రంగుల హేల 42: నైపుణ్యాలు

18
9

[box type=’note’ fontsize=’16’] “బతకనేర్వనితనం ముమ్మాటికీ మన తప్పే. మరొకరిని తప్పుబట్టడం మహా పాపం” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]నై[/dropcap]పుణ్యాలు అనేక రకాలు. కొన్ని మేధోపరమైనవి. కొన్ని శారీరకమైనవి. రెండింటికీ కఠోర శ్రమ, పట్టువదలని దీక్ష అవసరం. ఒకప్పుడు మన నేతన్నలు అగ్గిపెట్టెలో పట్టే జరీ చీరలు నేసేవారని వింటుంటాం. పూర్వకాలంలో జీవించిన ఇంకా ఎంతో గొప్ప, గొప్ప ప్రజ్ఞావంతులని గురించి కూడా విన్నాం. వారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని కొంతలో కొంత కృషి కూడా చేశాం.

నేడు మనం ప్రత్యక్షంగా అష్టావధానం, శతావధానం, సహస్రావధానం చూస్తున్నాం. ఎంత అబ్బురంగా అనిపిస్తుందో కదా! ఆ అవధానం చేసే పండితుల కాళ్ళమీద అమాంతం పడిపోవాలనిపించదూ మనకి? మనకి మూడు విషయాలు వరసగా చెబితే ఒకటే గుర్తుండి మిగిలినవి రెండూ బుర్ర అడుక్కి వెళ్లిపోతాయి. చెయ్యి పెట్టి లాగితే పైనున్నది లోపలి వెళ్ళిపోతుంది. అలాంటి మన మేధోసంపదకే మనకి ఓ రెండు, మూడు డిగ్రీలొచ్చాయి. ఇక ఆ అవధానులని కాలేజీల్లో చేర్పిస్తే రోజుకో డిగ్రీ పుచ్చేసుకోవడం ఖాయం కదూ. వాళ్లకి మనం చేసే డిగ్రీలంటే చిరాకేమోలెండి. వాళ్ళకొచ్చింది కూడా పోగలదని భయపడతారేమో! పోనీలెండి వాళ్ళని కూడా మనలాగే ఎందుకు చెడగొట్టడం?

నైపుణ్యాలనేక రకాలు. ఎలాగంటారా? సరదాగా కొన్ని చూద్దాం. కొందరించక్కా అబద్ధం నోటి చివరినుండి చెప్పేస్తారు. అలాంటి పరిస్థితి వస్తే మనం గింజుకుపోతాం. ఈ మాత్రానికి అబద్ధం ఎందుకు ఆడడం? ప్రాణ, విత్త, గౌరవ భంగములందు కదా ఆడవచ్చన్నారు? ఇప్పుడంత అవసరం ఏం ఉంది? నిజం చెప్పేద్దాం అని కొట్టుకుపోతాం. ఒకవేళ కూడ బలుక్కుని అబద్ధం ఆడినా మర్నాడే అది బైటపడి చచ్చేట్టు మాట్లాడేస్తాం. అబద్ధం ఆడి దాన్ని నిభాయించడం చాలా కష్టం. నిరంతరం అలెర్ట్‌గా ఉండాలి. మనం చెప్పిన అబద్దాన్ని పోషించుకుంటూ ముందుకు సాగాలి. ఈ టెన్షన్ పడలేకనే మనం నిజం చెప్పేసి ఊపిరి పీల్చుకుంటాం తప్ప సత్య హరిశ్చంద్రుడి వారసులైపోదామని గొప్ప దీక్షతో కాదు సుమండీ.

