నకుల సహదేవులు

1
7

[box type=’note’ fontsize=’16’] ‘నకుల, సహదేవులు’ అనే ఈ వ్యాసంలో పాండవ సోదరులు నకుల, సహదేవుల గురించి వివరాలు అందిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]మ[/dropcap]హాభారతములోని ఐదుగురు పాండవులలో ధర్మరాజు, భీముడు అర్జునుడు గురించి తెలిసినంతగా నాల్గవవాడైన నకులుడు, ఐదవ వాడైన సహదేవుడి గురించి అంత ఎక్కువగా తెలియదు. వీరిద్దరూ పాండురాజు రెండవ భార్య అయిన మాద్రికి అశ్విని దేవతల వరము వల్ల పుట్టిన కవలలు. నకులుడు అంటే అందమైనవాడు. ఆతను అందంలో కామదేవుడు (మన్మథుడు)తో పోల్చదగ్గవాడు. ఇతను కత్తి యుద్ధములో నైపుణ్యము గలవాడు అలాగే అశ్వ సంరక్షణ పెంపకంలో మంచి నైపుణ్యము ఉన్నవాడు.

పాండవులు అరణ్యవాసములో ఉన్నప్పుడు జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణుని వేషములో ద్రౌపదిని నకలుడిని సహదేవుని ఎత్తుకుపోతాడు. అప్పుడు భీముడు పోరాడి వాళ్లను విడిపిస్తాడు. అప్పుడు నకులుడు క్షేమంకర, మహామహా మరియు సురదా అనే వారిని చంపుతాడు. అలాగే పాండవులు అరణ్యవాసము తరువాత విరాటుని కొలువులు అజ్ఞాతవాసము గడిపేటప్పుడు తామ్ర గ్రంథి అనే పేరుతో అశ్వ సంరక్షకుడిగా చేరుతాడు.

నకులుడు ద్రుపదుడిని పాండవ సైన్యానికి అధిపతిగా ఉండాలని సూచిస్తాడు కానీ యుధిష్టరుడు అర్జునుడు ద్రుష్టద్యుమ్యుడిని ఆ పదవికి ఎంపిక చేస్తారు. కురుక్షేత్ర సంగ్రామములో నకులుడు కౌరవ పక్షాన గల చాలా మంది ప్రముఖులను చంపాడు.

నకులుని రథంపై గల జెండాపైన ఎర్రటి జింక బంగారపు రంగు వీపు భాగముతో ఉంటుంది. నకులుడు పాండవుల ఏడు అక్షౌహిణుల సైన్యములో ఒక అక్షౌహిణికి నాయకత్వము వహించాడు. యుద్ధము మొదటిరోజున నకులుడు దుశ్శాసనుడిని ఓడించినప్పటికీ భీముని ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశము ఉండాలి కాబట్టి చంపకుండా వదలివేస్తాడు. 11వ రోజు యుద్ధములో నకులుడు తన మేనమామ అయినా శల్యుని రధాన్ని నాశనము చేస్తాడు. 13వ రోజు యుద్ధములో పద్మవ్యూహములోకి చొరబడాలి అని ప్రయత్నం చేసిన జటాధరాని వర బలము వల్ల ఇతర పాండవులలాగానే (అభిమన్యుడు తప్ప) వెనక్కు వచ్చేస్తాడు. 14వ రోజూ శకునిని యుద్ధములో ఓడిస్తాడు. 15 వ రోజు యుద్ధములో నకులుడు దుర్యోధనుడి చేతిలో ఓడిపోతాడు, కానీ పాండవుల పక్షాన గల చేకితనుడు అనే యోధుడి వల్ల రక్షింపబడతాడు.

17వ రోజు యుద్ధములో నకులుడు శకుని కొడుకు వ్రికాసురుని చంపుతాడు. 18వరోజు యుద్ధములో కర్ణుడి ముగ్గురు కుమారులైన సుషేణుడు, చిత్రసేనుడు, సత్యసేనుడు అనే వారిని చంపుతాడు. యుద్ధము తరువాత ధర్మరాజు నకులుడిని తన మేనమామ శల్యుడి రాజ్యములోని ఉత్తర భాగానికి రాజుగా నియమిస్తాడు. అలాగే దక్షిణ భాగానికి సహదేవుడిని రాజుగా నియమిస్తాడు.

