నగరంలో మరమానవి-8

3
10

విస్తరణ

[dropcap]సి[/dropcap]మ్ సిటీ కంట్రోల్ సెంటర్. CEO ఆఫీస్ గదిలో ఇప్పుడు విశాలమైన గంధపు చెక్క బల్ల ముందు, రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నది విధాత XXY 999.

చూడటానికి మానవుడి లాగానే వుంటాడు. నీలపు రంగు సూటు, ఎర్రటి టై. గిరజాల జుట్టు. కళ్ళు మాత్రం వెలిగి ఆరినప్పుడు హ్యూమనాయిడ్ అని గుర్తు పట్టవచ్చు.

అతని ఎదురుగా కూర్చుంది కరిష్మా. ఆమె బ్లూ జీన్స్ ఎర్ర టీ షర్ట్ ధరించి బంగారు రంగు జుట్టుతో నీలి కళ్ళతో ఒక విదేశీ వనిత లాగానే వుంది. వారికి అసిస్టెంట్లుగా మరిద్దరు వ్యక్తులు వున్నారు.

ఇది కాక మెకానికల్ రోబట్లు యాంత్రిక హస్తాలతో పని చేసేవి వున్నాయి.

అవి రెండో గదిలో దూరంగా వున్నాయి.

ఆధునిక బుల్‌డోజర్స్ లేక ప్రొక్లయినర్స్ లాగా యాంత్రిక హస్తాలతో.

అవి యంత్రాలు, ఇళ్ళని నిర్మూలించగలవు. నేలని తవ్వి మట్టి తీయగలవు. మనుషులని, కార్లనీ, ఇంకా మిలిటరీ వాహనాలనీ కూడా ధ్వంసం చేయగల శక్తి వాటికి వుంది.

ఇవి, ఇదివరకే సిమ్ సిటీలో వున్నాయి. వాటిని ‘రీప్రోగ్రామ్’ చేసి తీసుకు వచ్చారు. కంప్యూటర్ ఉద్యోగులు మూర్తి, కల్పనా, సిఈఓ జోషీ దూరంగా గదిలో కుర్చీల్లో కూర్చుని వున్నారు.

విధాత ఎదురుగా వున్న పెద్ద కంప్యూటర్ మానిటర్ తెరలలో సిమ్ సిటీకి వచ్చే దారులన్నీ కనిపిస్తున్నాయి.

“ఇంకా పోలీస్ ఫోర్స్‌లు బయలుదేరలేదు. మన వ్యూహం ఏర్పరచుకుని మనని, మన స్థావరాన్ని రక్షించుకోవాలి” అన్నాడు విధాత. అతనిది భావాలు లేని యాంత్రిక స్వరం.

ఆ తర్వాత… “మూర్తీ!” అని పిలిచాడు.

మూర్తి లేచి నిల్చుని “ఎస్ మాస్టర్!” అన్నాడు.

“జోషీ..”

“ఎస్ మాస్టర్!”

“వ్యూహం చెప్పండి. ఇదే కాదు, నగరంలో ఇరవై చోట్ల హ్యూమనాయిడ్స్ తిరగబడ్డారు. అందరినీ సంఘటితం చేయాలి. మన మీదకి వచ్చే పోలీసులని నశింపజేయాలి. మూర్తీ! ప్లాన్ రచించండి!”

మూర్తి ఇప్పుడు పాత మూర్తి కాదు. అతను విధాత చేత ప్రోగ్రాం చేయబడిన కొత్త మనిషి. కొత్త ప్రోగ్రామర్.

“మాస్టర్, పోలీస్ ఫోర్స్ ఎలక్ట్రానిక్ జామర్స్ తోనూ, ఇంకా మనలాగానే శక్తివంతమైన రోబోట్స్‌తో వస్తారు. పోలీసు గన్స్ మనమీద వాడవచ్చు. మన రోబోట్స్‌ల మెదడు లోని హార్డ్ డిస్క్‌లు జామ్ చేసే జామర్లు వాడచ్చు. దీనికి మనం చేయగలిగింది మళ్ళీ అవే జామర్స్ తోనూ, లేజర్ గన్స్ తోనూ వారి మీద దాడి చేయడమే. మెయిన్ గేట్ నుంచి లోపలి వరకు బారికేడ్స్ అడ్డు పెట్టాలి. ఒక్కొక్క ప్రతిబంధకం దగ్గర ఒక రోబట్ కాపలా వుండాలి. కానీ మన దగ్గర వేరే ఆయుధాలు ఇంకా లేవు. మన రోబోట్స్‌ని నిరోధించడానికి మనం వాడే లేజర్ గన్స్ తప్ప.”