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను తీసుకొచ్చి చేసే రాజకీయ విశ్లేషణ కార్యక్రమం టీ.వీ. చానెల్స్‌లో వస్తున్నప్పుడు వక్తల తెలివితేటల నైపుణ్యం చూస్తే భలే ముచ్చటేస్తుంది. వాళ్ళెంతెంత డిఫెన్స్ టెక్నిక్స్ చూపెడతారో? ప్రతి ఒక్కరూ ఆయా పార్టీల డిఫెన్స్ లాయర్‌లే సుమా! అనిపిస్తారు. ఆ పార్టీ నాయకుడికి కూడా తట్టని పాయింట్లు వీళ్ళు చానెల్స్‌లో కాఫీ తాగుతూ వివరిస్తుంటారు. పొరపాటున ఆ పార్టీ పెద్దాయన గనక చూస్తే గనక ఆ సదరు వక్తకి మంత్రి పదవి ఇవ్వడం ఖాయం. అధికారంలో లేకుంటే వచ్చినప్పుడైనా ఇస్తానని మాటిచ్చేస్తాడు.

ఇంతా చేసి, పార్టీ సిద్ధాంతాల గురించి ఇన్ని మాట్లాడిన వాళ్లలో ఒకరు మర్నాడే తమ వ్యక్తిగత కారణాలవల్ల బేరం కుదుర్చుకుని మరో పార్టీలోకి దూకుతారు. కాలం కలిసొస్తే మంత్రి కూడా అవుతారు. అంతే! కళ్ళజోడు మారిపోతుంది. పొగిడిన నాయకుడినే తిడతారు. తిట్టిన నాయకుడినే పొగుడుతారు. పక్కనే నిలబడి మీటింగుల్లో పాల్గొంటారు. ఎన్నికల క్యాంపైన్‌లో అంటుకొని తిరుగుతారు. అద్దంలో మొహం ఎలా చూసుకుంటారో? ప్రజలకి ఎలా చూపెడతారో! అద్భుతం! అదొక విద్య. దాన్ని గుర్తించి మెచ్చుకోవాలంతే. గింజుకోకూడదు. బీపీ పెంచుకోకూడదు. మన ఆరోగ్యం కూడా మనమే చూసుకోవాలి కదా.

అప్పుడప్పుడూ నా సహాయకురాలు రాలేనప్పుడు చదువుకునే పన్నెండేళ్ల కూతుర్ని పంపుతుంది. “ఏంటి తోముతూ, తోముతూ గిన్నెలలా కిందపడేస్తున్నావేంటి?” అంటే “నేను పడెయ్యట్లేదమ్మా అవే పడిపోతున్నాయి” అంటుంది. ఎంత తెలివైన సమాధానమో కదా? అని ఆశ్చర్య పడతాను. దానికి జవాబేలేదు మరి. ‘పోన్లే, పై ఆఫీసర్ ప్రశ్నించగానే మనలా లబ లబ లాడిపోకుండా సమయస్ఫూర్తితో మాట్లాడి పిల్ల సుఖంగా బతికేస్తుంది’ అని ఆనందిస్తాను.

మరికొందరికి చమత్కార నైపుణ్యం పనుల్లోనూ, మాటల్లోనూ ఉంటుంది. చాలామంది మాట్లాడుతూ మాట్లాడుతూనే మాటలు మార్చేస్తారు. “మీరలా అన్నారు కదా?” అంటే “అబ్బే అలానేనెందుకంటాను? మీరే పొరబడి ఉంటారు” అని మన మొహం మీదే ఠక్కున జవాబు చెప్పేస్తారు. మనమేం సాక్ష్యం చూపించగలం? నోరు మూసుకోవడం తప్ప. మనమెవరితోనైనా ఒక మాటంటే ఆ మాటకి తేడా రాకూడదు అనేస్కుని తెగ ప్రయాసపడిపోతాం. తప్పని పరిస్థితిలో మాట మార్చినా, అందుకు తగినన్ని కారణాలు వివరించి ఎదుటివాడికి అడక్కపోయినా ఆపాలజీ లాంటిది చెప్పకపోతే మనకే నిద్ర పట్టదు. వాళ్లేమనుకున్నారో కదా అని కడుపు నొప్పి వచ్చేస్తుంది. అదో బలహీనత మనకి. ఎన్నాళ్ళయినా అధిగమించలేం. సమయానికి తగ్గట్టు అసత్యాలు చెప్పేసి దులుపుకుని వెళ్లిపోయే వారిని చూస్తే నాకు ఆరాధనా భావం. దేవుడు వీళ్ళకి ఇంత మంచి టెక్నిక్ వరంలా ఇచ్చేసాడు సుమా! అని కుళ్ళుకుంటాను.

