[box type=’note’ fontsize=’16’] “జగమంతా ప్రేమమయం, ప్రేయసి దాని ప్రతిరూపం అనుకున్నా; ప్రేమతో పాటు కోపం, ద్వేషం ఉంటాయని నాకేం తెలుసు” అంటున్నారు శంకరప్రసాద్ “నాకేం తెలుసు?” కవితలో. [/box]
[dropcap]తె[/dropcap]ల్ల కలువల వంటి కన్నులు
కెంపుల్లా ఎర్రబడితే
సిగ్గు మొగ్గలేసిందనుకున్నా
నా వైపు కోపంగా చూస్తుందని
నాకేం తెలుసు…..!
గులాబి రేకులాంటి పెదవిని
మంచిముత్యమంటి పంటితో అదిమితే
నన్ను కవ్విస్తుందేమో అనుకున్నా
అవి సర్పదంష్ట్రలని
నాకేం తెలుసు…….!
చందమామ లాంటి నగుమోము
పైటమబ్బుతో కప్పుకుంటే
దోబూచులాడుతుందనుకున్నా
అది నాపై కోపమని
నాకేం తెలుసు……!
విసురుగా వెనక్కి తిరిగి
విసవిసా వెళుతుంటే
శ్వేతనాగు గమనంలా ఉందనుకున్నా
నాపై విషం కక్కుతుందని
నాకేం తెలుసు…….!
జగమంతా ప్రేమ మయం
ప్రేయసి కూడా దాని ప్రతిరూపం
అని అనుకుంటూ భ్రమలో ఉన్నా
ప్రేమతో పాటు కోపం, ద్వేషం ఉంటాయని
నాకేం తెలుసు…..!
కవితకు ప్రేరణ: LA belle dame sans merci, (John Keats)