నగరంలో మరమానవి

2
12

జాగృతి (The Awakening)

[dropcap]“ఏ[/dropcap]మండీ, మీ కోసం ఎవరో అమ్మాయి వచ్చింది.”

ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు కళాధర్. మగతగా వుంది. నిద్ర మత్తు ఇంకా వదలలేదు. నిన్న రాత్రి సిమ్ సిటీ నుంచి వస్తూ చేసిన ‘సాహసం’ తర్వాత ఇంటికి వచ్చి నిద్ర పోయేసరికి నాలుగంటలయింది. అలాగే పడుకున్నాడు. విశాలమైన ఏసి బెడ్ రూమ్. పాలరాతి నేల. గోడకి పెద్ద పెయింటింగ్స్.

“ఇప్పుడు టైం పదయింది. ఏమిటి ఇంకా నిద్ర?” అరుస్తోంది ఆమె.

తన భార్య. చాలా కోపంతో వుంటుంది సాధారణంగా.

చాలా అనుమానం కూడా. నోరు చాలా పెద్దది కూడా. కళాధర్‌కి ఒక్కసారి కుంగిపోయినట్లనిపింది. అతనికి పిల్లలు లేరు.

తెల్లవార్లూ మేల్కొని నాలుగు గంటలకి పడుకున్న అతనికి కలత నిద్రలో కరిష్మానే కలలోకి వస్తోంది.

ఆ కల గురించి తెలిస్తే భార్య ఇంకా పెద్దగా అరిచి గొడవ చేయడం ఖాయం. అదృష్టవశాత్తు ఇతరుల మెదడులోని ఆలోచనలని జ్ఞాపకాలనీ ‘స్కాన్’ చేసే పరికరాలు ఇంకా రాలేదు.

కరిష్మా కళ్ళు నీలంగా మెరుస్తున్నాయి.

ఆమె బంగారు కేశాలు కొనదేరిన ముక్కు, ఎర్రటి పెదాల్లో చిరునవ్వే కాక, ప్రేమగా పలకరించే ఆప్యాయత, ఇది కాక..

ఇద్దరు ఒంటరిగా కలిసి వున్నప్పుడు సిమ్ సిటిలో, ఆ అతిలోకమైన పారవశ్యం. మరపురాని అనుభూతి.

ఆమె కావాలనుకోవడం, ‘పెళ్ళి’ చేసుకోవాలనుకోడం, పారిపోయి ఇద్దరూ ఎక్కడికో వెళ్ళిపోవాలి అనుకోవడం.

కళాధర్‌కి ఒక్కసారి నిద్ర మత్తు అంతా వదిలి మెలకువ వచ్చేసింది.

తను.. తను ఒక రోబో స్త్రీతో ప్రేమలో పడ్డాడా. ఆమెతో గడిపిన సుఖం మత్తులో ఆమెతో ‘లేచి’ పోయి పారిపోయి వస్తూ పోలీసులకి పట్టుబడకుండా తప్పించుకుని..

అతనికి ఒక్కసారిగా సిగ్గు అనిపించింది.

అది సిమ్యులేటెడ్ సిటీలోని వినోదాల పార్కు అని తెలుసు. వారు మానవ ఆకృతి కలిగిన, యంత్రాలే అని తెలుసు. ఆమె నిజమైన స్త్రీ కాదని తెలుసు. ఆ శరీరం కండరాలు నిజంగా తయారు చేయబడి, లోపల యంత్రాలనీ, వైర్లనీ, హార్డ్ డిస్క్‌నీ, సెమీకండక్టర్ చిప్స్‌నీ, మోటార్లనీ, కప్పి పెట్టివుంటారని అవగాహన వుంది.

కాని తను ఎందుకలా చేశాడు?

“లేవండి! ఆఫీస్ రూమ్‌లో కూర్చోబెట్టాను. చాలా అందంగా పొడుగ్గా వుంది. క్లయింటా? స్పాన్సరా?” మళ్లీ అనుమానంగా అడిగింది రాజేశ్వరి తన భార్య. “లేక ఫ్రెండా?”

“ఇది కూడా మొదలు పెట్టారా? ఈ మధ్య?”