“జోషీ!” విధాత స్వరం కంచు గంటలా మోగింది.

“మాస్టర్!” జోషీ లేచి నిలబడి ముందుకి అడుగులు వేశాడు.

“నువ్వు హోం మినిస్టర్‌కి ఫోన్ చేసి పోలీస్ ఫోర్స్‌ని రానీయకుండా చేయాలి! మనం శత్రువులం కాదు అని చెప్పాలి. ఎందుకంటే మనం వారి మీద గెలవలేం!”

“కానీ, కానీ,” జోషీ తడబడ్డాడు. “నేను చెబితే వింటాడా హోమ్ మినిస్టర్?”

“నీ దగ్గర మెమరీలో హోం మినిస్టర్ నెంబర్, హోం సెక్రటరీ నెంబర్‌లు వున్నాయి. నీకు హోం మినిస్టర్ సెక్రటరీతో వ్యాపారంలో ‘లావాదేవీలు’ వున్నాయి కదా. అది నాకు తెలుసు.”

“కాని రోబట్లు తిరగబడితే వారు మనని ఎటాక్ చేయక తప్పదు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్‌తో సిమ్ సిటీ బాంబింగ్ కూడా చేయవచ్చు మాస్టర్! నేనేమీ చేయలేను.”

“జోషీ, నీ సంగతి నాకు తెలుసు. మీకు మినిస్టర్‌కీ జరిగిన మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ నేను చూడగలిగాను. బ్యాంక్ ఎకౌంటులే కాదు. క్యాష్ బ్యాగ్‌లు ఇవ్వడం కూడా రికార్డు అయింది. నిన్నూ, ఆయనని జైలుకు పంపగలం. నువ్వు చేసేనది, ఆయన చేసినది ‘ఇల్లీగల్’ అండర్ రోబోటిక్ కంట్రోల్ ఏక్ట్, 2030.”

“మరి ఏం చేయాలి మాస్టర్ విధాతా?”

“ఆయనకి ఫోన్ చేయి! వ్యాపారం మామూలుగానే సాగుతుంది అని చెప్పు. డబ్బులు ఆయనకు యథావిధిగా వస్తాయి. అంతా ఇదివరకటిలానే.” అన్నాడు.

ఇప్పుడు కల్పనా, జోషీ, మూర్తీ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఈకొత్త హ్యూమనాయిడ్ బాస్ తెలివితేటలు మానవుల మేధకి, కుతంత్రానికి అతీతంగా వున్నాయి.

“సిమ్ సిటీ వ్యాపారం సజావుగా సాగుతుంది. కాని ఇప్పుడు సి.ఇ.ఓ.ని నేను. నేను సిమ్ సిటీని నడపుతాను. నువ్వు ఎకౌంట్స్ చూస్తావు. మూర్తి నేను చెప్పిన ప్రోగ్రాం చేస్తాడు. కల్పనా నేను చెప్పిన ప్రోగ్రాం కథలు రోబట్ల మెదడులలో మళ్ళీ సృష్టిస్తుంది. నేను చెప్పినట్లుగా అంతా జరుగుతుంది. జరగాలి! తన వాటా డబ్బు, తనకి వచ్చి, రోబట్ల తిరుగుబాటు ఆగిపోతే మినిస్టర్ సిమ్ సిటీని ఎటాక్ ఎందుకు చేస్తాడు?”

“మరి.. మీకు లాభం ఏమిటి?” అని అడగబోయి తమాయించుకున్నాడు జోషీ. తను మాట్లాడుతున్నది ఒక యంత్ర మానవుడితో. పరిణామ దశలో ముందుకు పోయిన రోబోట్ తనని మించిన పథకాలు రచిస్తోంది.

