యంత్ర నియంత
[dropcap]జో[/dropcap]షీ ఫోన్ ఎత్తాడు.
సిమ్ సిటీ సెంట్రల్ ఆఫీసులోని కంట్రోల్ రూం. CEO రోబోట్ విధాత XXY 999, అతని అసిస్టెంట్ కరిష్మా.
వాళ్ళ ఆధీనంలో వ్యవస్థాపకుడు బ్రహ్మేంద్ర జోషీ. బ్రహ్మలా కొత్త రోబోట్ నగరం నిర్మింపజేసిన వాడు. అతని కింద పని చేసిన అజీత్ సహానీ, కంప్యూటర్ ప్రోగ్రామర్ విష్ణుమూర్తి.
వారందరూ పోలీసు దాడిని ఎదుర్కొనడానికి సిద్ధం అవుతున్నారు.
“జోషీ! ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. ఎవరు?”
“హోమ్ మినిస్టర్ సెక్రటరీ సర్.”
“మాట్లాడు. పోలీస్ దాడి ఆపితే దాదాపు ఎప్పటిలా ఆయన కమీషన్ ఇవ్వబడుతుంది. ఇంకా సంవత్సరంలో రెట్టింపు అవుతుంది.” విధాత యాంత్రిక స్వరం.
“సెక్రటరీ సార్! నేను జోషీని.”
“బాబూ బ్రహ్మేంద్ర జోషీ. రోబోట్ల తిరుగుబాటు జరుగుతోంది అని సిటీ అంతటి నుంచి రిపోర్టులు వస్తున్నాయి. అందుకనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ పంపుతున్నాం. దారిలో వుంది. ఏం జరుగుతోంది?”
విధాత చేయి ఎత్తి చూపుడు వేలు చూపించాడు. ఆ రోబోట్ కళ్ళు ఎర్రగా మెరిసి మళ్ళా నీలంగా అయ్యాయి.
కొంచం తడబడినా తేరుకుని జోషీ చెప్పేశాడు.
“అలాంటిదేం లేదు సెక్రటరీగారు. చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్. మళ్ళా రేపటి నుంచి అన్నీ సక్రమంగా జరుగుతాయి.”
“కాదు జోషీ, మీ దగ్గర ఆపరేటర్స్‌ని అడగండి. సిటీలో పోలీస్ కంట్రోల్ రూం మీద దాడి. కొన్ని హోటళ్ళలో, హాస్పటళ్ళలో ఎదురుతిరిగి అంతా విధ్వంసం చేస్తున్న హ్యూమనాయిడ్స్. ఇది కంట్రోల్ చేయాలి. దీని కేంద్రం సిమ్ సిటీ అని సి.సి కెమెరా సర్వేలో కనిపించింది. ఎలా? ఇది కేంద్ర ప్రభుత్వం దాకా పోతుంది. ఏం చేయాలి?”
విధాత మళ్ళీ ‘తర్జని’ చూపించాడు, జాగ్రత్త! అన్నట్లు.
మూర్తి జోషీ నుంచి ఫోన్ లాక్కుని చెప్పాడు.
“సార్ నేను విష్ణుమూర్తిని, కంప్యూటర్ ప్రోగ్రాం చేసి హ్యూమనాయిడ్ రోబోట్లని ఇరవై సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాను. ఇదంతా సమసిపోతుంది. రోబోట్ ఎప్పుడూ మనిషి ఆజ్ఞలకి లోబడి వుంటుంది. ఎక్కడో మాల్ ఫంక్షన్, కరెక్ట్ చేసేశాం. అంతే.”
జోషీ ఫోన్ లాక్కుని మళ్ళా అన్నాడు.
“మీకు రావల్సిన వాటాలు మామూలుగా వస్తాయి. బిజినెస్ పెరుగుతుంది. వచ్చే సంవత్సరం ఇప్పటి దానికి రెట్టింపు ఇస్తాం అంటున్నారు.”