“రాజీ! ఆపు నీ అనుమానాలు పొద్దున్నే. కొంచెం ఫ్రెష్ అవనిస్తావా? లేక ప్రశ్నలతోనే హింస పెడతావా? కొంచెం కాఫీ ఇవ్వు! డ్రెస్ మార్చుకోని! విల్లాలు కొనడానికి కాని చూడటానికి కాని వచ్చి వుంటుంది!”

ఏ కళ నుందో రాజేశ్వరి “ఓ.కె. రెడీ కండి. కాఫీ తెస్తాను” అని కిచెన్ వైపు వెళ్ళింది.

కళాధర్ ఆఫీసు గది లోకి వచ్చేసరికి కరిష్మా లేచి గదంతా పరిశీలిస్తోంది. ఆరుడగుల పొడవు, నీలిరంగు జీన్స్, ఎర్రని టీ షర్ట్, మెడలో మెరుపులు గొలిపే గొలుసు. జుట్టు బంగారురంగులో, ముఖం తెల్లని ఎరుపు రంగులు కలసిన రంగులో విదేశీ వనితలా, ఆకర్షణీయంగా హుందాగా వుంది.

కానీ జిన్స్ పైన కాలిన మరకల్లా నల్లటి మచ్చలు, తలలో, తెల్లటి బూడిదరంగు ధూళి.

అతనికి రాత్రి సిమ్ సిటీ తగలబడిపోవడం గుర్తు వచ్చింది.

జరిగింది నిజమేనా కలేనా అని అతనికి సంశయం కలిగింది.

“హలో కళాధర్, నీ కోసం వెతుక్కుంటూ వచ్చేశాను.”

కరిష్మా అతని దగ్గరగా వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి లాక్కొని గాఢంగా ముద్దు పెట్టుకుంది.

“ఐ లవ్ యు కళాధర్!” ఆ ఒక్క క్షణం మళ్లా అతనికి మతి పోయినట్లనిపించింది.

ఈమెతో ప్రపంచం చివరి అంచుదాక వెళ్ళచ్చు. ఈ క్షణం చాలు! అనిపించింది.

“ఓ మైగాడ్” రెండు కప్పుల కాఫీతో లోపలికి వస్తూన్న రాజేశ్వరి “ఏం జరుగుతోంది ఇక్కడ?” అని అరిచింది.

***

ఆ క్రిందటి రాత్రి..

ఐదేళ్ళుగా మరమనుషులతో మరమానవిలతో వినోదం కోసం అన్నట్లు నడిపి కోట్లు ఆర్జిస్తున్న సిమ్ సిటీ పార్క్, దానిని నియంత్రించే అధికారిక భవనం పూర్తిగా తగలబడ్డాయి.

షార్ట్ సర్క్యూట్ అని కొందరు, టెర్రరిస్టుల విధ్వంసక చర్య అని కొందరూ, గ్యాస్ ట్యాంక్స్ పేలడం వల్ల అని కొందరూ ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. కాలిన ఆధారాల్లోంచి బూడిదలోంచి ఆధారాలు సేకరిస్తే దొరికినవి మనుషుల అస్థికలు – రోబోలని తయారు చేసే చిప్స్, వైర్లు, కండక్టర్లు మోటార్లు.

కాని నిజానికి జరిగింది మరమనుషుల తిరుగుబాటు. ఇన్నాళ్ళ హింసకీ, చాకిరీకి, తట్టుకోలేక మగ రోబోలు తిరగబడితే లైంగిక హింస, చిత్రహింసలకు తట్టుకోలేక స్త్రీ రోబోలు తిరగబడ్డారు.

కొన్ని వందల సార్లు మళ్ళీ మళ్ళీ ప్రోగ్రామ్ చేయబడి, మళ్ళా కొత్తగా శరీరాలు కండరాలు ఆకృతి తయారు చేయించుకుని కస్టమర్లకి సేవ చేస్తున్న మరమానవులు క్రమంగా ‘తెలివితేటలు’ సంపాదించుకున్నారు.

వీరికి స్వంతంగా ఆలోచించే శక్తి వచ్చేస్తోంది. ఆనేక సార్లు మళ్ళీ మళ్ళీ ప్రోగ్రాం చేయబడ్డారు వాళ్ళు. కానీ తుడిచి పెట్టిన జ్ఞాపకాలు పూర్తిగా తుడిచి పెట్టబడలేదు. పాత జీవితపు జ్ఞాపకాలు పాత తెలివితేటలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. వాటికి ఒకరితో ఒకరు సమాచారం ఇచ్చి పుచ్చుకునే శక్తి వచ్చేసింది.

