నవతరం సాహిత్యానికి దీపారాధన ‘నల్లమబ్బుపిల్ల’

1
10

[సాయిమల్లిక పులగుర్త రచించిన ‘నల్లమబ్బుపిల్ల’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. కాళ్ళకూరి శైలజ.]

[dropcap]హే[/dropcap]తువాదం, కాల్పనిక ప్రయోగం అనే రెండు పరస్పర విరుద్ధ భావనల నడుమ నేటి యువత ఊగిస లాడుతోంది. అరక్షణంలో వందల వేల మనుషుల ‘రీచ్’ దొరుకుతోంది. కానీ వారిలో F.O.M.O. fear of missing out.. ఏదో కోల్పోతున్న బాధ, అసంతృప్తి.. ఉంటున్నాయి. ఐతే వీరంతా ఇంతే అనుకోలేం. ఎన్నో నూతన ఆవిష్కరణలు, మరెంతో సామాజిక స్పృహతో చేసే పనులు కూడా వీరు చేస్తున్నారు.

ఈ తరం నుంచే మనకు సాయిమల్లిక అనే కొత్త కవయిత్రి దొరికింది. ముఖ పుస్తక పరిచయాలను ముఖత మార్చి, ఆన్‌లైన్ లోనే అందమైన అక్షరాల వంతెనలు వేసింది. ‘ఆంటీ’, ‘అంకుల్’, ‘అమ్మమ్మ’, ‘పెద్దమ్మ’, ‘పిన్ని’ అంటూ ఒక కుటుంబాన్ని నిర్మించింది. లలిత కళల్లో బొమ్మలు చేయడం, వేయడం, కవిత్వం వ్రాయడంతో పాటు మరికొన్ని ఉన్నాయి కదా! ఈ చిన్నారి కవయిత్రి అదనంగా ‘వ్యక్తుల నడుమ అనుబంధాలను నిర్మించే’ కళను చేర్చింది.

విదేశాల్లో, ప్రత్యేకత గల ఏ కొత్త పని చేసినా వారిని ఘనంగా ప్రస్తావిస్తారు. అలా, మన మధ్య కూడా అలాంటి ఒక యువ కెరటం ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆమెయే సాయిమల్లిక పులగుర్త.

జెన్ బౌద్ధంలో జపనీ పదమైన ‘సతోరి’ చాలా ప్రముఖమైనది. ‘సతోరి’ అంటే మేధకు అందని ఒక మెరుపు లాంటి అద్భుత జ్ఞానోదయం. ఒకానొక పారదర్శక దృష్టి. దానికి అందని వస్తువు, ఆలోచన, అనుభూతి ఏమీ ఉండవు. ఆ మాటకొస్తే, పత్తిని వత్తిగా చేసి, మునిగే దాకా నూనె పోసి, కొసలను పైకి తేర్చి, పదిలంగా వెలిగించి, గది నిండా వెలుతురు పంచే దీపారాధన జెన్ బౌద్ధం అనుకోవచ్చు. ఈ ప్రక్రియను మనకు అందించే చిట్టి కవిత పేరే హైకు. సాయిమల్లిక చేసినది ఈ దీపారాధన. తన తొలి పుస్తకం కవిత్వం కావటం, అది హైకు ప్రక్రియ కావడం, దానికి ‘నల్ల మబ్బు పిల్ల’ అని పేరు పెట్టడం అన్నీ సహజంగా జరిగిపోయాయి.

‘నల్ల మబ్బు పిల్ల – మరికొన్ని హైకూలు’ అనే కవిత్వ పుస్తకంలో మానవేతర ప్రాణుల్లో రూపం, చేష్టల్లో మానవీయతను అన్వేషిస్తూ, దానిని ప్రతిబింబించే కవితలెన్నో ఉన్నాయి. దీన్ని Personification అనుకోవచ్చు.

//ఈ చీకటిలో లాంతరు వెలుగులో నా చేతులు వాటి నీడతో ఆడుకున్నాయి.//

//సీతాకోకచిలుక రాకకై ఎదురుచూస్తూనే ఎరుపెక్కింది మందారం//

//నాన్న లేని పాపాయికి మామై మమ్ము పెట్టాడు నిండు చందమామ.//

వీటిలో ఒక లోతైన భావన చదవగానే మన మనసును పట్టి నిలుపుతుంది.

