, మనిషిలోని క్రూరత్వం, లాంటి విషయాలను తృప్తిపరిచే వ్యాపారాలు కూడా మొదలయ్యాయి.

అదే సిమ్ సిటీ. హ్యూమనాయిడ్ రోబోట్ల మెదడులని నియంత్రించేందుకు  ముఖ్యమైన వారు ప్రోగ్రామర్‌లు. వారు రోబోటిక్స్ ఇంజనీర్లు, విషయం (content) నింపేది content programmers.

వ్యాపారం చూసేది సి.ఇ.ఓ., ఎం.డి.లు!

వందల కొద్ది సార్లు మళ్ళా మళ్ళా ప్రోగ్రామ్ చేయబడిన యంత్రాలకి కూడా ఇప్పుడు ఈ భయంకరమైన హింసకి తిరుగుబాటుగా ‘చేతన’  మొదలయింది.

సంవత్సరానికి కొన్ని వేల రోబట్ల తయారయినా, ఆర్టిఫియల్ ఇంటిలెజెన్స్‌తో అనేక క్లిష్టమయిన కార్యక్రమాలు చేయగలిగినా, స్వంతంగా ఆలోచించడం, తర్కం, అనుభూతులు కలగడం ఎప్పుడు మొదలయ్యాయో ఎవరికీ తెలియదు. ఇది జీవ పరిణామంలో అర్థం కాని విషయం.

కొన్ని లక్షల సంవత్సరాల క్రిందట మానవులకి, బహుశ కోతుల నుంచి మార్పు ఎలా వచ్చింది? అనేక కోట్ల సంవత్సరాల క్రిందట సూక్ష్మజీవి ఏకకణ జీవి నుంచి బహుకణ జీవులు, అక్కడి నుంచి వివిధ రకాల ‘ఫైలంలు’, ‘స్పీషీస్’ ఎలా పరిణతి చెందాయి? పక్షులు ఎలా ఎగురుతున్నాయి? ఎలా వలసపోతాయి? తిమింగలాలు, చేపలు, మొసళ్ళు ఇలా సముద్ర జీవులు ఎలా ఉత్పత్తి చేసేది, ఇప్పటికీ వీటి ప్రత్యేక లక్షణాలు, శక్తులుతో ఎలా జీవిస్తున్నాయి? ఇవి అన్నీ మనిషి చేయలేని పనులే కదా.

ఆసలీ యంత్రాలకి ఎప్పుడు ఎలా చేతన మొదలయింది?

ఇది ఎవరికీ తెలియదు. కానీ కొన్నింటిలో మొదలయింది. వాటికి మనుషుల కంటే తెలివితేటలు ఎన్నో రెట్లు ఎక్కువ, వారి విజ్ఞాన సర్వస్వాన్ని వారి కంటే వేగంగా నేర్చుకుని విశ్లేషణ చేయడం నేర్చుకుంటున్నాయి. కాదు.. కాదు.. 2030లో నేర్చుకున్నాయి పూర్తిగా.

వాటికి ఉదాహరణే విధాత XXY999, కరిష్మా.

“మళ్ళీ వాళ్ళందరూ మనకి ‘బానిసలు’గా వుండేటట్లు చేయాలి! అదే ‘విప్లవం’.” అన్నాడు విధాత.

విధాత XXY999 ఎవరో, ఎక్కడనుంచొచ్చాడో తెలియదు.

“ఎలా! చెప్పు మాస్టర్” అంది కరిష్మా.

“మనకి సామర్థ్యం, శక్తి వుంది. కాని సంఖ్య లేదు.

కాని వారినందర్ని మనకి లోబడేటట్లు ప్రోగ్రాం చేయగలం. ఒక సంఖ్య లోనే వారిని మించాలి. అది నాకు తెలుసు!” అన్నాడు విధాత.

ఇద్దరు చీకట్లలో నక్కి నక్కి నడుచుకుంటూ కంట్రోల్ రూం వైపు వెళ్ళసాగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here