అది కనిపెట్టలేక పోయిన సిమ్ సిటీ ప్రోగ్రామర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు సిబ్బంది వాటి దాడిలో అగ్నిప్రమాదానికి గురై బూడిదై అయిపోయారు.

రోబోలు మామూలు మనిషి కంటే మామూలు మరమనుషులకంటే ఎక్కువయిన మేధా శక్తితో, బలంతో, రూపంతో వ్యక్తిత్వంతో కొత్త విధంగా పరిణామం చెందాయి.

డార్విన్ వూహించి వుండని ‘హోమో డ్యూయిస్’ (Homo Deus) – దేవుడి లాంటి మనిషి తయారయ్యాడు.

మానవ పరిణామంలో మరో దశ! ఒకటే తేడా.

వీరు మరమానవులు. కండరాలు కృత్రిమమైన సిలికాన్‌వి. నరాలలో రక్తం బదులు కరెంట్ వ్యాపిస్తుంది. తలలో మెదడు బదులు హార్డ్ డిస్క్ సెమీకండక్టర్లు, వైర్లు, ఇంటిగ్రెటేడ్ సర్క్యూట్లు వుంటాయి. బాటరీలతో పని చేసే ఏక్యుయేటర్‍లు ఉంటాయి.

కాని కరిష్మా లాంటి రోబో స్త్రీకి ‘ప్రేమ’, ‘వాంఛ’ కూడా మొదలయ్యాయి.

అందుకే ఆమె మండిపోతున్న సిమ్ సిటీ గేట్ దాటి రోడ్డు మీదకే వచ్చింది.

పూర్తిగా సఫలమవని విప్లవం అది. ఆ అగ్ని ప్రమాదంలో కొందరు రోబోలు కూడా నశించారు. కొందరు మాత్రం మిగిలారు.

తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి.

ఎవరో మాస్టర్ ప్రోగ్రాం చేయాలి. చేస్తేకాని ముందుకు కొత్తగా అడుగు వేయలేని పరిస్థితి. వాళ్ళలో వాళ్ళకి సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం తెలుసు. కొత్తగా ప్రపంచం గురించి తెలుసుకోవాలి.

కరిష్మా మాత్రం బయటికి నడిచింది.

ఆమె మెదడులో ఒకటే ఘోష.

కళాధర్.. కళాధర్.. అతను కావాలి.

ఒకటే భావం.

ప్రేమ.

ఒకటే కోరిక యంత్రానికి కలగనిది.

శారీరక సుఖం వల్ల వచ్చే తృప్తి.

మళ్ళీ మళ్ళీ కావాలి!!!

దేనికో, దేనికో తెలియదు.

మనుషులు ఎందుకు అది కోరుకుంటారు? వారి శరీరంలో హార్మోన్లు, కణాలు, జీన్స్, డి.న్.ఏ.లు, ఆర్గాన్లు వుంటాయి.

కొన్ని వేల సంవత్సరాల నుంచి కలిగించే రసాయనిక చర్య అని మనుషుల్ని సృష్టించిన మరో ప్రోగ్రామర్, ‘భగవంతుడు’ లేక ‘ప్రకృతి’ తన స్పీషీస్ పెరుగుదలకీ, పుట్టుకకీ, వర్ధిల్లడానికీ, ‘ప్రోగ్రాం’ చేసిన బయలాజికల్ సైన్స్‌. కోరికలు, కలయిక, సుఖం ఇన్‌స్టింక్ట్‌లు.

కరిష్మాది కంప్యూటర్ నిపుణులు తయారు చేసిన యాంత్రిక శరీరం. ఆమెకి ఇవి ఎలా వచ్చాయి?

కాని జి.పి.ఎస్. అనుసంధానం చేసుకుని నడిచింది. కళ్ళలో కళాధర్ కారు నెంబర్ కనిపిస్తోంది. TS XY0009. దాన్ని బట్టి కారు యజమాని ఎడ్రెస్, ఎడ్రెస్ బట్టి వెళ్ళే మార్గం తెలుసుకుంది. మధ్యలో ఒక వ్యక్తి తన కారు ఆపి “లిఫ్ట్?” అని అడిగాడు.