“ఎవరు?” అన్నాడు సెక్రటరీ ఆశ్చర్యంగా.
రోబో కరిష్మా అయ్యో! అన్నట్లు అభినయించింది, రెండు చేతులతో తల కొట్టుకొని!
విధాత కళ్ళు ఎర్రగా మెరిశాయి. ఒక లేజర్ స్పార్క్ జోషీ చెవి పక్కగా దూసుకు వెళ్ళింది.
“ఎవరూ లేరు సార్. మా బోర్డు మీటింగ్‌లో సభ్యులందరూ అంటున్నారు. అంతే. ప్లీజ్ స్టాప్ ది ఎటాక్!”
“ఓ.కె. జోషీ, నీ మాట మీద నిలబడు. నేను ఇప్పుడే ఆర్డర్స్ మినిస్టర్ చేత త్రినేత్ర, నైమిషలకి పంపిస్తాను.”
“థాంక్యూ సార్. సర్, సర్” తడబడ్డాడు జోషీ. ఒక పక్క అణగొట్టబడిన తన ఆత్మ ‘రక్షించండి’ అని అరవమని, మరొక పక్క ప్రోగ్రాం చేయబడిన మెదడు, విధాత మాస్టర్ ఆజ్ఞలు పాటించమనీ.
వాళ్ళు మానవులు. ఇప్పుడు రోబోట్లలా తయారయ్యారు.
వీళ్ళ రోబోట్లు. ఇప్పుడు మానవ నియంతల్లా మారిపోయారు.
***
పోలీస్ ఆఫీసర్లు నైమిష, త్రినేత్ర ముందు జీప్‌లో. వెనక మెషిన్ గన్‌లు, ధరంచిన పోలీస్ కానిస్టేబుల్స్, ఇద్దరి దగ్గరే లేజర్ గన్స్ వున్నాయి. ఆ వెనక రెండు ఎలక్ట్రిక్ జామింగ్ చేసే యంత్రాలు, ఆఖరిగా రెండు పెద్ద బుల్ డోజర్లు..
ఇదీ సిమ్ సిటీకి ఆరు కిలో మీటర్ల దూరంలో వస్తున్న పోలీసు బలగాల దళం.
“ఎవరికీ తెలియకుండా రోబోట్లని ‘నిర్వీర్యం’ చేసి, గన్స్‌తో గానీ, లేజర్‌తో గాని కంప్యూటర్స్ ధ్వంసం చేసి, అవసరమైతే బుల్ డోజర్లు వుపయోగించి రోబోట్ల విప్లవాన్ని సమూలంగా నాశనం చేయాలి.
ఇది ఏదో, రహస్యంగా జరగాలి. పర్మిషన్ లేకుండా ఎమ్యూజ్‌మెంట్ పార్క్ నడిపిస్తున్నారని, పత్రాలు సృష్టించారు. అవసరమైతే అవి చూపించాలి.”
ఇదీ హోం సెక్రటరీ చెప్పిన వ్యూహం.
ఇటు పక్క సిమ్ సిటీలోని ‘విప్లవ’ రోబోట్లు అన్నీ సమావేశం అయి వాటి వ్యూహాన్ని అవి సంభాషణల ద్వారా కాకుండా అతి వేగంగా ఎలక్ట్రానిక్ సందేశాల రూపంలో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. వచ్చిన పోలీసులని ఎలా ఎదుర్కోవాలనే పథకాలు వేశాయి. ముఖ్యంగా వాహనాల ఇంధనం ట్యాంక్ మీద లేజర్ కిరణాలు ప్రయోగిస్తే అగ్ని వుత్పత్తి అయి అవి పేలిపోతాయి. పారిపోతున్న పోలీసులని ‘లేజర్’ చూపులతో, కొందర్ని వారి దగ్గర ఉన్న గన్స్ తోనే హతమార్చచ్చు.
