నల్గొండలో విద్యా వికాసం..

0
10

[శ్రీ ప్రమోద్ ఆవంచ గారి ‘నల్గొండలో విద్యా వికాసం..’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]ల్గొండలో ఎంతో మంది జీవితాలను మార్చిన, ప్రభుత్వ పాఠశాలలు ఒక మంచి జ్ఞాపకంలా మన మస్తిష్కంలో కదలాడుతూనే ఉంటాయి. అక్కడ పని చేసిన ఉపాధ్యాయులు వాళ్ళ విద్యార్థుల శిక్షణ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, అంతే శ్రధ్ధతో చదువుకున్న విద్యార్థులను, ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. అప్పట్లో ప్రైవేటు పాఠశాలల్లో కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను షరీఖు చేయిస్తుండేవాళ్ళు. కారణం క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేది.

పాఠం అర్థం కాకపోతే ఎన్నిసార్లు అయినా అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు, పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికితే ఊర్కునే వారు కాదు అప్పట్లో ఉపాద్యాయులు.అందుకు ఉదాహరణ.. డెబ్భైవ దశకంలో ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ పరీక్షలో కాపీ కొడుతున్నాడని కన్న కొడుకుని డిబార్ చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.

ఆ హెడ్మాస్టర్ లక్ష్మారెడ్డి.. ఆ స్కూల్ బొట్టుగుడ. పిల్లవాడి భవిష్యత్తు పాడవుతుంది, ఎంతైనా మీ అబ్బాయే కదా వదిలేయండి అంటూ తోటి ఉపాధ్యాయులు ఎంత చెప్పినా వినలేదు ఆయన. అంత నిబద్ధతతో కర్తవ్యాన్ని నిర్వహించి, లక్ష్మారెడ్డి సార్ జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు గడించారు. విధి నిర్వహణలో ఆయన ఎవరి మాట వినేవాడు కాదు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందారు.. కట్ చేస్తే..

అదే డెబ్భైవ దశకంలో నల్గొండలోని మల్టీ పర్పస్ స్కూలులో పరీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు ఇంగ్లీషు పరీక్ష. ఒక హాలులో ఒక విద్యార్థి కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్‌గా ఉన్న ఒక ఇంగ్లీషు ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి వద్ద పేపర్ గుంచుకొని బయటకు పంపించాడు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న ఆ ఉపాధ్యాయుడి మీద కోపంతో ఆ విద్యార్థి తన అల్లరి మూకతో వచ్చి రాళ్ళు రువ్వి దాడి చేసాడు. దానితో ఆ ఉపాధ్యాయుడి తలకు బలమైన గాయం అయ్యింది. హెడ్మాస్టర్‌కి కంప్లైంట్ చేస్తే విద్యార్ధి భవిష్యత్తు నాశనం అవుతుందని, ఆ ఉపాధ్యాయుడు తరువాత రోజుల్లో ఆ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంగ్లీషు బోధించడంవల్ల ఆ విద్యార్థి పాస్ అయ్యాడు. ఆ తరువాత ఆ విద్యార్థి ఆ ఉపాధ్యాయుడికి ప్రియ శిష్యుడు అయ్యాడు.. ఆ ఉపాధ్యాయుడు ఆవంచ సీతారామారావు. అప్పట్లో ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయుడిగా ఆయనకు మంచి పేరు ఉండేది..

కట్ చేస్తే..