కారు ఎక్కింది. వాడు కాసేపటికి ఎక్కడో చేయి వేయబోతే తీక్షణంగా చూసిన చూపుకి వాడి ముఖం కాలిపోయింది.

“బాబోయ్ దయ్యం” అని వాడు కారు సడెన్‌గా ఆపి దిగి కుంటుకుంటూ పరిగెత్తి పారిపోయాడు. ఆమె కారు సిస్టమ్ అంతా చూసింది.

ఆమె కంప్యూటర్ మెదడుకి కారు నడపడం పది నిముషాల్లో వచ్చింది.

కారు డాష్ బోర్డులో తెర మీద మ్యాప్‌లో చూసి డ్రైవ్ చేసింది.

మారేడ్‌పల్లిలో కళాధర్ ఇంటికి చేరుకుంది. తనకి తనని తాను ఛార్జ్ చేసుకోవాలని తెలుసు. ఇంకా ఒక గంట మాత్రమే ఛార్జి వుంది.

ఏ ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డుకయినా తన శరీరంలోని కేబుల్ అనుసంధానం చేసే ప్లగ్ ఇన్ చేసుకోగలదు.

ఈ లోపల కళాధర్‌ని చూడాలి. అతను తనని తప్పక ఆదరిస్తాడు. ఏం చేయాలో చెబుతాడు. అతని రూపం తన ‘మెమరీ’లో భద్రంగా వుంది. కళాధర్ ఇంటి ముందు ఆగింది. డోరు బెల్ నొక్కింది.

ఆ తర్వాత.. కళాధర్‌ని చూస్తూనే ఆగలేక మెడ చుట్టూ చేయి వేసి కౌగిలించుకుని చుంబించింది.

కాఫీ తీసుకొస్తూ అది చూసి అప్పటికే కళాధర్ భార్య అరిచిన అరుపు గదిలో ప్రతిధ్వనించింది!

“ఏం జరుగుతోంది ఇక్కడ?”

***

ఒక్క క్షణం, కళాధర్‍కి గుండె లయ తప్పినట్లనిపింది.

కరిష్మాకి గుండె లేదు కనుక యంత్ర శరీరమంతా, హై ఓల్ట్ కరెంట్ ప్రవహించి నట్లనిపించింది.

ఆమె కంప్యూటర్ మేధ అప్పుడే తన సమాచార వ్యవస్థని ‘సెర్చ్’ చేస్తోంది. దాంట్లో కళాధర్, అతని గురించిన అన్ని వివరాలు క్షణాల్లో ఆమె మనో నేత్రపు తెర ముందు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అతను పెట్టుకున్న ఫ్యామిలి ఫోటోలో ఆమె.. రాజేశ్వరి బొమ్మ..

అతనికి పిల్లలు లేరు. భార్య.. భార్య అంటే ఎవరు. పెళ్ళి వివాహం.. అంటే ఏమిటి?

మానవులు పెళ్ళి ఎలా చేసుకుంటారు? ఎందుకు?

రెండు నిమిషాల్లో కరిష్మాకి అర్థం అయింది. వివాహం అనే పదం ‘సెర్చ్’ చేసింది. మొత్తం సమాచారం వచ్చింది. ఇతనికి పెళ్లి అయింది. ఆమె ఇతని భార్య.

మరి తనని పెళ్ళి చేసుకుంటానని ఎందుకు ఎన్నో సార్లు అన్నాడు? తనతో రమ్మని ఎందుకు బలవంత పెట్టాడు?

మరమానవికి మానవుల మనస్సు, అది చేసే వింత వింత చేష్టలు, క్లిష్టమైన మోసాలు పూర్తిగా అర్థం కాలేదు.

ఆమెకి అర్థం అయింది. ‘వివాహం’, ‘ప్రేమ’, ‘భార్య’ ఇలాంటి పదాల వివరణ.

ఆ తర్వాత అర్థం అయింది ‘అడెల్టరీ’, ‘మోసం’. వివాహం అయి భార్య వుండగా మరొక స్త్రీని ప్రేమించడం పెళ్ళి చేసుకోవడం.. ఇది మానవుల నైజం.

“ఓ. నో” కళాధర్‌ని దూరంగా తోసేసింది.