మనకి జ్ఞాపకశక్తి బాగా ఉండడం కూడా ఒక అనర్థమే. అన్నీ గుర్తుంచుకుని విచారిస్తుంటాం. ఏదో శ్రీరామచంద్రుడి తోడబుట్టిన వాళ్ళలా అన్నమాట ఖచ్చితంగా నిలబెట్టేసుకోవాలని తాపత్రయపడిపోతుంటాం. ఇలాంటి బతకనేర్వనితనం ముమ్మాటికీ మన తప్పే. మరొకరిని తప్పుబట్టడం మహా పాపం. అలా ఎవరికైనా అనిపిస్తే నేను క్షమింపబడెదను గాక !

మా బంధువులమ్మాయి రమ ఏటా వేసవి సెలవులకి తాత గారి ఊరు కనుక మా ఊరొచ్చేది. మాకిద్దరికీ స్నేహం. తర్వాత ఆమెకి పెళ్లయింది, అమెరికా వెళ్ళిపోయింది. పాతికేళ్ళు అయ్యింది. ఆమె తల్లి మాకు హైదరాబాద్‌లో టచ్ లోనే ఉన్నారు. ఒకసారి ఆంటీ ఫోన్ చేసి “మా రమ అమెరికా నుంచి వచ్చింది. కూతురు భరతనాట్యం నేర్చుకుంది. రవీంద్రభారతిలో అరంగేట్రం పెట్టాం తప్పక రావాలి” అంటే వెళ్ళాం. పిల్ల బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. నేను, రమా స్టేజి వెనక కుర్చీల్లో కూర్చున్నాం. ‘కూతురు మూడేళ్ళ నుంచీ టీవీ చూసి నాట్యం చేస్తుంటే నేర్పించామనీ, గిఫ్ట్ చైల్డ్ అనుకుంటామనీ’ చెప్పుకొచ్చింది రమ. ప్రోగ్రాం అయ్యాక డిన్నర్ కూడా పెట్టారు. రమ కూతురికి నేనొక గిఫ్ట్ ఇచ్చాను. వచ్చేస్తుంటే “నువ్వు నాకు గుర్తు రావట్లేదే” అంది రమ. నేను ఖంగుతిన్నాను. మర్నాడు వాళ్ళమ్మకి ఫోన్ చేసి “నేను అనవసరంగా వచ్చానాంటీ. మీ అమ్మాయికి నేను గుర్తులేనుట” అని నిష్టూరమాడాను. ఆవిడ చెప్పినట్టున్నారు. మర్నాడు రమ నుంచి ఫోన్. “అమ్మ చెప్పింది. నువ్వు బాగా మారిపోయావుట కదా అప్పటికీ ఇప్పటికీ. తప్పు నీదైతే నన్ననడం ఏమిటీ?” అని నిలదీసింది. ఇప్పటికీ ఈ విషయం గుర్తొస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ‘అలా ఎలా మర్చిపోయానో?’ అని బాధపడకుండా కనీసం “సారీ గుర్తు రావట్లేదు” అనైనా అనకుండా “నువ్వు మారిపోయావు” అంటూ అది నా నేరమైనట్టు అనడం చిత్రంగా లేదూ! పాతికేళ్ల తర్వాత మారకుండా ఎవరైనా ఉంటారా? ఇది మాటల్లో నైపుణ్యం కాక ఇంకేమిటి చెప్పండి?

