నల్లటి మంచు – దృశ్యం 10

0
13

[box type=’note’ fontsize=’16’] ఇంటిని, ఊరినే కాదు తమ ఉనికినే కోల్పోతున్న కాశ్మీరీ ప్రజల దుఃఖం – ‘డయస్పోరా’గా మారుతున్న కటువైన నిజాన్ని ‘నల్లటి మంచు’ నాటకం ప్రదర్శిస్తుంది. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-10

(Flash back)

[dropcap](టా[/dropcap]ఠాజీ శ్రీనగర్‌లో నున్న తమ ఇంట్లో ఉన్నారు. చేతిలో మంచు తీసుకుని శారిక పరిగెట్టి వస్తుంది).

శారిక : టాఠాజీ… ‘షీన్ ముబారక్… షీన్ ముబారక్’ టాఠాజీ….

టాఠాజీ : (ఆశ్చర్యంగా) షీన్ ముబారక్! మంచు కురిసిందా?

శారిక : (చేతిలో మంచుముద్దను టాఠాజీ చేతిలో ఉంచి) మీరేమో గదిలో కాంగడీ పెట్టుక్కూర్చున్నారు… ఈ ఋతువులో కురుస్తున్న తొలి మంచును బైటకొచ్చి చూడండి… నాలుగు దిక్కులా మంచే మంచు… ‘షీన్ ముబారక్’

టాఠాజీ : సరే! సరే! ‘షీన్ ముబారక్’!

శారిక : ఉహుఁ! ఇలా కాదు. ఈసారి మీ మనవడి తొలి చలికాలం ఇది. ఆపైన మంచు కురుస్తోందన్న చల్లటి వార్తను ముందుగా నేనే మీకు అందజేశాను… అందరికన్న ముందు ‘షీన్ ముబారక్’ కూడా నేనే చెప్పేను… (చెయ్యి జాచి) ఏదీ నాకు బహుమతి? ఇచ్చుకోవాలి మరి?

టాఠాజీ : నీ బహుమతా? నీకు కానుక తప్పక ఇస్తాను. తొందరలోనే చమన్ వాళ్ల ఇంటికి వెళ్లి, వాళ్ల నాన్నగారితో నీ సంబంధం గురించి మాట్లాడతాను!

శారిక : (సిగ్గుపడుతున్నా, ఉత్తుత్తి కోపాన్ని ప్రదర్శించటానికి నేలమీద అడుగులు దబ-దబ వేస్తూ వెళ్తుంది) టాఠాజీ… మీరు మరీను… నేను నా బహుమతి తీసుకోకుండా వదలనులేండీ! ‘షీన్ ముబారక్’ నేను చెప్పేను….

టాఠాజీ : (నవ్వుతూ) ఔనౌను… నువ్వు – నువ్వే చెప్పేవు. ఈసారి ‘షీన్ ముబారక్’ ముందు చెప్పింది నువ్వే… సరేనా? సరేగాని… ఇంత చలిగా ఉంది కదా… ఏదైనా ఒక కప్పు టీ లాటిది దొరుకుతుందా – లేదా?

శారిక : (ముగ్ధభావంతో) ఉహుఁ! ఇవాళ కేవలం మంచు దొరుకుతుంది. అంతే! చల్లటి – తెల్లటి మంచు!

టాఠాజీ : (నవ్వుతూ) చిన్నప్పటినుండీ నీది ఇదే వరస… మంచు చూస్తే చాలు వెక్కిపోతావు… పిచ్చిపిల్లా!…

శారిక : (ఉత్సాహంగా పాడుకుంటూ తిరుగుతూ వెనక్కి – ముందుకీ ఊగుతున్నట్లు అభినయిస్తుంది)

చల్లటి – తెల్లటి మంచు కురిసింది

ఆనందాల వాన కురిపించింది

చలికాలపు ముదుసలి గజగజమంటున్న

కూతురు పుట్టింటికొచ్చినట్లుంది!

టాఠాజీ : వాహ్! వాహ్!

గజగజలాడుతు నవ్వే చలికాలపు ముదుసలి?

కూతురు పుట్టింటి కొచ్చినట్లుంది? ఎంతబాగుంది.

శారిక : టాఠాజీ! ఒక్కసారి ఆలోచించి చూడండి. మీరు ఓవర్ కోటు ఎలాగా వేసుకునే ఉన్నారు… చేతిలో కాంగడీ ఉంది… కేవలం తలమీద జుట్టుని తెల్లబరుచుకుని, తెల్లటి పొడవైన గడ్డాన్నొక దానిని అతికించుకుంటే…. తెల్లగా… అంతే మీరే ‘మంచు బాబా’ అయిపోతారు!