సహదేవుడు పాండవులలో కనిష్ఠుడు. మాద్రి రెండవ కొడుకు అశ్విని దేవతల వరము వల్ల పుట్టినవాడు. ద్రౌపది కాకుండా విజయ అనే మరో భార్య ఉంది. సంస్కృతములో సహదేవుడు అనే పేరు సహా దేవా అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది సహా అంటే “తో” అని దేవ అంటే భగవంతుడు అంటే భగవంతుడితో అని అర్థము. ఇంకో అర్థము సహా అంటే వెయ్యి వెయ్యి దేవుళ్ళు అని అర్థము.

ఇంకో కథనం ప్రకారము సహదేవుడు అసురుల గురువైన శుక్రాచార్యుని అంశ వల్ల జన్మించినవాడు అని అంటారు. సహదేవుడు తన సోదరులతో పాటు హాస్తినాపురములో ద్రోణుడు కృపాచార్యుల వద్ద అస్త్ర శస్త్రలను ఉపయోగించటం నేర్చుకున్నాడు.

అంతేకాకుండా నీతిశాస్త్రము దేవతల గురువైన బృహస్పతి నుండి నేర్చుకున్నాడు. సహజముగా సహదేవుడు సాదు స్వభావి, ఓర్పు కలవాడు. పాండవులు ఐదుగురికి ద్రౌపది వల్ల సంతానము ఉన్నారు వారినే ఉపపాండవులు అంటారు. సహదేవుడు కొడుకు పేరు శ్రుతసేనుడు. రెండవ భార్య అయిన విజయ వల్ల కలిగిన కొడుకు పేరు సుహోత్ర. ధర్మరాజు రాజసూయ యాగము చేసినప్పుడు దక్షిణాది రాజులను జయించటానికి ధర్మరాజు సహదేవుడిని అశ్వముతో పంపుతాడు.

ఎందుకంటే దక్షిణ దేశ రాజులు కత్తి యుద్ధాలలో ప్రావీణ్యులు. సహదేవుడు కత్తియుద్ధములో ప్రావీణ్యుడు కాబట్టి వారిని ఎదుర్కొనగలడు అని ధర్మరాజు నమ్మకము. మహాభారతములో సహదేవుడు జయించిన రాజ్యాల ప్రస్తావన ఉంది. అజ్ఞాతవాసములో ఉన్నప్పుడు విరాట రాజు కొలువులో తంత్రీపాలుడు అనే పేరుతో పాసు సంరక్షకుడుగా ఉన్నాడు. సహదేవుడు జ్యోతిష్య శాస్త్రములో దిట్ట, అందుచేత కురుక్షేత్ర యుద్దానికి ముందు శకుని సహదేవుని చేత దండయాత్రకు ముహూర్తము పెట్టించాలని అనుకుంటాడు. సహదేవుని మంచితనము నిజాయితీ తెలిసిన కృష్ణుడు శకునికి కాదు అని చెప్పలేడని తెలిసి శ్రీకృష్ణుడు పరమాత్ముడు కాబట్టి గ్రహ స్థితి గతులను పాండవులకు అనుకూలముగా మార్చగలిగాడు.

కురుక్షేత్ర యుద్ధములో సహదేవుడు కూడ శత్రుపక్షంలోని వీరులను చంపాడు. సహదేవుని రథముపైన గల జెండా పై వెండి హంస గుర్తు ఉంటుంది. దుర్యోధనుని 40 మంది సోదరులను సహదేవుడు జయించాడు. జూదములో ధర్మరాజు సర్వస్వము ఓడిపోయినప్పుడు శకునిని చంపుతానని శపథము చేసాడు. అలాగే 18 వ రోజు యుద్ధములో శకునిని, శకుని కొడుకును చంపుతాడు. యుద్ధము తరువాత సహదేవుడు మత్స్య దేశానికి రాజుగా నియమింపబడతాడు.

ఆ తరువాత కలియుగము ప్రారంభమవటము, శ్రీకృష్ణ నిర్యాణము జరగటం, పాండవుల శక్తి సన్నగిల్లటం జరుగుతాయి. అప్పుడు పాండవులు వారితోపాటు ద్రౌపది, ఒక కుక్క హిమాలయాల నుండి స్వర్గారోహణ ప్రారంభిస్తారు. ఆ ప్రయాణములో మొదటగా పడిపోయింది ద్రౌపది. ఆ తరువాత సహదేవుడు. ఎందుచేతనంటే తాను తెలివి అయినవాడిని అని సహదేవునికి గర్వము. అతని గర్వమే అతని పతనానికి కారణము అయింది. చివరకు ధర్మరాజు అయన వెంట అయన ఆచరించిన ధర్మము కుక్కరూపములో స్వర్గానికి చేరుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here