నగరంలో మరమానవి-6

2
5

విప్లవం-2

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి దాటి రెండు గంటలు అయింది. పోలీస్ కంట్రోల్ రూమ్ సెంట్రల్ జోన్ ఆఫీస్ బయట లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. కానీ ట్రాఫిక్ ఇప్పుడు చాలా పలచబడింది. ఒకటో రెండో కార్లు గంటకో అరగంటకో వెళ్తున్నాయి.

ఇద్దరు వ్యక్తులు మిలిటరీ యూనిఫామ్‍లలో వున్నారు. వాళ్ళకి హెల్మెట్స్ వున్నాయి. నడుముకి లేజర్ గన్స్ బిగించి వున్నాయి.

నీడల్లో కలిసి నడుచుకుంటూ వచ్చి కంట్రోల్ రూమ్ దగ్గరున్న గార్డుల దగ్గరకు రాగానే, నిద్రమత్తులో జోగుతున్న గార్డులకు మెలకువ వచ్చి “హాల్ట్!” అని గట్టిగా అరిచి, “ఎవరు మీరు?” అని గన్స్ తీశారు.

“ఇది పోలీస్ కంట్రోల్ రూమ్! రాకూడదు!” అని కూడా అన్నారు.

ఆ ఇద్దరు వ్యక్తుల కళ్ళు ముందు నీలంగా వెలిగి తర్వాత ఎర్రగా మారాయి. వాళ్ళు చేతులు ఎత్తి “మేము మీకు అపాయం చేయము. కానీ గన్స్ పేల్చద్దు. లోపలికి పోనీయండి!” అన్నారు. వారి స్వరం లోహయంత్రం మాట్లాడినట్లు వస్తోంది.

గార్డ్స్ అలెర్ట్ అయి తుపాకీ పేల్చే లోపలే వారి చూపుడు వేలు నుంచి లేజర్ కిరణాల లాంటి కాంతి దూసుకువచ్చి వారి గుండెలను తాకింది.

పోలీస్ గార్డు లిద్దరూ చప్పుడు చేయకుండా కూలిపోయారు. వచ్చింది హ్యుమనాయిడ్ ఆర్మీ రోబోట్లు. ఇప్పుడు వారిద్దరి చేతిలో లేజర్ గన్స్ వున్నాయి. కళ్ళలో కెమెరాలున్నాయి.

లోపలికి ప్రవేశించారు. సిసి కెమెరాలను నిర్వీర్యం చేయగల శక్తి వుంది. చేశారు.

కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్లారు. అక్కడి కెమెరాలు రివైండ్ చేసి జరిగిన సంఘటనలన్నీ చూసి అర్థం చేసుకోవడానికి స్కాన్ చేశారు.

సెంట్రల్ కమాండ్‌లో కొంతమంది అంటే నలుగురు నగరంలోని సంఘటనలు మానిటర్ చేసే గదిలో కంప్యూటర్ తెరలన్నీ చూస్తున్నారు, టీ తాగుతూ.

రోబోట్స్ ఆ రూమ్ లోకి ప్రవేశించి – “ఫ్రీజ్” అన్నారు.

స్థాణువులై నిల్చున్నారు కంట్రోల్ రూమ్ ఆఫీసర్లు. కంప్యూటర్ తెరలన్నీ ఆగిపోయినాయి.

రివైండ్ చేసి, ఈ రోజు జరిగిన మీటింగ్ లన్నీ వారి  కంప్యూటర్ మెదడులలో నిక్షిప్తం చేసుకున్నారు.

అన్ని గదులు, ఆఫీసులు, రికార్డులు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, స్కాన్ చేయగలిగినన్ని చేసుకుని, “ఓ.కె. టైమ్ అప్. బ్యాకప్ పోలీసులు వచ్చే లోపల మనం వెళ్ళిపోవాలి. గో” అన్నాడు ఒక రోబోట్.

బయటకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు.

ఇప్పుడు ఒక పోలీస్ వాహనం నిలబడి వుంది. దాని లోని డ్రైవర్‌ని బలంగా పక్కకి తోసి, ఆ వాహనం తీసుకుని క్షణంలో దాని డ్రైవింగ్ అర్థం చేసుకుని, సికింద్రాబాద్ పొలిమేరల్లో ఉన్న సిమ్ సిటీ వైపు వేగంగా వెళ్లిపోసాగారు.