టాఠాజీ : (శారికను అనుకరిస్తూ, ఆమెలా) ఇక ఇప్పుడేమో నేనే తెల్లటి హిమకన్యనంటావు!

శారిక : (సంతోషం, గర్వంతో) అవును!

టాఠాజీ : (గంభీరంగా మారిపోయి). కాదు! ఇది సాధ్యం కాదు!

శారిక : అదేం?

టాఠాజీ : (అల్లరిగా) ఎందుకా? మంచేమో చలి తాత ఇంటికి, అంటే పుట్టింటికి వచ్చింది. …మరి నీకేమో ఇంకా పెళ్లవాలి కదా!

శారిక : (తెచ్చి పెట్టుకున్న కోపాన్ని అభినయిస్తూ) ఊ.. ఊ… టాఠాజీ… మళ్లీ అదేమాట… పెళ్లి పెళ్లంటారు. నేనేం మీతో మాట్లాడను… (గట్టిగా అడుగులు వేస్తూ అక్కడి నుండి వెళ్తుంది).

టాఠాజీ : ఓయ్! విను… వినమంటూంటే!… (అప్పుడే రూప ట్రేలో కాఫీ తీసుకువస్తూ)

రూప : వేడి టీ! వేడి – వేడి కాఫీ!… (వెళ్తున్న శారిక వంక సంజ్ఞ చేస్తూ) ఈవిడకేమయింది… ?

టాఠాజీ : ఏమీ లేదు. మంచు కురవటం మొదలయిందన్న సంతోషంలో కువకువలాడుతోంది, అంతే!

(రూప టాఠాజీ చేతిలో ముందు ఒక చిన్న తువ్వాలు గాని, రుమాలు గాని పెట్టి, కశ్మీరుకే ప్రత్యేకమయిన ‘ఖోస్’ అనే టీ కప్పు చేతికందిస్తుంది. అందులో ఒక చుక్క టీ పోసి, నిరీక్షిస్తూ ఉంటుంది)

రూప : టాఠాజీ! ‘షీన్ ముబారక్’!

టాఠాజీ : షీన్ ముబారక్! కాని పందెంలో మాత్రం శారికే గెలిచింది… ఎందుకంటే మొదటిగా ‘షీన్ ముబారక్’ నాకు తనే చెప్పింది.

(ఓ చుక్కని తాగి చప్పరిస్తారు)

రూప : (తెచ్చిపెట్టుకున్న కోపంతో) తను చెప్పకపోయినా, మీరు చెప్పిందనే అంటారులెండి… నాకు తెలుసు… మీ ముద్దుల కూతురు కదా… నేనేమీ కానుగా!

టాఠాజీ : అబ్బెబ్బే! ‘షీన్ ముబారక్’ బహుమతి నీకూ దొరుకుతుంది!

రూప : కాని శారికే ముందు చెప్పిందంటున్నారుగా… ఇంకేమిటి?

టాఠాజీ : అయినా… షీన్ ముబారక్ చెప్పటంతోబాటు మంచు కురవటం మొదలయ్యేక మొదటి వేడి కాఫీని నువ్వే తాగిస్తున్నావుగా! అందుకు!

(ఇద్దరూ ఫక్కున నవ్వేస్తారు)

రూప : సరే, పంచదార సరిపోయిందా?

టాఠాజీ : ఆఁ! సరిపోయిందిలే గాని… మంచు కురవటం మొదలయిన సంతోషంలో మరికాస్త వేసెయ్యి… తీపి ఇంకాస్త హెచ్చయితే జీవిత మాధుర్యం పెరిగినట్లనిపిస్తుంది… బాదం పప్పులు వెయ్యటంలో కూడా కాస్తంత పిసినారితనమే చూపించావు… మరి కాసిని వెయ్యి!

(రూప వెళ్తూ)

రూప : ఇవిగో తెస్తానుండండి!

టాఠాజీ : (కేకవేసి) – అవునూ! మీ అమ్మ ఎక్కడా?

రూప : (వెళ్తూ – వెళ్తూనే) అక్కడే… దేముని సేవలో!….

(రూప వెళ్లిపోతుంది)

టాఠాజీ : (వినోదంగా, స్వగతం) సరే! ఆవిడకి ఆవిడ భగవంతుని సమీపంలోనే ‘షీన్ ముబారక్’ చెప్పొస్తాను… (మధురంగా ముగ్ధుడయిన భావంతో పాడుకుంటూ)…

షీన్ ముబారక్…

షీన్ ముబారక్…

(Flash Back సమాప్తం).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here