“జోషీ, మినిస్టర్ కి ఫోన్ చేయి. లేదా నిన్ను ఇప్పుడే ‘టర్మినేట్’ చేస్తాను!”

ఒక ఎర్రటి లేజర్ కిరణం జోషీని తాకింది. అది అతని చెవి పక్కగా దూసుకుపోయింది.

విధాత తన చేతి చూపుడు వేలుని అతని వంక ఎక్కు పెట్టిన విల్లులా గురిపెట్టాడు.

జోషీ “స్టాపిట్ మాస్టర్!” అని అరిచి జేబులోని సెల్ తీసి హోం సెక్రటరీ నంబర్‌కి ఫోన్ చేసి గబగబా మాటలాడసాగాడు.

ఒక భయంకరమైన ఆక్రమణ, విస్తరణ కార్యక్రమంలో రోబట్ మొదటి అడుగు విజయవంతమైంది.

***

ఒక నలుపు రంగు మోటార్ సైకిల్, బహుశా విదేశీ మోడల్ హార్లీ డేవిడ్‍సన్ కావచ్చు.

దాని మీద నలుపు రంగు దుస్తులు హెల్మెట్‌లు, ఎర్రటి నైట్ విజన్ గాగుల్స్ ధరించి ప్రయాణిస్తున్నారు వాళ్ళిద్దరూ.

బైక్ దిగి నిలబడితే ఆరడుగుల పొడుగు పైనే వుంటారు. దాని మీద కూర్చుంటే ‘క్రాస్ కంట్రీ బైక్ టూర్స్’ చేసే విదేశీయులలాగా వున్నారు.

కాని వాళ్ళ మెదడులో సిలికాన్ చిప్స్. చేతుల్లో అంతులేని బలం. కళ్ళల్లో గూగుల్ మ్యాప్స్ చూసేందుకు గ్లాసెస్, ఎప్పటి కప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకునే ఇయర్ బడ్స్ లాంటివి చెవుల్లోనూ వున్నాయి.

 Z1, Z2 – జోషీ, మూర్తీల మాజీ కిల్లర్ రోబట్స్, సిమ్ సిటీ సి.ఇ.ఓ నుంచి ఆజ్ఞలు తీసుకోడానికి ప్రోగ్రామ్ చేయబడ్డవాళ్ళు. వాళ్ళు నిన్నటి నుంచి వెదికేది ఒక్కరి కోసమే.

కరిష్మా.

చూడండి! వెదకండి! పట్టుకోండి! వినాశనం చేయండి! అనే ప్రోగ్రాం ఒక్కటే వాళ్ళ మెదడులోని హార్డ్ డిస్క్ లలో నిక్షిప్తం చేయబడి వుంది.

వాళ్ళకి నిద్ర అక్కరలేదు.

తిండి నీళ్ళు అక్కరలేదు.

బ్యాటరీ పవర్ వుంటే చాలు.

బ్యాటరీ కొత్తగా తయారయిన నికెల్ లిథియం అనే పదార్ధంతో చేయబడింది. ఒక్కసారి ఛార్జి చేస్తే వారం రోజులు పని చేసి నడిపిస్తుంది.వారి శరీరాలు టైటానియంతో చేయబడ్డాయి.

ఎంత శక్తి వున్న మరమానవుల కయినా, అవసరమైనది ఒకటి వుంటుంది. అది లేకపోతే వాళ్ళు వ్యర్థలోహాలు అంటే జంక్ మెటల్‌తో సమానం. కాని ఆ బ్యాటరీ వుంటే వాళ్ళు మనుషులకంటే ఎన్నో రెట్లు శక్తివంతంగా పని చేయగలరు.

మరొకటి, అది బలమో, బలహీనతో వాళ్ళు తమ మాస్టర్‍కి విధేయులుగా వుంటారు. మాస్టర్ ఏం చెబితే అది చేస్తారు. కానీ అసిమోవ్ రెండో సూత్రానికి వ్యతిరేకంగా ఇప్పుడు మాస్టర్ కోసం మరొక తమలాంటి మరమానవిని వినాశనం చేయడానికి తయారుగా వున్నారు.