కొందరికి వాళ్ళూ వాళ్ళ పిల్లలే మంచివాళ్ళు. వాళ్లిళ్లే మంచివి. వాళ్ళకి సంబంధించినవే గొప్పవి. మిగిలినవి చెత్తవి. వాళ్ళ పిల్లలే బాగా చదువుతారు. వాళ్ళే అందగాళ్ళు. మిగిలిన వాళ్ళ పిల్లలు బాగోరు. చెడ్డ పిల్లలు. మొద్దులు. ఇలా నిత్యం వాళ్ళని వాళ్ళు హిప్నోటైజ్ చేసుకుంటూ పిల్లలకి ఇలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ సంతానం బైటి ప్రపంచంలోకి వచ్చాక ఈ తత్వం వదిలించుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. ఎవరితో స్నేహం చెయ్యలేకపోతారు. క్లాస్‌లో వంటరిగా కూర్చుంటూ ఉంటారు. ఇదే వరసలో కొందరు అలవికాని ప్రేమలతో తమ పిల్లల్ని సమర్థించుకుంటూ ఉంటారు, వాళ్ళు సబ్జక్ట్‌లు ఫెయిల్ అయితే “మా వాడు ఒంట్లో బాలేక రాయలేదు. మళ్ళీ రాస్తాడు” అంటూ. అది ఇతరుల ముందయితే పర్వాలేదు. ఇలాంటి స్వీయసమర్థనా బీజాలు పిల్లల్లో నాటుకుంటే వారు తమను తాము దిద్దుకోకుండా తప్పుదారి పడతారు. తర్వాత పెద్దలు వారిని సరిదిద్దలేరు. చేతులెత్తేయాల్సిందే.

కొందరికి నైపుణ్యం అతి తెలివిగా మాట్లాడడంలోనూ, వంకర మాటల్లోనూ ఉంటుంది. అందరినీ వెక్కిరించి, వెటకరించి ఆఖరికి వాళ్ళ పరిస్థితే బాగాలేని స్థితికి వెళ్ళిపోతారు. అప్పటికీ ఆ వక్ర భాష్యాలు వదులుకోరు. ఇటువంటి వారిని ఎవరూ కలుపుకోరు. అప్పుడు వారు ఒంటరిగా అయిపోయి ఇతరులపై మరింత అసూయా ద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు. ఇంకొందరిలో అతి తెలివి, గడుసుదనం ఉంటాయి. వీళ్ళు ఎవరితోనూ మిత్రత్వం నెరపలేరు. ఆ మాటకొస్తే నిజానికి ఇటువంటివారికి మిత్రులక్కరలేదు. వారసలు స్నేహానికి విలువనివ్వరు. అవసరం కోసమే స్నేహం చేస్తారు. అవసరం తీరగానే అన్‌జాన్ కొడతారు. అంచేత వీరిని ఎవరూ తమ మిత్రుల జాబితాలోకి తీసుకోరు. ఒకోసారి, చాలామందికి తమవల్ల తప్పు జరిగిందని తెలిసినా ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. పరివర్తన చెందడం మానేసి మళ్ళీ తమను తాము సపోర్ట్ చేసుకోవాలనుకునే బురదలోనే మళ్ళీ మళ్ళీ కూరుకుపోతారు. వారిని చూసి జాలిపడడం తప్ప ఏమీ చెయ్యలేం.

ఇంటిని అందంగా పెట్టుకునే ఇల్లాళ్ల నైపుణ్యం వాళ్ళింటికి వచ్చిన వారికి ఆనందం కలిగిస్తుంది. కొందరికి చక్కని సలహాలు ఇవ్వడంలో ప్రతిభ ఉంటుంది. ఎన్నిచికాకులున్నా నలుగురితో నవ్వుతూ మాట్లాడడం కూడా గొప్ప నైపుణ్యమే. ఇటువంటి వారు మన మిత్ర బృందంలో ఉంటే వారివల్ల మనకి కూడా ఆ తత్వం అలవడుతుంది. మంచి మిత్రులవల్ల లాభాల్లో ఇదొకటి. వారి సొంత సమయాన్ని వెచ్చించి షాపింగ్ లకి తోడొచ్చి, బాగా బేరాలు చేసే పెట్టే టాలెంట్ ఉన్నవారిని ఇరుగు పొరుగు ఆడవారంతా గౌరవంతో ప్రేమిస్తారు.