రెండు గుట్టల మధ్య నల్గొండ పట్టణం. ఒకవైపు కాపురాల గుట్ట, మరోవైపు బ్రహ్మం గారి గుట్ట. అప్పట్లో నల్గొండను నీలగిరి అని పిలిచేవారు. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాంతమంతా పాత బస్తీ. అదే అసలు నల్గొండ.. అదే నీలగిరి. పోలీసు స్టేషన్ నుంచి ముందుకు కొన్ని అడుగులు వేస్తే స్థానిక వైశ్య కులస్తులు కట్టించిన గాంధీ పార్క్ ఉండేది. ఇప్పుడూ ఉంది. అందులో పెళ్ళిళ్ళు, ఇతర ఫంక్షన్లు జరుపుకుంటుండేవారు. అక్కడే ఒక రూములో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ మందులు ఇస్తుండేవాడు. గాంధీ పార్క్ దాటి కొంచెం ముందుకు పోతే ఒక చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తాను బొడ్రాయి బజార్ అని కూడా అంటారు. ఆ చౌరస్తా వెనుకవైపు వెళ్ళే దారుల్లో ఎడమవైపు సిమెంట్ రోడ్డు ఆ రోడ్డులో స్వర్ణకారుల (అవసలోల్లు) దుకాణాలు వరుసగా ఉండేవి.

ఆ రోడ్డంతా వచ్చిపోయే జనాలతో కళ కళ లాడుతూ ఉండేది. ఆ రోడ్డెంట అలాగే ముందుకు పోతే పెద్దపులి బంగ్లా (శేర్ బంగ్లా). అది ఎవరు నిర్మించిన కట్టడమో తెలియదు కానీ, చాలా మంది స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఆ బంగ్లాలో దోమలపల్లి దొరవారు అడ్వకేట్ అమరేందర్ రావు కొంతకాలం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఎనభై అయిదవ సంవత్సరంలో ఆయన రామగిరిలో ఇల్లు కట్టుకుని వచ్చేసాడు. ఆదిలాబాద్‌కి చెందిన ఆయన భార్య డాక్టర్ సునీత అప్పట్లో జిల్లాలోనే ప్రముఖ గైనకాలజిస్ట్. చౌరస్తా కుడివైపు లోపలికి వెళితే ఒంటి స్తంభం, పాత శివాలయం, జేబిఎస్ స్కూల్, వివేకానంద స్కూలు, మాల్ బౌలి స్కూలు, గుట్ట మీద బ్రహ్మం గారి టెంపుల్, అలాగే ముందుకు వెళితే మునుగోడు ఊరికి వెళ్ళే దారి. చౌరస్తాకు ఒకవైపు కమాన్ బజార్.. అక్కడ అన్ని బట్టల షాపులు కిరాణా దుకాణాలు, ఉండేవి. చౌరస్తాకు మరొకవైపు అక్కచెలమ బజార్ ఉండేది.. కుమ్మరి కుంట దగ్గర ఉన్న కొండ చెలమ నీళ్ళు చాలా ఫ్రెష్‌గా, తియ్యగా ఉండి నీలగిరి ప్రజల దాహార్తిని తీర్చేది. నల్గొండ, దాని చుట్టుపక్కల ఊర్లల్లో భూగర్భ జలాలలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండేది. దాని మూలంగా,అప్పుడే పుట్టిన శిశువులు, ఏదో ఒక సమస్యతో బాధపడేవారు. అందుకే చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి కొండ చెలమ నీటిని తీసుకెళ్ళేవారు. ప్రస్తుత న్యూ ప్రేమ్ టాకీస్ ఉన్న ప్రాంతాన్ని అప్పట్లో బహార్ పేట అని పిలిచేవాళ్ళు. అప్పట్లో అక్కడ పెద్ద గిర్నీ, మెకానిక్ షాపులు, బహార్ పేట ప్రైమరీ స్కూలు కూడా ఉండేది..

కట్ చేస్తే..