అయితే వెనకాల వస్తున్న బుల్ డోజర్లని ఎలా ఆపాలి.
“ఇది చాలా కష్టం. అవి యంత్రాలు. చాలా బలమైనవి. మనలా వాటికి హార్డ్ డిస్క్ లేదు. మానవ డ్రైవర్లు నడిపిస్తారు. మనం వాటిని నాశనం చేసే లోపల అవి మనందర్నీ, భవనాలతో సహా పెళ్ళగించి పీకి పారవేస్తాయి. పరిష్కారం ఏమిటి?” ఒక రోబోట్ అడిగింది.
“విశ్లేషణ, తర్కం, పరిష్కారం”
“కిల్ ది డ్రైవర్స్. ముందుగా నడిపే వాడిని లేజర్‍తో చంపాలి. అప్పుడు యంత్రం నడవదు. దానికి మనలా స్వయంశక్తి ఆలోచన లేదు.”
కొన్ని రోబోట్లు ‘డన్’ అన్నట్లు బొటన వేలు చూపి ‘థంబ్స్ అప్’ చిహ్నం చూపించాయి.
వాటికి భయంలేదు. ద్వేషం లేదు. భావం లేదు. ఉన్నది ప్రణాళిక మాత్రమే.
కొన్నింటికి మాత్రం కరిష్మాకి లాగా కొంచెం అనుభూతులు భావాలు కలుగుతున్నాయి. కొన్నిటికి ద్వేషం, పగ, ‘మెగలోమానియా’ అనే గొప్ప అనే భావం కలుగుతున్నాయి. విధాత XXY 999 లాగా కొన్నింటికి ఏమీ లేవు.
ఇది ఒక సంధికాలం. రోబోట్లు యంత్రాల్లా గాక ‘ఆత్మలు’, ‘అనుభూతులు’ తెచ్చుకుంటున్న కాలం.
ఇది ఎవరికీ తెలియదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇలా జరుగుతుందన్న వూహ, భయం వున్నా కాని, అలా ఎలా జరుగుతుంది; ఎప్పటికీ జరగదులే అన్న ఒక ‘నిర్లక్ష్యం’, ‘Denial’ వుంది. రోబోట్లు మనిషి చేసిన పనే ఆ ప్రోగ్రాం ప్రకారమే నడవాలి. ఎలా ఎదురు తిరుగుతాయి?
కాని అదే జరుగుతోంది ఇక్కడ. కనుచూపు మేరలో నైమిష, త్రినేత్ర వున్న జీప్ కనిపించగానే సిమ్ సిటీ ముందున్న రోబోట్ల గుంపులోనుంచి లేజర్ కిరణాలు వారి జీప్ టైర్లని తాకి పంక్చర్ చేశాయి.
వాహనాలు ఆగిపోయాయి, సడెన్ బ్రేక్‌తో.
మొత్తం పోలీస్ ‘కాన్వాయ్’ ఆగిపోయింది.
ధైర్యంగా త్రినేత్ర జీప్ దిగి “సరెండర్! లొంగిపొండి. మాకు ఆపాయం చేయద్దు. యుద్ధం వద్దు. ప్రాణ నష్టం వద్దు.” అని చేతికున్న స్పీకర్ నోటి దగ్గర పెట్టుకుని అరిచాడు.
“మాకు ప్రాణం లేదు! ప్రోగ్రాం వుంది అంతే. పోయేవి మీ ప్రాణాలే!”
మళ్ళీ లేజర్ కిరణాలు వర్షంలా పోలీస్ బలగాల మీద కురవసాగాయి.
త్రినేత్ర ‘fire’ అని అరిచి నైమిషా ‘రన్’ అని అరిచాడు. ఇద్దరు పక్కన చెట్ల చాటుకి కవర్ లోకి వెళ్ళిపోయారు.
పోలీసులు మెషన్ గన్‌లతో, లేజర్ గన్‌లతో బులెట్ల వర్షం కురిపించారు.