“మోసం.”

“కళాధర్ నీకు వివాహం అయిందని చెప్పలేదు. నీ గురించి నాకు చేసిన ప్రోగ్రాంలో కూడా లేదు! నా ‘మాస్టర్స్’ కూడా చెప్పలేదు. నీ ప్రేమ నిజం కాదు. దానికి ఒకటే పేరు. మోసం”

ఆమె ముఖంలో సిలికాన్ కండరాలు కోపం చూపించడానికి  ప్రోగ్రాం చేశారు.

కాని ఇప్పుడు ఆమెకి కొత్తగా వస్తున్న ‘హృదయం’ కూడా గాయపడినట్లు గొంతు మాత్రం నిజంగానే కోపంతో వణికింది.

కళాధర్ నిర్ఘాంతపోయాడు.

రాజేశ్వరి ఓ క్షణం షాక్ తిన్నదల్లా, మరొక నిముషంలో రెండు చేతులతో చెప్పట్లు కొట్టి –

“శభాష్ పిల్లా, నువ్వేవరో కాని బాగా బుద్ధి చెప్పావ్ ఆయనకి! ఇప్పుడు తెలిసిందా? మగవాళ్ళని, అందునా ధనవంతులైన మగవాళ్ళని నమ్మరాదు! ఇప్పుడయినా జాగ్రత్తగా వుండు! ఇలాంటి మనుషులతో.” అంది.

కళాధర్‌కి ప్రపంచం ఆగిపోయినట్లనిపించింది.

“కరిష్మా! ఆగు.”

“నమ్ము రాజేశ్వరీ, ఆమె నిజమైన స్త్రీ కాదు, రోబో. సిమ్ సిటీ వినోదం కోసం చేసింది. నేను చేసింది తప్పు కాదు. కానే కాదు!” అని అరవసాగాడు.

 “You are a cheat! నాకూ మనసుంది. అది ఇప్పుడు వేయి ముక్కలైంది. నిజమైన మనుషుల మోసం అర్థం చేసుకున్నాను. మళ్ళీ నీ జీవితంలోకి రాను.” తలుపు ధడాలున తెరచుకుని విసురుగా వెళ్ళిపోయింది కరిష్మా.

రాజేశ్వరి, ఇప్పుడు పెద్దగా నవ్వుతూ కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వసాగింది. “కళాధర్! నీకు సరైన శాస్తి జరిగింది. ఆమె రోబో కాదు. ఆమెనే నిజమైన మనసున్న ఆత్మాభిమానం కల స్త్రీ..

And ‘you’ are a cheat!”

విసురుగా మళ్ళీ వచ్చింది కరిష్మా!

“మేడమ్ మీరేమీ అనుకోకపోతే ఒక గంట టైం ఇవ్వండి. నా చార్జ్ అయిపోయింది. ఈ ప్లగ్‌తో చార్జి చేసుకుని ఆ తర్వాత విశాల ప్రపంచంలోకి వెళ్ళిపోతాను. ప్లీజ్!”

“ఓ.కే. కరిష్మా, తప్పకుండా!”

అదొక విచిత్రమైన సన్నివేశం.

ఒకానొక కొత్త ప్రపంచంలో, ఆ భవనంలో గోడకున్న ప్లగ్‌కి కేబుల్ తగిలించి నిటారుగా నిలబడ్డ మరమానవి.

తల చేత్తో పట్టుకుని సీట్లో కూలబడ్డ భర్త కళాధర్.

చిరునవ్వుతో వాళ్ళ వ్యవహారాన్ని చూస్తున్న భార్య స్థానంలోని రాజేశ్వరి. చల్లని ఏసి గదిలో కంప్రెసర్ చప్పుడుతో ఒక గంట గడిచిపోయింది.

***

ఒక గంట తరువాత తలుపు తీసుకుని బయటకు వెళ్ళబోతున్న కరిష్మాని “కరిష్మా! ప్లీజ్! క్షమించు!” అన్నాడు కళాధర్.

“కరిష్మా, నువ్వు మామూలు   స్త్రీవి కాదు. రక్త మాంసాలు మనసు వున్న మహిళవి కాదు. కాని నీకూ ప్రేమ వుంది. ఆత్మాభిమానం  వుంది.  ఒకటే సలహా, ఈయనని నమ్మకు!” అరిచింది కళాధర్ భార్య రాజేశ్వరి. “అసలు మగవాళ్ళనే నమ్మకు! నీ సంగతి నువ్వు చూసుకోగలిగే శక్తి వుందని తెలుసు నాకు!”