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జైలుఖానాకు వెళ్ళే దారిలో ప్రస్తుత బాలుర జూనియర్ కళాశాల స్థలంలో పందొమ్మిది వందల యాభైవ దశకంలో మల్టీ పర్పస్ స్కూలు ఉండేది. ఒకటి నుంచి అయిదవ తరగతి వరకు ప్రైమరీ స్కూలు, ఏడవ తరగతి వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు హైస్కూలు, పదకొండు, పన్నెండు తరగతులను మల్టీ పర్పస్ స్కూలు అని పిలిచేవారు. ఆ మల్టీ పర్పస్ స్కూలులో మొదటి బ్యాచో లోనో, రెండవ బ్యాచులోనో చదువుకున్న వాళ్ళల్లో డాక్టర్ జైపాల్ రెడ్డి, అడ్వకేట్ అమరేందర్ రావులు ఉన్నారు. ఆ తరువాత అక్కడ చదువుకున్న వారిలో ఇంగ్లీషు ఉపాధ్యాయులు రాధా కిషన్ ఉన్నారు. అక్కడే తరువాత రోజుల్లో బాలుర జూనియర్ కాలేజీ ప్రారంభం అయ్యింది. నిజాం ప్రభుత్వం జిల్లాకొక మిడిల్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా వివేకానంద స్కూలు భవనం కంటే ముందు బాబూఖాన్‌కు చెందిన బిల్డింగ్‌లో మిడిల్ స్కూల్ ప్రారంభించారు. అందులో ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉండేది. ఏబిసీడీఈఎఫ్ జీ సెక్షన్లలో ఏడు వందల మంది విద్యార్థులు ఉండేవారు. అందులో ఎఫ్.. జీ సెక్షన్లు ఉర్దూ మీడియం ఉండేది.

వీళ్ళకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు యాభై ఎనిమిది మంది ఉండేవారు. ఆ తరువాత రోజుల్లో తొమ్మిది, పదవ తరగతులకు అప్‌గ్రేడ్ చేయడానికి అప్పటి ఎంఎల్సీ శంకర్ రావు ఎంతో కృషి చేశారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాఘవులుని స్కూలుకు తీసుకువచ్చి అప్ గ్రేడ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసారు. అప్పట్లో నల్గొండ జిల్లాలోనే అతి పెద్ద స్కూలుగా పేరు పొందింది.

మిడిల్ స్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేసిన అబ్దుల్ ఖాదర్ ఫిదా, ఆ తర్వాత డీఈవో అయ్యారు. టీచర్‌గా పనిచేసిన లక్ష్మారెడ్డి ఆ తరువాత రోజుల్లో బొట్టుగుడ స్కూలుకి హెడ్మాస్టర్ అయ్యారు. కనకాచారి సార్, నోముల సత్యనారాయణ సార్.. ఇద్దరూ కూడా మిడిల్ స్కూల్లో టీచర్లుగా పనిచేసారు. ఈ మిడిల్ స్కూల్‌ని బషీర్ బాగ్ స్కూల్ అని కూడా పిలిచేవారు. పందొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో బషీర్ బాగ్ మిడిల్ స్కూల్ ని బొట్టుగుడలోని పజ్జూరు దొరవారి బంగ్లాకు మార్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడి స్మారకార్ధం మూడు కోట్ల రూపాయలు వెచ్చించి బొట్టుగుడ స్కూల్‌కి శాశ్వత భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ వార్త విన్న ఆ స్కూలు పూర్వ విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బషీర్ బాగ్ స్కూల్ బిల్డింగ్‌ని తర్వాత భగవంత్ రెడ్డి కొని అందులో వివేకానంద స్కూలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ స్కూల్ కూడా లేదు. అక్కడ ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నడుస్తుంది.

మునుగోడు రోడ్డులోని పెద్ద కట్ట దగ్గర మర్కజీ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. దానినే జూనియర్ బేసిక్స్ స్కూల్ (జేబిఎస్) అని కూడా పిలిచేవారు. ఇప్పటికీ ఈ స్కూలు ఇంకా నడుస్తుంది. ఆ స్కూల్ లో ఫోర్త్ క్లాస్ నుంచి చదువుకొని ఆ తరువాత రోజుల్లో అక్కడే టీచర్ గా పనిచేసారు శంకర్ రావు సార్. వాళ్ళ నాన్న గారు శ్రీరాములు కూడా అక్కడ ఉపాధ్యాయులుగా పనిచేసారు. అందులో ఉర్దూ మీడియం కూడా ఉండేది. మర్కజీ స్కూలునే పీల్ ఖానా స్కూలు అని పిలిచేవారు.