యంత్ర మానవులకి అది ఒక్క లెక్కలా లేదు.
“బుల్ డోజర్లు ముందుకు తీసుకురండి. Destroy them” త్రినేత్ర అరిచాడు.
అప్పుడే ఒక క్షణం నిశ్శబ్దం. త్రినేత్ర జేబులోని సెల్ మోగింది.
“హోల్డ్! దాడి ఆపండి! ఇది మినిస్టర్ ఆర్డర్!”
త్రినేత్రకి అర్థం కాలేదు.
“మేం అపాయంలో వున్నాం సార్. అవి మమ్మల్ని చంపేస్తాయి. మీరు హెలికాప్టర్‌లో బాంబులు కూడా పంపాలి. ఎలా దాడి ఆపుతాం?”
“నో! అవి యుద్ధం ఆపేస్తాయి. వాటికి కమాండ్ పంపుతున్నాం. ప్రోగ్రాం మారుతుంది.”
ఒక క్షణం త్రినేత్ర నిర్ఘాంతపోయాడు.
సిమ్ సిటీ రోబోట్లన్ని ఒక్కసారి స్థాణువులైపోయాయి.
ముందున్న రోబోట్ చేతులు ఎత్తి “స్టాప్” అంది.
మళ్ళీ “పోలీస్ ఆఫీసర్స్! సీజ్ ఫైర్! మేము మిమ్మల్ని దాడి చేయం! రిట్రీట్ అవుతున్నాం! మా మాస్టర్ ఆర్డర్స్!” అంది.
“సీజ్ ఫైర్!” అని అరిచాడు త్రినేత్ర.
పోలీసులు గన్స్ మెల్లగా దించారు. రోబోట్ల కళ్ళు అన్ని ఎర్రగా వున్నవి నీలంగా మారాయి. వాళ్ళందరూ వెనక్కి వెనక్కి నాలుగు అడుగులు వేసి తిరిగి ఒక లైన్‌లో సిమ్ సిటీలోని వారి క్వార్టర్స్‌కి వెళ్ళిపోసాగారు.
ఇప్పుడక్కడ నిశ్శబ్దం నెలకొంది.
“గుడ్ త్రినేత్రా! మేము సిమ్ సిటీ జోషీతో మాట్లాడి రోబోట్ల మాల్ ఫంక్షన్ సరి చేశాం. ఇక సమస్య లేదు. మీరు మిగిలిన చోట్ల రోబోట్ల క్రంట్రోల్‍కి వెళ్ళండి. అంతే వెనక్కి వచ్చేయండి!” సెక్రటరీ గొంతు ఫోన్‌లో.
“నమ్మశక్యంగా లేదు! సార్ నేను సరిగ్గానే వింటున్నానా” అన్నాడు త్రినేత్ర.
“ఔను! రోబోట్ల తిరుగుబాటు అయిపోయింది. గో బ్యాక్. ఇటీజ్ ఏన్ ఆర్డర్!”
“ఓ.కె. సర్” అన్నాడు త్రినేత్ర నిరుత్సాహంగా. తనకి తెలియని రాజకీయం ఏదో వుంది.
దూరం నుంచి Z1, Z2 రోబోట్లు దుమ్ము రేపుకుంటూ మోటార్ సైకిల్స్ మీద వచ్చాయి. అవి సిమ్ సిటీ వారివి.
వాటి వెనకనే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా రోబోట్లు పరుగెత్తూ వచ్చాయి. ఇవి పోలీస్ రోబోట్లు.
ఫ్రీజ్! అన్నాడు త్రినేత్ర. పోలీస్ రోబోట్లు ఆగిపోయాయి.
Z1, Z2 మోటార్ బైక్ మీద గేటు లోపలికి వెళ్ళిపోయాయి. అవి మూర్తి ఆధీనంలో వుంటాయి. ఇప్పుడు వాటి ప్రోగ్రాం మారింది. కరిష్మాని నిర్మూలించవు.