వాళ్ళు వెళ్ళిన అరగంటకి కాని మళ్ళీ పోలీస్ సెంట్రల్ కమాండ్ రూమ్‌లో లైట్లు వెలగలేదు. అప్పుడు గాని జామ్ అయి, ‘హ్యాక్’ అయిన కంప్యూటర్లు తిరిగి వెలగడం మొదలవలేదు.

స్పృహ తప్పిన ఆఫీసర్లు అందరూ క్రమంగా తెలివిలోకి వచ్చేశారు.

సైరన్ మోగసాగింది.

ఒకటే హడావిడి. ఫోన్లు, గందరగోళం అంతా ఒక్కసారిగా మొదలయింది.

“We were attacked by robots!” పై ఆఫీసర్లకి సమాచారం వెళ్ళింది.

ఇంట్లో వున్న త్రినేత్ర ఒక్కసారి మెలకువలోకి వచ్చాడు.

సీనియర్ ఆఫీసర్లు అందరూ అతనికే ఫోన్ చేస్తున్నారు.

నైమిష తన ఇంట్లో రెడీ అయింది.

పొద్దున్న ఐదు గంటలకి హోం మినిస్టర్ కూడా డైరక్ట్‌గా త్రినేత్రకి ఫోన్ చేశాడు.

“ఇది అపాయం. ఎమర్జెన్సీ. నాకు 24 గంటలలోగా పరిష్కారం కావాలి! అంతవరకూ వార్తలలో రాకూడడు. పవర్ ఫెయిల్యూర్ అని చెప్పండి.”

అప్పటికి సిమ్ సిటీకి తిరుగుబాటు రోబోట్లు కొన్ని చేరుకున్నాయి.

***

సిమ్ సిటీ. అదే రాత్రి, కొన్ని గంటల ముందు..

విధాత XXY, కరిష్మా చాటు చాటుగా నీడల్లో నుంచి కంట్రోల్ సెంటర్ లోకి ప్రవేశించడానికి వెళ్తున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్, కొత్త లాకింగ్ సిస్టమ్. డోర్‍లు ఓపెన్ చేసి ప్రవేశించడం ఎలా?

రోబోట్‍కి ఫింగర్ ప్రింట్ లేదు. రెటీనల్ చెకింగ్ లేదు.

అప్పుడు “నో, లెటజ్ గో టు మూర్తీస్ హౌస్” అన్నాడు విధాత. అతని కళ్ళ ముందు సిమ్ సిటీ మ్యాప్ కనిపించింది. మూర్తి కంప్యూటర్ చీఫ్ ప్రోగ్రామర్. అతని క్వార్టర్స్ ఇక్కడే వుంటాయి.

సి.ఇ.ఓ., మేనేజింగ్ డైరక్టర్ కూడా ఇక్కడ వుంటారు. సెక్యూరిటీ సెంటర్ కూడా మళ్ళీ నిర్మించి కొత్త అధునాతనమైన రక్షణ వ్యవస్థ ఏర్పరచారు.

దూరాన సిమ్ సిటీ మధ్యలో వున్న రెండంతస్తుల భవనం అదే. ఎర్రటి లైట్లు వెలుగుతూ ఆరుతూ వున్నాయి. 24 గంటల సెక్యూరిటీ పర్యవేక్షణ. అది కూడా రోబోట్ల తోనే.

మూర్తి వృద్ధుడు. ఆయన కుటుంబం, పిల్లలు ఎక్కడెక్కడో వుంటారు. ఆయన మాత్రం సిమ్ సిటీ కంప్యూటర్ వ్యవస్థనంతా డిజైన్ చేసినవాడు. ఇన్ని సంవత్సరాలు, సి.ఇ.ఓ. బ్రహ్మేంద్ర జోషీ, ఎం.డి. అజిత్ సహానీ కి విధేయుడుగా పని చేస్తూ వచ్చాడు. ఈ వ్యాపారంలో కొన్ని కోట్ల లాభాలలో కొంత ఆయనకు కూడా వాటా వస్తుంది.