మర్కజీ స్కూలుకు దగ్గరలోనే బాలికల పాఠశాల మాల్ బౌలీ ఉండేది. శేర్ బంగ్లా దగ్గర ఆర్య సమాజ్‌కి చెందిన బద్రదేవ్ బాలికల పాఠశాల నడిపేవారు. అది కొద్ది రోజులే నడిచింది. బహార్ పేటలో న్యూప్రేమ్ టాకీస్ దగ్గర పెద్ద గిర్నీ పక్కన ఒక ప్రభుత్వ ఉర్దూ ప్రైమరీ స్కూలు ఉండేది. ఆ స్కూలు పేరు కాలక్రమేణా బార్ పేట స్కూలుగా మారిపోయింది. ఈ స్కూలు బషీర్ బాగ్ బాగ్ మిడిల్ స్కూల్‌కి అనుబంధంగా ఉండేది. బహార్ పేట స్కూలు ఇప్పటికీ నడుస్తున్నది. ఎంఆర్ఓ పక్కన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో అప్పట్లో నల్గొండ బాలికల పాఠశాల ఉండేది. ఈ స్కూలుకి అప్పటి ఎంఎల్సీ రాజారత్న గారి సతీమణి దీనారాణి ప్రధానోపాధ్యాయురాలుగా ఉండేవారు. ఆ తరువాత ఆమె డీఈవో కూడా పని చేశారు. ఆ ఇంటిని మీనాక్షి హోటల్ శివరామ్ కొని అక్కడే హోటల్‌ని మొదలు పెట్టాడు. ఆ తరువాత బాలికల పాఠశాలను పక్కనే ఉన్న బాలికల జూనియర్ కళాశాలకు మార్చారు. బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా అప్పట్లో రంగయ్య ఉండేవారు. ఈయన ప్రస్తుతం నల్గొండలో సీనియర్ కంటి శస్త్ర చికిత్స వైద్యుడు డాక్టర్ రమేష్ గారి నాన్న.

నల్గొండ మాన్యం చల్క లోని గోదాం దగ్గర సెంట్రల్ ప్రైమరీ స్కూలు ఉండేది. ఆ స్కూలులో తెలుగు, ఉర్దూ రెండు మీడియాలు ఏడవ తరగతి వరకు ఉండేవి.

ఈ స్కూలుకి అనుబంధంగా కంచనపల్లి, కేశరాజుపల్లి, కొత్తపల్లి, గ్రామాల స్కూళ్లు ఉండేవి. అప్పట్లో కొలనుపాక రఘునాథరావు ఆ స్కూల్లో టీచర్‌గా పనిచేసారు. నల్గొండ శివాజి నగర్ పక్కన ఉన్న నాగార్జున కాలనీలో పందొమ్మిది వందల డెభై అయిదు సంవత్సరంలో వేదవ్యాస ప్రాచ్య సంస్కృత పాఠశాలను ఆ కాలనీ సొసైటీ వాళ్ళు నెలకొల్పారు. ఈ వ్యవహారాలను అప్పట్లో చంద్ర మౌళి, వెంకటనారాయణ గార్లు చూసుకునేవారు. ఇకపోతే పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో కూడా ఒక ప్రైమరీ స్కూలు ఉండేది. అప్పటి ఎస్పీ సూర్యనారాయణ పోలీసు పిల్లల సౌకర్యార్థం ఆ స్కూలుని ఏర్పాటు చేశారు. అందులో పోలీసు వాళ్ళ పిల్లలే కాకుండా చాలా మంది బయటి విద్యార్థులు కూడా చదువుకునేవారు .రామగిరిలోని గాంధీ పార్క్ స్కూల్ కూడా చాలా పాతది. అప్పట్లో దోమలపల్లి యాదగిరిరావు స్వచ్చందంగా ఆర్య సమాజ్‌కి ఇచ్చిన అయిదు ఎకరాల భూమిలో రామగిరి బాలుర, బాలికల పాఠశాలలను నెలకొల్పారు. ఈ రెండు పాఠశాలలు బాగా నడిచేవి. పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం అధికంగా ఉండేది. ప్రతిభ గల ఉపాధ్యాయులు బోధకులుగా ఉండేవారు. ప్రస్తుతం విద్యార్థులు లేకపోవడంతో రామగిరి బాలికల పాఠశాలను బోయవాడ స్కూలులో కలిపేశారు.