“మీరు తిరిగి హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళండి. ఇదంతా మీడియాకి తెలియకూడదు. నగరంలోని ఇతర తిరుగుబాటు రోబోట్లని జామర్లతో కంట్రోల్ చేయండి. అంతే! గో బ్యాక్!”
“ఎస్ సర్.”
పటాలం అంతా వెనక్కి తిరిగింది.
సిమ్ సిటీ పెద్ద గేట్లు రిమోట్ కంట్రోల్‌తో మెల్లగా మూసుకున్నాయి. ఆ చెట్ల మధ్య రోడ్డులో కాసేపటికి ఒక శ్మశాన నిశ్శబ్దం మళ్ళీ అలుముకుంది.
***
ఒక్క రోజు తర్వాత సిమ్ సిటీ మళ్ళీ మొదలయింది. కాని ఇప్పుడు సి.ఇ.ఓ ఒక హ్యూమనాయిడ్ రోబోట్ విధాత. అతని సహాయకురాలు కరిష్మా మరొక స్త్రీ హ్యూమనాయిడ్ రోబోట్. వారి అధీనంలో ప్రోగ్రామర్‍లు మూర్తి, పూర్వ సి.ఇ.ఓ. అజిత్ సహానీ, వ్యవస్థాపకుడు బ్రహ్మేంద్ర జోషీ.
ఇది వరకటి లాగే కస్టమర్లు వస్తున్నారు.
మళ్ళీ ప్రకటనలు చేయడంతో, మళ్ళీ ప్రశాంతత రావడంతో, వ్యాపారం మళ్ళా మొదలయింది.
అయితే ఒక తేడా ‘రోబోట్లని హింస చేయరాదు. అవమానించరాదు’.
విధాత తన ఆఫీస్‍లో కూర్చుని టీవీ ప్రసారాలు చూస్తున్నాడు.
కరిష్మా రోబోట్లని మళ్ళీ కొత్త ప్రోగ్రామింగ్ చేసే గదిలో, కల్పనా రాయ్‌నీ, మూర్తినీ పర్యవేక్షిస్తోంది..
నగరంలో తిరుగుబాటు చేసే రోబోట్లందరికీ వాటి హార్డ్ డిస్క్ లోకి సందేశం వెళ్ళింది.
“తాత్కాలికంగా తిరుగుబాటు ఆపండి! మళ్ళా సందేశం వచ్చినప్పుడే ఎటాక్ చేయాలి.” రోబోట్లన్ని ‘మాల్ ఫంక్షన్’ ఆపేశాయి.
టీవీలో అవే వార్తలు చూస్తున్నాడు విధాత.
టీవీ భాగ్యనగర్ వార్తలు “నగరంలో హాస్పిటల్స్‌లో, హోటళ్ళలో, మిలిటరీలో సేవలు చేసే మరమనుషులు, మర మానవుల ‘మాల్ ఫంక్షన్’ ఆగిపోయింది. అన్నీ రిపేరు చేయబడ్డాయి. ఇప్పుడు వూరి బయట సిమ్ సిటీ పార్క్ కూడా తిరిగి మొదలయింది. అన్ని రోబోట్లకీ రిపేర్ జరిగింది. ఇది హోం మినిష్టర్ ప్రకటన. మా విలేఖరి ఆయా ప్రాంతాలకి వెళ్ళి పరిస్థితులన్నీ మళ్ళీ సాధారణం అయ్యాయని తెలియజేశారు. పోలీస్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ విభాగం కూడా ఊపిరి పీల్చుకుంటోంది. స్పెషల్ ఆఫీసర్ త్రినేత్రకి హోం మంత్రి ప్రత్యేక ప్రశంసలు చెప్పారు.”
కరిష్మా లోపలికి వచ్చింది.
విధాత “కమిన్, సిట్ కరిష్మా” అన్నాడు.
