జీవితానుభవాల నుంచీ పుట్టిన కథలు – ‘నల్ల సూరీడు’

4
5

[dropcap]గ[/dropcap]త కొద్ది కాలంగా తెలుగు సాహిత్య రంగంలో రెగ్యులర్‍గా వినిపిస్తున్న పేరు ‘రోహిణి వంజారి’. వివిధ పత్రికలలో వీరి కథలు, కవితలు ప్రచురితమయ్యాయి.

శ్రీమతి రోహిణి వంజారి రాసిన 21 కథలతో వెలువరించిన కథా సంపుటి ‘నల్ల సూరీడు’. ఇది రచయిత్రి తొలి కథా సంపుటి.

ఇప్పటివరకు దాదాపు 70కై పైగా కథలు రాశారు. వాటిల్లోంచి ఎంచుకున్న 21 కథలతో ఈ పుస్తకం వెలువరించారు.

ఈ పుస్తకానికి ప్రముఖ రచయితలు దగ్గుమాటి పద్మాకర్ గారు, సుధామ గారు, కె. ఎ. మునిసురేష్ పిళ్లె గారు ముందుమాటలు రాయగా, జగన్నాథశర్మగారు వెనుక అట్ట మీద తన అభిప్రాయం తెలియజేశారు.

జీవితాలలోని వాస్తవాలు, కొన్ని భ్రమలు, మరికొన్ని కలలు ఈ కథలకు కథావస్తువులని రచయిత్రి అన్నారు.

***

ఇంటా బయటా, బస్సుల్లోను, రైళ్ళలోనూ – వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీలను మాటలతో, చేతలతో వేధించే వంకర బుద్ధి మగవాళ్ల గురించి ‘క్రూకెడ్’ కథ చెబుతుంది. జుగుప్సాకరంగా వాగే వారికి, సరైన గుణపాఠం చెప్పితీరాలని ఈ కథ చెబుతుంది.

పాములంటే అందరికీ భయం. అవి విషపు పామో, విషరహితమైనవో తెలుసుకోకుండానే వాటిని చంపేస్తుంటారు. అయితే ఈ మధ్య కొంచెం అవగాహన పెరిగి స్నేక్ కాచర్స్‌ని పిలిపించి, పాముల్ని పట్టించి, వాటిని – మనుషుల వల్ల వాటికీ, వాటి వలన మనుషులకీ ప్రమాదం లేని స్థలల్లో విడిచిపెడుతున్నారు. ‘కుబుసం’ కథలో ఇలాగే చేస్తుంది శారద. అయితే శారదలో మరో అవగాహన కూడా కలుగుతుంది. పుట్టలో పాలు పోస్తే పాము ఆకలి తీరుతుందో లేదో తెలియదు కానీ, ఆ పండగ పూట ఓ పది మంది నిరుపేదల ఆకలి తీరుస్తుంది.

జీవితంలో గెలవాలనే తపన ముందు, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ముందు – ఎన్ని అడ్డంకులైనా ఎలా తొలగిపోతాయో ‘మధు’ కథ చెబుతుంది. అయితే మనలోని తపన, పట్టుదలలకు ప్రోత్సాహమిచ్చి, ముందుకు నడిపే మంచివాళ్ళ తోడు దొరికితే తప్పక విజేతలవుతామని ఈ కథ నిరూపిస్తుంది.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు, నమ్మినవాళ్ళే మోసం చేసినప్పుడు, ఉన్న పరిస్థితులు తారుమారైనప్పుడు ఎవరికైనా పోరాటం తప్పదు. ‘సరంగు’ కథలో విశాల పరిస్థితి అదే. జీవితమే ఓ పోరాటమైనప్పుడు, జీవితమే మనకు కావల్సిన ఆయుధాలను అందిస్తుంది. పోరాడి గెల్చిన వాళ్ళని తోటివాళ్ళకి ఉదాహరణగా నిలుపుతుంది. బ్రతుకుపోరులో విశాల ప్రదర్శించిన ధైర్యం, నిబ్బరం నేటి సమాజంలో అందరికీ అవసరం. స్ఫూర్తిదాయకం కూడా.

బాహ్య రూపం చూసి మనుషుల స్వభావాలని అంచనా వేయడం కష్టమని – ‘చెల్లె’ కథ చెబుతుంది. చిన్న కథే అయినా పాఠకుల మనసుపై తనదైన ముద్ర వేస్తుంది.

నమ్మకమే దైవం, నమ్మడం అంటూ జరిగితే మనిషికి మనిషే దైవం అని చెబుతుంది ‘పరబ్రహ్మం’ కథ. సాటి మనుషుల ఆకలి తీర్చే విషయంలో కాలక్రమంలో సమాజంలో వచ్చిన మార్పుకి ఈ కథ అద్దం పడుతుంది.