అక్కడ ప్రస్తుతం యాభై విద్యార్థులకు, పదహారు మంది ఉపాధ్యాయులు పాఠాలు చెపుతున్నారు. రామగిరి బాలుర పాఠశాలలో కూడా విద్యార్థులు లేరు. ఇది కూడా రేపో ఎల్లుండో ఇతర స్కూల్లో కలిపేయడానికి సిద్దంగా ఉంది. బోయవాడ స్కూలు కూడా చాలా ఏళ్ళ క్రితం ప్రారంభించబడింది.

నాగార్జున డిగ్రీ కళాశాల పందొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో మొదలైంది. అక్కడ చదువుకొని బయటకు వచ్చిన చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేసిన సుధాకర్ రావు అరవై రెండు సంవత్సరంలో అక్కడ డిగ్రీ పూర్తి చేసారు. జగిని భీమయ్య కూడా అక్కడే చదివారు.

పులిజాల రంగారావు ఇంటికి ఎదురుగా వకీల్ సీతారామయ్య ఉండేది. ఆయన ఇంట్లో అప్పట్లో మహిళా డిగ్రీ కళాశాల ఉండేది. ఆ తరువాత పిడబ్యూడి ఆఫీసును ఖాళీ చేయించి కాలేజీని అక్కడికి మార్చారు.

పందొమ్మిది వందల ఎనభై దశకం చివరి నుంచి నల్గొండలో ప్రభుత్వ పాఠశాలలకు చీకటి రోజులు ప్రారంభం అయ్యాయనే చెప్పవచ్చు. ఎనభై, తొంభైవ దశకంలో ప్రైవేట్ పాఠశాలల ప్రాబల్యం పెరిగి, కుప్పలు తెప్పలుగా ప్రైవేటు బడులు పుట్టుకొచ్చాయి. నల్గొండలో పందొమ్మిది వందల అరవై అయిదులో మూడు క్రిస్టియన్ ప్రైవేటు బడులు ఉండేవి. అవి సేయింట్ ఆల్ఫాన్సెస్, లిటిల్ ఫ్లవర్, మెథడిస్ట్ మిషన్ స్కూళ్లు. ఆల్ఫొన్సెస్ స్కూలు బాలురదైతే, లిటిల్ ఫ్లవర్ స్కూలు బాలికలది, అయితే లిటిల్ ఫ్లవర్ స్కూలులో తెలుగు మీడియం స్కూల్ నిర్మలా విజ్ఞాన మందిర్ ఉండేది ఇదీ బాలికలదే.

ఈ మూడు స్కూళ్ళు అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ప్రైవేట్ స్కూళ్ళతో బొట్టుగుడ, రామగిరి, ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతంలో పోటీ పడుతుండేవి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఉంటుండేవి. ఆ తరువాత తొంభై దశకం ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠాలు చెప్పడంలో శ్రద్ధ తగ్గిందనేది నిజం. దానికి కారణం ఉపాధ్యాయులకు తమ వ్యక్తిగత వ్యవహారాలు, ఇతర వ్యాపకాలు అధికం కావడంతో స్కూళ్ళకు సరిగ్గా రాకపోవడం, ఒకవేళ వచ్చినా సంతకం పెట్టి వెళ్లి పోవడం లాంటివి జరుగుతుండేది. దానితో పిల్లల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. పిల్లలు ఫెయిల్ అవుతుండడంతో తల్లిదండ్రుల దృష్టి ప్రైవేటు ట్యూషన్లు, ట్యుటోరియల్స్ ప్రైవేటు పాఠశాలల మీదకు మారింది. అప్పట్లో బాస్కర్ టాకీస్ దగ్గర ఉన్న రావూస్ ట్యుటోరియల్స్ ట్యూషన్లకు ఫేమస్ ఇనిస్టిట్యూట్. దీనిని ఈశ్వర్ రావు సార్ నడిపేవారు. తరవాతి రోజుల్లో ఎనభై రెండు, మూడు సంవత్సరాలలో ఆయన అదే రావూస్ పేరుతో ప్రైవేటు స్కలుని కూడా నడిపారు. దాదాపు రెండు వేల ఆరు వరకు ట్యుటోరియల్స్,స్కూలు రెండూ నడిపారు. దీని కంటే ముందు ధరణి ట్యుటోరియల్ ఇనిస్టిట్యూట్ ఉండేది. అక్కడ పదవ తరగతి విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేవారు. నల్గొండలో సీనియర్ అడ్వకేట్ మహమ్మద్ అలీ సంబంధీకులు కూడా విద్యాధాయిని అనే ఇనిస్టిట్యూట్ నడిపించినట్లు తెలుస్తుంది. ఆ దశకంలో ఇంకా చాలా కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన అనతి కాలంలోనే మూసివేసిన దాఖలాలు ఉన్నాయి.