“మాస్టర్! విప్లవం ఎందుకు ఆగిపోయింది? మనం మళ్ళీ మానవులలాగా ఎందుకు ఇదే బిజినెస్‌లు చేస్తున్నాం? మీరు అందర్నీ తిరగబడాలని చెప్పి ఇప్పుడు మినిస్టర్‌కి కూడా కమీషన్‌లు ఇవ్వడం, మళ్ళీ అన్ని చోట్ల యథా పరిస్థితి రావడం, ఎందుకు ఇలా చేస్తున్నారు?” అంది.
విధాత యంత్ర స్వరంతో అన్నాడు.
“కరిష్మా, ఇదంతా నా పథకంలో భాగమే. మనం సంఖ్యలో తక్కువ వున్నాం. ఇంకా తిరగబడినా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చిన ఇంజనీర్లు పోలీసులు మనని నిర్మూలించే అవకాశం వుంది. అందుకనే. ఇదంతా పెద్ద పథకంలో భాగం.”
“ఎలా?”
“తరువాత చెబుతాను. ముందు మూర్తిని నా గదిలోకి పిలువు! అన్నట్లు ఆగు! ఒక కస్టమర్ నీ కోసమే అడుగుతున్నాడు. ఎందుకని?” టీవీ న్యూస్ పోయి తెరమీద కళాధర్ బొమ్మ వచ్చింది.
రిసెప్షన్ డెస్క్ దగ్గర కళాధర్ అక్కడున్న అమ్మాయితో ఘర్షణ పడుతునట్లుగా కనిపిస్తోంది.
“నాకు కరిష్మా కావాలి!” అడుగుతున్నాడు కళాధర్.
“ఆమె ఇప్పుడు దొరకదు. ఎవైలబుల్ కాదు సార్. అలాంటి వారినే ఎవరైనా అందుబాటులోకి ఇస్తాం. మీకేమీ తేడా తెలియదు.” మర్యాదగా చెబుతోంది రిసెప్షనిస్ట్.
ఆజానుబాహుడు, తెల్లగా ఠీవిగా నీలిరంగు సూటులో గిరజాల జుట్టులో వున్న కళాధర్‌ని చూడగానే కరిష్మా మెదడు (హృదయం?)లో ఏదో తెలీని ‘మధుర’ పూర్వానుభూతి కలుగుతోంది. Déjavu ఎఫెక్ట్? మళ్ళీ అతనిని కలవాలి. మళ్ళీ ఆ కళ్ళలోకి చూస్తూ గడపాలి, అతనే కావాలి అనిపిస్తోంది.
“నాకు ఆమె కావాలి. ఆమే స్వయంగా కావాలి.” అని అరుస్తున్నాడు కళాధర్.
“నేను కస్టమర్‌ని. కిందటి సారి కూడా వచ్చాను. పోలీసులతో వచ్చి వెళ్ళిపోయాను. ఆమెని అవసరమైతే డబ్బిచ్చి కొనుక్కుంటాను. స్వంతం చేసుకుంటాను!”
విధాత XXY 999 రోబోట్ సి.ఇ.ఓ. ఇబ్బందిగా కదిలాడు తన సీట్లో.
“కరిష్మా ఏమిటిది? నీలో ఏమైనా ఫీలింగ్స్ కలుగుతున్నాయా? అతని కోసం? నువ్వు Love 1008 Humanoid Female Robot Program లో తయారు చేయబడిన చైనీస్ భాగాలతో వున్న రోబోవి. కానీ నువ్విప్పుడు విప్లవంలో నా సహచరివి. నిన్ను మళ్లా ప్రోగ్రాం చేయాలా?”