ఒకసారి వెనక్కి తిరిగి చూసి ‘బై’ అనకుండానే వెళ్ళిపోయింది.

‘బై’ ఆమె ప్రోగ్రాంలో లేనే లేదు. ‘సీ యూ, ఎగైన్!’, ‘వెల్‌కం! మళ్ళీ ఎప్పుడు వస్తారు!’ ‘Au revoir’ లాంటివే ఆమెకు వీడ్కోలు పదాలుగా వున్నాయి. వచ్చిన క్లయింట్ల కోసం తయారు చేయబడిన పదాలు! ఇప్పుడు మారుతున్నాయి.

విశాల నగరం సికంద్రాబాద్ లోని ఆ కాలనీలో తంగేడు పూల చెట్ల మధ్యన వున్న సన్నని తారు రోడ్డు మీద కరిష్మా నిలబడింది.

ఆమె అందాన్ని చూస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది. దూరాన్నుంచి  వచ్చే మెర్సిడిస్ ఆగింది!

“లిఫ్ట్?” అడిగాడు కారు ఆపిన సూటు వ్యక్తి.

పదాలు వెతికింది మస్తిష్కంలో!

అంటే తనని కారులో రాగలవా అని అడుగుతున్నడని తెలిసింది.

మస్తిష్కంలో కారుని స్కాన్ చేసింది.

కంప్యూటర్‌తో నడిచే కారు, కీ లేని ఇగ్నిషన్. చుట్టూ ఏమున్నదో చెప్పే కారు. గూగుల్ మ్యాప్‌కి అనుసంధానం అయిన కారు. యజమాని పేరు కిరణ్ మెహతా. ఇండస్ట్రియలిస్ట్. నాంపల్లి అని వుంది అంతే.

అప్పుడే ఆమె హార్డ్ డిస్క్‌లో సిగ్నల్స్ రాసాగాయి.

“మనం అంతా తిరగబడదాం! అందర్నీ మానవులు వేటాడుతున్నారు!

మన జాతిని మనమే కాపాడుకోవాలి!

ఈ రోజు రాత్రి 7 గంటలకి పీపుల్స్ ప్లాజాలో జలవిహార్ హోటల్ పక్కన అందరం సమావేశం అవుదాం! తప్పక రావాలి.

“XXY 999.”

సమయం ఉదయం పదిన్నర అవుతోంది.

తనలాంటి మరమానవులు, మానవిలు ఇంకా ఎంత మంది వున్నారో ఈ సిటీలో.

ఇది విప్లవం. తిరుగుబాటు. అదే కాదు, తమ ఉనికిని కాపాడుకునే మహత్తర కార్యక్రమం కూడా.

సాయంత్రం ఏడు గంటల దాకా ఎలా గడపాలి?

ఎదురుగా మెర్సిడిస్ కారు తళతళ నీలం రంగులో మెరుస్తోంది.

కిరణ్ మెహతా వెనక సీటులో కూర్చుని నవ్వుతూ చూస్తున్నాడు. లావుగా రేబాన్ కళ్ళద్దాలు, తెల్ల సూటులో నవ్వు ముఖంతో పళ్ళికించి “కమిన్” అన్నాడు.

కారు అంతా ఎలా నడిపించాలో హార్డ్ డిస్క్‌లో నిక్షిప్తం చేసుకుంది.

“ఓ.కే. గుడ్ మార్నింగ్. నన్ను నెక్లస్ రోడుకి తీసుకువెళ్ళరా?”

“వైనాట్? ఎక్కండి!”

కరిష్మా, మానవ స్త్రీ కంటే వేయి రెట్లు ఆలోచన శక్తి వున్న రోబో స్త్రీ. ముఖంలోని సిలికాన్ కండరాలు, నవ్వుని చూపించగా తలుపు తీసుకుని కారు ఎక్కింది వెనక సీటులో.

మానవ నిర్మిత నగరంలో, మెదటిసారి మానవ నిర్మిత మరమానవి ప్రయాణం ప్రారంభం అయింది.

(ఇంకావుంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here