కొంతమందికి అసత్యాలు పలకడంలో నైపుణ్యం ఉంటుంది. అలవోకగా ఆడుతుంటారు. క్రమంగా కొన్ని రోజులకి వాళ్ళ మాటల్ని ఎవరూ నమ్మరు. వారు నిజం చెప్పినా అందరికీ అనుమానమే ఉంటుంది. క్రెడిబిలిటీ ఒకసారి పోయిందంటే మళ్ళీ తెచ్చుకోవడానికి ఈ జన్మ చాలదు కదా! పిసినారితనంలో కొందరికి నైపుణ్యం ఉంటుంది. వాళ్లింక ఎంత ఆలోచిస్తారంటే చిటికెటు ఉప్పు, గుప్పెడు పప్పు కూడా వేస్ట్ అవ్వొద్దని ఆలోచిస్తుంటారు. పనిలో సహాయకుల దగ్గర ఈ విద్యలు ప్రదర్శించే సాహసం చేస్తే ఎవ్వరూ మన ఇంట్లోకి పనికి రారు, మన కీర్తి దశదిశలా వ్యాపించి.

కొందరికి పొదుపు చెయ్యడంలో నేర్పరితనం ఉంటుంది. అది పెరిగి పెరిగి హోటల్స్ వెళ్ళినప్పుడు మిత్రులు బిల్ కడితే తేరగా తిని వెళ్లిపోవడం, పక్కవాడితో కలిసి ఆటో ఎక్కి షేర్ ఇవ్వకుండా దిగిపోవడం వంటి అవలక్షణాలు ఏర్పడతాయి. ఇది వారు గమనించుకోరు. అమ్మయ్య పొదుపు చేసి పది రూపాయలు మిగుల్చుకున్నాం అన్న ఆనందంలో వాళ్లకు వళ్ళూ పై తెలీదు గొప్ప ఆత్మ సంతృప్తి తప్ప. వెనక అందరూ నవ్వుకుంటున్నారన్న సంగతి గమనించలేరు. కొందరికి భలే ఆత్మవంచనా టెక్నిక్ ఉంటుంది. వీళ్ళ బుర్ర ఏది చెబితే అది వాళ్ళ మనసు నమ్మేసి ఒప్పేసుకుంటుంది. మన మనసులా అది ఆత్మసాక్షీ, ఆవకాయబిరియానీ అనదు. అది వాళ్ళ అదృష్టం. కొందరిలో వక్ర పాండిత్యంతో కూడిన నైపుణ్యాలుంటాయి. అందులో వారంతా పరిశోధన చేసి డాక్టరేట్ పొంది ఉంటారు. ఆ మేధస్సుకు మనం జోహార్లర్పించక తప్పదు. వీళ్ళు రకరకాల వంకర టింకర వేషాలేస్తూ, నలుగురూ నవ్విపోతారన్న ఇంగితం కూడా లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. కొందరు అతిగా ఆలోచిస్తూ వాక్చాతుర్యంలో టాలెంట్ ప్రదర్శిస్తూ వితండవాదాలు చేస్తూ నలుగురిలో పిచ్చివాడన్న పేరు సంపాదించుకుంటారు.