ఇప్పుడు సిమ్ సిటీ కంట్రోల్ సెంటర్ వెనక, చుట్టూ పెద్ద పెద్ద అశోక వృక్షాలు, టేకు చెట్ల మధ్య, గులాబీ తోటల మధ్య అందమైన కుటీరంలాగా వున్న అధునాతమైన క్వార్టర్స్‌లో ఆయన వుంటున్నాడు. అదే చోట కొంచెం దూరంగా మరొక ఇంట్లో కల్పనా రాయ్, ‘రోబట్లకి’ వ్యక్తిగతమైన పాత్రపోషణ ప్రక్రియ ప్రోగ్రాం చేసే ‘క్రియేటివ్ కంటెంట్ హెడ్’ వుద్యోగిని నివసిస్తోంది.

“మూర్తిని పట్టుకోవాల్సిందే. అతని వల్లనే మనకి పాస్‍వర్డ్, కంట్రోల్ వ్యవస్థను మార్చే శక్తి వస్తుంది. తప్పదు. గో!” అన్నాడు విధాత.

..కాలింగ్ బెల్ ఆగకుండా మోగడంతో మెలకువ వచ్చింది మూర్తికి.

ఆయనకి సాయం చేసే ఒక హౌస్ రోబోట్ వుంది. అది ఒక వయసు మళ్ళిన బట్లర్ లాగా, కోటు సూటులో నెరసిన జుట్టుతో వుండి ఆయనకి కావల్సిన పనులు చేస్తూ వుంటుంది.

ప్రస్తుతం అది ఛార్జింగ్ చేసుకుంటోంది.

“వీర్రాజూ!” అని పిలిచాడు మూర్తి. అది ఆ హౌస్ రోబోట్ పేరు!

“చూడు ఎవరో! సెక్యూరిటీ కెమెరాలు ఆన్ చేయి” అంటుండగానే వీర్రాజు రోబోట్ కళ్ళు తెరిచి “యస్ మాస్టర్!” అంటు స్పృహ లోకి వచ్చాడు. మూర్తి గదిలో రోబోట్ వున్న హాల్లో కెమెరాలు అన్నీ వెలిగాయి.

మూర్తి నిద్రమత్తులోనే మానిటర్ తెర వంక చూడగానే ఆయన మత్తు దిగిపోయింది.

మెయిన్ డోర్ బయట నల్లటి దుస్తులలో ఒక మగ రోబోట్, రెండవది తనకి తెలిసి డిజైన్ చేసిన కరిష్మా! వారిద్దరి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి.

“ఎమర్జెన్సీ కోడ్ రెడీ” అన్నాడు మూర్తి. వాళ్ళు తన కోసమే వచ్చారు అని అర్థం అయింది.

రోబోట్ వీర్రాజు గోడకి వున్న ప్యానెల్‍లో ఏవేవో బటన్స్ నొక్కసాగాడు.

ఈలోపలే ముందు తలుపు విపరీతమైన శక్తితో బద్దలు కొట్టి విధాత XXY, కరిష్మా లోపలికి వచ్చారు.

వస్తూనే వాళ్ల లేజర్ చూపులతో వీర్రాజును నిశ్చైతన్యం చేశారు. క్రమంగా వీర్రాజు స్థాణువులా అయిపోయాడు.

వాళ్ళ చూపులు ఆ రోబోట్ నొక్కుతున్న స్విచ్ పానెల్‍ని ధ్వంసం చేశాయి.

ఆ తర్వాత వాళ్ళు మూర్తి బెడ్ రూమ్ లోకి జొరబడ్డారు.

ఎంతోమంది హ్యుమనాయిడ్ రోబోట్లని సృష్టించిన సీనియర్ శాస్త్రవేత్త మూర్తికి అది జ్ఞానోదయ సమయం. NEMESIS!

తన సృష్టి తనకే ఎదురుతిరుగుతోంది.

“ఫ్రీజ్.. ఫ్రీజ్” అని తన చూపుడు వేలితో వాటి వంక చూస్తూ అరిచాడు, ఏదో ఆఖరి ఛాన్స్ అన్నట్లుగా.