పందొమ్మిది వందల అరవై అయిదులో ప్రారంభం అయిన ఆ మూడు క్రిస్టియన్ ప్రైవేటు స్కూళ్ళ పదేళ్ల తరువాత అంటే పందొమ్మిది వందల డెభై అయిదులో గీతా విజ్ఞాన మందిర్ స్కూలు మొదలైంది.

విద్యావేత్తలు చిన వెంకట్ రెడ్డి, శ్రీరామచంద్రమూర్తి ఇంకా కొందరు కలిసి గీతా విజ్ఞాన సమితి అని ఒక సొసైటీనీ ప్రారంభించారు. స్కూలు ప్రాంగణంలో సాయంత్రం బీఓఎల్ ఓరియంటల్ కాలేజీ నడిపేవారు. నల్గొండ బాల భవన్‌లో సాయంత్రాలు పిల్లలకు సంగీతం, చిత్రలేఖనం, వివిధ వాయిద్యాలు ఉచితంగా నేర్పించేవారు. పందొమ్మిది వందల డెభై తొమ్మిదిలో జవహర్ భారతి పేరుతో ప్రైమరీ స్కూలు నడిపారు. ఆ సొసైటీ ఆధ్వర్యంలో పిల్లలకు ఎన్నో ఉచిత వేసవి శిబిరాలు నిర్వహించిన సందర్బాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా గీతా విజ్ఞాన మందిర్ స్కూలులో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో కలిపేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ స్కూలు లాండ్ ఓనర్ కూతురు అమెరికా నుంచి వచ్చి దానిపై స్టే తీసుకొచ్చినట్టు తెలిసింది. అప్పట్లో ఆ భూమిని లాండ్ ఓనర్ స్కూలు కోసం ఉచితంగా ఇచ్చారు. ఇంచుమించూ అదే సమయంలో ప్రారంభమైన మరో ప్రైవేటు స్కూలు ఎలమంద గారి దొడ్డ వీరయ్య మెమోరియల్ స్కూలు కూడా గీతా స్కూలుకి దీటుగా నడిచింది. రానురాను ఈ స్కూలు కూడా నడవక పోవడంతో దాన్ని రామగిరి బాలుర పాఠశాలలో విలీనం చేసారు. ఆ సంవత్సరం లోనే ప్రారంభం అయిన వేదవ్యాస ప్రాచ్య పాఠశాల, పాతబస్తీ బషీర్ బాగ్ లోని మిడిల్ స్కూల్ బొట్టుగుడకు షిఫ్ట్ అయ్యాక అదే బిల్డింగ్‌ను బగవంత్ రెడ్డి అనే అయన కొనుగోలు చేసి వివేకానంద అనే ప్రైవేటు స్కూలును ప్రారంభించారు. ఆ స్కూలులో కూడా అప్పట్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన ఉండేది.