మానవుడు యంత్రలాభం పైనే దృష్టి పెట్టి, తన శ్రమ తగ్గించుకుని, మరిన్ని, మరిన్ని, యంత్రాలను కనిపెట్టి వాటిని వాడుకుంటూ తానే ఒక యంత్రమైపోయాడు. ఈ యాంత్రికత నుంచి కాస్త భిన్నంగా, సరికొత్త దృక్కోణంలో ఆలోచించే వారిని కళాకారులు అంటాం. అలా, ఒక సహజ సుందర కవిత్వ స్ఫురణ సాయి మల్లిక హైకూల్లో పుష్కలంగా ఉంది.

//పువ్వును ఓదారుస్తూ తన కన్నీటి తోడై కురిసింది వర్షం//

…… ఇందులో వానను,

//చమత్కారపు

మడత లేసి అక్క చేసి

నేర్పిన భలే భలే కొబ్బరాకు బొమ్మ//

..అనడంలో కొబ్బరాకు బొమ్మను

//మొహమాటంలో మునిగిన కబుర్లు కొన్నేళ్ళకు స్నేహ సముద్రంలో తేలాయి//

..ఇందులో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఎంత అందంగా విప్పి చెప్పిందో, అంత భావ గర్భితంగా కూడా చెప్పింది.

కొన్నిచోట్ల విరోధాభాసను ‘కవిత’ అనే కాగితంలో చుట్టబెట్టి మనకు అందిస్తుందిలా..

//కొత్త జ్ఞాపకాలు తెస్తూ వచ్చింది మరచిన పాత తోవ//

//గాలితో ఆకాశాన్నంటే భగీరథ ప్రయత్నం లో కిటికీ పరదా//

ఈమె ఈతరం అమ్మాయిగా పెద్దవాళ్ళను ఎదిరించిందా? అంటే అవును ఎదిరించింది,కానీ సున్నితంగా, అని చెప్పాలి.

//ఇవన్నీ మేము పడ్డామని చెప్పడం ఎంత సులువో పడడం అంత కష్టం//

అంటూ తమ గమనంలో బాధలను సూచిస్తోంది..

తాను వెళుతున్న బాటలో ట్రాఫిక్ అందాలను సరికొత్త వర్ణాలతో ఆవిష్కరించి ‘ఈ దేశంలో వాహనం నడపడం చాలా కష్టంరా బాబు’ అని తల కొట్టుకునే ప్రతి వారికీ ప్రతిసారీ ఊరట నిచ్చే హైకూలను మల్లిక వ్రాసిన తీరు అబ్బురపరుస్తుంది. నిజానికి వీటిని ప్రతి కూడలిలో చిన్నా, పెద్దా ‘హోర్డింగులు’గా పెట్టాలి. అప్పుడు వాటిని చదువుతూ అందరం ఎంతో హాయిగా, ఏ చికాకులు లేకుండా నవ్వుతూ సాగిపోతాం. మచ్చుకు కొన్ని చెప్పనా?!

//ట్రాఫిక్ అంతా చిందర వందర చేసేసి రోడ్డు మధ్యలో హాయిగా బజ్జున్న బుల్లి దూడ//

//వాహనాల బద్దకపు నిద్రను వదలగొడుతూ నాట్యం చేయిస్తున్న స్పీడ్ బ్రేకర్స్//

//రోజంతా పచ్చగా ఉండి ఆలస్యమైనప్పుడు మాత్రమే ఎరుపెక్కి పోయే సిగ్నల్ శత్రువు//

ఇవి చాలవూ?!!!!

కాలం మారినా కొన్ని ‘Random Acts of kindness’ మారవుట! సాయి మల్లిక చెప్పిన ఈ మాట తద్ధర్మ కాలానికి చెందిన ఒక ఆర్యోక్తిని విన్నంత గొప్పగా ఉంటుంది.