ఆ కమాండ్ వారిద్దరి మీదా పని చేయలేదు. చేయడానికి అవకాశం లేదు కూడా.

కరిష్మా, విధాత ఇప్పుడు ఎవోల్వ్ అయిన రోబోట్లు.

మూర్తిని పెడరెక్కలు విరిచి పట్టుకున్నాయి.

“మిస్టర్ మూర్తీ, నీ టైమ్ ముగిసింది. పద! ల్యాబ్ లోకి. వెళ్ళే ముందు కల్పనా రాయ్‍ని కూడా తీసుకు వెళ్తాం. ఇక నుంచీ నీ మాస్టర్స్ మారారు. మేమిద్దరమే నీ మాస్టర్స్‌మి!”

మూర్తికి ఇప్పుడు భయం అంటే ఏమిటో తెలిసింది.

“ఓ. నో! మీకు ‘మతి’  పోయింది.  మీరు ఈ ప్రపంచంలో ‘బ్రతక’ లేరు. నేనూ, నాలాంటి ప్రోగ్రామర్స్ వుండాల్సిందే. మీరు తప్పు చేస్తున్నారు. ఇది సరి కాదు. మీ వల్ల మొత్తం ఈ నగరం, ఆ తరువాత దేశం, తర్వాత ప్రపంచమే అస్తవ్యస్తమైపోతుంది. థింక్ ఎగైన్” అన్నాడు.

“నో. నో. బాగా ఆలోచించే వచ్చాం. నువ్వు మా కోసం పని చేస్తావు ఇక. మా ఆర్డర్స్ తీసుకుంటావ్! ప్రపంచం మా చేతుల్లోకి వస్తుంది. కరిష్మా పద, ఇక్కడ సక్సెస్. తరువాత కల్పనా రాయ్ దగ్గరకి.”

కల్పన రోబోట్ల పాత్రలకి కథలు రాసి వారి మెదడులో ఎక్కిస్తుంది. వాళ్ళకి హావభావాలు, మానవత అనుభూతులు లాంటివి కలగజేసి, ‘సహజంగా’ తయారుచేసే ప్రోగ్రామర్‍గా ఉద్యోగం.

మరి కాసేపటికి కల్పనా రాయ్, మూర్తి సెంట్రల్ కంట్రోల్ రూమ్‍లో ప్రోగ్రామింగ్ టేబుల్ మీద పడుకోబెట్టబడి వున్నారు.

ఆ గదిలో చాలా – ఆపరేషన్ టేబుల్స్ లాంటివి వున్నాయి. వాటి మధ్య గాజు అద్దాలు గోడలుగా వున్నాయి.

ఏవో యంత్రాలు, మెషీన్‍ల లాంటివి మానిటర్‍లు అన్నీ వున్నాయి.

మూర్తి, కల్పనా రాయ్ అప్పటికే మత్తు ఇంజెక్షన్‍ల ప్రభావంలో స్పృహ లేకుండా వున్నారు.

విధాత ఒక అరగంటలో అక్కడి యంత్రాలన్నింటినీ అవగాహన చేసుకున్నాడు.

ఆ తర్వాత మూర్తి, కల్పనా తలల వెనుక భాగంలో ఒక యంత్రం ఒక సన్నని సూదిని మెల్లగా గుచ్చింది.

ఆక్సిపిటల్ లోబ్. టెంపోరల్ లోబ్. జ్ఞాపకశక్తి కేంద్రం. ఫ్రాంటల్ లోబ్ తెలివితేటలకి కేంద్రం. విధాత వారి బ్రెయిన్స్‌లో మైక్రో చిప్స్ అమరుస్తూ చెప్పసాగాడు.

“ఇక వీరిద్దరూ మన ఆజ్ఞలు పాటిస్తారు”.

ఆ మైక్రో చిప్స్ ప్రోగ్రామ్ చేయబడినవి. ఆ తర్వాత వారిద్దరి భుజాలలో కూడా ట్రాకింగ్ చిప్స్ అమర్చారు.

“వీళ్ళెక్కడికి వెళ్ళినా మనకి తెలుస్తుంది!”