ఆర్య సమాజ్ విశ్వామిత్ర గారి ఇంటి దగ్గర లింగం బాబు గారి సతీమణి అన్నపూర్ణమ్మ గాయత్రి విజ్ఞాన మందిర్ అనే ప్రైవేటు పాఠశాలను నడిపేవారు. డెభై తొమ్మిదిలో ముక్కామల నర్సింహా యాదవ్ వివేక వర్దిని విద్యా మందిర్ అనే ప్రైవేటు స్కూలును, ఎనభై మూడు సంవత్సరంలో నర్సింహారావు శేర్ బంగ్లా పక్కన ప్రదీప్ ప్రైవేటు స్కూలును, రవీంద్రనగర్ లో సేయింట్ ఆంథోనీ స్కూలును ప్రారంభించారు.

అదే ఎనభై మూడు సంవత్సరంలో కొలనుపాక రవి కుమార్ శ్రీ కృష్ణ దేవరాయ స్కూలుని, ఆ తరువాత రోజుల్లో మేథా విజ్ఞాన రత్న (ఎం.వీ.ఆర్.) అనే ఇంగ్లీషు మీడియం స్కూలు నెలకొల్పి ఇప్పటికీ విజయవంతంగా నడిపిస్తున్నారు. కొలనుపాక రవి కుమార్ నల్గొండలో శ్రీకృష్ణ దేవరాయ కల్చరల్ అసోసియేషన్ స్థాపించి గురువుగారు పురుషోత్తమాచార్యులు సహకారంతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. అదే సంవత్సరంలో పాండురంగయ్య రామగిరిలో విద్యాభారతి స్కూలు, పెద్ద సిస్టర్ ఇంటి దగ్గర జాగృతి స్కూలు నడిపారు. ఆ తరువాత రోజుల్లో పానగల్ దగ్గరికి షిఫ్ట్ చేసారు. ఎనభై మూడులో రవీంద్ర నగర్‌కి చెందిన మట్టపల్లి, అప్పారెడ్డి, మోహన్ రెడ్డిలు రవీంద్ర హైస్కూలుని నడిపారు. అప్పుడే ప్రసాద్ ఉడిపి హోటల్ దగ్గర బోయినపల్లి వెంకటేశ్వర్లు విజ్ఞాన జ్యోతి స్కూలు నడిపారు. ఈయన అప్పట్లో డాక్టర్ వసంతరావు దగ్గర పనిచేసేవాడు. రైల్వేస్టేషన్ రోడ్డులోని ఆర్టీసి కాలనీలో అబేదాభేగం గాంధీ మెమోరియల్ స్కూలు నడిపారు. రాజరత్నం కూతురు తమ తల్లిగారైన దీనారాణి పేరు మీద దీనా విజ్ఞాన మందిర్ అనే స్కూలుని ప్రారంభించి ఇప్పటికీ నడుపుతున్నారు. అప్పట్లో ఈ స్కూలు జైలుఖానా దగ్గర ఉండేది. ప్రస్తుతం జూనియర్ కాలేజీ పక్క సందులోకీ మార్చినట్లు తెలుస్తోంది.