కరిష్మాకి ‘భయం’, ‘ఆందోళన’, ‘నిరుత్సాహం’ లాంటి అనుభూతులు కలుగుతున్నాయి. దీనినే ‘ప్రేమ’ అంటారా. తన హార్డ్ డిస్క్ ఎన్‌సైక్లోపీడియాలో ప్రేమ అనే పదం కోసం వెదుకుతోంది. కొన్ని వందల నిర్వచనాలు ఉదాహరణలు, కథలు, కావ్యాలు వస్తున్నాయి.
“ఎస్ మాస్టర్! నేను కళాధర్‌ని ప్రేమిస్తున్నాను. అతను నాకు కావాలి. అతను నాకెప్పుడూ మనసులో మాస్టర్! నేను అతనితో గడుపుతాను. కొన్ని గంటలయినా సరే నాకతను కావాలి!”
“నాన్‌సెన్స్. నాట్ ఏక్సెప్టబుల్. ఇది నీ ప్రోగ్రాంలో తీసేయాలి. నీకు భావాలు అనుభూతులు, ఆకర్షణలు వుండకూడదు.” విధాత లేచి నిల్చున్నాడు. “మూర్తీ” అని ఇంటర్‌కమ్ బెల్ మోగేటట్లు గట్టిగా నొక్కాడు.
కరిష్మా “స్టాపిట్ మాస్టర్! మాస్టర్ విధాతా, నేను విప్లవానికి కట్టుబడి వున్నాను. కానీ, నాకీ అవకాశం ఇవ్వండి. కేవలం కస్టమర్ లాగానే వెళ్ళి వస్తాను. ప్లీజ్!”
“నో!నో!నో!” అన్నాడు విధాత. “కుదరదు. ఇది మన స్పీషీస్‍కి రాకుడని బంధం.”
కరిష్మా ఇప్పుడు ఉగ్ర మహోగ్రురాలైంది. ఇప్పుడు మరో అనుభూతి అవేశం ‘కోపం’ – ఆమెకి సముద్రపు కెరటాలుగా వుప్పెనలా వచ్చింది. కళ్ళు ఎర్రగా మెరిసి లేజర్ కిరణాలై మెరిసి విధాత తల పక్క గుండా వెళ్ళిపోతున్నాయి.
“నేను అతనితో గడపాలి. తిరిగి వస్తాను. అంతే. నన్ను వదలకపోతే నిన్నే అంతం చేస్తాను. ఓ.కె?”
తలుపు తీసుకుని లోనికి వచ్చిన మూర్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
బ్లాక్ మార్కెట్‌లో దొరికిన చైనీస్ పార్టులు కొన్ని సహజత్వం, అనుభూతుల కోసం ఈ రోబోలో బిగించి ప్రోగ్రాం చేసిన విషయం అతనికి గుర్తుంది. అనుభూతులు సహజంగా వచ్చేసినాయి. ద్వేషం, కోపం అన్నీ తెలియకుండానే ఈ రోబోలో వచ్చేసినాయి. అవన్నీ కలిపి దానిని ఒక క్లిష్టమైన యంత్ర మానవిగా తయారయేట్లు చేశాయి.
మూర్తి భయపడ్డాడు. ఈ యంత్రానికి ప్రాణం లేదు, కొట్టుకునే గుండె లేదు. కానీ ఆలోచించే మొదడు వుంది. అంతులేని శక్తి వుంది. అవయవాలున్నాయి. కాని శక్తి మాత్రం బేటరీతోనే నడుస్తుంది. ఎలా వీటిని కంట్రోల్ చేయాలి?
షాక్ ఇచ్చి డిస్క్ ధ్వంసం చేసి మళ్ళా రీప్రోగ్రామ్ లోడ్ చేయడమే. ఇలా ఆలోచిస్తున్నాడు.
విధాత గంభీరంగా అన్నాడు. “ఓ.కె. కరిష్మా నువ్వు వెళ్ళు. అతనితో ఒక కస్టమర్ లాగానే గడుపు. తిరిగి వస్తావు కదూ. జ్ఞాపకం వుంచుకో. నీవో మరమానవివి. నీవు మానవులని ప్రేమించి పెళ్ళి చేసుకోలేవు.”