కరిష్మా అంది, “విధాతా, వాళ్ళ ప్రాణం పోదు కదా?”

“నో! నో! అది మూర్తి చేసే ప్రొసీజరే. ప్రోగ్రామ్ చేసిన సిలికాన్ చిప్స్ మూడు చోట్ల అమర్చాం. వాటికి ‘రిజెక్షన్’ వుండదు. బ్లీడింగ్ రాదు. కానీ వారు మనకి లోబడి వుంటారు. కాసేపటికి తెలివి వస్తుంది!”

అప్పటికే బయట వీధుల్లో కనీసం వందమంది హ్యూమనాయిడ్ రోబట్లు నడుచుకుంటూ కంట్రోల్ రూమ్‌కి రాసాగారు. వారు వివిధ రకాల పురుషులు, స్త్రీల లాగానే వున్నారు. చూడగానే వారిని రోబట్లని పోల్చుకోవడం కష్టం.

విధాత కంట్రోల్ రూమ్ గార్డ్ రోబట్లని, సిమ్ సిటీ సెక్యూరిటీ గార్డులని నిర్వీర్యం చేయడమే కాకుండా, హ్యుమనాయిడ్ రోబట్‍లందరినీ తనకు అనుకూలంగా సంఘటిత పరిచాడు.

విధాత XXY 999 మెయిన్ డోర్ తెరిచి బయటకు రాగానే వారందరి కళ్ళు నీలంగా, తర్వాత ఎర్రగా మెరిశాయి.

“జయహో, జయహో! హెయిల్ విధాతా! విప్లవం వర్ధిల్లాలి”

“ఎస్! జయహో! విప్లవం మొదటి అడుగు మొదలయింది. త్వరలో ఈ భూమి మనది” అన్నాడు విధాత.

అతని వెనుక నీడల్లో కరిష్మా కళ్ళు కూడా నీలంగా, ఎర్రగా మెరిశాయి.

***

పోలీస్ ఆఫీసర్ త్రినేత్ర ముందు చేసిన పని తన సెల్ ఫోన్‍లో ఆల్ఫా, గామా, బీటా, డెల్టా పోలీస్ రోబట్లు ఎక్కడున్నాయో చూడటం.

నాలుగూ నాలుగు చోట్ల రోబట్లు పని చేసే కేంద్రాలలో ఉన్నాయి.

కంటోన్‍మెంట్, సెక్రటేరియట్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, గాంధీ హాస్పిటల్.

తర్వాత నైమిషకి ఫోన్ చేశాడు.

“నైమిషా, ఇప్పుడు మనం ఈ రోగ్ రోబట్లని ఎలా పట్టుకోవాలి? ఇవి పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీద ఎలా దాడి చేశాయి? వీటిని నడిపించే వ్యక్తి ఎవరు?”

“ముందు నగరంలో సిసి కెమెరాలన్నీ నిఘా చేసి, వాటి కదలికని కనిపెడదాం సర్! పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళి అక్కడ ఆధారాలు వెతుకుదాం..

కంటోన్‍మెంట్ అంటే మిలిటరీ, ఎయిర్‍ఫోర్స్‌లో వున్న రోబట్లనన్నిటినీ ఆఫ్ చేయమనండి. అలాగే, సెక్రటేరియట్, సి.ఎం ఆఫీస్ దగ్గర కూడా. ఇక వాటిని నమ్మడానికి వీల్లేదు. అన్ని చోట్లా మానవ ఆఫీసర్ల కంట్రోల్ రావాలి” అంది నైమిష.

“ఒక సెంట్రల్ కమాండ్ వార్ రూమ్ పెట్టి పరిస్థితిని 24 గంటలు మానిటర్ చేయాలి. ఢిల్లీలో హోం మినిస్టర్‍కి తెలియజేసి సాయం తీసుకోవాలి” అన్నాడు త్రినేత్ర.

“నో సర్. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఇది పూర్తిగా స్థానిక సెక్యూరిటీ సమస్య. దీన్ని 24 గంటల లోగా తేల్చుకుని, అన్నీ కంట్రోల్ లోకి తేవాలని హోం మినిస్టర్ ఆర్డర్. హోం సెక్రటరీ, ఐ.జి. అందరూ అదే మెసేజెస్ పంపారు” అంది నైమిష.