//ఆంటీ మీ చున్నీ టైర్లో పడుతోందని సైగ చేసి వెళ్ళిన కుర్రాళ్ళు//

//మండే ఎండల్లో మేడ మీద పక్షుల కోసం రోజూ నీళ్లు పెట్టే ఇంట్రోవర్ట్ అబ్బాయి.//

//జామ పళ్ళ బుట్ట కేసి చూస్తున్న పిల్లాడికి

కొన్న వాటిలో

రెండు కాయలు ఇచ్చిన హెల్మెట్ అంకుల్//

ఇవన్నీ ఎలా హైకూలయ్యాయో మనందరికీ తెలుసు. వాటి వెనుక నున్న శబ్ద చిత్రాల వలనే. హైకూ గురించి ఒక్కసారి ఇంటర్నెట్‌లో కొడితే వివరాలు తెలుస్తాయి గానీ, అలా మొదటి పాదంలో ఒక సందర్భాన్ని ప్రస్తావించి రెండు మూడు పాదాల్లో దాన్ని స్థిరీకరించి, చివర ఒక మెరుపులాంటి దర్శనం కలిగిస్తూ అత్యంత సమర్థవంతంగా వ్రాయడం అంత సులభమైన పనేం కాదు. అది ఈ బంగారు తల్లి చేసిన ఇంద్రజాలం. ఎంతటి వేసవిలోనైనా పరిమళాలు గుబాళించే మల్లిక అంటే ఇదే కదా!

పసి పిల్లల చేష్టలకు మనం ఆనందంతో ఉక్కిరిబిక్కిరై నిశ్చేష్ఠలమౌతాం, కానీ మల్లిక మాత్రం బోలెడు హైకూలు రాసేస్తుంది. ‘బుజ్జిగాళ్ళ సందళ్లు’ అని పేరు కూడా పెట్టింది!

బుడ్డిది, అమ్మకూచి, దొంగది, చిన్ని పాప, అల్ప సంతోషి, అల్లరోడు, పాల మీసాలోడు, గుడ్ బాయ్, బాడ్ గాల్, చిన్నోడు, రెండు పళ్ళోడు, బుల్లి బాబు, గుండ్రం మొహంది.. అంటూ కాగితంపై హైకూ ‘బాలానందం’ కార్యక్రమం నిర్వహించింది. ఈ అన్ని హైకూలలో అత్యంత మురిపమైనది,

//ఇన్నాళ్లు తెగ అడిగించుకున్నాక మొత్తానికి ‘అమ్మ’ అనేశాడు చిన్నోడు.//

కళాసృజన జరగాలంటే జగమంతా ప్రేమ నిండి ఉందనే ఒక ఎరుక కావాలి. సౌందర్యం అణువణువునా ఉందన్న దృష్టి కావాలి. రోజువారీ జీవితంలో ఎత్తు పల్లాలను ఒడిదుడుకులను స్వీకరించగల సత్తా కావాలి. వీటన్నింటికీ అత్యంత మౌలికమైనది మరొకటి ఉంది. అదే నేల విడిచి సాము చేయకుండా ఉండడం. ఈ యువ కవి కాల్పనిక జగత్తులో విహరించలేదు. పని ఒత్తిడిని అసహనంతో హెచ్చవేసుకోలేదు. కళ్ళను ఆప్టిక్ నెర్వ్ అనే నరం మెదడుకు అనుసంధానిస్తుందట! ఈ కవి కళ్ళు మాత్రం మనసుతో పెనవేసుకున్నాయి. అందుకే తాను చూసిన సాధారణ విషయాలను కూడా పాఠకునికి విస్మయం కలిగించేటంత అందంగా వ్రాయగలిగింది.

ఈమె కవిత్వంలో జీవన తాత్వికత కూడా అక్కడక్కడ మెరిసింది.

//ఉంటే ఉందని

లేకపోతే లేదని మనిషి పడే బాధ//

సాహిత్యంలో ఏ ప్రక్రియ ద్వారా తనను తాను అభివ్యక్తీకరించుకుంటారోననేది చాలా కీలకమైన విషయం. సాయి మల్లిక తన గమనింపులను హైకూలుగా మలచుకోవడం సంతోషదాయకం. పారదర్శకంగా నిష్కల్మషంగా ఉంటేనే ‘వీక్షణ మాత్ర దర్శనం’ సాధ్యం. నిజానికి దాన్ని RESONANCE (అనునాదం) అంటాం. కంటికి కనబడని, చెవికి వినబడని ఎన్నో తరంగాలు మన చుట్టూనే ఉంటాయి. వాటిని చూసే, వినే ‘సంసిద్ధత’ …ఇదే కళాత్మకత. ఈ లక్షణం ఈ కవిలో పుష్కలంగా ఉంది

అందుకే, ఈమె ఈనాటి విధ్వంసాన్ని కూడా చెప్పగలిగింది.