కరోనా తగ్గినా కొంతకాలం పాటు మనుషుల్లో అపోహలు కొనసాగిన వైనాన్ని, చిన్నపాటి జలుబులూ, జ్వరాలకే తోటివారిని దూరం పెట్టిన జనాలని ‘జాడలు’ కథలో చూడవచ్చు. తమ ఇంటి ఎదురుగా కూర్చుని చెప్పులు కుట్టద్దు అని బెదిరించి, అసహ్యించుకున్న కొండయ్యే దిక్కవుతాడు సుధాకర్‍కి. కొండయ్య వృత్తి, కులం వల్ల చిన్నచూపు చూసిన సుధాకర్‍ని ఆ కొండయ్యే సకాలంలో ఆసుపత్రిలో చేర్చి ప్రాణం కాపాడుతాడు. కొండయ్య మాటలతో సుధాకర్‍లో మార్పు వస్తుంది. కానీ మనం అనుకున్నట్లు సాగదు జీవితం అని ఈ కథ మరోసారి నిరూపిస్తుంది.

మనుషుల్లో వస్తున్న మార్పుల వల్ల – స్వార్థం పెరిగి – ఎవరి బ్రతుకు వాళ్ళదైపోతోంది. ఇతరుల గురించి మాకు అనవసరం అనే ధోరణి ప్రబలుతోంది. జీవితం యాంత్రికమై, పొరుగువారిని పట్టించుకోనంతగా ఉంటున్నారు జనాలు. అయితే అందరూ అలా తయారయ్యారని చెప్పలేం, మానవత్వం మీద విశ్వాసం ఉన్న వ్యక్తులు కొందరైనా ఇంకా ఉన్నారనీ, సాటి మనుషులకు జీవితం పట్ల భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్తుంది ‘ఆసరా’ కథ.

దళితుడైన కారణంగా అవమానాలు ఎదుర్కున్న సూరీడు మతం మారి సురేంద్ర పాల్ అవుతాడు. అయినా అతనికి హేళనలు తప్పవు. మనుషుల్లో దరహంకారులు ఉన్నట్టే, మంచివాళ్ళు ఉంటారు. కులాల పిచ్చిలో కొట్టుకుపోయేవాళ్ళున్నట్టే, కులం, మతం పట్టించుకోకుండా, మనిషిని మనిషిగా చూసే వ్యక్తులూ ఉంటారు. తనని చీదరించుకున్న వ్యక్తికే సాయం చేసి అతనిలో మార్పుకు కారణమవుతాడు సూరీడు ‘నల్ల సూరీడు’ కథలో.

ఒక మంచి పని చేయడానికి గట్టి నిర్ణయం తీసుకుంటే కాలమూ కలిసి వస్తుందని చెబుతుంది ‘దత్తత ఫలం’ కథ. ‘డ్రైవరో నారాయణో హరి’ కథ నవ్విస్తుంది. అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ పైనా, నగరంలోని షేర్ ఆటో డ్రైవర్ల ‘వేచిచూత’ ధోరణిపై, వారి రాష్ డ్రైవింగ్‍పై వ్యంగ్య బాణాలు సంధిస్తుంది.

నోటికి తీపి ఎంత కోరుకుంటామో, మనసుని కూడా అంతే తియ్యగా చేసుకోవచ్చని చెబుతుంది ‘ఇచ్చుటలోని ఆనందం’ కథ. అసూయ మనిషిని నిలువెల్లా దహించివేస్తుందని నిరూపించిన కథ ‘సూపర్ టీచర్ సిండ్రోమ్’. పిల్లలకి అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం వేరు, సూపర్ టీచర్ అని అనిపించుకోడం వేరు. మనసులో ఓర్వలేనితనం పేరుకుపోతే, అది శరీరంపై ప్రభావం చూపుతుందని ఈ కథ చెబుతుంది.

అప్పుడప్పుడే కౌమారదశలోకి అడుగుపెడుతున్న పిల్లలకు మానవ పునరుత్పత్తి అంశాల మీద సైన్సు పాఠాలు చెప్పడానికి ఎంత ఓర్పు, ఎంత నేర్పు కావాలో ‘కంచె’ కథ చెబుతుంది. ఉపాధ్యాయుడిగా ఉంటూనే – ఎదుగుతున్న పసిమొగ్గల శరీరాలపై వికృత చేష్టలు చేసి, వారి మానసికంగా హింసిస్తున్న కామాంధుడి ఆటలను తెలివిగా కట్టిస్తుంది రాగిణి టీచర్ ఈ కథలో. పాఠాలు చెప్పడమే కాదు, పిల్లల మనోవేదనని కూడా టీచర్లు గుర్తించాలని ఈ కథ సూచిస్తుంది.

మతం కన్నా, సాటిమనిషికి సాయం చెయ్యాలన్న అభిమతం గొప్పదని ‘అభిమతం’ కథ చెబుతుంది. మతమేదైనా మనుషులొక్కటే, మానవత్వమొక్కటే అని చెప్పిన కథ. తమకి అవసరమైనప్పుడు సాయం చేసిన మూర్తిగారు కష్టాల్లో ఉన్నారని తెలిసి – ఆయన అభిమానం దెబ్బతినకుండా – తమకు చేతనైనంత సాయం చేసిన రషీద్, డేవిడ్‍ల వ్యక్తిత్వం గొప్పది.