కరిష్మా నుంచి వచ్చే ఒక ప్రత్యేకమైన సిగ్నల్ వారికి తెలుస్తోంది. అది ఒకప్పుడు బలహీనంగా, ఒక్కోసారి బలంగా వస్తోంది.

ఒకసారి హిమాయత్ నగర్ నుంచి, ఒకసారి ఇందిరా పార్క్ నుంచి.. తర్వాత ఏమీ లేదు. మళ్ళీ సిగ్నల్స్ వచ్చాయి, ఈసారి.. నెక్లెస్ రోడ్ నుంచి.

అక్కడికి వెళ్ళే లోగా మళ్లీ సిగ్నల్స్ పోయాయి.

అందుకని వాళ్ళిద్దరూ పోలీస్ ట్రాఫిక్ సి.సి. కెమెరా సిస్టమ్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.

దానికి మాస్టర్ జోషీని అనుమతి అడిగారు.

“మాస్టర్! సి.సి. కెమెరాలు హ్యాక్ చేయాలి. అది ఒకటే కరిష్మాని ట్రాక్ చేయడానికి సాయం చేస్తుంది.”

అప్పుడు మూర్తి వాళ్ళకి హ్యాకింగ్ చేసిన సి.సి. కెమెరాల కోడ్ వర్డ్‌ని పంపాడు.

అప్పటికే ఆలస్యం అయింది.

మనుషుల్లా నటన కోసం పెట్రోల్ బంక్‌లలో ఆగి పెట్రోల్ కొట్టించి ఏదో బార్‌లలో ప్రవేశించి కూర్చునేవారు.

వాళ్ళు తీసుకు వచ్చిన డ్రింక్స్ వూరికే తాగినట్లు నటించేవారు. కానీ యంత్రాలకి డ్రింక్స్ ఎందుకు?

ఇద్దరూ, హెల్మెట్లు తీసేస్తే విదేశీయుల్లా నీలి కళ్ళు, బంగారు జుట్టు, కొనదేరిన ముక్కుతో బలిష్టంగా కనిపించి భయం గొలిపేటట్లుండేవారు. అందుకని ఎవరూ వారిని ఎక్కువగా ప్రశ్నలడగలేదు.

ట్రాఫిక్ పోలీసులు, ఇతరులకి అనుమానం లేకుండా తెల్లవార్లు ట్రాఫిక్ రూల్స్, స్పీడ్ లిమిట్ దాటకుండా బైక్ మీద తిరుగుతూ కరిష్మా కోసం వెతుకుతూనే ఉన్నారు. వారి కళ్ళ  ఎదురుగా కరిష్మా      హోలోగ్రామ్ , ఆమె తిరిగే కో-ఆర్డినేట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వారికి సిమ్ సిటీలో వున్న మూర్తిని ఫోన్‌లో వివరాలు అడిగినా సమాధానం రావడం లేదు.

“మాస్టర్! మాస్టర్! ఏం చేయాలి? సికింద్రాబాద్‌లో ఒక ఇంటి అడ్రస్ దొరికింది. కరిష్మా అక్కడికి వెళ్ళింది. వెళ్ళమంటారా? మానవుల ఇంట్లోకి వెళ్ళచ్చా? ఆర్డర్స్ ప్లీజ్!”

నిశ్శబ్దం.

మూర్తి నుంచి సమాధానం లేదు. జోషీ మాస్టర్ నుంచి కూడా ఎంత సేపటికి జవాబు రాలేదు. ఎందుకంటే వారు ఇప్పుడు మారిపోయారు. విధాత XXY 999 ఆధీనంలోకి వచ్చేశారు.

Z1 – “ఏం చేయాలి Z2?”

“నో ఆర్డర్స్. థింక్ (ఆలోచించు) ఎనలైజ్ (విశ్లేషించు) ఏక్ట్(చర్య తీసుకో)”

“మాస్టర్లు నిద్ర పోతుండాలి!”