భార్యాభర్తలు ఒకరితో మరొకరు జీవితాంతం కలిసి ఉండాలంటే నిపుణత చాలా అవసరం. లేకపోతే వారిమధ్య వైరుధ్యాలు చిలికి చిలికి గొడవలకు దారితీస్తాయి. ఒకరికోసం మరొకరు కొంత సర్దుకునే నైపుణ్యం పెంచుకోక తప్పని పరిస్థితులుంటాయి. లేకపోతే సంసారమనే నిత్యపరీక్షల్లో ఫెయిల్ అయిపోతారు. సాధారణంగా అన్ని జంటలూ ఈ నియమం పాటిస్తాయి. కొందరు మరీ ఒకరిపై మరొకరికి అతిశయించిన ప్రేమతో ఉంటారు. భర్త చెప్పే అబద్దాలు భార్యా, భార్య చెప్పే అల్లి బిల్లి కథలు భర్తా నమ్మేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఎవరి ఆనందం వారిది పక్కవారికి హాని కానంతవరకూ.

ఇంకొంతమంది జీవిత భాగస్వామిలో ఉన్న తీవ్ర లక్షణాలు తమకు ఇబ్బంది కలగకుండా నేర్పుతో మచ్చిక చేసుకుంటూ వారిని జనం మీదికి వదిలేసి తమాషా చూస్తూ ఉంటారు. “ఏం చెయ్యలేమండీ ఆవిడంతే” అనో “ఆయనంతే” అనో తమ స్వీయలాభం చూసుకుంటూ ఉంటారు. ఇటువంటి జంటలతో ఇరుగు పొరుగు, బంధువులు జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల మధ్య ఒకోసారి పొడసూపే వైరాగ్నిని ఎగదోసే నేర్పరితనం కొందరు చూపిస్తే, మంచి మాటలతో సర్ది చెప్పి వారిని కలిపే ప్రయత్నం కొందరు హృదయపూర్వకంగా చేస్తారు. అటువంటి నేర్పరితనం కీర్తించబడుతుంది. అటువంటి స్కిల్ పదిమందికి మంచి చెబుతుంది. చేసి చూపిస్తుంది.

నైపుణ్యం అంటే ఒక విషయాన్ని పట్టుకుంటే దాన్ని తపస్సులా ఆచరించడం అన్నమాట. అది మంచి పనికయితే చక్కని పేరూ, చెడ్డవాటికయితే చెడ్డపేరూ సంపాదించుకుంటారు. అంతే. వయసు పైబడే కొద్దీ విచక్షణతో ఎందులో ఎక్స్‌పర్‌టైజ్ పెంచుకోవాలీ అన్నది నిర్ణయించుకుంటే మనకి ప్రమాదం ఉండదు. గౌరవ ప్రతిష్ఠలు పెంచుకోగలుగుతాం. కనీసం అప్రతిష్ఠ పాలు కాకుండా ఉంటాం.

స్నేహం చెయ్యడానికి నైపుణ్యాలు అక్కర్లేదు. స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్న మనసుంటే చాలు, ఏ వయసులోనైనా కొత్త కొత్త మిత్రులను పరిచయం చేసుకుని స్నేహ సంపదను పెంచుకోవచ్చు. కల్మషం లేని ప్రేమనిండిన హృదయం ఉండడమే చక్కని మానవసంబంధాలకి పటిష్టమైన పునాది. అటువంటి నైపుణ్యం అలవరచుకో గలగడం మనకే మంచిది.

పరోపకారం చెయ్యడంలో నైపుణ్యాలు లోకంలో కీర్తింపబడతాయి. గొప్ప సర్జరీలు చేసే డాక్టర్‌కి అతని ప్రతిభ రోగులకు వరం, పండ్ల చెట్టుమాదిరి. అలాగే ఒక న్యాయవాది నైపుణ్యంతో ఇతరులకు జరిగే అన్యాయాన్ని అడ్డుకుంటాడు. నిత్యం ఆత్మశుద్ధి చేసుకుంటూ, పూర్ణ హృదయంతో పరిపూర్ణ మానవుడిగా ఎదగడానికి కంకణం కట్టుకుని, ఆ దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేసుకుంటూ ముందుకు సాగడం నైపుణ్యాల్లో కెల్లా నైపుణ్యం ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here