రిటైరయిన తండ్రి ఫించన్ డబ్బుల కోసం ఎటిఎం వద్దకు కాకుండా, తనని బ్యాంకుకు ఎందుకు తీసుకెళ్ళమంటాడో కొడుకుకి అర్థం కాదు. తీరా కారణం గ్రహించేసరికి తండ్రి భౌతికంగా దూరమవుతాడు. ఆ కొడుకుతో బాటు పాఠకుల గుండె కూడా బరువెక్కుతుంది ‘నాన్న కోరిక’ కథ చదివాకా.

ట్రాన్స్‌జెండర్‍ల జీవితాలలోని వెతలను చెప్పిన కథలు చాలానే ఉన్నాయి. కానీ అమ్మాయిగా మారిన ఓ అబ్బాయి విజయగాథని తెలుపుతుంది ‘విజేత’ కథ. కథలోని అబ్బాయికి అమ్మాయిగా మారడంలో తల్లిదండ్రులు మద్దతునిస్తారు. కాని వాస్తవ జీవితంలో అలా జరగదు అనేవాళ్ళు ఉంటారు. పురుషుడి నుంచి స్త్రీగా మారటాన్ని వ్యక్తులు ఆమోదించవచ్చు, కానీ సమాజం అంగీకరించదు. అయితే మార్పు దిశగా ఓ ముందడుగుగా దీన్ని భావించవచ్చు.

కరోనా కాలంలో ఆసుపత్రుల పాలయిన వారి మనసులోని అలజడిని కళ్ళకు కడుతుంది ‘ధనాత్మకం’ కథ. ఏదైనా జబ్బు చేసి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు బహుశా మనిషి తన జీవితాన్ని పునఃపరిశీలించుకుంటాడేమో. ఈ కథలో మధుసూదనరావుకి అలాగే అవుతుంది. ఓ పెద్ద ఆసుపత్రిలో మంచం మీద పడి ఉన్నప్పుడు తాను చేసిన నీచపు పనులని జ్ఞాపకం చేసుకుని బాధపడతాడు. బ్రతికి బయటపడి, మిగిలిన జీవితాన్ని కొత్త జన్మలా భావించి – గతంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు.

బాల్యం లోని భాధాకరమైన సంఘటనలు మనసులో పేరుకుపోయి, పెళ్ళయి సంతానం కలిగే సమయంలో ట్రామాగా మారుతాయి మైత్రి విషయంలో. వైద్యుడైన మిత్రుడు, మరో నిపుణుడి సహాయంతో మైత్రి మనసులోని వేదనని తెలుసుకున్న ఆమె భర్త – ఆ వేదనని దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు ‘దమనం’ కథలో. వర్క్-లైఫ్ బాలన్స్ గురించి, మానసిక సంతులనం గురించి చెప్తుందీ కథ.

అనావృష్టి వల్ల, అతివృష్టి వల్లా పంటలను కోల్పోయే రైతుల వేదనని చిత్రించిన కథ ‘కటిక నిజం’. మూగ జంతువులతో మనిషికి ఏర్పడే అనుబంధాన్ని చెప్పిన కథ ‘బుజ్జమ్మ పిల్లి’.

***

సరళమైన శైలిలో, మోతాదుకి మించని వర్ణనలతో, అవసరమైన మేర సంభాషణలతో, సన్నివేశాలని కళ్ళకు కడుతూ రాసిన కథలివి. భారీ సందేశాలిచ్చే కథలు కాకపోయినా, సానుకూల దృక్పథాన్ని కలిగించే కథలు ఇవి. జీవితంలో పోరాడాలనీ, ఆత్మహత్యలు సరికావని ఈ కథలు చెప్తాయి. అయితే ఈ కథలలో చెప్పినట్లు ఉండవు నిజ జీవితాలు అని కొందరు అనుకోవచ్చు; కానీ ఈ కథల్లో చాలా వరకూ రచయిత్రి స్వయంగా చూసిన జీవితాలలోలేవే. ఎలా ఉండకూడదో చెబుతూనే, ఎలా ఉంటే జీవితం సాఫీగా సాగుతుందో తెలిపే కథలు ఇవి.

ఈ కథలు చదివాకా, “కథలు ఫలానా రకంగా రాయలి అనే ప్రమాణాలు ఏవీ లేవు. కథను ఎలాగైనా రాయవచ్చు. అయితే మనం రాసిన కథను పాఠకులకు కనెక్ట్ అయ్యేలా చేసుకునే ప్రతిభ – మారుతున్న కాలమాన పరిస్థితులను అనుక్షణం పరిశీలిస్తూ ఉండడం, పఠనం, నిరంతర సాధన వల్ల వస్తుందని నేను నమ్ముతాను” అన్న రచయిత్రి అభిప్రాయం సరైనదని చదువరులకు అనిపిస్తుంది.

***

నల్ల సూరీడు (కథా సంపుటి)
రచన: రోహిణి వంజారి
ప్రచురణ: ఆదర్శిని మీడియా, హైదరాబాద్
పేజీలు: 152
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
శ్రీమతి రోహిణి వంజారి: 9000594630
శ్రీ కె. ఎ. మునిసురేష్ పిళ్లె: 9959488088

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here