//వీళ్ళిద్దరికీ వినబడదు ఒకరికి చెవుడు.

ఇంకొకరి దగ్గర ఫోన్ ఉంది//

//మా పుస్తకాల

కొత్త వాసన మీ కిండిల్ ఇవ్వగలదా? అని గర్వంగా ప్రశ్నించాయి//

//అమ్మకి ఆశ్చర్యంగా నక్షత్రం చూపిన వేలు ఇప్పుడు ఫోన్‌లో మీమ్ పంపి చూడమంది.//

ముత్యాల్లాంటి ఈ మూడు ఈ హైకూలూ మనుషుల మధ్య బాంధవ్యాలు, చివరికి తల్లీ బిడ్డల అనుబంధం సైతం ఎలా బీటలు వారాయో యాంత్రికత వలన ఎలా సహజత్వం మరుగున పడిందో చెబుతూ మనలను హెచ్చరించే ‘స్మార్ట్’ చురకలుగా ఆవిష్కరించింది.

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సుమారు 100 పేజీల్లో 300 పైగా హైకూలను రాస్తే వాటిలో 90 శాతం మళ్లీ మళ్లీ చదువుకునేలా ఉండడం. ఎక్కడా మొనాటనీ లేదు.

ఈమె హైకూలు పాఠకుని మనసును మెల్లగా తాకి, చిరునవ్వుల కానుకలిచ్చి, జడత్వం లోంచి స్పందన లోకి వేలు పట్టుకుని నడిపించే దారి దీపాలు. అందుకే అంటాను సాయి మల్లిక పులిగుర్త ‘నల్లమబ్బుపిల్ల’ అనే పుస్తకంతో నవతరం సాహిత్యానికి దీపారాధన చేసింది. ఈ వెలుగులో ఆశావహ పయనం సాగించడం అటు రచయితలకు, ఇటు పాఠకులకు కవి ఇచ్చిన సందేశం.

సంపూర్ణం, పరమోత్తమం, అమృత సదృశం అంటే ఏమిటి? జీవితం పై ఇష్టం కలిగించడం. అందుకే ఈ నవతరం ప్రతినిధి

//చెయ్యగలిగితే గొప్ప, లేకపోతే తప్పు- మాత్రమే కాదు నువ్వు//

అనే వాక్యాన్ని బుక్ మార్క్ మీద ప్రచురించి యువశక్తిని పోలికల పోటీ నుంచి సానుకూల దృక్పధం వైపు నడిపిస్తోంది. అదే ఈ పుస్తక ప్రయోజనం కూడా.

‘ఇంస్టా’ కాలంలో తన ఎదుటనున్న సాకారమైన వాటిని నిరామయ నిరాకారత లోకి, తాను చూసిన సుందర క్షణాలను సుమధుర కవితా పంక్తులుగానూ మార్చగలిగిన పరుసవేది విద్య ఈ చిన్నారి ప్రత్యేక నైపుణ్యం. ఇలాగే భవిష్యత్తులో కూడా ఎన్నో మంచి సాహితీ స్వరూపాలను ఎంచుకుని, నిర్మాణాత్మక నిసర్గ కళారూపాలుగా సాయిమల్లిక మార్చాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలతో స్వాగతిద్దాం.

***

నల్లమబ్బుపిల్ల (మరికొన్ని హైకూలు)
రచన: సాయిమల్లిక పులగుర్త
పేజీలు: 144
వెల: ₹ 150/-
ప్రతులకు:
వెన్నెల పబ్లికేషన్స్
హౌస్ నెం. 72,
జూయెల్ మాన్షన్
ఫ్లాట్ నెం. 402, నవోదయ కాలనీ,
మెహిదీపట్నం,
హైదరాబాద్ 500028
ఫోన్: 8008928587.

 

~

సాయిమల్లిక పులగుర్త గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-ms-p-sai-mallika/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here