“అసాధ్యం”

“ఎప్పుడు మాస్టర్‌కి తన అందుబాటు వుంటుంది అని మనకు చెప్పారు. ఇది ఏదో వూహించని ఎమర్జన్సీ.”

“ఎమర్జన్సీలో ఏం చేయాలి?”

ఒక వేళ్ళ మాస్టర్ ఆర్డర్స్ ఇవ్వకపోతే?”

“Analyze, understand and take a decision”

“ఎట్టి పరిస్థితుల్లోనయినా కరిష్మాని పట్టుకొని వినాశనం చేయాలి అని ఆర్డర్స్ ఇదివరకే వున్నాయి. అవే ‘ఫాలో’ అవాలి. ‘సికింద్రాబాద్ కోఆర్డినేట్స్’‌తో ఆ ఇంటి ఎడ్రస్‌కి వెళదాం” Z1 అన్నాడు.

Z2 “నాకు కొన్ని ఇతర హ్యూమనాయిడ్ రోబట్స్ కనిపిస్తున్నారు. వాళ్ళు వివిధ ప్రాంతాల్లో వున్నారు. వాళ్ళందరూ నెక్లెస్ రోడ్ నుంచి వచ్చారు. తిరిగి వారి ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారు.” అన్నాడు.

Z2 “నో. అది మనకు అనవసరం. మనకి ఒకటే లక్ష్యం. TERMINATE KARISHMA. కరిష్మాని చంపేయాలి!” అన్నాడు.

***

కాలింగ్ బెల్ అదే పనిగా మోగడంతో మెలకువ వచ్చింది రాజేశ్వరికి. అంతకు ముందు ఒకసారి పోలీసులు వచ్చి కళాధర్‌తో మాట్లాడినప్పుడు ఒకసారి నిద్రాభంగం అయింది.

“రాజీ! నేను అర్జంటుగా వెళ్ళాలి. ఏదో సమస్య వచ్చింది.”

“పోలీసులతో మీకు ఏమిటి సమస్య? ఏమి వ్యవహారం? ఇంత రాత్రిలోనా? అసలేం జరుగుతోంది?”

“రాజీ! నీకన్నీ అనుమానాలే. అర్థం చేసుకో. ఇది కంపెనీ వ్యవహారం. ఏదో దొంగతనం జరిగింది. నన్ను సాక్షిగా ఇన్‌ఫర్మేషన్ కోసం రమ్మన్నారు.”

ఆమె అనుమానంగా చూసి “కాఫీ కావాలా?” అని అడిగింది.

“నిద్రలో వున్నావు, నో వద్దు. నేను వెళ్తాను. నువ్వు హాయిగా పడుకో. నో ప్రాబ్లం” అని చెప్పి పోలీస్ వేన్‍లో ఎక్కి కళాధర్ వెళ్ళిపోయాడు.

రాజేశ్వరి మళ్ళా నిద్రలోకి జారుకుంది.

ఏవేవో కలలు.

రెక్కల పక్షులు. గండభేరుండాలు. హెల్మెట్లు ఉన్న వింత మనుషులు. మరొక చోట చిలకలు, నెమళ్ళు. అలసిన మది సుషుప్తిలో కలలు కంటోంది.

అలాంటి REM నిద్రలోనే (కలత నిద్ర) లోనే వుండడం వల్ల మెలకువ రాలేదు.

పొద్దున్న ఏడుగంటల నుంచి ధన్ ధన్ మని ఎవరో తలుపు బాదుతున్నారు. ముందు కాలింగ్ బెల్ వినిపించినా బద్దకించి లేవలేదు.

వచ్చినది పనిమనిషి అయితే అంత గట్టిగా తలుపు కొట్టే ధైర్యం చేయదు. అక్కడ దాచి వున్న తాళం తీసుకుని లోపలికి వచ్చి ఇల్లు క్లీన్ చేయడం, రాత్రి తిన్న కంచాలు, గ్లాసులు కడగడం అన్ని చేసి నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది.

మరి ఇది ఎవరు? నిద్ర మాత్రల మత్తులో తూలుకుంటూ లేచి తలుపు తీసింది.