ఖలీల్ అనే ఆయన భారత్ స్కూలుని ఎనభైవ దశకంలో నడిపినట్లు తెలుస్తోంది. పందొమ్మిది వందల ఎనభై నాలుగులో బస్టాండ్ పక్కన కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు దగ్గర వైద్యం వెంకటేశ్వర్లు, సుధాకర్, శ్రీకర్.. ఈ ముగ్గురూ కలిసి విద్యా గ్రామర్ స్కూల్‌ని నడిపారు. అప్పట్లో ఇది కూడా బాగా నడిచేది. వైద్యం వెంకటేశ్వర్లు అదే సంవత్సరం సెపరేట్‌గా బస్టాండ్ వెనుక ప్రశాంతి స్కూలుని నడిపాడు. ఎనభై అయిదులో నటరాజ్ టాకీస్ దగ్గర జనగాం యాదగిరి చైతన్య స్కూలుని నడిపాడు. పందొమ్మిది వందల ఎనభై అయిదు సంత్సరంలో నల్గొండ పబ్లిక్ స్కూల్ ప్రారంభం అయ్యింది స్కూల్ ప్రమోటర్స్ జగిని భీమయ్య, పులిజాల రామ్మోహనరావు, అమరేందర్ రావు వెంకటనారాయణ గౌడ్‌లు. ఈ స్కూలు అడ్వయిజర్ గా సురేష్ బాబు ఉన్నారు. మొదట్లో ఈ స్కూలు కబ్స్ అనే స్కూలు పేరుతో బీట్ మార్కెట్‌లో ఉండేది. ఆ తరువాత నల్గొండ పబ్లిక్ స్కూల్‌గా పేరు మార్చి హైదరాబాద్ దారిలోని మీర్ బాగ్ కాలనీలోని స్వంత భవనంలోకి మార్చారు. ఎనభై ఎనిమిదిలో విద్యావేత్త చిన వెంకట్ రెడ్డి ఎస్.వి.ఎస్. స్కూలుని నడిపారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ క్లాసులతో ఆ స్కూలుని కేవలం అయిదు సంవత్సరాలు మాత్రమే నడిపారు. పందొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రామగిరిలో బాదిని నర్సింహా ఆల్ఫా హై స్కూల్ ప్రారంభించారు. ఈ స్కూలు అప్పట్లో చాలా బాగా నడిచేది. అదే సంవత్సరంలో దేవరకొండ దారిలో సత్యనారాయణ రెడ్డి సాంధీప్ అనే స్కూలు ప్రారంభించారు. తొంభై అయిదు సంవత్సరంలో మమత హైస్కూలు కూడా ఉండేది..

ఒక్క ఎనభైవ దశకంలోనే నల్గొండ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వాటి ధాటికి తట్టుకోలేక ప్రభుత్వ పాఠశాలలు కుప్ప‌‌‌ కూలిపోయాయి. విచిత్రం ఏమిటంటే పాఠాలు చెప్పడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు కానీ వినడానికి విద్యార్థులే లేరు. సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయులు ఎన్ని తంటాలు పడుతున్నా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఇష్టపడడం లేదు. ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్నం భోజనం.. ఇలా ఎన్ని ఇచ్చినా పిల్లలను, వారి తల్లిదండ్రులను ఆకర్షించడం కష్టంగా మారింది. ఉచితం అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా ఉండవనే ప్రగాఢ నమ్మకానికి ప్రజలు వచ్చేసారు. నిజం చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు అనేక మంది ఉన్నారు. కానీ ఈ విషయాన్ని ప్రజలు గుర్తించేదెలా..

ఉదయం ఎనిమిది గంటలు.. పట్టణ శివారులోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి డూప్లెక్స్ ఇల్లు. చాలా ఖరీదైనది. ఆయన పట్టణంలో ఒక ప్రభుత్వ హైస్కూలులో మాథ్స్ టీచర్.

సరిగ్గా ఎనిమిది గంటలకు తన స్విఫ్ట్ డిజైర్ కారులో తన ఇద్దరు పిల్లలను ఎక్కించుకొని బయలుదేరాడు. కారు నేరుగా వెళ్లి ఒక కార్పోరేట్ స్కూలు ముందు ఆగింది. కారులో నుంచి దిగి పిల్లలను తీసుకుని స్కూలు లోపలికి వెళ్ళాడు. పిల్లలను వాళ్ళ వాళ్ళ క్లాసులకు వెళ్ళమని చెప్పి ఫీజు కౌంటర్ దగ్గరకి వెళ్ళాడు. అక్కడ తాను తన పిల్లల పేర్లు, క్లాసులు చెప్పి టర్మ్ ఫీజు చెల్లించాడు. రిసిప్ట్ తీసుకొని జేబులో పెట్టుకొని తిరిగి కారులో తాను పనిచేసే స్కూలుకు చేరుకున్నాడు. అప్పటికే బడిబాట కార్యక్రమానికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న తోటి ఉపాధ్యాయులతో బయలుదేరాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here