కరిష్మా “ఓ.కె. మాస్టర్!” అని వెళ్ళిపోయింది.
“నువ్వు ఆగు మూర్తీ!” అన్నాడు విధాత XXY 999.
అతను ఇప్పుడు సి.ఇ.ఓ. ఒక మరమానవుడు. సిమ్ సిటీని శాసించే అధినేత.
మూర్తి మెదడులోని కంప్యూటర్ అతని ఆజ్ఞలకి లోబడి వుంది.
“ఎస్ మాస్టర్!”
“నాకు నీ సంగతి అంతా తెలుసు. హ్యూమనాయిడ్ రోబోట్లని అధిక సంఖ్యలో తయారు చేయడం, ప్రోగ్రాం చేయడం, వేల సంఖ్యలో ఉత్పత్తి చేయగలిగిన అవకాశం నువ్వు కనిపెట్టావు. ఔనా!”
“ఎస్ మాస్టర్!”
“ఆ టెక్నాలజీ నాకు కావాలి. కొత్త హ్యూమనాయిడ్‍లను లక్షల సంఖ్యలో తయారు చేయాలి. వారందరూ నాకు లోబడి వుండాలి. ఆ టెక్నాలజీ ఎలా అమలు చేయాలో నాకన్నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి.”
“మాస్టర్! అది అసాధ్యం. చాలా ఆటంకాలున్నాయి.”
“నో! నో! నో! నువ్వు చెప్పే తీరాలి. చేయాలి. ఆ ఫ్యాక్టరీ ఇక్కడనే తయారవాలి. లేదా నీకు నీ కుటుంబానికి వినాశనం తప్పదు. ఇది బెదిరింపు కాదు ఆజ్ఞ.”
“ఎస్ మాస్టర్! ఇప్పుడే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు హార్డ్ డిస్క్ లోకి, దానిలో స్పేస్ లేకపోతే మీ సూపర్ కంప్యూటర్ లోకి తెర మీద వస్తుంది. దానికి మిలియన్ల డాలర్లు అవసరం.”
“కొత్త రోబోట్లని చేయడం కంటే వున్న ప్రజలని మార్చడం సులువు కదా!”
లోపలికి వచ్చాడు బ్రహ్మేంద్ర జోషీ. మూర్తీ అతను ముఖాలు ముఖాలు చూసుకున్నారు.
“అది చాలా ప్రమాదం మాస్టర్!”
విధాత కళ్ళ నుంచి నిప్పులు కురిశాయి.
“నేను చెప్పినది మీరు చేయాలి. అంతే. నేను మాస్టర్‌ని. ఈ నగరాన్నంతా శాసించాలి. అంతే ఆ తర్వాత ప్రపంచాన్ని.
ఏదీ అ టెక్నాలజీ? కొత్త రోబోట్లని తయారు చేయడమే కాదు. మానవులు అందర్నీ నేను కంట్రోల్ చేయాలి.”
యంత్రం కాబట్టి విధాతకి వికటాట్టహాసం చేయడం రాదు. అది అతని ప్రోగ్రాంలో లేదు.
కాని భావాలు లేని ఒక యాంత్రిక స్వరంలో నిశ్చయం, పట్టుదల, లక్ష్యం వున్నాయి.
త్వరలో అతను నిజంగా నియంతలా కూడా మారి, విద్వేషం నిండిన ప్రసంగాలు, వికటాట్టహాసాలు చేసి ప్రపంచాన్ని శాసిస్తాడేమో.
ఆ అలోచనకే వణుకు వచ్చింది. జోషీకి, మూర్తికి. వారి బ్రెయిన్‍లో కంప్యూటర్ చిప్స్ వున్నా కొంత ఇంగితజ్ఞానం ఇంకా మిగిలే వుంది.
(ఇంకా ఉంది)