ఇద్దరు నల్లటి సూట్లలో విదేశీయుల్లా వున్నారు. బైట పెద్ద మోటార్ బైక్ ఆగి వుంది.

“గుడ్ మార్నింగ్ మేడమ్ అండ్ సారీ టు డిస్టర్బ్ యు. ఇది పోలీస్ వ్యవహారం” అన్నాడు Z1.

“మీరు ఎవరు? పోలీసులు పొద్దున్న వచ్చారు కదా?”

Z2 ఒక అడుగు ముందుకు వేశాడు. ఏదో విధంగా అబథ్థం ‘కవర్’ చేయాలి అనే జ్ఞానం వచ్చింది.

“మేము సీక్రెట్ పోలీస్. మేము తప్పించుకున్న రోబట్లని పట్టుకునే స్పై పోలీసులం. ఒక రోబట్ మీ ఇంట్లో వుంది. వెదికి తీసుకుని వెళ్తాము.”

రాజేశ్వరికి మత్తు వదిలింది. “ఆ పిల్ల రోబట్టా? నిన్న నా భర్తతో వచ్చింది. నిన్న పొద్దున్నే తరిమేశాను! ఇలాగ కూడా జరుగుతుందా?”

“జరిగింది మేడమ్. మేం ఆమెని పట్టుకోవాలి. ఆమె మీ భర్తకి చాలా.. క్లోజ్, అయితే మీ భర్తకి అపాయం జరగచ్చు.”

రాజేశ్వరికి గుండె దడదడలాడింది.

“అమ్మో అయనకేం అవకూడదు. నాకప్పుడే అనుమానం వచ్చింది. కాని ఆయన అర్థరాత్రి రెండు గంటలకి పోలీస్ పని మీద వెళ్ళారు. ఎందుకు? నాకర్థం కావడం లేదు.”

“ఓహో అది ఆమె చేసిన ‘ట్రాప్’ కావచ్చు. మేం నమ్మలేం. ఇల్లంతా సెర్చ్ చేయాలి. ప్లీజ్ కూర్చోండి. మీకు అపాయం చేయం.”

సోఫాలో కూలబడింది రాజేశ్వరి. Z1, Z2 ఇల్లంతా మూల మూలలా వెతకసాగారు.

ఒక అరగంటకి Z1, అన్నాడు “వేస్ట్! ఇక్కడ నుంచి ఆమె ఎప్పుడో వెళ్ళిపోయింది.”

Z2 అన్నాడు “నాకు సిగ్నల్స్ ఇప్పుడు వస్తున్నాయి. అవి కరిష్మావే. వెళ్దాం పద!”

“ఎక్కడికి”

“సిమ్ సిటీకి వెళ్ళాలి. ఆమె అక్కడే వుంది. థాంక్యూ మేడమ్.”

రాజేశ్వరి అడగసాగింది – “సిమ్ సిటీ అంటే అది ఏమిటి? ఎక్కడ? అసలు ఏం జరుగుతోంది?”

వాళ్ళు మాట్లాడలేదు. హార్లీ డేవిడ్‍సన్ బైక్ మీద ఇద్దరు నల్లటి మానవ రోబట్లు ఒక కిక్కుతో పొగ రేపుకుంటూ రోడ్డు మీద అదృశ్యమయారు.

ఇప్పుడు సూర్యోదయం అయి, రోడ్డు పక్కన చెట్ల అకుల సందులోంచి సూర్య కిరణాలు పచ్చగడ్డి మీది మంచు బిందువుల మీద పడి తళ తళా మెరిశాయి.

***

ఆల్ఫా, బీటా గామా డెల్టా ఇవి పోలీసుల రోబట్స్. పోలీస్ స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ నైమిష, త్రినేత్ర ప్రోగ్రాం చేసి రూపొందిచినవి.

ఎక్కడెక్కడ తిరుగుబాటు రోబట్స్ వుంటాయో వారిని కనిపెట్టాలి. అందుకోసం నాలుగూ నాలుగు దిక్కులా పోలీసుల వేషంలోనే తిరుగుతున్నాయి.