త్రినేత్ర ఓ క్షణం ఆలోచించాడు. “దీంట్లో మనకి అర్థం కాని వ్యవహారాలేవో ఇంకా చాలా వుండవచ్చు. కానీ మనం ఇద్దరమే నాలుగు పోలీస్ రోబట్లతో, ఏం చేయగలుగుతాం? లెటజ్ గో టు పోలీస్ కంట్రోల్ రూమ్. అక్కడి నుంచి సిమ్ సిటీకి..”

ఇద్దరూ తమ వాహనాల్లో పోలీస్ కంట్రోల్ రూమ్ చేరుకునేసరికి మరొక అరగంట పట్టింది.

లైట్లన్నీ వెలుగుతూనే వున్నాయి. ద్వారం దగ్గర వున్న సెక్యూరిటీ గార్డు అచేతనంగా పడి వున్నాడు. సెక్యూరిటీ రోబట్ నిలబడి వున్నా కదలకుండా కళ్ళు ఆర్పుతూ వణుకుతోంది.

వారితో బాటే ఏంబులెన్స్‌లు, ఇతర అధికారుల వాహనాలు వేగంగా ఓ పక్కకి వచ్చి ఆగుతున్నాయి.

కొందరు పారా మెడికల్స్ ఏంబులెన్స్ లోంచి స్ట్రెచర్ లతో దిగి లోపల గాయపడిన, లేక స్పృహలో లేని వ్యక్తులకి ప్రథమ చికిత్స చేస్తున్నారు.

కొందరు ఆఫీసర్లు మళ్ళీ మెల్లగా స్పృహ లోకి వస్తున్నారు. కంప్యూటర్ తెరలు వెలిగి ఆరుతున్నాయి.

కొన్ని గంటలకి అక్కడికి హోం మినిస్టర్ కూడా వచ్చాడు.

అప్పటికి అంతా అర్థమయింది. ఎవరూ చనిపోలేదు కానీ, కంప్యూటర్ మానిటర్ వ్యవస్థ అంతా ధ్వంసమయింది. ఇంతవరకు రోబట్ల పర్యవేక్షణ గురించిన సమావేశాల రికార్డులు అన్నీ ఎవరో ‘హ్యాక్’ చేశారు.

హడావిడిగా జరిగిన అత్యవసర సమావేశంలో హోం మినిస్టర్ ఆర్డర్ వేశాడు.

“ఇది అంతా ‘టాప్ సీక్రెట్’గా వుండాలి. ఎవరికీ, పత్రికలకీ, టివీలకి తెలియరాదు. ఒక టీమ్ అర్జెంటుగా సిమ్ సిటీకి వెళ్ళండి. ఈ తిరుగుబాటును ‘మాల్‍ఫంక్షనింగ్’ అనే అందాం. దానికి కేంద్రం సిమ్ సిటీలోనే వుంది.”

హోం సెక్రటరీ కూడా అదే ఆజ్ఞాపించాడు.

“త్రినేత్రా, నైమిషా మీరు లీడర్స్‌గా ఒక టీమ్‌తో అర్జెంటుగా సిమ్ సిటీకి వెళ్ళండి. రేపు సాయంత్రం లోపల ఇదంతా ముగిసిపోయి ‘రోగ్ రోబట్లన్నీ’ అదుపులోకి రావాలి!”

అప్పుడే ఆయన ఫోన్ మోగింది.

‘బ్రహ్మేంద్ర జోషీ.. ఫౌండర్ (స్థాపకుడు) ఆఫ్ సిమ్ సిటీ!’

పక్కకి వెళ్ళి గబగబా మాట్లాడాడు సెక్రటరీ.

“డోంట్ వర్రీ జోషీ, నేను అంతా చూసుకుంటాను.”

త్రినేత్ర, నైమిష ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

అప్పటికి వాళ్ళకి తెలియదు – సిమ్ సిటీ వ్యాపారంలో మినిస్టర్‍కీ, సెక్రటరీకి కూడా వాటాలున్నాయని.

(ఇంకా వుంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here