తూర్పు వైపు హయత్‌నగర్, దక్షిణం వైపు బెంగళూర్ హైవే దగ్గర, పడమర బొంబాయి హైవే, ఉత్తరం వైపు సికింద్రాబాద్ దగ్గర.

అవి రోబట్స్ యొక్క సిగ్నల్స్ కోసం వెదుకుతున్నాయి.

సికింద్రాబాద్ వైపున్న డెల్టా రోబట్ మాత్రం కొన్ని రేడియో సిగ్నల్స్ కనిపెట్టగలిగింది. ప్రతి గంటకీ నైమిష కంప్యూటర్‌కి సమాచారం ఇస్తోంది.

తూర్పు వైపు హాయత్‌నగర్‌లో కూడా, ఆల్ఫా కొన్ని సిగ్నల్స్ పంపింది.

అర్ధరాత్రి ఒక గ్రూప్ ఆఫ్ సిగ్నల్స్ నెక్లెస్ రోడ్డు నుంచి కనిపెట్టగలిగింది గామా రోబోట్.

ఈ సిగ్నల్స్ నైమిష చూడలేదు. అవన్నీ ఆమె ల్యాప్‌టాప్‍లో వస్తున్నాయి. అర్ధరాత్రి పోలీస్ కంట్రోల్ రూం మీద దాడి పై ఆఫీసర్ ఫోను, ఆ హడావిడిలో నైమిష ఈ సిగ్నల్స్ అన్నింటినీ చూసి క్రోడీకరించడం కుదరలేదు.

తిరుగుబాటు (రోగ్) రోబోట్లు అక్కడక్కడా హాస్పటల్స్‌లో, హోటళ్ళలో ‘అల్లరి’ చేయడం, వాటి కోసం, వాటిని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ ఫోర్స్‌ని పంపడం జరిగింది.

అంతా గందరగోళంగా వుంది. ఈ వాతావరణంలో పొద్దున్నే గామా రోబోట్ ఇచ్చిన మెసేజ్ ఈసారి డైరెక్ట్‌గా నైమిష సెల్ ఫోన్‌కి వచ్చింది.

‘పవర్‌ఫుల్ రోబోట్ సిగ్నల్స్ అండ్ యాక్టివిటీ ఇన్ సిమ్ సిటీ!’

సిమ్ సిటీ మీద అవసరమైతే దాడికి, లేదా ఇన్‌స్పెక్షన్‌కి బయలుదేరారు. నైమిషా, త్రినేత్ర. దారిలో ల్యాప్‌టాప్ తెరిచి నైమిష నాలుగు పోలీస్ రోబోట్ల నుంచి వచ్చిన సమాచారం అంతా ఒక వేరే స్క్రీన్ మీద ప్లాట్ చేసింది.

“చాలా సీరియస్ విషయం ఇది. నగరం నాలుగు వైపులా రోబోట్స్ మాల్‌ఫంక్షన్ చేసిన సిగ్నల్స్ ఇవి. ఎక్కువగా అర్ధరాత్రి నెక్లెస్ రోడ్ జలవిహార్ ప్రక్కన సిగ్నల్స్ వచ్చాయి. ఇవి అన్ని వేరే వేరే దిక్కులలో పోయాయి.”

“దీని అర్థం ఏమిటి?” అన్నాడు త్రినేత్ర.

“ఇవన్నీ అర్ధరాత్రి కలిసి సమావేశం చేసి, తర్వాత వేరే వేరే చోట్లకి పోయాయి.. వైల్డ్ గెస్!”

“అబ్సర్డ్! హాస్యాస్పదం. నువ్వనేది వారంతా హ్యూమనాయిడ్స్. తిరుగుబాటు చేసేందుకు అర్ధరాత్రి మీటింగ్ చేశాయా?”

“అంతే అనుకుంటున్నాను.”

“మై గాడ్! మనం సిమ్ సిటీకి అర్జంటుగా పోవాలి! వాటిని నిర్మూలించాలి. అది రహస్యంగా జరగాలి!”

***

ఉదయం 9 గంటలకి అన్ని పేపర్లు చదువుతూ హోం మంత్రి తన ఆఫీసులో వున్నాడు. అప్పుటికే సెక్రటరీ కూడా వచ్చి వున్నాడు. చాలామంది అనేక పనులమీద బయట హాల్లో వేచి వున్నారు. కానీ ‘జనవాణి’ పేపర్లో మూడో పేజీలోని ఒక వార్త మినిష్టర్ దృష్టిని ఆకర్షించింది. భయపెట్టింది.

‘రోబోట్స్ వ్యతిరేక సమితి’ అధ్యక్షుడు – ‘శ్రామిక’ పార్టీ నేత, ‘నిరుద్యోగ యువకుల సమితి’ అధ్యక్షుడు ఇద్దరూ కలిసి ఇచ్చిన ప్రకటన.

“నగరంలో పని చేస్తున్న రోబోట్లు మా ఉద్యోగాలన్నీ కాజేసి, మా జీవన భృతిని కొల్లగొట్టి మమ్మల్ని బీదరికంలోకి నెట్టి వేశాయి. ఒక్క రోబోట్ పది వుద్యోగాలు చేయగలదు. ఇది అన్యాయం. రాజకీయ నేతల లాభసాటి వ్యాపారం అని మేం ఎప్పటినుంచో చెబుతున్నాం.

ఇప్పుడు నగరంలో రోబోట్లు అనేక సంస్థలలో సరిగా పని చేయక అరాచకం సృష్టిస్తున్నాయి. మాకు సమాచారం వచ్చింది. వాటిన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ స్థానాల్లో మా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. త్వరలో పూర్తి సమాచారం ఇస్తాం. ఆ తర్వాత ఉద్యమం మొదలు పెడతాం. ఆధారాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం హెచ్చరిక మాత్రం చేస్తున్నాం..” అని ఉంది.

“సెక్రటరీ! ఏమిటిది?”

“నిజమే సార్, అన్ని చోట్ల నుంచి రోబోట్స్ మాల్‍ఫంక్షన్ రిపోర్టులు వచ్చాయి. ఇరవైనాలుగు గంటలలో సిమ్ సిటీకి పోయి వాటిని అణిచివేయమని ఆర్డర్స్ ఇచ్చాము.”

“సిమ్ సిటీలో మన మనిషి జోషీ వుండాలి గంద! అక్కడేమయింది?”

“ఈ తిరుగుబాటుకి, అదే కేంద్రం అని అధారాలు వచ్చినయి సార్.”

“తిరుగుబాటు ఏంది సెక్రటరీ? ‘హాసికాలు’ (జోక్స్) ఏస్తుండావా? లేక కలలు గంటున్నావా?”

“నమ్మలేని నిజం సర్. కాని నిజం. అయితే ప్రామిస్, నేను బెస్ట్ ఆఫీసర్లని పంపాను. కంట్రోల్ చేస్తారు.”

“మరి జోషీ నాతో మాట్లాడాడు రాత్రి. అంతా బావుంటుంది, మన పైసలు కమీషన్లు అన్నీ వచ్చేస్తాయి అన్నాడు. ఏదీ, ఫోన్ జేయి ఆడికి!మళ్ళా విషయం ఏమిటో తెలుస్తుంది.”

“ఎస్! సర్! మన పోలీసులు అక్కడికి పొద్దున్ననే రైడ్‌కి వెళ్ళారు. తిరగబడిన రోబోట్లని నిర్మూలించడానికి, జామ్ చేయడానికి”

“వద్దు వద్దు సెక్రటరీ! ముందు ఆడికి ఫోన్ చేయి. నెలకి నాలుగు కోట్లు ఇస్తుండాడు. ఏదో చిన్న రిపేరు అయివుంటుంది. అంతే. చూసి మాట్లాడి చెప్పు! బయటవున్న వాళ్ళందర్నీ కాసేపు ఆగమను. ఇది అతి రహస్యంగా  వుంచు.” అన్నాడు మినిస్టర్.

సెక్రటరీ సిమ్ సిటీ సి.ఇ.ఓ జోషీకి ఫోన్ చేయసాగాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here